![Prashant Kishor Says Arvind Kejriwal Resignation Is Big Mistake To Lose](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/AAp.jpg.webp?itok=Q_x_hKS_)
పాట్నా: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కేజ్రీవాల్ ఓటమిపై జన్ సూరజ్ పార్టీ చీఫ్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం పాలసీ కేసులో బెయిల్ పొందిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఆయన చేసిన పెద్ద తప్పిదం అని చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్ రాజీనామా పార్టీకి తీవ్ర నష్టం కలిగించిందని వ్యాఖ్యలు చేశారు.
జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి పది సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకతనే మొదటి కారణం. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా రెండో కారణం. మద్యం పాలసీ కేసులో అరెస్టు అయినప్పుడు ఆయన పదవి నుంచి తప్పుకోవాలి. అయితే, బెయిల్ పొందిన తర్వాత రాజీనామా చేయడం, ఎన్నికలకు ముందు మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించడం పెద్ద వ్యూహాత్మక తప్పిదమే అయ్యింది.
అలాగే, ఇటీవలి కాలంలో కేజ్రీవాల్ రాజకీయ వైఖరి కూడా మారింది. ఇండియా కూటమిపై ఆయన నిర్ణయాలు కొంత దెబ్బతిశాయి. ఇదే సమయంలో ఢిల్లీ ఎన్నికల్లో కూటమితో కాకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది ఆప్ పనితీరుపై ప్రభావం చూపించింది. కేజ్రీవాల్ పరిపాలనలోని లోపాలను ప్రజలు ఎత్తి చూపించినా ఆప్ సర్కార్ పట్టించుకోలేదు. ఢిల్లీలో ఆప్ రాజకీయ ఆధిపత్యాన్ని తిరిగి పొందడం కష్టమే. ఇక, ఎంతో కష్టపడితే కానీ, కేజ్రీవాల్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరింది. ఎన్నికల్లో 70 అసెంబ్లీ సీట్లలో 48 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఇక, ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. వరుసగా మూడోసారి ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment