రైతుకు దూరంగా ‘వ్యవసాయ బీమా’
రాష్ట్రంలో మొదటిసారిరైతు పంటల బీమాపై ఏఐసీ విముఖత
రబీలో రెండు ప్రైవేటు కంపెనీలకు 10 పంటల బీమా అప్పగింత
ఖరీఫ్‌లో 6.55 లక్షల మంది రైతుల ప్రీమియం.. ఇందులో ఏఐసీ వాటానే అధికం
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం(డబ్ల్యూబీసీఐఎస్)లను రబీ సీజన్‌లో అమలు చేసే బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వ్యవసాయ బీమా కంపెనీ(ఏఐసీ) వైదొలగింది. రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్వహించిన బిడ్‌లలో కేవలం మూడు ప్రైవేటు కంపెనీలే పాల్గొన్నాయి. ఏఐసీ పాల్గొనలేదు. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి పీఎంఎఫ్‌బీవై పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచే మొదటిసారిగా ప్రైవేటు బీమా కంపెనీలకు దారులు తెరిచింది. ఖరీఫ్‌లో పీఎంఎఫ్‌బీవై పథకాన్ని ఏఐసీ సహా బజాజ్ అలియంజ్ జీఏసీ లిమిటెడ్ అమలు చేశాయి.
వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీఐఎస్)ను రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఎస్‌బీఐ జీఐసీ లిమిటెడ్‌లు అమలు చేశాయి. పీఎంఎఫ్‌బీవై పథకం అమలు కోసం రాష్ట్రంలో మూడు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. అన్ని కంపెనీలు కలసి ఈ ఏడాది ఖరీఫ్‌లో 6.55 లక్షల మంది రైతుల నుంచి రూ.85 కోట్లు ప్రీమియం వసూలు చేశాయి. అందులో ఏఐసీ వాటానే అధికంగా ఉండటం గమనార్హం. ఏళ్లుగా ఏఐసీ ఒక్కటే రైతు పంటల బీమాను అమలు చేస్తోంది. కానీ, ఈ రబీలో వైదొలగడంపై మాత్రం వ్యవసాయశాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బీమా కంపెనీ పోటీ నుంచి లేకపోతే ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశముందని అంటున్నారు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని చెబుతున్నారు.
రబీలో 2 కంపెనీలకు... పది పంటలు
ఈ రబీలో బజాజ్ అలియంజ్, చోల ఎంఎస్ బీమా ప్రైవేటు కంపెనీలకు 10 పంటలకు బీమా అప్పగిస్తూ వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. వరి, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుములు, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మిరప, ఉల్లి పంటలకు పీఎంఎఫ్‌బీవై పథకం కింద బీమా వర్తింపచేస్తారు. డబ్ల్యూబీసీఐఎస్ పథకంలో మామిడికి అవకాశం కల్పించారు. మొక్కజొన్న, శనగ పంటలకు డిసెంబర్ 15వ తేదీ వరకు ప్రీమియం చెల్లించడానికి రైతులకు గడువు ఖరారు చేశారు. మిగిలిన పంటలన్నింటికీ ఆ నెలాఖరు వరకు గడవు ఇచ్చారు. బ్యాంకు రుణాలు తీసుకునే రైతులకు, తీసుకోనివారికీ ఇవే గడువులు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. మామిడికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 5 శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లించాలి. మిగిలిన పంటలన్నింటికీ ఆయా జిల్లాల్లో ఖరారు చేసిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌లో 1.5 శాతం ప్రీమియం చెల్లించాలి. రాష్ట్రంలోని జిల్లాలను రెండు క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్‌ను ఒక్కో బీమా కంపెనీకి అప్పగిస్తారు.