కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: రబీ సీజన్ అక్టోబర్ 1 నుంచి మొదలైంది. నెలన్నర రోజులు గడిచినా పంటల సాగులో పురోగతి కరువైంది. గత ఏడాది ఇదే సమయానికి 2.86 లక్షల హెక్టార్లలో పంటలు సాగవగా.. ఈ విడత 2.35 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. ఇందుకు పెట్టుబడి సమస్యలతో పాటు గత నెలలో సంభవించిన వరదలే ముఖ్య కారణాలుగా తెలుస్తోంది. రబీ పంట రుణాల లక్ష్యం రూ.690 కోట్లు కాగా ఇప్పటి వరకు 23,242 మందికి రూ.124.61 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఇప్పటి వరకు బ్యాంకులు కొత్తగా ఒక్క రైతుకూ పంట రుణం మంజూరు చేసిన దాఖలాలు లేవు.
కేవలం పాత రుణాలను రెన్యువల్ చేయడం ద్వారా రూ.124 కోట్లు పంపిణీ చేశామనిపించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రబీలో రూ.125 కోట్ల పంట రుణాలను పంపిణీ చేయాల్సి ఉండగా.. 770 మంది రైతులకు రూ.94 లక్షలు మాత్రమే పంపిణీ చేయడం గమనార్హం. రైతుల కోసమే ఉద్దేశించిన ఈ బ్యాంకు వారినే విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. సీజన్ సాధారణ సాగు 4.35 లక్షల హెక్టార్లు కాగా.. ప్రధానంగా 2.20 లక్షల హెక్టార్లలో శనగ సాగవుతుంది. అలాంటిది ఇప్పటి వరకు జిల్లా మొత్తం మీద సాగు 2.35 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. ఇందులో శనగ 1.65 లక్షల హెక్టార్లలో.. ఆ తర్వాత అత్యధికంగా జొన్న 35,355 హెక్టార్లలో వేశారు. అయితే శనగ పంటను చీడపీడలు చుట్టుముట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పాములపాడు, ఓర్వకల్లు, కోడుమూరు, కోవెలకుంట్ల, బేతంచెర్ల, సంజామల తదితర మండలాల్లో శనగ పచ్చ పురుగు, రబ్బరు పురుగులు పంటను తినేస్తున్నాయి. ఈ తెగుళ్ల నివారణకు పురుగు మందులను ఇబ్బడిముబ్బడిగా పిచికారీ చేస్తుండటంతో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో భాస్వర ధాతు లోపంతోనూ పంట దెబ్బతింటోంది.
మిరపకు వేరుపురుగు తెగులు
శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో వేరుపురుగు తెగులు మిరప రైతుల ఆశలను మింగేస్తోంది. ఒక్క గ్రామంలోనే ఈ తెగులు ప్రభావంతో 400 ఎకరాల్లో పంట పూర్తిగా పాడైంది. ఇప్పటికే 200 ఎకరాల్లో తెగులు సోకి పనికి రాకుండాపోయిన మిరపను దున్నేశారు. వేరు పురుగు భూమిలో తల్లి వేరును తినేయడం వల్ల పంట ఎండినట్లు తయారవుతోంది. వేరు పురుగు తెగులును రైతులు గుర్తించలేక వేరుకుళ్లుగా భావించి మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకపోతోంది. ఆ పంటలను నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్, కర్నూలు డాట్ సెంటర్ సైంటిస్ట్‌లు పరిశీలించి వేరు పురుగు తెగులుగా నిర్ధారించారు. ఒక్కో రైతు పెట్టుబడి రూపంలో లక్ష రూపాయల వరకు నష్టపోయారు. ఈ తెగులు ఇతర ప్రాంతాలకూ విస్తరించే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.