పోరాడేది ముగ్గురైనా.. పోటీ ఇద్దరి మధ్యే! | AAP vs BJP in Delhi Elections 2025 | Sakshi
Sakshi News home page

పోరాడేది ముగ్గురైనా.. పోటీ ఇద్దరి మధ్యే!

Published Wed, Jan 8 2025 1:53 AM | Last Updated on Wed, Jan 8 2025 1:53 AM

AAP vs BJP in Delhi Elections 2025

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ

అస్థిత్వాన్ని కాపాడుకునే పనిలో కాంగ్రెస్‌

2015లో 67, 2020లో 62 స్థానాలతో ఊడ్చేసిన ఆప్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఢిల్లీ ఎన్నికలకు శంఖారావం మోగడంతో మూడు ప్రధాన పార్టీలు తాడోపేడో తేల్చకునేందుకు సిధ్దమవుతున్నాయి. ఎన్నికల పోరులో ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తలపడుతున్నా ప్రధాన పోటీ మాత్రం ఆప్, కాషాయ పార్టీల మధ్యే ఉండనుంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు రెండు నెలల ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కదనరంగంలోకి కాలుదువ్విన ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే ప్రచారపర్వంలో దూసుకుపోతుండగా, పరివర్తన్‌ యాత్రల పేరిట ప్రచారానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, తన ప్రభావం చూపేందుకు  సమాయత్తమయ్యారు. ఇక ప్రచార పర్వంలో కాస్త వెనుకబడ్డ కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటనలో మాత్రం ముందుంది. తన గత వైభావాన్ని పొందే పరిస్థతి లేకున్నా, అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు తంటాలు పడుతోంది.

జాతీయ పార్టీలను ఊడ్చేసిన ఆప్‌..
సామాన్యడినంటూ 2012లో ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థాపించిన కేజ్రీవాల్‌ అసమాన్య రీతిలో జాతీయ పార్టీలను తన చీపురుతో ఊడ్చేశారు. 2013లో కాంగ్రెస్‌ పొత్తుతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన కేజ్రీవాల్‌ జన్‌ లోక్‌పాల్‌ బిల్లు విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ప్రభుత్వంలోంచి దిగిపోయారు. అనంతరం 2015లో జరిగిన  ఎన్నికల్లో అసమాన్య రీతితో 70 స్థానాలకు గానూ ఏకంగా తన ఛరిష్మాతో 67 స్థానాలు సాధించిన బీజేపీ, కాంగ్రెస్‌లను మట్టి కరిపించారు. ఏకంగా 50 శాతానికి పైగా ఓట్ల శాతాన్ని పొందిన ఆప్, ఆ తర్వాత 2020లోనూ రెండు పార్టీలకు చుక్కలు చూపించింది.

2020 ఎన్నికల్లో ఆప్‌ ఏకంగా 53.57% ఓట్లతో 62 స్థానాలు సాధించింది. 38.51% ఓట్లు సాధించిన బీజేపీ కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా... షీలాదీక్షిత్‌ హయాంలో వరుసగా 15 ఏళ్ళపాటు అధికార హవాను కొనసాగించిన కాంగ్రెస్‌ పార్టీ కేవలం 4.26% ఓట్లకు పడిపోయి కనీసం ఖాతా కూడా తెరవలేదు. కాగా ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే హవాను కొనసాగించే వ్యూహంతో... ఎన్నికలకు నాలుగు నెలల ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్‌ మరోమారు జాతీయపార్టీలకు సవాల్‌ విసురుతున్నారు. 

మళ్లీ కొత్త పంథాలో ఆమ్‌ ఆద్మీ
ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన ఏకఛత్రాధిపత్యాన్ని నిరూపించుకొనేందుకు సిద్ధమైన ఆమ్‌ ఆద్మీ పార్టీ కొత్త పంథాలో దూసుకెళ్తోంది. లిక్కర్‌ స్కాం ఆరోపణల నేపథ్యంలో అప్రతిష్టపాలైన కేజ్రీవాల్‌ ఆరు నెలల జైలు జీవితం గడిపిన తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆప్‌ అధినేతగా ప్రచార బాధ్యతలను భుజస్కందాలపై ఎత్తుకున్న కేజ్రీవాల్‌... పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్‌ పథకాలతో ప్రజలకు చేరువైన ఆయన కొత్త తరహా హామీలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షలకు బీమా, ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.1 లక్ష సహాయం, మహిళా సమ్మాన్‌ యోజనలో భాగంగా మహిళలకు నెలకు రూ.2,100 ప్రత్యేక సహాయం, ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులందరికీ ఉచిత వైద్యం, హిందు, సిక్కు పూజారులకు నెలకు రూ.18 వేలు సహాయం, విదేశీ విద్యను అభ్యసించే దళిత విద్యార్థుల పూర్తి ఖర్చులను భరించేటువంటి హామీలను ఇచ్చారు. వీటితో పాటు అక్రమంగా పెంచిన నీటి బిల్లులను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని ప్రకటించారు.

ఆప్‌ హామీల ప్రకటన ప్రభావం ఎలా ఉన్నప్పటికీ కైలాష్‌ గెహ్లోత్‌ రాజీనామా, సీఎం అధికార నివాసం శీష్‌ మహల్‌పై రగులుతున్న వివాదం ఆమ్‌ ఆద్మీ పార్టీని ఇక్కట్లకు గురిచేస్తోంది. అంతేగాక ఆప్‌ అధినేతకు పోటీగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు బరిలో దిగారు. షీలా దీక్షిత్‌ కుమారుడు సందీప్‌ దీక్షిత్‌తో పాటు బీజేపీ నేత పర్వేష్‌ వర్మను ఎదుర్కోవడం కేజ్రీవాల్‌కు సవాలుగా మారింది.

పీఠం దక్కించుకోవాలన్న కాంక్షతో కమలం
ఆమ్‌ ఆద్మీ పార్టీని అప్రతిష్టాపాలు చేసి అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు బీజేపీ ప్రణాళికలను అమలు చేస్తోంది. లిక్కర్‌ స్కాం విషయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీని బజారుకీడ్చడంలో సక్సెస్‌ సాధించింది. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకే పరిమితం అయిన బీజేపీ... లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆప్, కాంగ్రెస్‌లు కలిసి పోటీచేసినప్పటికీ బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో 54.35% ఓట్లను రాబట్టుకుంది. ఇదే పంథాను కొనసాగించాలన్న బలమైన లక్ష్యంతో ఉన్న బీజేపీ... యమునా కాలుష్యం, శీష్‌ మహల్‌లో విలాస జీవితం, లిక్కర్‌ స్కాం వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఆప్‌ను ఇరుకునపెడుతోంది. సామాన్యుడు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్‌... అవినీతి సొమ్ముతో అద్దాల మేడలో విలాసంగా జీవించారంటూ బీజేపీ ప్రముఖంగా విమర్శిస్తోంది. ఈ నెల 3, 5 తేదీల్లో పరివర్తన యాత్రలో భాగంగా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ శీష్‌ మహల్‌ కేంద్రంగానే కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్‌ నేతలు మనోజ్‌ తివారీ, బాన్సురీ స్వరాజ్, ప్రదీప్‌ ఖండేల్వాల్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా వంటి నేతలు బీజేపీ గెలుపు కోసం పరిశ్రమిస్తున్నారు. 

ఒంటరి పోరులో కాంగ్రెస్‌ 
1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్‌ ప్రస్తుత ఎన్నికల్లో పరువు నిలుపుకొనేందుకు పోటీ పడుతోంది. గత రెండు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కనీస ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్‌ , ఆస్థిత్వాన్ని చాటుకునేందుకు కష్టపడుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి పోరాడి 18.19% ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ పార్టీ... ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరు చేయనుంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెరిగిన ఓట్ల శాతంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న అంశాన్ని పార్టీ బలంగా విశ్వసిస్తోంది. ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ దేవేందర్‌ యాదవ్, అల్కా లాంబ, అజయ్‌ మాకెన్, సందీప్‌ దీక్షిత్‌ వంటి  పార్టీ సీనియర్‌ నేతలు ఆప్‌కు పోటీగా ఎన్నికల హామీలు గుప్పిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement