ఉచితానికి ఉద్వాసన.. పాత పద్ధతి వైపు సర్కారు చూపు
సీఎం చంద్రబాబు నిర్ణయంతో రైతన్న గుండెల్లో గుబులు
ఐదేళ్లుగా అన్నదాతలపై పైసా భారం పడకుండా అమలు
యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ బీమా రక్షణ
నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు బీమా
రైతుల తరఫున ప్రీమియం మొత్తం చెల్లించిన వైఎస్ జగన్ ప్రభుత్వం
ఉచిత బీమా ద్వారా 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ
ఒక సీజన్ పరిహారం మరుసటేడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే జమ
బాబు హయాంలో రూ.3,411.20 కోట్లు.. జగన్ పాలనలో రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం చెల్లింపు
రూ.1,278.80 కోట్ల ప్రీమియం కట్టకుండా కూటమి సర్కారు ఎగనామం.. రైతులపై ఏటా సగటున రూ.800 కోట్లకు పైగా ప్రీమియం భారం
రూ.4 లక్షల బీమా పరిహారం అందుకున్నా..
పసుపు, కంద, అరటి, తమలపాకు సాగు చేస్తుంటా. వైఎస్సార్ ఉచిత పంటల బీమా రైతులకు ఎంతో బాసటగా నిలిచింది. గత ఐదేళ్లలో పైసా ప్రీమియం చెల్లించకుండా రూ.4 లక్షలకు పైగా బీమా పరిహారం పొందా. రూ.2 లక్షల వరకు పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) అందుకున్నా. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పరిహారం జమైంది. రైతాంగానికి ఎంతో ఆసరాగా ఉన్న పథకాన్ని రద్దు చేసి 2019కి ముందు ఉన్న విధానం అమలు చేయాలని నిర్ణయించడం సరికాదు. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి.
– ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, కిష్కిందపాలెం, బాపట్ల జిల్లా
సాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ తమపై పైసా భారం పడకుండా కష్టకాలంలో ఆదుకున్న డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు పాతరేసే దిశగా టీడీపీ సర్కారు సన్నద్ధం కావడం అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ‘సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తాం.. ఏ ఒక్కటీ ఆపే ప్రసక్తే లేదు. ఇంకా మెరుగైన రీతిలో అమలు చేస్తాం’ అని ఎన్నికల ప్రచార సభల్లో హామీలిచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర కూటమి నేతలు వాటిని గాలికి వదిలేశారు. రైతులకు మేలు చేసే వ్యవసాయ సలహా మండళ్లను రద్దు చేసిన కూటమి సర్కారు కన్ను తాజాగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంపై పడింది.
ఈ – క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్ బీమా కవరేజ్ కల్పిస్తూ ఈ పథకం దేశానికే తలమానికంగా నిలిచింది. అయితే 2019కి ముందు అమలులో ఉన్న పాత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్టు తొలి సమీక్షలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన రైతన్నల గుండెల్లో గుబులు రేపింది.
గత ఐదేళ్లుగా తాము కట్టాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి పైసా భారం లేకుండా ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే నేరుగా తమ ఖాతాల్లో జమ చేసే పరిస్థితి ఇక ఉండదన్న ఆందోళన వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. టీడీపీ సర్కారు తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుని ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమ బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నాయి.
ఏళ్ల తరబడి ఎదురు చూపులు..
1965లో కేంద్రం తెచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ బిల్లు ఆధారంగా ప్రవేశపెట్టిన మోడల్ ఇన్సూరెన్స్ పథకం వివిధ రూపాలు మార్చుకుని ప్రధాని ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)గా 2016 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతోంది. దీని ప్రకారం నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు ప్రీమియం చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాయి.
అయితే ప్రీమియం భారం అధికంగా ఉండడంతో పాటు అవగాహన లేక పలువురు రైతులు సొంతంగా బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. రుణాలు తీసుకునే రైతులకు మాత్రం బ్యాంకులు ప్రీమియం రూపంలో నిర్దేశించిన మొత్తాన్ని మినహాయించుకొని మిగతాది అందచేసేవి. అయితే బీమా చేయించుకున్న వారు సైతం ఎంతొస్తుంది? ఎప్పుడొస్తుందో అంతుబట్టక ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
2014–19 పరిహారం రూ.3,411.20 కోట్లే
చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడూ కేంద్ర పథకాలపై ఆధార పడడం మినహా అన్నదాతల సంక్షేమం కోసం తపించిన దాఖలాలు లేవు. 2014–19 మధ్య తొలి రెండేళ్లు వ్యవసాయ ఇన్సూరెన్‌స్కీమ్ (ఏఐఎస్), ఆ తర్వాత పీఎంఎఫ్‌బీవై అమలు చేశారు. ప్రీమియం రూపంలో 2014–19 మధ్యలో రైతులు తమ వాటాగా రూ.1249.90 కోట్లు చెల్లిస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.1281 కోట్లు చెల్లించింది. హుద్‌హుద్ లాంటి పెను తుపాన్, కరువు కాటకాటకాలతో రూ.వేల కోట్ల పంటలను కోల్పోయిన రైతులకు 2014–19 మధ్య దక్కిన పరిహారం కేవలం రూ.3,411.20 కోట్లు మాత్రమే.
పైసా భారం పడకుండా..
పాదయాత్ర హామీ మేరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019 జూలై 8న వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు శ్రీకారం చుట్టారు. తొలి ఏడాది పీఎం ఎఫ్‌బీవైతో అనుసంధానించి అమలు చేశారు. 2019 ఖరీఫ్ సీజన్‌లో రూపాయి ప్రీమియంతో పథకానికి శ్రీకారం చుట్టగా అనంతరం ఆ భారం కూడా రైతులపై పడకూడదన్న ఆలోచనతో ఖరీఫ్–2020 నుంచి నోటిఫైడ్ పంటలకు ఉచితంగా బీమా కవరేజ్ కల్పించారు. క్లెయిమ్‌లు, సెటిల్‌మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా ప్రభుత్వం తన భుజాన వేసుకుంది.
తొలి ఏడాది రైతుల వాటా (రూ.468 కోట్ల)తో కలిపి ప్రీమియం రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.971 కోట్లు బీమా కంపెనీలకు చెల్లించింది. యూనివర్సల్ కవరేజ్‌కు కేంద్రం ముందుకు రాకపోవడంతో 2020–21, 2021–22 సీజన్లలో పీఎం ఎఫ్‌బీవైతో సంబంధం లేకుండా మొత్తం బీమా పరిహారం ప్రభుత్వమే చెల్లించింది. 2022–23 నుంచి ఫసల్ బీమాతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం గత ప్రభుత్వం సొంతంగానే బీమా పరిహారం చెల్లించింది.
ఈ క్రాప్ ప్రామాణికంగా..
ఈ క్రాప్‌తో పాటు ఈ కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తి కాగానే గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలకు (స్టార్) గుర్తుతో ప్రత్యేకంగా తెలియచేస్తూ రైతులకు భౌతిక రసీదు అందచేసింది. ‘డాక్టర్ వైస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద నోటిఫై చేసిన పంటకు ప్రీమియంను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి పంట బీమా చేసింది‘ అని అందులో స్పష్టంగా తెలియచేసింది.
ఈ జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించి అభ్యంతరాలను పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా పరిహారం అందచేసింది. ప్రీమియం రూపంలో రైతుల వాటాతో కలిపి 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,022.26 కోట్లు కంపెనీలకు చెల్లించింది. 2019–24 మధ్య 1.91 కోట్ల హెక్టార్లకు బీమా కవరేజీ కల్పించగా 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ లభించింది.
రికార్డు స్థాయిలో పరిహారం..
2014–19 మధ్య 30.85 లక్షల మందికి రూ.3411.20 కోట్ల పరిహారం చెల్లిస్తే 2019–24 మధ్య 54.55 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం అందింది. టీడీపీ హయాంలో 6.19 లక్షల మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి గత సర్కారు అండగా నిలిచింది. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చెల్లించిన బీమా మొత్తం కంటే రూ.3,273.64 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూర్చగా 13.81 లక్షల మంది రైతులు అదనంగా ప్రయోజనం పొందారు.
ఏపీ బాటలో పలు రాష్ట్రాలు..
వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని దేశంలోనే అత్యుత్తమ పంటల బీమా పథకంగా కేంద్రం గుర్తించింది. ఇన్నోవేషన్ కేటగిరి కింద ఉత్తమ బీమా పథకంగా ఎంపిక చేసింది. 2023 ఏప్రిల్ 14న కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందించారు. ఏపీ స్ఫూర్తిగా జాతీయ స్థాయిలో పీఎంఎఫ్‌బీవైలో పలుమార్పులు చేసినట్టుగా కేంద్రం ప్రకటించింది. ఏపీ తరహాలో మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచించింది. 2023–24 నుంచి మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి తదితర రాష్ట్రాలు ఏపీ బాటలోనే రూపాయి ప్రీమియంతో పంటల బీమా అమలుకు శ్రీకారం చుట్టాయి. ఉచిత పంటల బీమా పథకాన్ని కేంద్రం సహా పలు రాష్ట్రాలు ప్రశంసించాయి.
రూ.1,278.80 కోట్ల ప్రీమియం చెల్లింపులకు ఎగనామం..
2023–24 సీజన్‌కు సంబంధించి బీమా కవరేజ్ పరిధిలోకి వచ్చిన అర్హుల జాబితాను గతంలోనే కేంద్రానికి పంపించారు. ఆ మేరకు రైతుల వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,278.80 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, ప్రభుత్వం మారడంతో ప్రీమియం చెల్లించాల్సిన బాధ్యత టీడీపీ సర్కారుపై ఉంది.
అయితే పాత పద్ధతిలోనే పంటల బీమా అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా 2023–24 సీజన్ ప్రీమియం చెల్లింపులు జరపవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు సంకేతాలిచ్చారు. దీంతో 2023–24 సీజన్‌లో వర్షాభావం, వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు 2024–25 సీజన్ నుంచి రైతులే చెల్లించేలా చూడాలంటూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో వారిపై పెనుభారం పడనుంది.
రైతులపై ఏటా రూ.800 కోట్లకుపైగా భారం
ఏ పంటైనా సరే జిల్లాలో కనీసం ఐదువేల ఎకరాల్లో సాగైతేనే నోటిఫై చేస్తారు. నోటిఫై చేసిన పంట పెట్టుబడి ఖర్చులను బట్టి బీమా కంపెనీలు ప్రీమియం నిర్దేశిస్తాయి. ఉదాహరణకు వరికి ఎకరాకు రూ.40 వేలు ఖర్చవుతుంటే కనీసం 8 శాతం అంటే రూ.3,200 చొప్పున ప్రీమియం చెల్లిస్తేనే బీమా కవరేజ్ కల్పిస్తుంది. ఈ మొత్తంలో ఖరీఫ్‌లో అయితే 2 శాతం, రబీలో 1.5 శాతం చొప్పున రైతులు గతంలో చెల్లించగా మిగతాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేవి. ఈ లెక్కన నోటిఫై పంటలకు రైతులు తమ వాటాగా ఏటా కనీసం రూ.800 కోట్లకు పైగా ప్రీమియం రూపంలో భరించాల్సి ఉంటుంది.
బ్యాంకుల నుంచి రుణాలు పొందని కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతులు సొంతంగానే ప్రీమియం చెల్లించాలి. వీరికి అవగాహన కల్పించకపోవడం, ఆర్ధిక భారం కారణంగా బీమాకు ముందుకు రావడం లేదు. దీంతో పంట నష్టపోతే విపత్తుల వేళ బీమా పరిహారం అందని దుస్థితి నెలకొంటుంది. వైఎస్సార్ రైతు భరోసాను హడావుడిగా అన్నదాతా సుఖీభవగా మార్చేసి రూ.20 వేలు ఇవ్వకుండా ఇప్పటికే సీజన్‌లో అన్నదాతలను ముంచేసిన టీడీపీ సర్కారు ఇప్పుడు ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేసే దిశగా అడుగులు వేయడం పిడుగుపాటుగా మారింది.
రూ.2.75 లక్షల పరిహారం ఇచ్చారు
వైఎస్సార్ ఉచిత పంటల బీమా అన్నదాతలను ఎంతో ఆదుకుంది. నోటిఫై చేసిన పంటలు ఈ క్రాప్‌లో నమోదైతే చాలు బీమా వర్తింపచేశారు. మాకు 20 ఎకరాల భూమి ఉంది. పత్తి, శనగ, ఉల్లి సాగు చేస్తుంటాం. 2019–20లో ఒక్క ఉల్లి పంటకే రూ.1.10 లక్షల బీమా పరిహారం వచ్చింది. ఆ తర్వాత రూ.70 వేలు, రూ.42 వేలు, రూ.53 వేలు చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.2.75 లక్షల బీమా పరిహారం అందింది.
రూపాయి ప్రీమియం చెల్లించకపోయినా ఇంత భారీగా పరిహారం దక్కటం ఎంతో ఊరటనిచ్చింది. అన్నదాతలకు ఎంతగానో ఆసరాగా నిలిచిన ఈ ఉచిత పంటల బీమాను కొనసాగించాలి. 2019కి ముందు ఉన్న పంటల బీమా పథకాన్ని కొనసాగిస్తే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది.
–గౌర మహేశ్వరరెడ్డి, ఏ.గోకులపాడు, కర్నూలు జిల్లా
పాత విధానం సరికాదు..
30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. 2021 ఖరీఫ్‌లో అరటి పంట దెబ్బతినడంతో రూ.90 వేల పంటల బీమా పరిహారం నేరుగా నా ఖాతాలో జమ చేశారు. దళారుల ప్రమేయం లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. ఐదేళ్లూ పైసా కూడా మేం ప్రీమియం చెల్లించలేదు. మా వాటా కూడా ప్రభుత్వమే కట్టింది. చంద్రబాబు ప్రభుత్వం పాత విధానంలో పంటల బీమా అమలు చేస్తామని చెప్పడం సరికాదు.
– గనివాడ సన్యాసినాయుడు, పెదమదుపాడ, విజయనగరం జిల్లా
రైతులు బీమా చేయించుకోలేరు
2019కు ముందు టీడీపీ హయాంలో రైతులు బీమా చేయించుకుంటేనే నష్టపరిహారం వర్తించేది. రైతులలో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నందున అవగాహన లేక నష్టపోయే ప్రమాదం ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను అమలు చేసింది. 2021లో వర్షాలకు 80 సెంట్లు పొలంలో నష్టపోతే నేరుగా రూ.5,100 పరిహారం ఇచ్చారు.
– డి. ప్రభాకర్, తాటితూరు, భీమిలి మండలం
రూ.3.80 లక్షల పరిహారం వచ్చింది
నేను పైసా ప్రీమియం చెల్లించకపోయినా 2021లో ఖరీఫ్‌లో పంట నష్టపోతే రూ.3.80 లక్షల బీమా పరిహారం జమైంది. గతంలో ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా పరిహారం కోసం అధికారులు, కంపెనీల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చేది. వైఎస్సార్ ఉచిత
పంటల బీమా పథకం ఎంతగానో ఉపయోగపడింది. ఈ పథకాన్ని కొనసాగించాలి.
– వీరపురం భీమేష్, గడేకల్లు, అనంతపురం జిల్లా
రైతుల తరపున ఉద్యమిస్తాం..
రైతులపై భారం పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాల్సిందే. పాత పద్ధతిలో పంటల బీమా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించటాన్ని ఖండిస్తున్నాం. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు బీమా ప్రీమియం రైతులకు తలకు మించిన భారమవుతుంది. ప్రీమియం చెల్లించలేక బీమాకు మెజార్టీ రైతులు దూరమవుతారు. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించకుంటే ఉద్యమిస్తాం.
– కె.ప్రభాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం
పాత పద్ధతితో తీవ్ర నష్టం
గతంలో క్రాప్ లోన్ ఆధారంగా రైతులు సాగు చేసిన పంటలకు కాకుండా ఇష్టానుసారంగా ఇన్సురెన్స్ ఇచ్చేవారు. ఐదేళ్లుగా ఉచిత పంటల బీమా అమలు చేయడం వలన పైసా ప్రీమియం చెల్లించాల్సిన పని లేకుండా సాగు చేసిన పంటకు బీమా పరిహారం నేరుగా అందింది. ఈ పథకాన్ని కొనసాగించాలి. పాత పద్ధతితో తీవ్రంగా నష్టపోతాం.
– ఎన్.రాజేశ్వరరెడ్డి, సింహాద్రిపురం, వైఎస్సార్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment