ఈ–క్రాప్ నమోదులో సాంకేతిక సమస్యలు
క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఇబ్బందులు
ఇప్పటివరకు 22.76 లక్షల ఎకరాల్లోనే ఈ–పంట నమోదు
30 శాతమే నమోదైన రైతుల ఈ–కేవైసీ
రబీ సీజన్ ప్రారంభమై రెండున్నర నెలలు కావస్తున్నా ఈ–క్రాప్ నమోదులో సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. సర్వర్లు పనిచేయక, వెబ్‌సైట్ సకాలంలో ఓపెన్ అవ్వక, క్షేత్రస్థాయి పరిశీలనలో యాప్ సరిగా పనిచేయకపోవడంతో సిబ్బంది సతమతమవుతున్నారు. రబీ సాగు లక్ష్యం 57.66 లక్షల ఎకరాలు కాగా..ఇప్పటి వరకు 30.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
ఇప్పటివరకు 22.76 లక్షల ఎకరాల్లో (74%) సాగైన పంటలను మాత్రమే ఈ–పంటలో నమోదు చేయగలిగారు. ఇక ఈ–కేవైసీ నమోదు మాత్రం వీఏఏలు 16.92 లక్షల ఎకరాలకు, వీఆర్వోలు, 11.77 లక్షల ఎకరాలకు సంబంధించి అథంటిఫికేషన్ పూర్తి చేయగా, రైతుల ఈ–కేవైసీ మాత్రం 3.55 లక్షల ఎకరాలకు (30%) మించి పూర్తి కాలేదు. రైతులు ఇష్టపూర్వకంగానే ఈ–కేవైసీ నమోదుకు అవకాశం కల్పించడంతో ఈ–కేవైసీ నమోదుకు క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాధాన్యతనివ్వడం లేదని చెబుతున్నారు. – సాక్షి, అమరావతి
వెబ్‌సైట్‌లోనే అప్‌డేట్‌కు అవకాశం
తొలుత ఈ–పంట నమోదులో తెలిపిన వివరాలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిశీలనలో మార్పులు, చేర్పులు ఉంటే గతంలో మొబైల్ యాప్‌లోనే అప్డేట్ చేసేవారు. ఉదాహరణకు, తొలుత తాను వరిని మాత్రమే సాగు చేస్తానని చెప్పిన రైతు, ఆ తర్వాత వరితో పాటు మరికొన్ని పంటలు కూడా సాగు చేస్తోన్న సందర్భంలో ఆ వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేసే వెసులుబాటు ఉండేది.
కానీ, ప్రస్తుతం ఆ మేరకు మార్పులు చేర్పులన్నీ రైతు సేవా కేంద్రానికి వచ్చి ఈ పంట వెబ్‌సైట్‌లోనే అప్టేడ్ చేయాల్సి ఉంది. దీంతో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతు సేవా కేంద్రం సిబ్బంది వాపోతున్నారు. 200 మీటర్ల వరకు మాగాణి, 50 మీటర్ల వరకు మెట్ట పొలాల్లో వెసులుబాటు ఇచ్చినప్పటికీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రోజుకు 10 కి.మీ మించి వెళ్లలేని పరిస్థితి ఉంది.
రోజుకు 100 ఎకరాలు ఈ–క్రాప్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, క్షేత్రస్థాయిలో 40 ఎకరాలకు మించి పూర్తవడంలేదు. ఇటు ఎన్యుమరేషన్, అటు ఈ–క్రాప్ నమోదుకు రోజుకు 10–12 గంటలు పనిచేస్తున్నా పూర్తి కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment