ఇంకెన్నడు?
– నెలలు గడుస్తున్నా అతీగతీ లేని ఇన్‌పుట్, ఇన్సూరెన్స్
– పట్టించుకోని మంత్రులు, అధికార యంత్రాంగం
– కష్టాల్లో రైతన్నలు
అనంతపురం అగ్రికల్చర్ : గత అక్టోబర్‌తో ఖరీఫ్ పంట కాలం ముగిసిపోయింది. ఈ జనవరితో రబీ కూడా పూర్తయ్యింది. మునుపెన్నడూ లేని విధంగా నైరుతి, ఈశాన్య రుతుపవనాలు మొహం చాటేశాయి. దీంతో 495 మిల్లీమీటర్ల (మి.మీ) సాధారణ వర్షపాతానికి గాను 285 మి.మీ మాత్రమే నమోదైంది. అంటే 47 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. ఇవి కూడా అననుకూల సమయంలో అడపాదడపా తేలికపాటిగా పడ్డాయి.
దీనివల్ల 7.53 లక్షల హెక్టార్ల ఖరీఫ్, 45 వేల హెక్టార్లలో రబీ పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటీవల కేంద్ర కరువు బృందం కూడా జిల్లాలో పర్యటించి దుర్భిక్ష పరిస్థితులను కళ్లారా చూసెళ్లింది. జిల్లాకు తక్షణ సాయంగా రూ.2,168 కోట్లు ఇవ్వాలని కలెక్టర్ కోనశశిధర్ కేంద్ర బృందానికి నివేదిక సమర్పించి చేతులు దులిపేసుకున్నారు. పంట కాలం ముగిసిన రెండు, మూడు నెలల్లోగా ఇవ్వాల్సిన పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ), హక్కుగా రావాల్సిన వాతావరణ బీమా గురించి మంత్రులు గానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదు.
రూ.2,874 కోట్ల పంట నష్టం
గత ఖరీఫ్‌లో వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, కొర్ర, పెసర, అలసంద, ఉలవ, మినుము, సోయాబీన్, పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర 16 రకాల పంటలు 7.53 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్నాయి. రూ.2,874 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను నష్టపోయినట్లు వ్యవసాయశాఖ నివేదిక తయారు చేసింది. ఈ క్రమంలో రూ.1,075.46 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి అధికారులు వేర్వేరుగా నివేదికలు అందజేశారు. ఆ తర్వాత మరోసారి గ్రామాల వారీగా పర్యటించి ఈ–క్రాప్ బుకింగ్‌లో నమోదైన పంట వివరాలతో పాటు ఈ–క్రాప్ బుకింగ్ చేసుకోని రైతుల నుంచి అర్జీలు తీసుకున్నారు. ఆ వివరాలన్నీ క్రోడీకరించి తుది నివేదిక తయారు చేస్తున్నారు.
మొక్కుబడిగా ఇన్సూరెన్స్
ఈసారి బజాజ్ అలయంజ్ అనే ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో వాతావరణ బీమా పథకం అమలు చేశారు. జిల్లాలో 5.50 లక్షల మంది రైతులు తమ వాటాగా రూ.52 కోట్ల వరకు ప్రీమియం చెల్లించారు. వర్షాలు కురవకపోవడం, పంటలు దారుణంగా దెబ్బతినడంతో వాతావరణ బీమా పరిహారం తగినంత వస్తుందని రైతులు ఆశించారు. కానీ.. రూ.367 కోట్ల పరిహారం మాత్రమే మంజూరైంది. దీన్ని రెండు నెలల కిందటే ప్రకటించారు. మండలాల వారీగా పంట విస్తీర్ణం, పరిహారం వర్తింపు, రైతుల సంఖ్య ప్రకటించకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు. ప్రాథమిక నివేదిక ప్రకారం 63 మండలాల పరిధిలో 4.94 లక్షల మంది రైతులకు రూ.367 కోట్లు వర్తింపజేశారని తెలుస్తోంది.
అధికారిక నివేదికల ప్రకారం 90 శాతానికి పైగా పంట దెబ్బతిన్నా, పంట కోత ప్రయోగాల్లో కూడా ఈ విషయమే తేలినా పరిహారం మాత్రం మొక్కుబడిగా మంజూరు కావడం గమనార్హం. ఖరీఫ్ పంట కాలంలో 18 వారాల్లో 13 వారాల పాటు తీవ్ర బెట్ట పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా అంతటా 180 వర్షపాత విరామాలు (డ్రై స్పెల్స్) నమోదయ్యాయి. ఎకరాకు 85 కిలోల వేరుశనగ మాత్రమే పండినట్లు అధికారులు నివేదిక తయారు చేశారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏమీపట్టనట్లు వ్యవహరిస్తోంది. చివరకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌కు ముడిపెట్టి, అంతో ఇంతో పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకోవడానికి ప్రయత్నిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారిక నివేదిక ప్రకారం పంట నష్టం వివరాలిలా...
–––––––––––––––––––––––––––––––––
జిల్లాలో దెబ్బతిన్న పంటల విస్తీర్ణం : 7,53,132 హెక్టార్లు
పంటల వారీగా నష్టం : రూ.2,874.44 కోట్లు
ఇన్‌పుట్ సబ్సిడీ ప్రతిపాదనలు : రూ.1,075.46 కోట్లు
నష్టపోయిన రైతుల సంఖ్య : 6,93,003 మంది
––––––––––––––––––––––––––––––––
ఆరేళ్లుగా వాతావరణ బీమా పరిస్థితి ఇలా...
–––––––––––––––––––––––––––––––––––––
సంవత్సరం పరిహారం(రూ.లలో) రైతులసంఖ్య
–––––––––––––––––––––––––––––––––––––
2011 98.28 కోట్లు 3,63,157
2012 181.82 ,, 3,08,131
2013 226.93 ,, 4,22,613
2014 25.61 ,, 47,627
2015 109.68 ,, 1,85,618
2016 367.00 ,, 4,94,069
–––––––––––––––––––––––––––––––––––