
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఆమోదిస్తే.. గుజరాత్‌కు వచ్చిన నష్టమేంటని ప్రధాని మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ఆలోచనా విధానం.. బీసీలకు వ్యతిరేకమన్న ఆయన.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జంతర్ మంతర్‌లో జరిగిన బీసీ సంఘాల పోరు గర్జనలో పాల్గొని ఆయన ప్రసంగించారు.
బీసీల లెక్క తేలకుండా రిజర్వేషన్లు ఇవ్వలేమని కోర్టులు చెబుతున్నాయి. లెక్కలు పక్కగా తీస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుంది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. అందరి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అందుకే అధికారంలోకి వస్తే కులగణన చేయిస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. జనగణనతోనే కులగణన చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానం. అందుకే కేంద్రం కుట్రపూరితంగా జనగణన కూడా చేయడం లేదు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కులగణన చేయడం లేదు. మండల్ కమిషను కు వ్యతిరేకంగా.. కమండల్ తెచ్చిన చరిత్ర బీజేపీది.
దేశ రాజకీయాలకు తెలంగాణ ఓ వెలుగు. రాహుల్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. తెలంగాణలో 56.36 శాతం అని పక్కాగా తేల్చాం. ఫిబ్రవరి 4వ తేదీన సోషల్ జస్టిస్ డే జరుపుకుంటున్నాం. బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం. రిజర్వేషన్ల పెంపు కేంద్ర పరిధిలోని అంశం. అందుకే కేంద్రానికి పంపాం. మేం తెలంగాణలో రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాం. గుజరాత్‌లో ఇవ్వాలని కాదు. తెలంగాణలో రిజర్వేషన్లు ఆమోదిస్తే గుజరాత్‌కు వచ్చిన నష్టమేంటి?. విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు అమలైతేనే బీసీలకు న్యాయం జరుగుతుంది.

బీసీల రిజర్వేషన్లు పెంచాలనే కోరిక అసంబద్ధమైంది కాదు. అందుకు పలు పార్టీలు కూడా మద్దతు ఈ వేదికపై ప్రకటించాయి. ఎవరేం అనుకున్నా బీసీలకు మేం అడగా నిలబడతాం. మా రాష్ట్రంలో మేం పెంచుకుంటే.. మీకేంటి నష్టం. మేమంతా మద్దతు ఇస్తున్నా మీకు వచ్చిన నష్టమేంటి?. మీ కుర్చీ.. ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం అని మేం అనడం లేదు. మాకు మీ ప్రాణాలొద్దు.. 42 శాతం రిజర్వేషన్లు కావాలి. ప్రధాని మోదీ మా గుండె చప్పుడు వినాలి. రిజర్వేషన్లకు అనుమతిస్తే పది లక్షల మందితో మోదీకి సన్మానం చేస్తాం. మాకు అనుమతి ఇవ్వకపోతే దేశమంతా కార్చిలా ఉద్యమిస్తాం.
అధికారం, చట్టం మీ చేతుల్లో ఉందని మాపై ఆధిప్యతం చెలాయించాలని చూడకండి. బలం లేకపోయినా వక్ఫ్ బిల్లు తెచ్చారు...మరి బీసీ బిల్లుకు అభ్యంతరం ఏమిటి?. మేం సయోధ్యకు వచ్చాం. గల్లీలో వినిపించుకోవడం లేదని.. ఢిల్లీలో గళం వినిపించేందుకు వచ్చాం. యుద్ధభేరి మోగించే ముందు ఢిల్లీకి రావాలని వచ్చాం. రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపాలి. ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం. చెప్పిన మాట వినకపోతే మా సత్తా చూపిస్తాం. తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వని తండ్రీకొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టాం. రిజర్వేషన్లపై దిగి రావాలి.. లేదంటే దిగిపోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలు వీళ్ల సంగతి తేల్చాలి అని రేవంత్ పిలుపు ఇచ్చారు.
బీసీ రిజర్వేషన్లు బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలనే డిమాండ్‌తో హస్తినలో బీసీ గర్జన జరగ్గా.. దేశవ్యాప్తంగా పలు పార్టీల అధినేతలు, ప్రతినిధులు హాజరై మద్ధతు ప్రకటించారు.