
ఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా (Delhi Cm Rekha Gupta) ఎంపికయ్యారు. సీఎంగా బీజేపీ (bjp) ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ, స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. సీఎంగా రేఖా గుప్తా రేపు(గురువారం) మధ్యాహ్నం 12:35 గంటలకు రామ్‌లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖాగుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
26 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎం ఎంపికపై బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో 47 మంది ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై పరిశీలకులుగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ జాతీయ కార్యదర్శి ఓం ప్రకాష్ ధన్‌ఖడ్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను సీఎంగా ఎన్నుకున్నారు.
ఢిల్లీకి 4వ మహిళా సీఎంగా రేఖ గుప్తా
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. సీఎంగా ఆ పార్టీ షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖ గుప్తాను ఎంపిక చేసింది. ఢిల్లీలో బీజేపీ నుంచి చివరగా 1998లో సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీ తరుఫున ఢిల్లీ సీఎంగా సుష్మా స్వరాజ్ తర్వాత రేఖ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ కాగా, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్,ఆప్ నుంచి అతిషీ మర్లేనా సీఎంలుగా సేవలందించారు. తాజాగా రేఖ గుప్తా ఢిల్లీకి నాలుగవ మహిళా సీఎంగా పనిచేయనున్నారు.
రేఖ గుప్తా రాజకీయ ప్రస్థానం
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన యాబైఏళ్ల రేఖా గుప్తా (Who is Rekha Gupta) బీజేపీ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. ఆమె ఢిల్లీలోని షాలిమార్ బాగ్ (ఉత్తర-పశ్చిమ) నియోజకవర్గం నుండి 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 68,200 ఓట్లతో విజయం సాధించారు. రేకా గుప్తా విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. యూనివర్సిటీలో అనుబంధ డౌలత్ రామ్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్, ఆర్‌ఎస్‌ఎస్‌లో యాక్టీవ్ మెంబర్‌గా పనిచేశారు. ఢిల్లీలో మూడుసార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా,ఒకసారి మేయర్‌గా సేవలందించారు.
- 1996-97లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు.
- 2003-2004 మధ్య బీజేపీ యువ మోర్చా ఢిల్లీ కార్యదర్శిగా పనిచేశారు.
- 2004-2006 మధ్య ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.
- 2007లో ఉత్తరీ పితాంపుర, ఢిల్లీ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా గెలుపొందారు
- 2007-2009 మధ్య రెండు వరుస సంవత్సరాల పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా సంక్షేమం, బాల అభివృద్ధి కమిటీ ఛైర్ పర్సన్‌గా వ్యవహరించారు
- 2009లో ఢిల్లీ రాష్ట్ర మహిళా మోర్చా బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు
- 2010లో బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా ఎన్నియ్యారు
- 2023 ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో తన ప్రత్యర్థి,ఆప్ నేత షెల్లీ ఒబెరోయి చేతిలో ఓడిపోయారు.
2025లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రమాణ స్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు
రామ్ లీలా మైదానంలో ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత సమాచారం మేరకు.. రామ్ లీలా మైదానంలో మూడు వేదికలను సిద్ధం చేయనున్నారు. ఒక వేదికపై ఢిల్లీ కొత్త సీఎం, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే. సక్సేనా, రెండో వేదికను మత గురువులు కోసం, మూడో వేదికపై బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలకు చెందిన 200 పైగా ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం సిద్ధం చేయనున్నారు.
ఈ ప్రమాణ స్వీకారానికి ఆప్ అధినేత,మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే కాంగ్రెస్ ఢిల్లీ శాఖాధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌లను సైతం ఆహ్వానించిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment