![Congress Big Defeat In Delhi Assembly Elections](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/Congress-Big-Defeat.jpg.webp?itok=DWVY7V3r)
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురబోతోంది. బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్(36) దాటి దాదాపు 44 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మరోవైపు.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు ఢిల్లీలో మరోసారి భంగపాటే ఎదురైంది. ఈసారి కూడా ఎన్నికల ఫలితాలు పూర్తి నిరాశను నింపాయి. దేశ రాజధానిలో తిరిగి సత్తా చాటాలనుకున్న కాంగ్రెస్‌కు మరోసారి మొండి చేయి ఎదురైంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి నుంచి ఆప్, బీజేపీ మధ్యే గట్టి పోటీ నడిచింది. దశాబ్దం పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్‌కు దేశ రాజధానిలో మరోసారి నిరాశే ఎదురవుతోంది. మొత్తం 70 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్.. ఒక్క చోట కూడా ప్రభావం చూపించలేకపోయింది. ఇక, 2015, 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో కూడా విజయం సాధించలేదు. సున్నా స్థానాలకే పరిమితమైంది. ఈసారి కూడా అలాంటి ఫలితమే పునరావృతమైంది. ఎన్నికల ఫలితాల్లో సందీప్ దీక్షిత్, అల్కా లాంబా, ఆరియా ఖాన్ వంటి నేతలు వెనకబడిపోయారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ పై న్యూఢిల్లీ నుంచి బరిలోకి దిగిన ఢిల్లీ మాజీ సీఎం శీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ సత్తా చాటలేకపోయాడు. న్యూఢిల్లీలో సందీప్ దీక్షిత్ మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. మరో కాంగ్రెస్ కీలక నేత అల్కా లంబా కూడా వెనబడిపోయారు. ఢిల్లీ సీఎం అతిశీకి పోటీగా కల్కాజీ నుంచి బరిలోకి అల్కా లాంబా ఎదురీదుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. దీంతో దేశ రాజధానిలో తిరిగి సత్తా చాటాలనుకున్న కాంగ్రెస్‌కు మరోసారి మొండి చేయి ఎదురైంది. ఢిల్లీలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి కీలక నేతలు ప్రచారం హోరెత్తించిన కాంగ్రెస్‌కు కలిసి రాలేదు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీకి 1952 నుంచి 2020 మధ్య ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నాలుగు సార్లు విజయం సాధించింది. అలాంటి పార్టీ ఇప్పుడు కేవలం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment