ఎగసాయం | Input subsidy, PMFBY, the only one in weather insurance | Sakshi
Sakshi News home page

ఎగసాయం

Published Fri, Jun 16 2017 9:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

ఎగసాయం - Sakshi

ఎగసాయం

► అన్నదాత ప్రయోజనాలకు తూట్లు
► ఇన్‌పుట్‌ సబ్సిడీ, పీఎంఎఫ్‌బీవై, వాతావరణ బీమాల్లో ఏదో ఒక్కటే..
► కరువు రైతులకు తీరని అన్యాయం
► ప్రభుత్వ తీరుతో సర్వత్రా విస్మయం
► బీమా సొమ్ముతో ఖజానా నింపుకునే కుట్ర
► ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు, రైతు సంఘాలు


కష్టాల్లోని రైతులను ఆదుకోవాల్సిన కనీస ధర్మం ప్రభుత్వానిది. వరుస కరువుతో అల్లాడుతున్న అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోయినా ఊరట కల్పించలేకపోయింది. ఖరీఫ్‌ సీజన్‌లో పెట్టుబడుల కోసం రైతుల అవస్థలు వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాత నోటికందాల్సిన సాయం విషయంలోనూ సర్కారు కుట్ర పన్నింది. మూడు రకాల పరిహారం విషయంలో ఒక్కటే వర్తింపజేసి ఆ నిధులను నొక్కేసే ప్రయత్నం చేస్తోంది.

కర్నూలు(అగ్రికల్చర్‌): ఇన్‌పుట్‌ సబ్సిడీ.. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా.. వాతావరణ బీమా.. వీటిలో ఏదో ఒక్కటి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు దక్కాల్సిన సొమ్ముతో సొంత ఖజానా నింపుకునేందుకు కుట్ర పన్నింది. 2016లో ప్రభుత్వం 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. ఇందులో 10 మండలాల్లో కరువు లేదని అధికారులు తేల్చారు. 26 మండలాల్లోనే అనావృష్టి ప్రభావంతో పంటలు దెబ్బతిన్నట్లు నివేదిక సిద్ధం చేశారు. ఈ మండలాలకు పెట్టుబడి రాయితీ కింద(ఇన్‌పుట్‌ సబ్సిడీ) రూ.325 కోట్లు మంజూరయ్యాయి. 2,50,128.68 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా.. 3,10,766 మంది రైతులు నష్టపోయారు. ఇదిలాఉంటే త్వరలోనే ప్రధానమంత్రి ఫసల్‌ బీమా, వాతావరణ ఆధారిత బీమా పరిహారం కూడా విడుదల కానుంది. అయితే రైతుల సంక్షేమం, అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తున్నామని గొప్పలు చెప్పుకునే టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు అదే రైతుల నోటికాడి సొమ్ము లాగేస్తోంది. మూడింట్లో ఏదో ఒక్కటి మాత్రమే వర్తింపజేస్తామని ప్రకటించడం విస్మయానికి గురిచేస్తోంది. కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న అన్నదాతకు ఈ చర్య మింగుడు పడటం లేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎప్పటికి విడుదలవుతుందో తెలియకపోయినా.. ఈనెల 19 నుంచి కరువు మండలాల్లో రైతులకు అందుకు సంబంధించిన పత్రాలు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో మండలాల వారీగా ఏఏ రైతుకు ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా, వాతావరణ ఆధారిత బీమా పరిహారం వచ్చిందనే విషయాలపైనా వ్యవసవయాధికారులు ఆరా తీస్తున్నారు. ఒక రైతుకు ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా, వాతావరణ బీమా పరిహారం వచ్చినట్లయితే.. వీటిలో ఏది ఎక్కువుంటే ఆ ఒక్కదానినే రైతులకు చెల్లించనున్నారు. ఇదే జరిగితే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

రైతుల్లో ఆందోళన
గత ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి వేరుశనగకు వాతావరణ బీమా కింద రూ.41కోట్లు విడుదల కానుంది. గత ఏడాది ఖరీఫ్‌లో బ్యాంకులు రూ.2870.62 కోట్ల పంట రుణాలు పంపిణీ చేశాయి. జూలై 31లోపు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న వారందరికీ నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తిస్తుంది. వరికి గ్రామం యూనిట్‌గా బీమా కల్పించారు. వరికి సంబంధించి ఆగస్టు 31 వరకు బ్యాంకుల నుంచి పంట రుణాలు చెల్లించిన రైతులకు బీమా వర్తిస్తుంది. ఈ ప్రకారం దాదాపు 2 లక్షల మందికి బీమా వర్తించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఏదో ఒక్కటి మాత్రమే ఇస్తామని ప్రకటించడంతో రైతుల ఆందోళన అంతా, ఇంతా కాదు.

బీమా సొమ్ముపై ప్రభుత్వం కన్ను
బీమా పొందాలంటే రైతులు ముందుగా ప్రీమియం చెల్లిస్తారు. ఇది రైతుల వ్యక్తిగతం. బీమా పరిహారం పొందడం రైతుల హక్కు. అయితే ఈ బీమా కింద రైతులకు వచ్చే పరిహారంపై ప్రభుత్వం కన్నేసింది. కరువు రైతులకు ఎలాగూ ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం కదా.. మళ్లీ బీమా ఎందుకు అంటూ ఏదైనా ఒక్కటి మాత్రమే అనే షరతు పెట్టింది. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా వస్తే ఏది ఎక్కువగా ఉంటే దానిని ఇచ్చి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం తమ ఖజానాకు మళ్లించనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు ఏదో ఒక్కటి మాత్రమే చెల్లించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా వివరాలను మండలాలకు పంపి ఏదైనా ఒక్కటే అనే నిబంధనను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.

రైతుల హక్కులను హరించడం దారుణం
బీమా అనేది రైతుల హక్కు. ముందుగా ప్రీమియం చెల్లిస్తే పంటలు దెబ్బతిన్నప్పుడు పరిహారం లభిస్తుంది. అనావృష్టి వల్ల పంటలు దెబ్బతిన్నపుడు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. ఇన్‌పుట్‌ సబ్సిడీ పొందడం కూడా రైతుల హక్కే. ప్రభుత్వం రైతుల హక్కులను కాలరాస్తోంది. రైతుల దక్కాల్సిన సాయాన్ని నొక్కేయాలనుకోవడం క్షమించరాని విషయం. – ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి, సీపీఎం

రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ,  బీమా ఇవ్వాల్సిందే..
రైతులు వరుస కరువులతో అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం రైతులకు తీవ్ర నష్టం కలిగించే నిర్ణయం తీసుకోవడం దారుణం. ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా వస్తే రెండూ ఇవ్వడం కోనేళ్లుగా జరుగుతోంది. 2016 కరువుకు సంబంధించి ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమాల్లో ఏదో ఒక్కటే ఇచ్చేలా చర్యలు తీసుకోవడం తగదు. ప్రభుత్వం రైతుల సొమ్ముకు ఎసరు పెట్టడం అన్యాయం. దీనిపై పోరాటం చేస్తాం.   – జగన్నాథం, రైతు సంఘం జిలా కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement