‘అసలు దోషి రాష్ట్ర ప్రభుత్వమే’
► 2012లో రైతులు ప్రీమియం చెల్లిస్తే ఇంతవరకూ బీమా రాలేదు
►ఎస్‌డీపీ, ఉపాధి నిధులను టీడీపీ కార్యకర్తలకు దోచిపెడుతున్నారు
►పనులన్నీ నామినేషన్‌పై అప్పగించడం దుర్మార్గం
►జిల్లాలో రూ.470కోట్ల నిధులు దుర్వినియోగం
►దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
►ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
కడప కార్పొరేషన్: 2012వ సంవత్సరం శనగపంట బీమా మంజూరు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ఇందులో అసలు దోషి ప్రభుత్వమేనని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. 2012 పంటల బీమాకు సంబంధించి మొదటి విడత 25వేల మంది రైతులకు రూ.130కోట్లు, రెండో విడత 11262 మందికి రూ.55కోట్లు అందిందన్నారు.
ఇంకా 20 వేల మంది రైతులు బీమా కోసం ఎంతో ఆందోళనతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఏఐసీ కార్యాలయం ఎదుట ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధర్నా చేశాక ఏడాదిన్నర కిందట అప్పటి వ్యవసాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగిందన్నారు. ఆ సమావేశం తర్వాత ఎలాంటి పొరపాట్లు లేని ప్రతిపాదనలకు వెంటనే బీమా చెల్లించాలని, మిగిలినవి రీవెరిఫికేషన్ చేయాలని నిర్ణయించారన్నారు. ఈ మేరకు రీవెరిఫికేషన్‌లో భాగంగా రెండో విడతలో 11,262 మంది అర్హత సాధించారన్నారు. ఇంకా 20వేలమందికి బీమా రావలసి ఉందన్నారు.
క్రాప్ సోయింగ్ డేట్ లేదనే కారణంతో ఈ దరఖాస్తులను పక్కనబెట్టారన్నారు. దీనికి కూడా అదే సమావేశంలో పరిష్కార మార్గం చూపినట్లు పేర్కొన్నారు.వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి మండలం నుంచి క్రాప్ సోన్ డేటా తెప్పించి ఇన్‌స్రూ?న్స్ కంపెనీకి అప్పగించారని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ వాటా ఇస్తామని లేఖ ఇస్తే కేంద్ర వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని 2016 ఏప్రిల్ 28న కేంద్ర వ్యవసాయ శాఖ లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం దానిపై ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ తరుపున కేంద్రానికి లేఖ రాసి పెండింగ్‌లో ఉన్న బీమా మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.
విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఇస్తున్న స్పెషల్ డెవెలప్‌మెంట్ ప్యాకేజీ నిధులు, ఉపాధి హామీ నిధులు తెలుగుదేశం కార్యకర్తల జేబులు నింపడానికే తప్పా అభివృద్ధికి ఉపయోగపడటం లేదని ఎంపీ అవినాష్‌రెడ్డి విమర్శించారు. మూడేళ్లలో ఎస్‌డీపీ నిధులు రూ.150కోట్లు వచ్చాయని, ఉపాధి హామీ పథకం నిధులను నీరు–చెట్టు పనులకు మరలించి రూ.320కోట్లకు ప్రొసీడింగ్స్ ఇచ్చారన్నారు. మొత్తం రూ.470కోట్ల నిధులను టెండర్లు లేకుండా నామినేషన్‌పై టీడీపీ నాయకులు, కార్యకర్తలకు దోచిపెట్టారని దుయ్యబట్టారు.
ప్రజల ఓట్లతో ఎన్నికైన మేయర్, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఎస్‌డీపీ కింద నిధులు ఇవ్వమని లేఖలిస్తే ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. ఒక్క కడపలోనే టీడీపీ జిల్లా అధ్యక్షుడి లేఖపై గత కలెక్టర్ రూ. 4.62కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారన్నారు. వెంటనే ఆ ప్రతిపాదనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే స్థానిక సంస్థల్లో ఉన్న అధికారులతో కాకుండా వేరే శాఖ అధికారులతో పనులు చేయించడమంటే ఖచ్ఛితంగా అధికార దుర్వినియోగం చేయడమేనన్నారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపైనైనా పద్దతి మారాలని, ప్రజా ప్రతినిధులు ఇచ్చే ప్రతిపాదనలకు విలువ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పాకా సురేష్‌కుమార్, చల్లా రాజశేఖర్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఎస్సీ విభాగం అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్, చీర్ల సురేష్‌యాదవ్ పాల్గొన్నారు.