PMFBY
-
ఆగస్ట్ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..!
ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంపై ప్రభావం చూపేలా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఆగస్ట్ 1 నుంచి మారబోయే అంశాలేంటో తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా : ఆగస్ట్ 1నుంచి ఆర్బీఐ సూచనల మేరకు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం 'పాజిటివ్ పే సిస్టమ్'ని అమలు చేస్తుంది. తద్వారా చెక్కు ఇచ్చి డబ్బులు తీసుకున్న ఖాతాదారుడి వివరాలు, సంబంధిత వ్యక్తికి చెక్కు ఇచ్చిన సంస్థ లేదంటే వ్యక్తుల వివరాల్ని ధృవీకరించాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ కేవైసీ : రైతుల సౌలభ్యం కోసం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎంకేఎస్‌ఎన్‌వై) కోసం ఈ-కేవైసీ గడువు మే 31 నుండి జూలై 31 వరకు పొడిగించింది. రేపటి నుండి కేవైసీ అప్డేట్ చేసుకునే సౌకర్యం లేదు. పీఎంఎఫ్‌బీవై రిజిస్ట్రేషన్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు జులై 31తో ముగుస్తాయి. రిజిస్ట్రేషన్లను కోల్పోయిన వారు ఈ స్కీంలో లబ్ధి పొందలేరు. కాగా ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్లైన్లోనైనా చేసుకోనే సదుపాయం కేంద్రం కల్పించింది. ఎల్పీజీ గ్యాస్ రేట్లు: ప్రతి నెల మొదటి తేదీన, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ధరలు సవరించబడతాయి. ఏప్రిల్ నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గగా, డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్: 2021-22 ఆర్థిక సంవత్సరం, 2022-23 విద్యా సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించడానికి జూలై 31 చివరి తేదీ. గడువు తేదీని ప్రభుత్వం పొడిగిస్తే తప్ప, ఐటీఆర్‌లను ఆలస్యంగా దాఖలు చేసినందుకు ఆగస్టు 1 నుంచి జరిమానా, ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. -
పీఎం ఫసల్ బీమా యోజనకు రూ.16వేల కోట్లు
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పిఎంఎఫ్‌బివై) పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.16,000 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021-22 బడ్జెట్ లో 305కోట్లు ఎక్కువగా కేటాయించారు. దేశంలోని వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వ తన నిబద్ధతను తెలియజేస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ అభిప్రాయపడింది. ఈ పథకం ద్వారా రైతుల విత్తనాలు వేసిన దగ్గర నుంచి పంటకోతకు వచ్చే వరకు ఆ పంటకు రక్షణ లభిస్తుంది. పిఎంఎఫ్‌బివై ప్రయోజనాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులు భీమా చేసిన పంటలకు నష్టం కలిగితే దీని ద్వారా భీమా అందిస్తారు. ప్రకృతి విపత్తు కారణంగా రైతు పంట నాశనమైతే వారికి ఈ పథకం కింద భీమా లభిస్తుంది. ఖరీఫ్ పంటలో 2శాతం, రబీ పంటకు 1.5శాతం, హార్టికల్చర్ కు 5శాతం రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల క్రితం 13 జనవరి 2016న భారత ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజన పథకాన్ని పీఎం తీసుకొచ్చింది.(చదవండి: భవిష్యత్ ఇంధనంగా హైడ్రోజన్) కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద పంట బీమా పథకం ఇది. ప్రీమియం విషయంలో మూడో అతిపెద్ద బీమా పథకం. ప్రతి ఏడాది 5.5 కోట్లకు పైగా రైతుల దరఖాస్తులు చేసుకుంటారు. ఈ పథకానికి రైతులు ఎవరైనా దరఖాస్తు చేయొచ్చు. అన్ని రకాల ఆహార పంటలకు ఇది వర్తిస్తుంది. పంట నష్టపోయిన రైతులు 72 గంటల్లో దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్‌కు లేదా క్రాప్ ఇన్స్యూరెన్స్ యాప్‌లో రిపోర్ట్ చేయాలి. అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్‌కు బీమా డబ్బులు వస్తాయి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను https://pmfby.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. -
బీమా ‘పంట’ పండటంలేదు!
న్యూఢిల్లీ: పంటల బీమా (క్రాప్ ఇన్సూరెన్స్) అంటే.. బీమా కంపెనీలు భయపడిపోతున్నాయి! ప్రకృతి విపత్తుల కారణంగా పరిహారం కోరుతూ భారీగా క్లెయిమ్‌లు వస్తుండటం, ఫలితంగా ఈ విభాగంలో వస్తున్న భారీ నష్టాలతో కంపెనీలు పునరాలోచనలో పడుతున్నాయి. దీంతో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పటికే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం కింద క్రాప్ ఇన్సూరెన్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ సైతం ఈ విభాగం నుంచి తప్పుకున్నట్టు డేటా తెలియజేస్తోంది. అయినా, కొన్ని కంపెనీలు మాత్రం ఈ విభాగం పట్ల ఆశావహంగానే ఉన్నాయి. పీఎం ఎఫ్బీవై కింద 2018–19 ఆర్థిక సంవత్సరంలో వసూలైన స్థూల ప్రీమియం రూ.20,923 కోట్లు. కాగా, బీమా కంపెనీలకు పరిహారం కోరుతూ వచ్చిన క్లెయిమ్‌ల మొత్తం రూ.27,550 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగంలోని రీఇన్సూరెన్స్ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీఆర్ఈ) సైతం తన క్రాప్ ఇన్సూరెన్స్ పోర్ట్‌ఫోలియోను భారీ నష్టాల కారణంగా తగ్గించుకోవడం గమనార్హం. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ డేటాను పరిశీలిస్తే.. చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ స్థూల ప్రీమియం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 91 శాతం తగ్గిపోయి రూ.5.26 కోట్లుగానే ఉన్నట్టు తెలుస్తోంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థకు వచ్చిన స్థూల ఆదాయం రూ.211 కోట్లుగా ఉంది. పెరిగిన స్థూల ప్రీమియం పంటల బీమా విభాగంలో అన్ని సాధారణ బీమా కంపెనీలకు స్థూల ప్రీమియం ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో పెరగడం గమనార్హం. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.15,185 కోట్లతో పోలిస్తే 26.5 శాతం వృద్ధి చెంది రూ.19,217 కోట్లకు చేరుకుంది. ‘‘క్రాప్ ఇన్సూరెన్స్ మంచి పనితీరునే ప్రదర్శిస్తోంది. కొన్ని విభాగాల్లో క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉంది. అయినప్పటికీ చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విభాగంపై బుల్లిష్‌గానే ఉన్నాయి’’అని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ సంస్థల పెద్దపాత్ర క్రాప్ ఇన్సూరెన్స్‌లో నష్టాల పేరుతో ప్రైవేటు కంపెనీలు తప్పుకున్నా కానీ, ప్రభుత్వరంగ బీమా సంస్థలు పెద్ద పాత్రే పోషిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే నేషనల్ ఇన్సూరెన్స్, న్యూఇండియా ఇన్సూరెన్స్ కొన్ని ప్రైవేటు సంస్థలతోపాటు పంటల బీమాలో వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ప్రభుత్వరంగ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అధిక మొత్తంలో క్రాప్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని సొంతం చేసుకుంటోంది. కాగా, ఈ ఏడాది ఎలాంటి క్రాప్ బీమా వ్యాపారాన్ని నమో దు చేయబోవడంలేదని రీ ఇన్సూరెన్స్ చార్జీలు దిగిరావాల్సి ఉందని ఐసీఐసీఐ లాంబార్డ్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ రంగంలో పరిస్థితులు ఇలా.. ► ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం పరిధిలో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ క్రాప్ ఇన్సూరెన్స్ వ్యాపారం నుంచి తప్పుకుంది. ► చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ సైతం ఈ విభాగం నుంచి తప్పుకున్నట్టు డేటా తెలియజేస్తోంది. ► అధిక నష్టాలు, పరిహారం కోరుతూ భారీగా వస్తున్న క్లెయిమ్‌లు. ► ప్రభుత్వరంగ రీఇన్సూరెన్స్ సంస్థ జీఐసీఆర్ఈ సైతం తన క్రాప్ పోర్ట్‌ఫోలియోను తగ్గించుకుంది. ► ప్రభుత్వరంగ నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ మాత్రం ఈ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా చూస్తే... అమెరికా, చైనా తర్వాత అతిపెద్ద పంటల బీమా మార్కెట్ మనదే కావడం గమనార్హం. -
పంట లెక్కలకు శాటిలైట్ సాయం
సాక్షి, హైదరాబాద్: రైతుల పంటలను అంచనా వేసేందుకు ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయశాఖను ఆదేశించింది. జిల్లా స్థాయిలో పంటల విస్తీర్ణం, వాటి పరిస్థితి, దిగుబడిని అంచనా వేయడానికి ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించాలని పేర్కొంది. తద్వారా వ్యవసాయ ఉత్పాదకత, వాతావరణ పరిస్థితులను అంచనా వేయొచ్చని సూచించింది. జియో–ఇన్ఫర్మేటిక్స్ ద్వారా పప్పుధాన్యాలు, ఉద్యాన పంటలు పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాన్ని అంచనా వేయాలని, కరువు అంచనా కోసం ఉపగ్రహ డేటాను ఉపయోగించాలని కేంద్రం నిర్ణయించింది. మరోవైపు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రైతులు పంట నష్టపరిహారం పొందడానికి అనేక సమస్యలు తలెత్తుతుతున్న నేపథ్యంలో ఆయా వివాదాలను పరిష్కరించడానికి కేవలం క్షేత్రస్థాయి పరిశీలనపైనే ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పరిహారం అందడంలో ఆలస్యమవుతోంది. పైగా నష్టం అంచనాలు సకాలంలో జరగడంలేదు. వాటిని ఉపగ్రహ చిత్రాల ద్వారా అంచనా వేయాలనేది ప్రధాన ఉద్దేశం. రైతుల వాదనల పరిష్కారానికి సమయ వ్యవధిని తగ్గించడానికి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కేంద్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ, పీఎంఎఫ్‌బీవై కింద వివిధ రాష్ట్రాల్లో పంట కోత ప్రయోగాలకు ప్రత్యామ్నాయంగా పరిజ్ఞానాన్ని ఉపయోగించేలా పైలట్ అధ్యయనాలు చేయడానికి 8 ఏజెన్సీలకు ఇప్పటికే బాధ్యత అప్పగించారు. పంటల దిగుబడి అంచనా కోసం బీమా యూనిట్ స్థాయికి అవసరమైన పంట కోత ప్రయోగాల సంఖ్యను తగ్గించడానికి శాటిలైట్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మోడలింగ్ టూల్స్ మొదలైన సాంకేతిక పరిజ్ఞాన అధ్యయనాలను ఉపయోగించాలనేది సర్కారు ఉద్దేశం. ఆలస్యమైతే కంపెనీలకు జరిమానా.. మెరుగైన సేవలు, జవాబుదారీతనం, రైతులకు క్లెయిమ్‌లను సకాలంలో చెల్లించడం కోసం పీఎంఎఫ్‌బీవై పథకాన్ని కేంద్రం అనేక సవరణలు చేసింది. గత రబీ సీజన్ నుంచి క్లెయిమ్‌ల చెల్లింపు కోసం నిర్దేశించిన గడువు తేదీకి 10 రోజులకు మించి సెటిల్మెంట్ చేయకపోతే బీమా కంపెనీ రైతులకు ఏడాదికి 12 శాతం వడ్డీ చెల్లించాలని పేర్కొంది. అయితే ప్రస్తుతం రబీ సీజన్‌కు క్లెయిమ్‌ల పరిష్కారం జరుగుతున్నందున జరిమానా వ్యవహారాన్ని కంపెనీలు తోసిపుచ్చుతున్నట్లు కేంద్రం భావిస్తోంది. ఆ ప్రక్రియపై రాష్ట్రం దృష్టిసారించాలని సూచించింది. నెలలు, ఏళ్ల తరబడి పంటల బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయడంలో ఆలస్యం చేస్తే బీమా కంపెనీలతోపాటు సంబంధిత రాష్ట్రాలకు జరిమానా విధించాలని కూడా కేంద్రం స్పష్టం చేసింది. అలాగే కంపెనీల విన్నపం మేరకు తన వాటా సబ్సిడీ సొమ్ము చెల్లించడంలో మూడు నెలలకు మించితే రాష్ట్రాలు 12 శాతం వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. -
పరిహారం ఆలస్యం చేస్తే జరిమానా
సాక్షి, హైదరాబాద్: పంటల బీమా సొమ్ము కోసం ఎదురుచూసే రైతులకు శుభవార్త. బీమా క్లెయిమ్ సెటిల్ చేయకుండా ఆలస్యం చేస్తూ రైతులను ఏడిపించే పరిస్థితికి కేంద్రం చెక్ పెట్టింది. అందుకు సంబంధించి బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రైతులకు బీమా పరిహారం క్లెయిమ్స్ సెటిల్ చేయడంలో ఆలస్యం చేస్తే బీమా కంపెనీలు, సంబంధిత రాష్ట్రాలకు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలచేస్తూ ఆయా రాష్ట్రాలకు పంపించింది. సెటిల్మెంటు చేయడంలో నిర్ణీతకాల పరిమితి రెండు నెలలు దాటితే 12 శాతం వడ్డీ రైతులకు చెల్లించాలని బీమా కంపెనీలను ఆదేశించింది. అలాగే కంపెనీల విన్నపం మేరకు తమ వాటా సబ్సిడీ సొమ్ము చెల్లించడంలో మూడు నెలలకు మించితే రాష్ట్రాలు 12 శాతం వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్ నుంచి అమలవుతాయని కేంద్రం ప్రకటించింది. అలాగే రైతులకు సక్రమంగా బీమా సేవలు అందించడంలో విఫలమయ్యే కంపెనీలను రద్దు చేయాలని ఆదేశించింది. ఇదిలావుండగా ఏడాదంతా సాగయ్యే ఉద్యాన పంటలను కూడా పీఎంఎఫ్‌బీవై పథకంలోకి తీసుకొస్తూ మరో నిర్ణయం తీసుకుంది. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తారు. అలాగే అడవి జంతువుల దాడిలో పంటకు నష్టం వాటిల్లితే దానికి కూడా బీమా వర్తింపజేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే దీన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తారు. డూప్లికేషన్‌ను నివారించేందుకు బీమా పరిహారంలో ఆధార్ లింక్‌ను తప్పనిసరిగా అమలుచేయనున్నారు. కంపెనీలు తాము వసూలు చేసే ప్రీమియం సొమ్ములో 0.5 శాతాన్ని బీమాపై రైతులను చైతన్యం చేయడానికి ఖర్చు చేయాలని కేంద్రం ఆదేశించింది. తాజా మార్గదర్శకాలు ఈ పథకంలో ప్రస్తుతం నెలకొన్న లోపాలను సరిదిద్దేందుకు తీసుకున్నవేనని కేంద్రం స్పష్టం చేసింది. -
రబీ పంటల బీమా ఖరారు
సాక్షి, హైదరాబాద్: రబీలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై), పునర్వ్యవస్థీకరించిన వాతావరణ పంటల బీమా పథకాలను అమలు చేసేందుకు వ్యవసాయశాఖ బుధవారం నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 30 జిల్లాలను ఆరు క్లస్టర్లుగా విభజించి ఐదు ప్రైవేటు కంపెనీలకు పంటల బీమా అమలుచేసే బాధ్యత అప్పగించింది. ఒక్కో క్లస్టర్లో ఐదు జిల్లాలను చేర్చారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోని రైతులు ఇష్టమైతేనే బీమా తీసుకోవచ్చు. బ్యాంకు రుణాలు తీసుకునే రైతులు తప్పనిసరిగా పంటల బీమా ప్రీమియాన్ని చెల్లించాల్సిందే. పీఎంఎఫ్‌బీవై పథకంలో వరి, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుములు, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఎర్ర మిరప, ఉల్లిగడ్డ, నువ్వుల పంటలకు బీమా అమలుచేస్తారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బీమా మొత్తాన్ని ఖరారు చేస్తారు. -
ఎగసాయం
► అన్నదాత ప్రయోజనాలకు తూట్లు ► ఇన్పుట్ సబ్సిడీ, పీఎంఎఫ్‌బీవై, వాతావరణ బీమాల్లో ఏదో ఒక్కటే.. ► కరువు రైతులకు తీరని అన్యాయం ► ప్రభుత్వ తీరుతో సర్వత్రా విస్మయం ► బీమా సొమ్ముతో ఖజానా నింపుకునే కుట్ర ► ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు, రైతు సంఘాలు కష్టాల్లోని రైతులను ఆదుకోవాల్సిన కనీస ధర్మం ప్రభుత్వానిది. వరుస కరువుతో అల్లాడుతున్న అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోయినా ఊరట కల్పించలేకపోయింది. ఖరీఫ్ సీజన్లో పెట్టుబడుల కోసం రైతుల అవస్థలు వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాత నోటికందాల్సిన సాయం విషయంలోనూ సర్కారు కుట్ర పన్నింది. మూడు రకాల పరిహారం విషయంలో ఒక్కటే వర్తింపజేసి ఆ నిధులను నొక్కేసే ప్రయత్నం చేస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): ఇన్పుట్ సబ్సిడీ.. ప్రధానమంత్రి ఫసల్ బీమా.. వాతావరణ బీమా.. వీటిలో ఏదో ఒక్కటి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు దక్కాల్సిన సొమ్ముతో సొంత ఖజానా నింపుకునేందుకు కుట్ర పన్నింది. 2016లో ప్రభుత్వం 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. ఇందులో 10 మండలాల్లో కరువు లేదని అధికారులు తేల్చారు. 26 మండలాల్లోనే అనావృష్టి ప్రభావంతో పంటలు దెబ్బతిన్నట్లు నివేదిక సిద్ధం చేశారు. ఈ మండలాలకు పెట్టుబడి రాయితీ కింద(ఇన్పుట్ సబ్సిడీ) రూ.325 కోట్లు మంజూరయ్యాయి. 2,50,128.68 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా.. 3,10,766 మంది రైతులు నష్టపోయారు. ఇదిలాఉంటే త్వరలోనే ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా పరిహారం కూడా విడుదల కానుంది. అయితే రైతుల సంక్షేమం, అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తున్నామని గొప్పలు చెప్పుకునే టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు అదే రైతుల నోటికాడి సొమ్ము లాగేస్తోంది. మూడింట్లో ఏదో ఒక్కటి మాత్రమే వర్తింపజేస్తామని ప్రకటించడం విస్మయానికి గురిచేస్తోంది. కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న అన్నదాతకు ఈ చర్య మింగుడు పడటం లేదు. ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటికి విడుదలవుతుందో తెలియకపోయినా.. ఈనెల 19 నుంచి కరువు మండలాల్లో రైతులకు అందుకు సంబంధించిన పత్రాలు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో మండలాల వారీగా ఏఏ రైతుకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా పరిహారం వచ్చిందనే విషయాలపైనా వ్యవసవయాధికారులు ఆరా తీస్తున్నారు. ఒక రైతుకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు, ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ బీమా పరిహారం వచ్చినట్లయితే.. వీటిలో ఏది ఎక్కువుంటే ఆ ఒక్కదానినే రైతులకు చెల్లించనున్నారు. ఇదే జరిగితే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. రైతుల్లో ఆందోళన గత ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి వేరుశనగకు వాతావరణ బీమా కింద రూ.41కోట్లు విడుదల కానుంది. గత ఏడాది ఖరీఫ్‌లో బ్యాంకులు రూ.2870.62 కోట్ల పంట రుణాలు పంపిణీ చేశాయి. జూలై 31లోపు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న వారందరికీ నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తిస్తుంది. వరికి గ్రామం యూనిట్‌గా బీమా కల్పించారు. వరికి సంబంధించి ఆగస్టు 31 వరకు బ్యాంకుల నుంచి పంట రుణాలు చెల్లించిన రైతులకు బీమా వర్తిస్తుంది. ఈ ప్రకారం దాదాపు 2 లక్షల మందికి బీమా వర్తించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఏదో ఒక్కటి మాత్రమే ఇస్తామని ప్రకటించడంతో రైతుల ఆందోళన అంతా, ఇంతా కాదు. బీమా సొమ్ముపై ప్రభుత్వం కన్ను బీమా పొందాలంటే రైతులు ముందుగా ప్రీమియం చెల్లిస్తారు. ఇది రైతుల వ్యక్తిగతం. బీమా పరిహారం పొందడం రైతుల హక్కు. అయితే ఈ బీమా కింద రైతులకు వచ్చే పరిహారంపై ప్రభుత్వం కన్నేసింది. కరువు రైతులకు ఎలాగూ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం కదా.. మళ్లీ బీమా ఎందుకు అంటూ ఏదైనా ఒక్కటి మాత్రమే అనే షరతు పెట్టింది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, బీమా వస్తే ఏది ఎక్కువగా ఉంటే దానిని ఇచ్చి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం తమ ఖజానాకు మళ్లించనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు ఏదో ఒక్కటి మాత్రమే చెల్లించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ, బీమా వివరాలను మండలాలకు పంపి ఏదైనా ఒక్కటే అనే నిబంధనను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. రైతుల హక్కులను హరించడం దారుణం బీమా అనేది రైతుల హక్కు. ముందుగా ప్రీమియం చెల్లిస్తే పంటలు దెబ్బతిన్నప్పుడు పరిహారం లభిస్తుంది. అనావృష్టి వల్ల పంటలు దెబ్బతిన్నపుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. ఇన్పుట్ సబ్సిడీ పొందడం కూడా రైతుల హక్కే. ప్రభుత్వం రైతుల హక్కులను కాలరాస్తోంది. రైతుల దక్కాల్సిన సాయాన్ని నొక్కేయాలనుకోవడం క్షమించరాని విషయం. – ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి, సీపీఎం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, బీమా ఇవ్వాల్సిందే.. రైతులు వరుస కరువులతో అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం రైతులకు తీవ్ర నష్టం కలిగించే నిర్ణయం తీసుకోవడం దారుణం. ఇన్పుట్ సబ్సిడీ, బీమా వస్తే రెండూ ఇవ్వడం కోనేళ్లుగా జరుగుతోంది. 2016 కరువుకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, బీమాల్లో ఏదో ఒక్కటే ఇచ్చేలా చర్యలు తీసుకోవడం తగదు. ప్రభుత్వం రైతుల సొమ్ముకు ఎసరు పెట్టడం అన్యాయం. దీనిపై పోరాటం చేస్తాం. – జగన్నాథం, రైతు సంఘం జిలా కార్యదర్శి -
పంట బీమాపై రైతుల అనాసక్తి
⇒ ఈ రబీలో బీమా చేయించిన రైతులు లక్షన్నర మందే ⇒ కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల బీమా పై రైతులు అనాసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల కంటే తెలంగాణ వెనుకబాటులో ఉంది. 2016–17 రబీ సీజన్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధా రిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీ ఐఎస్) ద్వారా రాష్ట్రంలో కేవలం 1.56 లక్షల మంది రైతులు మాత్రమే బీమా చేయించు కున్నారు. అందులో బ్యాంకు రుణం తీసుకు నే రైతులు 1.46 లక్షల మంది కాగా.. రుణం తీసుకోని రైతులు 10 వేల మంది ఉన్నారు. వీరు రూ.34.26 కోట్లు ప్రీమియం చెల్లించా రని కేంద్ర వ్యవసాయ శాఖ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొత్తంగా 7.7లక్షల ఎకరాలకు బీమా చేయించారు. ఈసారి ప్రైవేటు కంపెనీలే బీమా చేయించడంతో రైతులు ముందుకు రాలేదని తెలుస్తోంది. ముందున్న పక్క రాష్ట్రాలు.. దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 36.26 లక్షల మంది రైతులు రబీలో పంటల బీమా చేయించారు. ఆ తర్వాత రాజస్థాన్‌లో 30.76 లక్షల మంది, మధ్యప్రదేశ్‌లో 28.80 లక్షల మంది, బిహార్‌లో 11.54లక్షల మంది రైతులు పంటల బీమా చేయించారు. హరి యాణాలోనూ 5.75లక్షల మంది, అలాగే తమిళనాడులో 15.19 లక్షల మంది, కర్ణాటక లో 11.72 లక్షల మంది, మహారాష్ట్రలో 8.05 లక్షల మంది బీమా చేయించారు. ఏపీలోనూ 1.44 లక్షల మంది రైతులే పంట బీమా చేయించారు. నష్టపరిహారం సకాలంలో రాక పోవడంతో రైతులు ఆసక్తి చూపడంలేదని అధికారులు చెబుతున్నారు. -
పంట బీమాకు ని‘బంధనాలు’!
• పీఎంఎఫ్‌బీవైతో ఆశించిన ప్రయోజనం లేదు: పోచారం • బీజేపీ అభ్యంతరం.. పోచారం క్షమాపణకు డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పాత పంటల బీమా పథకంలో సవా లక్ష నిబంధనలతో రైతులకు ప్రయోజనం కలగలేదని, కేంద్రం కొత్తగా అమల్లోకి తెచ్చిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం కూడా ఆశించిన ప్రయోజనాన్ని కలిగించలేకపోతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పథకం ద్వారా రిలయన్స్, బజాజ్ తదితర 16 ప్రైవేటు బీమా కంపెనీలను కేంద్రం ప్రోత్సహించిందన్నారు. రాష్ట్రంలో పీఎంఎఫ్‌బీవై అమలుపై బీజేపీ సభ్యులు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో లేవనెత్తిన ప్రశ్నలకు పోచారం సమాధానమిచ్చారు. రైతులకు ప్రయోజనం కలిగించేందుకు నిబంధనలను సవరించాలని కేంద్రాన్ని కోరారు. పీఎంఎఫ్‌బీవై లోపాలను పోచారం ఎండగట్టడంపై బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పోచారం క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
‘బీమా’ అందరాని అందలం?
విశ్లేషణ ప్రధాన మంత్రి ఫసల్ యోజన పథకం సక్రమంగా అమలు కాకపోతే తలెత్తే సమస్యలపై కనీస అంచనా సైతం లేకుండానే దాన్ని ప్రభుత్వం చేపట్టింది. అది వాటిని గుర్తించక పోయైనా ఉండాలి లేదా ప్రైవేటు కంపెనీలపై అతి విశ్వాసాన్ని ఉంచైనా ఉండాలి అనిపిస్తుంది. కానీ ఈ విషయమై వస్తున్న వార్తా కథనాలను బట్టి చూస్తే... రైతులకు పంటల బీమాను కల్పించడం వల్ల బీమా సంస్థలకు కలగడానికి అవకాశం ఉన్న నష్టానికి బీమా రక్షణగానే ఈ పథకాన్ని చేపట్టారని అనిపిస్తోంది. అట్టహాసంగా ప్రారంభించిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎమ్ ఎఫ్బీవై) పథకం సమస్యల్లో పడ్డట్టుంది. మచ్చుకు ఇది చూడండి. అకాల వర్షాల వల్ల రాజస్తాన్‌లోని నాగౌర్ జిల్లాలో పంటలు దెబ్బ తిన్నాయి. ఈ పంట నష్టాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తేవడం కోసం వందలాది మంది రైతులు నానా పాట్లూ పడ్డారు. వారు ఇచ్చిన టోల్ ఫ్రీ ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ పని చేయడంలేదని, ఎవరిని సంప్రదించాలో తమకు తెలియ దని రైతులు వాపోతున్నారు. పొరుగునున్న హరియాణాలోని గోహన జిల్లాలో ఏదో తెగులు సోకి వరి పంట దెబ్బతింది. తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేయాలని 700 మందికి పైగా రైతులు కోరారు. రైతులు ఏడు రోజుల నిరాహార దీక్ష చేసిన తర్వాత గానీ పంట నష్టాన్ని అంచనా వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది కాదు. రైతులకు, పాలనా యంత్రాంగానికి మధ్య ఘర్షణ ఇలా ఉండగా, హరి యాణా వ్యవసాయ శాఖ అధికారులు పంట కోత ప్రయోగాల (దిగుబడిని అంచనా కట్టడం కోసం చేపట్టేవి) నిర్వహణకు నిరాకరించారు. వ్యవసాయ అధికారులు ఆరు నెలలపాటూ ఎలాంటి సమ్మెలు చేయరాదంటూ అత్యవసర సర్వీసుల చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినా ఫలితం లేక పోయింది. వ్యవసాయ శాఖ అధికారులు చెప్పేదాన్ని బట్టి ఖరీఫ్ పంట మార్కెట్లకు చే రడం మొదలయ్యేటప్పుడు పంట కోత అంచనా చేపట్టం వల్ల పంట నష్టానికి బీమా సొమ్మును చెల్లించాలని కోరే రైతులకు నష్టం జరుగు తుంది. రైతుల కోసమా? బీమా సంస్థల కోసమా? అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరుతూ మధ్యప్రదేశ్‌లో ఎన్నోచోట్ల రైతులు ఆందోళనలు చేపట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అకాల వర్షాలు లేదా వడగళ్ల వానల వల్ల పంటలు దెబ్బతింటే పదిహేను రోజుల లోగా చర్య తీసుకుంటామని, నెలలోగా నష్టపరిహారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వాగ్దానం చేశారు. మహారాష్ట్రలోని పత్రికల నిండా పంట నష్టాన్ని అంచనా కట్టడంలో బీమా కంపెనీల వైఫల్యా నికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. రాజస్తాన్ పత్రిక వెలువరించిన ఈ కథనాన్నే తీసుకోండి. పెసర, నువ్వు, పత్తి, వేరుశనగ, సజ్జ, జొన్న తదితర పంటలకు ఈ ఫసల్ బీమా వర్తిస్తుంది. పెసరకు చెల్లించగల అత్యధిక నష్ట పరిహార బీమా మొత్తం రూ. 16,130. అంటే పంట విలువలో ఇంచుమించుగా 40 శాతం. రాష్ట్ర వ్యవసాయ శాఖ తయారుచేసిన అంచనాల ప్రకారం పెసర దిగుబడి సగటున హెక్టారుకు 7 క్వింటాళ్లు. పెసర కనీస మద్దతు ధరనే తీసుకున్నా, దాదాపు హెక్టారుకు దిగుబడి విలువ రూ 40,000 అవుతుంది. అంటే, 60 శాతం పంట నష్టం జరి గినా బీమా కంపెనీ ఆ మొత్తం నష్టాన్నంతటినీ భరించదు. పంటల బీమా విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను శాసన సభలో లేవనెత్తినప్పుడు సైతం ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పి తాత్సారం చేస్తోందని రైతుల ఫిర్యాదు. పైన పేర్కొన్న వార్తా నివేదికలను బట్టి ప్రధానమంత్రి ఫసల్ యోజన పథకం సక్రమంగా అమలు కాకపోతే తలెత్తే సమస్యలపై కనీస అంచనా సైతం లేకుండానే దాన్ని ప్రభుత్వం చేపట్టిందని అర్థమౌతుంది. ప్రభుత్వం, తాము రూపొందించిన పద్ధతిలో ఈ పథకాన్ని అమలు చేయడంలో తీవ్ర సమస్యలున్నాయనే విషయాన్ని గుర్తించకపోయి అయినా ఉండాలి లేదా ప్రైవేటు కంపెనీలపై అతి విశ్వాసాన్ని ఉంచైనా ఉండాలి. అయితే నేనింత వరకు చదువుతున్న విషయాలను, విశ్లేషణలను బట్టి చూస్తే... రైతులకు పంట నష్టానికి బీమా రక్షణను కల్పించడం వల్ల ప్రైవేటు కంపెనీలకు కలగ డానికి అవకాశం ఉన్న నష్టానికి బీమాను కల్పించేదిగానే ఈ పథకాన్ని చేపట్టారని అనిపిస్తోంది. జవాబుదారీతనం సున్న పంట నష్టాలను, చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని బహిరంగ వేలం ప్రాతి పదికపై అంచనాకట్టడమే నేను అలా అనుకోవడానికి కారణం. ప్రపంచంలో ఎక్కడా ఇలా బహిరంగ వేలం ద్వారా నిర్దేశిత ప్రాంతంలో పంటల బీమాను అందించడం కోసం ఏ బీమా కంపెనీ ఇంతవరకు ముందుకు రాలేదు. ప్రభుత్వ రంగంలోని అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఏఐసీ ఎల్) సహా మొత్తం దాదాపు 12 బీమా కంపెనీలున్నాయి. అవి ఒక్కొక్క జిల్లాకు తాము అందించగల ప్రీమియంలను కోట్ చేస్తునాయి. ప్రీమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్పాలు సమానంగా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యవహారం దేనిలోనైనా సబ్సిడీ మొత్తం ఎంత అనేదే నిర్ణయా త్మకమైన అంశం అవుతుంది. రైతులు ఖరీఫ్ పంటల విషయంలో 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, ఉద్యానవన పంటలకు 5 శాతం ప్రీమియం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల వాతావరణపరంగా తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే గడ్డు ప్రాంతాలుగా గుర్తింపు పొందిన వాటిని ప్రభుత్వ బీమా సంస్థకు వదిలి పెట్టే శారు. మిగతా ప్రాంతాల్లో సైతం ప్రైవేటు కంపెనీలు కోట్ చేసిన ప్రీమియం పరిమితులకు ప్రాతిపదిక వాటి వాణిజ్య లాభదాయకతే గానీ, పంట నష్టం మాత్రం కాదు. ఇలాంటి దాన్ని అసలు ఎంత మాత్రమూ అనుమతించనే కూడదు. ప్రైవేటు కంపెనీలు ఎలాంటి జవాబుదారీతనం వహించకుండా తమ ఇష్టానుసారం గరిష్ట లాభాలను ఆర్జించడానికి అవకాశాలను కల్పిం చడమే ప్రభుత్వ ఉద్దేశమని ఇది స్పష్టంగా తెలుపుతోంది. రాజస్తాన్‌నే తీసు కోండి. ఆ రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్లో దాదాపు 35 శాతం ప్రధాని ఫసల్ బీమా యోజన అమలుకే పోతోంది. బీమా కంపెనీలు అధిక ప్రీమియం రేట్లను కోట్ చేయడమూ, వాటిని తగ్గించేలా చేయడానికి ప్రభుత్వం వద్ద యంత్రాంగం లేకపోవడమే అందుకు కారణం. ముందస్తు పెట్టుబడే లేని వ్యాపారం పంట నష్టాన్ని అంచనా వేయడం, పంట కోత అంచనాలు వంటి పనుల కోసం, సిబ్బంది సహా సరిపడా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎలాంటి ముందస్తు పెట్టుబడి పెట్టకుండానే ప్రైవేటు కంపెనీలు లాభాలు ఆర్జించడానికి పంటల బీమా అద్భుత వ్యాపార అవకాశంగా మారింది. పంట కోత ప్రయోగాల బాధ్యతలను ప్రైవేటు బీమా కంపెనీలే చేపట్టాలని హరి యాణాలో సమ్మె చేస్తున్న వ్యవసాయ అధికారులు కోరడం న్యాయ సమ్మ తమైనది, సమంజసమైనది. జిల్లాకు 24 పంట కోత ప్రయోగాలను నిర్వహిం చాలని ఈ పథకం కింద నిర్దేశించారు. అంటే దేశవ్యాప్తంగా 40 లక్షల పంట కోత ప్రయోగాలను నిర్వహించాల్సి ఉంటుంది. వీటికి అయ్యే వ్యయాలను ప్రైవేటు కంపెనీలు ఎందుకు కల్పించవు? ఈ ఫసల్ బీమా యోజన దాదాపుగా రూ. 18,000 కోట్ల వ్యాపారం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ పథకంపై ఖర్చు ఒక్కసారిగా రూ.12,000 కోట్ల మేరకు పెరిగిపోయింది. స్కూటరుకో లేదా కారుకో బీమా చేయించుకోమని మనల్ని కోరడానికి బీమా కంపెనీలు ఏజెంట్లను నియమి స్తాయి. అదే పంటల బీమా బీమా ప్రీమియంలను బలవంతంగా రైతుల నుంచి వసూలు చేస్తాయి. బ్యాంకుల ద్వారా అవి రైతుల ప్రీమియంలను వారి ఖాతాల నుంచి నేరుగా మినహాయించేసుకోవడం అంటే... అదీ కూడా పంట నష్టాన్ని అంచనా కట్టడానికి సైతం పైసా పెట్టుబడి పెట్టకుండానే చేయడం అంటే విచిత్రం కాదూ! ఈ వ్యాపారం చేయడానికి అనువుగానే ఈ పథకాన్ని రూపొందించారో లేక అజ్ఞానం వల్లనో ఇలా జరిగిందో నాకు తెలియదు. ఫసల్ బీమా అర్థవంతం కావాలంటే... ఈ బీమా పథకాన్ని మరింత అర్థవంతం చేయడం కోసం ఈ సూచనలను చేస్తున్నాను: 1. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే రైతుల బ్యాంకు ఖాతాల నుంచి ఫసల్ బీమా ప్రీమియం మొత్తాలను మినహాయించేసుకోవడాన్ని ఆపాలి. తాము ఏ పంటలకు బీమా చేశామో కూడా తెలియకుండానే బీమా కంపెనీలు బ్యాంకుల నుంచి నేరుగా ప్రీమియంలను వసూలు చేసేసుకుంటున్నాయి. 2. బీమా ప్రీమియంలను నిర్ధారించడానికి బహిరంగ వేలం పద్ధతిని నిలిపివేయాలి. దానికి బదులుగా వాతావరణ ప్రాతిపదికపై పంటల పరిస్థితిని, జిల్లాల వారీగా ప్రీమియం మొత్తాలను నిర్ధారించడానికి ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలి. 3. బీమా కంపెనీలు కోత ప్రయోగాలకు తగిన నిపుణ శ్రామిక శక్తిని తయారుచేసుకునేలా చేయాలి. ఇది విద్యావంతులైన, నిపుణ యువతకు ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది. 4. పంట నష్టాన్ని, బీమా చెల్లింపు మొత్తాన్ని లెక్కగట్టడానికి బీమా కంపెనీలు రైతు పొలాన్ని యూనిట్‌గా తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలి. ఒక బ్లాక్ మొత్తాన్ని ఒక యూనిట్‌గా తీసుకునే ప్రాతిపదికపై పంట నష్టాలను అంచనా కట్టడానికి వీల్లేదు. 5. నష్ట భయం ఉన్న 50 జిల్లాల్లోనే 60 శాతం పంటల బీమా అమలు రుగుతోంది. కాబట్టి ఈ జిల్లాలన్నింటిలోనూ బీమా కంపెనీలలోని పతి ఒక్కటీ రైతు పొలాన్ని యూనిట్‌గా తీసుకుని అమలుచేసే పంటల బీమా పథ కాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం కోరవచ్చు. అలా చేయకుండా ప్రభుత్వాన్ని అడ్డుకునేదేమీ లేదు. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈమెయిల్ : hunger55@gmail.com -
రైతుకు దూరంగా ‘వ్యవసాయ బీమా’
రాష్ట్రంలో మొదటిసారిరైతు పంటల బీమాపై ఏఐసీ విముఖత రబీలో రెండు ప్రైవేటు కంపెనీలకు 10 పంటల బీమా అప్పగింత ఖరీఫ్‌లో 6.55 లక్షల మంది రైతుల ప్రీమియం.. ఇందులో ఏఐసీ వాటానే అధికం సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం(డబ్ల్యూబీసీఐఎస్)లను రబీ సీజన్లో అమలు చేసే బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వ్యవసాయ బీమా కంపెనీ(ఏఐసీ) వైదొలగింది. రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్వహించిన బిడ్లలో కేవలం మూడు ప్రైవేటు కంపెనీలే పాల్గొన్నాయి. ఏఐసీ పాల్గొనలేదు. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి పీఎంఎఫ్‌బీవై పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచే మొదటిసారిగా ప్రైవేటు బీమా కంపెనీలకు దారులు తెరిచింది. ఖరీఫ్‌లో పీఎంఎఫ్‌బీవై పథకాన్ని ఏఐసీ సహా బజాజ్ అలియంజ్ జీఏసీ లిమిటెడ్ అమలు చేశాయి. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీఐఎస్)ను రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఎస్బీఐ జీఐసీ లిమిటెడ్‌లు అమలు చేశాయి. పీఎంఎఫ్‌బీవై పథకం అమలు కోసం రాష్ట్రంలో మూడు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. అన్ని కంపెనీలు కలసి ఈ ఏడాది ఖరీఫ్‌లో 6.55 లక్షల మంది రైతుల నుంచి రూ.85 కోట్లు ప్రీమియం వసూలు చేశాయి. అందులో ఏఐసీ వాటానే అధికంగా ఉండటం గమనార్హం. ఏళ్లుగా ఏఐసీ ఒక్కటే రైతు పంటల బీమాను అమలు చేస్తోంది. కానీ, ఈ రబీలో వైదొలగడంపై మాత్రం వ్యవసాయశాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బీమా కంపెనీ పోటీ నుంచి లేకపోతే ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశముందని అంటున్నారు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. రబీలో 2 కంపెనీలకు... పది పంటలు ఈ రబీలో బజాజ్ అలియంజ్, చోల ఎంఎస్ బీమా ప్రైవేటు కంపెనీలకు 10 పంటలకు బీమా అప్పగిస్తూ వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. వరి, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుములు, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మిరప, ఉల్లి పంటలకు పీఎంఎఫ్‌బీవై పథకం కింద బీమా వర్తింపచేస్తారు. డబ్ల్యూబీసీఐఎస్ పథకంలో మామిడికి అవకాశం కల్పించారు. మొక్కజొన్న, శనగ పంటలకు డిసెంబర్ 15వ తేదీ వరకు ప్రీమియం చెల్లించడానికి రైతులకు గడువు ఖరారు చేశారు. మిగిలిన పంటలన్నింటికీ ఆ నెలాఖరు వరకు గడవు ఇచ్చారు. బ్యాంకు రుణాలు తీసుకునే రైతులకు, తీసుకోనివారికీ ఇవే గడువులు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. మామిడికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 5 శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లించాలి. మిగిలిన పంటలన్నింటికీ ఆయా జిల్లాల్లో ఖరారు చేసిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌లో 1.5 శాతం ప్రీమియం చెల్లించాలి. రాష్ట్రంలోని జిల్లాలను రెండు క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్‌ను ఒక్కో బీమా కంపెనీకి అప్పగిస్తారు.