సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలోనే రైతన్నలకు విత్తనాల నుంచి పంట విక్రయాల దాకా అన్ని సేవలను అందించేందుకు ఏర్పాటైన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 10,408 రైతు భరోసా కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణాలను రూ.2,299.60 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ భవనాలన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది జూలై 8వతేదీ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పుట్టిన రోజు సందర్భంగా జూలై 8వ తేదీన ఆర్బీకే భవనాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో గడువుకు ముందుగానే రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు సన్నద్ధమయ్యారు. ఇటీవల స్పందన సమీక్ష సందర్భంగా రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.
రైతన్నలకు శాశ్వత ఆస్తి...
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే 607 కేంద్రాల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. 3,081 రైతు భరోసా కేంద్రాల పనులు చివరి స్థాయిలో ఉన్నాయి. మరో 6,720 భవనాలు బేస్‌మెంట్ స్థాయి నుంచి గ్రాండ్ ఫ్లోర్ శ్లాబు దశలో ఉన్నాయి. ఆర్బీకే భవనాల నిర్మాణంతో రైతులకు ఉన్న ఊరిలోనే శాశ్వత ఆస్తి సమకూరనుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అన్నీ సొంత ఊరిలోనే అందుతున్నాయి. గతంలో రైతులు వాటి కోసం పొలం పనులు మానుకుని మండల కేంద్రాలు, డివిజన్ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. రోజంతా పడిగాపులు కాస్తూ క్యూల్లో నిలబడి కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ దుస్థితి తొలగిపోయింది. రైతులు తమకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులు భరోసా కేంద్రాల్లో ఆర్డర్ ఇస్తే ఇంటి గుమ్మం వద్దే అందచేసే సదుపాయం కల్పించారు.
శరవేగంగా ఆర్బీకే భవనాలు
Published Mon, May 17 2021 4:05 AM | Last Updated on Mon, May 17 2021 4:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment