ఇంకెన్నాళ్లో
► 2012–13 రబీ బీమా కోసం ఎదురుచూపులు
► కొందరికి మోదం..మరికొందరికి ఖేదం
► 11 వేల మందిలో చాలా మండలాల్లో జమకాని వైనం
► ఎప్పుడొస్తుందా అని ఆశగా అడుగుతున్న రైతన్నలు
► త్వరలో పడొచ్చంటున్న బ్యాంకర్లు, వ్యవసాయశాఖ
సాక్షి, కడప: పంట నష్టపోయినప్పుడు ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. ఒకవేళ అలా జరగని పక్షంలో రైతన్న కట్టిన ప్రీమియంకు బీమా వచ్చేలా కృషి చేయడం మరో విధి. కానీ ఏ దానికీ ముందుకు రాకుండా ప్రభుత్వం రైతన్నలతో చెలగాటమాడుతోంది. ప్రకృతి చేసిన గాయంతో కోలుకోలేని దెబ్బ తగిలి అల్లాడిపోతున్న అన్నదాతపై కనికరం చూపాల్సిన ప్రభుత్వం ఏళ్లు గడుస్తున్నా బీమా అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో ప్రతిపక్ష నాయకులు బీమా కోసం పోరాటం చేసూ్తనే ఉన్నారు. 2012–13 రబీకి సంబంధించి నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా.. ఇన్సురెన్స్ అధికారులు రైతులకు బీమా అందించే విషయం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సవాలక్ష కారణాలు చూపి మళ్లీ వాటికి లెక్కలు సరిచేసి వ్యవసాయశాఖ ద్వారా నివేదికలు తెప్పించుకున్నా ఇప్పటికీ బీమా అందించడంలో కాకిలెక్కలు చూపుతున్నారు. జిల్లాలోని అనేక మం డలాల్లో 2012–13లో బుడ్డశనగ పంట వేసి తీవ్రంగా నష్టపోయారు. బీమా విషయంలో ఇన్సురెన్స్ కంపెనీతోపాటు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ కడప ఎంపీ వైఎస్ అవి నాష్‌రెడ్డి పలుమార్లు ఆందోళనలు చేపట్టారు.
కొందరికి ఖేదం..మరికొందరికి మోదం..: జిల్లాలో ఇప్పటికే రెండు విడతలుగా పంపిణీకి శ్రీకారం చుట్టిన ఇన్సురెన్స్ కంపెనీ ఇప్పటికీ రెండవ విడతలో మంజూరైన రైతులకు బీమా సొమ్ము అందించలేదు. చాలా రోజులుగా ఈరోజు, రేపు అంటూ ఖాతాల్లో జమ చేస్తామంటూ దాదాపు నెలలు గడుస్తున్నా అతీగతి లేదు. చివరికి అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా రైతులకు ఇచ్చేవారు లేరు. అయితే రెండవ విడత 11 వేల మంది రైతుల ఖాతాలకు బీమా సొమ్ము జమచేయాల్సి ఉంది. అయితే ఒక మండలంలో బీమా సొమ్మును అందించిన అధికారులు మిగతా మండలాల్లోని రైతులకు అందించకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తొండూరు, లింగాల, పులివెందులతోపాటు వేముల, ముద్దనూరు, రాజుపాలెం, పెద్దముడియం తదితర మండలాల రైతుల ఖాతాలకు జమ చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.
నివేదికలు వెళ్లి నెలలు గడిచినా..: జిల్లాలో 2012–13 రబీ బుడ్డశనగ రైతులకు సంబంధించి నివేదికలు వెళ్లి నెలలు గడుస్తున్నా బీమా అందించడంలో ఆలస్యం జరుగుతోంది. సుమారు 11 వేల మంది రైతుల ఖాతాలకు రెండవ విడత మంజూరు చేశారు. అందులో కొంతమంది రైతులకు సంబం ధించి సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ..ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన పాస్ పుస్తకాల జిరాక్స్‌లను వ్యవసాయశాఖ ద్వారా కడపకు తెప్పించుకుని అక్కడి నుంచి ఇన్సురెన్స్ కంపెనీకి నివేదిక రూపంలో పంపించి దాదాపు ఆరేడు నెలలు దాటినా ఇంతవరకు బీమా మొత్తాలు పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
అదే పనిలో ఉన్నారు....త్వరలో అందుతాయి: జిల్లాలోని కొన్ని మండలాల రైతుల ఖాతాల్లో రెండవ విడత సొమ్ము పడింది. మరికొన్ని మండలాల్లోని రైతులకు పడాల్సి ఉంది. అదే పనిలోనే హైదరాబాదులో అధికారులు నిమగ్నమై ఉన్నారు. త్వరలోనే ఇన్సురెన్స్ కంపెనీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అప్పట్లో రైతులకు సంబంధించి కొన్ని నివేదికలు కూడా పంపించి చాలా రోజులైంది. మంజూరైన ప్రతి రైతుకు బీమా సొమ్ము అందుతుంది. – ఠాగూర్ నాయక్, జేడీ, వ్యవసాయశాఖ