
ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌పై ధ్వజమెత్తిన కేటీఆర్
కాంగ్రెస్ వైఫల్యాలను బీజేపీ ప్రశ్నించదు
ఢిల్లీకి మూటలు పంపే ధ్యాసలోనే రేవంత్
సూర్యాపేటలో వరంగల్ బహిరంగ సభ సన్నాహక సమావేశం
సూర్యాపేట: కేంద్రంలో బడేభాయ్ మోదీ, రాష్ట్రంలో చోటే భాయ్ రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఒక్కటేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను బీజేపీ ప్రశ్నించదని, రేవంత్ అవినీతిని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. ఢిల్లీకి మూటలు పంపి పదవులు కాపాడుకునే ధ్యాస తప్ప సీఎం రేవంత్‌రెడ్డికి మరొకటి లేదని ధ్వజమెత్తారు.
ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్ బహిరంగ సభ కోసం గురువారం సూర్యాపేటలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించే వరంగల్ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రేవంత్‌కు పర్సంటేజీలపైనే దృష్టి
చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డికి పర్సనాలిటీ పెంచుకోవడం మీద కంటే పర్సంటేజీలు పెంచుకోవడం మీదనే ఎక్కువ ఆసక్తి ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ పాపమే రైతన్నకు శాపంలా మారిందన్నారు. రైతులకు రావాల్సిన రూ.37 వేల కోట్లు ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాం«దీ, మల్లికార్జున ఖర్గే ఖాతాల్లో టింగు టింగు అంటూ పడుతున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు అధికారం మాత్రమే పోయిందని, ప్రజల్లో అభిమానం మాత్రం అలాగే ఉందని చెప్పారు.
చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది.. అలాగే కాంగ్రెస్ కంచర గాడిదలను చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలిసి వచ్చిందన్నారు. సమావేశానికి ముందు సూర్యాపేటలో పార్టీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ, జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment