గూడు గోడు ‘పట్టా’ని సర్కార్
– ఇంటిపట్టాల కోసం ఎమ్మెల్యే విశ్వ దశలవారీ పోరాటాలు
– అయినా స్పందించిన పాలకులు
– సీఎం పర్యటన నేపథ్యంలోనైనా పట్టాల పంపిణీకి మోక్షం కలిగేనా?
ఉరవకొండ: నిరుపేదలందరికీ సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉరవకొండ పట్టణంలోని పేదలకు ఇంటి పట్టాలిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం 2008లో 88 ఎకరాల స్థలాన్ని రూ.కోటి వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే అప్పటి నుంచి పట్టాలు పంపిణీ చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. మున్సిపాలిటీ హోదా కల్గిన ఉరవకొండ పట్టణంలో 45 వేలకు పైగా జనాభా ఉన్నారు. ఇందులో 70 శాతం వరుకు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలూ అధికమే. అందుకే బాడుగ ఇళ్లలో అంటూ అద్దెలు కట్టలేక వారంతా అల్లాడిపోతున్నారు. ఇల్లు మంజూరు చేయకపోయినా కనీసం పట్టాలైనా ఇస్తే గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తామని పేదలంతా అధికారులను కోరుతున్నారు. కానీ వారి గూడుగోడు ఎవరికీ పట్టడం లేదు.
పట్టాల పంపిణీకి గ్రహణ
టీడీపీ అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా నియోజకవర్గంలో ఏ మంఽఽడలంలో కుడా పేదలకు పట్టాలు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మంజురు చేసిన పాపాన పోలేదు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గతంలో ఎవరూ చేయని విధంగా దశల వారీగా పోరాటాలు చేశారు. అయితే ఎమ్మెల్యే ఆందోళనతో దిగొచ్చిన అధికారులు పూటకో ప్రకటన చేస్తూ పట్టాలు పంపిణీ చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతం పట్టాలు పంపిణీ చేస్తే ఎమ్మెల్యేకు పేరు వస్తుందని భావించిన స్థానిక టీడీపీ నాయకులు అధికారుల పైఒత్తడి తెచ్చి పట్టాలు పంపిణీ కాకుండా చూస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈనెల 8న సీఎం చంద్రబాబు ఉరవకొండకు వస్తున్న నేపథ్యంలో తమకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తారని అర్హులైన పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
స్థలమున్నా పట్టాలివ్వడం లేదు
ఎన్నో ఏళ్ల నుంచి ఇంటి పట్టాల కోసం ఎదురు చూస్తున్నాం. వైఎస్సార్ హయాంలో భూమి కొనుగోలు చేశారు. ఆ స్థలంలో పట్టాలిచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వానికి తీరిక లేకుండా పోయింది. మాలాంటి పేదేళ్ల బాధలు వాళ్లకు ఎప్పుడు అర్థమవుతాయో. అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నాం.
-జైబూన్, ఉరవకొండ
కనికరం చూపండి
ఇంటి పట్టాల కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటికైనా మా మీద కనికరం చూపాలి. కూలీ పనులు చేసుకుని బతికే మేము.. బాడుగ చెల్లించలేక పోతున్నాం. కనీసం ఇప్పుడైనా అధికారులు మాకు పట్టాలివ్వాలి.
-నిర్మల, ఉరవకొండ