Crop insurance
-
సిబ్బందిపై పంటల బీమా భారం
సాక్షి, అమరావతి: పంటల బీమా అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. ప్రీమియం భారం భరించలేక పంటల బీమాలో తాము చేరలేమని రైతులు తెగేసి చెబుతుంటే.. ఎలాగైనా రైతులను చేర్పించాలంటూ రైతు సేవా కేంద్రాల సిబ్బంది (వీఏఏ)కి లక్ష్యాలను నిర్దేశించి మరి అధికారులు ఒత్తిడికి గురి చేస్తున్నారు. రైతులు కట్టలేమంటున్నారని చెబితే.. వారి తరఫున ఆ ప్రీమియం సొమ్ములు మీరే కట్టండంటూ అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు తట్టుకోలేక 15 రోజుల క్రితమే ఆళ్లగడ్డ మండలం జి.జంబులదిన్నె ఆర్ఎస్కే వ్యవసాయ అసిస్టెంట్ హరినాథ్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేస్తూ తమకూ ఇదే పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.బీమా చేయాల్సింది 51.90 లక్షల ఎకరాలురబీ సాగు లక్ష్యం 57.50 లక్షల ఎకరాలు. నోటిఫై చేసిన పంటల సాగు విస్తీర్ణం 44.72 లక్షల ఎకరాలు, వీటికి అదనంగా బీమా పరిధిలోకి తీసుకొచ్చిన మామిడి విస్తీర్ణం మరో 7.18 లక్షల ఎకరాలు. అంటే బీమా చేయించాల్సిన విస్తీర్ణం 51.90 లక్షల ఎకరాలు. ఇప్పటివరకు సాగైన విస్తీర్ణం 18.50 లక్షల ఎకరాలు. దిగుబడి, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల కింద ఈ నెల 17వ తేదీ వరకు బీమా కవరేజీ పొందిన విస్తీర్ణం కేవలం 7,40,875 ఎకరాలు మాత్రమే. రైతులు పంటల బీమాకు ఏ స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారో ఈ గణాంకాలే చెబుతున్నాయి.వీఏఏలపై రైతుల ప్రీమియం భారంకేవలం వరి పంటకు మాత్రమే బీమా చేయించుకునేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. రబీలో 20.50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. నోటిఫై చేసిన జిల్లాల పరిధిలో 15.77 లక్షల ఎకరాలు మాత్రమే బీమా కవరేజీ కల్పించాల్సి ఉండగా.. ఇప్పటివరకు కనీసం 10 శాతం విస్తీర్ణంలో కూడా బీమా కల్పించలేని దుస్థితి ఏర్పడింది. స్వచ్ఛందంగా ఈ పథకంలో చేరేందుకు రైతులెవరూ ముందుకు రాకపోవడంతో ఆ భారాన్ని వీఏఏలపై వేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్నెట్తో పాటు పాడిపంటలు మ్యాగజైన్ కోసం చందాలు చేర్పించేందుకు వీఏఏలకు చేతిచమురు వదిలిపోతోంది. ఇప్పుడు రైతుల తరఫున ప్రీమియం చెల్లించాలని ఒత్తిడి చేస్తే తాము బతికేదెలా అని వీఏఏలు ప్రశ్నిస్తున్నారు. ప్రీమియం భారం భరించలేక రైతులెవరూ పంటల బీమాపై ఆసక్తి చూపకపోవడంతో.. రోజుకు కనీసం 10 మందికి తక్కువ కాకుండా రైతులతో బీమా చేయించాల్సిందేనంటూ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. చేసేది లేక ఉద్యోగాలను కాపాడుకునేందుకు రైతుల తరఫున ప్రీమియం కడుతున్నామని వీఏఏలు చెబుతున్నారు. ఈ నెలలో వచ్చిన జీతంలో మూడో వంతు మ్యాగజైన్స్‌కు, మిగిలిన మొత్తం ప్రీమియానికి చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రూ.2, రూ.3 వడ్డీలకు తెచ్చి మరీ కట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. -
చంద్రబాబు మోసాలపై రైతుపోరు నేడే
సాక్షి, అమరావతి: రెండు సీజన్లు గడుస్తున్నా పెట్టుబడి సాయం రూ.20 వేలు అందక.. గిట్టుబాటు ధర దక్కక.. ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్సార్ సీపీ దన్నుగా నిలిచింది. అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న వైఎస్సార్సీపీ అన్ని జిల్లాల కేంద్రాల్లో శుక్రవారం రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనుంది. అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించనున్నారు.కుడి, ఎడమల దగా..కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని అన్నదాతలు ఆశించారు. అయితే రెండు వ్యవసాయ సీజన్లు గడిచిపోతున్నా కూటమి సర్కారు పైసా సాయం జమ చేసిన పాపాన పోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం కింద రూ10,718 కోట్లు చెల్లించాల్సి ఉండగా బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లే విదిలించిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. మరోవైపు పంటల బీమా ప్రీమియం బకాయిలను ఎగ్గొట్టి రైతులకు దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. సున్నా వడ్డీ రాయితీ కింద రూ.131.68 కోట్ల ఊసెత్తడం లేదు. రబీలో కరువు సాయం బకాయిలు రూ.319.59 కోట్లు ఎగ్గొట్టింది. ఖరీఫ్ ధాన్యాన్ని కొనే నాధుడు లేక రైతులు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్నెల్లలోనే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్సార్ ఉచిత పంటల బీమాను కూటమి సర్కారు రాగానే అటకెక్కించడంతో ఆ భారం భరించలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక, అవస్థలు పడలేక అన్నదాతలు పంటల బీమాకు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏకంగా 70 మంది వరకు రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడగా ఏ ఒక్కరికీ ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకోలేదు.రైతన్నకు బాసటగా జగన్..కూటమి ప్రభుత్వం దగా చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్ జగన్ దన్నుగా నిలిచారు. ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారు. ఈమేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో కలసి శుక్రవారం భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నాయి. టీడీపీ కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభంజనంలా కదిలి వచ్చేందుకు రైతన్నలు సన్నద్ధమయ్యారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని పేర్కొంటూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్న ప్రకారం రైతులకు పెట్టుబడి సాయంగా తక్షణమే రూ.20 వేలు అందించాలని కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు సమర్పించనున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాల్సిందేనని.. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ధాన్యంలో తేమ శాతం లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. తక్షణమే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని.. రైతులపై అదనపు భారం మోపే చర్యలను కూటమి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేయనున్నారు.నాడు... చెప్పిన దాని కంటే మిన్నగారైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని రూ.13,500కి పెంచడమే కాదు.. ఐదేళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.67,500 అందజేశారు. చెప్పిన దాని కంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్ కవరేజీ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. పంట నష్ట పరిహారమైతే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా నెలకొల్పిన ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. లక్ష మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్‌కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కళ్లాల నుంచే నేరుగా కొనుగోలు చేశారు. ప్రతీ గింజకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, రవాణా (జీఎల్టీ) భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించి రైతన్నలకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు. ఇలా వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019–24 మధ్య ఐదేళ్లలో అన్నదాతలకు ఏకంగా రూ.1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. -
రైతు కంట కన్నీరు
సాక్షి, అమరావతి: అన్నదాత కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పడరాని పాట్లు పడుతున్నారు. ఏటా సీజన్‌కు ముందే అందే పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా అటకెక్కింది. పంటల బీమా పరిహారం జాడలేదు. కరువు సాయం ఊసే లేదు. సున్నా వడ్డీ రాయితీ లేదు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనీస మద్దతు ధర దక్కక రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టే దుస్థితి నెలకొంది. ప్రభుత్వ తీరుపై అన్నదాతలు కన్నెర్ర చేస్తున్నారు. ఓవైపు విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆందోళన బాటపట్టారు. ఇటీవలే ధాన్యం రాశులతో మండల కేంద్రాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు డిమాండ్‌తో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిన రైతులకు అండగా వైఎస్సార్ సీపీ ఆందోళన బాటపట్టింది. ఈ నెల 13వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ఎదుట వైఎస్సార్ సీపీ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన వ్యక్తం చేసేందుకు రైతులు సన్నద్దమవుతున్నారు. అన్నదాతా.. ఎక్కడ సుఖీభవ? అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామంటూ సూపర్ సిక్స్‌లో ఇచి్చన హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. గత ఐదేళ్లుగా వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన 53.58 లక్షల మంది రైతులకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలంటే ఏటా రూ.10,718 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే విదిలించి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసింది. రబీ సీజన్ ప్రారంభమై 40 రోజులు దాటింది. కేంద్రం రెండు విడతల్లో పీఎం కిసాన్ సాయం అందించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క విడత కూడా పెట్టుబడి సాయాన్ని జమ చేసిన పాపాన పోలేదు. అన్నదాత సుఖీభవ కోసం విధివిధానాల రూపకల్పన కూడా జరగలేదు. పెట్టుబడిసాయం అందక, సకాలంలో రుణాలు దొరక్క గత రెండు సీజన్లలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పంటల బీమాకు దూరం రైతులపై పైసాభారం పడకుండా ఐదేళ్ల పాటు నోటిఫై పంటలకు యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం అటకెక్కించేసింది. 2023–24 సీజన్‌కు సంబంధించి రైతులతో సహా రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి రూ.930 కోట్ల ప్రీమియం మొత్తాన్ని జమ చేయకపోవడం వల్ల ఆ సీజన్లో కరువు వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 15 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా పోయింది. రబీ సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిలో పంటల బీమా అమలు చేస్తుండడంతో ప్రీమియం భరించలేక రైతులు పంటల బీమాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. రబీలో ఇప్పటి వరకు 16.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే బీమా కవరేజ్ పొందిన విస్తీర్ణం కేవలం 65 వేల ఎకరాలు మాత్రమే. ప్రీమియం భారం రైతుల నెత్తిన వేయడంతో ఈ సీజన్లో రూ.350 కోట్లకుపైగా భారం భరించలేక పంటల బీమాకు దూరమవుతున్నారు. కరువు సాయం అందక అగచాట్లు వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్–2023 సీజన్లో పంటలు నష్టపోయిన 8.89 లక్షల మంది రైతులకు రూ.1,126.31 కోట్లు జమ చేశారు. సాంకేతిక కారణాల వల్ల 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ కాలేదు. రబీ–2023–24 సీజన్లో కరువు ప్రభావం వల్ల 2.52 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలకు గాను 2.32 లక్షల మంది రైతులకు రూ.164.05 కోట్ల కరువు సాయం చెల్లించాల్సి ఉంది. ఈ రెండు బకాయిలు కలిపి 3.91 లక్షల మంది రైతులకు రూ.327.71 కోట్ల కరువు సాయం ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతోంది.ఇక ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షాల వల్ల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తొలుత 16 జిల్లాల్లో 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, చివరికి నాలుగు జిల్లాల్లో 54 వేల ఎకరాలకు పరిమితం చేశారు. 29,944 మంది రైతులకు రూ.37.33 కోట్లు పరిహారం చెల్లించాలని లెక్కతేల్చగా ఆచరణకు వచ్చేసరికి కేవలం 23వేల మందికి రూ.25.75 కోట్లకు కుదించేశారు. ఆ పరిహారం నేటికీ జమ చేయలేదు. సెప్టెంబర్ లో కురిసిన భారీవర్షాలు, వరదలకు తొలుత 6 లక్షల ఎకరాల్లో పంటలతో పాటు పెద్ద ఎత్తున పాడి రైతులకు జరిగిన నష్టానికి సంబంధించి రూ.557 కోట్ల పరిహారం ఇవ్వాలని అంచనా వేయగా చివరికి 2.15 లక్షల మందికి రూ.319.59 కోట్లకు కుదించేశారు. సాంకేతిక కారణాలతో లక్షలాది మందికి నేటికీ పరిహారం అందక పడరాని పాట్లు పడుతున్నారు. మరొక పక్క వర్షాభావ పరిస్థితుల వల్ల కరువుతో అల్లాడుతున్న రాయలసీమ జిల్లాల్లో కంటి తుడుపుగా కరువు మండలాల ప్రకటన చేసిన ప్రభుత్వం ఆయా జిల్లాల రైతులను ఆదుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. కలసిరాని సాగు.. ఆదుకోని ప్రభుత్వం ప్రభుత్వ నిర్వాకానికి తోడు వైపరీత్యాల ప్రభావంతో ఖరీఫ్‌తో పాటు రబీ సాగు కూడా రైతులకు కలిసిరావడం లేదు. పెట్టుబడుల కోసం పడరాని పాట్లు పడ్డారు. రూ.3–5 వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ సాగు చేసినా వైపరీత్యాల ప్రభావంతో పంటలు దెబ్బతినడంతో పాటు ఆశించిన దిగుబడులు రాక లక్షలాది మంది రైతులు నష్టాలపాలయ్యారు. చేతికొచ్చిన పంటలు అమ్ముకునే సమయంలో మార్కెట్లో ధరలేక ధాన్యం రైతులతో పాటు పత్తి తదితర పంటల రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొంది. ఓ వైపు ముమ్మరంగా కోతలు జరుగుతున్న దశలో విరుచుకు పడిన ఫెంగల్ తుపాన్ ప్రభావంతో చేతికొచ్చిన పంట దెబ్బతిని మరింత నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో తమ రెక్కల కష్టార్జితాన్ని దళారీల పాల్జేయాల్సిన దుస్థితి రైతులకు దాపురించింది.తేమ శాతం సాకుతో దోపిడీ..కేంద్ర ప్రభుత్వం ధాన్యం సాధారణ రకానికి క్వింటా రూ.2300, ఏ–గ్రేడ్‌కు రూ.2320గా మద్దతు ధర ప్రకటించింది. అంటే 75 కేజీల బస్తాకు సాధారణ రకానికి రూ.1725, ఏ–గ్రేడ్‌కు రూ.1740 గిట్టుబాటు ధర చెల్లించాలి. కానీ కూటమి ప్రభుత్వ పాలనలో 75 కేజీల బస్తాకు రూ.400 నుంచి రూ.500 వరకు రైతు నష్టపోతున్నారు. రైతు సేవా కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని తేమ శాతాన్ని బట్టి ధర నిర్ణయించాల్సిన అధికారులు మిల్లర్లు చెప్పిన ధరకు అమ్ముకోమంటూ సలహాలిస్తున్నారు. మరోవైపు మార్కెట్లో మద్దతు ధరకు మించి రేటు పలికే ఎంటీయూ 1262, ఎంటీయూ 1318, బీపీటీ 5204 వంటి ఫైన్ వెరైటీస్‌కు కూడా ఈసారి మద్దతు ధర కూడా దక్కడం కష్టంగా ఉంది. 75 కేజీల బస్తా రూ.1300–1500 మధ్య కొనే పరిస్థితి నెలకొంది. కోసిన ధాన్యాన్ని కొనే నాధుడు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. గోనె సంచుల కొరత తీవ్రంగా ఉంది. ఆరబోతకు కూలీల కొరత వేధిస్తోంది. కూలీల ఖర్చులు, పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్స్కు ఎకరాకు రూ.వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.ఆందోళన కలిగిస్తున్న రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్న రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేవలం ఆర్నెల్ల వ్యవ«ధిలోనే సుమారు 70 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు ఒడిగట్టడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది. అత్యధికంగా ఒక్క కర్నూలు జిల్లాలోనే 30 మందికి పైగా బలవన్మరణం చెందారు. రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాంధ్ర, గోదావరి జిల్లాల్లో కూడా రైతు ఆత్మహత్యలకు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కుటుంబానికీ కూటమి సర్కారు పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు.జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే..అదే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే.. జూన్‌లో అన్నదాతకు తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా సాయం అందేది. గడిచిన సీజన్ మాదిరిగానే ఈ ఏడాది కూడా 53.58 లక్షల మందికి మేలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని జమ చేసేవారు. ఖరీఫ్–2023 సీజన్‌కు సంబంధించి రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందేది. కరువు సాయం బకాయిలు రూ.327.71 కోట్ల కూడా జమ చేసేవారు. సున్నా వడ్డీ రాయితీ కింద సుమారు రూ.130 కోట్ల వరకు జమయ్యేది. ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు పూర్తి స్థాయిలో పరిహారం జమయ్యేది. -
ప్రీమియం చెల్లించకపోతే పంటల బీమాకు అనర్హులు: కూటమి ప్రభుత్వం
-
ప్రీమియం చెల్లించకపోతే పంటల బీమాకు అనర్హులు
సాక్షి, అమరావతి: నిర్దేశించిన గడువులోగా ప్రీమియం చెల్లించకపోతే తాము సాగు చేసే పంటలకు బీమా పొందేందుకు రైతులు అర్హత కోల్పోతారని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం స్థానంలో ఈ ఏడాది నుంచి రైతులను భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా అమలు చేస్తున్నట్లు చెప్పారు. పంటల బీమా ప్రచార వారోత్సవాలను మంగళవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆ శాఖ డైరెక్టర్ సేనాపతి ఢిల్లీరావుతో కలిసి ప్రారంభించారు. ఇన్సూరెన్సు కంపెనీలు తయారు చేసిన వాల్‌పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. మీడియాతో రాజశేఖర్ మాట్లాడుతూ..పంట రుణం పొందిన సందర్భంలో సంబంధిత బ్యాంక్ వారే ప్రీమియం వసూలు చేసి సదరు బీమా కంపెనీకి నేరుగా చెల్లిస్తారని చెప్పారు. బీమా వద్దనుకుంటే ప్రీమియం తగ్గింపు నిలిపివేయాలని రాతపూర్వకంగా బ్యాంక్‌కు సమరి్పంచాలన్నారు. రుణం తీసుకోని రైతులు తమ వాటా ప్రీమియం మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించి సచివాలయాలు, పీఏసీఎస్‌లు, పోస్టాఫీస్‌లు, కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్సీ)ల్లో నమోదు చేసుకోవాలన్నారు.దళారీలను నమ్మి మోసపోవద్దనన్నారు. రబీ సీజన్‌కు సంబంధించి ఇతర పంటలకు ఈ నెల 15గానూ, వరికి 31 లోగా ప్రీమియం చెల్లించాలని, లేకుంటే బీమా పొందేందుకు ఏమాత్రం అవకాశం ఉండదన్నారు. స్వచ్ఛంద నమోదు పద్ధతిపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలకు కేటాయించిన ఇన్సూ్యరెన్స్ కంపెనీలు, ఆయా జిల్లాలో నోటిఫై చేసిన పంటల వివరాలు, పంటల వారీగా కట్టాల్సిన ప్రీమియం శాతం, రైతులు చెల్లించాల్సిన వాటా, నమోదు చేయడానికి గడువు, తదితరాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ డైరక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంటలకు 2శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు తమ వాటా ప్రీమియం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూ రికార్డులు, సీసీఆర్సీలు పొందిన రైతుల డేటాను జాతీయ పంటల బీమా పోర్టల్‌తో అనుసంధానం చేశామన్నారు. -
చంద్రబాబూ.. రైతుల ఉసురుపోసుకోవద్దు: వైఎస్ జగన్
రబీ సీజన్ నుంచి పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైతుల తరఫున ప్రీమియం వాటా చెల్లించడం మీ ప్రభుత్వానికి భారమా చంద్రబాబూ?’ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే.. – సాక్షి, అమరావతి1. వైఎస్సార్సీపీ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేశాం. 2. నోటిౖఫై చేసిన ప్రతి పంటకూ, సాగైన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజీ కల్పిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో బీమా రక్షణ కల్పించాం.3.మా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 5.52 కోట్ల ఎకరాలకు బీమా కవరేజీ కల్పించాం. 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పించాం. 4. మా ప్రభుత్వ హయాంలో ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభంలో రైతుల ఖాతాలో జమ చేస్తూ వారికి అండగా నిలిచాం. 2014–19 మధ్య మీ ప్రభుత్వ హయాంలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పరిహారం చెల్లిస్తే.. మా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 54.55 లక్షల మందికి రూ.7,802.08 కోట్ల బీమా పరిహారాన్ని నేరుగా వారి ఖాతాలకు జమ చేశాం.5. రైతుల తరఫున ఐదేళ్లలో రూ.3,022.26 కోట్ల ప్రీమియం మొత్తాన్ని మా ప్రభుత్వం బీమా కంపెనీలకు చెల్లించింది. 6. గతంలో బీమా చేయించుకున్న వారు సైతం పరిహారం కోసం అధికారులు, బీమా కంపెనీల చుట్టూ చెప్పులరిగేలా తిరిగేవారు.7. 2023–24 సీజన్లో రైతుల తరఫున ప్రీమియం మొత్తం రూ.930 కోట్లను ఈ ఏడాది జూన్‌లో మీరు చెల్లించకుండా ఎగ్గొట్టడం వల్ల ఆ సీజన్లో వర్షాభావ పరిస్థితులు, భారీ వర్షాలు, తుపానుల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు రూ.1,385 కోట్ల పరిహారం అందకుండా పోయింది.8. మా హయాంలో ఇచ్చిన మాటకు మించి ఏటా మూడు విడతల్లో ఎకరాకు రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించి సాగు వేళ రైతులకు అండగా నిలిచాం. 9. వైఎస్సార్ రైతు భరోసా కింద ఐదేళ్లలో 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288.17 కోట్లను నేరుగా బ్యాంక్ ఖాతాలకు జమచేసి వారికి వెన్నుదన్నుగా నిలిచాం. దేశంలోనే తొలిసారిగా గ్రామ స్థాయిలో ఆర్బీకే వ్యవస్థను ఏర్పాటు చేసి, వాటి ద్వారా విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతులను చేయిపట్టి నడిపించాం.10. తొలిసారిగా ఈ–క్రాప్ ద్వారా సాగు చేసిన ప్రతి ఎకరాలో సాగైన ప్రతి పంటనూ నమోదు చేస్తూ.. ఈ క్రాప్ ప్రామాణికంగా రైతు క్షేత్రం వద్ద వారు పండించిన పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి వెన్నుదన్నుగా నిలిచాం. ఈ–క్రాప్ ప్రామాణికంగా పంట రుణాలు అందించడంతోపాటు పంటల బీమా, పంట నష్ట పరిహారం, సున్నా వడ్డీ రాయితీ వంటి సంక్షేమ ఫలాలు అందించాం.11. మీరు అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తున్నా.. సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకూ ఇస్తానన్న రూ.20 వేల పెట్టుబడి సాయంలో ఒక్కపైసా కూడా అందించలేదు.12. ఖరీఫ్, రబీ సీజన్లలో పెట్టుబడి కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రూ.3నుంచి రూ.5 వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.13. ఇప్పుడు రైతులకు ఐదేళ్లుగా అన్ని విధాలుగా ఎంతగానో అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేశావు. గతంలో మాదిరిగా ప్రీమియం భారాన్ని తిరిగి రైతుల నెత్తిన మోపావు.14. ఐదేళ్లుగా రైతులకు అన్నివిధాలుగా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడం రైతులకు నువ్వు చేస్తున్న ఘోరమైన అన్యాయం.15. అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులపై పంటల బీమా ప్రీమియం భారం మోపడం భావ్యం కాదు. 16. రైతులను బాధపెట్టిన వారు బాగుపడినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. వాళ్ల ఉసురుపోసుకోవద్దు.17. ‘తక్షణమే ఉచిత పంటల బీమా పథకం రద్దు చేసే విషయంలో పునరాలోచించాలి. 18. రైతుల తరఫున ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించాలి. లేకుంటే రైతులు ఎప్పటికీ నిన్ను క్షమించరు చంద్రబాబు..! -
‘చంద్రబాబూ..! రైతుల ఉసురుపోసుకోవద్దు’: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా చంద్రబాబు అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులపై పాసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమీ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుచేశారు. నోటిఫై చేసిన ప్రతీ పంటకు సాగైన ప్రతీ ఎకరాకు యూనివర్శల కవరేజ్ కల్పిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా @ncbn ? pic.twitter.com/J2jW6kLqyA— YS Jagan Mohan Reddy (@ysjagan) October 29, 2024 రైతుల్లో ఆందోళన..టీడీపీ ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపే అనే విషయం మరోసారి రుజువైంది. వ్యవసాయమంటే దండగ అని గతంలో చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యానించిన సందర్భాలను చూశాం. ఇప్పుడు ఉచిత పంటల బీమాకు మంగళం పాడేశారు. దీంతో రైతులు, రైతు సంఘాల నేతలు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు విజయవంతంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమాను అమలు చేసింది.ఆ పథకాన్ని ఎత్తేసి రైతులే పంటల బీమాను చెల్లించుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు నిరక్షరాస్యులే ఉంటారు. వాళ్లు పంటలబీమాను ప్రకటించినప్పుడు తెలుసుకుని వెళ్లి డబ్బులు చెల్లించడం అనేది చాలా కష్టతరమైన పని. ఇలాంటి నేపథ్యంలో పంటల బీమాను రైతులే చెల్లించాలనటం ఎంత వరకు సబబని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పంటల బీమా.. లేదిక ధీమా
పంటల బీమా పథకం అమలులోనూ కూటమి ప్రభుత్వం అన్నదాతలను దగా చేస్తోంది. ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసి రైతుల వెన్ను విరుస్తోంది. రబీ సీజన్ నుంచి వలంటరీ ఎన్రోల్మెంట్ మోడల్ (స్వచ్ఛంద నమోదు పద్ధతి)లో పంటల బీమాను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం చేసిన అధికారిక ప్రకటనతో తమకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాము సాగు చేసిన పంటలను పంటల బీమా పరిధిలోకి తీసుకు రావాలంటే ప్రీమియం వాటా మొత్తం చెల్లించాల్సి రావడం రైతులకు పెనుభారంగా మారనుంది. - సాక్షి, అమరావతిరబీలోనే రూ.300 కోట్ల భారం రైతులకు ఎంతో మేలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో రైతులను భాగస్వామ్యం చేస్తూ పంటల బీమాను అమలు చేయబోతున్నట్టు తొలి సమీక్షలోనే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమయంలేని కారణంగా ఖరీఫ్ సీజన్ వరకు ఈ–పంట నమోదు ప్రామాణికంగా ఉచిత పంటల బీమాను కొనసాగించాలని, రబీ 2024–25 సీజన్ నుంచి వలంటరీ ఎన్రోల్మెంట్ మోడల్ పద్ధతి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్‌లో 15 దిగుబడి ఆధారిత, 7 వాతావరణ ఆధారిత పంటలకు ఉచిత బీమా కవరేజీ కల్పించగా, రబీలో 11 దిగుబడి ఆధారిత, 2 వాతావరణ ఆధారిత పంటలకు వలంటరీ ఎన్రోల్మెంట్ మోడల్ కింద బీమా కవరేజీ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి అదనంగా మామిడికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రబీ సీజన్ వరకు నోటిఫై చేసిన పంటలు 44.75 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద కంపెనీలు నిర్దేశించిన ప్రీమియం మొత్తం (8 శాతం)లో నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు గరిష్టంగా ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.6 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు తమ వాటాగా చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. ఇలా ఒక్క రబీ సీజన్లోనే రైతులపై రూ.300 కోట్లకు పైగా భారం పడతుందని అంచనా వేస్తున్నారు. వెన్నుదన్నుగా ఉచిత పంటల బీమా గతంలో ప్రీమియం మొత్తాన్ని మినహాయించుకుని రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. అయితే, బ్యాంకుల నుంచి రుణాలు పొందని రైతులు ప్రీమియం భారం అధికంగా ఉండటం, ఆర్థిక స్తోమత, అవగాహన లేకపోవడం వంటి కారణాలతో బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. ఫలితంగా రైతుల్లో అత్యధికులు బీమా చేయించుకోలేక విపత్తుల వేళ పంటలకు పరిహారం దక్కక నష్టపోయేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ రైతులపై పైసా భారం పడకుండా ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజీ కల్పిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. పంట నష్టానికి మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేవారు. ఇలా గడచిన ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు బీమా కవరేజీ కల్పించారు. ఏటా సగటున 40.5 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.04 కోట్ల మందికి బీమా కవరేజీ కల్పించారు. రైతుల తరఫున రూ.3,022.26 కోట్లను ప్రీమియం రూపంలో బీమా కంపెనీలకు చెల్లించగా.. ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతులు రూ.7,802.08 కోట్ల బీమా పరిహారం పొందగలిగారు. ఎన్రోల్మెంట్ ఎలాగంటే.. రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకునే ముందు తాము సాగు చేసే పంటల వివరాలను తొలుత ఎన్సీఐపీ (జాతీయ పంటల బీమా పోర్టల్)లో ఎన్రోల్ చేస్తారు. ఆయా పంటలకు కంపెనీలు నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో రైతులు చెల్లించాల్సిన వాటా మొత్తాన్ని బ్యాంకులు మినహాయించుకుని మిగిలిన రుణాలను మంజూరు చేస్తాయి. ఆ మొత్తాన్ని బీమా కంపెనీలకు జమ చేస్తాయి. ఇక రుణాలు తీసుకోని (నాన్ లోనీ ఫార్మర్స్) మాత్రం తగిన ధ్రువీకరణ పత్రాలతో కామన్ సర్విస్ సెంటర్స్ (సీఎస్సీ), బ్యాంక్ బ్రాంచీలు, ఐసీ అపాయింట్మెంట్ చేసిన వ్యక్తుల ద్వారా లేదా వ్యక్తిగతంగా ఎన్సీఐసీ పోర్టల్‌లో ఎన్రోల్ చేసుకోవచ్చు. భూ యజమానులైతే ల్యాండ్ డాక్యుమెంట్స్, కౌలు రైతులైతే సీసీఆర్సీ కార్డులు తప్పనిసరిగా ఉండాలి. రైతులు సాగు చేసిన పంటలను ధ్రువీకరిస్తూ వీఏఏ/వీహెచ్ఏ/వీఎస్ఎలు జారీచేసే సర్టిఫికెట్లు ఉండాలి. రైతుల మొబైల్ నంబర్, ఆధార్‌తో సీడింగ్ అయిన బ్యాంక్ పాస్ పుస్తకం కాపీ లేదా క్యాన్సిల్ చేసిన చెక్ కాపీలను అప్లోడ్ చేయాలి. రబీ సీజన్లో వరి మినహా మిగిలిన నోటిఫైడ్ పంటలకు అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీలోగా ఎన్రోల్ చేసుకోవాలి. జీడిమామిడికి నవంబర్ 15వ తేదీ, టమాటాకు డిసెంబర్ 15వ తేదీ వరకు, వరికి మాత్రం డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. కటాప్ తేదీకి 7 రోజులు ముందుగా ఆప్షన్ మార్చుకుంటూ డిక్లరేషన్ ఇవ్వొచ్చు. బీమా చేయించుకునే పంటను మారుస్తున్నట్టయితే కటాప్ డేట్‌కు రెండు రోజులు ముందుగా చెప్పాలి. చలానా మొత్తాన్ని 15 రోజులు ముందుగా చెల్లించాలి. అలాగే 15 రోజులు ముందుగా రిజెక్ట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. రైతులను నట్టేట ముంచుతున్న కూటమి ప్రభుత్వంవైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజంవ్యవసాయం దండగ అని చెప్పే చంద్రబాబు రైతులకు మేలు చేస్తారనుకోవడం భ్రమే. ఎన్నికల్లో అనేక హామీలతో రైతులను మభ్య పెట్టడం, అధికారంలోకి వచ్చాక వారిని నిలువునా ముంచడం చంద్రబాబుకు అలవాటే. ఇప్పుడూ రైతు వ్యతిరేక విధానాలనే కొనసాగిస్తూ అన్నదాతల నడ్డి విరుస్తున్నారు. అన్నదాతలపై పైసా భారం పడకుండా ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్లు విజయవంతంగా అమలు చేసిన వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేయడం దుర్మార్గం. ఈ కుట్రలో భాగంగానే పంటల బీమాపై అధ్యయనం కోసం కేడినెట్ సబ్ కమిటీ వేశారు. ప్రభుత్వ సూచన మేరకే సబ్ కమిటీ రైతులకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చింది. వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం దేశంలోనే అత్యుత్తమ పథకమని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. మిగిలిన రాష్ట్రాలూ ఈ విధానాన్ని అమలు చేయాలని కూడా సూచించింది. ఇలాంటి అద్భుత పథకాన్ని ఎత్తివేయడం రైతులను నట్టేట ముంచడమే.జగన్‌పై కోపాన్ని రైతులపై చూపొద్దుసీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్‌పై ఉన్న కోపాన్ని రైతులపై చూపడం నైతికత అనిపించుకోదు. ఉచిత పంటల బీమాను ఎత్తేసి, రైతులే ప్రీమియం కట్టుకోవాలనడం అన్యాయం. కూటమి హామీ ఇచ్చిన మేరకు రైతులకు రూ.20 వేలు ఇవ్వకపోగా, పంటల బీమా ప్రీమియం భారాన్ని కూడా వేయడం బాధాకరం. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతులకు రూ. వందల కోట్ల లబ్ధి కలిగింది. – వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడురైతులపై పెనుభారంవైఎస్ జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.3,411 కోట్లు పంటల బీమా పరిహారంగా చెల్లించింది. సుమారు 30.85 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలు పేరుతో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను ఎత్తివేసి, అన్నదాతపై భారం వేయడం దుర్మార్గమే. దీనివల్ల ఖరీఫ్‌లో వరి రైతులు ఎకరాకు రూ.630 చెల్లించాల్సి ఉంటుంది. ఇది రైతులపై పెనుభారమే. – కొవ్వూరి త్రినాధ్ రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడురైతును ఆదుకొనే పథకాన్ని ఎత్తివేస్తారా?కరువు పీడిత అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఉచిత పంటల బీమా పథకం ఎంతో ఆదుకుంది. అలాంటి మంచి పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎత్తివేయడం దుర్మార్గం. రైతులను ఆదుకొని, ఆత్మహత్యలు నివారించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చింది. అన్ని పంటలకూ ఈ పథకాన్ని వర్తింపజేసింది. ఇప్పుడీ పథకాన్ని చంద్రబాబు నిలిపివేయడంతో జిల్లా రైతాంగంపై రూ.110 కోట్ల భారం పడుతుంది. – వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ -
‘ఫసల్ బీమా’లో కొత్త పద్ధతి!
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి సంబంధించి కొత్త పద్ధతిని అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రీమియం సొమ్ము కంటే పరిహారపు సొమ్ము రైతులకు ఎక్కువగా చెల్లించే పరిస్థితి నెలకొంటే, బీమా కంపెనీకి నష్టం రాకుండా నిర్ణీత మొత్తంలో ప్రభుత్వం చెల్లించాలని యోచిస్తోంది.పరిహారపు సొమ్ము కంటే ప్రీమియం ఎక్కువెక్కువగా ఉంటే ముందనుకున్న లెక్క ప్రకారం నిర్ణీత మొత్తం ప్రభుత్వానికి కంపెనీ చెల్లించేలా, అటు వ్యవసాయ బీమా కంపెనీకి, ఇటు ప్రభుత్వానికి ఏ మాత్రం నష్టం జరగకుండా ఈ పథకాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అనేక సందర్భాల్లో ప్రీమియం ఎక్కువ చెల్లించగా, క్లెయిమ్స్ మాత్రం చాలా తక్కువగా ఉండేవి. ఇలా కంపెనీలు తెలంగాణ నుంచి రూ. వందల కోట్ల లాభాలు పొందాయి. దీంతో గత ప్రభుత్వం ఈ పథకం నుంచి బయటకొచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొత్త పద్ధతి ప్రకారం అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి, మరోవైపు కంపెనీలకు కూడా నష్టం జరగకుండా ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బీమా పథకం అమలు పంటల బీమా పథకంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ పద్ధతిలో పంటల బీమాను అమలు చేస్తున్న మధ్యప్రదేశ్‌ను అనుసరించాలని యోచి స్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్రంలో ఇటీవల వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి పర్యటించి.. అక్కడ అమలవుతున్న పంటల బీమాను అధ్యయనం చేశారు. బీమా అమలు చేస్తున్న కంపెనీలతోనూ చర్చించారు. ఏఐ పరిజ్ఞానంతో పంట నష్టాన్ని అత్యంత సక్రమంగా అంచనా వేయొచ్చని అంటున్నారు. ప్రస్తుతం మాన్యు వల్ పద్ధతిలో నష్టాన్ని అంచనా వేస్తుండగా, పారదర్శకంగా ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు మాన్యువల్‌గానూ... మరోవైపు ఏఐ ద్వారానూ పంటల నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఆ ప్రకారం నష్టాన్ని అంచనా వేస్తే, నష్టపోయిన పంటలకు బీమా కంపెనీలు పరిహారం ఇస్తాయని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. సింగిల్ రైతుకూ పరిహారం ఇచ్చేలా...!జీవిత బీమాలో వ్యక్తులకు ఏదైనా ప్రమాదం జరిగితే పరిహారం ఎలా వస్తుందో...పంట నష్టం జరిగిన సింగిల్ రైతుకు కూడా పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంటే రైతు యూనిట్‌గా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తారు. గతంలో అమలు చేసినప్పుడు గ్రామం లేదా మండలం యూనిట్‌గా వివిధ రకాలుగా పంటలను బట్టి పథకం ఉండేది. అంతేగాక సంబంధిత యూనిట్లో ఉన్న వ్యవసాయ పంటల్లో 33 శాతం దెబ్బతింటేనే బీమా పథకం వచ్చేది. అంటే వందెకరాలుంటే... 33 ఎకరాలు దెబ్బతింటేనే పథకం కింద రైతులకు పరిహారం అమలు చేసేవారు. కానీ ఇప్పుడు ఒక ఎకరా, అరెకరా ఉన్న ఒక్క రైతుకు కూడా పరిహారం అందుతుంది. అయితే ఈ వెసులుబాటును అమలుచేయాలంటే బీమా కంపెనీలు ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తాయని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. కాగా, రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. గతంలో పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది పంటల బీమా చేయించేవారు. ఇప్పుడు బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల బీమా పరిధిలోకి వచ్చే రైతుల సంఖ్య 50 లక్షలు ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రీమియం కూడా రూ. 2,500 కోట్ల మేరకు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. » ఓ ఉన్నతాధికారి లెక్క ప్రకారం ఉదాహరణకు ప్రభుత్వం రైతుల తరఫున బీమా కంపెనీకి కోటి రూపాయల ప్రీమియం చెల్లించిందనుకుందాం. ఒక సీజన్లో పంటల నష్టం వల్ల రైతులకు బీమా కంపెనీ రూ. 1.20 కోట్లు చెల్లిస్తే...కంపెనీకి రూ. 20 లక్షల నష్టం వచ్చినట్టు లెక్క. అప్పుడు ప్రభుత్వం రూ. 40 లక్షలు చెల్లించి... ఆ కంపెనీకి రూ. 20 లక్షలు లాభం జరిగేలా చూస్తుంది.» అలా కాకుండా అదే కోటి ప్రీమియం ప్రకారం చూసుకుంటే... పంట నష్టం జరిగి రైతులకు కంపెనీ రూ. 60 లక్షలు చెల్లిస్తే... అప్పుడు ప్రభుత్వానికి రూ.40 లక్షలు నష్టం జరిగినట్టు లేదా అదనంగా కంపెనీకి 40 శాతం ఎక్కువ ప్రీమియం సొమ్ము చెల్లించినట్టు లెక్క. అప్పుడు ప్రభుత్వానికి అంతగా నష్టం జరగకుండా కంపెనీ రూ.20 లక్షలు ఇచ్చి కొంత వెసులుబాటు ఇస్తుంది. అయితే దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. -
రబీ నుంచి రైతులపైనే బీమా భారం
సాక్షి, అమరావతి : ఉచిత పంటల బీమాపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ భారాన్ని రైతులే భరించాలని తేల్చి చెప్పేసింది. రైతులపై పైసా భారం పడకుండా యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. 2024–25 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపజేస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుత ఖరీఫ్ వరకు మాత్రమే.. అది కూడా సమయం లేని కారణంగా రైతుల తరపున ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుందని, రబీ నుంచి మాత్రం ప్రీమియం రైతులే చెల్లించుకోవాలని, వారికే పంటల బీమా వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఈ పంట ఆధారంగానే పంటల బీమాఖరీఫ్– 2024, రబీ 2024–25 సీజన్లలో దిగుబడి ఆధారిత పంటలకు అమలు చేసే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధారిత పంటలకు అమలు చేసే పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్డబ్ల్యూ బీసీఐ)పై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఖరీఫ్ సీజన్ వరకు ఈ పంట డేటా ఆధారంగా సోషల్ ఆడిట్ పూర్తయిన తర్వాత తుది జాబితాలో అర్హత పొంది, నోటిఫై చేసిన పంటలు సాగు చేసిన వారికి బీమా వర్తింపచేస్తామని ప్రకటించింది. ఖరీఫ్ సీజన్ వరకు గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపింది. ఖరీఫ్‌లో దిగుబడి ఆధారిత పంటల పథకం కింద వరి, సజ్జ, జొన్న, మొక్కజొన్న, కొర్ర, రాగి, పెసర, మినుము, కంది, వేరుశనగ, నువ్వులు, ఆముదం, మిర్చి, పసుపు, ఉల్లి పంటలకు, వాతావరణ ఆధారిత పథకం కింద వేరుశనగ, ప్రత్తి, టమాటా, నిమ్మ, దానిమ్మ, బత్తాయి, అరటి పంటలకు బీమా వర్తింపచేయనుంది. ప్రీమియం చెల్లించిన వారికే బీమారబీ–2024–25 సీజన్ నుంచి పంటల బీమాలో రైతులు స్వచ్చందంగా చేరాల్సిందేనని స్పష్టం చేసింది. రబీ సీజన్లో దిగుబడి ఆధారిత పథకం కింద వరి, జొన్న, మొక్కజొన్న, రాగి, పెసర, మినుము, వేరుశనగ, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, శనగ, రాజ్మా, మిర్చి, ఉల్లి, వాతావరణ ఆధారిత పథకం కింద జీడిమామిడి, టమాటా పంటలకు బీమా వర్తింపచేయనున్నారు. రబీ సీజన్లో బీమా చేయించుకోవాలంటే రైతుల వాటా ప్రీమియంను వారే చేయించాలని ప్రభుత్వం తెగేసి చెప్పింది. ప్రీమియం మొత్తంలో ఆహార ధాన్యాలు, నూనెగింజల పంటలకు 1.5 శాతం, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం రైతులు స్వచ్ఛందంగా చెల్లిస్తేనే బీమా వర్తిస్తుందని పేర్కొంది. పీఎంఎఫ్‌బీవై లో పంటకోత ప్రయోగాల ఆధారంగా వాస్తవ దిగుబడి లెక్కించి హామీ దిగుబడి కన్నా తగ్గిన సందర్భంలో ఇన్సూ్యరెన్స్ యూనిట్ పరిధిలోని రైతులందరికీ నష్ట శాతం లెక్కించి బీమా పరిహారం చెల్లిస్తారు. పీఎంఎఫ్‌బీవై పథకాన్ని 9 క్లస్టర్స్ పరిధిలోనూ ఐదు బీమా కంపెనీలను, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ పథకాన్ని ఐదు క్లస్టర్స్ పరిధిలో నాలుగు బీమా కంపెనీలను ఎంపిక చేసారు. -
రాష్ట్రంలో పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించండి... ఏపీ సీఎంను డిమాండ్ చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
పంటల బీమా ప్రీమియం 'తక్షణమే చెల్లించండి': వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ 2023–24 సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ చెల్లించకపోవడంతో రైతులకు పంటల బీమా పరిహారం చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీ కింద పెట్టుబడి సాయంగా సీఎం చంద్రబాబు ఏటా రైతులకు ఇస్తామన్న రూ.20 వేలను వెంటనే చెల్లించాలన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఆదివారం “ఎక్స్’లో ట్వీట్ చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే.. ఉచిత పంటల బీమాలో ఆదర్శంగా నిలిచాం.. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియాన్ని మా ప్రభుత్వ హయాంలో ఏటా ఏప్రిల్–మే నెలల్లో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్‌లో ఆదుకున్నాం. ఖరీఫ్‌లో పంటలు వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థంగా పథకాన్ని అమలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా తన వాటా విడుదల చేస్తుంది. అనంతరం సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుంది. ఇలా మా ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.7,802 కోట్లు అందించి అండగా నిలిచాం. తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో మన రాష్ట్రం దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతతో రైతులకు తీవ్ర నష్టం.. 2023–24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ దాని గురించి పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటా ఇవ్వలేదు. ఇప్పటికే జూన్, జూలై మాసాలు గడిచిపోయాయి. ఆగస్టులో దాదాపు పక్షం రోజులు పూర్తి కావస్తున్నా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలికలేక పోవడం అత్యంత విచారకరం. ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికైనా మేలుకుని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులకు బీమా పరిహారం చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మళ్లీ వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే దుస్థితిరైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామని సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్నారు. మీరిచ్చే పెట్టుబడి సహాయం కోసం రైతులంతా ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ దాదాపు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలన్నీ కుదేలైనా మా ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా అన్నదాతలకు రైతు భరోసా అందించాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సీజన్లో రైతు భరోసా చెల్లించాం. ఆ విధంగా 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు పెట్టుబడి సహాయం అందించాం. ఇప్పుడు మళ్లీ రైతులు పెట్టుబడి డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ, వడ్డీ వ్యాపారులు చుట్టూ మళ్లీ తిరిగే దుస్థితి కల్పించారు. వెంటనే పెట్టుబడి సహాయం కింద రైతులకు మీరు ఇస్తానన్న డబ్బులతో పాటు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి 2023–24 పరిహారం సొమ్ము విడుదలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గుర్తు పెట్టుకోండి చంద్రబాబూ! వైఎస్సార్ రైతు భరోసాతో పెట్టుబడి సాయం ఇలారైతుల సంఖ్య లబ్ధి రూ.కోట్లలో 53.58 లక్షలు 34,288 -
ఉచిత పంటల బీమాపై నీలి నీడలు
సాక్షి, అమరావతి: రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లుగా విజయవంతంగా అమలు చేస్తోన్న వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు మంగళం పాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పంటల బీమాపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశం కాబోతోంది. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకంతో పాటు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పంటల బీమాపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఐదేళ్లుగా విజయవంతంగా అమలవుతున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేస్తున్నట్టుగా తొలి సమీక్షలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం స్థానంలో 2019కి పూర్వం రైతుల భాగస్వామ్యంతో అమలైన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) తీసుకొస్తున్నట్టు స్వయంగా వెల్లడించారు. ఈ ప్రకటనకు కొనసాగింపుగా ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఉచిత పంటల బీమా పథకం స్థానంలో మెరుగైన బీమా పథకం కోసం అధ్యయనం పేరిట వ్యవసాయ, పౌర సరఫరాలు, ఆర్థిక శాఖా మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న క్రాప్ ఇన్సూ్యరెన్స్ చట్టాలపై ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్లో తీర్మానించారు. పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఆ తర్వాత ఒక్కొక్కొటిగా వాటికి మంగళం పాడుతోంది.అత్యుత్తమ పథకంగా కొనియాడిన కేంద్రంప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న ఉచిత పంటల బీమా పథకం దేశంలోనే ది బెస్ట్ క్రాప్ ఇన్సూ్యరెన్స్ పథకమని కేంద్రమే అధికారికంగా ప్రకటించింది. ఇన్నోవేషన్ కేటగిరి కింద 2023లో అవార్డును సైతం అందించింది. ఏపీ స్ఫూర్తితో నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్ కవరేజి కల్పించేందుకు ఫసల్ బీమాలో పలు మార్పులు కూడా చేసింది. ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్సల్ కవరేజి కల్పిస్తూ రైతులపై పైసా భారం పడకుండా 2019 రబీ నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. రూ.7802 కోట్ల పరిహారంఈ పథకం కింద రికార్డు స్థాయిలో దాదాపు 5 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించడం ద్వారా 2.04 కోట్ల మంది రైతులకు ఉచితంగా బీమా రక్షణ కల్పించింది. ఐదేళ్లలో వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న 54.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7802.08 కోట్ల బీమా పరిహారం నేరుగా జమ చేసింది. 2023–24 సీజన్‌కు సంబంధించి రైతుల వాటాతో కలిపి ప్రీమియం రూపంలో రూ.1,384 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించ కుండా ఎగ్గొట్టాలనే ఆలోచనతో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల భాగస్వామ్యంతో పాత పంటల బీమాను పునరుద్దరిస్తున్నట్టుగా ప్రకటించింది. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం భేటీ కానుంది. పైసా భారం పడకుండా ఐదేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలంటూ రాష్ట్రంలోని రైతులు, రైతు సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. -
బీమా పేరుతో భారం వేయవద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలకపార్టీ ఉచిత పంటల బీమాను మార్చే సాకుతో బీమా భారాన్ని రైతులపై వేసే యోచన విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు, వ్యవసాయ కార్మిక, కౌలురైతుల సంఘాల సంయుక్త సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విజయవాడలో నిర్వహించిన సంయుక్త సమావేశం వివరాలను ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి, ఏపీ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, ఏపీ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు మంగళవారం మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమాను మార్చేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయతి్నస్తోందన్నారు. రైతుల భాగస్వామ్యం పేరుతో బీమా ప్రీమియం భారాన్ని రైతులపై వేసేందుకు ఈ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. కరువు, వరదలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే రైతులను ఆదుకునేందుకు ఉచిత పంటల బీమా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయాన్ని మరిచి రైతులపై భారం వేసే ప్రయత్నాలు చేస్తే రైతు ఉద్యమం తప్పదని చెప్పారు. ఈ విషయమై గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమం చేపడతామని, రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు రైతులు, కౌలురైతులు కదులుతారని తెలిపారు. రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సమన్వయంతో ఈ నెల 18, 19 తేదీల్లో గ్రామ సచివాలయాల్లో ‘సామూహిక రాయబారాల’ పేరుతో వినతిపత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. 2023లో కరువు, తుపాన్లతో దెబ్బతిన్న పంటలకు పంటల బీమా పరిహారం రైతుల ఖాతాల్లో వేయాలని, కౌలు రైతులకు కూడా పంటల బీమా పరిహారం ఇవ్వాలని, రైతు సేవా (రైతు భరోసా) కేంద్రాలను బలపర్చాలని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను రైతుసేవా కేంద్రాల ద్వారా అందించాలని, పెండింగులో ఉన్న ఉపాధి బిల్లులను వెంటనే ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో వినతిపత్రాలు ఇస్తామని వారు వివరించారు. -
పంటల బీమాకు ‘పాత’ర!
రూ.4 లక్షల బీమా పరిహారం అందుకున్నా..పసుపు, కంద, అరటి, తమలపాకు సాగు చేస్తుంటా. వైఎస్సార్ ఉచిత పంటల బీమా రైతులకు ఎంతో బాసటగా నిలిచింది. గత ఐదేళ్లలో పైసా ప్రీమియం చెల్లించకుండా రూ.4 లక్షలకు పైగా బీమా పరిహారం పొందా. రూ.2 లక్షల వరకు పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందుకున్నా. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పరిహారం జమైంది. రైతాంగానికి ఎంతో ఆసరాగా ఉన్న పథకాన్ని రద్దు చేసి 2019కి ముందు ఉన్న విధానం అమలు చేయాలని నిర్ణయించడం సరికాదు. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి.– ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, కిష్కిందపాలెం, బాపట్ల జిల్లాసాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ తమపై పైసా భారం పడకుండా కష్టకాలంలో ఆదుకున్న డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు పాతరేసే దిశగా టీడీపీ సర్కారు సన్నద్ధం కావడం అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ‘సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తాం.. ఏ ఒక్కటీ ఆపే ప్రసక్తే లేదు. ఇంకా మెరుగైన రీతిలో అమలు చేస్తాం’ అని ఎన్నికల ప్రచార సభల్లో హామీలిచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర కూటమి నేతలు వాటిని గాలికి వదిలేశారు. రైతులకు మేలు చేసే వ్యవసాయ సలహా మండళ్లను రద్దు చేసిన కూటమి సర్కారు కన్ను తాజాగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంపై పడింది. ఈ – క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్ బీమా కవరేజ్ కల్పిస్తూ ఈ పథకం దేశానికే తలమానికంగా నిలిచింది. అయితే 2019కి ముందు అమలులో ఉన్న పాత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్టు తొలి సమీక్షలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన రైతన్నల గుండెల్లో గుబులు రేపింది. గత ఐదేళ్లుగా తాము కట్టాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి పైసా భారం లేకుండా ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే నేరుగా తమ ఖాతాల్లో జమ చేసే పరిస్థితి ఇక ఉండదన్న ఆందోళన వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. టీడీపీ సర్కారు తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుని ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమ బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నాయి.ఏళ్ల తరబడి ఎదురు చూపులు..1965లో కేంద్రం తెచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ బిల్లు ఆధారంగా ప్రవేశపెట్టిన మోడల్ ఇన్సూరెన్స్ పథకం వివిధ రూపాలు మార్చుకుని ప్రధాని ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)గా 2016 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతోంది. దీని ప్రకారం నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు ప్రీమియం చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాయి. అయితే ప్రీమియం భారం అధికంగా ఉండడంతో పాటు అవగాహన లేక పలువురు రైతులు సొంతంగా బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. రుణాలు తీసుకునే రైతులకు మాత్రం బ్యాంకులు ప్రీమియం రూపంలో నిర్దేశించిన మొత్తాన్ని మినహాయించుకొని మిగతాది అందచేసేవి. అయితే బీమా చేయించుకున్న వారు సైతం ఎంతొస్తుంది? ఎప్పుడొస్తుందో అంతుబట్టక ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.2014–19 పరిహారం రూ.3,411.20 కోట్లే చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడూ కేంద్ర పథకాలపై ఆధార పడడం మినహా అన్నదాతల సంక్షేమం కోసం తపించిన దాఖలాలు లేవు. 2014–19 మధ్య తొలి రెండేళ్లు వ్యవసాయ ఇన్సూరెన్స్కీమ్ (ఏఐఎస్), ఆ తర్వాత పీఎంఎఫ్‌బీవై అమలు చేశారు. ప్రీమియం రూపంలో 2014–19 మధ్యలో రైతులు తమ వాటాగా రూ.1249.90 కోట్లు చెల్లిస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.1281 కోట్లు చెల్లించింది. హుద్‌హుద్ లాంటి పెను తుపాన్, కరువు కాటకాటకాలతో రూ.వేల కోట్ల పంటలను కోల్పోయిన రైతులకు 2014–19 మధ్య దక్కిన పరిహారం కేవలం రూ.3,411.20 కోట్లు మాత్రమే. పైసా భారం పడకుండా.. పాదయాత్ర హామీ మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 జూలై 8న వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు శ్రీకారం చుట్టారు. తొలి ఏడాది పీఎం ఎఫ్‌బీవైతో అనుసంధానించి అమలు చేశారు. 2019 ఖరీఫ్ సీజన్లో రూపాయి ప్రీమియంతో పథకానికి శ్రీకారం చుట్టగా అనంతరం ఆ భారం కూడా రైతులపై పడకూడదన్న ఆలోచనతో ఖరీఫ్–2020 నుంచి నోటిఫైడ్ పంటలకు ఉచితంగా బీమా కవరేజ్ కల్పించారు. క్లెయిమ్‌లు, సెటిల్మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా ప్రభుత్వం తన భుజాన వేసుకుంది. తొలి ఏడాది రైతుల వాటా (రూ.468 కోట్ల)తో కలిపి ప్రీమియం రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.971 కోట్లు బీమా కంపెనీలకు చెల్లించింది. యూనివర్సల్ కవరేజ్‌కు కేంద్రం ముందుకు రాకపోవడంతో 2020–21, 2021–22 సీజన్లలో పీఎం ఎఫ్‌బీవైతో సంబంధం లేకుండా మొత్తం బీమా పరిహారం ప్రభుత్వమే చెల్లించింది. 2022–23 నుంచి ఫసల్ బీమాతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం గత ప్రభుత్వం సొంతంగానే బీమా పరిహారం చెల్లించింది. ఈ క్రాప్ ప్రామాణికంగా.. ఈ క్రాప్‌తో పాటు ఈ కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తి కాగానే గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలకు (స్టార్) గుర్తుతో ప్రత్యేకంగా తెలియచేస్తూ రైతులకు భౌతిక రసీదు అందచేసింది. ‘డాక్టర్ వైస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద నోటిఫై చేసిన పంటకు ప్రీమియంను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి పంట బీమా చేసింది‘ అని అందులో స్పష్టంగా తెలియచేసింది. ఈ జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించి అభ్యంతరాలను పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా పరిహారం అందచేసింది. ప్రీమియం రూపంలో రైతుల వాటాతో కలిపి 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,022.26 కోట్లు కంపెనీలకు చెల్లించింది. 2019–24 మధ్య 1.91 కోట్ల హెక్టార్లకు బీమా కవరేజీ కల్పించగా 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ లభించింది. రికార్డు స్థాయిలో పరిహారం.. 2014–19 మధ్య 30.85 లక్షల మందికి రూ.3411.20 కోట్ల పరిహారం చెల్లిస్తే 2019–24 మధ్య 54.55 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం అందింది. టీడీపీ హయాంలో 6.19 లక్షల మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి గత సర్కారు అండగా నిలిచింది. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చెల్లించిన బీమా మొత్తం కంటే రూ.3,273.64 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూర్చగా 13.81 లక్షల మంది రైతులు అదనంగా ప్రయోజనం పొందారు. ఏపీ బాటలో పలు రాష్ట్రాలు.. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని దేశంలోనే అత్యుత్తమ పంటల బీమా పథకంగా కేంద్రం గుర్తించింది. ఇన్నోవేషన్ కేటగిరి కింద ఉత్తమ బీమా పథకంగా ఎంపిక చేసింది. 2023 ఏప్రిల్ 14న కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందించారు. ఏపీ స్ఫూర్తిగా జాతీయ స్థాయిలో పీఎంఎఫ్‌బీవైలో పలుమార్పులు చేసినట్టుగా కేంద్రం ప్రకటించింది. ఏపీ తరహాలో మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచించింది. 2023–24 నుంచి మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి తదితర రాష్ట్రాలు ఏపీ బాటలోనే రూపాయి ప్రీమియంతో పంటల బీమా అమలుకు శ్రీకారం చుట్టాయి. ఉచిత పంటల బీమా పథకాన్ని కేంద్రం సహా పలు రాష్ట్రాలు ప్రశంసించాయి. రూ.1,278.80 కోట్ల ప్రీమియం చెల్లింపులకు ఎగనామం.. 2023–24 సీజన్‌కు సంబంధించి బీమా కవరేజ్ పరిధిలోకి వచ్చిన అర్హుల జాబితాను గతంలోనే కేంద్రానికి పంపించారు. ఆ మేరకు రైతుల వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,278.80 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, ప్రభుత్వం మారడంతో ప్రీమియం చెల్లించాల్సిన బాధ్యత టీడీపీ సర్కారుపై ఉంది. అయితే పాత పద్ధతిలోనే పంటల బీమా అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా 2023–24 సీజన్ ప్రీమియం చెల్లింపులు జరపవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు సంకేతాలిచ్చారు. దీంతో 2023–24 సీజన్లో వర్షాభావం, వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు 2024–25 సీజన్ నుంచి రైతులే చెల్లించేలా చూడాలంటూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో వారిపై పెనుభారం పడనుంది. రైతులపై ఏటా రూ.800 కోట్లకుపైగా భారం ఏ పంటైనా సరే జిల్లాలో కనీసం ఐదువేల ఎకరాల్లో సాగైతేనే నోటిఫై చేస్తారు. నోటిఫై చేసిన పంట పెట్టుబడి ఖర్చులను బట్టి బీమా కంపెనీలు ప్రీమియం నిర్దేశిస్తాయి. ఉదాహరణకు వరికి ఎకరాకు రూ.40 వేలు ఖర్చవుతుంటే కనీసం 8 శాతం అంటే రూ.3,200 చొప్పున ప్రీమియం చెల్లిస్తేనే బీమా కవరేజ్ కల్పిస్తుంది. ఈ మొత్తంలో ఖరీఫ్‌లో అయితే 2 శాతం, రబీలో 1.5 శాతం చొప్పున రైతులు గతంలో చెల్లించగా మిగతాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేవి. ఈ లెక్కన నోటిఫై పంటలకు రైతులు తమ వాటాగా ఏటా కనీసం రూ.800 కోట్లకు పైగా ప్రీమియం రూపంలో భరించాల్సి ఉంటుంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందని కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతులు సొంతంగానే ప్రీమియం చెల్లించాలి. వీరికి అవగాహన కల్పించకపోవడం, ఆర్ధిక భారం కారణంగా బీమాకు ముందుకు రావడం లేదు. దీంతో పంట నష్టపోతే విపత్తుల వేళ బీమా పరిహారం అందని దుస్థితి నెలకొంటుంది. వైఎస్సార్ రైతు భరోసాను హడావుడిగా అన్నదాతా సుఖీభవగా మార్చేసి రూ.20 వేలు ఇవ్వకుండా ఇప్పటికే సీజన్లో అన్నదాతలను ముంచేసిన టీడీపీ సర్కారు ఇప్పుడు ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేసే దిశగా అడుగులు వేయడం పిడుగుపాటుగా మారింది.రూ.2.75 లక్షల పరిహారం ఇచ్చారువైఎస్సార్ ఉచిత పంటల బీమా అన్నదాతలను ఎంతో ఆదుకుంది. నోటిఫై చేసిన పంటలు ఈ క్రాప్‌లో నమోదైతే చాలు బీమా వర్తింపచేశారు. మాకు 20 ఎకరాల భూమి ఉంది. పత్తి, శనగ, ఉల్లి సాగు చేస్తుంటాం. 2019–20లో ఒక్క ఉల్లి పంటకే రూ.1.10 లక్షల బీమా పరిహారం వచ్చింది. ఆ తర్వాత రూ.70 వేలు, రూ.42 వేలు, రూ.53 వేలు చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.2.75 లక్షల బీమా పరిహారం అందింది. రూపాయి ప్రీమియం చెల్లించకపోయినా ఇంత భారీగా పరిహారం దక్కటం ఎంతో ఊరటనిచ్చింది. అన్నదాతలకు ఎంతగానో ఆసరాగా నిలిచిన ఈ ఉచిత పంటల బీమాను కొనసాగించాలి. 2019కి ముందు ఉన్న పంటల బీమా పథకాన్ని కొనసాగిస్తే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. –గౌర మహేశ్వరరెడ్డి, ఏ.గోకులపాడు, కర్నూలు జిల్లాపాత విధానం సరికాదు..30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. 2021 ఖరీఫ్‌లో అరటి పంట దెబ్బతినడంతో రూ.90 వేల పంటల బీమా పరిహారం నేరుగా నా ఖాతాలో జమ చేశారు. దళారుల ప్రమేయం లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. ఐదేళ్లూ పైసా కూడా మేం ప్రీమియం చెల్లించలేదు. మా వాటా కూడా ప్రభుత్వమే కట్టింది. చంద్రబాబు ప్రభుత్వం పాత విధానంలో పంటల బీమా అమలు చేస్తామని చెప్పడం సరికాదు.– గనివాడ సన్యాసినాయుడు, పెదమదుపాడ, విజయనగరం జిల్లారైతులు బీమా చేయించుకోలేరు2019కు ముందు టీడీపీ హయాంలో రైతులు బీమా చేయించుకుంటేనే నష్టపరిహారం వర్తించేది. రైతులలో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నందున అవగాహన లేక నష్టపోయే ప్రమాదం ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను అమలు చేసింది. 2021లో వర్షాలకు 80 సెంట్లు పొలంలో నష్టపోతే నేరుగా రూ.5,100 పరిహారం ఇచ్చారు. – డి. ప్రభాకర్, తాటితూరు, భీమిలి మండలంరూ.3.80 లక్షల పరిహారం వచ్చిందినేను పైసా ప్రీమియం చెల్లించకపోయినా 2021లో ఖరీఫ్‌లో పంట నష్టపోతే రూ.3.80 లక్షల బీమా పరిహారం జమైంది. గతంలో ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా పరిహారం కోసం అధికారులు, కంపెనీల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చేది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ఎంతగానో ఉపయోగపడింది. ఈ పథకాన్ని కొనసాగించాలి.– వీరపురం భీమేష్, గడేకల్లు, అనంతపురం జిల్లారైతుల తరపున ఉద్యమిస్తాం..రైతులపై భారం పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాల్సిందే. పాత పద్ధతిలో పంటల బీమా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించటాన్ని ఖండిస్తున్నాం. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు బీమా ప్రీమియం రైతులకు తలకు మించిన భారమవుతుంది. ప్రీమియం చెల్లించలేక బీమాకు మెజార్టీ రైతులు దూరమవుతారు. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించకుంటే ఉద్యమిస్తాం.– కె.ప్రభాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘంపాత పద్ధతితో తీవ్ర నష్టంగతంలో క్రాప్ లోన్ ఆధారంగా రైతులు సాగు చేసిన పంటలకు కాకుండా ఇష్టానుసారంగా ఇన్సురెన్స్ ఇచ్చేవారు. ఐదేళ్లుగా ఉచిత పంటల బీమా అమలు చేయడం వలన పైసా ప్రీమియం చెల్లించాల్సిన పని లేకుండా సాగు చేసిన పంటకు బీమా పరిహారం నేరుగా అందింది. ఈ పథకాన్ని కొనసాగించాలి. పాత పద్ధతితో తీవ్రంగా నష్టపోతాం.– ఎన్.రాజేశ్వరరెడ్డి, సింహాద్రిపురం, వైఎస్సార్ జిల్లా -
ఉచిత పంటల బీమా కొనసాగించాల్సిందే
సాక్షి, అమరావతి: రైతులపై భారం పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 2019కి ముందు ఉన్న పాత పద్ధతిలోనే పంటల బీమాను అమలుచేస్తామని వ్యవసాయ శాఖపై జరిగిన తొలి సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి. కృష్ణయ్య, కె. ప్రభాకర్‌రెడ్డి తప్పుబట్టారు. రైతుల భాగస్వామ్యంతో పంటల బీమా అమలుచేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో బీమా ప్రీమియం భారం భరించే స్థితిలో రైతుల్లేరని వారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేసినట్లుగానే రైతుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. రైతులపై భారం లేకుండా ఉచిత పంటల బీమా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రీమియం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50శాతం చొప్పున భరించాలన్నారు. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకూ ఉచిత పంటల బీమా అమలుచేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ బీమా సంస్థలొద్దు.. పంటల బీమా అమల్లో ప్రైవేటు, కార్పొరేట్ బీమా సంస్థలను పక్కన పెట్టి ప్రభుత్వ రంగ బీమా సంస్థలను అనుమతించాలన్నారు. ప్రైవేట్ బీమా కంపెనీలు తమ లాభాల కోసం రైతులకు జరిగిన నష్టాన్ని తక్కువచేసి చూపి రైతులకు పంటల బీమా చెల్లించకుండా మోసం చేస్తున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం కూడా తొలి మూడేళ్లూ తానే బాధ్యత తీసుకుని రైతులకు పంటల బీమా అమలుచేసిందని గుర్తుచేశారు.రెండేళ్లుగా కేంద్రం ఒత్తిడితో పంటల బీమాలోకి ప్రైవేట్, కార్పొరేట్ బీమా కంపెనీలను అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఫలితంగా కొన్ని పంటలకు బీమా పరిహారం అందక రైతులు నష్టపోయారన్నారు. కరువు, తుపాను వంటి విపత్తులతోపాటు వాతావరణ ప్రభావంతో పంట దిగుబడి తగ్గిపోయిన పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. పంట నష్టం అంచనాలో అధికారుల నివేదికల ఆధారంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులపై ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
మళ్లీ పాత పద్ధతిలోనే పంటల బీమా
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఉన్న ఉచిత పంటల బీమా పథకం స్థానంలో మళ్లీ పాత విధానంలో క్రాప్ ఇన్సూ్యరెన్స్ తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రైతు భాగస్వామ్యం లేకుండా పంటల బీమా స్వరూపాన్నే మార్చేశారని, ఇక నుంచి సాగు చేసే ప్రతీ రైతుకు భాగస్వామ్యం ఉండేలా పంటల బీమా విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పారు. ఖరీఫ్ పంటల సాగులో వ్యవసాయ శాఖ సన్నద్దతపై బుధవారం సచివాలయంలో వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు సాగునీటి విడుదల ప్రణాళికను సీఎం చంద్రబాబుకు వివరించారు. గోదావరి డెల్టాకు జూన్ 1న నీరు విడుదల చేశామని, ఈ రోజు (బుధవారం) పట్టిసీమ, పుష్కర, తాటిపూడి, పురుషోత్తంపట్నం ద్వారా నీటి విడుదల ప్రారంభించామని చెప్పారు. పులిచింతలలో నీటి లభ్యత లేదని, పట్టిసీమ ద్వారా వచ్చే నీటి ద్వారానే కృష్ణా డెల్టాకు సాగు నీరు ఇస్తామన్నారు. జూన్‌లో హీట్ వేవ్ ఉన్నప్పటికీ, ప్రస్తుతం వర్షాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సగటున 50 శాతం అదనపు వర్షపాతం నమోదైందని, కేవలం 45 మండలాల్లోనే లోటు వర్షపాతం ఉందన్నారు. సీజన్లో ఇప్పటి వరకు 4,14,490 ఎకరాలు సాగు జరగాల్సి ఉండగా 3,04,604 ఎకరాల్లో పంటలు సాగయ్యాయన్నారు. ఏపీలోనే రైతుల అప్పులెక్కువదేశంలో ఎక్కువ అప్పులు ఉండే రైతులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. ప్రభుత్వ సబ్సిడీలు, పాలసీల ద్వారా సాగు ఖర్చులు తగ్గాలన్నారు. గతంలో క్రమం తప్పకుండా సాయిల్ టెస్ట్‌లు నిర్వహించి, రైతులకు పోషకాలు అందించే వాళ్లమన్నారు. రాయలసీమ జిల్లాల్లో సబ్సిడీపై పెద్ద ఎత్తున డ్రిప్, స్ప్రింక్లర్లు ఇచ్చామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణలో మళ్లీ ఉత్తమ విధానాలు అమలు చేయాలని సూచించారు. జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్‌ను మళ్లీ ప్రోత్సíßæంచాలన్నారు. డ్రోన్లతో పురుగు మందుల పిచికారీపై అధ్యయనం చేయాలని, వాటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. పంటలకు అధికంగా పురుగు మందులు కొట్టే విధానాలకు స్వస్తి పలకాలన్నారు. ఏ తెగులుకు ఏ మందు కొట్టాలి అనే విషయంలో అధికారులు రైతులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అన్ని పంట కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన గుర్రపు డెక్క తొలగించాలని ఆదేశించారు. కృష్ణా నది నీటిని రాయలసీమకు ఎక్కువగా ఉపయోగించి, వృధాగా పోయే గోదావరి వరద నీటిని సద్వినియోగం చేసుకుని కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆక్వా, హార్టికల్చర్‌కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులకు మళ్లీ భరోసా కల్పించేలా అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఐఏఎస్ అధికారులు సైతం సచివాలయం నుంచి పొలాలకు వెళ్లి, రైతులతో నేరుగా మాట్లాడాలన్నారు. ఈ సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ, ఉద్యాన, ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉచిత పంటల బీమాను కొనసాగించాల్సిందే
సాక్షి, అమరావతి: మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుకు రాసిన లేఖను సంఘ అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శులు కె.ప్రభాకరరెడ్డి ఆదివారం మీడియాకు విడుదల చేశారు. రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయం వెంటనే రైతుల ఖాతాలకు జమ చేయాలని, రబీలో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు పరిహారం, సున్నా వడ్డీ రాయితీలను జమ చేయాలని, వ్యవసాయ విద్యుత్ మీటర్ల ఏర్పాటు జీవోను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘం కోరింది. రైతు భరోసా కేంద్రాలను అభివృద్ధి చేసి, రైతులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, సొసైటీలకు పాలు పోసే రైతులకు లీటర్‌కు రూ.5, బోనస్ ఇవ్వాలని, మూతపడిన డెయిరీలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. మద్దతు ధరపై ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇవ్వాలని, ఆహార, పప్పుధాన్యాలు, వాణిజ్య, ఉద్యాన పంటలన్నిటికి మద్దతు ధరలు ప్రకటించాలని కోరింది. రబీలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన రూ.1,600 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని, రైతుల చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని, అప్పుల పాలైన రైతులు బకాయిపడిన రూ.2 లక్షల వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని కోరింది.చక్కెర కర్మాగారాల్ని పునరుద్ధరించాలిరాష్ట్రంలోని 32 లక్షల కౌలు రైతులకు యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన బ్యాంక్ రుణాలు, ఇతర సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం కోరింది. రాష్ట్రంలో మూతపడిన 25 చక్కెర కర్మాగారాలను వెంటనే పునరుద్ధరించాలని, పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని కోరింది. -
వరికి ని‘బంధనాలు’
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయాలని నిర్ణయించిన పంటల బీమా పథకంలోని నిబంధనలు వరి రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఒక జిల్లాలో మొత్తం సాగువిస్తీర్ణంలో 25 శాతానికి మించి విస్తీర్ణమున్న పంటలను మాత్రమే గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకం అమలు చేయాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం సంగారెడ్డితోపాటు, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఏ ఒక్క పంట కూడా 25 శాతానికి మించి సాగు కావడం లేదు. దీంతో ఈ జిల్లాల్లో గ్రామం యూనిట్‌గా అమలు చేసే అవకాశం లేకుండాపోతోంది. ఈ వానాకాలం నుంచే కొత్త పథకం అమలు అధిక వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా పంటల బీమా పథకం అమలు చేస్తారు. ఐదేళ్ల క్రితం నిలిపివేసిన ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో భాగంగా ఈ వానాకాలం నుంచే రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. నిర్మల్‌లో వరితోపాటు, సోయా కూడా.. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో ఈ పంటల బీమా పథకం అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో వరి పంటను గ్రామం యూనిట్‌గా అమలు చేసేందుకు నిబంధనలు కలిసొస్తున్నాయి. నిర్మల్ జిల్లా వరితోపాటు, సోయా పంట కూడా గ్రామం యూనిట్‌గా అమలు చేసేందుకు వీలు కలుగుతోంది. మండలం యూనిట్ అయితే వరి రైతుకు నష్టం పంటల బీమా పథకం గ్రామం యూనిట్‌గా అమలు చేస్తేనే ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు క్లెయిమ్ (పరిహా రం) అందుతుంది. మండలం యూనిట్‌గా అమలు చేస్తే చాలామంది రైతులకు ఈ క్లె యిమ్ అందదు. ఎలాగంటే.. మండలం యూనిట్‌గా తీసుకుంటే అధిక వర్షాలుగానీ, వడగండ్ల వానగానీ, ఈదురుగాలుల వర్షం కారణంగా మండలవ్యాప్తంగా అన్ని గ్రామా ల్లో మొత్తం వరి పంట నష్టపోతే మాత్రమే రైతులకు పరిహారం అందుతుంది.మండలంలో కొన్ని గ్రామాల్లో పంట నష్టం జరిగి, మరికొన్ని గ్రామాల పరిధిలో నష్టం జరగకపోతే పంట నష్టపోయిన గ్రామాల రైతులకు కూడా పరిహారం అందదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఈ నిబంధనపై రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లాలకు ఒకే విధంగా నిబంధనలను సరళీకృతం చేయాలని కోరుతున్నారు. -
‘పంటల బీమా’కి రూ.3 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు చేయనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. ప్రభుత్వమే రైతుల ప్రీమియాన్ని చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ వానాకాలం పంటల సీజన్ నుంచే అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం మంత్రి తుమ్మల ఒక ప్రకటన జారీచేశారు. తడిచిన ధాన్యాన్ని సైతం తమ ప్రభుత్వం సేకరిస్తుందని వివరించారు. గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకొక ఐఏఎస్‌ను నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని వివరించారు. తరుగు, తాలు పేరుతో కోతలు లేవని స్పష్టం చేశారు. గతంలో ప్రతి క్వింటాకు 7 నుంచి 10 కేజీల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ జరిగిందనీ, ఈ దఫా మిల్లర్ల దోపిడీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కోతలకు మిల్లర్లు స్వస్తి చెప్పారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ప్రతి కింటాపై రైతుకు రూ.150 నుంచి రూ.200 రూపాయల వరకు అదనపు లబ్ధి చేకూర్చామని తెలిపారు. పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు చేరుతుందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో 45 రోజులు పట్టేదని, దాంతో రైతు ఎంతో వడ్డీ నష్ట పోయేవాడని గుర్తు చేశారు. భవిష్యత్‌లో దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోనస్ తెలంగాణలో సన్న వడ్ల సాగును పెంచేందుకు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించిందని మంత్రి తుమ్మల పునరుద్ఘాటించారు. రైతులు నాట్లేసుకునే సమయం దగ్గర పడిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ఈ స్కీంను ప్రవేశపెట్టామని తెలిపారు. భవిష్యత్‌లో దొడ్డు వడ్లకు కూడా ఈ స్కీం వర్తింపచేస్తామని హామీనిచ్చారు. రాష్ట్రంలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయిందనీ, పేదలు కూడా పెద్దోళ్లు తినే సన్న బియ్యం తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి అన్ని హామీలను పూర్తి చేసి తీరుతామనీ, లేకుంటే ఓట్లే అడగబోమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. -
పంటల బీమాకు కేంద్రం ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోనూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలులోకి రానుంది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. దీనికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే సీజన్ నుంచి అమలు చేయాలంటే తక్షణమే పథకాన్ని అమలు చేసే కంపెనీలను టెండర్ల ద్వారా ఆహ్వానించాలి. దీనికి నోటిఫికేషన్ జారీ చేయాలి. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇప్పుడు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. పంటల బీమా పథకం ప్రారంభం అనేది ఎంతోమంది రైతులను ప్రభావితం చేయనున్నందున ఈసీ అనుమతి లేనిదే ముందుకు సాగలేమని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈసీ అనుమతి ఇవ్వకుంటే ఈ పథకం వచ్చే సీజన్ నుంచి అమలు అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. క్లస్టర్ల వారీగా అమలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు అనుకూలంగా లేదన్న భావనతో ఈ పథకం నుంచి 2020లో బయటకు వచ్చింది. అయితే ఏదో ఒక పంటల బీమా పథకం ఉండటమే మేలన్న భావన కొందరు రైతుల్లో ఉంది. దీంతో చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాత పథకాన్నే అమలు చేయనుంది. దీంతో ప్రకృతి వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకాన్ని క్లస్టర్ల వారీగా అమలు చేయనున్నారు. గతంలో అప్పటి ప్రభుత్వం ఆరు క్లస్టర్లు ఏర్పాటు చేసింది. ఆ ప్రకారమే ఈసారి కూడా ముందుకు సాగే అవకాశాలున్నాయి. ప్రీమియం ఇలా... వానాకాలం సీజన్లో సాగుచేసే ఆహారధాన్యాల పంటలకు 2 శాతం ప్రీమియం రైతులు చెల్లించాలి. – పత్తి, మిర్చి సహా ఇతర వాణిజ్య, వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం 5 శాతం రైతులు ప్రీమియం చెల్లించాలి. అయితే జిల్లాలను బట్టి, అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి ప్రీమియం రేటు మారుతుండేది. అయితే ఈసారి రైతు వాటా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించారు. కాబట్టి రైతులంతా ఈ పథకంలోకి వస్తారు. మరోవైపు ఈ పథకాన్ని అమలు చేసేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. దీనికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీమా అమలుకు సూచనలు పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని పలువురు అధికారులు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. – బీమా కంపెనీలు ప్రీమియం ధరలను ఏటేటా భారీగా పెంచుతుంటాయి. ఈ పద్ధతి మార్చాలి. – కంపెనీలు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం లేదు. జిల్లా స్థాయిలో అధికారులు ఉండటం లేదు. దీంతో రైతులకు బీమాపై అవగాహన కల్పించే పరిస్థితి లేకుండా పోయింది. – కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీమా ప్రీమియం చెల్లించిన మూడువారాల్లోగా రైతులకు పరిహారం ఖరారు చేయాలి. గతంలో నెలల తరబడి ఆలస్యం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. – రైతుల ఫిర్యాదులు వినడానికి, పరిష్కరించడానికి కచ్చితమైన యంత్రాంగం జిల్లా, రాష్ట్రస్థాయిలో నెలకొల్పాలి. – చిన్నచిన్న అంశాలను ఆధారం చేసుకొని పంటల బీమాను రైతులకు అందకుండా చేస్తున్నారు. ఇది పథకం అమలును నీరుగారుస్తుంది. – వివిధ దశల్లో విధిస్తున్న షరతులు, నిబంధనల కారణంగా బీమా నష్టపరిహారం పొందడం గగనంగా మారింది. వీటిని మార్చాలి. -
వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా
ఖలీల్‌వాడి/నిజామాబాద్ /కామారెడ్డి నెట్వర్క్: వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా అమలు చేస్తామని, ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురు వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వడగళ్ల వానలతో పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకుంటామన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 40 వేల ఎకరాల వరకు నష్టం జరిగిందన్నారు. అధికారులు సర్వే పూర్తి చేసిన తర్వాత ఎకరానికి రూ.10 వేలు నష్ట పరిహారం అందిస్తామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు ఆధికారంలో ఉన్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రుణమాఫీ, మహిళలకు జీరో వడ్డీ, దళితులకు మూడెకరాల పంపిణీ వంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ సర్కార్ రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. వీటికి రూ.60 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు. దీనికోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మహా అయితే ఒక సీటు రావొచ్చునని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అ«ధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. రైతులు అధైర్యపడవద్దు : వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూర్, పెద్దవాల్గోట్ గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం లింగుపల్లి, భిక్కనూరు మండలం అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, జంగంపల్లి, బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామాల్లో పర్యటించారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
రైతులకు ఉచితంగా పంటల బీమా!
సాక్షి, హైదరాబాద్: రైతులు పైసా ఖర్చు చేయకుండా ప్రభుత్వమే ఉచితంగా పంటల బీమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రాష్ట్రంలో రైతులు చెల్లించాల్సిన వాటా ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్ నుంచి ఫసల్ బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం చాలా ఎక్కువగా ఉన్నందున గత ప్రభుత్వం ఈ బీమా పథకం నుంచి బయటకు వచ్చింది. దీంతో కొంతకాలంగా రైతులకు పంటల బీమా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కొత్త సర్కారు రైతుల ప్రీమియం వాటాను తామే చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిసింది. క్లస్టర్ల వారీగా అమలు వ్యవసాయ శాఖ వర్గాల అంచనా ప్రకారం..రాష్ట్ర రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సీజన్లకు కలిపి దాదాపు రూ.2 వేల కోట్లు బీమా కంపెనీలకు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అందులో రైతుల వాటా దాదాపు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. కాగా ఫసల్ బీమా పథకంలో చేరే విషయమై కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయనుంది. పంటల బీమా పథకాన్ని క్లస్టర్ల వారీగా అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని జిల్లాలను ఆరు క్లస్టర్లుగా విభజిస్తారు. కాగా బీమా పథకంలో ఉన్న వివిధ రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తారు. అకాల వర్షాలతో నష్టపోతే ఒక రకమైన ప్రీమియం, కోత కోసి కల్లాల్లో ఉన్నప్పుడు వర్షం పడి నష్టం జరిగితే మరో రకమైన ప్రీమియం, దిగుబడి తక్కువ వస్తే అందుకు సంబంధించి మరో ప్రీమియం ఇలా వివిధ రకాలుగా పథకంలో వెసులుబాట్లు ఉన్నాయి. దీంతో ఏ క్లస్టర్లలో ఎటువంటి వాతావరణం ఉంటుందన్న దానికి అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తారు. బీమా కంపెనీలు కోట్ చేసే ధరలను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందే పథకానికి సంబంధించి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. -
పాత పద్ధతిలోనే పంటల బీమా
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ తరహాలో రాష్ట్రంలో సొంతంగా పంటల బీమా తీసుకురావాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గింది. కొన్నేళ్ల కింద రాష్ట్రంలో అమలు చేసిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)నే తిరిగి అమలు చేసేందుకు సిద్ధమైంది. దీనితో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందనుంది. నిజానికి 2020 వరకు రాష్ట్రంలో పీఎంఎఫ్‌బీవై అమలైంది. కానీ అప్పటి సర్కారు రైతులకు అనుకూలంగా లేదన్న భావనతో ఈ పథకం నుంచి బయటికి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా అమల్లో లేదు. పంట దెబ్బతిన్నప్పుడు రైతులు నష్టపోతున్నారు. ఏదో ఒక పంటల బీమా పథకం ఉంటే మేలన్న భావన చాలా మంది రైతుల్లో నెలకొని ఉంది. పంటల బీమాతో ప్రయోజనం రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. గతంలో పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది బీమా చేయించేవారు. నేరుగా పంటల బీమా తీసుకోవడానికి రైతులు ముందుకు రావడంలేదని భావించిన సర్కారు.. బ్యాంకులు, సహకార సంఘాల్లో పంట రుణాలు తీసుకునే రైతులకు తప్పనిసరిగా పంటల బీమా చేయించే నిబంధన పెట్టింది. పంట రుణం ఇచ్చేప్పుడే బీమా ప్రీమియాన్ని మినహాయించుకొని మిగతా డబ్బులు రైతులకు ఇచ్చేవారు. ప్రకృతి విపత్తులు సంభవిస్తే రైతులకు ఎంతో కొంత నష్టపరిహారం వచ్చేది. 2012–13లో 10 లక్షల మంది పంటల బీమా చేయగా.. పంట నష్టపోయిన 1.80 లక్షల మందికి రూ.78.86 కోట్ల పరిహారం అందింది. 2013–14లో 8.52 లక్షల మంది బీమా చేయించగా.. 1.18 లక్షల మందికి రూ.56.39 కోట్ల పరిహారం వచ్చింది. 2015–16లో 7.73 లక్షల మంది బీమా చేస్తే.. ఆ ఏడాది పంట నష్టం ఎక్కువ జరగటంతో ఏకంగా రూ.441.79 కోట్ల నష్ట పరిహారం రైతులకు అందింది. ► 2016 వానాకాలం సీజన్ నుంచి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం అ మల్లోకి వచ్చింది. దీనికి చెల్లించే ప్రీమియంలో రైతులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంతమేర సొ మ్మును తమ వాటాగా భరిస్తాయి. 2016–17లో 8.87 లక్షల మంది మంది రైతులు ఫసల్ బీమా చేయించగా.. 1.34 లక్షల మందికి రూ.111.33 కోట్ల పరిహారం వచ్చింది. ∙2018–19, 2019–20 సంవత్సరాల్లో రూ.960 కోట్ల పరిహారం రాష్ట్రానికి మంజూరైనా.. అందులో కొంతమేర మాత్రమే రైతులకు దక్కింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రీమియం చెల్లించకపోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. బీమా ప్రీమియంపై కట్టడి తప్పనిసరి పంటల బీమా వల్ల లాభం ఉన్నా.. చాలా మంది రైతులు బీమా ప్రీమియం విషయంలో అసంతృప్తితో ఉన్నారు. బీమా కంపెనీలు భారీగా లాభాలు గడిస్తున్నా.. ప్రీమియం ధరలను పెంచుకుంటూ పోయాయని వాపోతున్నారు. తెలంగాణలో అప్పట్లో రబీలో చెల్లించే ప్రీమియం మొత్తం దాదాపు బీమా కంపెనీలను బాగు చేయడానికే అన్నట్టుగా అమలైందని.. ప్రైవేటు బీమా సంస్థలకు పంటల బీమా పథకంలో అవకాశం కల్పించడంతో పరిస్థితి మరింత దిగజారిందని విమర్శలు ఉన్నాయి. పీఎంఎఫ్‌బీవై కింద వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములకు రెండు శాతం చొప్పున, పసుపు రైతులు ఐదు శాతం చొప్పున ప్రీమియం చెల్లించారు. ఇక పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి, మిరప, ఆయిల్‌పాం, బత్తాయి పంటలకు పంట రుణంలో 5 శాతాన్ని రైతులు ప్రీమియంగా చెల్లించారు. పైగా జిల్లా జిల్లాకు ప్రీమియం ధరలు మారుతుండేవి. ఉదాహరణకు 2018లో పెసరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో హెక్టార్‌కు రూ.24,165 చొప్పున, మిరపకు ఏకంగా రూ.38,715 చొప్పున ప్రీమియంగా ఖరారు చేయడం గమనార్హం. అంత దారుణంగా ప్రీమియం రేట్లు ఉండటంతో రైతులు కూడా పంటల బీమాపై తీవ్ర అసంతృప్తి చెందారు. తమకు పంటల బీమా వద్దని మొత్తుకున్నారు. ఈ క్రమంలోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమాను నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ అమల్లోకి తెస్తున్న నేపథ్యంలో.. బీమా ప్రీమియంపై కట్టడి అవసరమని, ఆ దిశగా వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. -
పంటల భీమాపై డ్రామోజీ విషం