ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆప్ నేతలు బీజేపీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని, రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలకు కాషాయ పార్టీ కౌంటరిచ్చింది. కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను రుజువు చేయలేకపోతే క్షమాపణలు చెప్పాలన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు(శనివారం) ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్..‘గత రెండు గంటల్లోనే మా పార్టీకి చెందిన 16 మంది అభ్యర్థులకు ఫోన్లు వచ్చాయి. ఆప్‌ను వీడి బీజేపీ చేరితే మంత్రి పదవి ఇస్తామని, రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారు. ఆ పార్టీకే 55కుపైగా సీట్లు వస్తుంటే.. మా అభ్యర్థులకు ఫోన్లు చేయాల్సిన అవసరం ఏముంది? దీన్నిబట్టి చూస్తే.. నకిలీ సర్వేలు నిర్వహించారని స్పష్టమవుతోంది. కొంతమంది అభ్యర్థులను లాక్కునే ఉద్దేశంతోనే ఇటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏదేమైనా మావాళ్లు ఒక్కరూ అమ్ముడుపోరు’ అని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటరిచ్చింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా స్పందిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోతుందనే కారణంగా ఆ పార్టీ నేతలంతా నిరాశతో ఉన్నారు. అందుకే ఏదేదో మాట్లాడుతున్నారు. బీజేపీ ఫోన్ కాల్స్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా వారు చేసిన ఆరోపణలను నిరూపించాలి. లేదంటూ అది ఫేక్ అని క్షమాపణలు చెప్పాలి. అలా చేయకపోతే మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము’ అని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment