సాక్షి, అమరావతి: భూ యజమాని హక్కులకు భంగం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులకు మరింత మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. గడిచిన ఖరీఫ్ సీజన్‌లో ఈ–క్రాప్ నమోదు పగడ్బందీగా చేపట్టారు. రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ (ఆర్‌బీయూడీపీ) ద్వారా తొలిసారిగా సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాలను నమోదు చేశారు. కానీ, చాలాచోట్ల వాస్తవ సాగుదారుల స్థానంలో భూ యజమానుల పేర్లు నమోదైనట్లుగా గుర్తించారు. దీంతో ప్రస్తుత రబీ సీజన్‌లో సాగుచేసే ప్రతీ అసలైన రైతు వివరాలు ఈ–క్రాప్‌లో నమోదుకు చర్యలు చేపట్టారు.
నిజానికి.. ఈ–క్రాప్ విధానం అమలులోకి వచ్చాక ఖరీఫ్–2020 సీజన్‌లో 124.92 లక్షల ఎకరాల్లో 49.72 లక్షల మంది రైతులు సాగుచేస్తున్నట్లుగా నమోదు కాగా.. రబీ 2020–21లో 34.65 లక్షల మంది రైతులు 86.77లక్షల ఎకరాలు సాగుచేస్తున్నట్లుగా నమోదయ్యాయి. అలాగే, ఖరీఫ్–2021లో 45.02 లక్షల మంది రైతులు సాగుచేస్తున్న 102.23 లక్షల ఎకరాలు నమోదు చేశారు. వీరిలో కౌలురైతులు 2.92 లక్షల మంది ఉన్నారు. కానీ, వాస్తవంగా రాష్ట్రంలో 16.56 లక్షల మంది కౌలుదారులున్నారు. వారిలో 60–70 శాతానికి పైగా సెంటు భూమి కూడా లేనివారే. సాగువేళ వీరిలో ప్రభుత్వ ప్రయోజనాలందుకుంటున్న వారు 10–20 శాతం లోపే ఉంటున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ప్రతీ వాస్తవసాగుదారుడు లబ్ధిపొందేలా ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్‌లో ఈ–క్రాప్ నమోదులో మార్పులు తీసుకొచ్చింది. వీటిపై వాస్తవ సాగుదారులు–భూ యజమానులకు అర్ధమయ్యే రీతిలో ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది.
సాగుదారుల గుర్తింపు ఇలా..
► విత్తిన వారంలోపు ఆర్బీకేల్లో ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్ నెంబర్లతో సహా క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డు (సీసీఆర్సీ) నకళ్లను అందజేయాలి.
► ఒకవేళ సీసీఆర్సీ లేకున్నా, భూ యజమాని అంగీకరించకపోయినా సరే తాము ఏ సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటల సాగుచేస్తున్నామో ఆ వివరాలను ఆర్బీకేలో తెలియజేసి ఈకేవైసీ (వేలిముద్రలు) చేయించుకుంటే రెండు వారాల్లోపు ఆర్బీకే సిబ్బంది పొలానికి వెళ్లి చుట్టుపక్కల రైతులను విచారించి వాస్తవ సాగుదారుడెవరో గుర్తిస్తారు.
► ఇలా నమోదైన వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో వారం రోజులపాటు ప్రదర్శిస్తారు. తప్పులుంటే సవరిస్తారు.
► అభ్యంతరాలొస్తే మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవ సాగుదారులను గుర్తిస్తారు.
సీసీఆర్సీ అంటే..
సీసీఆర్‌సీ పత్రం అంటే భూ యజమానికి, సాగుదారునికి మధ్య అవగాహనా ఒప్పంద పత్రం. వలంటీర్/వీఆర్‌ఓ వద్ద ఉండే దరఖాస్తులో వివరాలు నింపి భూ యజమాని లేదా వారి ప్రతినిధి, సాగుదారు–గ్రామ వీఆర్వోలు సంతకం చేస్తే సరిపోతుంది. పంట కాలంలో ఎప్పుడైనా ఈ పత్రాన్ని పొందవచ్చు. దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే ఈ పత్రం జారీచేస్తారు. దీని కాలపరిమితి జారీచేసిన తేదీ నుంచి కేవలం 11 నెలలు మాత్రమే. ఈ కార్డుపొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల రైతులు వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం పొందేందుకు అర్హులు.
ఈ–క్రాప్‌తో ప్రయోజనాలు..
► దీని ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణం పొందవచ్చు.
► రూ.లక్షలోపు పంట రుణం ఏడాదిలోపు చెల్లిస్తే సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 4 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు.
► ఉచిత పంటల బీమా సౌకర్యం వర్తిస్తుంది.
► వైపరీత్యాల్లో పంట నష్టానికి పెట్టుబడి రాయితీ పొందొచ్చు.
► అలాగే, పంటలను ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరలకు అమ్ముకోవచ్చు.
భూ యజమానులకు పూర్తి రక్షణ
ఈ–క్రాప్‌లో వాస్తవ సాగుదారుల వివరాలు నమోదు ద్వారా భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. ఈ వివరాలేవీ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయరు. కోర్టులో సాక్షులుగా కూడా చెల్లవు. ఈ–క్రాప్ ఆధారంగా పొందిన పంట రుణం కట్టకపోయినా, ఎగ్గొట్టినా భూ యజమాని/భూమిపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. కేవలం బకాయి వసూలు సందర్భంగా ఫలసాయంపై మాత్రమే బ్యాంకులకు హక్కు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment