‘బీమా’ అందరాని అందలం? | pradhan mantri fasal bima yojana not helpful for farmers | Sakshi
Sakshi News home page

‘బీమా’ అందరాని అందలం?

Published Wed, Nov 9 2016 2:16 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

‘బీమా’ అందరాని అందలం? - Sakshi

‘బీమా’ అందరాని అందలం?

విశ్లేషణ
ప్రధాన మంత్రి ఫసల్ యోజన పథకం సక్రమంగా అమలు కాకపోతే తలెత్తే సమస్యలపై కనీస అంచనా సైతం లేకుండానే దాన్ని ప్రభుత్వం చేపట్టింది. అది వాటిని గుర్తించక పోయైనా ఉండాలి లేదా ప్రైవేటు కంపెనీలపై అతి విశ్వాసాన్ని ఉంచైనా ఉండాలి అనిపిస్తుంది. కానీ ఈ విషయమై వస్తున్న వార్తా కథనాలను బట్టి చూస్తే... రైతులకు పంటల బీమాను కల్పించడం వల్ల బీమా సంస్థలకు కలగడానికి అవకాశం ఉన్న నష్టానికి బీమా రక్షణగానే ఈ పథకాన్ని చేపట్టారని అనిపిస్తోంది.
 
అట్టహాసంగా ప్రారంభించిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎమ్ ఎఫ్‌బీవై) పథకం సమస్యల్లో పడ్డట్టుంది. మచ్చుకు ఇది చూడండి. అకాల వర్షాల వల్ల రాజస్తాన్‌లోని నాగౌర్ జిల్లాలో పంటలు దెబ్బ తిన్నాయి. ఈ పంట నష్టాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తేవడం కోసం వందలాది మంది రైతులు నానా పాట్లూ పడ్డారు. వారు ఇచ్చిన టోల్ ఫ్రీ ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ పని చేయడంలేదని, ఎవరిని సంప్రదించాలో తమకు తెలియ దని రైతులు వాపోతున్నారు. పొరుగునున్న హరియాణాలోని గోహన జిల్లాలో ఏదో తెగులు సోకి వరి పంట దెబ్బతింది. తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేయాలని 700 మందికి పైగా రైతులు కోరారు. రైతులు ఏడు రోజుల నిరాహార దీక్ష చేసిన తర్వాత గానీ పంట నష్టాన్ని అంచనా వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది కాదు.
 
రైతులకు, పాలనా యంత్రాంగానికి మధ్య ఘర్షణ ఇలా ఉండగా, హరి యాణా వ్యవసాయ శాఖ అధికారులు పంట కోత ప్రయోగాల (దిగుబడిని అంచనా కట్టడం కోసం చేపట్టేవి) నిర్వహణకు నిరాకరించారు. వ్యవసాయ అధికారులు ఆరు నెలలపాటూ ఎలాంటి సమ్మెలు చేయరాదంటూ అత్యవసర సర్వీసుల చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినా ఫలితం లేక పోయింది. వ్యవసాయ శాఖ అధికారులు చెప్పేదాన్ని బట్టి ఖరీఫ్ పంట మార్కెట్లకు చే రడం మొదలయ్యేటప్పుడు పంట కోత అంచనా చేపట్టం వల్ల  పంట నష్టానికి బీమా సొమ్మును చెల్లించాలని కోరే రైతులకు నష్టం జరుగు తుంది.
 
రైతుల కోసమా? బీమా సంస్థల కోసమా?
 అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరుతూ మధ్యప్రదేశ్‌లో ఎన్నోచోట్ల రైతులు ఆందోళనలు చేపట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అకాల వర్షాలు లేదా వడగళ్ల వానల వల్ల పంటలు దెబ్బతింటే పదిహేను రోజుల లోగా చర్య తీసుకుంటామని, నెలలోగా నష్టపరిహారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వాగ్దానం చేశారు. మహారాష్ట్రలోని పత్రికల నిండా పంట నష్టాన్ని అంచనా కట్టడంలో బీమా కంపెనీల వైఫల్యా నికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి.
 

రాజస్తాన్ పత్రిక వెలువరించిన ఈ కథనాన్నే తీసుకోండి. పెసర, నువ్వు, పత్తి, వేరుశనగ, సజ్జ, జొన్న తదితర పంటలకు ఈ ఫసల్ బీమా వర్తిస్తుంది. పెసరకు చెల్లించగల అత్యధిక నష్ట పరిహార బీమా మొత్తం రూ. 16,130. అంటే పంట విలువలో ఇంచుమించుగా 40 శాతం. రాష్ట్ర వ్యవసాయ శాఖ తయారుచేసిన అంచనాల ప్రకారం పెసర దిగుబడి సగటున హెక్టారుకు 7 క్వింటాళ్లు. పెసర కనీస మద్దతు ధరనే తీసుకున్నా, దాదాపు హెక్టారుకు దిగుబడి విలువ రూ 40,000 అవుతుంది. అంటే, 60 శాతం పంట నష్టం  జరి గినా బీమా కంపెనీ ఆ మొత్తం నష్టాన్నంతటినీ భరించదు. పంటల బీమా విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను శాసన సభలో లేవనెత్తినప్పుడు సైతం ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పి తాత్సారం చేస్తోందని రైతుల ఫిర్యాదు.   
 
పైన పేర్కొన్న వార్తా నివేదికలను బట్టి ప్రధానమంత్రి ఫసల్ యోజన పథకం సక్రమంగా అమలు కాకపోతే తలెత్తే సమస్యలపై కనీస అంచనా సైతం లేకుండానే దాన్ని ప్రభుత్వం చేపట్టిందని అర్థమౌతుంది. ప్రభుత్వం, తాము రూపొందించిన పద్ధతిలో ఈ పథకాన్ని అమలు చేయడంలో తీవ్ర సమస్యలున్నాయనే విషయాన్ని గుర్తించకపోయి అయినా ఉండాలి లేదా ప్రైవేటు కంపెనీలపై అతి విశ్వాసాన్ని ఉంచైనా ఉండాలి. అయితే నేనింత వరకు చదువుతున్న విషయాలను, విశ్లేషణలను బట్టి చూస్తే...  రైతులకు పంట నష్టానికి బీమా రక్షణను కల్పించడం వల్ల ప్రైవేటు కంపెనీలకు కలగ డానికి అవకాశం ఉన్న నష్టానికి బీమాను కల్పించేదిగానే ఈ పథకాన్ని చేపట్టారని అనిపిస్తోంది.
 
జవాబుదారీతనం సున్న
 పంట నష్టాలను, చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని బహిరంగ వేలం ప్రాతి పదికపై అంచనాకట్టడమే నేను అలా అనుకోవడానికి కారణం. ప్రపంచంలో ఎక్కడా ఇలా బహిరంగ వేలం ద్వారా  నిర్దేశిత ప్రాంతంలో పంటల బీమాను అందించడం కోసం ఏ బీమా కంపెనీ ఇంతవరకు ముందుకు రాలేదు. ప్రభుత్వ రంగంలోని అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఏఐసీ ఎల్) సహా మొత్తం దాదాపు 12 బీమా కంపెనీలున్నాయి. అవి ఒక్కొక్క జిల్లాకు తాము అందించగల ప్రీమియంలను కోట్ చేస్తునాయి. ప్రీమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్పాలు సమానంగా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యవహారం దేనిలోనైనా సబ్సిడీ మొత్తం ఎంత అనేదే నిర్ణయా త్మకమైన అంశం అవుతుంది. రైతులు ఖరీఫ్ పంటల విషయంలో 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, ఉద్యానవన పంటలకు 5 శాతం ప్రీమియం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
 
అందువల్ల వాతావరణపరంగా తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే గడ్డు ప్రాంతాలుగా గుర్తింపు పొందిన వాటిని ప్రభుత్వ బీమా సంస్థకు వదిలి పెట్టే శారు. మిగతా ప్రాంతాల్లో సైతం ప్రైవేటు కంపెనీలు కోట్ చేసిన ప్రీమియం పరిమితులకు ప్రాతిపదిక వాటి వాణిజ్య లాభదాయకతే గానీ, పంట నష్టం మాత్రం కాదు. ఇలాంటి దాన్ని అసలు ఎంత మాత్రమూ అనుమతించనే కూడదు. ప్రైవేటు కంపెనీలు ఎలాంటి జవాబుదారీతనం వహించకుండా తమ ఇష్టానుసారం గరిష్ట లాభాలను ఆర్జించడానికి అవకాశాలను కల్పిం చడమే ప్రభుత్వ ఉద్దేశమని ఇది స్పష్టంగా తెలుపుతోంది. రాజస్తాన్‌నే తీసు కోండి. ఆ రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌లో దాదాపు 35 శాతం ప్రధాని ఫసల్ బీమా యోజన అమలుకే పోతోంది. బీమా కంపెనీలు అధిక ప్రీమియం రేట్లను కోట్ చేయడమూ, వాటిని తగ్గించేలా చేయడానికి ప్రభుత్వం వద్ద యంత్రాంగం లేకపోవడమే అందుకు కారణం.
 
ముందస్తు పెట్టుబడే లేని వ్యాపారం
పంట నష్టాన్ని అంచనా వేయడం, పంట కోత అంచనాలు వంటి పనుల కోసం, సిబ్బంది సహా సరిపడా మౌలిక సదుపాయాల కల్పన కోసం  ఎలాంటి ముందస్తు పెట్టుబడి పెట్టకుండానే ప్రైవేటు కంపెనీలు లాభాలు ఆర్జించడానికి పంటల బీమా అద్భుత వ్యాపార అవకాశంగా మారింది. పంట కోత ప్రయోగాల బాధ్యతలను ప్రైవేటు బీమా కంపెనీలే చేపట్టాలని హరి యాణాలో సమ్మె చేస్తున్న వ్యవసాయ అధికారులు కోరడం న్యాయ సమ్మ తమైనది, సమంజసమైనది. జిల్లాకు 24 పంట కోత ప్రయోగాలను  నిర్వహిం   చాలని ఈ పథకం కింద నిర్దేశించారు. అంటే దేశవ్యాప్తంగా 40 లక్షల పంట కోత ప్రయోగాలను నిర్వహించాల్సి ఉంటుంది. వీటికి అయ్యే వ్యయాలను ప్రైవేటు కంపెనీలు ఎందుకు కల్పించవు?
 
ఈ ఫసల్ బీమా యోజన దాదాపుగా రూ. 18,000 కోట్ల వ్యాపారం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ పథకంపై ఖర్చు ఒక్కసారిగా రూ.12,000 కోట్ల మేరకు పెరిగిపోయింది. స్కూటరుకో లేదా కారుకో బీమా చేయించుకోమని మనల్ని కోరడానికి బీమా కంపెనీలు ఏజెంట్లను నియమి స్తాయి. అదే పంటల బీమా బీమా ప్రీమియంలను బలవంతంగా రైతుల నుంచి వసూలు చేస్తాయి. బ్యాంకుల ద్వారా అవి రైతుల ప్రీమియంలను వారి ఖాతాల నుంచి నేరుగా మినహాయించేసుకోవడం అంటే... అదీ కూడా పంట నష్టాన్ని అంచనా కట్టడానికి సైతం పైసా పెట్టుబడి పెట్టకుండానే చేయడం అంటే విచిత్రం కాదూ! ఈ వ్యాపారం చేయడానికి అనువుగానే ఈ పథకాన్ని రూపొందించారో లేక అజ్ఞానం వల్లనో ఇలా జరిగిందో నాకు తెలియదు.

 ఫసల్ బీమా అర్థవంతం కావాలంటే...
 ఈ బీమా పథకాన్ని మరింత అర్థవంతం చేయడం కోసం ఈ సూచనలను చేస్తున్నాను:
 1.    బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే రైతుల బ్యాంకు ఖాతాల నుంచి ఫసల్ బీమా ప్రీమియం మొత్తాలను మినహాయించేసుకోవడాన్ని ఆపాలి. తాము ఏ పంటలకు బీమా చేశామో కూడా తెలియకుండానే బీమా కంపెనీలు బ్యాంకుల నుంచి నేరుగా ప్రీమియంలను వసూలు చేసేసుకుంటున్నాయి.
 2.    బీమా ప్రీమియంలను నిర్ధారించడానికి బహిరంగ వేలం పద్ధతిని నిలిపివేయాలి. దానికి బదులుగా వాతావరణ ప్రాతిపదికపై పంటల పరిస్థితిని, జిల్లాల వారీగా ప్రీమియం మొత్తాలను నిర్ధారించడానికి ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలి.
 3.    బీమా కంపెనీలు కోత ప్రయోగాలకు తగిన నిపుణ శ్రామిక శక్తిని తయారుచేసుకునేలా చేయాలి. ఇది విద్యావంతులైన, నిపుణ యువతకు ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది.
 4.    పంట నష్టాన్ని, బీమా చెల్లింపు మొత్తాన్ని లెక్కగట్టడానికి బీమా కంపెనీలు రైతు పొలాన్ని యూనిట్‌గా తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలి. ఒక బ్లాక్ మొత్తాన్ని ఒక యూనిట్‌గా తీసుకునే ప్రాతిపదికపై పంట నష్టాలను అంచనా కట్టడానికి వీల్లేదు.
 5.    నష్ట భయం ఉన్న 50 జిల్లాల్లోనే 60 శాతం పంటల బీమా అమలు రుగుతోంది. కాబట్టి ఈ జిల్లాలన్నింటిలోనూ బీమా కంపెనీలలోని పతి ఒక్కటీ రైతు పొలాన్ని యూనిట్‌గా తీసుకుని అమలుచేసే పంటల బీమా పథ కాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం కోరవచ్చు. అలా చేయకుండా ప్రభుత్వాన్ని అడ్డుకునేదేమీ లేదు.
 

 దేవిందర్‌శర్మ
 వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
 ఈమెయిల్ : hunger55@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement