పైసల్లేవ్.. పత్రాలు పెట్టుకోండి..
- ఇన్‌పుట్, ఇన్సూరెన్స్ పంపిణీపై గందరగోళం
- 19 నుంచి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పత్రాలు
- రుణమాఫీ మాదిరిగానే అవుతుందంటూ అన్నదాతల్లో ఆగ్రహావేశాలు
- వ్యవసాయ శాఖ అధికారుల్లో గుబులు
అనంతపురం అగ్రికల్చర్ :
‘పైసల్లేవు.. ప్రస్తుతానికి పత్రాలు పెట్టుకోండి.. పరిహారం ఇచ్చినప్పుడు తీసుకోండి’ అంటూ రైతులను మరోసారి మోసపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన రుణ ఉపశమన పత్రాల మాదిరిగానే ఇప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ), వాతావరణ బీమాకు కూడా పత్రాలు ఇవ్వనుంది. ‘పెట్టుబడి రాయితీ మంజూరు పత్రాల’ పేరుతో వీటిని ఈ నెల 19 నుంచి రైతులకు పంపిణీ చేయనుంది. చేతిలో చిల్లిగవ్వ లేక ఖరీఫ్ పంటల సాగుకు దిక్కులు చూస్తున్న రైతులు.. ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక వ్యవసాయ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఇన్‌పుట్‌పై గందరగోళం
తీవ్ర వర్షాభావం కారణంగా 2016 ఖరీఫ్‌లో 6.73 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేసిన వేరుశనగతో పాటు ఇతర అన్ని రకాల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో పెట్టుబడి రాయితీ కింద 6,25,050 మంది రైతులకు రూ.1,032.42 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులకు ఈ నెల రెండు నుంచి పంపిణీ చేస్తామని మొదట తెలిపింది. ఆ తర్వాత 9వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి వేస్తామని కలెక్టర్ చెప్పారు. అనంతరం 14 నుంచి పంపిణీ ఉంటుందని ఆశ పెట్టారు. ఇలా తేదీలన్నీ పోయినా పరిహారంపై ఏమీ తేల్చలేకపోయారు. ఈ నెల 9న రాయదుర్గంలో జరిగిన ఏరువాక పౌర్ణమి సభలో సీఎం చంద్రబాబు ఇన్‌పుట్ సబ్సిడీకి సంబంధించిన ‘మెగా చెక్కు’ విడుదల చేశారు. ఉన్నపళంగా ఇప్పుడు మంజూరు పత్రాలు ఇస్తామంటూ కొత్తపల్లవి అందుకోవడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇన్సూరెన్స్‌ను లాగేసుకుంటున్న ప్రభుత్వం
హక్కుగా రావాల్సిన వాతావరణ బీమా పరిహారాన్ని రైతులకు నేరుగా ఇవ్వకుండా ప్రభుత్వం లాగేసుకుంటోంది. వేరుశనగ రైతులు గత ఏడాది పంట రుణాల రెన్యూవల్స్‌లో వాతావరణ బీమా పథకం కింద ప్రీమియం చెల్లించారు. తమ వాటాగా పంట రుణాల మొత్తంలో 2 శాతం ప్రీమియం అంటే మొత్తం రూ.56 కోట్లు చెల్లించారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా 8 శాతం జమ చేశాయి. అంటే ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేసిన బజాజ్ అలయంజ్ కంపెనీకి ప్రీమియం రూపంలో రూ.280 కోట్ల వరకు జమ అయ్యింది. దెబ్బతిన్న పంటల విలువను బట్టి చూస్తే బీమా కింద రూ.2 వేల కోట్ల వరకు రావాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ... నియమ నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా లెక్కకట్టిన బజాజ్ కంపెనీ అధికారులు 5.07 లక్షల మంది రైతులకు రూ.419 కోట్ల పరిహారం మంజూరు చేస్తున్నట్లు వారం రోజుల కిందట ప్రకటించారు. ఈ మొత్తమైనా ఇచ్చారా అంటే అదీ లేదు. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని లాగేసుకుని ఇన్‌పుట్ సబ్సిడీకి లింకు పెట్టి పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వం ఇచ్చేది రూ.60 కోట్లే
ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌కు లింకు పెట్టి వ్యవహారం నడుపుతుండటంతో కేంద్ర ప్రభుత్వం, బజాజ్ కంపెనీ ఇచ్చేది పోనూ రాష్ట్ర ప్రభుత్వం భరించేది రూ.60 కోట్లకు మించి ఉండదంటున్నారు. ఇవన్నీ పక్కనపెట్టి ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ రూపంలో పెద్ద మొత్తంలో ఇచ్చి ఆదుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. నిధులు విడుదల చేయకుండానే పెట్టుబడి రాయితీ మంజూరు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.