సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. దీనిపై కరీంనగర్‌లో ఇటీవల జరిగిన రైతు సదస్సులో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా అధికారులు మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు పంటలు నష్టపోతేనే ప్రభుత్వం రైతుకు బీమా పరిహారం ఇచ్చేది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.6 లక్షలు అందించే అవకాశం ఉండేది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకంలో అన్నదాతలు సాధారణ మరణం పొందినా, ఆత్మహత్యలకు పాల్పడినా, ప్రమాదంలో మృతిచెందినా ఆయా కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ బీమా కోసం ఏడాదికి రూ.300 చొప్పున ప్రీమియం చెల్లించాలి.
దాన్ని కూడా ప్రభుత్వమే రైతుల తరపున చెల్లిస్తుందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్పాయి. రైతులకు చెల్లించే బీమా పరిహారంలో రూ.2 లక్షలు కేంద్రం, రూ.3 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. కొత్త పథకం వచ్చాక ఆత్మహత్యల కింద ఇస్తున్న రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా పథకాన్ని ఎత్తివేస్తారు.
సాగుకు రూ. 15 వేల కోట్లు...
బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ. 15 వేల కోట్లు కేటాయించాలని వ్యవసాయశాఖ ఆర్థికశాఖకు ప్రతిపాదించినట్లు తెలిసింది. సచివాలయ వర్గాల సమాచారం ప్రకారం రైతుకు పెట్టుబడి సాయం పథకానికి రూ. 12 వేల కోట్లు, రైతు బీమాకు రూ. 500 కోట్లు, రైతు వేదికల నిర్మాణానికి రూ. 200 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 522 కోట్లు, వడ్డీలేని రుణాలకు రూ. 500 కోట్లు, పంటల బీమాకు రూ. 210 కోట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు రూ. 775 కోట్లు, విత్తన చైన్ పథకానికి రూ. 180 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు చేశారు.
ఏది సాధారణ మరణం... ఏది ఆత్మహత్య?
రాష్ట్రంలో దాదాపు 72 లక్షల మంది రైతులున్నట్లు ఇటీవల భూప్రక్షాళన సర్వే సందర్భంగా ప్రభుత్వం అంచనా వేసింది. ఆ ప్రకారం ప్రతి రైతుకూ ఏటా ప్రభుత్వమే రూ. 300 చొప్పున బీమా ప్రీమియం చెల్లిస్తుంది. కేంద్ర నేర గణాంకాల లెక్కల ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మంది రైతుల్లో ఏడాదికి 12 మంది చొప్పున మరణిస్తున్నారని అంచనా.
ఆ ప్రకారం ప్రభుత్వం రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టిందని, ఆ లెక్కల ప్రకారమే బడ్జెట్ కేటాయింపులు చేస్తుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు రైతులు పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటే జిల్లాల్లో ఆర్డీవో, డీఎస్పీ, వ్యవసాయాధికారి ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీలు నిర్ధారించేవి. ఏవి వ్యవసాయ సంబంధిత ఆత్మహత్యలో, ఏవి కావో త్రిసభ్య కమిటీలే అంచనా వేసేవి. కమిటీలు రూపొందించే జాబితాల ఆధారంగా వ్యవసాయ సంబంధిత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ. 6 లక్షల చొప్పున పరిహారం చెల్లించేది.
అయితే ఇక నుంచి రైతులు ఎవరైనా ఆత్మహత్యలకు పాల్పడినా, సాధారణ మరణం పొందినా కూడా ఆయా కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా పరిహారం అందనుంది. దీనివల్ల ఎవరు ఆత్మహత్య చేసుకున్నారో కూడా నిర్ధారించాల్సిన, జాబితాలు తయారు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. ఫలితంగా రైతు ఆత్మహత్యలపై రాజకీయ దుమారం చెలరేగకుండా ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment