
బీసీ రిజర్వేషన్ల అంశంపై అన్ని పార్టీల నేతలం వచ్చి కలుస్తాం: ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
రాష్ట్ర అసెంబ్లీ రెండు బిల్లులను ఆమోదించిందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే అంశంలో సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతూ సోమవారం రాత్రి లేఖ రాశారు. ‘‘రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానం మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కులగణన సర్వే నిర్వహించాం. ఆ సర్వే నివేదికల ఆధారంగా రాష్ట్రంలోని బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో రెండు బిల్లులను పెట్టి చర్చించాం. అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చాయి. బిల్లులు ఆమోదం పొందాయి. ఈ చర్చ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం సహకారం కోరాలని రాజకీయ పక్షాలు సూచించాయి. ఈ మేరకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పార్టీల తరఫున మిమ్మల్ని కలసి మీ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాం. సానుకూలంగా స్పందించి అపాయింట్‌మెంట్ ఇవ్వగలరు’’అని ఆ లేఖలో సీఎం కోరారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టండి
రైల్వేశాఖ ఇటీవల ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కోరుతూ రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు సీఎం సోమవారం రాత్రి లేఖ రాశారు. చర్లపల్లి టెర్మినల్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ లాజిస్టిక్ హబ్‌గా మరో కేంద్రం ఏర్పాటు కావడం సంతోషకరమని చెప్పారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును ఈ టెర్మినల్‌కు పెట్టడం సముచితమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment