government negligance
-
గూడు గోడు ‘పట్టా’ని సర్కార్
– ఇంటిపట్టాల కోసం ఎమ్మెల్యే విశ్వ దశలవారీ పోరాటాలు – అయినా స్పందించిన పాలకులు – సీఎం పర్యటన నేపథ్యంలోనైనా పట్టాల పంపిణీకి మోక్షం కలిగేనా? ఉరవకొండ: నిరుపేదలందరికీ సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉరవకొండ పట్టణంలోని పేదలకు ఇంటి పట్టాలిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం 2008లో 88 ఎకరాల స్థలాన్ని రూ.కోటి వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే అప్పటి నుంచి పట్టాలు పంపిణీ చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. మున్సిపాలిటీ హోదా కల్గిన ఉరవకొండ పట్టణంలో 45 వేలకు పైగా జనాభా ఉన్నారు. ఇందులో 70 శాతం వరుకు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలూ అధికమే. అందుకే బాడుగ ఇళ్లలో అంటూ అద్దెలు కట్టలేక వారంతా అల్లాడిపోతున్నారు. ఇల్లు మంజూరు చేయకపోయినా కనీసం పట్టాలైనా ఇస్తే గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తామని పేదలంతా అధికారులను కోరుతున్నారు. కానీ వారి గూడుగోడు ఎవరికీ పట్టడం లేదు. పట్టాల పంపిణీకి గ్రహణ టీడీపీ అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా నియోజకవర్గంలో ఏ మంఽఽడలంలో కుడా పేదలకు పట్టాలు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మంజురు చేసిన పాపాన పోలేదు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గతంలో ఎవరూ చేయని విధంగా దశల వారీగా పోరాటాలు చేశారు. అయితే ఎమ్మెల్యే ఆందోళనతో దిగొచ్చిన అధికారులు పూటకో ప్రకటన చేస్తూ పట్టాలు పంపిణీ చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతం పట్టాలు పంపిణీ చేస్తే ఎమ్మెల్యేకు పేరు వస్తుందని భావించిన స్థానిక టీడీపీ నాయకులు అధికారుల పైఒత్తడి తెచ్చి పట్టాలు పంపిణీ కాకుండా చూస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈనెల 8న సీఎం చంద్రబాబు ఉరవకొండకు వస్తున్న నేపథ్యంలో తమకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తారని అర్హులైన పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. స్థలమున్నా పట్టాలివ్వడం లేదు ఎన్నో ఏళ్ల నుంచి ఇంటి పట్టాల కోసం ఎదురు చూస్తున్నాం. వైఎస్సార్ హయాంలో భూమి కొనుగోలు చేశారు. ఆ స్థలంలో పట్టాలిచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వానికి తీరిక లేకుండా పోయింది. మాలాంటి పేదేళ్ల బాధలు వాళ్లకు ఎప్పుడు అర్థమవుతాయో. అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నాం. -జైబూన్, ఉరవకొండ కనికరం చూపండి ఇంటి పట్టాల కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటికైనా మా మీద కనికరం చూపాలి. కూలీ పనులు చేసుకుని బతికే మేము.. బాడుగ చెల్లించలేక పోతున్నాం. కనీసం ఇప్పుడైనా అధికారులు మాకు పట్టాలివ్వాలి. -నిర్మల, ఉరవకొండ -
ఇంకెన్నడు?
– నెలలు గడుస్తున్నా అతీగతీ లేని ఇన్పుట్, ఇన్సూరెన్స్ – పట్టించుకోని మంత్రులు, అధికార యంత్రాంగం – కష్టాల్లో రైతన్నలు అనంతపురం అగ్రికల్చర్ : గత అక్టోబర్‌తో ఖరీఫ్ పంట కాలం ముగిసిపోయింది. ఈ జనవరితో రబీ కూడా పూర్తయ్యింది. మునుపెన్నడూ లేని విధంగా నైరుతి, ఈశాన్య రుతుపవనాలు మొహం చాటేశాయి. దీంతో 495 మిల్లీమీటర్ల (మి.మీ) సాధారణ వర్షపాతానికి గాను 285 మి.మీ మాత్రమే నమోదైంది. అంటే 47 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. ఇవి కూడా అననుకూల సమయంలో అడపాదడపా తేలికపాటిగా పడ్డాయి. దీనివల్ల 7.53 లక్షల హెక్టార్ల ఖరీఫ్, 45 వేల హెక్టార్లలో రబీ పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటీవల కేంద్ర కరువు బృందం కూడా జిల్లాలో పర్యటించి దుర్భిక్ష పరిస్థితులను కళ్లారా చూసెళ్లింది. జిల్లాకు తక్షణ సాయంగా రూ.2,168 కోట్లు ఇవ్వాలని కలెక్టర్ కోనశశిధర్ కేంద్ర బృందానికి నివేదిక సమర్పించి చేతులు దులిపేసుకున్నారు. పంట కాలం ముగిసిన రెండు, మూడు నెలల్లోగా ఇవ్వాల్సిన పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ), హక్కుగా రావాల్సిన వాతావరణ బీమా గురించి మంత్రులు గానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. రూ.2,874 కోట్ల పంట నష్టం గత ఖరీఫ్‌లో వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, కొర్ర, పెసర, అలసంద, ఉలవ, మినుము, సోయాబీన్, పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర 16 రకాల పంటలు 7.53 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్నాయి. రూ.2,874 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను నష్టపోయినట్లు వ్యవసాయశాఖ నివేదిక తయారు చేసింది. ఈ క్రమంలో రూ.1,075.46 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి అధికారులు వేర్వేరుగా నివేదికలు అందజేశారు. ఆ తర్వాత మరోసారి గ్రామాల వారీగా పర్యటించి ఈ–క్రాప్ బుకింగ్‌లో నమోదైన పంట వివరాలతో పాటు ఈ–క్రాప్ బుకింగ్ చేసుకోని రైతుల నుంచి అర్జీలు తీసుకున్నారు. ఆ వివరాలన్నీ క్రోడీకరించి తుది నివేదిక తయారు చేస్తున్నారు. మొక్కుబడిగా ఇన్సూరెన్స్ ఈసారి బజాజ్ అలయంజ్ అనే ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో వాతావరణ బీమా పథకం అమలు చేశారు. జిల్లాలో 5.50 లక్షల మంది రైతులు తమ వాటాగా రూ.52 కోట్ల వరకు ప్రీమియం చెల్లించారు. వర్షాలు కురవకపోవడం, పంటలు దారుణంగా దెబ్బతినడంతో వాతావరణ బీమా పరిహారం తగినంత వస్తుందని రైతులు ఆశించారు. కానీ.. రూ.367 కోట్ల పరిహారం మాత్రమే మంజూరైంది. దీన్ని రెండు నెలల కిందటే ప్రకటించారు. మండలాల వారీగా పంట విస్తీర్ణం, పరిహారం వర్తింపు, రైతుల సంఖ్య ప్రకటించకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు. ప్రాథమిక నివేదిక ప్రకారం 63 మండలాల పరిధిలో 4.94 లక్షల మంది రైతులకు రూ.367 కోట్లు వర్తింపజేశారని తెలుస్తోంది. అధికారిక నివేదికల ప్రకారం 90 శాతానికి పైగా పంట దెబ్బతిన్నా, పంట కోత ప్రయోగాల్లో కూడా ఈ విషయమే తేలినా పరిహారం మాత్రం మొక్కుబడిగా మంజూరు కావడం గమనార్హం. ఖరీఫ్ పంట కాలంలో 18 వారాల్లో 13 వారాల పాటు తీవ్ర బెట్ట పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా అంతటా 180 వర్షపాత విరామాలు (డ్రై స్పెల్స్) నమోదయ్యాయి. ఎకరాకు 85 కిలోల వేరుశనగ మాత్రమే పండినట్లు అధికారులు నివేదిక తయారు చేశారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏమీపట్టనట్లు వ్యవహరిస్తోంది. చివరకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌కు ముడిపెట్టి, అంతో ఇంతో పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకోవడానికి ప్రయత్నిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక నివేదిక ప్రకారం పంట నష్టం వివరాలిలా... ––––––––––––––––––––––––––––––––– జిల్లాలో దెబ్బతిన్న పంటల విస్తీర్ణం : 7,53,132 హెక్టార్లు పంటల వారీగా నష్టం : రూ.2,874.44 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ప్రతిపాదనలు : రూ.1,075.46 కోట్లు నష్టపోయిన రైతుల సంఖ్య : 6,93,003 మంది –––––––––––––––––––––––––––––––– ఆరేళ్లుగా వాతావరణ బీమా పరిస్థితి ఇలా... ––––––––––––––––––––––––––––––––––––– సంవత్సరం పరిహారం(రూ.లలో) రైతులసంఖ్య ––––––––––––––––––––––––––––––––––––– 2011 98.28 కోట్లు 3,63,157 2012 181.82 ,, 3,08,131 2013 226.93 ,, 4,22,613 2014 25.61 ,, 47,627 2015 109.68 ,, 1,85,618 2016 367.00 ,, 4,94,069 ––––––––––––––––––––––––––––––––––– -
కొట్టొస్తున్న వైఫల్యం
పుష్కారాలకు కండిషన్లో లేని బస్సులు అభద్రత నీడన ప్రయాణం వరుస ప్రమాదాలకు గురవుతున్న ‘పురం’ బస్సులు హిందూపురం అర్బన్ : కృష్ణా పుష్కరాలకు కండిషన్లో లేని బస్సులు పంపుతుండడంతో మార్గమధ్యలోనే అవి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆర్టీసీ అధికారులు పర్యవేక్షణ వైఫల్యం కారణంగా వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో బస్సులో ప్రయాణించేందుకు భక్తులు భయపడుతున్నారు. ప్రత్యేకించి హిందూపురం డిపో నుంచి ఐదు బస్సులను కృష్ణా పుష్కరాల కోసం కేటాయించగా, ఈ నాలుగు రోజుల్లో నాలుగు ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనల్లో ఒక ప్రయాణికురాలు మృత్యువాతపడింది. ఇంకొందరు ఆస్పత్రుల పాలయ్యారు. తాజాగా శనివారం రాత్రి హిందూపురం నుంచి బయలుదేరిన సూపర్ లగ్జరీ బస్సు ఆదివారం తెల్లవారుజామున కృష్ణా బ్యారేజ్ దాటగానే వెనుకనున్న రెండు చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదాలపై విచారణ చేస్తున్నాం హిందూపురం డిపోకు చెందిన బస్సుల వరుస ప్రమాదాలపై విచారణ చేస్తున్నాం. డ్రైవర్ల అజాగ్రత్త వల్లనే ప్రమాదాలకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూస్తోంది. బస్సుల కండిషన్లు, ప్రయాణికుల భద్రతపై దృష్టి సారిస్తున్నాం. – రాంబాబు, డిప్యూటీ సీఎంఈ -
రాజీవ్ రహదారి విస్తరణపై పాలకుల నిర్లక్ష్యం
కొండపాక: హైదరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా రామగండం వరకు రాజీవ్ రహదారిపై నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనుల నిర్మాణాలు పూర్తి చేయించడంలో గత ప్రభుత్వం తరహాలోనే నేటి ప్రభుత్వం నడుకుంటుందని తెలంగాణా దలిత బహుజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు దేవి రవీందర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని దుద్దెడ గ్రామంలో టీఆర్ఎస్వీ జిల్లా జనరల్ సెక్రటరీ నూనె కుమార్‌తో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి రామగండం వరకు రాజీవ్ రహదారిపై పూర్తి స్థాయిలో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని కుకునూర్‌పల్లి - మంగోల్ గ్రామాల మధ్య ఉన్న రోడ్డుపై పూర్తి స్థాయిలో డివైడర్లను ఏర్పాటు చేయకపోవడంతో ఎదురెదురుగా వాహనాలు ఢీ కొంటున్నాయన్నారు.