దిగుబడి తగ్గి.. దుఃఖం మిగిలి | Onion Price Decreased In TDP Govt | Sakshi
Sakshi News home page

దిగుబడి తగ్గి.. దుఃఖం మిగిలి

Published Mon, Sep 3 2018 7:13 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

Onion Price Decreased In TDP Govt - Sakshi

కర్నూలు మార్కెట్‌ యార్డుకు వచ్చిన ఉల్లి(ఫైల్‌)

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదంటారు. అయితే ఉల్లి పండించే రైతులకు మాత్రం ఎలాంటి మేలూ జరగడం లేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడులు తగ్గినా..గిట్టుబాటు ధర లభించడం లేదు. తీవ్ర నష్టాలు వచ్చి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదు. రాష్ట్రంలో ఉల్లి పంట అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే సాగు అవుతోంది. ఖరీఫ్‌ సాధారణ సాగు 20,357 హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 18,500 హెక్టార్లలో సాగైంది. దిగుబడులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఎకరాకు కనీసం 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చి.. ధర రూ.1500 లభిస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఈ ఏడాది వర్షాభావంతో ఉల్లి పంట దెబ్బతిని..ఎకరాకు సగటున 50 క్వింటాళ్లు కూడా రావడం లేదు. కర్నూలు మార్కెట్‌లో ధర రూ.800 కూడా పలకడం లేదు.
   
పట్టించుకోని ప్రభుత్వం.. 
ధరలు లేనపుడు ఉల్లి రైతులు నష్టపోకుండా టీడీపీ మంత్రులు స్పష్టమైన హామీలు  ఇచ్చారు. గతంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న పరటాల సునీత.. కర్నూలు మార్కెట్‌ను సందర్శించి గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నదాతలకు భరోసానిచ్చారు. ధరలేనప్పుడు ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేస్తుందని చెప్పారు. హామీ ప్రస్తుతం అమలు కావడం లేదు. ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా దక్కకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో జిల్లాలో ఇద్దరు ఉల్లి రైతులు బలవన్మరణాలకు పాల్పడారు.  ధర వచ్చింటే బాబూరావు 
బతికుండేవాడేమో.. 
సి.బెళగల్‌ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన బండారి బాబురావు రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు. అప్పు తెచ్చి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. వర్షాభావ పరిస్థితుల్లో కేవలం 35 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. దీనిని కర్నూలు మార్కెట్‌కు తీసుకరాగా.. క్వింటాకు రూ.600 మాత్రమే ధర లభించింది. చేతికి రూ.21 వేలు మాత్రమే రావడంతో అప్పు తీర్చే మార్గం కానరాక గత నెల 28న కర్నూలు మార్కెట్‌ యార్డులోనే పురుగుల మందుతాగాడు. చికిత్స పొందుతూ... శనివారం మృతిచెందాడు. గిట్టుబాటు ధర వచ్చి ఉంటే బాబురావు బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు.
 
90 శాతం రైతులకు అతి తక్కువ ధరే.. 
కర్నూలు మార్కెట్‌కు వచ్చే ఉల్లి రైతుల్లో పది శాతం మందికి క్వింటాకు రూ.300లోపే ధర లభిస్తోంది. 30 శాతం మంది రైతులకు రూ.301 నుంచి రూ.600 వరకు ధర వస్తోంది. ఎక్కువగా 50 శాతం మంది తెచ్చిన సరుకుకు రూ.601 నుంచి రూ.800 వరకు ధర  లభిస్తోంది. మొత్తం 90 శాతం మంది రైతులకు గిట్టుబాటు ధర లేదనే చెప్పొచ్చు.  కేవలం 10 శాతం మంది రైతులకు మాత్రమే రూ.1000 ఆపైన ధర లభిస్తోంది.   

నష్టాలను ఎలా భరించాలి? 
మూడు ఎకరాల్లో ఉల్లిసాగు చేశాను. పెట్టుబడులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోతే అప్పు తెచ్చుకున్నాను. ఎకరాకు రూ.50 వేల ప్రకారం రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాను. వర్షాలు పడక పంట అభివృద్ధి చెందలేదు. బోరు ఉన్నా నీరు అడుగంటి పోయింది. దిగుబడులు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గాయి. ప్రస్తుత ధరల్లో అమ్ముకుంటే రూ.60వేలు కూడా దక్కే పరిస్థితి లేదు. నష్టం రూ.90వేల వరకు ఉంటోంది. ఇంత భారీ స్థాయిలో నష్టాలను ఎలా భరించాలో తెలియడం లేదు.  వెంకటేష్, పొన్నకల్‌ గ్రామం, గూడూరు మండలం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement