మూడోసారి గడువు పొడిగింపు
16న తుది జాబితా ప్రచురణ అదే రోజు నుంచి భౌతిక, డిజిటల్ రసీదుల పంపిణీ
సాక్షి, అమరావతి: దాదాపు ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నప్పటికీ నిర్ధేశించిన గడువులోగా ఈ–క్రాప్‌నకు ఈ–కేవైసీ పూర్తి చేయలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రభుత్వ నిర్వాకానికి తోడు సాంకేతిక సమస్యలు వెంటాడడంతో ఈ దుస్థితి నెలకొంది.
ఇంకా లక్షలాది మంది రైతుల ఈ–కేవైసీ పెండింగ్‌లోనే..
ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ ఉద్యాన, పట్టు తదితర పంటలన్నీ కలిపి 1.34 కోట్ల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 96.68 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యింది. ఆ మేరకు ఈ–క్రాప్ నమోదు చేయగా, వీఏఏలు, వీఆర్వోల అథంటికేషన్ పూర్తి కాగా, రైతుల ఈ–కేవైసీ మాత్రం నమోదయ్యింది.
ఇంకా లక్షల ఎకరాలకు సంబంధించి లక్షలాది మంది రైతుల ఈ–కేవైసీ నమోదు కావాల్సి ఉంది. మరో పక్క మండల, జిల్లా అధికారుల సూపర్ చెక్ కూడా పూర్తి కాలేదు. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ–క్రాప్ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. సర్వర్లు పనిచేయక, వెబ్‌సైట్ సకాలంలో ఓపెన్ కాక, క్షేత్రస్థాయి పరిశీలనలో యాప్ సరిగా పనిచేయక పోవడం తదితర సాంకేతిక సమస్యలతో ప్రారంభంలో ఈ–క్రాప్ నమోదు నత్తనడకన సాగింది.
కాగా, వరదలు, వర్షాలతో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతినడంతో నష్టం అంచనాల తయారీలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది నిమగ్నమవడంతో ఈ–క్రాప్ నమోదుకు కొంత కాలం బ్రేకులు పడ్డాయి. తొలుత సెపె్టంబర్ 15 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించినప్పటికీ, ఒకేసారి ఈ–క్రాప్, పంట నష్ట పరిహారం అంచనాలు తయారు చేయాల్సి రావడంతో గడువును సెపె్టంబర్ 25వ తేదీకి పొడిగించారు. ఆ తర్వాత మళ్లీ 30వ తేదీ వరకు గడువిచ్చారు.
7వ తేదీ వరకు ఆధార్ దిద్దుబాటుకు అవకాశం
ఈ–కేవైసీ పూర్తి కాకపోవడంతో చేసేది లేక మరోసారి గడువును పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధార్ అప్‌డేటెడ్ ప్రక్రియ పెండింగ్ వల్ల చాలా మంది రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో రైతుల ఈ–కేవైసీతో పాటు ఆధార్ దిద్దుబాటుకు ఈ నెల 7వ తేదీ వరకు గడువునిచ్చారు.
సూపర్ చెక్ కూడా 7వతేదీ కల్లా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ–క్రాప్ ముసాయిదా జాబితా 8వ తేదీన రైతుసేవాకేంద్రాలు (ఆర్బీకే)ల్లో ప్రదర్శించనున్నారు. 8 నుంచి 13వ తేదీ వరకు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి అదే సమయంలో పరిష్కరించనున్నారు. 16వ తేదీన తుది జాబితాను ప్రదర్శించాలని లక్ష్యంగా నిర్ధేశించారు.
ఈ క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తయినట్టుగా 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు భౌతిక రసీదులతో పాటు ఎస్‌ఎంఎస్ రూపంలో రైతుల మొబైల్ ఫోన్లకు మెస్సేజ్‌లు పంపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment