
అందుకే అఫిడవిట్ డిమాండ్లు
బీజేపీని అడగలేదేం: రాహుల్
బిహార్‌లో ఓట్ల చోరీ వాస్తవం
‘ఓటర్ అధికార్ యాత్ర’లో ఉద్ఘాటన
పేదల ఓటు హక్కు కాపాడుతామని ప్రతిన
సాసారాం: కేంద్రం ఎన్నికల సంఘం బాగోతం దేశ ప్రజలందరికీ తెలిసిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. అధికార బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పేరిట గోల్‌మాల్‌కు తెరతీశారన్నారు.
అనుకూలురైన వ్యక్తులను ఓటర్ల జాబితాలో చేర్చి, వ్యతిరేకుల పేర్లు తొలగించి ఎన్నికల్లో నెగ్గేలా పెద్ద కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘ఈసీ–బీజేపీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోం. ఎన్నికల చోరీని బిహార్ ప్రజలు సహించబోరు. పేదల ఓటు హక్కును కాపాడి తీరతాం’’ అన్నారు. బిహార్‌లోని సాసారాంలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఓటర్ అధికార్ యాత్ర’ను రాహుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
ఓట్ల చోరీని బయటపెట్టాక ఈసీకి దిక్కుతోచడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే అఫిడవిట్ దాఖలు చేయాలనే డిమాండ్లను తెరపైకి తెస్తోందని అన్నారు. ‘‘ఈసీ వెబ్‌సైట్ నుంచి తీసుకున్న డేటాతోనే ఓట్ల చోరీని బయటపెట్టా. అలాంటప్పుడు మళ్లీ అఫిడవిట్ ఎందుకు? ఓట్ల చోరీపై బీజేపీ నేతలు కూడా ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. అఫిడవిట్ దాఖలు చేయాలని వారినెందుకు అడగలేదు? ఎన్నికల వీడియో పుటేజీ కోరితే ఈసీ స్పందించకపోవడం వెనక మతలబేమిటి?’’ అని నిలదీశారు.
ఓట్ల చోరీతోనే విజయం
‘‘ఇటీవల లోక్‌సభతో పాటు పలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీతోనే బీజేపీ గెలిచింది. మహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లను చేర్చి అధికారంలోకి వచ్చింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆదే కుతంత్రం మొదలైంది. అడ్డదారిలో నెగ్గజూస్తున్నారు. వారి కుట్రలు సాగనివ్వం. బిహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్ సహా ఎక్కడ ఓట్ల చోరీకి పాల్పడినా వారి బండారాన్ని ప్రజల ముందు పెడతాం’’ అన్నారు.
మోదీ ప్రమాదకారి: ఖర్గే
ప్రధాని మోదీని ప్రమాదకరమైన వ్యక్తిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభివరి్ణంచారు. పౌరుల ఓటు భద్రంగా ఉండాలంటే మోదీని ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకించిన ఆరెస్సెస్, సంఘ్‌ను మోదీ పొగడటం ఏమిటని మండిపడ్డారు. మోదీ పాలనలో యథేచ్ఛగా ఓట్ల చోరీ జరుగుతోందన్నారు.
16 రోజులు.. 1,300 కి.మీ.
ఓటర్ అధికార్ యాత్ర బిహార్‌లో 20 జిల్లాల గుండా 16 రోజులు.. 1,300 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో ముగుస్తుంది. ఆదివారం సభలో ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్, తేజస్వీ యాదవ్, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: