rabi season
-
సర్వర్లు పనిచేయవు...వెబ్సైట్ ఓపెన్ కాదు!
రబీ సీజన్ ప్రారంభమై రెండున్నర నెలలు కావస్తున్నా ఈ–క్రాప్ నమోదులో సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. సర్వర్లు పనిచేయక, వెబ్సైట్ సకాలంలో ఓపెన్ అవ్వక, క్షేత్రస్థాయి పరిశీలనలో యాప్ సరిగా పనిచేయకపోవడంతో సిబ్బంది సతమతమవుతున్నారు. రబీ సాగు లక్ష్యం 57.66 లక్షల ఎకరాలు కాగా..ఇప్పటి వరకు 30.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు 22.76 లక్షల ఎకరాల్లో (74%) సాగైన పంటలను మాత్రమే ఈ–పంటలో నమోదు చేయగలిగారు. ఇక ఈ–కేవైసీ నమోదు మాత్రం వీఏఏలు 16.92 లక్షల ఎకరాలకు, వీఆర్వోలు, 11.77 లక్షల ఎకరాలకు సంబంధించి అథంటిఫికేషన్ పూర్తి చేయగా, రైతుల ఈ–కేవైసీ మాత్రం 3.55 లక్షల ఎకరాలకు (30%) మించి పూర్తి కాలేదు. రైతులు ఇష్టపూర్వకంగానే ఈ–కేవైసీ నమోదుకు అవకాశం కల్పించడంతో ఈ–కేవైసీ నమోదుకు క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాధాన్యతనివ్వడం లేదని చెబుతున్నారు. – సాక్షి, అమరావతి వెబ్సైట్లోనే అప్డేట్కు అవకాశం తొలుత ఈ–పంట నమోదులో తెలిపిన వివరాలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిశీలనలో మార్పులు, చేర్పులు ఉంటే గతంలో మొబైల్ యాప్‌లోనే అప్డేట్ చేసేవారు. ఉదాహరణకు, తొలుత తాను వరిని మాత్రమే సాగు చేస్తానని చెప్పిన రైతు, ఆ తర్వాత వరితో పాటు మరికొన్ని పంటలు కూడా సాగు చేస్తోన్న సందర్భంలో ఆ వివరాలను యాప్‌లో అప్లోడ్ చేసే వెసులుబాటు ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ మేరకు మార్పులు చేర్పులన్నీ రైతు సేవా కేంద్రానికి వచ్చి ఈ పంట వెబ్సైట్లోనే అప్టేడ్ చేయాల్సి ఉంది. దీంతో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతు సేవా కేంద్రం సిబ్బంది వాపోతున్నారు. 200 మీటర్ల వరకు మాగాణి, 50 మీటర్ల వరకు మెట్ట పొలాల్లో వెసులుబాటు ఇచ్చినప్పటికీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రోజుకు 10 కి.మీ మించి వెళ్లలేని పరిస్థితి ఉంది. రోజుకు 100 ఎకరాలు ఈ–క్రాప్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, క్షేత్రస్థాయిలో 40 ఎకరాలకు మించి పూర్తవడంలేదు. ఇటు ఎన్యుమరేషన్, అటు ఈ–క్రాప్ నమోదుకు రోజుకు 10–12 గంటలు పనిచేస్తున్నా పూర్తి కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. -
ప్రీమియం భారం బీమాకు దూరం
సాక్షి, అమరావతి: గతేడాది ఇదే రబీ సీజన్లో పంటల బీమాలో నమోదైన రైతుల సంఖ్య ఏకంగా 43.82 లక్షలు.. మరిప్పుడు.. కేవలం 5.94 లక్షలు.. ఏడాదిలో ఎంత తేడా! లక్షల ఎకరాలు.. లక్షలాది మంది రైతన్నలు బీమా రక్షణకు దూరమై గాలిలో దీపంలా సాగు చేయాల్సిన దుస్థితి నెలకొంది.. గత ఐదేళ్లూ అన్నదాతలపై పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఎక్కడా తిరగాల్సిన అవసరం లేకుండా ఈ–క్రాప్ ప్రామాణికంగా గ్రామంలోనే పని పూర్తయ్యేది. నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు నూరు శాతం యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ పంటల బీమా కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకంతో ఉచితంగా లబ్ధి చేకూరేది. రైతన్నలు నిశ్చింతగా పొలం పనుల్లో నిమగ్నమైతే కావాల్సిన కాగితాలు.. మిగతా ప్రక్రియ విషయాన్ని గ్రామ సచివాలయాలు, వలంటీర్లు దగ్గరుండి చూసుకునేవారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతన్నలకు పంటలు నష్టపోతే రికార్డు స్థాయిలో రూ.7,802.05 కోట్లు పరిహారంగా అందచేసి సాగుకు అండగా నిలిచింది. ఇప్పుడు వరికి పంటల బీమా వర్తించాలంటే హెక్టార్‌కు రూ.1,575 చొప్పున రైతన్నలు తమ చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాలి. పనులు మానుకుని బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాలి. రోజుల తరబడి పడిగాపులు కాయాలి. అసలు బీమా పథకానికి ఎప్పటిదాకా గడువు ఉందో చెప్పేవారు లేక.. ఈ అవస్థలు భరించలేక.. డబ్బులు కట్టలేక ఎంతో మంది ఈ పథకానికి దూరమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు నిర్వాకాలతో అన్నదాతలు అన్యాయమైపోయారు! ఐదేళ్ల పాటు పైసా భారం పడకుండా అమలైన ఉచిత పంటల బీమా పథకం ద్వారా పూర్తి స్థాయిలో రక్షణ పొందిన రైతన్నలంతా నేడు ప్రీమియం భారాన్ని భరించలేక, పంటల బీమా చేయించుకోలేక గగ్గోలు పెడుతున్నారు.బీమా కవరేజ్ విస్తీర్ణం 8.44 లక్షల ఎకరాలేరబీ–2024–25 సీజన్లో దిగుబడి ఆధారిత పంటల బీమా పథకం కింద 13 పంటలను, వాతావరణ ఆధారిత పంటల కింద 3 పంటలను నోటిఫై చేశారు. జీడి మామిడి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు నవంబర్ 15వ తేదీతోనే ముగియగా వరి మినహా మిగతా వాటికి ఈ నెల 15తో గడువు ముగిసింది. వరితో పాటు ఇటీవలే నోటిఫై చేసిన మామిడి పంటకు ఈ నెల 31వతేదీతో గడువు ముగియనుంది. దిగుబడి ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన సాగు విస్తీర్ణం 45.55 లక్షల ఎకరాలు కాగా వాతావరణ ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన జీడిమామిడి, మామిడి, టమాటా పంటల సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాలు.. అంటే రెండూ కలిపి 60.55 లక్షల ఎకరాల పైమాటే. కానీ ఇప్పటి వరకు పంటల బీమా కవరేజ్ పొందిన విస్తీర్ణం కేవలం 8.44 లక్షల ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. వీటిలో వాతావరణ పంటల బీమా కింద 24,550 ఎకరాలు, దిగుబడి ఆదారిత పంటల బీమా కింద 8.20 లక్షల ఎకరాలలో సాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ పొందగలిగారు. రైతుల పరంగా చూస్తే ఈ రబీలో కేవలం 5,94,336 మంది మాత్రమే బీమా చేయించుకోగలిగారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా తీరు ఎలా ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. పంటల బీమా వర్తించాలంటే గరిష్టంగా హెక్టార్‌కు మామిడికి రూ.5,625, జీడి మామిడికి రూ.3,837.50, టమాటాకు రూ.3,775, వరికి రూ.1,575 చొప్పున బీమా ప్రీమియాన్ని చెల్లించాలి. ఇతర పంటలకూ అదే స్థాయిలో ప్రీమియం భారం పడుతోంది. ఇంత భారం భరించలేక పంటల బీమాకు దూరం అవుతున్నట్లు అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు.ఐదేళ్లు నూరు శాతం కవరేజ్మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ ఈ – క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు ఉచితంగా నూరు శాతం పంటల బీమా కవరేజ్ కల్పించింది. రబీ 2023–24 సీజన్లో 37.80 లక్షల ఎకరాల్లో సాగైన నోటిఫైడ్ పంటలకు బీమా కవరేజ్ కల్పించడంతో 43.82 లక్షల మంది బీమా రక్షణ పొందగలిగారు. టీడీపీ కూటమి సర్కారు పగ్గాలు చేపట్టిన మరుక్షణమే రైతుల మదిలో వైఎస్ జగన్ ముద్రను చెరిపివేయాలనే అక్కసుతో ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేసింది. పంటల బీమా అమలులో రైతులను భాగస్వాములను చేస్తామని చెబుతూ పెనుభారం మోపింది. స్వచ్ఛంద నమోదు పద్థతిలో పంటల బీమాకు శ్రీకారం చుట్టింది. చివరకు అవగాహన కల్పించలేక చేతులెత్తేసింది.తుపాన్, అకాల వర్షాలతో ఇప్పటికే తీవ్ర నష్టం..పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును జనవరి నెలాఖరు వరకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రబీ సీజన్ ప్రారంభంలో విరుచుకుపడిన ఫెంగల్ తుపాన్‌తో పాటు ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రబీ పంటలకు బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. దురదృష్టవశాత్తూ సీజన్ ముగిసేలోగా మరేదైనా విపత్తు సంభవిస్తే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.పారదర్శకంగా పథకం..1965లో కేంద్రం రూపొందించిన క్రాప్ ఇన్‌స్రూెన్స్ బిల్లు ఆధారంగా తెచ్చిన మోడల్ ఇన్‌స్రూెన్స్ పథకం వివిధ రూపాలు మార్చుకుని 2016 నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)గా అమలవుతోంది. దీని ప్రకారం నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున ప్రీమియాన్ని రైతులు చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించేవి. అయితే ప్రీమియం భారం అధికంగా ఉండడం, ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లేక రైతులు సొంతంగా బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. రుణాలు తీసుకుంటే మాత్రం బ్యాంకులు ప్రీమియం రూపంలో నిర్దేశిత మొత్తాన్ని మినహాయించుకునేవి. లక్షలాది మంది రైతన్నలు తాము పండించిన పంటలకు బీమా చేయించుకోలేకపోవడంతో విపత్తుల బారిన పడితే తీవ్ర నష్టాల పాలయ్యేవారు. గతంలో బీమా చేయించుకున్న వారు సైతం ఎంతొస్తుందో? ఎప్పుడొస్తుందో తెలియక ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉండేవి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ దుస్థితిని తొలగిస్తూ చర్యలు చేపట్టింది. ఈ క్రాప్‌తో పాటు ఈ కేవైసీ నమోదు పూర్తికాగానే ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలను (స్టార్ గుర్తు) ప్రత్యేకంగా తెలియచేస్తూ రైతులకు భౌతిక రసీదులు అందచేసింది. డాక్టర్ వైస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద నోటిఫై చేసిన పంటకు మీరు చెల్లించాల్సిన ప్రీమియాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి పంటకు బీమా చేసినట్లు స్పష్టంగా తెలియజేసింది. ఈ జాబితాలను ఏటా సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించడమే కాకుండా అభ్యంతరాలను పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకుంది. కూటమి సర్కారు వచ్చాక ఈ క్రాప్ అస్తవ్యస్థంగా మారింది. ఎవరు ఏ పంట సాగు చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక పంటల బీమాలో నమోదు చేసేందుకు అవసరమైన సాగు పత్రాల కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు.బాబు హయాంలో అరకొరగా..2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏటా సగటున 46 లక్షల ఎకరాల చొప్పున 2.32 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించగా, ఏటా సగటున 14.88 లక్షల మంది చొప్పున 74.4 లక్షల మంది రైతులు ప్రీమియం కట్టి బీమా సదుపాయం పొందారు. నాడు హుద్‌హుద్, తిత్లీ లాంటి భారీ తుపాన్లు, 324 మండలాల్లో కరువు ప్రభావం వల్ల రూ.వేల కోట్ల విలువైన పంటలను కోల్పోయినా రైతులకు దక్కిన పరిహారం అరకొరే. 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్లు మాత్రమే బీమా పరిహారం దక్కింది.జగన్ హయాంలో రికార్డు..2019–23 మధ్య వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఏటా 1.08 కోట్ల ఎకరాల చొప్పున 5.42 కోట్ల ఎకరాలకు ఉచిత పంటల బీమా సదుపాయాన్ని కల్పించింది. ఏటా సగటున 40.50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పిస్తూ చర్యలు తీసుకుంది. రైతుల తరపున వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,022.26 కోట్లను బీమా కంపెనీలకు ప్రీమియం రూపంలో చెల్లించింది. ఇక ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.08 కోట్ల మేర బీమా పరిహారాన్ని అందచేసి ఆదుకుంది. అంతేకాకుండా 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో 6.19 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి అండగా నిలిచింది. టీడీపీ హయాంతో పోల్చితే అదనంగా 23.70 లక్షల మందికి రూ.4,390.88 కోట్ల మేర అదనంగా బీమా పరిహారం అందించి వైఎస్ జగన్ అన్నదాతలకు అండగా నిలిచారు.ప్రభుత్వమే చెల్లించాలి..నాకున్న 75 సెంట్ల పల్లపు భూమిలో వరి పండిస్తుంటా. 2021 సెప్టెంబరులో గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోతే నా బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం రూ.4,650 జమ చేసి ఆదుకుంది. వైఎస్సార్సీపీ హయాంలో ఈ – క్రాప్‌లో నమోదైన ప్రతీ పంటకు బీమా వర్తించేది. ఇప్పుడు పంటల బీమా ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని చెబుతున్నారు. ప్రీమియం భారాన్ని భరించలేక.. బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగలేక, అవగాహన లేక చాలా మంది నష్టపోతున్నాం. రైతుల తరపున ప్రీమియాన్ని గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి.– తమ్మిన సీతారమణ, రైతు, టి.నగరపాలెం, భీమిలి మండలం, విశాఖ జిల్లాప్రీమియం భారాన్ని మోయలేం..ప్రీమియం భారాన్ని భరించలేకనే రైతులు పంటల బీమాకు దూరమవుతున్నారు. వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు కనీసం మద్దతు ధర చెల్లించి ఆదుకోవడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అన్నదాతలు ఈ తరుణంలో ప్రీమియం చెల్లించి బీమా చేయించుకునే పరిస్థితిలో లేరు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. – కోసూరి శివనాగేంద్ర, రైతు, పమిడిముక్కల మండలం, గడ్డిపాడు, కృష్ణా జిల్లాఉచిత బీమా కొనసాగించాలి..గత ఐదేళ్లూ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకం ఎంతగానో ఆదుకుంది. స్వచ్ఛంద నమోదు పద్ధతి పేరుతో కూటమి ప్రభుత్వం తెచ్చిన పంటల బీమా వల్ల కౌలు రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. గతంలో మాదిరిగా రైతుల తరపున ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి.– ఎం.హరిబాబు, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శిఏటా రూ.900 కోట్లకుపైగా భారం..ప్రీమియం భారాన్ని భరించ లేకనే రాష్ట్రంలో రైతన్నలు పంటల బీమాకు దూరమయ్యారు. గత ఐదేళ్లు పైసా భారం పడకుండా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు పూర్తి స్థాయిలో బీమా కవరేజీ రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. కూటమి సర్కారు కక్షకట్టినట్లు వ్యవహరిస్తూ ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఏటా రూ.900 కోట్లకుపైగా అన్నదాతలపై భారాన్ని మోపడం దుర్మార్గం.–వడ్డి రఘురాం, వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం2021లో పైసా కట్టకుండా రూ.55 వేల పరిహారం..ఐదెకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఖరీఫ్ 2021లో గులాబ్ తుపాను వల్ల మూడు ఎకరాల్లో పంట దెబ్బ తినడంతో రూ.55 వేల బీమా పరిహారం నా ఖాతాలో జమైంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ ప్రీమియం కింద పైసా చెల్లించలేదు. ప్రస్తుతం బీమా ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని ఈ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది రైతులకు ఎంతో భారంగా ఉంది. మా తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఆదుకోవాలి. – ఎం.శ్రీనివాసరావు, రైతు, కేసీహెచ్ పల్లి, విజయనగరం జిల్లా -
రాష్ట్రంలో ‘రబీ’ నష్టం రూ. 320 కోట్లు
అనంతపురం అగ్రికల్చర్/కర్నూలు(అగ్రికల్చర్): గత రబీ సీజన్ (2023–24)లో కరువు పరిస్థితుల కారణంగా గత ప్రభుత్వం ఆరు జిల్లాల పరిధిలో ప్రకటించిన 87 కరువు మండలాల్లో రూ. 320 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రకృతి విపత్తుల విభాగం మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఆరి్థకసాయం అందజేయాలంటూ.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ)కు సమగ్ర కరువు నివేదిక అందజేశారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో రాష్ట్రస్థాయిలో రబీ నష్టంపై సమీక్ష నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ నేతృత్వంలో ఈ సమీక్ష జరిగింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ రితే‹Ùచౌహాన్ నేతృత్వంలో ఆరుగురు కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. మరో నలుగురితో కూడిన కేంద్ర బృందం నెల్లూరు నుంచి వర్చువల్ పద్ధతిలో సమీక్షలో పాల్గొన్నారు. అలాగే ఆర్.కూర్మనాథ్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.నాగరాజు, గ్రౌండ్ వాటర్ ఏడీ విశ్వేశ్వరరావు, జేడీఏ జగ్గారావు, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీరు ఎం.బ్రహ్మాజీ, పశుశాఖ జేడీ జెడ్.ఈశ్వర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాషా, గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ కమిషనర్ శివప్రసాద్‌తో కూడిన రాష్ట్ర స్థాయి బృందం సభ్యులు కూడా సమీక్షకు హాజరయ్యారు. 24 రకాల పంటలకు దెబ్బ ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో గత రబీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు కేంద్ర బృందానికి రాష్ట్ర, జిల్లా అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాలో 14 మండలాలు, శ్రీసత్యసాయి జిల్లాలో ఒకటి, కర్నూలు జిల్లాలో 18, నంద్యాలలో 13, ప్రకాశంలో 31, నెల్లూరులో 10... మొత్తంగా ఆరు జిల్లాల పరిధిలో 87 మండలాలు కరువు జాబితాలో ప్రకటించినట్లు తెలిపారు. ఆరు జిల్లాల పరిధిలో 2.53 లక్షల హెక్టార్లలో 24 రకాల పంటలు దెబ్బతినడంతో రూ.1,207 కోట్లు విలువ చేసే 2.93 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు కోల్పోయినట్లు వివరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం ఒక్కో రైతుకు రెండు హెక్టార్లకు ఆరి్థకసాయం అందించడానికి వీలుగా 2.38 లక్షల మంది రైతులకు రూ. 228.03 కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీ రూపంలో అందించాలని కోరారు. పంటనష్టం కాకుండా ఉద్యానశాఖ, పశుశాఖ, ఉపాధిహామీ, గ్రామీణ, పట్టణ తాగునీటి సరఫరా తదితర వాటికి మరో రూ. 91.74 కోట్లు... మొత్తంగా రూ.319.77 కోట్లు కరువు సాయం అందించాలని కోరుతూ సమగ్ర కరువు నివేదికను కేంద్ర బృందానికి అందించారు. ఇక్కడే ఆరు జిల్లాల పరిధిలో జరిగిన పంటనష్టం గురించి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అనంతరం ఒక బృందం శ్రీసత్యసాయి జిల్లా పర్యటనకు, మరొక బృందం కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనకు వెళ్లాయి.నగరడోణ, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణంతోనే కరువు నివారణ కర్నూలు జిల్లాలో కరువును శాశ్వతంగా నిర్మూలించాలంటే ప్రధానంగా నగరడోణ రిజర్వాయర్, వేదవతినదిపై ప్రాజెక్టు నిర్మించాలని, ఈ మేరకు కేంద్రానికి నివేదించాలని రైతులు, రైతు సంఘాల నేతలు ఐఎంసీటీ ప్రతినిధులను కోరారు. కేంద్ర బృందం బుధవారం కర్నూలు కలెక్టరేట్లో రబీ కరువును ప్రతిబింబించే ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది. శనగ, జొన్న రైతులతో ముఖాముఖి మాట్లాడి కరువు తీవ్రతను తెలుసుకున్నారు. 2023–24 ఖరీఫ్, రబీల్లో వివిధ పంటల్లో పెట్టిన పెట్టుబడుల్లో 25 శాతం కూడా దక్కలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి పంటల బీమా పరిహారం చెల్లించాలని కోరారు. గురువారం జిల్లాల్లో కరువు పరిశీలన తర్వాత అన్ని బృందాలు విజయవాడ చేరుకుంటాయని అధికారులు తెలిపారు. -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
కడెం(ఖానాపూర్): రబీ సీజన్లో సాగు చేసిన పంటలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయాలని కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు నచ్చన్ఎల్లాపూర్ వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై గురువారం బైఠాయించారు. వారం రోజులుగా సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయకపోవడంతో కడెం మండలంలోని లింగాపూర్, మాసాయిపేట్, నచ్చన్ఎల్లాపూర్, పెద్దూర్‌తండా, చిట్యాల్, ధర్మాజీపేట్, తదితర గ్రామాల్లోని సుమారు 13 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే వెడ్మ సదర్మాట్ రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కాలువ నీళ్లు వస్తాయ ని రైతులు ఆందోళన చెందవద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలని ఈఎన్సీ నుంచి ఎస్ఈకి గురువారమే ఆదేశాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. -
ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీ
న్యూఢిల్లీ: రబీ సీజన్లో పాస్ఫరస్, పొటాషియం (పీ అండ్ కే) సంబంధిత ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 50 కేజీల డీఏపీ బస్తా ధరను రూ.1,350గానే కొనసాగించాలని నిర్ణయించింది. 2023–24 రబీ సీజన్(2023 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2024 మార్చి 31 దాకా)లో పోషకాల ఆధారిత సబ్సిడీకి ఎరువులు, రసాయనాల శాఖ చేసిన ప్రతిపాదనలకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియాకు వెల్లడించారు. రైతులకు అందుబాటు ధరల్లో చాలినన్ని ఎరువులను అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ‘ నత్రజని, ఫాస్ఫరస్, పొటాíÙయంలు పాత ధరకే లభిస్తాయి. అంటే బస్తా నత్రజని పాత రూ.1,470 ధరకే, ఎస్ఎస్పీ(సింగిల్ సూపర్ ఫాస్ఫేట్) బస్తా దాదాపు రూ.500కు దొరుకుతాయి. ఫొటాష్(ఎంఓపీ) బస్తా ధర రూ.1,655కు తగ్గనుంది’ అని మంత్రి వివరించారు. గత ఖరీఫ్ సీజన్‌కు రూ.38,000 కోట్ల ఎరువుల సబ్సిడీని కేంద్రం అందజేయడం తెలిసిందే. మొత్తం వార్షిక ఎరువుల సబ్సిడీ రూ.2.55 లక్షల కోట్లకు పెరిగిందని ఠాకూర్ చెప్పారు. -
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం
-
అకాల కష్టం అండగా ఉందాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పంట నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాటే రాకూడదని, పంటలు కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్దేశించారు. ఆర్బీకేల స్థాయిలో నిశితంగా పర్యవేక్షణ జరగాలని స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం జగన్ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. సచివాలయాల్లో రైతుల జాబితాలు వర్షాల వల్ల పంటలు సహా ఇతర నష్టాలకు సంబంధించి గ్రామ సచివాలయాల స్థాయిలోనే ఎప్పటికప్పుడు వివరాలను సేకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీల కోసం సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. తద్వారా ఎవరైనా మిగిలిపోతే వెంటనే అధికారుల దృష్టికి తెచ్చేందుకు వీలుంటుందన్నారు. వేగంగా రబీ ధాన్యం కొనుగోలు రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పంటను కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. ఫిర్యాదులకు ట్రోల్ ఫ్రీ నెంబర్ రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే ఫిర్యాదు చేసేందుకు ట్రోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు చేపట్టాలన్నారు. రైతన్నల ముఖంలో చిరునవ్వు కనిపించేలా అధికారుల చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. రానున్న రోజులకు సంబంధించి వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటూ వర్ష ప్రభావిత ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లాకు వ్యవసాయ శాస్త్రవేత్త రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి సమీక్షలో అధికారులు వివరించారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 4.75 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. పంట కోతలు పూర్తి కాని ప్రాంతాల్లో ఏం చేయాలన్న అంశంపై రైతులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. పంటలు కోసిన చోట పనలు తడిస్తే ఉప్పు ద్రావణం చల్లడం లాంటి విధానాలను పాటించడంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తను అందుబాటులో ఉంచి స్థానిక అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ధాన్యం భద్రంగా గోడౌన్లకు తరలింపు వివిధ కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద ఉన్న ధాన్యం నిల్వలను భద్రంగా ప్రభుత్వ భవనాలు, గోడౌన్లలోకి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు ఊపందుకున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్స్ తెరిచామని, యంత్రాంగం అంతా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. -
96 శాతం ఈ–క్రాప్ నమోదు
సాక్షి, అమరావతి: రబీసాగు చివరి దశకు చేరుకుంటోంది. ఈసారి సాగుతో పాటు ఈ–క్రాప్ నమోదు, ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సాగైన విస్తీర్ణంలో 96 శాతం ఈ–క్రాప్ నమోదు పూర్తికాగా, ఈ–కేవైసీ 55 శాతం పూర్తయింది. ఈ నెల 20వ తేదీలోగా 100 శాతం పంటల నమోదుతోపాటు ఈ–కేవైసీ పూర్తిచేయాలనే లక్ష్యంతో వ్యవసాయశాఖ ముందుకెళ్తోంది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని రబీసీజన్ నుంచి ఈ–క్రాప్ నమోదులో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో రూపొందించిన యాప్ ద్వారా డిసెంబర్ 8వ తేదీన ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ గ్రామాల వారీగా వెబ్‌ల్యాండ్ డేటాతోపాటు పంట సాగుహక్కుపత్రాల (సీసీఆర్సీ) డేటా ఆధారంగా ఈ–క్రాపింగ్ చేస్తున్నారు. దీంతోపాటు సమాంతరంగా రైతుల వేలిముద్రలు (ఈ–కేవైసీ) తీసుకుంటున్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా.. గతేడాది డిసెంబర్లో విరుచుకుపడిన మాండూస్ తుపాన్ వల్ల దెబ్బతిన్న పంటల స్థానే రెండోసారి విత్తుకున్న పంటల వివరాలను స్థానిక వ్యవసాయాధికారి ధ్రువీకరణతో నమోదు చేస్తున్నారు. ప్రైవేటు విత్తన కంపెనీల కోసం విత్తనోత్పత్తికి సాగుచేసే పంటల వివరాలను సర్వే నంబర్ల వారీగా నమోదు చేస్తున్నారు. ఆయా సర్వే నంబర్లలో సాగైన పంటను కొనుగోలు చేయడానికి వీల్లేకుండా ఈ మార్పుచేశారు. సీజన్లో ఒకసారి పంట నమోదైన తర్వాత సాగుకాలం ముగిసేవరకు రెండోసారి పంట నమోదు కాకుండా లాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ‘ఈ–ఫిష్’ ద్వారా ఆక్వా సాగవుతున్నట్టుగా గుర్తించిన సర్వే నంబర్లను ఈసారి ఈ–క్రాప్‌లో బ్లాక్ చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ–క్రాప్, ఈ–కేవైసీ నమోదుతోపాటు మండల వ్యవసాయాధికారుల నుంచి కలెక్టర్ల వరకు ర్యాండమ్‌గా చెక్ చేస్తున్నారు. గతంలో ఈ–క్రాప్, ఈ–కేవైసీ ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ తనిఖీలు చేసేవారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిల్లో తనిఖీ కోసం ఎంపికచేసిన పంట వివరాలను సైతం కమిషనరేట్ నుంచే జిల్లాలకు పంపిస్తున్నారు. ఆ మేరకు ర్యాండమ్‌గా తనిఖీచేసి క్షేత్రస్థాయిలో గుర్తించిన లోటుపాట్లను సరిదిద్దుకునేలా మార్పుచేశారు. ప్రతి 15 రోజులకోసారి ర్యాండమ్‌గా చెక్ చేస్తున్నారు. ఈ–క్రాప్ నమోదు కాగానే రైతుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్లు, ఈ–కేవైసీ పూర్తికాగానే భౌతిక రసీదులు ఇస్తున్నారు. 43.62 లక్షల ఎకరాల్లో పంటల నమోదు రబీ సీజన్లో సాధారణ సాగువిస్తీర్ణం 57.30 లక్షల ఎకరాలుకాగా ఈ ఏడాది 58 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 45.31 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు 43.62 లక్షల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీలోగా ఈ–క్రాప్ నమోదు, ఈ–కేవైసీ నూరుశాతం పూర్తిచేసి, సామాజిక తనిఖీల్లో భాగంగా 28వ తేదీ వరకు ఆర్బీకేల్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత మార్చి 7వ తేదీన తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
జోరుగా రబీ సాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సాగు జోరందుకుంటోంది. నిర్దేశించిన లక్ష్యంలో మూడోవంతు విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. మాండూస్ తుపాను ప్రభావం ఈ పంటలపై స్వల్పంగా చూపింది. రాయలసీమలోని మూడు జిల్లాల్లో కొంతమేర పంటలు దెబ్బతినగా, ఆ మేరకు ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో రెండోసారి విత్తుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు.. రబీ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువుల నిల్వలు ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచారు. అనంతపురంలో 70 శాతం సాగు రబీ సాధారణ సాగు విస్తీర్ణం 56.29 లక్షల ఎకరాలు. 2020–21లో రికార్డు స్థాయిలో 62 లక్షల ఎకరాల్లో సాగవగా, 2021–22లో 56.27 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 58లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గతేడాది ఇదే సమయానికి 18 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈ ఏడాది ఇప్పటివరకు 19.53 లక్షల ఎకరాల్లో సాగైంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 70 శాతం మేర రబీ పంటలు సాగవగా, వైఎస్సార్, కర్నూలు జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 60 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో 50 శాతం మేర పంటలు సాగయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ పనులు ఊపందుకున్నాయి. ఈసారి వరి సాగు లక్ష్యం 20.77 లక్షల ఎకరాలు రబీలో వరి సాధారణ విస్తీర్ణం 19.72 లక్షల ఎకరాలు. గత సీజన్లో 19.52 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈ ఏడాది 20.77లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు 3.07లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గతేడాది ఇదే సమయానికి 1.9 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇక బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అపరాలు, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. 11.75 లక్షల ఎకరాల్లో అపరాల సాగు ఇక ముతక ధాన్యాలు 8.02 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 2.52 లక్షల ఎకరాల్లో సాగైంది. వీటిలో 1.65 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 82 వేల ఎకరాల్లో జొన్నలు సాగయ్యాయి. అపరాల విషయానికొస్తే.. ఈ ఏడాది 23.65 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 11.75 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 10.85 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వీటిలో ప్రధానంగా 7.56 లక్షల ఎకరాల్లో శనగలు, 3.07 లక్షల ఎకరాల్లో మినుములు సాగయ్యాయి. అలాగే, నూనె గింజల సాగు లక్ష్యం 3.67లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.25 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వీటిలో ప్రధానంగా 1.05 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగైంది. ఇతర పంటల విషయానికొస్తే పొగాకు సాగు లక్ష్యం 1.75 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 87 వేల ఎకరాల్లో సాగైంది. సమృద్ధిగా ఎరువుల నిల్వలు రబీ సీజన్‌కు కేంద్రం 22.69 లక్షల టన్నుల ఎరువులు కేటాయించింది. ప్రారంభ నిల్వ 7.29 లక్షల టన్నులుండగా, గడిచిన 45 రోజుల్లో 7.82 లక్షల టన్నులను కేంద్రం సరఫరా చేసింది. డిసెంబర్ 15 నాటికి 7.94 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరిగాయి. డిసెంబర్ నెలకు 3.34 లక్షల టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 7.17లక్షల టన్నుల ఎరువుల నిల్వలున్నాయి. కేటాయింపు ప్రకారం డిసెంబర్ నెలకు మరో 3.95 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. -
రైతులకు మరింత ధీమా
కడప సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ, ఇన్‌పుట్‌సబ్సిడీ రాయితీ పథకాలు అన్నదాతలకు మరింత ధీమాను ఇస్తున్నాయని కలెక్టర్ విజయరామరాజు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణిలు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2020–21 సంవత్సరానికి రబీ సీజన్‌కు సంబంధించి, 2021 ఖరీఫ్ కాలానికి వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాలు, 2022 ఖరీఫ్‌లో ఇన్పుట్ సబ్సిడీ కింద లబ్ధి మొత్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి కలెక్టర్ విజయరామరాజుతోపాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, నగర మేయర్ సురేష్‌బాబు, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లేల ఝాన్సీరాణి, జేసీ సాయకాంత్‌వర్మ, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పులివెందుల మార్కెట్‌యార్డు చైర్మన్ చిన్నప్ప, వ్యవసాయ సలహా మండలి సభ్యులు బలరామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. అన్నదాతలకు కొండంత అండ : కలెక్టర్ విజయరామరాజు ఈ సందర్భంగా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ పథకాలు అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తున్నాయన్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2020–21 రబీ సీజన్‌కు సంబంధించి రూ. లక్షలోపు పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన 12,112 మంది జిల్లా రైతులకు మంజూరైన రూ. 2.69 కోట్లు, 2021 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 24,920 మంది రైతులకు రూ. 6.05 కోట్లు, అలాగే 2020 ఖరీఫ్ సీజన్‌కుగాను సున్నా వడ్డీ కింద 30233 మంది వివిధ కారణాలతో జమకాని రైతులకుగాను రూ. 7.30 కోట్లు జమ అయిందన్నారు. మొత్తంగా జిల్లాలో 67,265 మంది రైతులకు రూ. 16.04 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. అలాగే 2022 ఖరీఫ్ కాలానికి ఇన్పుట్ సబ్సిడీ కింద జిల్లాలో 3855 మంది రైతులకు రూ. 4.33 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారని తెలిపారు. మెగా చెక్కు అందజేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీసీ అనంతరం సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన మెగా చెక్కులను కార్యక్రమానికి హాజరైన అతిథులందరూ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ►ఈ కార్యక్రమంలో వీరపునాయునిపల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నాగేశ్వరరావు, పశుసంవర్థకశాఖ జేడీ శారద, డీసీఓ సుభాషిణి, వ్యవసాయ ఏడీలు నరసింహారెడ్డి, సుబ్బారావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రైతు పక్షపాత ప్రభుత్వం: ఎస్.రఘురామిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి రైతు తలెత్తుకుని జీవించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమన్నారు. రైతు దేశానికి వెన్నముక అని, రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వం భావించి రైతులను అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు. అన్నదాతల కోసం అమూల్య పథకాలు : సురేష్‌బాబు, నగర మేయర్ అన్నదాతల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమూల్యమైన పథకాలను అమలు చేస్తున్నారని నగర మేయర్ సురేష్‌బాబు తెలిపారు. వరుసగా మూడవ సంవత్సరం సజావుగా సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీలను రైతులకు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రిదేనన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : మల్లెల ఝాన్సీరాణి, ఆప్కాబ్ చైర్ పర్సన్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణి తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు కల్పతరువులు : సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు అన్ని విధాలా కల్పతరువుగా మారాయని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి పేర్కొ న్నారు. ప్రభుత్వం విత్తనం నుంచి అమ్మకం వరకు రైతులకు అండగా నిలుస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సేవలు అందుతున్నాయన్నారు. రైతు బాంధవుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు బాంధవుడిగా మారి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మిన నాయకుడు జగనన్న. ప్రభుత్వ మద్దతు ధరతో పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా విక్రయించుకోగలిగాను. – భాస్కర్, రైతు, యల్లారెడ్డిపల్లె, కమలాపురం జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి వ్యవసాయ రంగంలో రైతుల అభ్యున్నతికి అనేక మార్పులు తెచ్చి ఆపన్నహస్తం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే ఉండాలని కోరుకుంటున్నాను. – పి.వీరారెడ్డి, చౌటపల్లె, కడప రైతు శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రిగా ఘనత సాధించారు. అనేక పథకాలను రైతుల కోసం ప్రవేశపెట్టారు. ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలన్నదే మా అందరి ఆకాంక్ష. – ఎం.సుబ్బిరెడ్డి, చౌటపల్లె, కడప -
రబీకి 5 లక్షల లీటర్ల నానో యూరియా నిల్వలు
సాక్షి, అమరావతి: పర్యావరణ హితమైన నానో యూరియా వినియోగం పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) నానో టెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో ఈ నానో యూరియాను మార్కెట్లోకి తెచ్చింది. 500 మిల్లీలీటర్ల సీసాలో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా మార్కెట్లో రూ.266.50 ఉండగా, నానో యూరియా సీసా రూ.240కే అందుబాటులోకి తెచ్చారు. గతేడాది ఖరీఫ్ సీజన్లో ప్రయోగాత్మకంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా, 20 వేల మంది రైతులు 34,128 సీసాల (17 వేల లీటర్ల) యూరియాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రబీలో లక్షమందికి పైగా రైతులు 5,46,012 సీసాలు (2.73 లక్షల లీటర్లు) కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2 లక్షల లీటర్లు (4 లక్షల సీసాలు) అందుబాటులో ఉంచగా 1.25 లక్షల లీటర్లు (2.50 లక్షల సీసాలు) అమ్ముడయ్యాయి. సకాలంలో వర్షాలు పడడం, పూర్తిస్థాయిలో సాగునీరు అందుబాటులో ఉండడం, తెగుళ్ల ఉద్ధృతి తక్కువగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో యూరియా నిల్వలను డిమాండ్‌కు తగినట్టుగా అందుబాటులో ఉంచడం వంటి కారణాల వల్ల ఆశించిన స్థాయిలో నానో యూరియా అమ్మకాలు జరగలేదని అంచనా వేస్తున్నారు. ఎరువుల వినియోగం ఎక్కువగా ఉండే ప్రస్తుత రబీ సీజన్లో కనీసం 5 లక్షల లీటర్ల (10 లక్షల సీసాల) నానో యూరియాను అందుబాటులో ఉంచారు. డిమాండ్‌ను బట్టి వీటిలో కనీసం 25 శాతానికి తక్కువ కాకుండా ఆర్బీకేల ద్వారా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నానో యూరియా వినియోగంపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో పాటు పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో ట్రయల్‌రన్‌లో ఉన్న ఈ ఉత్పత్తులను ఖరీఫ్–2023 సీజన్ నుంచి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సమృద్ధిగా నానో యూరియా నిల్వలు నానానో యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం పెరుగుతోంది. గతేడాది ఖరీఫ్‌లో 17 వేల లీటర్ల విక్రయాలు జరగగా, ఈ ఏడాది ఖరీఫ్‌లో ఏకంగా 1.25 లక్షల లీటర్ల విక్రయాలు జరిగాయి. రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత రబీ సీజన్ కోసం 5 లక్షల లీటర్ల నానో యూరియా బాటిల్స్‌ను అందుబాటులో ఉంచాం. ఇంకా అవసరమైతే పెంచేందుకు ఇఫ్కో సిద్ధంగా ఉంది. – టి.శ్రీధర్‌రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
Andhra Pradesh: రైతన్నకు ‘మద్దతు’
రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువకు పంటలు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఒక్క ధాన్యమే కాదు.. ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటలకూ కనీస మద్దతు ధర లభించేలా అధికారులు సవాల్‌గా తీసుకుని పనిచేయాలి. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర ఏమాత్రం ఉండకూడదు. ఈ – క్రాప్ వంద శాతం పూర్తి కావాల్సిందే. రైతుల ఈ–కేవైసీ 93 శాతం పూర్తి కాగా మిగిలిన 7 శాతం రైతులకు ఎస్ఎంఎస్ల ద్వారా ఈ–క్రాప్ వివరాలు పంపించాలి. ఈ – క్రాప్ డేటా ఆధారంగా గరిష్ట ప్రయోజనం చేకూర్చేలా ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపట్టాలి. వ్యవసాయ, పౌరసరఫరా శాఖలు సమన్వయంతో పని చేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతన్నలకు ఏ లోటూ రానివ్వకుండా అన్ని విధాలా తోడుగా నిలవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇన్పుట్స్ సహా అన్నీ సకాలంలో అందించాలని స్పష్టం చేశారు. విత్తనాల నుంచి ఎరువుల వరకు సాగు ఉత్పాదకాలన్నీ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచి సాగు మెళకువలు, సూచనలు అందించాలన్నారు. ఈ దఫా రబీలో 22.92 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేస్తున్నామని, బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు సాగును ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. పొలంబడుల్లో విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ అత్యుత్తమ వ్యవసాయ పద్ధతులు పాటించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించి అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో చేపట్టిన పొలంబడి కార్యక్రమాలను మరింత సమర్ధంగా నిర్వహించాలి. పొలంబడి నిర్వహణలో మనం ఆదర్శంగా నిలిచాం. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులను భాగస్వాములను చేసేలా అప్రెంటిస్‌షిప్ కోసం ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే శ్రీకారం చుట్టాలి. వీటి ద్వారా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి. వారి నుంచి సలహాలు తీసుకోవాలి. రెండేళ్లలో ప్రతి ఆర్బీకేలో డ్రోన్ ప్రతి ఆర్బీకేలోనూ డ్రోన్ సేవలు అందుబాటులోకి రావాలి. వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లో డ్రోన్లు ఉండేలా కార్యాచరణ రూపొందించాలి. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంతో నానో ఫెర్టిలైజర్స్ వాడకంపై అవగాహన పెరుగుతుంది. ఎరువుల వృథాను నివారించడంతోపాటు మొక్కలకు మరింత మెరుగ్గా పోషకాలు అందుతాయి. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా సమకూర్చిన వ్యవసాయ యంత్రసామగ్రి రైతులకు అందుబాటులో ఉంచాలి. వీటి సేవలు రైతులందరికీ అందుబాటులోకి తేవాలి. మార్చికి ఆర్బీకేల్లో ప్లాంట్ డాక్టర్లు వచ్చే మార్చి కల్లా ఆర్బీకేల స్థాయిలో ప్లాంట్ డాక్టర్ సేవలను అందుబాటులోకి తేవాలి. ఇందుకు సంబంధించిన ప్లాంట్ డాక్టర్ కిట్స్ ప్రతీ ఆర్బీకేలో అందుబాటులో ఉంచాలి. భూసార పరీక్షలు నిర్వహించే పరికరాలను ఆర్బీకేల్లో సిద్ధం చేయాలి. వచ్చే మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. భూసార పరీక్షలు నిర్వహించి ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేయడం ద్వారా ఏ పంటలకు ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలో స్పష్టత వస్తుంది. దీనివల్ల పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. నాణ్యమైన దిగుబడులు పెరుగుతాయి. భూసారాన్ని పరిరక్షించుకునే అవకాశం ఏర్పడుతుంది. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు ఇన్పుట్ సబ్సిడీని ఈ నెల 29న జమ చేసేలా ఏర్పాట్లు చేయాలి. దిగుబడి అంచనా 186 లక్షల టన్నులు రాష్ట్రంలో జూన్ నుంచి నవంబర్ వరకు సాధారణ వర్షపాతం 775 మి.మీ. కాగా ఇప్పటి వరకు 781.7 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో 186 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి రానుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ‘ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ – క్రాప్ వంద శాతం నమోదైంది. వీఏఏ, వీఆర్వో బయోమెట్రిక్ ఆథరైజేషన్ కూడా వంద శాతం పూర్తైంది. రైతుల ఈ కేవైసీ 93 శాతం పూర్తైంది. సోషల్ ఆడిట్లో భాగంగా జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాం. రైతుల సమక్షంలోనే గ్రామసభల ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించాం’ అని అధికారులు వివరించారు. సమీక్షలో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్‌శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల కమిషనర్లు ప్రద్యుమ్న, హెచ్.అరుణ్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండ్యన్, ఏపీ సీడ్స్ ఎండీ జి.శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
అపరాలు, చిరుధాన్యాలపై గురి
సాక్షి, అమరావతి: రబీలో బోర్లు కింద వరిసాగు చేసే రైతుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని సంకల్పించింది. ఆరుతడి పంటలవైపు వీరిని మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధంచేసింది. వాస్తవానికి మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే బోర్ల కింద వరి సాగుకయ్యే ఖర్చు ఎక్కువ. ఫలితంగా పెట్టుబడి పెరిగి, గిట్టుబాటు ధర దక్కక ఆర్థికంగా నష్టపోతుంటారు. దీనిని నివారించేందుకు సర్కారు ఈ ప్రణాళిక రూపొందించింది. సాధారణంగా రబీలో సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు. అయితే, గతేడాది 57.27 లక్షల ఎకరాల్లో సాగైంది. 19.72 లక్షల ఎకరాల్లో వరి, 24 లక్షల ఎకరాల్లో అపరాలు, 4.97 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 3.47 లక్షల ఎకరాల్లో నూనెగింజలు, 3.2 లక్షల ఎకరాల్లో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. కానీ, ఈ ఏడాది 58.68 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇందులో ఇప్పటివరకు 2.50 లక్షల ఎకరాల్లో రబీ పంటల సాగుకు వడివడిగా శ్రీకారం చుట్టారు. రూ.25 కోట్లతో కార్యాచరణ రాష్ట్రంలో 12 లక్షల బోర్ల కింద 24.63 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులోని 11.55 లక్షల ఎకరాల్లో సుమారు 10 లక్షల మంది సంప్రదాయంగా వరిసాగు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుత రబీ సీజన్లో ప్రయోగాత్మకంగా బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటల సాగుకోసం రూ.25 కోట్లతో వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధంచేసింది. ఇందులో భాగంగా బోర్ల కింద 750 క్లస్టర్ల (ఒక క్లస్టర్ కింద 50 ఎకరాలు) పరిధిలోని 37,500 ఎకరాల్లో వరికి బదులుగా అపరాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించనున్నారు. ఇలా ఒక్కో క్లస్టర్‌లోని రైతులకు విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలను 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. అదే విధంగా మిషన్ మిల్లెట్ పాలసీ కింద బోర్ల కింద ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంతాల్లో కూడా ప్రస్తుత రబీ సీజన్లో కనీసం 50వేల ఎకరాల్లో రాగి, కొర్ర పంటల సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు ప్రోత్సాహకాలు ఇలా.. ఇక ఈ కార్యాచరణలో భాగంగా బోర్ల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు అనేక ప్రోత్సాహకాలు అందించబోతోంది. బోర్ల కింద అపరాలకు రూ.9వేలు, నూనెగింజలకు రూ.10వేలు, బోర్లతోపాటు మైదాన ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు హెక్టార్‌కు రూ.6వేల విలువైన విత్తనాలు, విత్తనశుద్ధి చేసే రసాయనాలు, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. వీటితో పాటు రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన మినీ ప్రాసెసింగ్ యూనిట్లు 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్ ఇంట్రస్ట్ గ్రూపులకు (ఎఫ్ఐజీ) అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు పండించే రైతుల గ్రూపులకు రాష్ట్ర ప్రభుత్వం 150 యూనిట్లు ఇవ్వనుంది. బోర్ల కింద ఆరుతడి పంటలే మేలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బోర్ల కింద వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, నూనెగింజలు, చిరు«ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కార్యాచరణ సిద్ధంచేశాం. ఈ ఏడాది బోర్ల కింద 37,500 ఎకరాల్లో నూనెగింజలు, అపరాలతో పాటు 50 వేల ఎకరాల్లో చిరుధాన్యాల సాగుకు రాయితీలు అందించనున్నాం. ఇలా దశల వారీగా రానున్న నాలుగు సీజన్లలో కనీసం 3 లక్షల ఎకరాల్లో పంటల మార్పిడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ ప్రోత్సాహకాలు ఇలా.. బోర్ల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు అనేక ప్రోత్సాహకాలు అందించబోతోంది. బోర్ల కింద అపరాలకు రూ.9వేలు, నూనెగింజలకు రూ.10వేలు, బోర్లతోపాటు మైదాన ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు హెక్టార్‌కు రూ.6వేల విలువైన విత్తనాలు, విత్తనశుద్ధి చేసే రసాయనాలు, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. వీటితో పాటు రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన మినీ ప్రాసెసింగ్ యూనిట్లు 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్ ఇంట్రస్ట్ గ్రూపులకు (ఎఫ్ఐజీ) అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు పండించే రైతుల గ్రూపులకు ప్రభుత్వం 150 యూనిట్లు ఇవ్వనుంది. -
నిండుకుండల్లా జలవనరులు.. రబీకి జలసిరులు
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో జలసిరులు తాండవిస్తున్నాయి. గడిచిన మూడేళ్లుగా చెరువులు, ప్రాజెక్ట్‌ల్లో నీరు పుష్కలంగా ఉంది. నదులు పొంగిపొర్లుతున్నాయి. జలవనరుల్లో నీటి లభ్యతనుసరించి ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు అంచనాలకు తగినట్లుగా కేటాయించిన సాగునీటి వినియోగం తగ్గింది. జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు ఏ మాత్రం తగ్గకపోవడంతో పాటు, కార్తెలకు తగినట్లుగా వర్షాలు కురుస్తుండడంతో నీటి నిల్వలకు కొదవలేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు కేటాయించిన నీటి వినియోగం జరగలేదు. తాజాగా రబీకి నీటి కేటాయింపులను ఆదివారం ఐఏబీ సమావేశంలో నిర్ణయించనున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జిల్లాలో నీటికి కొరతే లేదు. జలాశయాలు పూర్తి సామర్థ్యానికి చేరుకుంటున్నాయి. రైతుల్లో నీటి గురించి ఏ మాత్రం చింత లేదు. సోమశిల, కండలేరు ప్రాజెక్ట్‌లతో పాటు మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం, నెల్లూరు పెన్నా బ్యారేజీ పూర్తయిన తర్వాత జరిగే మొట్టమొదటి ఐఏబీ సమావేశం. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 66.192 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల ఆరంభంలోనే సోమశిల 76 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమశిలకు భారీగా వరద రావడంతో అంతే సామర్థ్యంలో నీటిని పెన్నానది ద్వారా సముద్రానికి వదిలేస్తున్నారు. ప్రస్తుతం 45,885 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. రానున్న రోజుల్లో కురిసే వర్షాలకు వచ్చే వరద నీటిని సమన్వయం చేసుకుంటూ డిసెంబర్ నెలకు 78 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డెడ్ స్టోరేజీ, తాగునీటి అవసరాలు, రాళ్లపాడు జలాశయం, నీటి ఆవిరి శాతం పోనూ మొత్తం 65.102 టీఎంసీల నీటిని రబీ సీజన్లో ఇప్పటికే స్థిరీకరించిన ఆయకట్టుతో పాటు తాజాగా స్థిరీకరించిన అదనంగా 55.1000 ఎకరాలకు నీటిని అందించనున్నారు. పది వేల ఎకరాలకు ఒక టీఎంసీ అందించే అవకాశం ఉంది. దీన్ని బట్టి సోమశిల కింద సుమారు 6.50 లక్షల ఎకరాలు సాగునీటిని అందించనున్నారు. కండలేరు కింద 3.50 లక్షల ఎకరాలు కండలేరు జలాశయంలో ప్రస్తుతం 53.852 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డిసెంబర్ నాటికి డెడ్ స్టోరేజీ నీటి ఆవిరి మినహా 60.854 టీఎంసీలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగుగంగ పథకం కింద చెన్నై నగరానికి నీటి సరఫరాతో పాటు నెల్లూరు జిల్లాలో 74,436 ఎకరాలకు, తిరుపతి జిల్లాలో 1,72,423 ఎకరాల మెట్ట భూములతో పాటు చెరువుల కింద 1.08,357 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. చెన్నై తాగునీటి అవసరాలకు, రాపూరు, పొదలకూరు, వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు, స్వర్ణముఖి బ్యారేజీకి తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు నీటిని కేటాయించనున్నారు. ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా పరిషత్‌లో 10 గంటలకు సాగునీటి సలహా మండలి సమావేశం కానుంది. నీరు సమృద్ధిగా ఉండడంతో ఐఏబీ సమావేశంలో నీటి కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నారు. -
ఖరీఫ్ సాగు భళా..
కడప అగ్రికల్చర్: ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడం.. ప్రాజెక్టులు నిండటం.. కేసీ కెనాల్‌కు నీరు రావడంతో పంటలసాగు ఆశాజనకంగా ఉంది. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఖరీ‹ఫ్ సీజన్‌కు సంబంధించి సాధారణం కంటే అధికశాతంలో పంటలు సాగయ్యాయి. కొన్ని పంటలు వందశాతం, మరికొన్ని రెండువందల శాతం, ఇంకొన్ని మూడువందలశాతంపైగా కూడా సాగయ్యాయి. జిల్లాలో ఈ ఏడాది సోయాబీన్ పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగై రికార్డు సృష్టించింది. జిల్లాలో ఖరీఫ్ పంటల సాధారణ విస్తీర్ణం 91991 హెక్టార్లు ఉండగా ఖరీఫ్ ముగిసే ఆక్టోబర్ 15వ తేదీ నాటికి జిల్లాలో 1,10,514 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ పంటలు సాగు చేశారు. సాధారం కంటే ఈ ఏడాది 18,523 హెక్టార్లలో అధికంగా పంటలు సాగై 120.14 శాతం నమోదైంది. దీంతోపాటు ఈ క్రాపు, ఈకేవైసీ నమోదులోనూ రాష్ట్రంలోనే వైఎస్సార్‌జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. అత్యధికంగా సాగైన సోయాబీన్ ఈ ఏడాది జిల్లాలో సోయాబీన్ పంటను అత్యధికంగా సాగు చేశారు. పొద్దుటూరు, పులివెందుల, పెద్దముడియం, జమ్మలమడుగు, వేముల, వేంపల్లి, వీఎన్పల్లెతో పాటుపలు మండలాల్లో ఈ పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. జిల్లాలో సోయాబీన్ సాధారణ సాగు 63 హెక్టార్లు కాగా ఈ ఏడాది 3,753 హెక్టార్లలో సాగు చేశారు. గతంలో మెట్టప్రాంతంలో ఏ పంటను సాగు చేయకుండా ఏగిలి పెట్టుకుని రబీ ప్రారంభం కాగానే శనగ సాగు చేసుకునేవారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడం, పంటదిగుబడి కాలం 70 నుంచి 80 రోజులు కావడంతో ఎక్కువ మంది సోయాబీన్ ఖరీఫ్‌లో సాగు చేసుకున్నారు. తగ్గిన వరి విస్తీర్ణం జిల్లాలో ఈ ఏడాది వరి సాగు తగ్గింది. సాధారణం కంటే కూడా తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేశారు. జిల్లాలో వరి సాధారణ సాగు 32,741 హెక్టార్లు ఉండగా ఈ ఏడాది 27,058 ఎకరాల్లో మాత్రమే సాగైంది. నీటి వసతి సమృద్ధిగా ఉన్నా చాలా మంది ఆరుతడి పంటలవైపే మొగ్గుచూపారు. వరి సాగుకు ఖర్చులు పెరగడం, తెగుళ్లు ఎక్కువగా ఉండటం, పంట దిగుబడి సమయానికి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది చాలా మంది రైతులు సాగు తగ్గించారు.కొందరు రెండోపంటగా వరి సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల కూడా సాగు విస్తీర్ణం తగ్గిందనే చెప్పాలి. రెండో పంట దిగుబడి సమయానికి తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల బెడద తగ్గుతుంది.అందువల్ల రైతులు ఆ ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తగ్గిన వేరుశనగ..పెరిగిన మినుము సాగు విస్తీర్ణం... జిల్లాలో ఈ ఏడాది వేరుశనగ సాగు విస్తీర్ణం కూడా బాగా తగ్గింది. సాధారణ సాగు 7,454 హెక్టార్లు ఉండగా ఈ ఏడాది 3,787 హెక్టార్లలో మాత్రమే సాగైంది. గత ఖరీఫ్‌లో జిల్లాలో 22,503 హెక్టార్లలో సాగైంది. మినుముకు సంబంధించి 1268 హెక్టార్లో సాధారణ సాగు ఉండగా 3838 హెక్టార్లలో సాగైంది. ఇతర పంటల సాగు వివరాలు ఇలా... జిల్లాలో పత్తి 17,303 హెక్టార్లలోసాగు చేయాల్సి ఉండగా 46,263 హెక్టార్లలో సాగై 267.37 శాతంగా నమోదైంది కుసుమ పంట 4 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 11 ఎకరాల్లో సాగైంది. పొద్దుతిరుగుడు పంట 874 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 1870 హెక్టార్లలో సాగై 206.75 శాతం, టమాటా 1246 హెక్టార్లకుగాను 2041 హెక్టార్లలోసాగై 136 శాతం, ఉల్లి 3603 హెక్టార్లకుగాను 3690 హెక్టార్లలో సాగై 109.91 శాతం, రాగి 4 ఎకరాలకుగాను 7 ఎకరాల్లో సాగై 175 శాతం, ఆముదం 534 హెక్టార్లకుగాను 1031 ఎకరాల్లోసాగై 193.07 శాతం సాగయ్యాయి. çసజ్జలు, మొక్కజొన్న, కందులు, మిరప పంటలు సాధారణం కంటే తక్కువ హెక్టార్లలో సాగయ్యాయి. పంటల సాగు విస్తీర్ణం పెరిగింది ఈ ఏడాది ప్రాజక్టుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఖరీఫ్ సీజన్లో పంటలసాగు ఆశాజనకంగా ఉంది. సాధారణం కంటే అధికంగా సాగైంది. ఈ ఏడాది ఈ క్రాపు, ఈకే వైసీని కూడా వందశానికి మించి చేసి రాష్ట్రంలోనే వైఎస్సార్ జిల్లా ప్రథమస్థానంలో నిలిపాం. చాలా సంతోషంగా ఉంది. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి -
గుండ్లకమ్మ నుంచి ఖరీఫ్‌కు నీరిస్తాం
మద్దిపాడు: వచ్చే రబీ సీజన్‌కల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్‌కు, వచ్చే రబీ సీజన్లో పంటలకు ప్రాజెక్టు నుంచి నీరందిస్తామని, తాగు నీరు కూడా అందిస్తామని తెలిపారు. ఆయన శనివారం ప్రకాశం జిల్లాలోని కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయాన్ని పరిశీలించారు. గడ్డర్లు ఊడిపోయిన మూడో గేటును పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజర్వాయర్‌లో నీటిని 1.25 టీఎంసీలకు తగ్గించి పనులు చేస్తామన్నారు. సాగు నీటి సరఫరాకు ఏ ఇబ్బందీ కలగదని, అవసరమైతే సాగర్ కాలువల ద్వారా రిజర్వాయర్ నింపుతామని తెలిపారు. మూడో నంబర్ గేటుతో పాటు మరో తొమ్మిది గేట్లకు మరమ్మతులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారన్నారు. ఈ పనులకు కాంట్రాక్టర్‌ను కూడా ఖరారు చేశామని చెప్పారు. నీరు కిందకు పోవడంవల్ల రైతులకు నష్టం జరుగుతోందంటూ టీడీపీ అధినాయకుడి డైరెక్షన్లో పచ్చ పత్రికలు వికృత భాషలో వండి వారుస్తున్నాయని మండిపడ్డారు. గేటు విరగడం నిన్న, మొన్న జరిగింది కాదని, 2014 – 19 మధ్య టీడీపీ ప్రభుత్వం రిజర్వాయర్‌కు మరమ్మతులు చేయించలేదని తెలిపారు. వారి హయాంలో మరమ్మతులకు రూ.6 కోట్లు మంజూరు చేయించుకుని గేట్లు, స్పిల్‌వేను పట్టించుకోలేదని చెప్పారు. ఆ డబ్బుతో రిజర్వాయర్ వద్ద బ్యూటిఫికేషన్, గెస్ట్ హౌస్‌లు అంటూ టీడీపీ నేతలు కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. పచ్చ పత్రికలకు ఇవేమీ కనిపించవని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పులిచింతలలో కొట్టు కుపోయిన గేటు రిపేరు చేస్తున్నామన్నారు. డ్యాములకు రిపేర్లు రావడం ఈ రోజు వచ్చిన సమస్య కాదని చెప్పారు. గత ప్రభుత్వం డ్యాముల నిర్వహణను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్ని డ్వామ్‌లకు మరమ్మతులు చేపడతామని అన్నారు. రాష్ట్రానికి ఏ పరిశ్రమ రాకూడదని ప్రతిపక్షం కుట్రలు పన్నుతోందన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ రాకుండా కేంద్రానికి టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు పర్యావరణ ఇబ్బందులు వస్తాయంటూ లేఖలు రాస్తున్నారని, ఇదేం పద్ధతని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాలకు మాత్రమే డ్రగ్ పార్కులకు అవకాశం దక్కిందన్నారు. డ్రగ్ పార్క్ ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, వేలాది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. అటువంటి ప్రాజక్టును అడ్డుకోవడం వారి దుర్బుద్ధికి నిదర్శనమని చెప్పారు. -
సాగులో ‘డ్రోన్స్’
సాక్షి, అమరావతి: వ్యవసాయ పనుల్లో సాంకేతిక పరికరాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. మనుషులపై దుష్ప్రభావం చూపే రసాయన ఎరువులు, పురుగు మందుల పిచికారీ వంటి పనులకు డ్రోన్ల వినియోగానికి చర్యలు చేపట్టింది. వచ్చే రబీ సీజన్‌లోగా డ్రోన్లను అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపట్టింది. వ్యవసాయంలో రైతులకు సాయం చేయడానికి కృత్రిమ మేథస్సుతో కూడిన డ్రోన్స్ అండ్ సెన్సార్ టెక్నాలజీను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్రంలోని ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల (సీహెచ్‌సీ) ద్వారానే వీటినీ రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. తొలి దశలో మండలానికి 3 ఆర్బీకేల చొప్పున కనీసం 2 వేల ఆర్బీకేల్లో డ్రోన్లను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం మండల పరిధిలో ఎక్కువ విస్తీర్ణం కల్గిన ఆర్బీకేలను ఎంపిక చేస్తున్నారు. వీటి పరిధిలో ఏ పంటల విస్తీర్ణం ఎంత ఉంది? ఏ సీజన్లో ఎంత ఎరువులు, పురుగుల మందులు వినియోగిస్తారో అంచనా వేస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణం, ఎక్కువ మంది రైతులకు లబ్ధి కలిగేలా డ్రోన్లను ఏర్పాటు చేస్తున్నారు. సబ్సిడీపై డ్రోన్లు ఒక్కో డ్రోన్, దాని అనుబంధ పరికరాల అంచనా వ్యయం రూ.10 లక్షలు. వీటి వినియోగానికి కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రైతులతో కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీరికి ప్రత్యేకంగా మాస్టర్ ట్రైనర్స్ ద్వారా శిక్షణనిచ్చి, సర్టిఫికెట్లను కూడా ఇస్తారు. డ్రోన్లకు సబ్సిడీ కూడా వస్తుంది. చదువుకోని రైతులకు 40 శాతమే సబ్సిడీ వస్తుంది. అదే చదువుకున్న రైతులతో ఏర్పాటు చేసే సీహెచ్‌సీలకు 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. డ్రోన్ల నిర్వహణలో ఫలితాలు వస్తాయి. డ్రోన్‌తో మందులు, ఎరువులు చల్లే విధానంతో వీడియోలూ రూపొందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా 30 వేల ఎకరాల్లో ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఇప్పటికే డ్రోన్స్ అండ్ సెన్సార్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. పురుగు మందుల పిచికారీకి పుష్పక్–1, ఎరువులు, విత్తనాలు చల్లడానికి పుష్పక్–2 అనే రెండు రకాల డ్రోన్లను తయారు చేశారు. ఆటోమేటిక్ స్ప్రేయింగ్ మెకానిజంతో 8 కిలోల బరువుండే అగ్రికల్చర్ డ్రోన్లను రూపొందించారు. వీటికి కేంద్రం నుంచి అనుమతులు పొందారు. పది రకాల పంటల సాగులో వీటి వినియోగంపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఒపీ)ను రూపొందించింది. ప్రయోగాత్మకంగా గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 30 వేల ఎకరాల్లో ఈ డ్రోన్లతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పురుగుల మందులు, ఎరువులు చల్లిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, చెరకు పంటల్లో వీటిని వినియోగిస్తున్నారు. డ్రోన్లతో ఉపయోగాలెన్నో.. ► మనుషులతోకన్నా 60 శాతం వేగంగా మందులు, ఎరువులు చల్లొచ్చు ► మోతాదుకు మించి రసాయనాల వినియోగానికి అడ్డుకట్ట వేయొచ్చు ► అవసరమైన ప్రాంతంలోనే అవసరమైనంతే పిచికారీ చేయొచ్చు ► తద్వారా రైతులకు ఖర్చు కూడా తగ్గుతుంది ► వైపరీత్యాల కారణంగా నష్టాన్ని డ్రోన్ చిత్రాలతో సులభంగా, త్వరితగతిన అంచనా వేయొచ్చు ► సులువుగా ఎక్కడికై నా తీసుకెళ్లవచ్చు. ► తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చు. ► పంట విస్తీర్ణం. సరిహద్దులను రిమోట్ సెన్సింగ్ చిత్రాల ద్వారా గుర్తించవచ్చు సాధ్యమైనంత త్వరగా సీహెచ్‌సీల ఏర్పాటు డ్రోన్ల ఎంపిక, వినియోగంపై కేంద్రం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఈలోగా క్షేత్రస్థాయిలో ఆర్బీకేల ఎంపిక, సీహెచ్‌సీల కోసం పట్టభద్రులైన రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాం. సాధ్యమైనంత త్వరగా వీరితో సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తాం. కేంద్రం నుంచి మార్గదర్శకాలు రాగానే ఎంపిక చేసిన వారికి శిక్షణనిచ్చి గడువులోగా గ్రౌండింగ్ చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయశాఖ -
పొలంబడి.. కొత్త ఒరవడి
కడప అగ్రిక్చలర్: సేద్యం లాభసాటి కావాలి. సాంకేతిక సలహాలు, సాగు అధ్యయన అంశాలపై రైతులకు అవగాహన పెరగాలి. వ్యవసాయ అధికారులు పొలం వద్దకే వెళ్లి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసి శాస్త్రీయ సాగు విధానాన్ని ప్రయోగాత్మకంగా వివరించాలనే ఉద్దశంతోతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ పొలంబడి కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో ప్రతి రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే) పరిధిలో ఒక పొలంబడిని నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేశారు. జిల్లావ్యాçప్తంగా 387 పొలంబడులను ఎంపిక చేశారు. ఇందులో వరి, పత్తి, అపరాలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, చిరుధాన్యాలు పంటలు ఉన్నాయి. రైతులకు సాంకేతిక సలహాలు, సాగు ఆధ్యయన అంశాలను వివరించడం ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు డాక్టర్ వైఎస్సార్ పొలంబడి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తక్కువ òపెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడిని ఎలా సాధించవచ్చు? ఇందుకు శాస్త్రయ సాగు విధానం ఎలా ఉపయోగపడుతుందో రైతులకు ప్రయోగాత్మకంగా వివరిస్తారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మండలానికి ఒకటి, రెండు చొప్పున మాత్రమే పొలంబడులను నిర్వహించేవారు. అది కూడా కొన్ని పంటలకు మాత్రమే పరిమితం చేసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చింది. అన్ని పంటలకూ పొలంబడి నిర్వహించేలా కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం బేస్‌లైన్ సర్వేను నిర్వహిస్తున్నారు. త్వరలో సాగుకు అనుగుణంగా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1,93, 000 ఎకరాలు. ఇందులో వరి 32,741 హెక్టార్లలో, వేరుశనగ 7,454 హెక్టార్లలో, పత్తిపంట 17,303 హెక్టార్లలో, కందిపంట 3,685 హెక్టార్లలో, జొన్న 2021 హెక్టార్లలో, సజ్జలు 1,091 హెక్టార్లలో, మిరప 1070 హెక్టార్లలో, పసుపు 3420 హెక్టార్లలో, ఉల్లి 3603 హెక్టార్లలో, మొక్కజొన్న 624 హెక్టార్లలో, మినుములు 1268 హెక్టార్లలో, పొద్దు తిరుగుడు 874 హెక్టార్లలో, పెసర 225 హెక్టార్లలో, అముదం 534 హెక్టార్లలో సాగు చేయనున్నారు. ఇందులో ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక పొలంబడి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పంటలసాగు చేపట్టగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ∙తక్కువ పెట్టబడితో నాణ్యమైన అధిక దిగుబడి సాధించేలా చూడటం. ∙ఇందులో ఎంపిక చేసిన గ్రామాల్లో 10 హెక్టార్లను గుర్తించి 20 నుంచి 30 మంది రైతులను భాగస్వాములను చేసి సహజ సి ద్ధవనరులతో సాగు చేయించడం. ∙భూసార పరీక్ష ఫలితాల అధారంగా ఎరువుల వినియోగంపై చైతన్యం కల్పించడం. ∙వానపాములు, సేంద్రియ ఎరువుల వాడాకాన్ని పెంచి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిచేలా చూడటం. ∙ విత్తన శుద్ధితో చీడపీడల నివారణ, అంతర మిశ్రమ పంటల ద్వారా మిత్ర పురుగు వృద్ధి, పక్షి స్థావరాల ఏర్పాటు ఆవశ్యకత గురించి తెలియజేయడం. ∙రైతులను సాగు శాస్త్రవేత్తలుగా ఎదిగేలా చేయడం, స్వయం నిర్ణయం తీసుకునేలా.. సాధికారత సాధించేలా సమగ్రశిక్షణ ఇచ్చేలా కార్యక్రమానికి రూపకల్పన చేయడమే కార్యక్రమం ఉద్దేశం. ప్రతి నెల మంగళవారం నుంచి శుక్రవారంలోపు పొలంబడి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తారు. ప్రతి గ్రా మంలో 14 వారాలపాటు 30 మంది రైతులతో స్థానికంగా సాగు చేస్తున్న పంటలపై శిక్షణ ఇస్తారు. శత్రు, మిత్ర పురుగుల ఉనికిని గుర్తించి మిత్ర పురుగుల సంరక్షణపై అవగాహన కల్పిస్తారు. పంటలో చీడపీడల పరిశీలన, వాటి నివారణకు తీసుకోవాల్సిన పద్దతులను వివరిస్తారు. రైతు లతో ముఖాముఖి మాట్లాడి శాస్త్రీయ సాగు విధానంపై పూర్థిస్థాయిలో అవ గాహన కల్పిస్తారు. సాగులో ఎదురయ్యే ఆటుపోట్లును అధిగమించేలా సాంకేతిక సలహాలిస్తారు. సాగు పెట్టుబడి వ్య యం 15 శాతం తగ్గించడం, దిగుబడిలో 15 శాతం అధికంగా అందేలా ప్రణాళికలను రూపొందిస్తారు. గ్రామస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ సహాయకులు నిర్వహించే పొలంబడి కార్యక్రమాన్ని వ్యవసాయ విస్తరణాధికారి, మండల వ్యవసాయ అధికారి, మండలస్థాయిలో పర్యవేక్షిస్తారు. సబ్‌డివిజన్ స్థాయిలో ఏడీఏæ, జిల్లాస్థాయిలో జేడీఏ పర్యవేక్షిస్తారు. త్వరలో కార్యక్రమం ప్రారంభిస్తాం జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్‌కు 387 పొలంబడి కా ర్యక్రమాలు నిర్వహించనున్నాం. త్వరలో ప్రారంభంకానున్న సీజన్‌కు అను గుణంగా ఆయా పంటల సాగు నుంచే కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఈ సారి విద్యార్థి దశ నుంచే వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈసారి కొత్తగా విద్యార్థులను ఈ కార్యక్రమంలో మమేకం చేయనున్నాం. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
పల్నాడు ప్రవర్ధిని
పల్నాడు జిల్లా ధాన్యసిరులతో తుల తూగనుంది. రబీలో సాగు చేసిన వరి పొలాలు కోతకొచ్చాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 40 బస్తాల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో పంట సేకరణకూ ప్రభుత్వం సిద్ధమైంది. 211 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రబీలో 72,731 ఎకరాల్లో వరి సాగైంది. ప్రధానంగామాచర్ల, గురజాల, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని రైతులు వరి పంట వేశారు. ప్రస్తుతం పంట కోతదశకొచ్చింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు దిగుబడిని అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఇందులో లక్ష మెట్రిక్ టన్నల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 211 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వరికి మద్దతు ధర కూడా ప్రకటించింది. సూపర్ ఫైన్ రకం క్వింటాకు రూ.1960, దుడ్డురకం క్వింటాకు రూ.1940 చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఖరీఫ్ కంటే భేష్ గత ఖరీఫ్ సీజన్లో సేద్య ఖర్చులు పెరగడంతోపాటు ఎలుకల బెడదతో దిగుబడి తగ్గింది. ఎకరానికి 20 సెంట్ల నుంచి 30 సెంట్లలోని పంటను ఎలుకలు పాడుచేశాయని రైతులు చెబుతున్నారు. దీనివల్ల ఎకరానికి 30 బస్తాలే దిగుబడి వచ్చిందని పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు రబీ సీజన్ ఆశాజనకంగా ఉందని, ఖరీఫ్ మిగిల్చిన స్వల్ప నష్టాలను రబీ భర్తీ చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రబీలో చీడపీడల బెడద లేదని చెప్పారు. ఎకరానికి 40 బస్తాలకు తగ్గకుండా దిగుబడి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సాగర్ ఆయకట్టులో నీటి లభ్యత గతేడాది కంటే అధికంగా ఉండడం కూడా కలిసొచ్చిందని, ఏప్రిల్ 15 వరకు సాగు జలాలు విడుదలయ్యాయని తెలిపారు. కొనుగోళ్లకు ఏర్పాట్లు జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు్ల చేశాం. సోమ వారం నుంచి ఎక్కడైతే ధాన్యం పండించారో అక్కడే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. గన్నీ బ్యాగులు, తేమను కొలిచే పరికరాలు సిద్ధం చేశాం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే పంటను కొంటాం. – ఎ.శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ ‘రబీ’ బాగుంది నాకున్న నాలుగెకరాల పొలంలోని రెండెకరాల్లో ఖరీఫ్‌లో వరిసాగు చేశా. 65 బస్తాల దిగుబడి వచ్చింది. రబీలో మూడెకరాలు పంట వేశా. దిగుబడి బాగుంది. చీడపీడలు లేవు. ఎలుకల బాధ అంతగా లేదు, ఖర్చు తక్కువగా ఉంది. ఎకరానికి 40 బస్తాలకు పైగా దిగుబడి 120 బస్తాల వరకు దిగుబడి వస్తుందని భావిస్తున్నా. మరో మూడు నాలుగు రోజుల్లో వరికోత కోస్తా. – షేక్.సైదాసాహెబ్, విప్పర్ల, రొంపిచర్ల మండలం దిగుబడి పెరిగింది ఖరీఫ్‌లో ఆరెకరాలు వరిసాగు చేయగా 175 బస్తాలు దిగుబడి వచ్చింది. రబీలో మళ్లీ ఆరెకరాలు సాగు చేశా. ఈసారి పంట చాలా బాగుంది. పెట్టుబడి వ్యయం తగ్గింది. ఆరెకరాల మీద 240 బస్తాల వరకు దిగుబడి వస్తుందని భావిస్తున్నా. 75 కేజీల బస్తా రూ.1500 వరకు పలుకుతుందని ఆశిస్తున్నా. ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. – చిలకా ఆదేయ్య, మాచవరం, రొంపిచర్ల మండలం -
పప్పు ధాన్యాల కొనుగోళ్లు షురూ
సాక్షి, అమరావతి: రబీ సీజన్లో రైతులు పండించిన పప్పు ధాన్యాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటికే శనగలు, కందుల కొనుగోళ్లు మొదలవగా.. ఏప్రిల్ మొదటి వారం నుంచి పెసలు, మినుములను కొనుగోలు చేసేందుకు మార్క్ ఫెడ్ ద్వారా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కనీస మద్దతు ధర చెల్లించి రూ.10.47 కోట్ల విలువైన 2,047 టన్నుల శనగల్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా రూ.14 లక్షల విలువైన 22 టన్నుల కందులను ఇప్పటివరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో 1,26,270 టన్నుల శనగలు, 91,475 టన్నుల మినుములు, 19,632 టన్నుల పెసలు కొను గోలు చేసేందుకు అనుమతినిచ్చింది. శనగలకు క్వింటాల్ రూ.5,230, పెసలు రూ.7,275, మినుము, కందులకు రూ.6,300 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. శనగలు క్వింటాల్ రూ.4,800 నుంచి రూ.5,000, పెసలు క్వింటాల్ రూ.6,500 నుంచి రూ.6,800 వరకు మాత్రమే ధర ఉండటంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఆ ఇబ్బంది లేకుండా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం ద్వారా రైతులను ఆదుకోనుంది. ఎస్ఎంఎస్ ద్వారా రైతుకు సమాచారం పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. ప్రతి రైతు రబీలో సాగు చేసిన పంట వివరాలను సమీప ఆర్బీకేలో నమోదు చేసుకోవాలి. కొనుగోలు సందర్భంగా సన్న, చిన్నకారు రైతులకే ప్రాధాన్యత ఇస్తారు. పంట కోత ల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. పంట సేకరణ తేదీ, కొనుగోలు కేంద్రం సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా రైతులకు తెలియజేస్తారు. దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. కొనుగోలు వేళ రైతులకు ఈ–రసీదు ఇస్తారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్ఎఫ్ ఐడీ ట్యాగ్ వేస్తారు. చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఈ–సైన్ (ఈ–హస్తాక్షర్) అమలు చేస్తున్నారు. నాణ్యత (ఎఫ్ఏక్యూ) ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరిగేలా థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తున్నారు. -
Andhra Pradesh: అన్నదాతకు విరివిగా రుణాలు
సాక్షి, అమరావతి: విత్తనాల నుంచి విక్రయాల దాకా అడుగడుగునా అన్నదాతలకు తోడుగా నిలుస్తూ చేయి పట్టి నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషితో వ్యవసాయదారులకు బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేస్తున్నాయి. ముందెన్నడూలేని రీతిలో బ్యాంకర్లు రుణ వితరణతో ప్రభుత్వ సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు. గతంలో రుణాల కోసం రైతన్నలు కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకు పోయేవారు. గత మూడేళ్లుగా అడిగిందే తడవుగా అన్నదాతలకు రుణాలు మంజూరవుతున్నాయి. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రస్తుత రబీ సీజన్లో రుణాల మంజూరుకు శ్రీకారం చుట్టారు. వంద శాతం లక్ష్యం దిశగా.. 2021–22 సీజన్లో 1.08 కోట్ల మంది రైతన్నలకు రూ.1.48 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు 75.78 లక్షల మందికి రూ.1.23 లక్షల కోట్ల మేర మంజూరయ్యాయి. ఖరీఫ్‌లో లక్ష్యం రూ.86,981 కోట్ల రుణాలు కాగా 50.88 లక్షల మంది రైతులకు రూ.70,531 కోట్ల రుణాలు (81 శాతం) ఇవ్వగలిగారు. స్వల్ప కాలిక రుణాలు 45.88 లక్షల మందికి రూ.56,940 కోట్లు అందాయి. దీర్ఘకాలిక రుణాలు 4.72 లక్షల మందికి రూ.10,966 కోట్లు ఇచ్చారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన కోసం 27,345 మందికి రూ.2625 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుత రబీ సీజన్లో 44.19 లక్షల మందికి రూ.61,518 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటికే 34.90 లక్షల కుటుంబాలకు రూ.52,659 కోట్ల రుణాలు మంజూరు చేశారు. షార్ట్ టర్మ్ రుణాలు 13 లక్షల మందికి రూ.28,281 కోట్లు, లాంగ్ టర్మ్ రుణాలు 8.28 లక్షల మందికి రూ.17,948 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 66,981 మందికి రూ.6,430 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రబీలో మంజూరైన రుణాల్లో ఆప్కాబ్, డీసీసీబీల ద్వారా పంట రుణాలు 6,595.64 కోట్లు, షార్ట్ టర్మ్ రుణాలు రూ.4,893.63 కోట్లు, లాంగ్ టర్మ్ రుణాలు రూ.5,255.92 కోట్లు మంజూరు చేశారు. మరోవైపు కౌలుదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీజన్లోనూ ఆర్థిక చేయూత అందిస్తోంది. వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తోంది. ఇబ్బంది లేకుండా రుణం.. ప్రస్తుత రబీ సీజన్లో నాకున్న ఎకరం పొలంలో జొన్న సాగు చేశా. స్థానిక సహకార బ్యాంకులో రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. ఆర్బీకేలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా. ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణం మంజూరైంది. చాలా సంతోషంగా ఉంది. – పెండ్యాల సురేష్, గొడవర్రు, కృష్ణా జిలా నూరు శాతం లక్ష్యాన్ని అధిగమిస్తాం.. 2021–22 సీజన్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలిచ్చేలా చర్యలు చేపట్టాం. మూడో త్రైమాసికం ముగిసే నాటికే 86 శాతం లక్ష్యాన్ని అధిగమించాం. ఈ నెలాఖరులోగా వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం. – వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ -
ఊపందుకున్న రబీ.. సాగు లక్ష్యం 60 లక్షల ఎకరాలు
సాక్షి, అమరావతి: అకాల వర్షాలు, భారీ వరదలతో మొదలైన రబీ సీజన్ క్రమంగా ఊపందుకుంటోంది. మొత్తం సాగు లక్ష్యంలో ఇప్పటికి మూడో వంతు పూర్తయింది. రాయలసీమ జిల్లాల్లో పెద్దఎత్తున పంటలు దెబ్బతినడంతో ఇక్కడ రెండోసారి విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు కాగా.. 2018–19లో 53.04 లక్షలు, 2019–20లో 54.66 లక్షల ఎకరాల్లో సాగైంది. చదవండి: నిండుగా తుంగభద్ర.. రికార్డు స్థాయిలో నీటి నిల్వలు గతేడాది రెండో పంటకు నీరివ్వడం, వాతావరణం కలిసి రావడంతో 62 లక్షల ఎకరాల్లో సాగైంది. రబీ చరిత్రలో ఇదే రికార్డు. ప్రస్తుతం రబీలో 60 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. గతేడాది ఇదే సమయానికి 124.45 లక్షల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది వర్షాలు, వరదల ప్రభావంతో ఇప్పటివరకు 21.82 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. గోదావరి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో రెండో పంటకు నీరిచ్చే పరిస్థితి లేకపోవడం, బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో గతేడాదితో పోలిస్తే వరి సాగు తగ్గనుండగా అపరాలు, చిరు ధాన్యాల విస్తీర్ణం పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. వరి లక్ష్యం 21.50 లక్షల ఎకరాలు రబీలో వరి సాధారణ విస్తీర్ణం 17.60 లక్షల ఎకరాలు కాగా.. 2019–20లో 19.38 లక్షల ఎకరాలు, 2020–21లో 23.49 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 21.50 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు 3.33 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది ఇదే సమయానికి 4.67లక్షల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది వర్షాలు, వరదలవల్ల నాట్లు మందకొడిగా సాగుతున్నాయి. పెరగనున్న అపరాల సాగు ఇక ముతక ధాన్యాలు 8.2 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 2.05 లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. 1.13 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 87వేల ఎకరాల్లో జొన్నలు సాగయ్యాయి. అపరాల సాగు లక్ష్యం ఈ ఏడాది 24.15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 14.07 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 14.32 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అలాగే, ఇప్పటివరకు 8.22 లక్షల ఎకరాల్లో కందులు, 4.77 లక్షల ఎకరాల్లో మినుములు, 60వేల ఎకరాల్లో పెసలు సాగయ్యాయి. నూనె గింజల సాగు లక్ష్యం 3.67 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 1.17లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వేరుశనగ 95 వేల ఎకరాల్లో సాగైంది. పొగాకు సాగు లక్ష్యం 1.77 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 72 వేల ఎకరాల్లో సాగైంది. మిరప సాగు లక్ష్యం 75 వేల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 37 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. రాయలసీమలో రికార్డు వర్షపాతం సీజన్ ఆరంభంలోనే ఈసారి భారీ వర్షపాతం నమోదైంది. ఈశాన్య రుతు పవనాల సీజన్లో 24.3 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 294 మి.మీ.ల వర్షపాతం కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 365.9 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. రాయలసీమ జిల్లాల్లో 235.7 మి.మీ.లు కురవాల్సి ఉండగా, 431.2 మి.మీ.ల వర్షపాతం (82.9 శాతం అధికం) కురిసింది. కోస్తాంధ్రలో 381.2 మి.మీ.ల వర్షపాతానికి 416.2 మి.మీ.ల వర్షపాతం (9.2 శాతం అధికం) కురవగా, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో 271.7 మి.మీ.ల వర్షపాతానికి 259.4 మి.మీ.ల వర్షపాతం (–4.5 శాతం తక్కువ) కురిసింది. మళ్లీ నారు పోశాం 20 ఎకరాల్లో నెల్లూరు జీలకర్ర సన్నాలు రకం వరి నారుమడి వరదలకు కొట్టుకుపోయింది. 80 శాతం సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చిన విత్తనంతో మళ్లీ నారుమళ్లు పోసుకున్నా. నాట్లు వేయాలి ఇక. – పి.విశ్వనాథ్, నెల్లూరు జిల్లా బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు అకాల వర్షాలు, వరదలతో రబీ సీజన్ మొదలైంది. నారుమళ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో మళ్లీ పోసుకుంటున్నారు. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేపట్టాలని ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈసారి అపరాలు, చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నాం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి -
చిరుధాన్యాలు, నూనె గింజలను సాగు చేయండి
సాక్షి, అమరావతి: వరికి మించిన ఆదాయం రావడమే కాకుండా తక్కువ నీటి వసతితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు చిరుధాన్యాలు, నూనె గింజల పంటల్ని సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అధికారికంగా ప్రారంభమైన రబీ సీజన్లో సాగు చేసే దాళ్వా వరికి బదులు పలు రకాల వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. మొక్కజొన్న.. మొక్కజొన్న పంటను కోస్తా జిల్లాల్లో జనవరి 15 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 8 కిలోల విత్తనం వాడాలి. మొక్క తొలి దశలో ఆశించే పురుగులను నివారించటానికి సయాట్రినిప్రోల్, థయోమిథాక్సామ్ మందును 4 మి.లీ. కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి ఎకరానికి 26,666 నుండి 33,333 మొక్కల సాంద్రత ఉండేలా చూడాలి. రబీ జొన్న రబీకి అనువైన సూటి రకాలు: ఎన్టీజే 4, ఎన్టీజే 5, ఎన్ 15, సీఎస్వీ 216, ఆర్సీఎస్వీ 14, ఆర్ఎం 35–1, సీఎస్వీ 18, సీఎస్వీ 22 అనుకూలమైన హైబ్రిడ్ రకాలు: సీఎస్హెచ్ 15, ఆర్సీఎస్హెచ్ 16, సీఎస్హెచ్ 19, సీఎస్హెచ్ 31 ఆర్. ఈ వారంలో విత్తుకోవచ్చు. ఎకరాకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తేటప్పుడు వరుసల మధ్య 45 సెం.మీ. దూరం, మొక్కల మధ్య 12–15 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. వేరుశనగ.. రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ వేస్తుంటారు. అందుకు అనువైన రకాలు. కదిరి లేపాక్షి (కె. 1812), పంట కాలం 122 రోజులు. ఎకరానికి 20–25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. 57% నూనెను, 70% గింజ దిగుబడిని ఇస్తుంది. ఎకరానికి 30–35 కిలోల గింజలు కావాలి. బెట్టను, తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. కదిరి అమరావతి (2016), కదిరి చిత్రావతి, కదిరి 7 బోల్ట్, కదిరి 6, కదిరి 9, కదిరి హరితాంద్ర, ధరణి ఒకవేళ ఈ రబీ సీజన్లో దాళ్వా సాగు చేయాలనుకునే రైతులు ఎంటీయూ 1010 (కాటన్ దొర సన్నాలు), ఎంటీయూ 1153 (చంద్ర), ఎంటీయూ 1156 (తరంగిణి), ఎంటీయూ 1121 (శ్రీధృతి), ఎంటీయూ 1210 (సుజాత), ఎంటీయూ 3626 (ప్రభాత్), ఐఆర్ 64, ఎన్.ఎల్.ఆర్. 34449 (నెల్లూరు మసూరీ), ఎన్.ఎల్.ఆర్. 3354 (నెల్లూరు ధాన్యరాశి)వినియోగించినట్లయితే మెరుగైన దిగుబడి సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ లేదా ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్‌ను సంప్రదించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విస్తరణ సంచాలకులు డాక్టర్ పి.రాంబాబు తెలిపారు. -
యాసంగిలో వరి వద్దు.. ప్రభుత్వం కొనదు: నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో యాసంగిలో వరి వేయవద్దు.. ప్రభుత్వం కొనలేదని బదనాం వద్దు’’ అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. యాసంగి పంటల సాగుపై ప్రభుత్వ వైఖరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి వరి వడ్లను, బాయిల్డ్ రైస్‌ను భవిష్యత్‌లో ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వ విధానం ప్రకటిస్తున్నాం. యాసంగిలో వరి వేయవద్దు.. దానికి బదులు ఇతర పంటలు వేసుకోవాలి’’ అని తెలిపారు. (చదవండి: కేంద్రం, ఎఫ్‌సీఐ నిర్ణయాన్ని మార్చుకోవాలి) ‘‘విత్తన కంపెనీలతో ఒప్పందం ఉంటే రైతులు యాసంగిలో వరి సాగు చేయవచ్చు. రైస్ మిల్లులతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు వరి వేసుకోవచ్చు. అయితే వీటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అనుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్స్‌పోర్ట్స్ అనుమతులు ఉండవు. రైతుల వద్ద వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రైతులు అర్ధం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి’’ అని నిరంజన్ రెడ్డి తెలిపారు. చదవండి: ‘వరి’ని నిషేధిత జాబితాలో చేర్చారా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు -
ఏపీ లోని రైతులకు శుభవార్త