kurnool agriculture
-
గద్వాల నుంచి జిల్లాలోకి..
కర్నూలు(అగ్రికల్చర్) : రాష్ట్రంలో పత్తి సాగయ్యే జిల్లాల్లో కర్నూలు ప్రధానమైంది. జిల్లాలో దాదాపు 3 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగవుతుంది. కొద్ది నెలలుగా పత్తి ధరలు ఆశాజనకంగా ఉండటం, జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటంతో పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో గ్రామాలను నకిలీ బీటీ పత్తి విత్తనాలు ముంచెత్తుతున్నాయి. ఈ ఖరీఫ్‌లో రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్లకు పైగా నకిలీ విత్తన వ్యాపారం ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ వ్యవసాయ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఎమ్మిగనూరు, ఆస్పరి, దేవనకొండ, కర్నూలు, సి.బెళగల్, కోసిగి, మంత్రాలయం, హొళగుంద, హాలహర్వి, పెద్దకడబూరు, గోనెగండ్ల, మద్దికెర, తుగ్గలి, ఓర్వకల్ తదితర మండలాల్లో నకిలీ బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. గద్వాల నుంచి.. బీటీలో నకిలీ విత్తనాలకు కర్నూలు జిల్లా పెట్టింది పేరు. చాలా ఏళ్లుగా ఈ పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సరఫరా అవుతున్నాయి. ఇక ఆశ్చర్యం కల్గించే అంశం ఏమిటంటే.. తెలంగాణలోని గద్వాల జిల్లా నుంచి ఇక్కడికి నకిలీ విత్తనాలు వస్తుండడం. కర్నూలు సబ్ డివిజన్లోని వివిధ మండలాల రైతులు గద్వాల విత్తనాలను కొనుగోలు చేస్తూ నష్టపోతున్నారు. బీటీ నకిలీ పత్తి విత్తనాలను ఏప్రిల్, మే నెలల్లోనే గ్రామాలకు చేర్చినట్లు సమాచారం. గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పరచుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. ప్యాకెట్ రూ.500 నుంచి రూ.600 ప్రకారం విక్రయిస్తుండడంతో ఎక్కువ శాతం మంది రైతులు వాటినే కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు గ్రామాల్లో లూజు విత్తనాల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. కంపెనీ విత్తనమైతే ఇలా ఉండాలి... కంపెనీ బీటీ విత్తన ప్యాకెట్లను సులభంగా గుర్తించవచ్చు. ప్యాకెట్‌పై కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే రింగ్ వస్తుంది. ఒకవేళ రింగ్ కాకపోతే నకిలీ విత్తనంగా అనుమానం పడొచ్చు. అలాగే కంపెనీ పేరు, అడ్రెస్, వెరైటీ తదితర వివరాలన్నీ ఉండాలి. ఇటీవల పట్టుబడిన నకిలీ విత్తనాల ప్యాకెట్లను పరిశీలిస్తే కస్టమర్ కేర్ నెంబర్లు లేవు. బ్రాండెడ్ కంపెనీల పేరుతోనే నకిలీ విత్తనాల ప్యాకెట్లు లభిస్తుండటం గమనార్హం. వీటి విక్రయిస్తున్న వారిని అక్కడక్కడ అరెస్టు చేస్తున్నా.. సూత్రధారులెవరనే విషయాన్ని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ జేడీ ఠాగూర్ నాయక్‌ను వివరణ కోరగా..నకిలీ విత్తనాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక బృందాల ద్వారా ట్రాన్స్‌పోర్టు కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లను తనిఖీ చేయించామన్నారు. రైతులు సహకరిస్తేనే నకిలీ విత్తనాల నియంత్రణ సాధ్యమని స్పష్టం చేశారు. -
దిగుబడి తగ్గి.. దుఃఖం మిగిలి
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదంటారు. అయితే ఉల్లి పండించే రైతులకు మాత్రం ఎలాంటి మేలూ జరగడం లేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడులు తగ్గినా..గిట్టుబాటు ధర లభించడం లేదు. తీవ్ర నష్టాలు వచ్చి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదు. రాష్ట్రంలో ఉల్లి పంట అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే సాగు అవుతోంది. ఖరీఫ్ సాధారణ సాగు 20,357 హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 18,500 హెక్టార్లలో సాగైంది. దిగుబడులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఎకరాకు కనీసం 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చి.. ధర రూ.1500 లభిస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఈ ఏడాది వర్షాభావంతో ఉల్లి పంట దెబ్బతిని..ఎకరాకు సగటున 50 క్వింటాళ్లు కూడా రావడం లేదు. కర్నూలు మార్కెట్లో ధర రూ.800 కూడా పలకడం లేదు. పట్టించుకోని ప్రభుత్వం.. ధరలు లేనపుడు ఉల్లి రైతులు నష్టపోకుండా టీడీపీ మంత్రులు స్పష్టమైన హామీలు ఇచ్చారు. గతంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న పరటాల సునీత.. కర్నూలు మార్కెట్‌ను సందర్శించి గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నదాతలకు భరోసానిచ్చారు. ధరలేనప్పుడు ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేస్తుందని చెప్పారు. హామీ ప్రస్తుతం అమలు కావడం లేదు. ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా దక్కకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో జిల్లాలో ఇద్దరు ఉల్లి రైతులు బలవన్మరణాలకు పాల్పడారు. ధర వచ్చింటే బాబూరావు బతికుండేవాడేమో.. సి.బెళగల్ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన బండారి బాబురావు రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు. అప్పు తెచ్చి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. వర్షాభావ పరిస్థితుల్లో కేవలం 35 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. దీనిని కర్నూలు మార్కెట్‌కు తీసుకరాగా.. క్వింటాకు రూ.600 మాత్రమే ధర లభించింది. చేతికి రూ.21 వేలు మాత్రమే రావడంతో అప్పు తీర్చే మార్గం కానరాక గత నెల 28న కర్నూలు మార్కెట్ యార్డులోనే పురుగుల మందుతాగాడు. చికిత్స పొందుతూ... శనివారం మృతిచెందాడు. గిట్టుబాటు ధర వచ్చి ఉంటే బాబురావు బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. 90 శాతం రైతులకు అతి తక్కువ ధరే.. కర్నూలు మార్కెట్‌కు వచ్చే ఉల్లి రైతుల్లో పది శాతం మందికి క్వింటాకు రూ.300లోపే ధర లభిస్తోంది. 30 శాతం మంది రైతులకు రూ.301 నుంచి రూ.600 వరకు ధర వస్తోంది. ఎక్కువగా 50 శాతం మంది తెచ్చిన సరుకుకు రూ.601 నుంచి రూ.800 వరకు ధర లభిస్తోంది. మొత్తం 90 శాతం మంది రైతులకు గిట్టుబాటు ధర లేదనే చెప్పొచ్చు. కేవలం 10 శాతం మంది రైతులకు మాత్రమే రూ.1000 ఆపైన ధర లభిస్తోంది. నష్టాలను ఎలా భరించాలి? మూడు ఎకరాల్లో ఉల్లిసాగు చేశాను. పెట్టుబడులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోతే అప్పు తెచ్చుకున్నాను. ఎకరాకు రూ.50 వేల ప్రకారం రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాను. వర్షాలు పడక పంట అభివృద్ధి చెందలేదు. బోరు ఉన్నా నీరు అడుగంటి పోయింది. దిగుబడులు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గాయి. ప్రస్తుత ధరల్లో అమ్ముకుంటే రూ.60వేలు కూడా దక్కే పరిస్థితి లేదు. నష్టం రూ.90వేల వరకు ఉంటోంది. ఇంత భారీ స్థాయిలో నష్టాలను ఎలా భరించాలో తెలియడం లేదు. వెంకటేష్, పొన్నకల్ గ్రామం, గూడూరు మండలం -
కష్టకాలం
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: రబీ సీజన్ అక్టోబర్ 1 నుంచి మొదలైంది. నెలన్నర రోజులు గడిచినా పంటల సాగులో పురోగతి కరువైంది. గత ఏడాది ఇదే సమయానికి 2.86 లక్షల హెక్టార్లలో పంటలు సాగవగా.. ఈ విడత 2.35 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. ఇందుకు పెట్టుబడి సమస్యలతో పాటు గత నెలలో సంభవించిన వరదలే ముఖ్య కారణాలుగా తెలుస్తోంది. రబీ పంట రుణాల లక్ష్యం రూ.690 కోట్లు కాగా ఇప్పటి వరకు 23,242 మందికి రూ.124.61 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఇప్పటి వరకు బ్యాంకులు కొత్తగా ఒక్క రైతుకూ పంట రుణం మంజూరు చేసిన దాఖలాలు లేవు. కేవలం పాత రుణాలను రెన్యువల్ చేయడం ద్వారా రూ.124 కోట్లు పంపిణీ చేశామనిపించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రబీలో రూ.125 కోట్ల పంట రుణాలను పంపిణీ చేయాల్సి ఉండగా.. 770 మంది రైతులకు రూ.94 లక్షలు మాత్రమే పంపిణీ చేయడం గమనార్హం. రైతుల కోసమే ఉద్దేశించిన ఈ బ్యాంకు వారినే విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. సీజన్ సాధారణ సాగు 4.35 లక్షల హెక్టార్లు కాగా.. ప్రధానంగా 2.20 లక్షల హెక్టార్లలో శనగ సాగవుతుంది. అలాంటిది ఇప్పటి వరకు జిల్లా మొత్తం మీద సాగు 2.35 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. ఇందులో శనగ 1.65 లక్షల హెక్టార్లలో.. ఆ తర్వాత అత్యధికంగా జొన్న 35,355 హెక్టార్లలో వేశారు. అయితే శనగ పంటను చీడపీడలు చుట్టుముట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాములపాడు, ఓర్వకల్లు, కోడుమూరు, కోవెలకుంట్ల, బేతంచెర్ల, సంజామల తదితర మండలాల్లో శనగ పచ్చ పురుగు, రబ్బరు పురుగులు పంటను తినేస్తున్నాయి. ఈ తెగుళ్ల నివారణకు పురుగు మందులను ఇబ్బడిముబ్బడిగా పిచికారీ చేస్తుండటంతో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో భాస్వర ధాతు లోపంతోనూ పంట దెబ్బతింటోంది. మిరపకు వేరుపురుగు తెగులు శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో వేరుపురుగు తెగులు మిరప రైతుల ఆశలను మింగేస్తోంది. ఒక్క గ్రామంలోనే ఈ తెగులు ప్రభావంతో 400 ఎకరాల్లో పంట పూర్తిగా పాడైంది. ఇప్పటికే 200 ఎకరాల్లో తెగులు సోకి పనికి రాకుండాపోయిన మిరపను దున్నేశారు. వేరు పురుగు భూమిలో తల్లి వేరును తినేయడం వల్ల పంట ఎండినట్లు తయారవుతోంది. వేరు పురుగు తెగులును రైతులు గుర్తించలేక వేరుకుళ్లుగా భావించి మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకపోతోంది. ఆ పంటలను నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్, కర్నూలు డాట్ సెంటర్ సైంటిస్ట్‌లు పరిశీలించి వేరు పురుగు తెగులుగా నిర్ధారించారు. ఒక్కో రైతు పెట్టుబడి రూపంలో లక్ష రూపాయల వరకు నష్టపోయారు. ఈ తెగులు ఇతర ప్రాంతాలకూ విస్తరించే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.