సాక్షి, అమరావతి: అన్నదాతలు గ్రామ పొలిమేరలు దాటాల్సిన అవసరం లేకుండా విత్తన సేకరణ నుంచి పంట విక్రయం దాకా రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా తోడుగా నిలుస్తుండటంతో రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. సీజన్ ప్రారంభానికి ముందే 24 పంటలకు గిట్టుబాటు ధరలను ప్రకటించడంతో నిశ్చింతగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఏ ప్రాంతంలో ఎప్పటి నుంచి పంటల కొనుగోలు ప్రారంభం అవుతుందో రైతులకు ముందే తెలియచేయడంతోపాటు వ్యాపారుల సిండికేట్ బారిన పడి నష్టపోకుండా ధరల వివరాలను గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధిని ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని పొగాకును సైతం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడం గమనార్హం.
తొలిసారిగా నిల్వ ఉండని పంటలకూ మధ్దతు ధర ప్రకటించింది. దక్షిణ భారత దేశంలో తొలిసారిగా అనంతపురం నుంచి పండ్లు, కూరగాయలు, ఉద్యాన ఉత్పత్తులతో దేశ రాజధానికి ‘కిసాన్ రైలు’ ప్రారంభించి మెరుగైన ధరలకు విక్రయించుకునే అవకాశాన్ని కల్పించింది. గత ప్రభుత్వ హయాంలో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. పంట విక్రయించాలంటే మండల కేంద్రాలకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన దుస్థితి. రైతుల కష్టాలను స్వయంగా చూసి చలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించి గ్రామ స్థాయికే అన్నింటినీ చేర్చారు. సాగు చేయడం మినహా రైతులకు మరో కష్టం కలగని రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.
గ్రామాల్లో గోదాములు.. జనతా బజార్లు
గ్రామ స్థాయిలో పంటల సేకరణ, ఎరువులు, విత్తనాలు అమ్మకాలు జరుగుతుండటంతో వీటిని నిల్వచేయడానికి గోదాముల సమస్య లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నాబార్డు ఆర్ధికసాయంతో దశలవారీగా 9 వేల గోదాములు, అనుబంధంగా పంటలను ఆరబెట్టుకునే ఫ్లాట్‌ఫారాలను నిర్మించేందుకు సిద్ధమైంది. ఒక్కో గోదాములో 500 టన్నులను నిల్వ చేసుకునే విధంగా త్వరలో టెండర్లు పిలవనుంది. నాడు–నేడు కింద వ్యవసాయ మార్కెట్ కమిటీలను అధునీకరించాలని నిర్ణయించింది. త్వరలోనే 1500 జనతా బజార్లు కూడా ఏర్పాటు చేయనుంది.
48 గంటల్లోగా..
రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా మార్చేసి 10,641 కేంద్రాలలో ధాన్యం, మొక్కజొన్న లాంటి పంటలతో పాటు అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను అందులో నమోదు చేసుకున్న 48 గంటల్లోగా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతు పొలం వద్దకే వెళ్లి పంటలను కొనుగోలు చేసే విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. రైతులను ఆదుకునేందుకు మద్దతు ధర లేని అనేక పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. కొవిడ్–19 విపత్కర సమయంలోనూ ఆక్వా రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంది. సరైన రవాణా సౌకర్యాలు లేక రాయలసీమలో రైతులు అరటి, బత్తాయి, ఉల్లి పంటలను అమ్ముకోలేని పరిస్ధితులు ఏర్పడితే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయించి ఆదుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ, పత్తిని నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తోంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.150 కోట్ల వరకు భారం పడినా అన్నదాతల శ్రేయస్సే లక్ష్యంగా సాగుతోంది. పొగాకు వ్యాపారులంతా కూటమిగా ఏర్పడిన తరుణంలో మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. పోటీ కారణంగా రైతులకు మెరుగైన ధర లభించింది.
నిల్వ ఉండని పంటకు మద్దతు ఇదే తొలిసారి
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆరు పంటలకు మద్దతు ప్రకటించింది. మిర్చి క్వింటాకు రూ. 7వేలు, పసుపు పంటకు రూ.6,850, ఉల్లి క్వింటా రూ.770, చిరుధాన్యాలకు క్వింటా రూ.2500, అరటి, బత్తాయికి క్వింటా రూ. 800 చొప్పున మద్దతు ధరలను ప్రకటించి అమలు చేస్తోంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నిల్వ ఉండని బత్తాయి, అరటి, ఉల్లి, టమాటా లాంటి వాటికి కూడా మద్దతు ధర ప్రకటించిన తొలి ప్రభుత్వం ఇదేనని స్పష్టం చేస్తున్నారు. మొదటిసారిగా గ్రేడేడ్ ఎంఎస్‌పీ అమలు చేస్తూ ధాన్యం, వేరుశనగకు అమలు చేస్తోంది. కోవిడ్ సంక్షోభంలోనూ రైతులకు మేలు చేసేందుకు దాదాపు రూ.3200 కోట్లతో వ్యవసాయ, ఉద్యానవన పంటలను కొనుగోలు చేసింది. ఇటీవల వరకు రూ.4700 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేసింది. అమూల్‌తో ఒప్పందం కారణంగా పాడి రైతులకు రోజుకు లీటరుకు కనీసం రూ. 4 నుంచి రూ.7 చొప్పున అధికంగా లభిస్తోంది. రైతుల కోసం క్షేత్రస్థాయిలో మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్‌లను ప్రభుత్వం తెస్తోంది. రూ.9,932 కోట్లతో రొయ్యల ప్రాసెసింగ్‌కు 10 యూనిట్లు నిర్మించేందుకు సిద్ధమైంది. వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు త్వరలో 15 వేల జనతా బజార్లను ఏర్పాటు చేయనుంది.
మెరుపు వేగం.. ముందుచూపు నిర్ణయాలు
కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నా రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు తలెత్తకపోవటానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలే. రైతులకు ఎప్పుడు కష్టం కలిగినా ప్రభుత్వం తక్షణమే స్పందించి నిర్ణయాలు తీసుకుంది. తాజాగా నివర్ తుపాను వల్ల 6.59 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బ తినగా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఎన్యూమరేషన్ ఈ నెల 10కి పూర్తి చేసి 15కు తుది జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ నెల 30న రైతుల ఖాతాల్లో పరిహారం జమ చేసేందుకు సిద్ధమైంది. చంద్రబాబు హయాంలో రూ.2,200 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు ధాన్యం సొమ్ములు బకాయి పెట్టడం గమనార్హం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక రూ.960 కోట్లు చెల్లించింది. విత్తన బకాయిలు రూ.380 కోట్లు చెల్లించింది. రైతులకు బీమా పరిహారం ఈ నెల 15న అందచేసేందుకు ఏర్పాట్లు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment