బీమా చేయించుకునేందుకు ముందుకు రాని రైతులు
రోజూ 10 మంది రైతులతో బీమా చేయించాలని అధికారుల ఆదేశాలు
రైతులు చెల్లించకపోతే, వారి తరపున మీరే కట్టాలని హుకుం
చేతిచమురు వదులుతోందని వీఏఏల గగ్గోలు
సాక్షి, అమరావతి: పంటల బీమా అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. ప్రీమియం భారం భరించలేక పంటల బీమాలో తాము చేరలేమని రైతులు తెగేసి చెబుతుంటే.. ఎలాగైనా రైతులను చేర్పించాలంటూ రైతు సేవా కేంద్రాల సిబ్బంది (వీఏఏ)కి లక్ష్యాలను నిర్దేశించి మరి అధికారులు ఒత్తిడికి గురి చేస్తున్నారు.
రైతులు కట్టలేమంటున్నారని చెబితే.. వారి తరఫున ఆ ప్రీమియం సొమ్ములు మీరే కట్టండంటూ అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు తట్టుకోలేక 15 రోజుల క్రితమే ఆళ్లగడ్డ మండలం జి.జంబులదిన్నె ఆర్‌ఎస్‌కే వ్యవసాయ అసిస్టెంట్ హరినాథ్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేస్తూ తమకూ ఇదే పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.
బీమా చేయాల్సింది 51.90 లక్షల ఎకరాలు
రబీ సాగు లక్ష్యం 57.50 లక్షల ఎకరాలు. నోటిఫై చేసిన పంటల సాగు విస్తీర్ణం 44.72 లక్షల ఎకరాలు, వీటికి అదనంగా బీమా పరిధిలోకి తీసుకొచ్చిన మామిడి విస్తీర్ణం మరో 7.18 లక్షల ఎకరాలు. అంటే బీమా చేయించాల్సిన విస్తీర్ణం 51.90 లక్షల ఎకరాలు.
ఇప్పటివరకు సాగైన విస్తీర్ణం 18.50 లక్షల ఎకరాలు. దిగుబడి, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల కింద ఈ నెల 17వ తేదీ వరకు బీమా కవరేజీ పొందిన విస్తీర్ణం కేవలం 7,40,875 ఎకరాలు మాత్రమే. రైతులు పంటల బీమాకు ఏ స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారో ఈ గణాంకాలే చెబుతున్నాయి.
వీఏఏలపై రైతుల ప్రీమియం భారం
కేవలం వరి పంటకు మాత్రమే బీమా చేయించుకునేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. రబీలో 20.50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. నోటిఫై చేసిన జిల్లాల పరిధిలో 15.77 లక్షల ఎకరాలు మాత్రమే బీమా కవరేజీ కల్పించాల్సి ఉండగా.. ఇప్పటివరకు కనీసం 10 శాతం విస్తీర్ణంలో కూడా బీమా కల్పించలేని దుస్థితి ఏర్పడింది. స్వచ్ఛందంగా ఈ పథకంలో చేరేందుకు రైతులెవరూ ముందుకు రాకపోవడంతో ఆ భారాన్ని వీఏఏలపై వేస్తున్నారు.
ఇప్పటికే ఇంటర్నెట్‌తో పాటు పాడిపంటలు మ్యాగజైన్ కోసం చందాలు చేర్పించేందుకు వీఏఏలకు చేతిచమురు వదిలిపోతోంది. ఇప్పుడు రైతుల తరఫున ప్రీమియం చెల్లించాలని ఒత్తిడి చేస్తే తాము బతికేదెలా అని వీఏఏలు ప్రశ్నిస్తున్నారు. ప్రీమియం భారం భరించలేక రైతులెవరూ పంటల బీమాపై ఆసక్తి చూపకపోవడంతో.. రోజుకు కనీసం 10 మందికి తక్కువ కాకుండా రైతులతో బీమా చేయించాల్సిందేనంటూ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు.
చేసేది లేక ఉద్యోగాలను కాపాడుకునేందుకు రైతుల తరఫున ప్రీమియం కడుతున్నామని వీఏఏలు చెబుతున్నారు. ఈ నెలలో వచ్చిన జీతంలో మూడో వంతు మ్యాగజైన్స్‌కు, మిగిలిన మొత్తం ప్రీమియానికి చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రూ.2, రూ.3 వడ్డీలకు తెచ్చి మరీ కట్టాల్సి వస్తోందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment