ఆసక్తి రేపుతున్న అగ్నిపరీక్ష | Sakshi Editorial On Delhi Assembly Elections 2025 | Sakshi
Sakshi News home page

ఆసక్తి రేపుతున్న అగ్నిపరీక్ష

Published Wed, Feb 5 2025 12:23 AM | Last Updated on Wed, Feb 5 2025 12:23 AM

Sakshi Editorial On Delhi Assembly Elections 2025

దేశ రాజధాని ప్రాంతం ఎన్నికల సమరానికి సిద్ధమైంది. నేడు జరగనున్న ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఉత్కంఠ ఇంత చలిలోనూ వేడి పుట్టిస్తోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీలో 70 స్థానాల్లోని 699 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.56 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్న ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ సమరమిది. సోమవారం సాయంత్రం గడువు ముగిసేవరకు హోరాహోరీగా సాగిన ప్రచారంలో పార్టీల పరస్పర నిందారోపణలు పతాక స్థాయికి చేరాయి. ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశి తమ పాలన నమూనాను ఆదర్శంగా చూపితే, ఆ పాలనంతా అవినీతిమయమంటూ, అగ్రేసర కమలనాథులు మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డాలు శాంతి భద్రతల సమస్యను సైతం లేవనెత్తారు. 

గత రెండు ఢిల్లీ ఎన్నికల్లో కనీసం ఖాతా అయినా తెరవలేకపోయిన కాంగ్రెస్‌ పక్షాన రాహుల్, ప్రియాంకలు మిగతా రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు. అధికారిక నివాసాలకు ఆప్‌ ప్రజాధన దుర్వినియోగం, యమునా నది నీటి నాణ్యత, ఓటర్ల జాబితాలో అవకతవకల ఆరోపణలు పతాకశీర్షికలకు ఎక్కితే, ప్రతి పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిన ఉచిత కానుకలు ప్రజాకర్షణకు పోటీలు పడ్డాయి. నేటి ఓటింగ్, శనివారం నాటి కౌంటింగ్‌లతో కానీ రానున్న రోజులకు కానున్న ఢిల్లీ సుల్తాన్‌ ఎవరో తేలనుంది. 

ఏకోన్ముఖంగా సాగిన గడచిన 2015, 2020 నాటి ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఉత్కంఠభరిత పోరాటం సాగనుంది. ముచ్చటగా మూడోసారి ఆప్‌ విజయం నల్లేరుపై బండి నడక కాదని కేజ్రీవాల్‌కూ తెలుసు. అయితే, ప్రస్తుతం ఎక్సైజ్‌ పాలసీతో అనుచిత లబ్ధి కేసులో బెయిల్‌పై ఉన్న కేజ్రీ వాల్‌ ఇప్పటికీ కాషాయ పార్టీకి బలమైన ప్రత్యర్థే. చిత్రమేమిటంటే... ఓటర్లను కుదిపేస్తాయనుకున్న అనేక అంశాలు క్షేత్రస్థాయిలో ఏమంత ప్రభావం చూపడం లేదట. 

కేజ్రీవాల్, మనీశ్‌ సిసోడియా సహా పలువురు ‘ఆప్‌’ అగ్ర నేతల్ని జైలుకు పంపిన ఎక్సైజ్‌ కుంభకోణం కానీ, ప్రజాధన దుర్వినియోగంతో కేజ్రీవాల్‌ ఆర్భాటంగా ‘శీష్‌ మహల్‌’ కట్టుకున్నారన్న ఆరోపణలు కానీ ఓటరుల్ని పెద్దగా ఆకర్షించడం లేదని వార్త. కూటి కోసం, కూలీ కోసం దేశ రాజధానికి వచ్చి కష్టాలు పడుతున్న బడుగు వర్గాలు కాస్తంత ఊపిరి పీల్చుకొనేందుకు ఎంతో కొంత చేయడంలో ఆప్‌ సఫలమైంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం, ఉచిత మంచినీరు, ఉచిత ఆస్పత్రి – వైద్యం లాంటి ప్రభుత్వ సౌకర్యాలు అన్నీ అందరికీ సక్రమంగా అందకున్నా, ఎంతో కొంత లబ్ధి చేకూరడంతో ఆ వర్గాల్లో పార్టీ కొంత బలంగా ఉందని ఓ విశ్లేషణ.  

అదే సమయంలో ‘ఇండియా’ కూటమిలోని ఆప్, కాంగ్రెస్‌లు ఢిల్లీలో పరస్పరం అస్త్రాలు సంధించుకోవడం చిత్రమైన స్థితి. 2024 హరియాణా ఎన్నికల్లో తమ మధ్య పోరు చివరకు బీజేపీకి లాభించిన చేదు నిజం నుంచి ఈ భాగస్వామ్య పక్షాలు పాఠం నేర్చుకున్నట్టు లేదు. గతంలో ఏకధాటిగా 15 ఏళ్ళు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా ఉంది. పోగొట్టుకున్న ఇమేజ్‌ను కూడగట్టుకొనేందుకు హస్తం పార్టీ తంటాలు పడుతోంది కానీ, పరిస్థితి ‘అప్ప ఆరాటమే కానీ... బావ బతికే మార్గం లేదు’ అన్నట్టుంది. 

గమ్మత్తేమిటంటే, దశాబ్దిన్నర క్రితం కాంగ్రెస్‌పై కోపంతో మార్పు కోరిన మధ్యతరగతి జనాభా సైతం ప్రస్తుతం ఆప్‌ ఉచిత హామీలు, అంతంత మాత్రపు అభివృద్ధితో కినిసినప్పటికీ మళ్ళీ మార్పు కావాలనీ, మళ్ళీ కాంగ్రెస్‌ రావాలనీ కోరుకోవట్లేదు. వెరసి, పోటీ అంతా బలమైన ఆప్‌కీ, బీజేపీకీ మధ్యనే! హరియాణాలోని బీజేపీ సర్కార్‌ ఢిల్లీకి వచ్చే యమునా జలాల్ని విషతుల్యం చేస్తోందన్న కేజ్రీవాల్‌ బాధ్యతారహిత ఆరోపణ ఎన్నికల సంఘం (ఈసీ) తాఖీదుకు దారి తీసినా, వివరణతో ఆయన దాన్ని అధిగమించారు. బీజేపీని ఆత్మరక్షణ ధోరణిలో పడేసి, ఆరోపణలకు జవాబివ్వడంలోనే ఆ పార్టీకి పుణ్యకాలం గడిచిపోయేలా చేశారు.

స్థానిక ఢిల్లీ పీఠంపై ఆప్‌ 11 ఏళ్ళు గడపడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత సహజం. అదే సమయంలో కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టినప్పటికీ, 27 ఏళ్ళుగా ఢిల్లీ అసెంబ్లీపై జెండా ఎగరేయలేకపోయిన బీజేపీ ఈసారి చరిత్ర తిరగరాయాలని బలంగా సంకల్పించింది. దిగువ శ్రేణి జనం ఆప్‌కు అండగా నిలబడితే, ఆదాయపు నిచ్చెనలో పైకి పోయినకొద్దీ అవకాశాలను అందుకుంటున్న ప్రజానీకం మాత్రం మోదీ మార్కు బీజేపీ అభివృద్ధి మాటల వైపు మొగ్గుతున్నారు. 

ఈ సంకుల సమరంలో బీజేపీ సైతం ఓటర్ల కోసం ఉచితాల బాట తొక్కక తప్పలేదు. పనిలోపనిగా ఇంతకాలంగా భారం మోస్తున్న మధ్య తరగతి వర్గానికి తాజా కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను నుంచి భారీ ఊరట అందించింది. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో ఢిల్లీకి ప్రత్యేకించే ఏదీ చేయరాదంటూ నెల క్రితం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) హూంకరించినా, జరిగింది వేరు. పన్ను మినహాయింపు ‘ఢిల్లీకి మోదీ సర్కార్‌ కానుక’ అంటూ పత్రికల్లో మొదటి పేజీలో బీజేపీ భారీ ప్రకటనలు గుప్పించినా ఈసీ కిమ్మనలేదు. 

గత పదేళ్ళలో అధికారాలతో బలోపేతుడైన ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కానీ, ఓటర్ల జాబితాల్లో గోల్‌మాల్‌ ఆరోపణలు సహా అనేక అంశాల్లో ఇప్పుడు ఈసీ కానీ నిష్పక్షపాతంగా ఉన్నట్టు నమ్మించలేకపోయారు. ఈ నెలలోనే రిటైర్‌ కానున్న సీఈసీపై ఆప్‌ ఆరోపణల నేపథ్యంలో ఈసీ వివరణనిచ్చుకోవాల్సి వచ్చిన దుఃస్థితి. ఆరోపణలు, అనుమా నాల నేపథ్యంలో ‘ఢిల్లీలో కేజ్రీవాల్‌... కేంద్రంలో మోదీ’ అన్న మాట మారిపోయే అవకాశమూ లేక పోలేదు. అందువల్లే, ఈసారి ఢిల్లీ ఎన్నికలు ఆప్‌కు అగ్నిపరీక్షయ్యాయి. ఈ ఏటి బిహార్‌ ఎన్నికలపై, వచ్చే ఏటి బెంగాల్‌ ఎన్నికలపైనా ఈ ఫలితాల ప్రభావం తధ్యం గనక ఆసక్తి రేపుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement