సాక్షి, అమరావతి: గ్రామంలోకి అడుగు పెట్టగానే కనిపించే సచివాలయాలు.. మరో నాలుగు అడుగులు వేస్తే రైతన్నల కోలాహలంతో సందడిగా ఆర్బీకేలు.. అనారోగ్య సమస్యలు తలెత్తితే చికిత్స అందించేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్స్.. ఆధునిక సదుపాయాలతో సరికొత్తగా మారిపోయిన ప్రభుత్వ పాఠశాలలు.. ఆ పక్కనే అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో సిద్ధమవుతున్న డిజిటల్ లైబ్రరీలు.. సంతృప్త స్థాయిలో సేవలు అందించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్.. ప్రతి గ్రామంలో పది మంది క్వాలిఫైడ్ శాశ్వత ఉద్యోగులు.. వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలతో జీవనోపాధులు పొందుతూ సాధికారత దిశగా అడుగులు వేస్తున్న అక్క చెల్లెమ్మలు.. ఇలా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లి చూసినా సరికొత్తగా పల్లెసీమల ముఖచిత్రం ఆవిష్కృతమవుతోంది.
రాష్ట్రంలో వికేంద్రీకరణతో నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనబడుతోంది. గతంలో కూలిపోయే దశలో ఉన్న సర్కారు స్కూళ్ల భవనాలు మినహా ఇతర ప్రభుత్వ భవనాలేవీ కానరాని దుస్థితి నుంచి అన్ని సదుపాయాలతో సర్వ సేవలు అందించేలా పలు కార్యాలయాలు గ్రామాల్లోనే నిర్మితమవుతున్నాయి. అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో ఏ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులైనా గ్రామాల నుంచే పని చేసుకోవచ్చు.
► ఇప్పుడు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే అన్ని సేవలు అందుతున్నాయి. బంధువులను చూడడానికి మాత్రమే ఇప్పుడు పొరుగూళ్లకు వెళుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో ప్రజలకు పథకాలు, సేవలను ప్రభుత్వం చేరువ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే దుస్థితిని, వ్యయ ప్రయాసలను సమూలంగా తొలగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఏ మారుమూల ప్రాంతమైనా సరే సచివాయాల ఉద్యోగులు, వలంటీర్ల ద్వారా సేవలు అందేలా వ్యవస్థను రూపొందించారు.
లంచాల బెడద లేకుండా లబ్ధిదారుల ఇంటి వద్దే టంఛన్‌గా పింఛన్లు, రేషన్ సరుకులు, వివిధ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందచేస్తున్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా బలవర్ధకమైన ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో సైతం 545 రకాల ప్రభుత్వ సేవలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం తిరగాల్సిన అవస్థలు తొలగిపోయాయి. ఏదో మహమ్మారి జబ్బులైతే మినహా సాధారణ రోగాల చికిత్స కోసం ఊరు దాటాల్సిన అవసరం లేకుండా వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు హెల్త్ క్లినిక్‌లలో ఉచితంగా వైద్య సేవలను అందజేస్తోంది. రక్త పరీక్షలు అక్కడే నిర్వహిస్తూ అవసరమైన మందులూ ఉచితంగా ఇస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారు. ఇంటింటినీ జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ప్రివెంటివ్ హెల్త్ కేర్‌లో నూతన అధ్యాయాన్ని లిఖించారు.
► ఐదేళ్ల క్రితం వరకు గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లను మినహాయిస్తే మరే ప్రభుత్వ కార్యాలయాలు లేని పరిస్థితి నెలకొంది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు దాటిన 2019కి ముందు వరకు దాదాపు 3 వేల పంచాయతీలలో కనీసం కార్యాలయం భవనాలు కూడా లేవని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇరుకు గది, చిన్న హాలు మినహా మరే వసతులు ఉండవు. కార్యదర్శుల కొరతతో అవి నెలల తరబడి మూసివేసి ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం రూ.4,750 కోట్ల ఖర్చుతో రాష్ట్రవ్యాప్తంగా 10,893 గ్రామ సచివాలయాల భవనాలను మంజూరు చేసింది.
ఇప్పటికే 7,144 భవనాల నిర్మాణం పూర్తి కాగా మరో 1,888 భవనాలు నెల రోజుల్లో పూర్తి అయ్యే దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల్లో అన్ని రకాల పంటలకు సంబంధించిన మాగ్యజైన్లు ఉంటాయి. రైతులతో వ్యవసాయ శాస్త్రవేత్తల ముఖాముఖి సమావేశాలకు వీలుగా స్మార్ట్ టీవీలు, వివిధ పంట ఉత్పత్తుల ధరలు, వాతావరణ సమాచారం తెలుసుకునే డిజిటల్ కియోస్క్‌లు, తేమ కొలిచే యంత్రాలు, విత్తన పరీక్ష పనిముట్లు, భూసార పరీక్ష కిట్లు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.
► గతంలో విత్తనాలు కావాలన్నా ఎరువులు అవసరమైనా వ్యయ ప్రయాసలకు ఓర్చి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. పంటలను చీడపీడలు ఆశిస్తే వ్యవసాయ అధికారి సలహా కోసం కార్యాలయం వద్ద ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి. ఇప్పుడు అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం గ్రామంలోనే అందిస్తోంది. కాల్ సెంటర్ ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తల సేవలను చేరువ చేసింది. రైతులకు సేవలు అందించేందుకు ఒక్కో ఊరిలో రూ.23.94 లక్షలు ఖర్చు పెట్టి 1,360 చదరపు అడుగుల విస్తీర్ణంలో రైతు భరోసా కేంద్రాలను నిర్మించారు. పశువైద్య సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.2446 కోట్లతో 10,216 రైతు భరోసా కేంద్రాల భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది.
► గ్రామాల్లో ప్రజలకు కనీస వైద్య సేవలు అందించేందుకు ఒక్కొక్కటి రూ.17.50 లక్షల వ్యయంతో 1,185 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెల్త్ క్లినిక్స్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.1726 కోట్లతో 8299 హెల్త్ క్లినిక్‌లను మంజూరు చేసింది. వీటిలో 3,388 నిర్మాణం పూర్తి కాగా మరో 1705 ఒకట్రెండు నెలల్లో పూర్తయ్యే దశలో ఉన్నాయి. విలేజీ హెల్త్ కిన్లిక్‌లలో 14 రకాల రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలన్నింటినీ ప్రభుత్వం అందించింది. డెంగ్యూ, మలేరియా సహా హెచ్‌ఐవీ, సిఫిలిస్ లాంటి వ్యాధుల నిర్ధారణకు అవసరమైన ర్యాపిడ్ కిట్లను అన్ని హెల్త్ క్లినిక్‌లోనూ అందుబాటులో ఉంచింది. వీటికి తోడు ప్రతి హెల్త్ క్లినిక్‌లో 105 రకాల మందులు సరిపడినంత స్టాక్ అందుబాటులో ఉంచింది.
► నాడు – నేడు ద్వారా రూ.11,000 కోట్ల ఖర్చుతో 38,059 ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ సూళ్లకు ధీటుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. రూ.612 కోట్లు ఖర్చు చేసి ప్రహరీ గోడలను నిర్మించింది. డిజిటల్ ల్రైబరీలను కూడా నిర్మిస్తోంది.
► ప్రభుత్వం కేవలం కార్యాలయాల నిర్మాణం మాత్రమే కాకుండా వాటిల్లో అన్ని మౌలిక వసతులను కల్పించింది. ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు కంప్యూటర్లు, యూపీఎస్, ప్రింటర్లను సమకూర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 30,004 కంప్యూటర్లు, 15,002 యూపీఎస్, 15,002 ప్రింటర్లుతో పాటు 3,000 ఆధార్ కిట్లు, 2,86,646 ఫింగర్ ప్రింట్ స్కానర్లను పంపిణీ చేసింది. వలంటీర్లతోపాటు సచివాలయ సిబ్బందికి విధులను వేగంగా నిర్వహించేందుకు 2,91,590 స్మార్ట్ ఫోన్లను, సిమ్ కార్డులను అందజేసింది.
► 2020లో పలు భవన నిర్మాణాలకు అనుమతులు లభించగా వరుసగా రెండేళ్ల పాటు కరోనా కారణంగా నిర్మాణ పనులను స్తంభించాయి. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 16,081 భవన నిర్మాణాలు పూర్తి కాగా మరో 5095 భవనాలు నెల నుంచి నెలన్నర లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. నిర్మాణాలు జరుగుతున్న చోట్ల అద్దె భవనాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇరుకైన పంచాయతీ భవనాలు మినహా రైతులకు, ప్రజలకు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఎలాంటి కార్యాలయాలు లేకపోవడం గమనార్హం.
► గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు సాధికారత బాట పట్టారు. జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి పశువులు కొనుగోలు చేశారు. ఆసరా, చేయూత ద్వారా కిరాణా షాప్‌లు ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఉన్న ఊరిలోనే ఉపాధి పొందుతున్నారు. ఆమూల్, రిలయన్స్, పీ అండ్ జీ లాంటి దిగ్గజ కంపెనీలతో అనుసంధానించి మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వారికి బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందిస్తోంది.
నాలుగు నెలల్లో నియామకాలు..
అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్ ఒకేసారి ఏకంగా 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. ఇది ఒక రికార్డు కాగా కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేసి మరో రికార్డు నెలకొల్పారు. ఈ స్థాయిలో లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. నాడు ఉద్యోగాలు సాధించిన ఎంతోమంది సచివాలయాల ఉద్యోగులు ఈ నాలుగేళ్ల కాలంలో పదోన్నతులు కూడా పొందారు. టీచర్లు మినహా ప్రభుత్వ ఉద్యోగులు లేని గ్రామాల్లో నేడు సచివాలయాల ద్వారా పది మంది చొప్పున శాశ్వత ఉద్యోగులు సేవలందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment