పంట బీమాపై రైతుల అనాసక్తి
⇒ ఈ రబీలో బీమా చేయించిన రైతులు లక్షన్నర మందే
⇒ కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల బీమా పై రైతులు అనాసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల కంటే తెలంగాణ వెనుకబాటులో ఉంది. 2016–17 రబీ సీజన్‌లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధా రిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీ ఐఎస్) ద్వారా రాష్ట్రంలో కేవలం 1.56 లక్షల మంది రైతులు మాత్రమే బీమా చేయించు కున్నారు. అందులో బ్యాంకు రుణం తీసుకు నే రైతులు 1.46 లక్షల మంది కాగా.. రుణం తీసుకోని రైతులు 10 వేల మంది ఉన్నారు. వీరు రూ.34.26 కోట్లు ప్రీమియం చెల్లించా రని కేంద్ర వ్యవసాయ శాఖ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొత్తంగా 7.7లక్షల ఎకరాలకు బీమా చేయించారు. ఈసారి ప్రైవేటు కంపెనీలే బీమా చేయించడంతో రైతులు ముందుకు రాలేదని తెలుస్తోంది.
ముందున్న పక్క రాష్ట్రాలు..
దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 36.26 లక్షల మంది రైతులు రబీలో పంటల బీమా చేయించారు. ఆ తర్వాత రాజస్థాన్‌లో 30.76 లక్షల మంది, మధ్యప్రదేశ్‌లో 28.80 లక్షల మంది, బిహార్‌లో 11.54లక్షల మంది రైతులు పంటల బీమా చేయించారు. హరి యాణాలోనూ 5.75లక్షల మంది, అలాగే తమిళనాడులో 15.19 లక్షల మంది, కర్ణాటక లో 11.72 లక్షల మంది, మహారాష్ట్రలో 8.05 లక్షల మంది బీమా చేయించారు. ఏపీలోనూ 1.44 లక్షల మంది రైతులే పంట బీమా చేయించారు. నష్టపరిహారం సకాలంలో రాక పోవడంతో రైతులు ఆసక్తి చూపడంలేదని అధికారులు చెబుతున్నారు.