e-crop
-
నత్తనడకన ఈ–కేవైసీ
సాక్షి, అమరావతి: దాదాపు ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నప్పటికీ నిర్ధేశించిన గడువులోగా ఈ–క్రాప్‌నకు ఈ–కేవైసీ పూర్తి చేయలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రభుత్వ నిర్వాకానికి తోడు సాంకేతిక సమస్యలు వెంటాడడంతో ఈ దుస్థితి నెలకొంది. ఇంకా లక్షలాది మంది రైతుల ఈ–కేవైసీ పెండింగ్‌లోనే..ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ ఉద్యాన, పట్టు తదితర పంటలన్నీ కలిపి 1.34 కోట్ల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 96.68 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యింది. ఆ మేరకు ఈ–క్రాప్ నమోదు చేయగా, వీఏఏలు, వీఆర్వోల అథంటికేషన్ పూర్తి కాగా, రైతుల ఈ–కేవైసీ మాత్రం నమోదయ్యింది. ఇంకా లక్షల ఎకరాలకు సంబంధించి లక్షలాది మంది రైతుల ఈ–కేవైసీ నమోదు కావాల్సి ఉంది. మరో పక్క మండల, జిల్లా అధికారుల సూపర్ చెక్ కూడా పూర్తి కాలేదు. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ–క్రాప్ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. సర్వర్లు పనిచేయక, వెబ్సైట్ సకాలంలో ఓపెన్ కాక, క్షేత్రస్థాయి పరిశీలనలో యాప్ సరిగా పనిచేయక పోవడం తదితర సాంకేతిక సమస్యలతో ప్రారంభంలో ఈ–క్రాప్ నమోదు నత్తనడకన సాగింది. కాగా, వరదలు, వర్షాలతో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతినడంతో నష్టం అంచనాల తయారీలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది నిమగ్నమవడంతో ఈ–క్రాప్ నమోదుకు కొంత కాలం బ్రేకులు పడ్డాయి. తొలుత సెపె్టంబర్ 15 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించినప్పటికీ, ఒకేసారి ఈ–క్రాప్, పంట నష్ట పరిహారం అంచనాలు తయారు చేయాల్సి రావడంతో గడువును సెపె్టంబర్ 25వ తేదీకి పొడిగించారు. ఆ తర్వాత మళ్లీ 30వ తేదీ వరకు గడువిచ్చారు. 7వ తేదీ వరకు ఆధార్ దిద్దుబాటుకు అవకాశంఈ–కేవైసీ పూర్తి కాకపోవడంతో చేసేది లేక మరోసారి గడువును పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధార్ అప్డేటెడ్ ప్రక్రియ పెండింగ్ వల్ల చాలా మంది రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో రైతుల ఈ–కేవైసీతో పాటు ఆధార్ దిద్దుబాటుకు ఈ నెల 7వ తేదీ వరకు గడువునిచ్చారు. సూపర్ చెక్ కూడా 7వతేదీ కల్లా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ–క్రాప్ ముసాయిదా జాబితా 8వ తేదీన రైతుసేవాకేంద్రాలు (ఆర్బీకే)ల్లో ప్రదర్శించనున్నారు. 8 నుంచి 13వ తేదీ వరకు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి అదే సమయంలో పరిష్కరించనున్నారు. 16వ తేదీన తుది జాబితాను ప్రదర్శించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఈ క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తయినట్టుగా 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు భౌతిక రసీదులతో పాటు ఎస్ఎంఎస్ రూపంలో రైతుల మొబైల్ ఫోన్లకు మెస్సేజ్‌లు పంపించనున్నారు. -
Fact Check: రైతులకే ప్రా‘ధాన్యం’...'పచ్చ'రాతల్లోనే దైన్యం!
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2014–15లో రెండు సీజన్లలో కలిపి 1.18 లక్షల మంది రైతుల నుంచి 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇందు కోసం రూ.5,583 కోట్లు చెల్లించింది. ఇక్కడ సగటున ఒక రైతు నుంచి సేకరించిన ధాన్యం 34.42 టన్నులు. చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉన్న రాష్ట్రంలో ఒక్కో రైతు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఎలా కొనుగోలు చేశారన్నది ఎవరికైనా కలిగే సందేహం. అంటే ఇక్కడ దళారులు, మిల్లర్లు కొందరు రైతుల పేరిట ప్రభుత్వానికి ధాన్యం విక్రయించి మద్దతు ధర కొట్టేశారన్నది సుస్పష్టం. 2015–16లో సగటున ఒక రైతు నుంచి 24 టన్నుల ధాన్యం సేకరించినట్టు చూపారు. ఇక్కడ కూడా మద్దతు ధర మధ్యవర్తులే కాజేశారని తెలుస్తోంది కదా... దీనిని బట్టి టీడీపీ హయాంలో ధాన్యం దోపిడీ ఎంతగా సాగిందో అర్థమవుతోంది. కానీ నాడు కళ్లకు గంతలు కట్టుకున్న ఈనాడుకు ఇవేవీ కనిపించలేదు. ఇప్పుడు పారదర్శకంగా సేకరణ జరుగుతున్నా... లేనిపోని ఏడుపుగొట్టు రాతలు. సాక్షి, అమరావతి: రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, మిల్లర్లకు దోచిపెట్టడం తెలుగుదేశం సంస్కృతి. వారి హయాంలో పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరించేది. కొనేదంతా మిల్లర్లు, దళారులే. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200ల వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యేక్షంగా రైతులు నష్టపోయేవారు. కానీ, సీఎంగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ప్రతి సీజన్లోనూ ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్ ప్రామాణికంగా పంట కొనుగోలు చేపట్టడంతో వాస్తవ రైతుకు పూర్తి మద్దతు ధర దక్కుతోంది. దీంతో తమ దళారుల దోపిడీ వ్యవస్థను నాశనం చేశారన్న ఆక్రోశం రామోజీ రాతల్లో నిలువెల్లా కనిపిస్తోంది. వాస్తవానికి రైతుకు మద్దతు ధరతో పాటు గన్నీ, లేబర్, రవాణా చార్జీలను సొంతంగా పెట్టుకున్న రైతుకు టన్నుకు రూ.2,523ల వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. అందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పంట విక్రయించేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా బయట మార్కెట్లోని వ్యాపారుల్లో ధాన్యానికి డిమాండ్ పెరిగింది. చేసేదేమీ లేక వారు సైతం ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకు మించి చెల్లిస్తూ కల్లాల్లోంచే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. అందువల్ల రైతులు మంచి రేటు వస్తున్న చోటే ధాన్యం అమ్ముకుంటున్నారు. అంత మాత్రాన ప్రభుత్వ సేకరణ తగ్గిందనడం ఎంతవరకు సమంజసం. ఈ వాస్తవాన్ని మరుగునపెట్టి రామోజీ రైతులపై కపట ప్రేమను ఒలకబోయడం చూస్తే జాలేస్తోంది. టీడీపీ ఐదేళ్లలో 17.94లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువలైన 2.65 కోట్ల టన్నులను ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి అండగా నిలిచింది. అంటే గతంతో పోలిస్తే దాదాపు 20లక్షల మంది అదనంగా రైతులు సంపూర్ణ మద్దతు ధరను అందుకున్నారు. ఆశాజనకంగా దిగుబడులు గత ఖరీఫ్‌లో దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. గతేడాది చివరల్లో మిచాంగ్ తుఫాన్ కొంత ఇబ్బంది పెట్టినా ఎకరాకు అత్యధికంగా 40–42 బస్తాల దిగుబడి వచ్చింది. జనవరి పండుగ సీజన్ కావడం, పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలకు బియ్యం అవసరం పెరగడంతో దాదాపు 15 లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు మించి(సాధారణ రకానికి రూ.100కు పైగా ఫైన్ వెరైటీలకు రూ.200–500లకు పైగా) చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేయడం విశేషం. ఇదే క్రమంలో ఆర్బీకే ద్వారా 29.58లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ లెక్కన 44.58 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి బయటకు వెళ్లిపోయింది. అంటే దాదాపు ఈఖరీఫ్‌లో పంట మొత్తం విజయవంతంగా కొనుగోలు చేశారు. ఇంతటి ఫలితాన్ని రామోజీ కలలోకూడా ఊహించి ఉండరు. కానీ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు అడ్డగోలు అభాండాలు వేశారు. కేంద్ర నిబంధనలు రామోజీకి తెలియవా... కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర దక్కట్లేదని గుండెలు బాదుకున్న రామోజీకి.. ధాన్యం కొనుగోలు విషయంలో నిబంధనలు విధిస్తుందన్న విషయం తెలీదా? ఆ ప్రకారం తేమ 17శాతం మించితే కొనుగోలుకు ఎక్కడైనా అభ్యంతరం చెబుతారు కదా? ఇదే ఆసరాగా చేసుకుని టీడీపీ హయాంలో బస్తాలకు బస్తాలు అదనంగా రైతు నుంచి దోచేసినప్పుడు ఈనాడు గొంతెందుకు మూగబోయిందన్నది ఇక్కడి ప్రశ్న. అధికారంలో మనవాడు లేకుంటే దుమ్మెత్తి పోయడమే వారికి తెలిసిన న్యాయం. కానీ, సీఎం జగన్ రైతుకు ఒక్క రూపాయి నష్టం జరగకుండా తేమ శాతం ఎక్కువగా ఉన్నా మద్దతు ధరకు కొనుగోలు చేసి డ్రయర్ సౌకర్యం ఉన్న మిల్లులకు తరలిస్తున్నారు. ప్రకృతి వైప రీత్యాల సమయంలోనూ తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని సైతం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. ♦ ఇక దుడ్డు రకాలు(జయ రకం ధాన్యం) కేరళకు ఎగుమతి చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఒప్పందం చేసుకుంది. అందువల్ల గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆ రకాలనే సాగు చేసేందుకు మొగ్గు చూపారు. గతేడాది తుఫాన్ కంటే ముందే అక్కడ కోతలు పూర్తవడం, ప్రభుత్వం కంటే ముందుగా బయట వ్యాపారులు వచ్చి మంచి రేటు ఇచ్చి పంట కొనుగోలు చేయడంతో ప్రభుత్వానికి సేకరించే అవకాశం రాలేదు. దీనిని కూడా ఈనాడు వక్రీకరించింది. ♦ ధాన్యం సేకరణలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వమే కళ్లాల్లోని ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తోంది. అక్కడ కస్టమ్ మిల్లింగ్ చేసిన తర్వాత బియ్యాన్ని బఫర్ గొడౌన్లు, మండల నిల్వ కేంద్రాలకు తరలించాలి. వీటిన్నింటికీ ప్రతి స్టేజీలో వేర్వేరు రవాణా వ్యవస్థలు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ ప్రాంతాల్లో సమర్థవంతమైన వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించింది. దానిపై దీనిని ఈనాడు ధాన్యం సేకరణ మిల్లర్లకు అప్పగిస్తున్నారంటూ అబద్దపు ప్రచారం చేస్తోంది. -
ఈ–క్రాప్‌తో అన్నదాతలకు భరోసా
సాక్షి, అమరావతి: రబీ సీజన్లో ఈ–క్రాప్ నమోదు వేగంగా సాగుతోంది. రైతులు వారి పొలాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారనే వివరాలను వ్యవసాయ శాఖ నమోదు చేస్తోంది. ఈ–క్రాప్ ప్రామాణికంగానే రైతులకు ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తోంది. దీంతో పంటలు వేసిన ఒక్క రైతును కూడా వదలకుండా.. రాష్ట్రంలోని ప్రతి ఎకరాలో ప్రతి పంటనూ నమోదు చేయడమే వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో రబీ సాధారణ విస్తీర్ణం 55.95 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 38.25 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ డేటాతోపాటు జియో ఫెన్సింగ్ ఆధారంగా డిసెంబర్లో ఈ–క్రాప్ నమోదుకు వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 37,02,031 ఎకరాల్లో పంటలను ఈ–క్రాప్‌లో నమోదు చేశారు. ఇందులో 34,21,189 ఎకరాల్లో వీఏఏలు, 31,86,682 ఎకరాల్లో వీఆర్వోలు క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా పూర్తి చేశారు. ఇప్పటివరకు 20,06,326 ఎకరాలకు సంబంధించి రైతుల ఈకేవైసీ (వేలిముద్రలు) నమోదు పూర్తయింది. జియో ఫెన్సింగ్ ద్వారా హద్దుల గుర్తింపు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్‌లో ఆధార్, వన్‌బీ, జాతీయ చెల్లింపుల సహకార సంస్థ (ఎన్పీసీఐ), ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నంబర్, సీసీఆర్సీ కార్డుల వివరాలను నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత జియో ఫెన్సింగ్ ద్వారా సరిహద్దులు నిర్థారించి, రైతు ఫొటోను ఆర్బీకే సిబ్బంది అప్లోడ్ చేస్తున్నారు. గిరి భూమి వెబ్సైట్లో నమోదైన వివరాలు ఆధారంగా అటవీ భూముల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేస్తున్నారు. మరోవైపు పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతోపాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. పొలం ఖాళీగా ఉంటే నో క్రాప్ జోన్ అని, రొయ్యలు, చేపల చెరువులుంటే ఆక్వా కల్చర్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రిల్యాండ్ యూజ్ అని నమోదు చేసి లాక్ చేస్తున్నారు. డూప్లికేషన్‌కు తావులేకుండా ఈ–ఫిష్ డేటాతో ఇంటిగ్రేట్ చేశారు. జిరాయితీ, పట్టాదార్, అసైన్డ్, ఆర్ఓఎఫ్ఆర్, ఎండోమెంట్, వక్ఫ్, ఈనాం, లంక, సీజేఎఫ్ఎస్, మిగులు, ఆక్రమిత తదితర కేటగిరీల కింద గుర్తించిన ప్రభుత్వ భూముల్లో సాగవుతున్న ఆహార, నూనె గింజలు, పశుగ్రాసం, పంటలు, పండ్ల తోటలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, పూలు, మల్బరీ పంటలను నమోదు చేశారు. ఈకేవైసీ నమోదు ప్రక్రియ పూర్తి కాగానే ప్రతి రైతుకు రసీదు అందించే ఏర్పాటు చేశారు. పారదర్శకంగా నమోదు ఈ–క్రాప్‌ను పారదర్శకంగా నమోదు చేయడంతోపాటు ఈకేవైసీ నమోదు ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించాం. సోషల్ ఆడిట్ కోసం 21 నుంచి 28వ తేదీ వరకు ప్రాథమిక ఈ క్రాప్ జాబితాలను ప్రదర్శిస్తాం. మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరించి.. మార్చి 6న తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తాం. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగానే సంక్షేమ ఫలాలు అందుతాయి. అందువల్ల ప్రతి రైతు వారు సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. – గెడ్డం శేఖర్‌బాబు,ఇన్చార్జి కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఈ–క్రాప్ నమోదుకు ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఈ–పంట నమోదులో మరిన్ని సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. ఈ సీజన్లో 89.37 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం కాగా.. తొలకరి కాస్త ఆలస్యం కావడంతో ఇప్పటివరకు 9.07 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. సాంకేతిక సమస్యలకు తావులేకుండా పకడ్బందీగా ఈ–పంట నమోదుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టగా, మిగిలిన జిల్లాల్లో వచ్చే వారం ప్రారంభించనున్నారు. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు పంట నష్టపరిహారం, పంటల బీమా, పంట కొనుగోలుకు ఈ–పంట నమోదే ప్రామాణికం కావడంతో చిన్నపాటి లోపాలకూ ఆస్కారంలేని రీతిలో ఈ–పంట నమోదు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. నూరు శాతం ఈ–క్రాప్ నమోదు చేస్తున్నప్పటికీ ఈకేవైసీ నమోదులో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద ఈ–పంట నమోదు చేస్తున్నారు. ఇందుకోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ)సౌజన్యంతో ప్రత్యేకంగా యాప్‌ను డిజైన్ చేశారు. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంటసాగు హక్కు పత్రం) డేటాతో అనుసంధానించిన యాప్‌లో రైతు ఆధార్ నెంబర్ కొట్టగానే అతని పేరిట ఏ ఏ సర్వే నెంబర్లలో ఎంత విస్తీర్ణంలో వ్యవసాయ, కౌలు భూములున్నాయో తెలిసిపోతుంది. తొలుత ఆధార్, వన్ బీ, జాతీయ చెల్లింపుల సహకార సంస్థ (ఎన్పీసీఐ), ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్‌నెంబర్, సీసీఆర్సీ కార్డుల వివరాలను ఈ యాప్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులతో కలిసి ప్రతిరోజు కనీసం 50 ఎకరాలకు తక్కువ కాకుండా క్షేత్రస్థాయి పరిశీలనకు చేస్తారు. యాప్‌లో నమోదైన వివరాలను క్షేత్రస్థాయిలో సరిపోల్చుకుని అంతా ఒకే అనుకుంటే జియో కోఆర్డినేట్స్‌తో సహా పంట ఫొటోను తీసి అప్లోడ్ చేస్తారు. జియో ఫెన్సింగ్ ద్వారా సరిహద్దుల గుర్తింపు.. ఈసారి కొత్తగా జియో ఫెన్సింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. మొన్నటి వరకు సాగుచేసే పొలానికి కాస్త దూరంగా నిలబెటిŠట్ ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తే సరిపోయేది. కానీ, ఇక నుంచి ఖచ్చితంగా సాగుచేసే పొలంలో నిలబెట్టి జియో ఫెన్సింగ్ ద్వారాæ సరిహద్దులు నిర్ధారించిన తర్వాతే ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. గిరిజన రైతులు సాగుచేసే అటవీ భూముల (ఆర్ఓఎఫ్ఆర్) డేటా ఉన్న గిరిజన సంక్షేమ శాఖకు చెందిన గిరి భూమి వెబ్‌సైట్‌తో అనుసంధానం చేస్తున్నారు. తద్వారా ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో గిరిజనులు సాగుచేసే పంటల వివరాలు కూడా పక్కాగా ఈ–క్రాప్‌లో నమోదు చేసేందుకు వెసులుబాటు కలుగుతుంది. పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను నమోదు చేసేలా యాప్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఈ ఫిష్ డేటాతో అనుసంధానం ఖాళీగా ఉంటే నో క్రాప్ అని, ఆక్వా సాగవుతుంటే ఆక్వాకల్చర్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రి ల్యాండ్ యూజ్ అని నమోదు చేస్తున్నారు. డుప్లికేషన్‌కు తావులేకుండా ఉండేందుకు ఈ–ఫిష్ డేటాతో ఇంటిగ్రేట్ చేశారు. ఈ–క్రాప్ నమోదు పూర్తికాగానే రైతుల ఫోన్ నెంబర్లకు డిజిటల్ రశీదు, వీఏఏ/వీహెచ్ఏ, వీఆర్ఏల వేలిముద్రలతో పాటు చివరగా రైతుల వేలిముద్రలు (ఈకేవైసీ) తీసుకోవడం పూర్తికాగానే రైతు చేతికి భౌతికంగా రశీదు అందజేస్తారు. ప్రతీ సీజన్లోనూ నూరు శాతం ఈ–పంట నమోదు చేయగా, ఖరీఫ్–22లో 92.4 శాతం ఈకేవైసీ నమోదు చేశారు. గడిచిన రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 97.47 శాతం ఈకేవైసీ నమోదు చేశారు. ఇక ఈసారి ఈ–పంటతో పాటు నూరు శాతం ఈకేవైసీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబర్ 20 కల్లా ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తిచేసి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ఈ–పంట జాబితాలను ప్రదర్శిస్తారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత సెప్టెంబర్ 30న తుది జాబితాలను ప్రదర్శిస్తారు. -
ఇది రైతు ప్రభుత్వం
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు తరఫున పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింది. ఏ గ్రామంలో, ఏ రైతు, ఏ పంటను, ఎన్ని ఎకరాల్లో వేశారన్నది ఈ–క్రాప్ ద్వారా గుర్తించి ఇన్సూరెన్స్ పరిధిలోకి తెచ్చాం. ప్రతి ఆర్బీకే పరిధిలో బ్యాంకు రుణాలు తీసుకున్న, తీసుకోని రైతుల నోటిఫైడ్ పంటలన్నింటినీ ఉచిత బీమా పరిధిలోకి తీసుకొచ్చాం. తద్వారా ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ పరిహారం ఇప్పించాలనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం. ఇలాంటప్పుడు బీమా కంపెనీల నుంచి రైతులకు అందాల్సిన పరిహారం అందకూడదని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? అయితే, చంద్రబాబు, ఆయన గజ దొంగల ముఠా.. దుష్ట చతుష్టయంలోని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. వీళ్లందరి దత్తపుత్రుడు దుష్ప్రచారం చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రమూ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని, ఏ ఒక్క రైతుకూ కష్టం రానివ్వకుండా చూసుకుంటున్న సర్కారు ఇదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నాలుగేళ్లలో రైతుల కోసం రూ.1.70 లక్షల కోట్లకు పైగా వ్యయం చేశామని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. పంటల బీమా పరిహారం మొదలు.. మద్దతు ధర వరకు వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తేవడం ద్వారా రైతుకు చేదోడు వాదోడుగా నిలిచామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8)ని పురస్కరించుకుని శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా 2022– ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రాష్ట్రంలోని 10.20 లక్షల మందికి పైగా రైతులకు డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద రూ.1,117.21 కోట్ల పరిహారాన్ని కంప్యూటర్లో బటన్ నొక్కి వారి ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. డాక్టర్ వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించిన తర్వాత అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. మహానేత వైఎస్సార్ జయంతి రోజున అన్నదాతకు పాదాభివందనం చేస్తూ ఏటా రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. ‘నాన్న గారు గుర్తుకొచ్చినప్పుడల్లా రైతుల పట్ల ఆయన ఎలా స్పందించారన్నది గుర్తుకొస్తుంది. ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్మెంట్, లక్షల ఇళ్లు, ఆరోగ్యశ్రీ పథకం.. 104, 108 గుర్తుకొస్తుంది. కుయ్.. కుయ్.. కుయ్.. అన్న శబ్ధం కూడా గుర్తుకొస్తుంది’ అని అన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన చేసిన మంచి ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు. అందుకే ఆయన్ను గౌరవిస్తూ వ్యవసాయ, ఆరోగ్య, గృహ నిర్మాణ రంగాల్లో మనం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలకు డాక్టర్ వైఎస్సార్ పేరే పెట్టామని స్పష్టం చేశారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆ ఐదేళ్లలో నోరెత్తలేదెందుకు? ► గత చంద్రబాబు ప్రభుత్వ ఐదేళ్లలో సగటున ప్రతి ఏటా 300 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించే పరిస్థితి. అంటే సగం రాష్ట్రంలో ఏటా కరువే. ఉమ్మడి అనంతపురం అంతా కరువుగానే కనిపించే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు ప్రభుత్వం పంట నష్టపోయిన రైతన్నలకు అరకొరగానే బీమా పరిహారం ఇచ్చింది. ఆ ఐదేళ్లలో కేవలం రూ.3,411 కోట్లు మాత్రమే. అది కూడా 30.85 లక్షల మంది రైతులకు మాత్రమే ఇచ్చింది. ► దేవుడి దయ వల్ల ఈ నాలుగేళ్లలో ఒక్క కరువు మండలం లేకున్నా.. అప్పుడప్పుడు అధిక వర్షాలు, ఇతర కారణాల వల్ల జరిగిన పంట నష్టాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నాలుగేళ్లలో 54,48,000 మంది రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రూ.7,802 కోట్లు పరిహారంగా చెల్లించాం. ► చంద్రబాబు ఐదేళ్ల కరువు కాలంలో రైతులకు అందాల్సిన బీమా పరిహారం అందలేదని ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఏనాడూ నోరు మెదపలేదు. పైగా ఈ పెద్దమనిషి చంద్రబాబు రెయిన్ గన్‌తో కరువును పారదోలానంటూ ఫొటోలకు పొజులిస్తే.. కరువు వెళ్లిపోయిందని నిస్సిగ్గుగా రాశారు. ఇలాంటి దుర్మార్గులు మనం మంచి చేస్తుంటే మొసలి కన్నీరు కారుస్తున్నారు. వ్యవసాయం వ్యాపారం కాదని గుర్తించాలి ► ప్రణాళికా బద్ధంగా, ప్రాధాన్యతా క్రమంలో నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నాం. కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల కోసం రూ.542 కోట్లతో బీటీపీ ప్రాజెక్టుకు సంబంధించి.. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఎన్నికల కోసం టెంకాయ కొట్టి వదిలేశారు. దీని కోసం 1407 ఎకరాల భూసేకరణ చేస్తే తప్ప అడుగులు ముందుకు పడని పరిస్థితి. ఈ ప్రాజెక్టు కోసం రూ.208 కోట్లు రైతన్నల బ్యాంకు అకౌంట్లలోకి విడుదల చేస్తున్నాం. ► చంద్రబాబు హయాంలో ఆహార ధాన్యాల దిగుబడి 152 లక్షల టన్నులు ఉండేది. మన ప్రభుత్వంలో నాలుగేళ్లలో సగటున 13 లక్షల టన్నులు పెరిగి 165 లక్షల టన్నులకు చేరింది. ఈ నాలుగేళ్లలో రైతన్నలకు మంచి చేసేందుకు మీ బిడ్డ ప్రభుత్వం రూ.1,70,769 కోట్లు ఖర్చు చేసింది. ► రైతు చేస్తున్నది అన్నం పెట్టే వ్యవసాయం తప్ప వ్యాపారం కాదని పాలించే వాళ్లకు అర్థం కావాలి. రైతును మోసం చేయకూడదని, ప్రజలను మోసం చేయకూడదని పాలకుడికి ఒక నిబద్ధత ఉండాలి. అలాంటి నిబద్ధత, నైతికత ఉంటే ఆ మనిషిని, ఆ గుండెను ఒక వైఎస్సార్ అని, ఒక జగనన్న అంటారని సగర్వంగా తెలియజేస్తున్నా. అలాంటి నిబద్ధత, నైతికత లేకపోతే ఆ గుండెను, ఆ మనిషిని చంద్రబాబు నాయుడు అంటారు. 16 విప్లవాత్మక మార్పులు 1ఇన్సూరెన్స్: గ్రామ స్థాయిలో ఏ రైతన్నకు భారం పడకుండా ప్రతి పంటను ఈ–క్రాప్‌తో అనుసంధానం చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం ద్వారా ఉచిత బీమా పథకం కిందకు తెచ్చాం. ఇలా మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. 2వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్: మూడు విడతల్లో వైఎస్సార్ రైతు భరోసా సాయం రూ.13,500 క్రమం తప్పకుండా ఇస్తున్నాం. ఈ నాలుగేళ్లలో 52.38 లక్షల మంది రైతులకు రూ.61,500 చొప్పున వారి ఖాతాల్లో నేరుగా జమ చేశాం. ఈ ఒక్క పథకం ద్వారా రూ.30,985 కోట్లు ఇచ్చాం. ఈ సొమ్ము చిన్న, సన్నకారు రైతులకు సంజీవనిలా ఉపయోగపడుతోంది. 3ఆర్బీకేలు: 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేశాం. ఇది దేశంలోనే అతిపెద్ద విప్లవాత్మక మార్పు. విత్తనం మొదలు పంట అమ్మకం వరకు.. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు.. సలహాలు సహా ప్రతి అడుగులోనూ రైతులకు అండగా, తోడుగా ఉంటూ వారిని చేయి పట్టుకొని నడిపిస్తున్న వ్యవస్థ గ్రామ స్థాయిలో కనిపిస్తోంది. దేశం మొత్తం మన రాష్ట్రానికి వచ్చి ఎలా జరుగుతోందని చూసి వెళ్తున్నారు. 4ఈ–క్రాప్: ఏ రైతు, ఏ పంట, ఎన్ని ఎకరాల్లో వేశాడన్నది గ్రామ స్ధాయిలో, ఆర్బీకే స్ధాయిలో స్పష్టంగా తెలిసిపోతుంది. దీని ఆధారంగా ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రతి రైతుకు పారదర్శకంగా వడ్డీ లేని రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ చివరకు పంటల కొనుగోలులో కూడా మేలు జరుగుతోంది. 5పంట నష్టపరిహారం: ఏ సీజన్లో పంట నష్టం ఆ సీజన్ ముగియక మునుపే రైతుల చేతుల్లో పెడుతున్న ఏకైక ప్రభుత్వం మనదే. ఈ నాలుగేళ్లలో 22.74 లక్షల మంది రైతన్నలకు రూ.1,965 కోట్లు ఇచ్చాం. తద్వారా ఎక్కడా దళారులు, మధ్యవర్తులు, లంచాలు లేవు. నేరుగా అర్హులందరికీ మేలు జరుగుతోంది. 6సున్నా వడ్డీ: ఏ రైతు అయినా రుణం సకాలంలో చెల్లిస్తే ప్రోత్సాహం ఇస్తూ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందులో మన రాష్ట్రం అగ్రగామి. గత ప్రభుత్వం సున్నా వడ్డీ, రుణ మాఫీ పథకాల్ని గాలికొదిలేసింది. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి చివరకు రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వకుండా రైతులను నిలువునా ముంచేసింది. ఆ అప్పులపై వడ్డీల మీద వడ్డీలు తడిసి మోపెడై రైతులు ఇబ్బందులు పడ్డారు. అలాంటి రైతులందరికీ మేలు చేస్తూ ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద 73.88 లక్షల మందికి రూ.1,835 కోట్లు ఇచ్చింది. 7ధాన్యం కొనుగోలు: ధరలు రాకపోతే రైతులు నష్టపోకుండా ఆదుకోవడం కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మిరప, పసుపు, ఉల్లి, చిరు ధాన్యాలు, అరటి బత్తాయి పంటలకూ కనీస మద్దతు ధర ప్రకటించాం. మార్కెట్లో రేటు తగ్గితే గ్రామ స్థాయిలో ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. దళారీ, మధ్యవర్తుల వ్యవస్థను పూర్తిగా తుడిచేశాం. చివరకి మిల్లర్లను కూడా తీసివేసి ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలుకు రూ.58,767 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇతర పంటల కొనుగోలుకు రూ.7,633 కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ధాన్యం సేకరణ బకాయిలు రూ. 965 కోట్లు మనమే చెల్లించాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.384 కోట్ల విత్తన బకాయిలూ ఇచ్చాం. చివరకు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన కరెంటు బకాయిలు రూ.8,800 కోట్లు కూడా మనమే కట్టాం. 8నాణ్యమైన ఉచిత విద్యుత్: రైతన్నలకు పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇందుకోసం రూ.1700 కోట్లతో ఫీడర్ల కెపాసిటీని అప్‌గ్రేడ్ చేశాం. ఇందుకు ఈ నాలుగేళ్లలో రూ.40,000 కోట్లు ఖర్చు చేశాం. మరో 30 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఉండేలా రూ.2.49కే వ్యవసాయ అవసరాల మేరకు 17వేల మిలియన్ యూనిట్లను సరఫరా చేసేటట్టుగా.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం చేసుకున్నాం. ఆక్వా రైతులకూ యూనిట్ రూ.1.50కే ఇస్తున్నాం. ఇందుకు ఈ నాలుగేళ్లలో రూ.2,968 కోట్లు సబ్సిడీగా భరించాం. 9వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం : ఆర్బీకేల ద్వారా సన్న, చిన్నకారు రైతులకు సాగులో అవసరమయ్యే యంత్రాలను అందుబాటులో ఉంచాం. రూ.1,100 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని ప్రారంభించాం. దీనికోసం సబ్సిడీ రూపంలో రూ.400 కోట్లు ప్రభుత్వం భరించింది. 10భూ హక్కు పత్రాలు: వంద ఏళ్లకు పైగా చుక్కల భూములుగా మిగిలిపోయిన 2.06 లక్షల ఎకరాలకు సంబంధించి 87,560 మంది రైతన్నలకు సంపూర్ణ భూహక్కు పత్రాలు ఇచ్చాం. గతంలో ఎవరూ పట్టించుకోలేదు. 11పశు సంరక్షణ: పశుసంపద ద్వారా కూడా రైతులకు అదనంగా ఆదాయం పెరగాలని అడుగులు ముందుకు వేశాం. పశువుల కోసం కూడా 340 అంబులెన్స్‌లు తీసుకొచ్చాం. నియోజకవర్గానికి 2 చొప్పున ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. 12జగనన్న పాల వెల్లువ: రైతులకు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం పెంచేందుకు సహకార రంగానికి తోడుగా ఉండేటట్టుగా.. ప్రైవేట్ డెయిరీల గుత్తాధిపత్యానికి గండి కొడుతూ అమూల్ రంగ ప్రవేశం చేసేలా అడుగులు వేశాం. అమూల్ వచ్చిన తర్వాత రెండేళ్లలో 8 సార్లు రేట్లు పెంచారు. గేదె పాలు రూ.22, ఆవు పాలు రూ.11 అదనంగా పెరిగింది. 13చిరుధాన్యాలకు ప్రోత్సాహం: బియ్యం మాత్రమే కాకుండా చిరుధాన్యాలను (మిల్లెట్స్) ప్రోత్సహిస్తున్నాం. 8 జిల్లాల్లో ఇంటింటికీ రేషన్ ద్వారా చిరు ధాన్యాలు ఇవ్వడం మొదలు పెట్టాం. స్కూళ్లలో రాగిజావ ఇస్తున్నాం. 32 చిరుధాన్యాల ప్రాసెసింగ్ ప్లాంట్లు మొదలు పెట్టాం. చిరుధాన్యాలకు కనీస మద్దతు ధర ఉండేలా అడుగులు వేస్తున్నాం. ఒకవేళ ఆ ధర లేకపోతే ప్రభుత్వమే మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు చేస్తుంది. 14సమగ్ర భూ సర్వే: వందేళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే నిర్వహిస్తున్నాం. రైతులకు గ్రామ స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. వాళ్ల భూములన్నింటికీ సమగ్రంగా సరిహద్దులు ఏర్పాటు చేసి, సర్వే రాళ్లను పాతించి, రైతుల రికార్డులు అప్డేట్ చేయించి, వివాదాలకు తావులేకుండా రైతుల చేతిలో భూహక్కు పత్రాలు పెట్టే గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. 15గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు: రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా 17 వేల రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటికే 2 వేల రెవెన్యూ గ్రామాల్లోని సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రేషన్ సేవలు అందుతున్నాయి. 16మరింత పటిష్టంగా ఆర్బీకేలు: రాబోయే రోజుల్లో ఆర్బీకేలను ఇంకా పటిష్టపరచబోతున్నాం. ఆర్బీకే స్థాయిలోనే సాయిల్ టెస్టింగ్ చేయించబోతున్నాం. గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్‌ను కూడా ప్రతి రైతన్నకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. వాటి ద్వారా రైతులు ఇంకా ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం కల్పించడానికి జీఏపీ సర్టిఫికేషన్ తీసుకురాబోతున్నాం. నానో ఫెర్టిలైజర్స్‌ను తీసుకురాబోతున్నాం. తద్వారా డ్రోన్లు, ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. ఎరువులు ఎంత అవసరమో అంతే వేసేలా చూస్తాం. ఆర్బీకేల పరిధిలో ప్రైమరీ ప్రాసెసింగ్, జిల్లా కేంద్రాల్లో సెకండరీ ప్రాసెసింగ్ తీసుకువస్తున్నాం. అందుకు తగిన విధంగా గోదాములు ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో జరగబోయే గొప్ప మార్పులు. -
Fact Check: అండగా నిలిస్తే అభాండాలా? వాస్తవాలకు ముసుగేసిన ‘ఈనాడు’
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. గత ప్రభుత్వాలు ఆలోచన కూడా చేయని పంట సాగు హక్కుదారుల చట్టం–2019 తీసుకురావడమే కాదు... పంట సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్సీ) ఆధారంగా వైఎస్సార్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీతో పాటు వివిధ కారణాలతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం అందిస్తున్నారు. అంతేకాదు.. కౌలురైతులకు ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులివ్వడమే కాదు, పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), ఉచిత పంటల బీమా వంటి సంక్షేమ పథకాలూ అందిస్తున్నారు. ఈ–క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా అమ్ముకోగలుగుతున్నారు. కానీ, వాస్తవాలకు ముసుగేసి తప్పుడు కథనాలతో ‘ఈనాడు’ నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకుంది. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ రైతులను మభ్యపెట్టాలని చూస్తోంది. ‘కౌలు రైతులకు మిగిలింది కంటితుడుపే’ అంటూ సోమవారం ఆ పత్రిక వండివార్చిన కథనంపై అంశాల వారీగా ‘ఫ్యాక్ట్‌చెక్’ ఇదిగో.. ఆరోపణ: కొత్త చట్టం తెచ్చినా చిక్కుముడేనా? వాస్తవం: భూ యజమాని హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, వారి హక్కులకు రక్షణ కల్పిస్తూనే వాస్తవ సాగుదారులకు పంట సాగుదారు హక్కు పత్రాలను జారీచేస్తోంది. ఇందుకోసం ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు రెవెన్యూ శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది. భూ యజమానులను ఒప్పించి మరీ కౌలుదారులకు సీసీఆర్సీలు జారీచేస్తోంది. 2019 నుంచి∙ఇప్పటివరకు 17.61 లక్షల మంది కౌలు రైతులకు ఈ కార్డులు మంజూరు చేశారు. ఆరోపణ: పంట రుణాల్లోనూ కోతే.. వాస్తవం: వాస్తవ సాగుదారులందరికీ పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్‌లను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. సీసీఆర్సీ కార్డులున్న వారికి రుణాలు అందిస్తున్నారు. సీసీఆర్సీ పొందలేని కౌలు రైతులను గుర్తించి, వారితో జాయింట్ లయబిలిటీ గ్రూపు (జేఎల్‌జీ)లను ఏర్పాటుచేస్తున్నారు. ఈ గ్రూపుల ద్వారా కౌలుదారులకు పెద్దఎత్తున రుణాలు అందేలా చేస్తున్నారు. ఇలా 2019 నుంచి ఇప్పటివరకు 9.83 లక్షల మందికి రూ.6,905.76 కోట్ల రుణాలు అందించారు. 2022–23లోనే 2.19 లక్షల మంది కౌలుదారులకు రూ.1,802.74 కోట్ల రుణాలు అందించారు. అంతేకాదు.. రూ.లక్ష లోపు పంటరుణాలు పొందిన కౌలుదారులకు వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ కూడా అందిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 30వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని అందించారు. ఆరోపణ: రైతుభరోసా సాయమేది? వాస్తవం: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు అటవీ, దేవాదాయ భూమి సాగుదారులకు కూడా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందిస్తోంది. 16 లక్షల మంది కౌలుదారుల్లో 6 శాతం మందికి మాత్రమే రైతుభరోసా అందుతుందనడంలో వాస్తవంలేదు. మెజారిటీ కౌలుదారులు సొంత భూమి కూడా కలిగి ఉన్నారు. వీరందరికీ భూ యజమానిగా వైఎస్సార్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందుతోంది. సీసీఆర్సీ కార్డులు పొందిన కౌలు రైతులు సమీప ఆర్బీకేల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు ‘భరోసా’ అందిస్తున్నారు. సొంత భూమిలేకుండా పూర్తిగా కౌలుకి మాత్రమే సాగుచేస్తున్న దాదాపు 1.24 లక్షల మందికి రైతుభరోసా సాయం అందిస్తున్నారు. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా వైఎస్సార్ రైతుభరోసా కింద 46 నెలల్లో 3.92 లక్షల మందికి రూ.529.07 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. ఆరోపణ: కౌలురైతులకు అందని సంక్షేమ ఫలాలు.. వాస్తవం: కౌలుదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదనడంలో ఏమాత్రం వాస్తవంలేదు. వైఎస్సార్ రైతుభరోసాతో సహా భూ యజమానులకు వర్తింçపజేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులకు కూడా వర్తింపజేస్తున్నారు. సీసీఆర్సీ కార్డు ఉన్నా లేకున్నా కూడా అందిస్తున్నారు. ఈ–క్రాప్ బుకింగ్ ఆధారంగా 2019–20లో 6,331 మందికి రూ.5.73 కోట్లు, 2020–21లో 1.38 లక్షల మందికి రూ.140.70 కోట్లు, 2021–22లో 68,911 మందికి రూ.77.84 కోట్ల పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ), ఖరీఫ్–2020లో 51,238 మందికి రూ.156.80 కోట్లు, ఖరీఫ్–21 సీజన్లో 1,21,735 మందికి రూ.330.34 కోట్ల పంటల బీమా పరిహారంతో పాటు 2.50 లక్షల మంది రైతులకు రూ.3,500 కోట్ల సబ్సిడీతో కూడిన 8వేల క్వింటాళ్ల విత్తనాలు అందించారు. -
96 శాతం ఈ–క్రాప్ నమోదు
సాక్షి, అమరావతి: రబీసాగు చివరి దశకు చేరుకుంటోంది. ఈసారి సాగుతో పాటు ఈ–క్రాప్ నమోదు, ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సాగైన విస్తీర్ణంలో 96 శాతం ఈ–క్రాప్ నమోదు పూర్తికాగా, ఈ–కేవైసీ 55 శాతం పూర్తయింది. ఈ నెల 20వ తేదీలోగా 100 శాతం పంటల నమోదుతోపాటు ఈ–కేవైసీ పూర్తిచేయాలనే లక్ష్యంతో వ్యవసాయశాఖ ముందుకెళ్తోంది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని రబీసీజన్ నుంచి ఈ–క్రాప్ నమోదులో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో రూపొందించిన యాప్ ద్వారా డిసెంబర్ 8వ తేదీన ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ గ్రామాల వారీగా వెబ్‌ల్యాండ్ డేటాతోపాటు పంట సాగుహక్కుపత్రాల (సీసీఆర్సీ) డేటా ఆధారంగా ఈ–క్రాపింగ్ చేస్తున్నారు. దీంతోపాటు సమాంతరంగా రైతుల వేలిముద్రలు (ఈ–కేవైసీ) తీసుకుంటున్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా.. గతేడాది డిసెంబర్లో విరుచుకుపడిన మాండూస్ తుపాన్ వల్ల దెబ్బతిన్న పంటల స్థానే రెండోసారి విత్తుకున్న పంటల వివరాలను స్థానిక వ్యవసాయాధికారి ధ్రువీకరణతో నమోదు చేస్తున్నారు. ప్రైవేటు విత్తన కంపెనీల కోసం విత్తనోత్పత్తికి సాగుచేసే పంటల వివరాలను సర్వే నంబర్ల వారీగా నమోదు చేస్తున్నారు. ఆయా సర్వే నంబర్లలో సాగైన పంటను కొనుగోలు చేయడానికి వీల్లేకుండా ఈ మార్పుచేశారు. సీజన్లో ఒకసారి పంట నమోదైన తర్వాత సాగుకాలం ముగిసేవరకు రెండోసారి పంట నమోదు కాకుండా లాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ‘ఈ–ఫిష్’ ద్వారా ఆక్వా సాగవుతున్నట్టుగా గుర్తించిన సర్వే నంబర్లను ఈసారి ఈ–క్రాప్‌లో బ్లాక్ చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ–క్రాప్, ఈ–కేవైసీ నమోదుతోపాటు మండల వ్యవసాయాధికారుల నుంచి కలెక్టర్ల వరకు ర్యాండమ్‌గా చెక్ చేస్తున్నారు. గతంలో ఈ–క్రాప్, ఈ–కేవైసీ ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ తనిఖీలు చేసేవారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిల్లో తనిఖీ కోసం ఎంపికచేసిన పంట వివరాలను సైతం కమిషనరేట్ నుంచే జిల్లాలకు పంపిస్తున్నారు. ఆ మేరకు ర్యాండమ్‌గా తనిఖీచేసి క్షేత్రస్థాయిలో గుర్తించిన లోటుపాట్లను సరిదిద్దుకునేలా మార్పుచేశారు. ప్రతి 15 రోజులకోసారి ర్యాండమ్‌గా చెక్ చేస్తున్నారు. ఈ–క్రాప్ నమోదు కాగానే రైతుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్లు, ఈ–కేవైసీ పూర్తికాగానే భౌతిక రసీదులు ఇస్తున్నారు. 43.62 లక్షల ఎకరాల్లో పంటల నమోదు రబీ సీజన్లో సాధారణ సాగువిస్తీర్ణం 57.30 లక్షల ఎకరాలుకాగా ఈ ఏడాది 58 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 45.31 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు 43.62 లక్షల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీలోగా ఈ–క్రాప్ నమోదు, ఈ–కేవైసీ నూరుశాతం పూర్తిచేసి, సామాజిక తనిఖీల్లో భాగంగా 28వ తేదీ వరకు ఆర్బీకేల్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత మార్చి 7వ తేదీన తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
తుది దశకు ఈ–క్రాప్ నమోదు
సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రైతులు తమ వేలిముద్రలు (ఈకేవైసీ) నమోదుకు సోమవారం వరకు గడువు ఇచ్చారు. సామాజిక తనిఖీ కోసం ఈ–క్రాప్ జాబితాలను మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు. రైతుల పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం, పంట సాగు తదితర వివరాల నమోదులో ఎక్కడైనా పొరపాట్లు చోటుచేసుకున్నట్టు గుర్తిస్తే వాటిని సరి చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఇస్తారు. నవంబర్ 1వ తేదీ నుంచి తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. వాటి ఆధారంగానే పంటల కొనుగోళ్లకు శ్రీకారం చుడతారు. పంటల బీమా, నష్టపరిహారం వంటి సంక్షేమ ఫలాలు కూడా తుది జాబితా ప్రకారమే అందిస్తారు. పకడ్బందీగా నమోదు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు వేళ ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈసారి ఈ–క్రాప్ నమోదులో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో తయారు చేసిన యాప్ ద్వారా జాయింట్ అజమాయిషీ కింద ఆగస్టు 8న ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ గ్రామాల వారీగా వెబ్‌ల్యాండ్ డేటాతో పాటు పంట సాగు హక్కు పత్రాల (సీసీఆర్సీ) డేటా ఆధారంగా ఈ–క్రాప్ నమోదు చేశారు. ఖరీఫ్‌లో 48 లక్షల మంది రైతులు పంటలు సాగు చేస్తుండగా.. ఇప్పటివరకు 41 లక్షల మంది రైతులు ఆర్బీకేల్లో తమ పంట వివరాలను సరిచూసుకుని వేలిముద్రలు (ఈకేవైసీ) నమోదు చేసుకున్నారు. వరితో సహా నోటిఫైడ్ పంట వివరాలు 100 శాతం పూర్తి కాగా, ఈకేవైసీ నమోదు 95 శాతానికి పైగా నమోదైనట్టు చెబుతున్నారు. -
ఈ క్రాప్‌లో ఫస్ట్.. ఈ కేవైసీలో బెస్ట్
కడప అగ్రికల్చర్: అన్నదాత కష్టానికి నష్టం జరిగేటప్పుడు ఆ నష్టం ప్రభుత్వం భర్తీ చేసేలా ఉండేందుకు వినూత్నంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ క్రాప్ నమోదు జిల్లాలో రికార్డు స్థాయిలో జరిగింది. గత నెల 25న ఈ క్రాప్ గడువు ముగిసింది. 100 శాతం నమోదుకు గాను 133.37 శాతం మేర నమో దు చేసి అధికార యంత్రాంగం శభాష్ అనిపించుకుంది. ఈ క్రాప్ నమోదులో వైఎస్సార్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ క్రాప్ నమో దు పూర్తి చేసుకున్న రైతులందరూ తప్పని సరిగా ఈకేవైసీ కూడా వేయాలి. ఈ విషయంలో వైఎస్సార్ జిల్లా 56.19 శాతం మేర నమోదు చేసి రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. ఈకేవైసీ నమోదు గడువు ఈనెల 10వ తేదీతో ముగియనుంది. ఈ క్రాప్ నమోదు విజయవంతం వైఎస్సార్ జిల్లాలో ఈ క్రాప్ నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయింది. అన్నదాతలకు ప్రభు త్వ ప్రోత్సాహకాలు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు, అతివృష్టి, అనావృష్టి, తెగుళ్లతో నష్టం జరిగితే పంటల బీమా పథకంలో పరిహారం పొందడానికి ఈ క్రాప్ నమోదు తప్పనిసరి. దీంతోపాటు గతేడాది జిల్లాలో అధిక వర్షాలతో చాలా మంది రైతులకు సంబంధించిన పంటలకు నష్టం జరిగింది. అయితే నష్టపోయిన పంటలన్నింటికి ప్రభుత్వం పంటనష్ట పరిహారం చెల్లించింది. దీంతో చాలామంది రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. గతంలో కొంతమంది రైతులు ఈ క్రాప్ నమోదులో నిర్లక్ష్యం వహించడంతో పరిహారం అందక ఇబ్బందులు పడ్డారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సారి అన్న దాతలు ఉత్సాహంగా పంటలను నమోదు చేసుకున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్లు ఈ క్రాప్ వివరాలను నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో వీఆర్వోలతోపాటు వీరు ఈ వివరాలను ధ్రువీకరించాలి. సాధారణం కంటే అధిక శాతం జిల్లాలో 36 మండలాల పరిధిలోని 735 రెవెన్యూ గ్రామాలకుగాను 676 గ్రామాల పరిధిలో ఈ ఖరీఫ్ సీజన్‌కుగాను వ్యవసాయ, ఉద్యానశాఖ, సెరికల్చర్‌కు సంబంధించి సాధారణ విస్తీర్ణం 2,64.664. 81 ఎకరాలు ఉండగా ఈ ఏడాది సకాలంలో వర్షాలు రావడంతో 3,54,300.03 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 1,34,812 మంది రైతులకు సంబంధించి 3,54,300.03 ఎకరాల్లో ఈ క్రాప్ నమోదు పూర్తి చేసుకుని 133.87 శాతం మేర నమోదు ప్రక్రియ పూర్తయింది. ముమ్మరంగా ఈకేవైసీ మొన్న మొన్నటి వరకు ఈ క్రాప్ నమోదులో బిజీబిజీగా ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు, సెరికల్చర్ అసిసెంట్లతోపాటు వీఆర్వోలు ప్రస్తుతం ఈ క్రాప్ నమోదుకు సంబంధించి ఈకేవైసీతో ధ్రువీకరణ చేసే ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలోని 36 మండలాల పరిధిలో 9వ తేదీ ఉదయానికి 75518 మంది రైతులకు సంబంధించి 2,12,110 ఎకరాల్లో ఈకేవైసీ పూర్తి చేసి 56.19 శాతం మేర నమోదుతో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. ఈ ప్రక్రియ ఈనెల 10వ తేదీతో ముగియనుంది నమోదుపై తనిఖీ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పంటను చూసి ఈ పంట నమోదు చేశారు. ఈ రైతు ఏ పంట వేశాడో పరిశీలించి ఈ క్రాప్‌లో నమోదు చేశారు. ఈ అంశాన్ని రైతులే స్వయంగా తెలుసుకోవచ్చు. ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రైతు భరోసా కేంద్రాల్లో వివరాలు అందుబాటులో ఉంచనున్నారు. అక్కడి నుంచి ఏడు రోజులపాటు అంటే ఈ నెల 28వ తేదీలోపు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి మార్పులు, చేర్పులు చేస్తారు. ఇందుకు సంబంధించిన తుది జాబితాను ఈ నెల 31న ఆయా రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. లక్ష్యానికి మించి ఈ క్రాప్ నమోదు వైఎస్సార్ జిల్లాలో లక్ష్యానికి మించి ఈ క్రాప్ నమోదు చేశాం. సాధారణంగా వందశాతం చేయాల్సి ఉండగా ప్రస్తుతం 133.87 శాతం మేర చేశాం. ఈ క్రాప్ నమోదుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈకేవైసీని కూడా ప్రస్తుతం ముమ్మరంగా చేస్తున్నాం. ఈ ప్రక్రియంతా పూర్తి చేసి ఈ నెలాఖరుకు తుది జాబితాను ప్రదర్శిస్తాం. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి. వైఎస్సార్ జిలా -
ఏపీని ఆదర్శంగా తీసుకోండి.. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్ అహూజా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లుగా విజయవంతంగా అమలుచేస్తున్న ఎలక్ట్రానిక్ క్రా పింగ్ (ఈ–క్రాప్)ను 2023 మార్చికల్లా అన్ని రా ష్ట్రాలు అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్ అహూజా సూచించారు. ఏపీని ఆదర్శంగా తీసుకొని ఈ–క్రాపింగ్ అమలుచేయాలని సూచించారు. అగ్రిస్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ పేరిట జాతీయ స్థాయిలో ఈ–క్రాపింగ్ అమలుపై అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖాధికారులతో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో అహూజా మాట్లాడుతూ వాస్తవ సాగుదారులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏపీలో ఈ క్రాపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుత ఖరీఫ్, వచ్చే రబీసీజన్‌లో అన్ని రాష్ట్రాలు పైలెట్ ప్రాజెక్టుగా ఈ–క్రాపింగ్‌ను అమలు చేయాలని సూచిం చారు. 2023 మార్చి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. ఏపీలో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న చోట ఆన్లైన్లో, లేని చోట ఆఫ్‌లైన్‌లో ఈ–క్రాపింగ్ నమోదు చేస్తున్నారని చెప్పారు. ఇదే హైబ్రిడ్ విధానంలో అన్ని రాష్ట్రాలూ పాటించాలన్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని చోట ఆఫ్‌లైన్‌లో నమోదు చేసి, ఆ వివరాలను ఇంటర్నెట్ ఉన్న చోట ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. రైతులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ఈ–క్రాప్ అమలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, స్పెషల్ కమిషనర్ హరికిరణ్ ఇతర రాష్ట్రాల అధికారులకు వివరించారు. వాస్తవ సాగుదారులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు ఈ–క్రాపింగ్‌ను డిజైన్ చేసినట్లు తెలిపారు. ఈ–క్రాపింగ్ ప్రామాణికంగా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, పంట నష్ట పరిహారం, పంటల బీమా వంటి అన్ని పథకాలనూ అందిస్తున్నామన్నారు. గ్రామస్థాయిలో ఆర్బీకేల ద్వారా ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లను కూడా దీని ఆధారంగానే చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానించి అమలు చేయనున్నట్లు చెప్పారు. ఆర్బీకేలు, సచివాలయాల్లో ఉండే వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సçహాయకులు సంయుక్తంగా ఈ–క్రాపింగ్ నమోదు చేసి, ప్రతి రైతుకు రశీదులు ఇస్తున్నారన్నారు. వివిధ రాష్ట్రాల అధికారుల సందేహాలను స్పెషల్ సీఎస్, కమిషనర్ నివృత్తి చేశారు. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూసర్వేకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ సర్వే పూర్తయితే భూముల సరిహద్దులు కచ్చితంగా నిర్ధారణ అవుతాయని, ఈ క్రాప్‌ను మరింత పక్కాగా ఇంటిగ్రేట్ చేయవచ్చని చెప్పారు. జాతీయ స్టీరింగ్ కమిటీలో తొలిసారి ప్రాతినిధ్యం కేంద్ర వ్యవసాయ పథకాలు, కార్యక్రమాల అమలుకు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రాతినిధ్యం కల్పించారు. ఈ కమిటీలో ఓ రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించడం ఇదే తొలిసారి. ఈ కమిటీలో కేంద్ర వ్యవసాయ మంత్రి, కార్యదర్శులు, సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులే ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌ని ఆదర్శంగా తీసుకొని ఈ–క్రాపింగ్‌ను అమలు చేస్తున్నందున ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌కు కూడా చోటు కల్పించారు. -
ఏపీ మోడల్ తరహాలో దేశవ్యాప్తంగా ఈ–క్రాప్
ఈ–క్రాప్ నమోదు ద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించి వివిధ పథకాల అమలు, నష్టపరిహారం పంపిణీ సులువుగా మారింది. ఏ ఊళ్లో.. ఎన్ని ఎకరాల్లో.. ఏయే పంటలు వేశారన్న కచ్చితమైన సమాచారం అందుబాటులోకి వస్తోంది. తద్వారా దిగుబడిపై ముందస్తుగా ఓ అంచనాకు రావచ్చు.. ఆయా పంటలకు మార్కెటింగ్ కల్పించే విషయమై సరికొత్త ఆలోచనలతో అడుగులు ముందుకు వేయొచ్చు. ఈ–క్రాప్ వల్ల ఇన్ని సౌలభ్యాలుండటం గమనించిన కేంద్రం.. ‘ఏపీ మోడల్ భేష్’ అంటూ జాతీయ స్థాయిలో అమలుకు శ్రీకారం చుడుతోంది. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ–క్రాప్ నమోదు వల్ల రైతాంగానికి ఒనగూరుతున్న ప్రయోజనాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్రం.. ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఏపీని మోడల్‌గా తీసుకొని.. అగ్రిస్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ (ఏడీఎ) పేరిట అన్ని రాష్ట్రాల్లో ఈ– క్రాప్ నమోదు చేయాలని కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన ఈ కార్యక్రమం మూడేళ్లుగా విజయవంతంగా అమలవుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటోంది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు, రూ.లక్ష లోపు పంట రుణాలు ఏడాది లోపు చెల్లించిన వారికి వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీజన్ ముగియకుండానే పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ), వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాలనందిస్తున్నారు. భూ యజమానులకే కాకుండా, సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు కూడా ఈ క్రాప్ నమోదే అర్హతగా వైఎస్సార్ రైతు భరోసాతో సహా అన్ని రకాల పథకాలు అందిస్తున్నారు. ఈ క్రాప్ అమలులోకి వచ్చాక వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుగ్రాసం, ఆక్వా పంటలన్నీ కలిపి ఖరీఫ్ 2020లో 124.92 లక్షల ఎకరాలు, రబీ 2020–21లో 83.77 లక్షల ఎకరాలు, ఖరీఫ్ 2021లో 112.26 లక్షల ఎకరాలు, రబీ 2021–22లో 82.59 లక్షల ఎకరాల్లో ఈ–క్రాప్ బుకింగ్ జరిగింది. ఏపీలో ఈ–పంట నమోదు ఇలా.. ► నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్ ద్వారా జాయింట్ అజమాయిషీ కింద వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సహాయకులు ఈ –పంట నమోదు చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కు పత్రం) డేటా ఆధారంగా వాస్తవ సాగుదారులు సీజన్ వారీగా ఏ సర్వే నంబర్లో ఏయే రకాల పంటలు ఏయే వ్యవసాయ పద్దతులు పాటిస్తూ సాగు చేస్తున్నారో ఆర్బీకేల్లో నమోదు చేస్తున్నారు. ► ఆ తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలనలో జియో కో ఆర్డినేట్స్‌తో సహా పంట ఫొటోను అప్లోడ్ చేసి, చివరగా రైతుల సోషల్ స్టేటస్ తెలుసుకునేందుకు వీలుగా వారి వేలి ముద్రలు (ఈకేవైసీ – మీ పంట తెలుసుకోండి) తీసుకుని.. డిజిటల్ రసీదు వారి ఫోన్ నంబర్‌కు పంపిస్తున్నారు. ► ఈ పంట నమోదును వీఏఏ/వీహెచ్‌ఎ, వీఆర్ఏ ధ్రువీకరించగానే ఫిజికల్ రసీదు అందజేస్తారు. పంట సాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు ఆ కార్డుల్లేని రైతుల పంట వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. ► ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 96.41 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 43.35 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతుంటే.. ఇప్పటి వరకు 35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 20 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు నమోదు చేశారు. సెప్టెంబర్ 15కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి, సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రాల వారీగా స్టీరింగ్ కమిటీలు ► ఏపీలో ఈ–క్రాప్‌ను మోడల్‌గా తీసుకొని అగ్రి స్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ (ఏడీఏ) అమలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఏడీఏ ద్వారా పంటల సాగు ఆధారంగా రైతుల డేటా బేస్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు వెబ్ ల్యాండ్ డేటానే అన్నింటికీ ఆధారం. దీన్ని బట్టే పీఎం కిసాన్తో సహా ఇతర పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. ఇక నుంచి సీజన్ వారీగా పంటల సాగు ఆధారంగా రైతుల డేటాను తయారు చేసి, ఆ మేరకు వారికి సంక్షేమ ఫలాలు అందించాలని సంకల్పించింది. ► వెబ్ ల్యాండ్ డేటా ఆధారంగా జియో రిఫరెన్స్, విలేజ్ మ్యాప్, జీఐఎస్, ఆధార్ అథంటికేషన్, ఈ–కేవైసీలను అనుసంధానిస్తూ సీజన్ వారీగా రియల్ టైం క్రాప్ సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాల కోసం రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్ కమిటీలు, అమలు కోసం జిల్లా స్థాయిలో ఇంప్లిమెంటింగ్ కమిటీలు నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ► ఈ డేటాతో పీఎం కిసాన్తో పాటు పీఎంఎఫ్‌బీవై వంటి సంక్షేమ పథకాలను అనుసంధానించాలని భావిస్తోంది. ఇప్పటికే ఏపీని ఆదర్శంగా తీసుకొని తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ– పంట నమోదుకు శ్రీకారం చుట్టారు. ఇదే బాటలో జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కేంద్రం కార్యాచరణ సిద్ధం చేసింది. ► ఇందుకోసం సోమవారం జాతీయ స్థాయిలో వ్యవసాయ శాఖ కార్యదర్శులు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్ అహూజా ఆదేశాల మేరకు ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్‌లు రాష్ట్రంలో అమలవుతున్న ఈ–పంట నమోదుపై అవగాహన కల్పించనున్నారు. కేంద్రానికి ఏపీ ఆదర్శం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినూత్న ఆలోచనలకు దక్కిన అరుదైన గౌరవమిది. ఏపీని ఆదర్శంగా తీసుకుని అగ్రిస్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ పేరిట జాతీయ స్థాయిలో ఈ పంట నమోదుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బాటలోనే వాస్తవ సాగుదారుల డేటాను రూపొందించి పీఎం కిసాన్తో సంక్షేమ ఫలాలు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించడం నిజంగా శుభ పరిణామం. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ -
వడివడిగా ఈ-పంట నమోదు
కడప అగ్రికల్చర్: రైతుకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) ఏర్పాటు చేసి విత్తనం మొదలుకుని పంట దిగుబడి చేతికొచ్చే వరకు అన్ని రకాల సేవలందిస్తోంది. అలాగే అర్హులైన రైతులకు ప్రభుత్వ పథకాలను అందించాలనే లక్ష్యంలో ఈ క్రాప్ పేరుతో పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది.ఇందులో భాగంగా రైతులు ఏయే పంటలు సాగు చేశారు..ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే వివరాలను వ్యవసాయ అధికారులు ఈ క్రాప్‌లో నమోదు చేస్తున్నారు. ఖరీఫ్‌లో సాగైన పంటల వివరాలు జిల్లాలో 36 మండలాల పరిధిలోని 432 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 91,741 హెక్టార్లలో సాధారణ వ్యవసాయ సాగు భూమి ఉంది. ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు 38,592 హెక్టార్లలో వివిధ పంటలను సాగుచేశారు. ఇందులో 3,398 హెక్టార్లలో వరి, 531 హెక్టార్లలో సజ్జ, 236 హెక్టార్లలో మొక్కజొన్న, కంది 968 హెక్టార్లలో, మినుము 1687 హెక్టార్లలో, వేరుశనగ 2601 హెక్టార్లలో, పొద్దుతిరుగుడు 1385 హెక్టార్లలో, సోయాబీన్ 2,706 హెక్టార్లలో సాగైంది. వీటిలో ఏయే పంటలు ఎంతమేర సాగయ్యాయనే వివరాలను విలేజ్ అగ్రికల్చర్, హార్టీకల్చర్ సెరీకల్చర్ అసిస్టెంట్లు నేరుగా రైతుల పొలం వద్దకే వెళ్లి ఈ క్రాపులో నమోదు చేస్తున్నారు. జోరుగా నమోదు ప్రక్రియ జిల్లాలో అగ్రికల్చర్, హార్టీకల్చర్, సెరీకల్చర్‌కు సంబంధించి సాధారణ సాగు విస్తీర్ణం 1,90, 727 ఎకరాలు ఉంది. ఇందులో పలు రకాల పంటలు దాదాపు 60 వేల ఎకరాలకు పైగా సాగైంది. వీటికి సంబంధించి ప్రస్తుతం ఈ పక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా మూడు పంటలు కలుపుకుని దాదాపు 40 వేల ఎకరాల్లో ఈ–క్రాప్ నమోదు జరిగింది. ఈ క్రాపు నమోదులో రాష్ట్రంలో వైఎస్సార్‌జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రాపు నమోదు కోసం రైతులు ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్‌నంబర్లు, భూమికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి. వీఏఏలు ఆధార్ బేస్ డేటాను అనుసంధానం చేసి ఈ క్రాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈ పక్రియను సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇవీ ప్రయోజనాలు... పంట నమోదు వల్ల వరదలు, తుపాన్ల సమయంలో పంటలకు ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ అందుతోంది. పంటల బీమా కావాలన్నా, సున్నా వడ్డీకి పంట రుణాలు కావాలన్నా రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు తీసుకోవాలన్నా ఈ క్రాప్‌లో నమోదు తప్పనిసరి. పండించిన పంట ఉత్పత్వులను ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నా ఈ క్రాప్ చేసి ఉండాలి. కౌలు రైతులు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు తమ వివరాలు అందజేసి పంట నమోదు చేసుకోవచ్చు. రైతులందరూ ఈ క్రాప్ నమోదు చేసుకోవాలి జిల్లాలో రైతులందరూ ఈ క్రాప్ నమోదు చేయించుకుంటే ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది.జిల్లాలో ఈ ప్రక్రియ పక్రియ పకడ్బందీగా జరుగుతోంది. వరదలు, తుపాన్లు వచ్చి పంట నష్టపోయిన సమయంలో ఈ క్రాప్ చేయించుకుని ఉంటే ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ అందుతుంది. పంటలు సాగు చేసిన ప్రతి రైతు కచ్చితంగా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
ఖరీఫ్‌లో పంటల నమోదుకు ‘ఈ–క్రాప్’
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో ఈ–పంట నమోదుకు అధికార యంత్రాంగం సోమవారం నుంచి శ్రీకారం చుడుతోంది. సాంకేతిక సమస్యలకు తావులేకుండా పకడ్బందీగా ఈ–పంట నమోదుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులు సంయుక్తంగా ఈ–పంట నమోదు చేయనున్నారు. ఇందుకోసం గ్రామాల్లో దండోరాతోపాటు రైతు వాట్సాప్ గ్రూపులు, ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. పక్కాగా నమోదు ఈ ఖరీఫ్‌లో 92.05 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం కాగా ఇప్పటికే 47.07 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు ఇన్పుట్ సబ్సిడీ, పంటల కొనుగోలుకు ఈ క్రాప్ నమోదే ప్రామాణికం. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో అనుసంధానిస్తూ అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి ఈ పంట నమోదే ప్రామాణికం. ఈ నేపథ్యంలో చిన్నపాటి లోపాలకు కూడా ఆస్కారం లేకుండా ఈ క్రాప్ నమోదు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో వ్యవసాయ శాఖ అందుకు అనుగుణంగా సన్నద్ధమైంది. క్షేత్రస్థాయిలో పరిశీలన.. ఈ క్రాప్ నమోదు కోసం ఆధార్, 1 బీ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నెంబర్, సీసీఆర్సీ కార్డులతో రైతులు ఆర్బీకేల వద్దకు వెళితే సరిపోతుంది. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంటసాగు హక్కు పత్రం) డేటాతో యాప్‌ను అనుసంధానించినందున రైతు ఆధార్ నెంబర్ నమోదు చేయగానే సర్వే నంబర్లవారీగా భూముల వివరాలు తెలుస్తాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఏ సర్వే నెంబర్ పరిధిలో ఏ రకం పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు. ఆ తర్వాత వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులతో కలిసి రోజూ కనీసం 50 ఎకరాలకు తక్కువ కాకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపడతారు. యాప్‌లో నమోదైన వివరాలతో సరి పోల్చుకుని జియో కో ఆర్డినేట్స్‌తో సహా పంటల ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారు. అనంతరం యాప్‌లో నమోదు చేసిన వివరాలన్నీ తెలియచేసి రైతు వేలిముద్ర (మీ పంట తెలుసుకోండి – ఈకేవైసీ) తీసుకోగానే యాప్ ద్వారానే సంబంధిత ఫోన్ నెంబర్‌కు డిజిటల్ రసీదు జారీ అవుతుంది. ఆ తర్వాత వీఏఏ /వీహెచ్ఏ, వీఆర్వో వేలిముద్రలు వేసి సబ్మిట్ చేస్తారు. పంట నమోదు ప్రక్రియ పూర్తి కాగానే రైతుకు భౌతిక రసీదు అందజేస్తారు. పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను కూడా నమోదు చేసేలా యాప్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భూమి ఖాళీగా ఉంటే నో క్రాప్ అని, ఆక్వా సాగవుతుంటే ఆక్వా కల్చర్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రి ల్యాండ్ అని నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారు. పండ్ల తోటలు, సుబాబుల్, యూకలిఫ్టస్, ఆర్చర్డ్ (అలంకరణ పుష్పాలు) తోటలను వయసువారీగా నమోదు చేస్తారు. ఈ ఆప్షన్లో వివరాలు.. సీసీఆర్సీ కార్డులు లేని సాగుదారులు, వెబ్‌ల్యాండ్‌లో నమోదు కానివారు ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తుంటే పర్యవేక్షణాధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఒకసారి వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత మార్పు (ఎడిట్) చేసే అవకాశం వీఏఏ/వీహెచ్‌ఏలకు కల్పించలేదు. ఎంఏవోలు/ ఎంఆర్వోలు 10 శాతం, ఏడీఏ/ఏడీహెచ్‌లు 5 శాతం, డీఏవో/డీహెచ్‌ఒలు మూడు శాతం, జాయింట్ కలెక్టర్లు రెండు శాతం, కలెక్టర్లు ఒక శాతం చొప్పున విధిగా ఈ పంట నమోదును ర్యాండమ్‌గా తనిఖీ చేయాలి. ఈసారి పబ్లిక్ సెర్చ్ ఆప్షన్ కూడా కల్పించారు. పంట నమోదు ప్రక్రియ పూర్తి కాగానే ఆ వివరాలను ఈ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. నేటి నుంచి ప్రారంభమవుతున్న ఈ పంట నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అనంతరం సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేల్లో పంట నమోదు వివరాలను ప్రదర్శిస్తారు. -
అసలైన సాగుదారులకు దన్నుగా..
సాక్షి, అమరావతి: భూ యజమాని హక్కులకు భంగం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులకు మరింత మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. గడిచిన ఖరీఫ్ సీజన్లో ఈ–క్రాప్ నమోదు పగడ్బందీగా చేపట్టారు. రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ (ఆర్బీయూడీపీ) ద్వారా తొలిసారిగా సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాలను నమోదు చేశారు. కానీ, చాలాచోట్ల వాస్తవ సాగుదారుల స్థానంలో భూ యజమానుల పేర్లు నమోదైనట్లుగా గుర్తించారు. దీంతో ప్రస్తుత రబీ సీజన్లో సాగుచేసే ప్రతీ అసలైన రైతు వివరాలు ఈ–క్రాప్‌లో నమోదుకు చర్యలు చేపట్టారు. నిజానికి.. ఈ–క్రాప్ విధానం అమలులోకి వచ్చాక ఖరీఫ్–2020 సీజన్లో 124.92 లక్షల ఎకరాల్లో 49.72 లక్షల మంది రైతులు సాగుచేస్తున్నట్లుగా నమోదు కాగా.. రబీ 2020–21లో 34.65 లక్షల మంది రైతులు 86.77లక్షల ఎకరాలు సాగుచేస్తున్నట్లుగా నమోదయ్యాయి. అలాగే, ఖరీఫ్–2021లో 45.02 లక్షల మంది రైతులు సాగుచేస్తున్న 102.23 లక్షల ఎకరాలు నమోదు చేశారు. వీరిలో కౌలురైతులు 2.92 లక్షల మంది ఉన్నారు. కానీ, వాస్తవంగా రాష్ట్రంలో 16.56 లక్షల మంది కౌలుదారులున్నారు. వారిలో 60–70 శాతానికి పైగా సెంటు భూమి కూడా లేనివారే. సాగువేళ వీరిలో ప్రభుత్వ ప్రయోజనాలందుకుంటున్న వారు 10–20 శాతం లోపే ఉంటున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ప్రతీ వాస్తవసాగుదారుడు లబ్ధిపొందేలా ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్లో ఈ–క్రాప్ నమోదులో మార్పులు తీసుకొచ్చింది. వీటిపై వాస్తవ సాగుదారులు–భూ యజమానులకు అర్ధమయ్యే రీతిలో ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. సాగుదారుల గుర్తింపు ఇలా.. ► విత్తిన వారంలోపు ఆర్బీకేల్లో ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్ నెంబర్లతో సహా క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డు (సీసీఆర్సీ) నకళ్లను అందజేయాలి. ► ఒకవేళ సీసీఆర్సీ లేకున్నా, భూ యజమాని అంగీకరించకపోయినా సరే తాము ఏ సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటల సాగుచేస్తున్నామో ఆ వివరాలను ఆర్బీకేలో తెలియజేసి ఈకేవైసీ (వేలిముద్రలు) చేయించుకుంటే రెండు వారాల్లోపు ఆర్బీకే సిబ్బంది పొలానికి వెళ్లి చుట్టుపక్కల రైతులను విచారించి వాస్తవ సాగుదారుడెవరో గుర్తిస్తారు. ► ఇలా నమోదైన వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో వారం రోజులపాటు ప్రదర్శిస్తారు. తప్పులుంటే సవరిస్తారు. ► అభ్యంతరాలొస్తే మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవ సాగుదారులను గుర్తిస్తారు. సీసీఆర్సీ అంటే.. సీసీఆర్సీ పత్రం అంటే భూ యజమానికి, సాగుదారునికి మధ్య అవగాహనా ఒప్పంద పత్రం. వలంటీర్/వీఆర్ఓ వద్ద ఉండే దరఖాస్తులో వివరాలు నింపి భూ యజమాని లేదా వారి ప్రతినిధి, సాగుదారు–గ్రామ వీఆర్వోలు సంతకం చేస్తే సరిపోతుంది. పంట కాలంలో ఎప్పుడైనా ఈ పత్రాన్ని పొందవచ్చు. దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే ఈ పత్రం జారీచేస్తారు. దీని కాలపరిమితి జారీచేసిన తేదీ నుంచి కేవలం 11 నెలలు మాత్రమే. ఈ కార్డుపొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల రైతులు వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం పొందేందుకు అర్హులు. ఈ–క్రాప్‌తో ప్రయోజనాలు.. ► దీని ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణం పొందవచ్చు. ► రూ.లక్షలోపు పంట రుణం ఏడాదిలోపు చెల్లిస్తే సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 4 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. ► ఉచిత పంటల బీమా సౌకర్యం వర్తిస్తుంది. ► వైపరీత్యాల్లో పంట నష్టానికి పెట్టుబడి రాయితీ పొందొచ్చు. ► అలాగే, పంటలను ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరలకు అమ్ముకోవచ్చు. భూ యజమానులకు పూర్తి రక్షణ ఈ–క్రాప్‌లో వాస్తవ సాగుదారుల వివరాలు నమోదు ద్వారా భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. ఈ వివరాలేవీ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయరు. కోర్టులో సాక్షులుగా కూడా చెల్లవు. ఈ–క్రాప్ ఆధారంగా పొందిన పంట రుణం కట్టకపోయినా, ఎగ్గొట్టినా భూ యజమాని/భూమిపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. కేవలం బకాయి వసూలు సందర్భంగా ఫలసాయంపై మాత్రమే బ్యాంకులకు హక్కు ఉంటుంది. -
జోరుగా ఈ–పంట నమోదు
సాక్షి, అమరావతి: ఈసారి విత్తుతో పాటు పంటల నమోదు కూడా ఒకేసారి ప్రారంభమైంది. విత్తనం వేసిన వెంటనే రైతులు తమ పంట వివరాలను ఆర్బీకేలో నమోదు చేశారు. ఆ తర్వాత 15–20 రోజుల్లో ఆర్బీకేల్లోని వ్యవసాయ, ఉద్యాన సహాయకులు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వెళ్లారు. ఆర్బీయూడీపీ యాప్‌లోని వివరాలతో సరిపోల్చి అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత పంట ఫొటో, ఇతర వివరాలను అప్లోడ్ చేశారు. మూడో దశలో రైతుల వేలిముద్రలు (ఈ–కేవైసీ) తీసుకొని ఈ–పంట వివరాలతో అనుసంధానించారు. ఈ యాప్‌లో పంట వివరాలు నమోదు కాగానే రైతు మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపారు. ‘మీ పంట ఈ క్రాప్‌లో నమోదైనట్టు’గా ధ్రువీకరించే రశీదు (డిజిటల్ ఎక్నాలెడ్జ్మెంట్ కాపీ)ని కూడా అందజేశారు. ఎంత నమోదైందంటే ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 92.21 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 89.96 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌లో సాగు చేస్తున్న రైతులు అందరూ ఆర్బీకేల్లో పంట వివరాలు నమోదు చేసుకున్నారు. సాగైన విస్తీర్ణంలో 80,52,863 ఎకరాల్లో (దాదాపు 90 శాతం) పంటల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు. ఇప్పటి వరకు 77,00,550 ఎకరాల్లో పంటలకు సంబంధించి రైతులకు రశీదులు అందజేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలో రైతు ఫొటో తీసి పంట వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది ఈ ఖరీఫ్‌లో పంటలు సాగు చేస్తున్న 42,92,773 మంది రైతులకు గాను ఇప్పటివరకు 29,86,151 మంది వేలిముద్రలను ఈ క్రాప్‌తో అనుసంధానించడం ద్వారా 70 శాతం ఈ కేవైసీ పూర్తి చేశారు. ఇంకా 9.43 లక్షల ఎకరాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉంది. 13.06 లక్షల రైతుల వేలిముద్రలను ఈ క్రాప్‌తో అనుసంధానించాల్సి ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లో నవంబర్ 5వ తేదీ, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో నవంబర్ 15 కల్లా ఈకేవైసీతో సహా మొత్తం ప్రక్రియ పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. కోతలు ప్రారంభమయ్యే నాటికి కొనుగోలు కేంద్రాలు కోతలు ప్రారంభమయ్యే నాటికి ఆర్బీకే స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొనుగోలు సందర్భంగా ఏ ఒక్క రైతు ఇబ్బందిపడకుండా చర్యలు చేపట్టారు. ‘ఈ–పంట’లో నమోదుతో లాభాలెన్నో... ఈ క్రాప్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సాగు ఉత్పాదకాలు, పంట రుణాలు, సున్నా వడ్డీ, పెట్టుబడి రాయితీలు, పంటల బీమా, పంట నష్టపరిహారంతో పాటు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు అమ్ముకోవచ్చు. తాజాగా సాగుకు అవసరమైన సలహాలు, సూచనలు పొందే వెసులుబాటు కూడా కల్పించారు. ఏ సర్వే నంబర్లో ఏ రకం పంట వేశారు, ఎప్పుడు కోతకొస్తుంది. ఎంత దిగుబడి వస్తుంది, పంట నాణ్యత ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. ఎన్నో ప్రయోజనాలు ► మిరప సాగు చేసా. పంట వివరాలు నమోదు చేయించుకున్నా. ఈ పంట నమోదుతో ఎన్నో ప్రయోజనాలు పొందే అవకాశం ఏర్పడింది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులే కాదు.. పంట రుణాలు,. పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం.. ఇలా ప్రతిదీ ఈ పంటలో వివరాల ఆధారంగానే ఇస్తున్నారు. – సీహెచ్ వెంకట సతీష్‌కుమార్, చినఓగిరాల శ్రీకాకుళం జిల్లా దారబకు చెందిన ఈ రైతు పేరు ఎస్.సిమ్మయ్య. ఈ ఖరీఫ్‌లో 3 ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఆర్బీకేలో బుక్ చేసుకున్న వెంటనే ఇతనికి విత్తనాలు ఇచ్చారు. వాటిని నాటిన అనంతరం ఆర్బీకేలో పంట వివరాలు (ఈ–పంటలో) నమోదు చేయించాడు. వెంటనే సిబ్బంది అతని పొలానికి వచ్చి పంట వివరాలు తీసుకున్నారు. ఫొటోలు తీసుకొన్నారు. వేలిముద్రలు తీసుకొని ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేశారు. రశీదు కూడా ఇచ్చారు. ఇప్పుడు తనకు ప్రభుత్వం నుంచి పలు ప్రయోజనాలు అందుతాయని సిమ్మయ్య సంతోషంగా ఉన్నాడు. ఈ రైతు పేరు మారెప్ప. అనంతపురం జిల్లా దురదకుంట. 9 ఎకరాల్లో వేరుశనగ వేశాడు. విత్తనాలు వేయగానే ఆర్బీకేలో పంట వివరాలు నమోదు చేశాడు. 15 రోజుల్లో వ్యవసాయ సిబ్బంది వచ్చి పంట ఫొటోలు, వివరాలు తీసుకున్నారు. రైతు వేలిముద్రలు కూడా తీసుకొని, రశీదు ఇచ్చారు. ఇకపై తెగుళ్లు, చీడపీడల నుంచి పంటను రక్షించుకోవడానికి వ్యవసాయ అధికారుల తోడ్పాటు లభిస్తుందని, పంట విక్రయం కూడా సులభమవుతుందని మారెప్ప ఘంటాపథంగా చెబుతున్నాడు. ఇలా రాష్ట్రంలో దాదాపు 43 లక్షల మంది రైతులు తమ పంటలు ఈ–పంటలో నమోదు చేయించుకున్నారు. దాదాపు 70 శాతం రైతుల ఈ కేవైసీ పూర్తయింది. మిగతా 30 శాతం రైతుల పంటల నమోదు కూడా వేగవంతంగా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి రైతు ఏ రాయితీ పొందాలన్నా పంటల నమోదు (ఈ–క్రాప్) తప్పనిసరి. ఈ ఏడాది మరింత సాంకేతికతతో కొత్తగా తీసుకొచ్చిన రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లా్లట్‌ఫామ్ (ఆర్బీయూడీపీ) ద్వారా ఈ పంట నమోదు జరుగుతోంది. -
ఆర్బీకేల తనిఖీ తప్పనిసరి
ఆర్బీకేల తనిఖీల్లో.. ఇ– క్రాపింగ్ చేసిన తర్వాత డిజిటల్ రశీదుతోపాటు, భౌతికంగా కూడా రశీదు ఇస్తున్నారా.. లేదా? అనేది చూడాలి. గ్రామంలో ప్రతి ఎకరా కూడా ఇ– క్రాపింగ్ జరగాల్సిందే. సాగుదారు ఎవరు? ఏ పంట సాగుచేస్తున్నారన్నది ప్రధానం. ఆ వివరాలనే నమోదు చేయాలి. ఇ– క్రాపింగ్ ఉంటేనే పంటల బీమా, సున్నా వడ్డీ, పంట కొనుగోళ్లు, ఇన్పుట్ సబ్సిడీ.. ఇలాంటివన్నీ సవ్యంగా జరుగుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 62 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. నవంబర్ నుంచి రబీ పనులు ఊపందుకుంటాయి. 56 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. రబీకి అవసరమైన విధంగా అధికారులు సన్నద్ధం కావాలి. ఈ రంగం ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ప్రతిక్షణం మీరు మనసులో పెట్టుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దీని మీదే ఆధారపడి ఉంది. సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు కలెక్టర్లు, జేసీలు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు)ను కూడా తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఎటువంటి డాక్యుమెంట్లతో సంబంధం లేకుండా ఇ–క్రాపింగ్ చేయాలని స్పష్టం చేశారు. సీడ్ కార్పొరేషన్లో ఎంప్యానెల్ అయిన కంపెనీలు మాత్రమే విత్తనాలు సరఫరా చేయాలని.. మరెవరైనా ఎంప్యానెల్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో రబీ సన్నద్ధత, ఇ–క్రాపింగ్, కౌలు రైతులకు రుణాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇ– క్రాపింగ్ చేయించడమనేది ఆర్బీకేల ప్రాథమిక విధి అని చెప్పారు. దీనిపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. సీఎం–యాప్ పై కూడా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఎక్కడ రైతులకు ధరల విషయంలో నిరాశాజనక పరిస్థితులు ఉన్నాయో సీఎం –యాప్ ద్వారా పర్యవేక్షించి వెంటనే రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జేసీ, మార్కెటింగ్ శాఖ అలాంటి పరిస్థితుల్లో వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పారు. జేడీఏలు, డీడీఏలు కూడా 20 శాతం ఇ– క్రాప్ తనిఖీలు చేయాలని.. అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు తప్పనిసరిగా 30 శాతం ఇ–క్రాప్ తనిఖీ నిర్వహించాలన్నారు. వ్యవసాయ సలహా మండలి సమావేశాలు కచ్చితంగా జరిగేలా చూడాలని చెప్పారు. నెలలో మొదటి శుక్రవారం ఆర్బీకేల స్థాయిలో, రెండో శుక్రవారం మండల స్థాయిలో, మూడో శుక్రవారం జిల్లాల స్థాయిలో, నాలుగో శుక్రవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి సమక్షంలో రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశాల్లో వచ్చే సలహాలు, సూచనలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మనం గ్యారెంటీ ఇస్తున్నామనే విషయాన్ని మరవద్దు ► ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేయాలి. నెల్లూరులో జరిగిన ఘటన నాదృష్టికి వచ్చింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పాం. ఎంప్యానెల్ అయిన కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులనే ఇవ్వాలి. సీడ్ కార్పొరేషన్.. ఈ ఉత్పత్తులను సమగ్రంగా పరిశీలించాలి. సీడ్ కార్పొరేషన్లో ఎంప్యానెల్ అయిన కంపెనీలు మాత్రమే సరఫరా చేయాలి. ► మరెవ్వరూ ఎంప్యానెల్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే సహించేది లేదు. ఆర్బీకేల ద్వారా ఇస్తున్న సీడ్, ఫెర్టిలైజర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్న విషయాన్ని మరిచిపోవద్దు. కలెక్టర్లు మొదలుకుని అందరూ కూడా సమష్టిగా బాధ్యత వహించాలి. ► పదిహేను రోజులకొకసారి కలెక్టర్లు ఆర్బీకేలపై సమీక్ష నిర్వహించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉంచడానికి ఆర్బీకేల్లోనే గోడౌన్లను ఏర్పాటు చేస్తున్నాం. అప్పటి వరకు స్టోరేజీ కోసం.. అద్దె ప్రాతిపదికన భవనాలు తీసుకోండి. నాకు ఫలానాది కావాలని రైతులు అడిగితే.. కచ్చితంగా సంబంధిత ఆర్బీకే ద్వారా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సరఫరా కావాలి. అందుకే వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలి. కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు వెనకడుగు వేయొద్దు ► ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఉంచాలని చెప్పాం. వారి విధులు, కార్యకలాపాలపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలి. అన్ని ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉండేలా చర్యలు తీసుకోండి. ► కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇచ్చాం. వారికి పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి. వారికి రైతు భరోసా సహా.. అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. బీమా ఇస్తున్నాం. పంట కొనుగోలుకు కూడా భరోసా ఇస్తున్నాం. ► ఇలాంటి సందర్భాల్లో వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు వెనకడుగు వేయాల్సిన పనిలేదు. అందుకే వారికి రుణాలు అందేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. కనీస మద్దతు ధరకు సంబంధించి మనం హామీ ఇస్తున్న పోస్టర్‌ను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. అధికారులు సందర్శనకు వెళ్లినప్పుడు ఇది కూడా తనిఖీ చేయాలి. తద్వారా ఏ పంటకు ఎంత రేటు ఇస్తున్నామన్నది రైతుకు భరోసా ఇచ్చినట్లవుతుంది. -
Andhra Pradesh: సిరి ధాన్యాలపై గురి
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు కోరిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను నిర్దేశిత సమయంలోగా అందజేయాలి. మోతాదుకు మించి అధికంగా ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. పంటల సాగులో రైతులకు అవగాహన పెంపొందించేలా రూపొందించిన వీడియోలను యాప్ ద్వారా అందుబాటులోకి తేవాలి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: పెరుగుతున్న వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి పోషక విలువలు కలిగిన చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. బోర్ల కింద, వర్షాధార భూముల్లో వరికి బదులు చిరుధాన్యాలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. వరికి బదులు చిరుధాన్యాలను సాగు చేయడం ద్వారా మంచి ఆదాయం వస్తుందని రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. చిరుధాన్యాల సాగుదారులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని భరోసా కల్పించడం వల్ల మరింత మంది రైతులు ముందుకు వస్తారన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షపాతం, పంటలసాగు, ఇ–క్రాపింగ్, వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు, ఎరువుల పంపిణీ, ఆర్బీకేల నిర్మాణ ప్రగతి తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. రైతుల సమస్యలు కచ్చితంగా పరిష్కరించాలి.. గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్ జిల్లా స్థాయి ప్రతినిధులతో రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అన్నదాతలతో ఏర్పాటైన వ్యవసాయ సలహా మండళ్ల అభిప్రాయాలు, సమస్యలను నేరుగా కలెక్టర్ల దృష్టికి తెచ్చి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రైయిన్లు సహా ఇతర పనులపై ఇప్పుడే వివరాలు తెప్పించుకుని తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. రైతుల సమస్యలను కచ్చితంగా తీర్చే బాధ్యతను స్వీకరించి అధికారులు మరింత దృష్టిపెట్టాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండళ్లలో లక్ష మంది అన్నదాతలు వ్యవసాయ సలహా మండళ్లు సత్ఫలితాలనిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. మార్కెట్లో డిమాండ్ లేని వంగడాల సాగును నిరుత్సాహపరిచేలా మండళ్లు కీలక పాత్ర పోషించాయన్నారు. సుమారు లక్ష మందికిపైగా రైతులు వ్యవసాయ సలహా మండళ్లలో ఉన్నట్లు తెలిపారు. ఆర్బీకేలకు ఐఎస్వో గుర్తింపు లభించేలా.. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులు కోరిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను నిర్దేశిత సమయంలోగా అందచేయాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఆర్బీకేల పనితీరు, సామర్థ్యాన్ని ఆ మేరకు మెరుగుపరచుకుని నాణ్యమైన వాటిని రైతులకు సమకూర్చేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఆర్బీకేల ద్వారా కూడా అన్నదాతల సమస్యలు నేరుగా ఉన్నతస్థాయికి తెలిసే వ్యవస్థను సిద్ధం చేయాలని సూచించారు. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఇందుకు వినియోగించుకోవాలన్నారు. ఆర్బీకేలపై నిరంతర పర్యవేక్షణ, సమీక్ష చేపట్టి పనితీరును మెరుగుపరిచి ఐఎస్వో సర్టిఫికేషన్ పొందేలా కృషి చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు నిర్దిష్ట నిర్వహణ ప్రణాళికలు (ఎస్వోపీ) రూపొందించుకోవాలన్నారు. అనుబంధంగా చిన్న గోడౌన్లు ఆర్బీకేలకు అనుబంధ భవనాలను విస్తరించుకుంటూ చిన్నపాటి గోడౌన్లను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. అక్కడే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నిల్వ చేయవచ్చన్నారు. భవనాలను విస్తరించి నిర్మించే వరకూ అద్దె ప్రాతిపదికన కొన్నిటిని తీసుకోవాలని ఆదేశించారు. ఆర్బీకేల్లో పొలం బడి షెడ్యూల్ వైఎస్సార్ పొలంబడి కార్యక్రమాల షెడ్యూల్‌ను రైతు భరోసా కేంద్రాల్లో పొందుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 15 రకాల పంటలపై పొలంబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అగ్రికల్చర్ కాలేజీలు, యూనివర్సిటీ విద్యార్థులు అప్రెంటిస్‌షిప్ కింద ఆర్బీకేల్లో విధిగా నిర్దిష్ట కాలం పనిచేసేలా చూడాలని సూచించారు. ప్రకృతి సేద్యంపై అవగాహన పెరగాలి నేచురల్ ఫార్మింగ్ (ప్రకృతి వ్యవసాయం)పై రైతులకు అవగాహనను పెంపొందించి ఈ విధానాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనికి సంబంధించిన సామగ్రి వెంటనే రైతులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌ను డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. పంటల సాగుపై వీడియోలతో యాప్.. ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌తోపాటు మంచి ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మోతాదుకు మించి అధికంగా ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఆర్బీకేలు యూనిట్‌గా మ్యాపింగ్ చేసి రైతులకు పొలంబడి ద్వారా ప్రత్యేక శిక్షణ, అవగాహన కల్పించాలన్నారు. పంటల సాగులో రైతులకు అవగాహన పెంపొందించేలా రూపొందించిన వీడియోలను యాప్ ద్వారా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఇ–క్రాపింగ్.. అన్నిటికీ అదే ఆధారం పంటల నమోదుకు సంబంధించి ఇ–క్రాపింగ్ చేసిన రైతులకు భౌతిక రశీదులు, డిజిటల్ రశీదులు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇ– క్రాపింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలని, దీనివల్ల పూర్తి పారదర్శకత వస్తుందన్నారు. రుణాలు, సున్నావడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ, పంటల కొనుగోలు, బీమా... తదితరాలన్నిటికీ ఇ–క్రాపింగ్ ఆధారమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అన్ని ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అన్ని ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు సేవలందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో భారీ పరికరాలు, సామగ్రిని అందుబాటులో ఉంచడమే కాకుండా ప్రతి ఆర్బీకే పరిధిలో రైతులకు అవసరమైన పనిముట్లను వ్యక్తిగతంగా అందించేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వచ్చే రబీ సీజన్లో అందుబాటులోకి తేవాలని సూచించారు. 2,038 ఉద్యాన పోస్టుల భర్తీ హార్టికల్చర్ విద్యార్హతలు ఉన్నవారు సరిపడా లేకపోవడంతో గ్రామ సచివాలయాల్లో 2,038 ఖాళీ పోస్టులను అగ్రికల్చర్ అభ్యర్థులతో భర్తీ చేయడానికి సీఎం జగన్ అంగీకారం తెలిపారు. వీరికి ఉద్యానవన పంటలపై తగిన శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సీఎం యాప్ వినియోగంపై శిక్షణ సీఎం యాప్ వినియోగంపై సచివాలయాల సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలని, ఆమేరకు వారికి శిక్షణ, అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు, కోత అనంతరం చర్యలు, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతపై ఆర్బీకే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలకు సూచించారు. ఇప్పటివరకూ 67.41 లక్షల ఎకరాలు సాగులోకి రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం, సాగు వివరాలను సమీక్ష సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. బుధవారం వరకూ సాధారణ వర్షపాతం 403.3 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 421.7 మిల్లీమీటర్లు కురిసిందని తెలిపారు. నెల్లూరు మినహా అన్ని జిల్లాల్లో సాధారణ లేదా అధిక వర్షపాతం నమోదైందని వివరించారు. ఇక ఖరీఫ్‌లో ఇప్పటివరకు 76.65 లక్షల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా 67.41 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినట్లు తెలిపారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున మిగిలిన చోట్ల కూడా వేగంగా విత్తనాలు వేస్తున్నట్లు చెప్పారు. – సమీక్షలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, ఏపీ స్టేట్ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుక్కపట్నం నవీన్ నిశ్చల్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, జెడ్బీఎన్ఎఫ్ స్పెషల్ సీఎస్ టి.విజయ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్.ప్రద్యుమ్న, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్ వీసీ, ఎండీ గెడ్డం శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్బీకేల్లో ఇ–పంట వివరాల ప్రదర్శన
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) వద్ద ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఇ–పంట నమోదు వివరాలను ఆదివారం నుంచి ప్రదర్శిస్తున్నారు. అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఆర్బీకేలోని గ్రామ వ్యవసాయ సహాయకులకు (వీఏఏ) తెలియజేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, పంట వివరాలు నమోదు కాకున్నా, రైతు పేరు లేకున్నా తక్షణమే ఇ–పంట వివరాలు నమోదు చేయించుకోవాలి. లేకుంటే ఆ పంటను కొనుగోలు చేయరు. ఈ ఏడాది నుంచి ఆర్బీకేల వద్దనే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. -
ఇ–పంట నమోదు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినూత్నంగా చేపట్టిన ఎలక్ట్రానిక్ పంట నమోదు (ఇ–పంట) కార్యక్రమం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. 13 జిల్లాలు, 670 మండలాల్లోని 10,641 వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలలో పంట నమోదును రెవెన్యూ, వ్యవసాయాదికారులు సంయుక్తంగా చేపట్టారు. వచ్చే నెల 31 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రస్తుత ఖరీఫ్‌లో సాగయ్యే అన్ని రకాల పంటలనూ నమోదు చేసి రైతుల మొబైల్ ఫోన్లకు సందేశం పంపుతారు. రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చి నేరుగా పొలానికి వెళ్లి పంట వివరాలను ఇ–పంట యాప్‌లో నమోదు చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో సాగయ్యే సుమారు 40 లక్షల హెక్టార్ల పంటలను ఇందులో నమోదు చేస్తారు. రాష్ట్రంలో ఇలా నమోదు చేయడం ఇదే ప్రథమం. భూమికి సంబంధించిన సమస్త సమాచారాన్ని అధికారులు నమోదు చేస్తున్నారు. అనుమానాలుంటే 155251కు కాల్ చేయండి ఇదిలా ఉంటే.. రైతులు తమ సందేహాలు, ఇతరత్రా అనుమానాల నివృత్తికి తమ సమీపంలోని రైతు భరోసా కేంద్రాలను లేదా 155251 టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయవచ్చునని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇ–పంట నమోదు ప్రారంభమైందని, ఇది శుభారంభమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అభిప్రాయపడ్డారు. -
ఈ- క్రాప్ బుకింగ్ దాదాపు పూర్తి
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ చేపట్టిన ఈ– క్రాప్ బుకింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. పలు మండలాలు వంద శాతం సర్వే పూర్తి చేయడం విశేషం. గ్రామం, సర్వే నెంబరు, రైతు వారీగా పంటల వివరాలను ట్యాబ్‌ల ద్వారా ఫొటో తీసి ఆన్లైన్లో అఫ్లోడ్ చేయాల్సి ఉంది. ఈ– క్రాప్ బుకింగ్ వల్ల కరువు ఏర్పడినపుడు రైతులు ఏ పంట సాగు చేసి ఉంటే ఆదే పంటకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 5.72 లక్షల హెక్టార్లలో పంటలు సాగవ్వగా ఇప్పటి వరకు 95.8 శాతం క్రాప్ బుకింగ్ పూర్తి చేశారు. కొన్ని మండలాల్లో వందశాతం పూర్తి చేయగా మిగతా వాటిలో మండలాల్లో 97 శాతం పూర్తి చేశారు. కొసిగి, కౌతాళం, చాగలమర్రి, కొలిమిగుండ్ల, దొర్నిపాడు, హలహర్వి, మద్దికెర, కల్లూరు తదితర మండలాలు కాస్త వెనుకబడి ఉన్నాయి. ట్యాబ్‌లు, ఏఈఓ, ఎంపీఈఓల కొరత కారణంగా సర్వేలో జాప్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం 36 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ మండలాల్లో ఈ–క్రాప్ బుకింగ్‌ను బట్టి పంట నష్టం అంచనా వేస్తారు. వారం రోజుల్లో ఖరీప్‌లో సాగు చేసిన అన్ని పంటల బుకింగ్‌ను వందశాతం పూర్తి చేయనున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. -
‘ఈ క్రాప్’తో తేలనున్న పంటలెక్కలు
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్‌లో సాగైన పంటల వివరాలు ఈ–క్రాప్ బుకింగ్‌తో తేలిపోనున్నాయి. అధికారులు పొలాలకు వెళ్లి పంటల వివరాలను ట్యాబ్‌లలో నిక్షిప్తం చేస్తుండటంతో వాస్తవ సాగు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 80 శాతానికి పైగా ఈ–క్రాప్ బుకింగ్ పూర్తయిన నేపథ్యంలో పంటల వారీగా విస్తీర్ణం కొంత అటుఇటుగా మారినట్లు కనిపిస్తోంది. ప్రధానంగా జిల్లాకు సంబంధించి వేరుశనగ పంట ఎంత విస్తీర్ణంలో వేశారనే విషయం పక్కాగా తెలియనుంది. జిల్లా మొత్తమ్మీద చూస్తే రికార్డుల ప్రకారం వేరుశనగ జూన్, జులై, ఆగస్టు నెలల్లో 6.10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగైంది. అయితే ఈ క్రాప్ బుకింగ్‌లో 5.75 హెక్టార్ల నుంచి 5.80 లక్షల హెక్టార్లకే పరిమితం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే 30 నుంచి 35 వేల హెక్టార్ల విస్తీర్ణం తగ్గే సూచనలున్నాయి. నాలుగైదు రోజుల్లో ఈ క్రాప్ బుకింగ్ పూర్తవుతుందని, పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. విస్తీర్ణం తారుమారు కొన్ని మండలాల్లో కాగితాల్లో కన్నా ఈ–క్రాప్ బుకింగ్‌లో ఎక్కువ విస్తీర్ణం రాగా, మరికొన్ని మండలాల్లో బాగా తగ్గుదల కనిపించింది. అనంతపురం, కళ్యాణదుర్గం, రాప్తాడు, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, గుంతకల్లు, విడపనకల్, ధర్మవరం, రామగిరి, కంబదూరు, కుందుర్పి, గుమ్మగట్ట, కనేకల్లు, కొత్తచెరువు, నార్పల తదితర మండలాల్లో రికార్డుల్లో ఉన్న దానికన్నా సాగు విస్తీర్ణం బాగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గుత్తి, శింగనమల, ఉరవకొండ, చెన్నేకొత్తపల్లి, శెట్టూరు, రాయదుర్గం, డి.హిరేహాల్, సోమందేపల్లి, పుట్టపర్తి, అగళి, అమరాపురం, ముదిగుబ్బ, నల్లమాడ, అమడగూరు తదితర మండలాల్లో రికార్డుల్లో ఉన్న విస్తీర్ణం కన్నా మరింత పెరిగే పరిస్థితి ఉంది. మిగతా మండలాల్లో పెద్ద వ్యత్యాసాలు కనిపించే పరిస్థితి లేదు. మిగతా పంటల విషయానికి వస్తే కంది, పత్తి, జొన్న, కొర్ర, పెసర, ఉలవ, పొద్దుతిరుగుడు పంటల విస్తీర్ణంలో ఎక్కువ వ్యత్యాసం కనిపించనుండగా, ఆముదం, వరి, మొక్కజొన్న, ఇతర పంటల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చని అంటున్నారు. మొత్తమ్మీద ఖరీఫ్‌లో అన్ని పంటలు 7.60 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగైనట్లు నివేదిక చెబుతుండగా ఈ–క్రాప్ పూర్తయితే 7 లక్షల నుంచి 7.10 లక్షల హెక్టార్లకు పరిమితం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల పంట తొలగించడం, అక్కడక్కడా కొన్ని సాంకేతిక సమస్యలు ఉండటం, ఈ–క్రాప్ ఆలస్యం కావడం వల్ల ఈ ఏడాది వందశాతం కచ్చితమైన సమాచారం రాకపోవచ్చని, వచ్చే ఏడాది మాత్రం వంద శాతం కచ్చితమైన లెక్కలు తీస్తామని చెబుతున్నారు.