మూడు దఫాల్లో రూ.17,869.22 కోట్లు ఇచ్చాం
మాట ఇచ్చిన ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేశాం
మిగిలిన వారికి కూడా నిర్ణీత గడువులో మాఫీ చేస్తాం
మహారాష్ట్రలో ప్రధాని వ్యాఖ్యలకు సీఎం రేవంత్ స్పందన
మాఫీ గణాంకాలను వివరిస్తూ మోదీకి లేఖ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతాంగానికి రూ. 2లక్షల రుణమాఫీ ప్రక్రియను మాట ఇచ్చిన ప్రకారం పూర్తి చేశామంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖ లో ఆ వివరాలను ప్రస్తావించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు మాఫీ చేయలేదని, ఇలాంటి మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దంటూ వ్యా ఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ లేఖను ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ హామీ అంటే బంగారు హామీ అని తెలంగాణ రైతులు నమ్మారని, అలాంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రుణమాఫీ చేసి దేశానికి కొత్త పంథా చూపెట్టామని ఎక్స్‌లో పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ అభివృద్ధికి భవిష్యత్‌లో కేంద్రం నుంచి తగిన సహకారం అందించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ కోరారు.
లేఖలో ఏం రాశారంటే...!
ప్రధాని మోదీకి రాసిన లేఖలో మూడు దఫాలు గా రైతు రుణమాఫీని తెలంగాణలో అమలు పరిచిన తీరును సీఎం రేవంత్ వివరించారు. ఈ ఏడాది జూలై 18న రూ.లక్ష లోపు రుణమాఫీకి సంబంధించి 11,34,412 రైతు ఖాతాల్లో రూ. 6,034.97 కోట్లు జమ చేశామని, జూలై 30న రూ.1.50 లక్షలలోపు మాఫీ కోసం 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6,190.01 కోట్లు జమ చేశామని, ఆగస్టు 15వ తేదీన రూ.2లక్షల వరకు మాఫీ కోసం 4,46,832 మంది ఖాతాల్లో రూ. 5,644.24 కోట్లు జమ చేశామని వెల్లడించారు.
మొత్తం కేవలం 27 రోజుల వ్యవధిలో రూ.17,869.22 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులు ఆ ఎక్కువ ఉన్న రుణాన్ని బ్యాంకుల్లో కడితే రూ. 2 లక్షలు ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధంగా ఉందని, ఈ ప్రక్రియను కూడా నిర్ణీత గడువులో పూ ర్తి చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్‌లో పారదర్శకత కోసం అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని, అప్పు ల ఊబి నుంచి రైతులను విముక్తి చేయడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ పూర్తి చేశామని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment