ప్రీమియం భారం బీమాకు దూరం | TDP coalition govt has taken away free crop insurance for farmers | Sakshi
Sakshi News home page

ప్రీమియం భారం బీమాకు దూరం

Published Mon, Dec 30 2024 5:00 AM | Last Updated on Mon, Dec 30 2024 5:00 AM

TDP coalition govt has taken away free crop insurance for farmers

రైతులకు ఉచిత పంటల బీమాను దూరం చేసిన కూటమి సర్కారు

రబీలో 8.44 లక్షల ఎకరాలకే బీమా.. గతేడాది 37.80 లక్షల ఎకరాలకు రక్షణ

కవరేజ్‌ పొందిన రైతులు కేవలం 5.94 లక్షలు.. నిరుడు 43.82 లక్షల మందికి లబ్ధి

ప్రీమియం చెల్లించేందుకు రేపే తుది గడువు 

ప్రీమియం భారాన్ని మోయలేక, కార్యాలయాల చుట్టూ తిరగలేక అన్నదాతల అగచాట్లు  

సాక్షి, అమరావతి: గతేడాది ఇదే రబీ సీజన్‌లో పంటల బీమాలో నమోదైన రైతుల సంఖ్య  ఏకంగా 43.82 లక్షలు.. మరిప్పుడు.. కేవలం 5.94 లక్షలు.. ఏడాదిలో ఎంత తేడా! లక్షల ఎకరాలు.. లక్షలాది మంది రైతన్నలు బీమా రక్షణకు దూరమై గాలిలో దీపంలా సాగు చేయాల్సిన దుస్థితి నెలకొంది.. గత ఐదేళ్లూ అన్నదాతలపై పైసా భారం పడకుండా డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఎక్కడా తిరగాల్సిన అవసరం లేకుండా ఈ–క్రాప్‌ ప్రామాణికంగా గ్రామంలోనే పని పూర్తయ్యేది. 

నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు నూరు శాతం యూనివర్శల్‌ కవరేజ్‌ కల్పిస్తూ పంటల బీమా కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకంతో ఉచితంగా లబ్ధి చేకూరేది. రైతన్నలు నిశ్చింతగా పొలం పనుల్లో నిమగ్నమైతే కావాల్సిన కాగితాలు.. మిగతా ప్రక్రియ విషయాన్ని గ్రామ సచివాలయాలు, వలంటీర్లు దగ్గరుండి చూసుకునేవారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతన్నలకు పంటలు నష్టపోతే రికార్డు స్థాయిలో రూ.7,802.05 కోట్లు పరిహారంగా అందచేసి సాగుకు అండగా నిలిచింది. ఇప్పుడు వరికి పంటల బీమా వర్తించాలంటే హెక్టార్‌కు రూ.1,575 చొప్పున రైతన్నలు తమ చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాలి. 

పనులు మానుకుని బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాలి. రోజుల తరబడి పడిగాపులు కాయాలి. అసలు బీమా పథకానికి ఎప్పటిదాకా గడువు ఉందో చెప్పేవారు లేక.. ఈ అవస్థలు భరించలేక.. డబ్బులు కట్టలేక ఎంతో మంది ఈ పథకానికి దూరమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు నిర్వాకాలతో అన్నదాతలు అన్యాయమైపోయారు! ఐదేళ్ల పాటు పైసా భారం పడకుండా అమలైన ఉచిత పంటల బీమా పథకం ద్వారా పూర్తి స్థాయిలో రక్షణ పొందిన రైతన్నలంతా నేడు ప్రీమియం భారాన్ని భరించలేక, పంటల బీమా చేయించుకోలేక గగ్గోలు పెడుతున్నారు.

బీమా కవరేజ్‌ విస్తీర్ణం 8.44 లక్షల ఎకరాలే
రబీ–2024–25 సీజన్‌లో దిగుబడి ఆధారిత పంటల బీమా పథకం కింద 13 పంటలను, వాతావరణ ఆధారిత పంటల కింద 3 పంటలను నోటిఫై చేశారు. జీడి మామిడి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు నవంబర్‌ 15వ తేదీతోనే ముగియగా వరి మినహా మిగతా వాటికి ఈ నెల 15తో గడువు ముగిసింది. వరితో పాటు ఇటీవలే నోటిఫై చేసిన మామిడి పంటకు ఈ నెల 31వతేదీతో గడువు ముగియనుంది. 

దిగుబడి ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన సాగు విస్తీర్ణం 45.55 లక్షల ఎకరాలు కాగా వాతావరణ ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన జీడిమామిడి, మామిడి, టమాటా పంటల సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాలు.. అంటే రెండూ కలిపి 60.55 లక్షల ఎకరాల పైమాటే. కానీ ఇప్పటి వరకు పంటల బీమా కవరేజ్‌ పొందిన విస్తీర్ణం కేవలం 8.44 లక్షల ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. 

వీటిలో వాతావరణ పంటల బీమా కింద 24,550 ఎకరాలు, దిగుబడి ఆదారిత పంటల బీమా కింద  8.20 లక్షల ఎకరాలలో సాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్‌ పొందగలిగారు. రైతుల పరంగా చూస్తే ఈ రబీలో కేవలం 5,94,336 మంది మాత్రమే బీమా చేయించుకోగలిగారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా తీరు ఎలా ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. 

పంటల బీమా వర్తించాలంటే గరిష్టంగా హెక్టార్‌కు మామిడికి రూ.5,625, జీడి మామిడికి రూ.3,837.50, టమాటాకు రూ.3,775,  వరికి రూ.1,575 చొప్పున బీమా ప్రీమియాన్ని చెల్లించాలి. ఇతర పంటలకూ అదే స్థాయిలో ప్రీమియం భారం పడుతోంది. ఇంత భారం భరించలేక పంటల బీమాకు దూరం అవుతున్నట్లు అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు.

ఐదేళ్లు నూరు శాతం కవరేజ్‌
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ ఈ – క్రాప్‌ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు ఉచితంగా నూరు శాతం పంటల బీమా కవరేజ్‌ కల్పించింది. రబీ 2023–24 సీజన్‌లో 37.80 లక్షల ఎకరాల్లో సాగైన నోటిఫైడ్‌ పంటలకు బీమా కవరేజ్‌ కల్పించడంతో 43.82 లక్షల మంది బీమా రక్షణ పొందగలిగారు. 

టీడీపీ కూటమి సర్కారు పగ్గాలు చేపట్టిన మరుక్షణమే రైతుల మదిలో వైఎస్‌ జగన్‌ ముద్రను చెరిపివేయాలనే అక్కసుతో ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేసింది. పంటల బీమా అమలులో రైతులను భాగస్వాములను చేస్తామని చెబుతూ పెనుభారం మోపింది. స్వచ్ఛంద నమోదు పద్థతిలో పంటల బీమాకు శ్రీకారం చుట్టింది. చివరకు అవగాహన కల్పించలేక చేతులెత్తేసింది.

తుపాన్, అకాల వర్షాలతో ఇప్పటికే తీవ్ర నష్టం..
పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును జనవరి నెలాఖరు వరకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రబీ సీజన్‌ ప్రారంభంలో విరుచుకుపడిన ఫెంగల్‌ తుపాన్‌తో పాటు ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రబీ పంటలకు బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. దురదృష్టవశాత్తూ సీజన్‌ ముగిసేలోగా మరేదైనా విపత్తు సంభవిస్తే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

పారదర్శకంగా పథకం..
1965లో కేంద్రం రూపొందించిన క్రాప్‌ ఇన్‌స్రూెన్స్‌ బిల్లు ఆధారంగా తెచ్చిన మోడల్‌ ఇన్‌స్రూెన్స్‌ పథకం వివిధ రూపాలు మార్చుకుని 2016 నుంచి ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)గా అమలవుతోంది. దీని ప్రకారం నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున ప్రీమియాన్ని రైతులు చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించేవి. 

అయితే ప్రీమియం భారం అధికంగా ఉండడం, ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లేక రైతులు సొంతంగా బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. రుణాలు తీసుకుంటే మాత్రం బ్యాంకులు ప్రీమియం రూపంలో నిర్దేశిత మొత్తాన్ని మినహాయించుకునేవి. లక్షలాది మంది రైతన్నలు తాము పండించిన పంటలకు బీమా చేయించుకోలేకపోవడంతో విపత్తుల బారిన పడితే తీవ్ర నష్టాల పాలయ్యేవారు. 

గతంలో బీమా చేయించుకున్న వారు సైతం ఎంతొస్తుందో? ఎప్పుడొస్తుందో తెలియక ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉండేవి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ దుస్థితిని తొలగిస్తూ చర్యలు చేపట్టింది. ఈ క్రాప్‌తో పాటు ఈ కేవైసీ నమోదు పూర్తికాగానే ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలను (స్టార్‌ గుర్తు) ప్రత్యేకంగా తెలియచేస్తూ రైతులకు భౌతిక రసీదులు అందచేసింది. 

డాక్టర్‌ వైస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద నోటిఫై చేసిన  పంటకు మీరు చెల్లించాల్సిన ప్రీమియాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి పంటకు బీమా చేసినట్లు స్పష్టంగా తెలియజేసింది. ఈ జాబితాలను ఏటా సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించడమే కాకుండా అభ్యంతరాలను పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకుంది. కూటమి సర్కారు వచ్చాక ఈ క్రాప్‌ అస్తవ్యస్థంగా మారింది. ఎవరు ఏ పంట సాగు చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక పంటల బీమాలో నమోదు చేసేందుకు అవసరమైన సాగు పత్రాల కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు.

బాబు హయాంలో అరకొరగా..
2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏటా సగటున 46 లక్షల ఎకరాల చొప్పున 2.32 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్‌ కల్పించగా, ఏటా సగటున 14.88 లక్షల మంది చొప్పున 74.4 లక్షల మంది రైతులు ప్రీమియం కట్టి బీమా సదుపాయం పొందారు. నాడు హుద్‌హుద్, తిత్లీ లాంటి భారీ తుపాన్లు, 324 మండలాల్లో కరువు ప్రభావం వల్ల రూ.వేల కోట్ల విలువైన పంటలను కోల్పోయినా రైతులకు దక్కిన పరిహారం అరకొరే. 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్లు మాత్రమే బీమా పరిహారం దక్కింది.

జగన్‌ హయాంలో రికార్డు..
2019–23 మధ్య వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉండగా ఏటా 1.08 కోట్ల ఎకరాల చొప్పున 5.42 కోట్ల ఎకరాలకు ఉచిత పంటల బీమా సదుపాయాన్ని కల్పించింది. ఏటా సగటున 40.50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పిస్తూ చర్యలు తీసుకుంది. రైతుల తరపున వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.3,022.26 కోట్లను బీమా కంపెనీలకు ప్రీమియం రూపంలో చెల్లించింది. 

ఇక ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.08 కోట్ల మేర బీమా పరిహారాన్ని అందచేసి ఆదుకుంది. అంతేకాకుండా 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో 6.19 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి అండగా నిలిచింది. టీడీపీ హయాంతో పోల్చితే అదనంగా 23.70 లక్షల మందికి రూ.4,390.88 కోట్ల మేర అదనంగా బీమా పరిహారం అందించి వైఎస్‌ జగన్‌ అన్నదాతలకు అండగా నిలిచారు.

ప్రభుత్వమే చెల్లించాలి..
నాకున్న 75 సెంట్ల పల్లపు భూమిలో వరి పండిస్తుంటా. 2021 సెప్టెంబరులో గులాబ్‌ తుపాను కారణంగా పంట నష్టపోతే నా బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం రూ.4,650 జమ చేసి ఆదుకుంది. వైఎస్సార్‌సీపీ హయాంలో ఈ – క్రాప్‌లో నమోదైన ప్రతీ పంటకు బీమా వర్తించేది. ఇప్పుడు పంటల బీమా ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని చెబుతున్నారు. ప్రీమియం భారాన్ని భరించలేక.. బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగలేక, అవగాహన లేక చాలా మంది నష్టపోతున్నాం. రైతుల తరపున ప్రీమియాన్ని గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి.
– తమ్మిన సీతారమణ, రైతు, టి.నగరపాలెం, భీమిలి మండలం, విశాఖ జిల్లా

ప్రీమియం భారాన్ని మోయలేం..
ప్రీమియం భారాన్ని భరించలేకనే రైతులు పంటల బీమాకు దూరమవుతున్నారు. వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు కనీసం మద్దతు ధర చెల్లించి ఆదుకోవడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అన్నదాతలు ఈ తరుణంలో ప్రీమియం చెల్లించి బీమా చేయించుకునే పరిస్థితిలో లేరు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. 
– కోసూరి శివనాగేంద్ర, రైతు, పమిడిముక్కల మండలం, గడ్డిపాడు, కృష్ణా జిల్లా

ఉచిత బీమా కొనసాగించాలి..
గత ఐదేళ్లూ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకం ఎంతగానో ఆదుకుంది. స్వచ్ఛంద నమోదు పద్ధతి పేరుతో కూటమి ప్రభుత్వం తెచ్చిన పంటల బీమా వల్ల కౌలు రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. గతంలో మాదిరిగా రైతుల తరపున ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి.
– ఎం.హరిబాబు, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి

ఏటా రూ.900 కోట్లకుపైగా భారం..
ప్రీమియం భారాన్ని భరించ లేకనే రాష్ట్రంలో రైతన్నలు పంటల బీమాకు దూరమయ్యారు. గత ఐదేళ్లు పైసా భారం పడకుండా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు పూర్తి స్థాయిలో బీమా కవరేజీ రైతులకు వైఎస్‌ జగన్‌ అండగా నిలిచారు. కూటమి సర్కారు కక్షకట్టినట్లు వ్యవహరిస్తూ ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఏటా రూ.900 కోట్లకుపైగా అన్నదాతలపై భారాన్ని మోపడం 
దుర్మార్గం.
–వడ్డి రఘురాం, వర్కింగ్‌ ప్రెసిడెంట్, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం

2021లో పైసా కట్టకుండా రూ.55 వేల పరిహారం..
ఐదెకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఖరీఫ్‌ 2021లో గులాబ్‌ తుపాను వల్ల మూడు ఎకరాల్లో పంట దెబ్బ తినడంతో రూ.55 వేల బీమా పరిహారం నా ఖాతాలో జమైంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ ప్రీమియం కింద పైసా చెల్లించలేదు. ప్రస్తుతం బీమా ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని ఈ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది రైతులకు ఎంతో భారంగా ఉంది. మా తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఆదుకోవాలి.     
– ఎం.శ్రీనివాసరావు, రైతు, కేసీహెచ్‌ పల్లి, విజయనగరం జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement