revenue records
-
ఇది... భూ హక్కుకు భరోసా!
ప్రజల భూమి హక్కును కాపాడటం ప్రభుత్వాల రాజ్యాంగ బాధ్యత. ప్రస్తుతం చాలా ఉన్న సివిల్ కేసులకు, క్రిమినల్ కేసులకు కారణం భూమిపై యజమానికి వున్న హక్కును లేక టైటిల్ ను గుర్తించే చట్టబద్ధమైన వ్యవస్థ లేకపోవటం. వారసత్వం, కొనుగోలు, బదిలీ, కేటాయింపు ద్వారా భూమిపై యాజమాన్య హక్కు మార్పిడి జరుగుతుంది. రిజిస్ట్రేషన్ వ్యవస్థ భూమికి సంబంధించిన ఈ బదలాయింపు లావాదేవీలను రిజిస్టర్ చేస్తుంది. అంతేకాని లావాదేవీల ద్వారా పొందిన హక్కును రిజిస్టర్ చేయదు. అందువలన రిజిస్ట్రేషన్ విధానం భూమిపై సంపూర్ణ హక్కుకు రుజువు కాదు. అందుకే ఒకరు భూమిని కొని రిజిస్టర్ చేయించుకుంటే అదే భూమిని మరొకరు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ‘డబుల్ రిజిస్ట్రేషన్’ అనే సమస్య ఎక్కువగా వింటున్నాం. ‘లాండ్ టైటిలింగ్ చట్టం –2022’ ఈ సమస్యకు పరిష్కారం. పట్టాదారు పాస్ బుక్, టైటిల్ డీడ్, 1బీ ఆడంగల్, మరే ఇతర రెవెన్యూ రికార్డులు కూడా భూమిపై యజమానికి ఉన్న యాజమాన్య హక్కును నిరూపించే పత్రాలు కావు (పి. కిశోర్ కుమార్ వర్సెస్ విట్టల్ కె పట్కర్, 2023). రెవెన్యూ రికార్డుల్లో వివరాలు పొందుపరచే ‘మ్యుటేషన్’ కేవలం భూమిశిస్తు కట్టటానికి ఉపయోగపడే పత్రం. ఈ మ్యుటేషన్ వలన భూమిపై హక్కులు కల్పించబడవు, ధ్రువీకరించ బడవు (సవర్ణి వర్సెస్ ఇందర్ కౌర్, 1996). ఆంధ్ర ప్రదేశ్ (భూమి హక్కులు మరియు పట్టాదార్ పాస్ పుస్తకాలు) చట్టం, 1971 చట్ట బద్ధంగా భూములకు సంబంధించిన హక్కుల రికార్డులను తయారు చేయడానికీ, ఆ రికార్డులను నిర్వహించడానికీ ఉద్దేశించిందే కాని యజమానికి భూమిపైన ఉన్న హక్కులను ధ్రువీకరించదు (సీతారామ్ పాటిల్ వర్సెస్ రాంచంద్ర నాగో పాటిల్, (1977). పట్టాదారు పాస్ బుక్ కూడా యాజమాన్య హక్కును నిర్ధారించదు (గౌసియా బేగమ్ వర్సెస్ బసిరెడ్డి రుక్మిణమ్మ, 2013). ఈ దేశంలో ఏ రెవెన్యూ రికార్డు కూడా భూమిపైన యజమానికి వున్న హక్కును లేదా టైటిల్‌ను సంపూర్ణంగా నిర్ణయించదు, నిర్ధారించదు. భూమిపైన యజమానులకు ఉన్న హక్కులను లేక టైటిల్ కాపాడే విధంగా, భూ యజమానికి ఉన్న హక్కును ధ్రువీకరించి, హక్కు భద్రతకు హామీని ఇచ్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘లాండ్ టైటిలింగ్ చట్టం’ చేసింది. ఇది విప్లవాత్మకమైనది. భారత దేశంలో భూ యజమాని హక్కు(టైటిల్)ను చట్టబద్ధంగా గుర్తించిన మొట్ట మొదటి చట్టం ఇది. ఈ చట్టం లాండ్ టైటిలింగ్ అథారిటీనీ, స్థిరాస్తిపై హక్కునూ రిజిస్టర్ చేసే వ్యవస్థనూ ఏర్పాటు చేసి, టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని నియమిస్తుంది. ఈ చట్టం ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతంలో ఉన్న భూమి వివరాలకు సంబంధించిన రికార్డును సిద్ధం చేసి, స్థిరాస్తి గుర్తింపు సంఖ్య కేటాయించి, దాని సరిహద్దులతో రికార్డ్‌లో నమోదు చేసుకోవాలి. ఈ రికార్డులు మూడు రకాలు. 1. రికార్డు ఆఫ్ టైటిల్ 2. రికార్డు ఆఫ్ చార్జ్ 3. వివాదాలలో వున్న భూమి రికార్డు. ప్రారంభంలో తాత్కాలిక టైటిల్ రికార్డును సిద్ధంచేసి, నోటిఫై చేసి, భూ హక్కు దారులకు ఆ రికార్డు పైన వున్న అభ్యంతరాలను స్వీకరించి, ఆ అభ్యంత రాలను నివృత్తి చేస్తారు. ఏ అభ్యంతరం లేని భూముల టైటిల్‌ను రికార్డు ఆఫ్ టైటిల్లో నమోదు చేస్తారు. ఈ రికార్డులో నమోదు చేసిన రెండు సంవత్సరాల తరువాత ఆ భూమిపై ఉన్న హక్కు యజమాని సంపూర్ణ హక్కుగా గుర్తించబడుతుంది. భూమికి సంబంధించి సివిల్ కోర్ట్‌లో లేక రెవెన్యూ కోర్ట్‌లో అయినా కేసు వుంటే, దాని తీర్పు ప్రకారం రెండు సంవత్సరాల తరువాత కూడా హక్కును నమోదు చేస్తారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న అన్ని రెవెన్యూ రికార్డుల స్థానంలో ఒకే ఒక్క రికార్డు ‘రికార్డు ఆఫ్ టైటిల్’ అమలులోకి వస్తుంది. ఈ రికార్డు భూ యజమానికి వున్న హక్కును సంపూర్ణ హక్కుగా ఈ చట్టం గుర్తిస్తుంది. భారత దేశంలో భూ యజమాని హక్కును (టైటిల్) చట్టబద్ధంగా గుర్తించిన మొట్టమొదటి చట్టం ఇది. చట్టంలోని సెక్షన్ 38... భూమి టైటిల్ హక్కుకు సంబంధించిన వివాదాలను సివిల్ కోర్ట్ పరిధి నుండి మినహాయించి, రెవెన్యూ కోర్ట్‌కు బదలాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ఈ సెక్షన్ రాజ్యాంగ బద్ధతను గూర్చిన వివాదం ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయ స్థాన పరిధిలో వుంది. సివిల్ కోర్ట్ అధికారాలను కొనసాగిస్తూ మధ్యంతర వుత్తర్వులు వెలువరించింది హైకోర్ట్. మరో వివాదాస్పద అంశం సెక్షన్ 14 ప్రకారం టైటిల్ రిజిస్టర్లో నమోదు కాబడిన లేక నమోదుకాని భూములకు సంంబంధించి అభ్యంతరాలు వున్నట్లయితే, సంబంధిత వ్యక్తులు టైటిల్ రిజిస్ట్రేషన్ అప్పీలేట్ అధికారికి అర్జీ పెట్టుకోవాలి. రెవెన్యూ అధికారి అప్పీలేట్ అధికారిగా వుంటాడు కాబట్టి ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది అనేది ఒక వాదన. సివిల్ కోర్ట్‌లో భూవివాద పరిష్కారం ఆలస్యం అవుతుంది అని ఈ విధానాన్ని ఈ చట్టంలో అమలు చేశారు. రెవెన్యూ న్యాయస్థానాలు ఈ చట్టంలో కొత్తగా ఏర్పాటు చేసినవి కావు. అనేక ఏళ్లుగా అమలులో వున్న ఈ రెవెన్యూ కోర్టులను ఎప్పుడు ప్రజలు, న్యాయవాదులు వ్యతిరేకించలేదు. అమలుచేసే అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారనే అభియోగంతో చట్టాన్ని కొట్టి వేయటం న్యాయ శాస్త్ర ప్రాథమిక సూత్రానికి వ్యతిరేకం. భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ కొనుగోలు లావాదేవీలను రిజిస్టర్ చేయించినట్లే, సంబంధిత అధికారి దగ్గర హక్కును లేక టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ విధానం భూ యజమానికి వున్న భూమిపై వున్న హక్కుకు రక్షణ, భద్రత. కొనిన స్థలం చుట్టూ కంచ వేయించు, గోడ కట్టు అని మన శ్రేయోభిలాషులు చేసే హెచ్చ రికలు ఇక అవసరం లేదు. స్థిరాస్తిని టైటిల్ రికార్డులో నమోదు చేసిన తరువాత, హక్కును కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ దేశంలో భూమి కొని దానిని టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసుకొని విదేశాలకు వెళ్ళి ఎన్ని సంవత్సరాల తరువాత తిరిగి భారతదేశానికి వచ్చినా,వారి భూమి అన్యాక్రాంతం కాదు. ముఖ్యంగా ఈ చట్టం ’సెకండ్ రిజిస్ట్రేషన్’ సమస్యకు పరిష్కారం. దీనికి కారణం భూమి కొనిన యజమాని హక్కుకు ఈ చట్టం ప్రభుత్వాన్నే కాపలాదారునిగా చేస్తుంది. ప్రభుత్వం భూమిని పరిరక్షించటంలో విఫలమైనా, టైటిల్‌కి సంబంధించి సమస్య వచ్చినా భూమి యజమానికి ప్రభుత్వం బీమా చెల్లిస్తుంది. రెవెన్యూ రికార్డు లేకుండా చాలా కాలంగా భూమిని పండించుకుంటున్న బలహీన వర్గాలకు పంపిణీ చేసిన భూమిని కూడా వెంటనే రికార్డు ఆఫ్ టైటిల్లో నమోదు చేయాలి. వారి హక్కుకు భద్రత మరియు బీమా కల్పించాలి. ఈ చట్టం అమలు వలన బలహీన వర్గాల ప్రజలకు వారి అనుభవంలో వున్న భూమికి, వారికి బదలాయించే భూమి హక్కుకు భద్రత కల్పించ వలసిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుంది. ఆ విధంగా పేద, బలహీన వర్గాల వారికి కూడా ఈ చట్టం వలన మేలు జరుగుతుంది.డా‘‘ నేలటూరి జేసు రత్న కుమార్ వ్యాసకర్త పూర్వ సహాయ సంచలకులు,ఏపీ జ్యుడీషియల్ అకాడెమీ ‘ 98857 20777 -
‘పట్టా’లు తప్పారు!
హుస్నాబాద్ రూరల్: తాతలు, తండ్రులు కట్టిన ఇళ్లు 12...చనిపోయిన వారి సమాధులు 18... ఒక వ్యవసాయ బావి, మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేసే పైప్‌లైన్. ఇవన్నీ కాకుండా 1984 నుంచి ఆ భూముల్లో కబ్జాలోనే ఉంటూ సాగు కూడా చేసుకుంటున్నారు. అయితే రెవెన్యూ అధికారులకు ఇవేమీ కనిపించలేదు. మోక (పొజిషన్) విచారణ జరపలేదు. కబ్జాలో ఎవరు ఉన్నారో తెలుసుకోలేదు. ధరణిలో కబ్జా కాలమ్ తొలగించడంతో పాత పట్దాదారుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. దీనిని పసిగట్టిన కొందరు స్థానిక రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని, సాదాబైనామాలు సృష్టించి 2021లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామంలో సర్వే నంబర్ 250లో 2.00 ఎకరాలు, 263లో 1.30 ఎకరాల వ్యవసాయ భూమిని కొంతమంది పట్టా చేయించుకున్నారు. మోక మీద రాజయ్య కుటుంబ సభ్యులే ఉన్న విషయమూ రెవెన్యూ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో బోగస్ సాదాబైనామాలు సృష్టించి నలుగురు పేరున పట్టా చేయించుకున్నారని బాధితులు ఆరోపిస్తూ ఆర్డీఓ, తహసీల్దార్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. మోక చూడకుండానే పట్టా మార్పిడి.. భూ రికార్డుల మార్పు సమయంలో రెవెన్యూ అధికారులు మోక(పొజిషన్) విచారణ జరిపాక పట్టా చేయాలి. కానీ అవేమీ పట్టించుకోలేదు. ఒకరు మోక మీద ఉంటే మరొకరి పేరున పట్టా చేశారు. దీనివల్ల 250లో సర్వే నంబర్లో రక్బా తక్కువ వస్తుంది. మోక మీద ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న దళిత కుటుంబాలకు పట్టాలు లేవు, కొత్తగా పట్టాదార్ పాసు పుస్తకాలు పొందినవారికి మోక మీద భూమి లేదు. మా తాత ఇల్లు కట్టిన భూమి మాది కాదంటున్నారు యాబై ఏళ్ల క్రితమే మా తాత ఇల్లు కట్టాడు. అయితే ఇప్పుడు ఆ భూమి మాది కాదని ఎవరో అమ్మారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. సర్వేనంబర్ 250లో రెండు ఎకరాలు, 263 సర్వేనంబరులో 1.30 ఎకరాల్లో మా తాత కాలేష్ రాజయ్యనే పహాణీలో, కబ్జాలో ఉన్నారు. ఇప్పుడు మా వారికి పట్టా మారిన సంగతి తెలియదు. మేమంతా మా అయ్యలు చూపించిన భూములనే దున్నుకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఈ భూములు మావి కావంటే ఎలా? మోక విచారణ జరిపించి అక్రమంగా పట్టా చేయించుకున్న వారి పాస్‌పుస్తకాలు రద్దు చేసి మాకు న్యాయం చేయాలి. – కాలేష్ రాజేశ్, పోతారం(ఎస్) మా తాతల సమాధులను పట్టా చేశారు 1980లోనే 250 సర్వే నంబరులో మా తాతల సమాధులు కట్టాం. ఒకటి కాదు రెండు కాదు 18 సమాధులు ఉన్నాయి. వ్యవసాయ బావి, మా ఇళ్లకు కరెంట్ మీటర్లు ఉన్నాయి. మిషన్ భగీరథ నుంచి తాగునీరు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరో వచ్చి ఈ భూములు కావాలంటే ఎలా? 50 ఏళ్ల నుంచి ఈ భూమిని నమ్ముకొని బతికినోళ్లం...ఇప్పుడు భూమి లేదంటే ఎక్కడకు పోవాలి. మా పాత రికార్డులను పరిశీలించి మోక విచారణ జరిపి మా భూములకు పట్టాలు ఇవ్వాలి. – కాలేష్ శివకుమార్, పోతారం(ఎస్) విచారణ జరిపిస్తాం పోతారం(ఎస్) దళిత కాలనీ పేదల భూముల విషయమై మోక విచారణ జరిపిస్తాం. అదే సర్వే నంబర్లో పేదల ఇళ్లు ఉంటే పట్టాదారుల పాసు పుస్తకాలు రద్దు చేసి పేదలకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు నివేదిస్తాం. – రవీందర్‌రెడ్డి, తహసీల్దార్,హుస్నాబాద్ -
4 వేల గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి
సాక్షి, అమరావతి: భూముల రీసర్వేలో రాష్ట్ర ప్రభుత్వం మరో మైలు రాయిని అధిగమించింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తయింది. ఈ గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు నెంబర్ 13 నోటిఫికేషన్లు కూడా జారీచేయడంతో అక్కడ కొత్త రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు దేశంలోని ఏ గ్రామంలోనూ పూర్తిస్థాయి రీ సర్వే జరగలేదు. ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లోని గ్రామాలు, పట్టణాల్లో బ్రిటీష్ వాళ్లు రూపొందించిన రెవెన్యూ రికార్డులే ఉన్నాయి. తొలిసారిగా మన రాష్ట్రంలోనే నాలుగు వేల గ్రామాల్లో రీసర్వే పూర్తవడంతో అక్కడ డిజిటల్ రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త రికార్డుల ఆధారంగానే ఇకపై భూముల వ్యవహారాలు జరగనున్నాయి. రీసర్వేలో భాగంగా ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్‌లు (గ్రామాల ఫొటోలు) తయారుచేయడానికి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగిస్తున్న తొలి రాష్ట్రం కూడా మనదే. 2020 డిసెంబర్లో ప్రాజెక్టు ప్రారంభం పూర్వపు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకాన్ని 2020 డిసెంబర్ 21న ప్రారంభించారు. ఆ తర్వాత కరోనా రావడంతో కొంత ఆలస్యమైనా ఆ తర్వాత శరవేగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, కంటిన్యూయస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్లు, రోవర్ల వంటి అత్యాధునిక సర్వే టెక్నాలజీలను ఉపయోగించి దాదాపు వందేళ్ల తర్వాత సమగ్ర రీ సర్వేను చేపట్టారు. సర్వే తర్వాత రైతులకు భూ హక్కు పత్రాలివ్వడం.. ఆ భూములకు భద్రత నిర్ధారించడం, భూ రక్ష సర్వే రాళ్లు నాటడం ద్వారా సరిహద్దు భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. భూరక్ష సర్వే రాళ్ల ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రీ సర్వే వల్ల ప్రయోజనాలు.. ► సర్వే తర్వాత భూముల రికార్డులను 10 సెంటీమీటర్ల కచ్చితత్వంతో కొలిచి తయారుచేస్తారు. ► భూ యజమానులకు భూ కమత పటం, గ్రామ పటం, భూ హక్కు పత్రం వంటి రికార్డులను జీపీఎస్ కో–ఆర్డినేట్లు, ఐడీ నెంబర్, క్యూఆర్ కోడ్‌తో ఇస్తారు. ► గ్రామంలోని స్థలాలు, అర్బన్ ప్రాంతాల్లోని భూములను కూడా మొదటిసారి సర్వేచేసి యజమానులకు యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు కూడా జారీచేస్తున్నారు. ► భూమి రికార్డులు ట్యాంపరింగ్‌కి అవకాశం ఉండదు. భూ యజమానికి తెలియకుండా భూమి రికార్డులో ఏ మార్పులు జరిగే అవకాశం ఉండదు. డబుల్ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉండదు. ► గ్రామ సచివాలయాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు భూమి రికార్డులు అప్డేట్ అవుతాయి. ► రిజిస్ట్రేషన్‌కు ముందే మ్యుటేషన్, పట్టా సబ్ డివిజన్ జరుగుతుంది. ► రీ సర్వేకు హాజరుకాలేని వారికి వాట్సాప్ వీడియో కాల్, జూమ్ ఇతర వీడియో ఇంటరాక్టివ్ టెక్నాలజీల ద్వారా రీసర్వే బృందాలు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నాయి. భూ సంబంధిత సేవలన్నీ ఏకీకృతమయ్యాయి రీ సర్వే విజయవంతంగా జరుగుతోంది. భూమికి సంబంధించిన అన్ని సేవలు ఏకీకృతమై ఒకే డెస్క్ వ్యవస్థలోకి వస్తున్నాయి. గ్రామ సచివాలయంలో సమీకృత సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలను దేశంలోనే మొదటిసారి అందిస్తున్నాం. మన రీ సర్వే ప్రాజెక్టు అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మన అధికారులతో ఇతర రాష్ట్రాల్లో రీసర్వే శిక్షణలు ఏర్పాటుచేస్తోంది. – సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే, సెటిల్మెంట్ శాఖ -
22(ఎ) జాబితా నుంచి.. ఆ భూముల్ని తొలగించవచ్చు
సాక్షి, అమరావతి: పేదలకు 1954వ సంవత్సరానికి ముందు ఇచ్చిన (అసైన్డ్) భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించవచ్చని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు స్పష్టతనిస్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ), ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తాజాగా సర్క్యులర్ జారీచేశారు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ తమ జిల్లాలో ఉన్న పరిస్థితిని వివరిస్తూ దీనిపై స్పష్టత ఇవ్వాలని సీసీఎల్‌ఏని కోరారు. కర్నూలు జిల్లాలో 5,382.78 ఎకరాల ప్రభుత్వ భూమిని 1954 జూన్ 18 నాటికి 2,755 మంది నిరుపేదలకు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చారని, ఈ భూములను నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఎ) 1 నుంచి తొలగించడంపై పలు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఆ భూముల్ని 22 (ఎ) జాబితా నుంచి తొలగించవచ్చా? లేదా? అనే దానిపై తగు సూచనలు ఇవ్వాలని కోరారు. దీనిపై సీసీఎల్ఏ స్పష్టతనిస్తూ 22 (ఎ) కేసులను త్వరితగతిన పరిష్కరించడం కోసం 2022 సెప్టెంబర్ ఒకటో తేదీన జిల్లా కలెక్టర్లకు అన్ని అంశాలపైనా తగిన వివరణలు, సూచనలతో ఒక సర్క్యులర్ ఇచ్చినట్లు తెలిపారు. మరోసారి దీనిపై స్పష్టతనిస్తూ.. 1954 జూన్ 18కి ముందు పేదలకు (డిప్రెస్డ్ క్లాసెస్) షరతులతోగానీ, షరతులు లేకుండా గానీ ఇచ్చిన భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించవచ్చని స్పష్టంచేశారు. ఆ భూములకు సంబంధించిన పట్టాలు అందుబాటులో ఉన్నా, లేకపోయినా రెవెన్యూ రికార్డుల ఆధారంగా సుమోటోగా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. అసైన్డ్ భూముల వ్యవహారంపై తరచూ ప్రశ్నలు వస్తుండడంతో ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఈ సర్క్యులర్ ఇచ్చింది. స్వాతంత్య్రానికి ముందు పేదలకిచ్చిన భూములను 22(ఎ) జాబితా నుంచి తీసివేయాలని గతంలోనే ప్రభుత్వం స్పష్టంచేసినా జిల్లా కలెక్టర్లు, జేసీలు రకరకాల కారణాలు, వివాదాల భయంతో వాటి జోలికి వెళ్లడంలేదు. నిబంధనల ప్రకారం చేయాల్సిన వాటిని కూడా చేయకుండా నాన్చుతున్నారు. అందులో భాగంగానే తమ వద్దకు వచ్చే ఇలాంటి పిటిషన్లపై తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా సీసీఎల్ఏకి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో.. రెవెన్యూ వ్యవస్థకి సంబంధించి అనేక అంశాలపై జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఉన్నాయని సీసీఎల్ఏ తరచూ స్పష్టంచేస్తూనే ఉన్నారు. ఇలాంటి అంశాలపై తామిచ్చిన మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. అందులో భాగంగానే 1954 ముందు పేదలకిచ్చిన భూములను 22 (ఎ) నుంచి నిరభ్యంతరంగా తొలగించవచ్చని తాజా సర్క్యులర్ ఇచ్చారు. -
క్యూఆర్ కోడ్‌లో భూమి
సాక్షి, అమరావతి: బ్రిటీష్ కాలం నాటి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి వివాదాలకు శాశ్వతంగా తెరదించే లక్ష్యంతో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా భూముల రీ సర్వే కార్యక్రమాన్ని శరవేగంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ముద్రించనుంది. దీన్ని స్కాన్ చేయడం ద్వారా భూ కమతం, విస్తీర్ణం, ఎలాంటి భూమి, మ్యాప్ తదితర వివరాలన్నీ తెలుసుకోవచ్చు. రీ సర్వేలో ఆక్షాంశాలు, రేఖాంశాలతో (జియో కో–ఆర్డినేట్స్) భూమి హద్దులను నిర్ధారిస్తున్నారు. భూమికి నలువైపులా వీటిని సూచించడం ద్వారా విస్తీర్ణాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు. వీటి ఆధారంగా రైతుల పట్టాదార్ పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు. ప్రస్తుతం ఒక సర్వే నంబర్‌కి ఒక ఎఫ్ఎంబీ ఉండగా, నలుగురైదుగురు భూ యజమానులుంటే ఉమ్మడిగా ఒక మ్యాప్ కేటాయిస్తున్నారు. రీ సర్వే తర్వాత ప్రతి భూమిని (సెంటు భూమి విడిగా ఉన్నా సరే) సర్వే చేసి ప్రత్యేకంగా రాళ్లు పాతుతారు. దానికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ఇస్తారు. ఆ సర్వే నంబర్లో ఎంత మంది ఉంటే అందరి మ్యాప్‌లు విడివిడిగా పొందుపరుస్తారు. ప్రతి భూ యజమానికి తమ భూములపై ఎవరూ సవాల్ చేయడానికి వీలు లేని శాశ్వత హక్కులు లభిస్తాయి. 70 బేస్ స్టేషన్లతో కార్స్ నెట్వర్క్ జీపీఎస్ కార్స్ నెట్వర్క్ (కంటిన్యుస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ నెట్వర్క్) ద్వారా భూములను కొలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 బేస్ స్టేషన్లు శాటిలైట్ రేడియో సిగ్నళ్లను స్వీకరించి కచ్చితమైన అక్షాంశ, రేఖాంశాలను సెంట్రల్ కంట్రోల్ స్టేషన్‌కు పంపుతాయి. కార్స్, డ్రోన్, రోవర్ సహాయంతో భూములను కచ్చితంగా కొలుస్తారు. తద్వారా ప్రతి స్థిరాస్తి కొల తలు, హద్దులు, విస్తీర్ణం, భూ కమత పటం ల్యాండ్ రిజిస్టర్లో డిజిటల్ రూపంలో నమోదవుతాయి. వీటితో మ్యాప్‌లో క్యూఆర్ కోడ్ రూపంలో పొందుపరుస్తారు. నకిలీలు, ట్యాంపరింగ్‌కు తెర ప్రతి భూమికి (ల్యాండ్ పార్సిల్) ఒక విశిష్ట సంఖ్య కేటాయించి భూమి వివరాలతోపాటు భూ యజమాని ఆధార్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ సేకరించి భూ రికార్డులో భద్రపరుస్తారు. భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. డూప్లికేట్ రికార్డులు, ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు. ఆయా భూముల క్రయ విక్రయాలు జరిగిన వెంటనే రికార్డుల్లో ఆటోమేటిక్‌గా మారిపోతాయి. తద్వారా భూ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ ఆధారిత భూ సమాచార వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీనిద్వారా ఎవరైనా తమ భూమిని మ్యాప్‌తో సహా చూసుకోవడానికి వీలుంటుంది. సర్వేతో ఇవీ ప్రయోజనాలు.. ► ప్రతి ఆస్థికి యజమాని గుర్తింపు ► రికార్డుల్లో పదిలంగా ఆస్తి హక్కులు ► ఆ ఆస్తిని మరొకరు ఇతరులకు విక్రయించే అవకాశం ఉండదు ► పకడ్బందీగా హద్దులు, కొలతలు ► క్షేత్రస్థాయిలో భూమి ఏ ఆకారంలో ఉందో రికార్డుల్లో అలాగే ఉంటుంది ► ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఆస్తి వివరాలు తెలుసుకోవచ్చు ► హద్దు రాళ్లు తొలగించినా, గట్టు తెగ్గొట్టినా మీ ఆస్తి డిజిటల్ రికార్డుల్లో భద్రంగా ఉంటుంది. ► భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం, సంపూర్ణ హక్కుతో ఉంటుంది. సంపూర్ణ హక్కులు, రక్షణే లక్ష్యం స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా భూముల రీ సర్వే నిర్వహిస్తున్నాం. రీ సర్వేతో అస్తవ్యస్థంగా ఉన్న రికార్డుల ప్రక్షాళన జరుగుతుంది. వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం డిజిటల్ రికార్డులు తయారవుతాయి. దళారీ వ్యవస్థకు ఆస్కారం ఉండదు. ప్రస్తుతం సర్వే నెంబర్ల వారీగా హద్దు రాళ్లు లేకపోవడంతో సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నాయి. రీ సర్వేలో ప్రతి సర్వే నెంబరును ఉచితంగా సర్వే చేస్తున్నాం. వైఎస్సార్ జగనన్న హద్దురాళ్లు ఏర్పాటు చేస్తాం. ప్రతి భూమిపై సంబంధిత యజమానికి సంపూర్ణ హక్కు, రక్షణ కల్పించడమే రీ సర్వే ఉద్దేశం. – సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ -
ఆదాయార్జనలో దక్షిణ మధ్య రైల్వే ఆల్ టైమ్ రికార్డు..!
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన వినూత్న విధానాలు, జోన్లో నిత్యావసర వస్తువుల సరఫరా సజావుగా సాగేందుకు కేంద్రీకృత విధానాలను కఠినతరం చేయడం ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ రంగంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. 2020-21 సంవత్సరంలో పార్సిల్లో వార్షిక ఆదాయం మొత్తం రూ.108.3 కోట్లు కాగా.. కరోనా మహమ్మారి తెచ్చిన సవాళ్లను అధిగమిస్తూ పార్సిల్స్‌లో 4.78 లక్షల టన్నుల సరుకు రవాణా వల్ల రూ.200 కోట్ల ఆదాయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వేస్ సాధించింది. భారతీయ రైల్వేలో పార్శిల్ స్థలం కోసం అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం, షెడ్యూల్ ప్రకారం రైళ్లను నడపడం స్నేహపూర్వక విధానాలతో ఇది సాధ్యమైంది. కొత్త పార్శిళ్లను కొనుగోలు చేయడం, రోడ్డు పార్సిల్స్‌ను రైలు రవాణాకు మళ్లించడం వంటివి పార్సిల్ రంగంలో వృద్ధికి ఊతంగా మారాయి. వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడంలో, దేశ రాజధానికి పాలను రవాణా చేయడంలో ఈ సేవలు కీలక పాత్ర పోషిస్తాయి. 473 కిసాన్ ప్రత్యేక రైళ్లు 1.57 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసి రూ.72.67 కోట్ల ఆదాయాన్నిఆర్జించింది. పాల సరఫరా ద్వారా రూ.34.03 కోట్లు, నాన్ లీజు ట్రాఫిక్ ద్వారా రూ.73.62 కోట్లు, స్పేస్ లీజింగ్ ద్వారా రూ.20.08 కోట్లు ఆర్జించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజీవ్ కిశోర్ తెలిపారు. కరోనా కారణంగా దక్షిణ మధ్య రైల్వే అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. వాటిని ఇప్పుడిప్పుడే అధిగమిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. ఇది 2021-22 లో 112.51 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి రికార్డు స్థాయిలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అన్ని రకాల సరకుల లోడిరగ్ అధిక స్థాయిలో జరగడంతో అన్ని రంగాల్లోనూ సరకు రవాణాలో వృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరం 2020-21తో పోలిస్తే సరుకు రవాణా ఆదాయంలో 17.7 శాతం పెరుగుదల, 17.3 శాతం అధిక లోడ్ సాధించింది. 53.78 మెట్రిక్ టన్నుల బొగ్గు, 7.980 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు, 5.925 మెట్రిక్ టన్నుల ఎరువులు, 4.13 మెట్రిక్ టన్నుల ముడిసరుకుతో కూడిన సరుకును సౌత్ సెంట్రల్ రైల్వేస్ రవాణా చేసింది. (చదవండి: మీ ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోండి ఇలా..!) -
అసలైన సాగుదారులకు దన్నుగా..
సాక్షి, అమరావతి: భూ యజమాని హక్కులకు భంగం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులకు మరింత మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. గడిచిన ఖరీఫ్ సీజన్లో ఈ–క్రాప్ నమోదు పగడ్బందీగా చేపట్టారు. రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ (ఆర్బీయూడీపీ) ద్వారా తొలిసారిగా సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాలను నమోదు చేశారు. కానీ, చాలాచోట్ల వాస్తవ సాగుదారుల స్థానంలో భూ యజమానుల పేర్లు నమోదైనట్లుగా గుర్తించారు. దీంతో ప్రస్తుత రబీ సీజన్లో సాగుచేసే ప్రతీ అసలైన రైతు వివరాలు ఈ–క్రాప్‌లో నమోదుకు చర్యలు చేపట్టారు. నిజానికి.. ఈ–క్రాప్ విధానం అమలులోకి వచ్చాక ఖరీఫ్–2020 సీజన్లో 124.92 లక్షల ఎకరాల్లో 49.72 లక్షల మంది రైతులు సాగుచేస్తున్నట్లుగా నమోదు కాగా.. రబీ 2020–21లో 34.65 లక్షల మంది రైతులు 86.77లక్షల ఎకరాలు సాగుచేస్తున్నట్లుగా నమోదయ్యాయి. అలాగే, ఖరీఫ్–2021లో 45.02 లక్షల మంది రైతులు సాగుచేస్తున్న 102.23 లక్షల ఎకరాలు నమోదు చేశారు. వీరిలో కౌలురైతులు 2.92 లక్షల మంది ఉన్నారు. కానీ, వాస్తవంగా రాష్ట్రంలో 16.56 లక్షల మంది కౌలుదారులున్నారు. వారిలో 60–70 శాతానికి పైగా సెంటు భూమి కూడా లేనివారే. సాగువేళ వీరిలో ప్రభుత్వ ప్రయోజనాలందుకుంటున్న వారు 10–20 శాతం లోపే ఉంటున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ప్రతీ వాస్తవసాగుదారుడు లబ్ధిపొందేలా ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్లో ఈ–క్రాప్ నమోదులో మార్పులు తీసుకొచ్చింది. వీటిపై వాస్తవ సాగుదారులు–భూ యజమానులకు అర్ధమయ్యే రీతిలో ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. సాగుదారుల గుర్తింపు ఇలా.. ► విత్తిన వారంలోపు ఆర్బీకేల్లో ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్ నెంబర్లతో సహా క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డు (సీసీఆర్సీ) నకళ్లను అందజేయాలి. ► ఒకవేళ సీసీఆర్సీ లేకున్నా, భూ యజమాని అంగీకరించకపోయినా సరే తాము ఏ సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటల సాగుచేస్తున్నామో ఆ వివరాలను ఆర్బీకేలో తెలియజేసి ఈకేవైసీ (వేలిముద్రలు) చేయించుకుంటే రెండు వారాల్లోపు ఆర్బీకే సిబ్బంది పొలానికి వెళ్లి చుట్టుపక్కల రైతులను విచారించి వాస్తవ సాగుదారుడెవరో గుర్తిస్తారు. ► ఇలా నమోదైన వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో వారం రోజులపాటు ప్రదర్శిస్తారు. తప్పులుంటే సవరిస్తారు. ► అభ్యంతరాలొస్తే మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవ సాగుదారులను గుర్తిస్తారు. సీసీఆర్సీ అంటే.. సీసీఆర్సీ పత్రం అంటే భూ యజమానికి, సాగుదారునికి మధ్య అవగాహనా ఒప్పంద పత్రం. వలంటీర్/వీఆర్ఓ వద్ద ఉండే దరఖాస్తులో వివరాలు నింపి భూ యజమాని లేదా వారి ప్రతినిధి, సాగుదారు–గ్రామ వీఆర్వోలు సంతకం చేస్తే సరిపోతుంది. పంట కాలంలో ఎప్పుడైనా ఈ పత్రాన్ని పొందవచ్చు. దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే ఈ పత్రం జారీచేస్తారు. దీని కాలపరిమితి జారీచేసిన తేదీ నుంచి కేవలం 11 నెలలు మాత్రమే. ఈ కార్డుపొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల రైతులు వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం పొందేందుకు అర్హులు. ఈ–క్రాప్‌తో ప్రయోజనాలు.. ► దీని ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణం పొందవచ్చు. ► రూ.లక్షలోపు పంట రుణం ఏడాదిలోపు చెల్లిస్తే సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 4 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. ► ఉచిత పంటల బీమా సౌకర్యం వర్తిస్తుంది. ► వైపరీత్యాల్లో పంట నష్టానికి పెట్టుబడి రాయితీ పొందొచ్చు. ► అలాగే, పంటలను ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరలకు అమ్ముకోవచ్చు. భూ యజమానులకు పూర్తి రక్షణ ఈ–క్రాప్‌లో వాస్తవ సాగుదారుల వివరాలు నమోదు ద్వారా భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. ఈ వివరాలేవీ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయరు. కోర్టులో సాక్షులుగా కూడా చెల్లవు. ఈ–క్రాప్ ఆధారంగా పొందిన పంట రుణం కట్టకపోయినా, ఎగ్గొట్టినా భూ యజమాని/భూమిపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. కేవలం బకాయి వసూలు సందర్భంగా ఫలసాయంపై మాత్రమే బ్యాంకులకు హక్కు ఉంటుంది. -
AP: ఊర్లున్నాయి.. ప్రజలు లేరు!
సాక్షి, అమరావతి బ్యూరో/కారంపూడి: పాడి–పంట.. పక్షుల కిలకిలారావాలు.. రచ్చబండలు.. అమ్మలక్కల ముచ్చట్లు.. ఇవీ పల్లెలకు ప్రతిరూపాలు. కానీ, ఊరు ఉండి ఆ ఊర్లో ఇవేమీ లేకపోతే..? అచ్చం ఇలాంటివే రెండు ఊర్లు గుంటూరు జిల్లా కారంపూడి మండలంలో ఉన్నాయి. ఒకటి సింగరుట్ల అయితే రెండోది వీరలక్ష్మీపురం. ఇక్కడ జనావాసాలు అంతరించినా అనేక శతాబ్దాలుగా ఆ గ్రామాల పేర్లు మాత్రం సజీవంగా ఉంటూ వస్తున్నాయి. ఈ విశేషమేంటో.. స్థానికంగా ప్రచారంలో ఉన్న చరిత్ర ఏమిటంటే.. రూపం చెడినా ఆనవాళ్లున్నాయి పల్నాటి యుద్ధం (క్రీ.శ 1182) అనంతరం వీరలక్ష్మీపురం అగ్రహారం కనుమరుగు కాగా, ఉగ్రనారసింహుని ఆగ్రహానికి గురై సింగరుట్ల భౌతిక రూపం లేకుండాపోయిందనే గాథ స్థానికంగా ప్రచారంలో ఉంది. సింగరుట్లలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం గతకాల వైభవానికి ప్రతీకగా కన్పిస్తోంది. ఆ గ్రామ పుట్టుక నుంచి కాలగర్భంలో కలసిపోయే వరకు అంతా స్వామి మహిమతోనే జరిగినట్లు స్వామివారి స్థల పురాణం చెబుతోంది. ఆ గ్రామ ఉనికి నిజమని తెలిపేందుకు అక్కడికి సమీపంలోనే అదే పేరుతో సింగరుట్ల తండా ఒకటి ఉంది. అలాగే, వీరలక్ష్మీపురం గ్రామం కాలగర్భంలో కలిసిపోయినా దానికి పడమరగా లక్ష్మీపురం పేరుతో కొత్త గ్రామం ఉంది. సింగరగూడెమే సింగరుట్లగా.. కారంపూడికి సమీపంలోని నల్లమల అడవిలో నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడు. ఆహార సేకరణ నిమిత్తం వేటకు వచ్చిన చెంచులు స్వామివారిని గుర్తించకుండా అపరాధం చేశారని, వారిపై తేనేటీగలు దాడిచేసి ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టిన విషయాన్ని చెంచులు వారి నాయకుడు సింగరకు తెలపగా, సింగర ఆ ప్రాంతాన్ని పరిశీలించి కొండరాతిపై ఉగ్రనారసింహుని రూపాన్ని చూశాడని, ఇక అప్పటినుంచి ఆయన్ను కొలుస్తూ అక్కడే గూడేన్ని ఏర్పాటుచేసుకున్నాడని.. ఆదే సింగరగూడెమని కాలక్రమంలో సింగరుట్లగా నామాంతరం చెందినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కాలంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు స్వామివారికి 7,700 ఎకరాల భూమిని ఈనాంగా సమర్పించి, పూజించాడని చారిత్రక ఆధారం ఉంది. తర్వాత కాలంలో సింగరుట్ల అగ్రహారికులు స్వామివారి మాన్యాలను ఆక్రమించుకుని చివరకు స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలు లేకుండా చేయడంతో ఉగ్రనారసింహుడు ఆగ్రహించి సింగరుట్ల గ్రామ రూపరేఖలు లేకుండా చేశాడనే పురాణ గాథ ఉంది. వీరలక్ష్మీపురం.. రికార్డుల్లో పదిలం ఇక పల్నాటి చరిత్ర కాలంలో వీరలక్ష్మీపురం అగ్రహారంగా వర్థిల్లింది. ఇది 581.14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఊరు కాలగమనంలో కలిసిపోయినా గ్రామం సరిహద్దులు మాత్రం చెక్కుచెదరలేదు. ఇక్కడున్న భూములు సేద్యం చేస్తున్న క్రమంలో అనేక దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. వాటిలో వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, పోలేరమ్మ విగ్రహాలున్నాయి. ఇక్కడ లభ్యమైన విగ్రహాన్నే అగ్రహారం పొలాల్లో వేపకంపల్లి, ఒప్పిచర్ల గ్రామస్తులు ప్రతిష్ఠించారు. వీరలక్ష్మీపురంలో వీరాంజనేయస్వామి దేవాలయం నేటికీ అలనాటి చరిత్రకు సాక్షిగా కన్పిస్తోంది. పల్నాటి చరిత్ర కాలంలో పేర్కొన్న 194 గ్రామాల్లో వీరలక్ష్మీపురం అగ్రహారం కూడా ఒకటి. సింగరుట్లలోని నరసింహస్వామి ఆలయం -
లేని భూమిని అమ్మేశారు.. అసలు భూమిని కొట్టేశారు
కోడుమూరు: అగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ నాయకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలతో ఆ సంస్థకు కొంత భూమిని అమ్మారు. అమ్మిన భూమికి కూడా తిరిగి తమ కుటుంబ సభ్యుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ తంతు వెనుక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రధాన అనుచరుడు దామోదర్ నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించారు. సీఐడీ అధికారుల విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామంలో సర్వే నంబర్ 113లో ఉన్న 8.24 ఎకరాల భూమిని దామోదర్ నాయుడు సోదరులు వెంకటయ్య, నారాయణ గతంలో అగ్రి గోల్డ్ సంస్థకు విక్రయించారు. ఇది సాగులో ఉన్న భూమి కావడంతో రెవెన్యూ అధికారులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని దామోదర్ నాయుడు భార్య వరలక్ష్మి, వెంకటయ్య భార్య రంగమ్మకు తిరిగి బదలాయించుకున్నారు. అలాగే సర్వే నంబర్ 146/1 రెవెన్యూ రికార్డుల్లో లేకున్నా.. నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకం సృష్టించి 6.95 ఎకరాల భూమిని దామోదర్ నాయుడు అగ్రి గోల్డ్ సంస్థకు విక్రయించారు. 149బీ, 80/1, 40/2, 40, 33/7, 25/9, 84ఏ సర్వే నంబర్లలో దామోదర్ నాయుడు సమీప బంధువులు రామాంజనేయులు, శ్రీనివాసులు, నారాయణ, నాగేశ్వరరావు, లక్ష్మమ్మ, పుల్లయ్య, పార్వతమ్మలకు భూములు లేకపోయినా నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాల ద్వారా 21.4 ఎకరాలను అగ్రి గోల్డ్ సంస్థకు అమ్మారు. బయటపడుతున్న అక్రమాలు అగ్రి గోల్డ్ కొనుగోలు చేసిన భూముల్లో భారీ ఎత్తున అక్రమాలు బయటపడుతున్నాయి. రెవెన్యూ రికార్డులు తారుమారు కావడంతో వాటి మూలాలను వెలికి తీసేందుకు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల్ని పరిశీలించి అవకతవకలను గుర్తించారు. 40/2 సర్వే నంబర్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తి విస్తీర్ణం 2.72 ఎకరాలుండగా.. 10.61 ఎకరాలున్నట్టు రిజిస్ట్రేషన్ చేయించారు. ఇలా రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నంబర్లను సృష్టించి నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలతో రిజిస్ట్రేషన్ చేయించి భూములు అమ్మినట్టు సీఐడీ అధికారుల విచారణలో బయటపడింది. వారం పది రోజుల్లో పూర్తి నివేదికను సీఐడీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు సమాచారం. రికార్డులు తారుమారు రెవెన్యూ అధికారులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని దామోదర్ నాయుడు కుటుంబ సభ్యులు రికార్డులను తారుమారు చేశారు. ప్రస్తుతం కృష్ణగిరి గ్రామ సర్పంచ్ వరలక్ష్మి (దామోదర్ నాయుడు భార్య) పేరిట సర్వే నంబర్ 113లో గల 4.12 ఎకరాల భూమిని గతంలోనే దామోదర్ నాయుడు అగ్రి గోల్డ్‌కు విక్రయించారు. అలాగే సర్వే నంబర్ 95లో రామాంజనేయులు, శ్రీనివాసులు, నారాయణ, వెంకటలక్ష్మికి ఉన్న 4.57 ఎకరాల భూమిని అగ్రి గోల్డ్‌కు అమ్మారు. అదే భూమిని వారి కుటుంబ సభ్యులు హరిబాబు, జయరాముడు, వెంకటయ్య పేర్ల మీద బదలాయించుకున్నారు. సర్వే నంబర్లు 123/1ఏ, 123/2ఏ, 123/3ఏ, 141/1, 121/2సీ, 121/1బీ, 113, 93, 92/ఏ2, 76, 68/ఏ, 64/2, 64/ఏ, 54/2, 48/5, 5/4,5,7, 144/1,2, 145/ఏ, 2సీ, 133/2, 3, 149/బీ1, 146/1బీ, 95లలో ఉన్న 126.56 ఎకరాల భూమిని గతంలో అగ్రి గోల్డ్‌కు అమ్మారు. మా దృష్టికి రాలేదు అగ్రి గోల్డ్ సంస్థ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులు తారుమారైనట్టు మా దృష్టికి రాలేదు. ఏడాది క్రితమే నేను కృష్ణగిరి తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్నాను. రికార్డుల మార్పులు, చేర్పులపై సీఐడీ అధికారులు పరిశీలన చేస్తున్నారు. – రామచంద్రారావు, తహసీల్దార్, కృష్ణగిరి -
పట్టాదారు పేరు తహసీల్దార్ ఆఫీసు.. తండ్రి పేరు కొందుర్గు
కొందుర్గు: సాధారణంగా వ్యవసాయ భూములకు పట్టాదార్లుగా రైతులు ఉంటారు. వారి పేర్లపై ఎంత భూమి ఉంది, ఖాతా నంబరు, తండ్రి పేరు వంటి వివరాలను రికార్డుల్లో పొందుపరుస్తారు. కానీ రంగారెడ్డి జిల్లా జిల్లేడ్‌చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్ల గ్రామంలో రెవెన్యూ రికార్డులు విచిత్రంగా ఉన్నాయి. ధరణి పోర్టల్‌లో పెద్దఎల్కిచర్ల లోని సర్వేనంబర్ 32/ఉ2లో 1–14 ఎకరాల భూమి తహసీల్దార్ ఆఫీసు పేరుపైన ఉంది. పట్టాదారు పేరు నమోదు చేయాల్సిన స్థానంలో తహసీల్దార్ ఆఫీసు అని ఉంది. తండ్రిపేరు స్థానంలో కొందుర్గు అని నమోదు చేశారు. ఇక ఈ భూమికి ఫ్యాన్సీ ఖాతా నంబర్ 2222 ఇచ్చారు. దీంతో అధికారుల పనితీరుపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
15.74 ఎకరాలను నొక్కేసేందుకు కుట్ర
వెంకటాచలం: ఆన్లైన్లో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చిన కేసులో నలుగురు వ్యక్తులను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన బొడ్డు గీత కొన్నినెలల క్రితం పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసింది. ప్రస్తుతం గుడ్లూరు కార్యాలయంలో పనిచేస్తుంది. పొదలకూరులో పనిచేసే సమయంలో మండలంలోని అయ్యవారిపాళెం గ్రామానికి చెందిన పెంచలభాస్కర్తో గీతకు పరిచయం అయ్యింది. అతని చిన్నాన్న నలగర్ల కోటేశ్వరరావుకు ఓ వ్యక్తి కుంకుమపూడిలో ప్రభుత్వ పోరంబోకు 1.16 ఎకరాలు విక్రయించాడు. దీనిని పట్టా భూమిగా మార్చాలని కోటేశ్వరరావు పెంచల్భాస్కర్ను కోరాడు. దీంతో అతను గీతను సంప్రదించాడు. గీత రూ.2 లక్షలిస్తే పట్టా భూమిగా మార్పిస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం కంప్యూటర్ ఆపరేటర్లు సైదాపురానికి చెందిన రాజేష్, కర్నూలుకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సాయం కోరింది. గుడ్లూరు డిప్యూటీ తహసీల్దార్ అనారోగ్యం కారణంగా సెలవుపై ఉండడంతో అతని డిజిటల్ సిగ్నేచర్ కీ గీత వద్దనే ఉంది. రాజేష్, ప్రవీణ్ సాయంతో గత నెల 30వ తేదీన వెంకటాచలం తహసీల్దార్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి వెబ్‌ల్యాండ్ వెబ్సైట్ ఓపెన్ చేసింది. ఆ తర్వాత గుడ్లూరు డీటీ సిగ్నేచర్ కీతో కాకుటూరు, కుంకుమపూడి పరిధిలోని 15.74 ఎకరాల ప్రభుత్వ భూములను పట్టా భూమిగా మార్చి బొడ్డు బుజ్జమ్మ, బొడ్డు మస్తానయ్య, బిక్కి మనెమ్మ, నలగర్ల కోటేశ్వరరావు పేర్లమీదమార్చి వేసింది. విషయం అధికారులకు తెలియడంతో విచారణ చేయగా.. వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న గొల్ల రామబ్రహ్మం బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయగా, గీత డిజిటల్ సిగ్నేచర్ చేసి కుట్రపూరితంగా రికార్డులు తారుమారు చేసినట్లు గుర్తించారు. బొడ్డు గీత, పెంచలభాస్కర్, నలగర్ల కోటేశ్వరరావును అరెస్టు చేయగా, గొల్ల రామబ్రహ్మం వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. -
ప్రభుత్వ లెక్కల ప్రకారం 27 ఏళ్లు; అందుకే మళ్లీ పెళ్లి చేసుకుంటున్నా
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అజమ్ఘఢ్ జిల్లాకు చెందిన ఖలీలాబాద్ గ్రామవాసి మృతక్లాల్ బిహారి. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి మరొకరిని పెళ్లి చేసుకుని, కొడుకును తీసుకుని ముబారక్ పూర్‌కి వెళ్లింది. చదువు అబ్బకపోవడంతో బిహారి బనారస్ చీరలు నేయడం నేర్చుకున్నాడు. 22 ఏళ్ల వయసులో తండ్రికి ఊరిలో ఉన్నకొద్ది పాటి స్థలంలో మగ్గాలు పెట్టాలనుకున్నాడు. అందుకు ఆయనకు బ్యాంక్ లోన్ అవసరమైంది. గ్రామంలో ఉంటున్నట్టుగా గుర్తింపు పత్రం కోసం జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడే లాల్ బిహారికి ఆశ్చర్యకర విషయం తెలిసింది. రెవెన్యూ రికార్డులో అప్పటికే లాల్ బిహారీ మరణించినట్లుగా ఉంది.దీనిప్రకారం ప్రభుత్వ రికార్డుల్లో ఆయన చనిపోయాడు. తాను బతికే ఉన్నానని నిరూపించుకునేందుకు బిహారి 18 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం 64 ఏళ్ల వయసున్న లాల్ బిహారీ ప్రభుత్వ లెక్కల ప్రకారం తన వయస్సు 27 ఏళ్లని అందుకే నా భార్య కర్మీదేవిని మరోసారి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. '' 2022లో తమ పెళ్లి జరగనుందని.. 56 ఏళ్ల నా భార్య మెడలో మళ్లీ తాళి కట్టనున్నాను. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1994లో మళ్లీ పుట్టిన నాకు ఇప్పుడు 27 ఏళ్లు. నేను బతికే ఉన్నానని దేశంలో మరింత మందికి తెలియజెప్పేందుకే వివాహం చేసుకుంటున్నా. ఊరిలో ఉన్న వ్యవసాయ భూమిని దక్కించుకునేందుకు దగ్గరి బంధువొకరు చేసిన పని అది.నా ఆస్తిని దక్కించుకునేందుకు మా దగ్గరి బంధువు ప్రభుత్వ అధికారికి 300 రూపాయల లంచం ఇచ్చి నేను జూలై 30, 1976లో మరణించినట్టుగా రాయించాడు. విచిత్రమేమిటంటే ఆ అధికారి ఒకప్పుడు నా మిత్రుడే. లంచానికి ఆశపడి ఎదుటివారికి లాభం చేకూర్చేందుకు అలా చేశాడని తెలిసింది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా బిహారి తన 18 ఏళ్ల పోరాటంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. మొదట్లో ఆయన కేసు విని కొంతమంది లాయర్లు నవ్వితే, మరికొందరు సానుభూతి తెలిపారు. స్థానికులు బిహారీని దెయ్యంగా పిలిచేవారు. చిన్నపిల్లలు ఆయనను చూసి పారిపోయేవారు. అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ బిహారీకి ఆయన భార్య కర్మీదేవి మాత్రం తోడుగా నిలిచింది. ఆమె సహకారంతోనే బిహారి ఒక పథకం ఆలోచించాడు. తాను బతికే ఉన్నానని అధికారులకు తెలియజేసేందుకు ప్రభుత్వ అధికారికి లంచం ఇచ్చిన తన బంధువు కొడుకును కిడ్నాప్ చేశాడు. ఎలాగైనా తన పేరు మీద కేసు రిజిస్టర్ కావాలనుకున్నాడు. ఎన్నికల్లో పోటీ చేయడం, భార్యకు వితంతు పెన్షన్ రాబట్టడం కోసం ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించడం, ‘ముఝే జిందా కరో’ (నన్ను బతికించండి) అనే ప్లకార్డుతో అసెంబ్లీలోకి దూసుకెళ్లడం... ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వజూపుతూ పట్టుబడటం, తన శవ ఊరేగింపు తనే జరుపుకోవడం వంటి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ విధంగా స్థానిక వార్తల్లోకి ఎక్కాడు. ఆయన చేసిన పోరాటాల ఫలితంగా చివరకు జూన్ 30, 1994లో జిల్లా యంత్రాంగం లాల్ బిహారీ బతికున్నట్టుగా గుర్తించింది. లాల్ బిహారీ పోరాటాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీశ్ కౌశిక్ ఆయన జీవితాన్ని తెరకెక్కించాడు. ‘కాగజ్’గా ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలో ప్రధాన పాత్రను ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి పోషించారు. ఇందులో ఆయన భార్య కర్మీదేవిగా మోనాల్ గజ్జర్ నటించారు. ఈ సినిమాకు ప్రముఖ హీరో సల్మాన్‌ఖాన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. -
జనంలేక పాడుబడ్డ ఊరు: రోజూ వచ్చి వెళ్తున్న వృద్ధుడు
చిత్తూరు: పాపాఘ్ని నది సమీపంలో ఉండే ఊరు ఒకప్పుడు జనాలతో, పంటలతో కళకళలాడేది. ఆ ఊరి పేరు పుట్టాపర్తి. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో ఉంది. కొన్నేళ్ల నుంచి నదిలో నీరులేక, బోరు బావుల్లో నీరు రాక.. పంటలు పండక ఊరు ఖాళీ అయిపోయింది. ఇక్కడ జీవించిన వారు సమీప గ్రామాలకు, బెంగళూరుకు పనుల కోసం వలస వెళ్లిపోయారు. దీంతో ఇళ్లన్నీ శిథిలమైపోయాయి. జనం లేకపోయినా ఊరి పేరు మాత్రమే రెవెన్యూ రికార్డుల్లో మిగిలిపోయింది. అయితే బక్కోళ్ల కిట్టన్న అనే 70 ఏళ్ల వృద్ధుడు మాత్రం ప్రతిరోజు ఊరికి వచ్చి వెళుతూ ఉంటాడు. పగలంతా తన వ్యవసాయ భూమిలో ఉన్న షెడ్డులో కాలక్షేపం చేసి సాయంత్రం తాను నివసిస్తున్న టి.సదుం గ్రామానికి చేరుకుంటున్నాడు. ఎందుకు వెళ్తావు ఆ ఊరికి అని అడిగితే.. చిన్న నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి అని కిట్టన్న బదులిస్తాడు. ఊరి పేరు ఎలా వచ్చిందంటే.. టి.సదుంలో ఒకప్పుడు కలరా వ్యాధి ప్రబలడంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి కొంతమంది పాపాఘ్ని నది ఒడ్డున ఉన్న ప్రాంతంలో నివసించడానికి వెళ్లారు. ఆ ఖాళీ స్థలంలో గుడిసెలు, రాతి సుద్ద మిద్దెలు కట్టుకోవడంతో అదో ఊరిగా మారింది. అక్కడ నాగుల పుట్టలు, చెదలు పుట్టలు అధికంగా ఉండటంతో ఆ ఊరికి పుట్టాపర్తిగా నామకరణం చేశారు. శివరాత్రి ఉత్సవాలు ప్రత్యేకత.. పాపాఘ్ని నది ఒడ్డున శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఏటా శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి ఉత్సవ ప్రతిమలను పుట్టాపర్తికి తీసుకెళ్లడం.. అనంతరం టి.సదుం గ్రామానికి తీసుకెళ్లడం ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడు పుట్టాపర్తిలో ఎవరూ లేకపోవడంతో ఉత్సవ ప్రతిమలను నేరుగా టి.సదుంకు తీసుకెళ్లిపోతున్నారు. పాపాఘ్ని నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నపుడు కపిల్ (ఎద్దులతో తిప్పే యంత్రం) ద్వారా నీళ్లు తోడి పంటలు సాగు చేసేవారమని, పచ్చటి పొలాలతో ఊరు కళకళలాడేదని కిట్టన్న చెప్పాడు. ఏడేళ్ల వయసు వరకు ఇక్కడే.. నాకు ఏడేళ్ల వయసు వచ్చే వరకూ ఊళ్లోనే ఉన్నా. పాపాఘ్ని నది దాటి టి.సదుంలో ఉన్న పాఠశాలకు వెళ్లేవాడిని. ఒకసారి నదిలో నీటి ప్రవాహం అధికం కావడంతో ఇంటికి రాలేక పోయాను. ఇప్పుడు టి.సదుంలోనే ఉంటున్నాను. – బోడెన్నగారి ఆదెన్న నీరు తగ్గే వరకూ అక్కడే.. పాపాఘ్ని నదిలోకి నీరు వస్తే మూడు రోజుల వరకూ ప్రవాహం తగ్గేది కాదు. పని మీద బయటకు వెళ్తే అక్కడే ఉండేవాళ్లం. ఊళ్లో పండుగలు, పబ్బాలు గొప్పగా చేసుకునేవాళ్లం. పగలంతా గత అనుభవాలు గుర్తుచేసుకుంటూ ఇక్కడే కాలక్షేపం చేసి రాత్రికి టి.సదుం చేరుకుంటాను. – బక్కోళ్ల కిట్టన్న చదవండి: నా కులంపై దుష్ప్రచారం చేస్తున్నారు: పుష్ప శ్రీవాణి -
జీఎస్టీ... రికార్డు వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను వసూళ్ల రికార్డులు కొనసాగుతున్నాయి. మార్చిలో వసూళ్లు రూ.1.23 లక్షలుగా నమోదయినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారికాగా, 2020 ఇదే నెలతో పోల్చితే 27 శాతం అధికం. 2020 మార్చిలో జీఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం రూ.97,590 కోట్లు. ఎకానమీ వేగంగా పురోగమిస్తోందనడానికి జీఎస్టీ గణాంకాలు సంకేతమని ఆర్థికశాఖ తెలిపింది. నకిలీ బిల్లింగ్ నిరోధం, జీఎస్టీ, ఆదాయపు పన్ను, కస్టమ్స్ ఐటీ వ్యవస్థలుసహా సూక్ష్మ స్థాయిలో డేటా విశ్లేషణ, పటిష్టమైన పన్ను యంత్రాంగం కూడా జీఎస్టీ వసూళ్లు క్రమంగా పురోగమించడానికి కారణమని ఆర్థికశాఖ వివరించింది. ముఖ్యాంశాలు చూస్తే... ► మార్చి నెలలో జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.1,23,902 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో సెంట్రల్ జీఎస్టీ రూ.22,973 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ.29,329 కోట్లు. ఏకీకృత జీఎస్టీ రూ. 62,842 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.31,097 కోట్ల వసూళ్లు కలిపి), సెస్ రూ.8,757 కోట్లు (వస్తు దిగుమతులపై రూ. 935 కోట్ల వసూళ్లు కలిపి). ► వార్షికంగా 2020 మార్చితో పోల్చితే తాజా సమీక్షా నెలలో వస్తు దిగుమతల నుంచి ఆదాయం 70 శాతం పెరిగింది. దేశీయ లావాదేవీల నుంచి రెవెన్యూ 17 శాతం పెరిగింది. ► కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు 2020 మార్చి చివరి వారం నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కేంద్రం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ తర్వాతి నెల ఏప్రిల్‌కు సంబంధించిన జీఎస్టీ వసూళ్లు రూ.32,172 కోట్లకు పడిపోయాయి. లాక్డౌన్ నియంత్రణలను క్రమంగా సడలిస్తూ రావడంతో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇదే జీఎస్టీ వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. ► పెద్ద రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్లలో 6–15 శాతం మధ్య వృద్ధిని చూపించాయి. వరుసగా జీఎస్టీ ఆదాయాలు వృద్ధిని చూపిస్తుండడం ఆర్థిక వ్యవస్థ సామర్థ్యంపై విశ్వాసాన్ని కలిగిస్తుంది. అలాగే, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా తిరిగి మొదలయ్యాయని, వస్తు, సేవలకు డిమాండ్ అధికంగా ఉండడాన్ని తెలియజేస్తోంది. పారిశ్రామిక రంగం తిరిగి సాధారణ స్థితికి వస్తోందని కూడా జీఎస్టీ ఆదాయంలో వృద్ధి తెలియజేస్తోంది. ద్రవ్యలోటు కట్టడికి దోహదం 2020–21లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం(ద్రవ్యలోటు) రూ.18.5 లక్షల కోట్లు ఉంటుం దని (జీడీపీలో 9.5%) 2021 ఫిబ్రవరి 1 న ప్రవేశపెట్టిన బడ్జెట్ సవరించిన గణాంకాలు పేర్కొన్నాయి. మార్చిలో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్ల నేపథ్యంలో.. ద్రవ్యలోటు నిర్దేశిత స్థాయిలోనే ఉండొచ్చు. ప్రభుత్వ ఆదాయాలకు సంబంధించి తగిన నగదు సమతౌల్యతతో 2021–22 ప్రారంభం అవుతున్నట్లు తాజా పరిస్థితి సూచిస్తోంది. – అదితి నాయర్, ఇక్రా ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ -
పేరుంది.. కానీ ఊరే లేదు
సాక్షి, మెదక్/తూప్రాన్: అక్కడ ఊరు లేదు.. జనం లేరు. కానీ.. రెవెన్యూ రికార్డుల్లో ఆ గ్రామాల పేర్లు నిక్షిప్తమై ఉన్నాయి. అంతేకాదు.. ఇప్పటికీ వందల ఎకరాల భూమికి సంబంధించి లావాదేవీలు వాటి పేరిటే కొనసాగుతున్నాయి. ఆనవాళ్లు మాత్రమే మిగిలినప్పటికీ.. ఆ భూములకు మంచి డిమాండ్ ఉంది. ఇంతకీ అక్కడి జనం ఏమైనట్లు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. తూప్రాన్ మండలంలో రికార్డులకే పరిమితమైన రెవెన్యూ గ్రామాలు హుస్సేన్‌పూర్, మజీద్‌పల్లిపై ప్రత్యేక కథనం.. తూప్రాన్ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో హుస్సేన్‌పూర్, మజీద్‌పల్లి పేర్లు రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి. జనంలేని ఈ రెండు పల్లెలు 1953 నుంచి రెవెన్యూ గ్రామాలుగా కొనసాగుతున్నాయి. గతంలో అల్లాపూర్ పంచాయతీ పరిధిలో హుస్సేన్‌పూర్ ఉండేది. ప్రస్తుతం అల్లాపూర్ తూప్రాన్ మున్సిపాలిటీ విలీనమైంది. మజీద్‌పల్లి(ఎన్కే) గ్రామం మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డి గ్రామ పంచాయతీ పరిధిలోకి రాగా.. రెవెన్యూ గ్రామంగా తూప్రాన్ మండల పరిధిలోకి వస్తోంది. హుస్సేన్‌పూర్ శివారులో హనుమాన్ విగ్రహం, రోలు ఆ గ్రామానికి ఆనవాలుగా నిలుస్తుండగా.. మజీద్‌పల్లి (ఎన్కే)కి సంబంధించి ఎలాంటి గుర్తులు లేవు. నిజాం కాలంలో ఈ గ్రామాల్లో జనావాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రజలు ఎక్కడికెళ్లారు.. ఏ కారణంతో ఊళ్లు ఖాళీ అయ్యాయి.. అని ఎవరూ చెప్పలేకపోతున్నారు. కనిపించని ఊళ్లలో ‘రియల్’ జోరు.. ప్రస్తుతం కనపడని.. జనం లేని హుస్సేన్‌పూర్, మజీద్‌పల్లి (ఎన్కే) ఊళ్లలో సాగు భూమి మాత్రమే ఉంది. గతంలో కొందరు రైతులు పత్తి, వరి, మొక్కజొన్న పంటలు పండించేవారు. ప్రస్తుతం ఈ భూములకు మంచి డిమాండ్ పలుకుతోంది. ఈ నేపథ్యంలో భూమిని ప్లాట్లుగా చేసి.. క్రయవిక్రయాలు జరుపుతుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. హుస్సేన్‌పూర్‌లో ఎకరాకు రూ.కోటికి పైగా.. మజీద్‌పల్లి (ఎన్కే)లో ఎకరాకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పలుకుతుండడం విశేషం. మజీద్‌పల్లి(ఎన్కే) గ్రామంలో 60 ఎకరాల భూమిని టీఎస్ఐసీసీకి కేటాయించగా.. మిగతా భూముల్లో రైతులు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గతంలో ఉండేవారట గతంలో హుస్సేన్‌పూర్‌లో జనాభా ఉండేదని పెద్దలు చెప్పారు. వ్యవసాయమే ఆధారంగా జీవించినట్లు మా తాత చెప్పేవారు. ఇక్కడ ప్రస్తుతం ఏ ఒక్కరూ లేకపోవడం అంతుపట్టడం లేదు. ఈ గ్రామ శివారులో హనుమాన్ విగ్రహం, నంది విగ్రహం ఉండేది. నంది విగ్రహాన్ని ఎవరో తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎలాంటి ఆనవాళ్లు లేవు. – జిన్న భగవాన్‌రెడ్డి, మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్, అల్లాపూర్ ఈ గ్రామాల్లో ప్రజలెవరూ లేరు.. తూప్రాన్ మండలంలోని హుస్సేన్‌పూర్, మజీద్‌పల్లి(ఎన్కే) గ్రామాలు రెవెన్యూ రికార్డుల్లో దశాబ్దాలుగా ఉన్నాయి. ఈ గ్రామాలు ఇప్పడు కనిపించడం లేదు.. జనాలు కూడా లేరు. నిజాం కాలంలో ప్రజలు నివసించేవారట. ఈ భూములకు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో వెంచర్లుగా చేసి విక్రయిస్తున్నారు. కొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు. – శ్రీదేవి, తహసీల్దార్, తూప్రాన్ -
కటకటాల్లోకి కల్లాడ వీఆర్ఏ..
నందిగాం(శ్రీకాకుళం జిల్లా): రెవెన్యూ రికార్డుల తారుమారు కేసులో కల్లాడ పంచాయతీ వీఆర్ఏని అరెస్టు చేశామని ఎస్సై ఎస్.బాలరాజు బుధవారం తెలిపారు. తప్పుడు రికార్డులు సృష్టించి సుమారు 30 ఎకరాల లేని భూమి ఉన్నట్లుగా చేసి అమాయకులకు అమ్మజూపి వారి నుంచి లక్షలాది రూపాయలు దోచుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మదన్‌గౌడ్‌కు వీఆర్ఏ కొత్తపల్లి ఢిల్లేశ్వరరావు సహకరించినట్టు తేలింది. కంప్యూటర్ పరిజ్ఞానంతో రెవెన్యూ కార్యాలయంలో తిష్ట వేసిన ఢిల్లేశ్వరరావు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి మదన్‌గౌడ్‌కు సహాయం చేశాడని, అందుకు ప్రతిఫలంగా రూ.1.25 లక్షలు పుచ్చకున్నాడని పక్కా ఆ«ధారాలు సేకరించడంతో అరెస్టు చేసి జైలుకు పంపించామని ఎస్సై పేర్కొన్నారు. నందిగాం తహసీల్దారు కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్‌లో పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్ పని చేసేవారు. అయితే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వీఆర్ఏ ఢిల్లేశ్వరరావును గతంలో అధికారులు నియామకం చేశారు. ఇదే అదునుగా ప్రతి చిన్న పనికీ లంచం తీసుకోవడానికి అలవాటు పడిన ఆయన టీడీపీ నాయకులకు పూర్తి సహాయసహకారాలు అందిస్తుండేవాడని తెలిసింది. రెవెన్యూ రికార్డుల వ్యవహారంలో ప్రతి చిన్న పనికి తహసీల్దారు డిజిటల్ సంతకం అవసరం కావడంతో దానికి సంబంధించిన ‘కీ’ని అప్పుడప్పుడూ ఢిల్లేశ్వరరావు వినియోగించేవాడు. అయితే ఇదే అదునుగా భావించిన మదన్‌గౌడ్ ఢిల్లేశ్వరరావు ద్వారా మండలంలోని పలుచోట్ల రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేందుకు రూ.1.25 లక్షలు ముట్టజెప్పాడు. అయితే భూముల కోనుగోలు చేసిన హైదారాబాద్‌కు చెందిన వ్యక్తికి అనుమానం రావడంతో కార్యాలయానికి వెళ్లి ఆరా తీయడంతో రికార్డుల తారుమారు వ్యవహారం జూలైలో బయటకు వచ్చింది. అంతేకాక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నందిగాం పోలీసులు గతంలో ప్రధాన నిందితుడు మదన్‌గౌడ్‌ను అరెస్టు చేశారు. రికార్డుల తారుమారులో తహసీల్దారు కార్యాలయ సిబ్బంది పాత్రపై అనుమానం ఉన్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా వీఆర్ఏ ఢిల్లేశ్వరరావుపై అనుమానం వచ్చి ఆరా తీయగా నిజాలు బయటకు వచ్చాయి. దీంతో మదన్‌గౌడ్ నుంచి పుచ్చుకున్న రూ.1.25 లక్షల్లో పోలీసులు రూ.లక్ష రికవరీ చేయడంతో పాటు ఢిల్లేశ్వరరావును అరెస్టు చేసి నరసన్నపేట సబ్‌జైల్‌కు పంపించారు. రెవెన్యూ రికార్డుల తారుమారు వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. -
విజయనగరంలో సమగ్ర భూ సర్వే..!
మరికొద్ది నెలల్లో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. భూముల వివరాలు ఆన్లైన్ కానున్నాయి. ప్రభుత్వ పథకాలు, రాయితీలు అర్హులైన రైతులకు అందనున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న భూ సమగ్ర సర్వే నిర్ణయం రైతుల్లో ఆనందం నింపుతోంది. సాక్షి, మెరకముడిదాం: దశాబ్దాల కాలంగా రైతులను వెంటాడు తున్న భూ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడగులేస్తోంది. భూముల సమగ్ర సర్వేకు సన్నద్ధమవుతోంది. 2021 జనవరి నెల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించేందు కు ఏర్పాట్లు చేస్తోంది. రైతుల భూములకు చెందిన రికార్డుల సమస్యలను గుర్తించిన సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి భూ సమగ్రసర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 12లక్షల60వేల377ఎకరాల 20 సెంట్ల భూమిని అధికారులు సర్వే చేయనున్నారు. దీనివల్ల భూముల వివరాలు పక్కాగా నమోదవుతాయని, ఎలాంటి వివాదాలకు తావుండదని, వివాదాల్లో ఉన్న భూములకు పరిష్కారం దొరుకుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. సమస్యలకు చెక్... గతంలో పట్టాదారు పాస్ పుస్తకం ఒకరిపేరు మీద ఉంటే రెవెన్యూ రికార్డుల్లో ఇంకొకరి పేరుతో ఆ భూమి ఉండేది. ఫలితంగా సంక్షేమపథకాలు సంబంధిత రైతులకు అందడంలేదు. మరోవైపు తల్లిదండ్రులు మృతిచెందితే... వారిపేరు మీద ఉన్న భూములు వారసుల పేరుకు మార్చేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటికీ సమగ్ర సర్వే ఒక్కటే మార్గమని సీఎం భావిస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం– కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్ నెట్వర్క్ సాయంతో సమగ్ర భూసర్వేకు సన్నద్ధమవుతున్నారు. గ్రామాల్లో రైతులకు ఉన్న భూములను గుర్తించి ఆధార్ కార్డుల ఆధారంగా వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. చిన్నచిన్న కమతాల నుంచి భూస్వాముల వరకూ ప్రతీది నమోదు చేస్తారు. జనవరి నుంచి ఈ పునఃసర్వే జరగనుంది. తొలుత మెట్ట ప్రాంతాలను తీసుకోగా, అనంతరం పల్లపు భూములను కొలతలు వేసి ప్యూరిఫికేషన్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు సర్వేయర్లతో పాటు ఇతర అధికారులకు శిక్షణ ఇస్తోంది. క్షేత్రస్థాయి నుంచి సర్వే... ముందుగా తహసీల్దార్ కార్యాలయాల్లోని రికార్డులను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి రికార్డులు గ్రామస్థాయిలోకి వెళ్తా యి. రైతులకు ఉన్న వాస్తవ భూమిని పరిశీలించి సరి చేస్తారు. చిన్నచిన్న సమస్యలు ఉన్నచోట వెంటనే పరిష్కరిస్తారు. పెద్ద, పెద్ద సమస్యలను తహసీల్దార్ సమక్షంలో పరిష్కరిస్తారు. క్షేత్రస్థాయి నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. కోర్టులో కేసులు ఉన్నవాటి వివరాలను ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచుతారు. మిగిలిన భూము ల వివరాలు మొత్తం ఆన్లైన్ కానున్నాయి. వీటితో పాటు ఇంటిపట్టాల వివరాలు, పొజిషిన్ సర్టిఫికెట్లు, ప్రభుత్వం ఇవ్వనున్న ఇళ్ల స్థలాలు పట్టాలు కూడా ఆన్లైన్ కానున్నాయి. సమగ్ర సర్వే నిర్వహిస్తాం.. భూ సమగ్ర సర్వేకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే సర్వేయర్లకు, అధికారులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. 2021 జనవరి నుంచి ఈ సర్వే ప్రారంభం కానుంది. ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలకు పరిష్కారం లభించనుంది. సమగ్ర సర్వే వల్ల భూముల వివరాలు క్రమబద్ధీకరణ జరుగుతుంది. దీనికి రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలి. – పీవీఎన్ కుమార్, జిల్లా సర్వే అసిస్టెంట్ డైరెక్టర్, విజయనగరం -
కమతంపై పోలీసు పెత్తనం
అది 20వ శతాబ్దం... 1941 జూన్ 17, సూర్యాపేట – జనగామ రోడ్డు. మాసిన షేర్వానీ, చిరిగిన అడ్డ పంచ నడుముకు చుట్టి ఓ బక్కపలచని ఫకీరు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కండలు తిరిగిన గూండా ఒకడు కొడవలితో ఫకీరు మెడ మీద వేటు వేశాడు. ఇంకోడు కత్తితో పొడిచాడు. చనిపోయిన ఆ ఫకీరు షేక్ బందగి అయితే... చంపిన వారు విస్నూర్ దేశముఖ్ గూండాలు. షేక్ బందగికి వారసత్వంగా వచ్చిన పట్టా భూమిని విస్నూరు దేశముఖ్ బంటు దౌర్జన్యంగా మలుపు కున్నాడు. బందగీ అడ్డం తిరుగుతాడు. తగాదా తుదకు కోర్టుకెక్కింది. కార్వాయి నడిచి నడిచి బందగి వైపే ఫైసలా అయింది. బక్క రైతుకు భూమి దక్కటాన్ని జీర్ణించుకోలేని దేశముఖ్ బందగీని హత్య చేయించాడు. పారిన ఫకీరు నెత్తురు తెలంగాణ సాయుధ పోరాటానికి , ఇక్కడి భూ పోరాటాలకు జీవధార అయింది. 21వ శతాబ్దం.. 60 ఏళ్ల కల సాకారమైంది. తెలంగాణ జననేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు అడగకుండానే కమ్యూనిస్టులను మించిన ఎజెండాను రూపొందించి అమలు చేశారు. 70 ఏళ్లుగా లొసుగులతో సాగిన భూ రికార్డులను ప్రక్షాళన చేశారు. ఎవరి హద్దులు వాళ్లకు చూపించి బీద, బిక్కీ, బడుగు, బక్క రైతుల భూములకు ఎవరికి వారివి పక్కాగా పట్టా చేసి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.55 కోట్ల వ్యవసాయ భూమి ఉండగా వివాదరహితంగా ఉన్న 2.38 కోట్ల ఎకరాల భూమికి పక్కాగా పాసుబుక్కులు తయారు చేసి ఇచ్చారు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను పునరుద్ధరణ చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కాళేశ్వరం, సీతారామ సాగర్ ఒక్కొక్క ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ కృష్ణా, గోదావరి జలాలను కాలువలకు మళ్లించి చెరువులను నింపారు. ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతలకు చేయూతనిచ్చి సాగును గాడిలో పెట్టేందుకు ‘రైతుబంధు’ పథకాన్ని అమలు చేశారు. దీంతో చిగురించిన చెట్టు మీదికి పిట్టలు వచ్చి వాలినట్లుగా వలసపోయిన జనాలు తిరిగి సొంతూళ్లకు చేరుకున్నారు. కొత్త ఆశలతో సాగుకు సిద్ధమయ్యారు. కమతం మీదికి సాగుకు వచ్చిన సన్న, చిన్నకారు రైతులకు అక్కడక్కడ మళ్లీ బందగీ అనుభవాలే ఎదురవుతున్నాయి. బడా పెట్టుబడిదారుల వైపు నిలబడిన పోలీసులు, లేని సమస్యలను ఉత్పన్నం చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి మొగ్గు చూపిస్తున్నారు. వందలాది ఎకరాలను కొనుగోలు చేసి భూముల చుట్టూ పెన్సింగ్ వేసి ఏక ఖండిక కమతాలుగా మార్చుకున్న పెట్టుబడిదారులు మధ్యలో ఉన్న వలస కూలీలకు చెందిన ఎకరం, అర ఎకరం భూములను అక్రమంగా కలిపేసుకున్నారు. సొంత భూములలో సాగు చేసుకునేందుకు తిరిగి వచ్చిన వలస కూలీలు లబోదిబోమంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి పట్టా దారి హక్కు పుస్తకాలు సంపాదించుకుని వస్తే పోలీసులు లాఠీలు పట్టుకొని గెట్టుకు అడ్డంగా, కబ్జాదారులకు అండగ నిలబడుతున్నారు. కబ్జా మీద ఎవరు ఉంటే వారిదే భూమి అనే చట్టవిరుద్ధ నిబంధనలను అమలు చేస్తున్నారు. పట్టాదారుల మీద ఆక్రమణ కేసులు బనాయిస్తున్నారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలతో పాటుగా కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఈ సమస్యలు విపరీతంగా ఉత్పన్నమవుతున్నాయి. బాధితుల అభ్యర్థన మేరకు నా నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ను సంప్రదిస్తే ‘రెవెన్యూ రికార్డులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతానికి భూమి ఎవరి అధీనములో ఉందో వారే హక్కుదారులు. భూమి మీదికి వెళ్ళినవారు ఆక్రమణదారులు. అటువంటి వారిపై అక్రమ కేసులు పెడతాం’ అన్నారు. డీజీపీ ఆదేశాలమేరకే నడుచుకుంటున్నామని మరో సమాధానం చెప్పాడు. ఆయన చెప్పిన సమాధానంతో అవాక్కయ్యాను. పట్టా రైతుకు అన్యాయం జరుగొద్దనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తమ తీరు మార్చుకోకపోతే గతంలోలాగే మళ్లీ ప్రజల్లో అశాంతి రగిలే అవకాశం ఉంది. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, అంచనాలు పద్దుల కమిటీ చైర్మన్, మొబైల్ 9440380141 -
రీసర్వేతో భూవివాదాలకు చరమగీతం
సాక్షి, అమరావతి: భూవివాదాలకు ఏమాత్రం ఆస్కారంలేని విధంగా రెవెన్యూ సంస్కరణల అమలు దిశగా సర్కారు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పూర్తిస్థాయిలో భూ రికార్డుల ప్రక్షాళన (స్వచ్ఛీకరణ)కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురితో బృందాలను నియమించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దోషరహిత రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర రీసర్వేని చేపట్టనుంది. 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా భూములను సర్వే చేసి రీసర్వే రిజిష్టర్ (ఆర్ఎస్ఆర్) తయారు చేశారు. నేటికీ ఇదే ప్రామాణికంగా ఉంది. ప్రతి 30 ఏళ్లకు రీసర్వే చేయాల్సి ఉన్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదు. లెక్కలేనన్ని మార్పులు చేర్పులు తరాలు మారడం, కుటుంబాలు విడిపోవడం తదితర కారణాలతో భూములు చేతులు మారడంవల్ల గత 120 ఏళ్లలో భూముల పరంగా చెప్పలేనన్ని మార్పులు జరిగాయి. ప్రభుత్వ భూములకు దరఖాస్తు పట్టాలు (డీకేటీలు) ఇవ్వడంవల్ల సబ్డివిజన్లు/ సర్వేనంబర్లు పెరిగిపోయాయి. భూమి హద్దుల విషయంలోనూ వివాదాలు పెరిగాయి. చాలాచోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలపాలయ్యాయి. వాస్తవంగా ఉన్న భూమికీ, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న దానికీ మధ్య లక్షల ఎకరాల తేడా ఏర్పడింది. భూరికార్డులు సక్రమంగా లేనందున సివిల్ కేసుల్లో భూ వివాదాలకు సంబంధించినవే 60 శాతంపైగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రికార్డుల స్వచ్ఛీకరణ, భూముల రీసర్వే, శాశ్వత భూ హక్కుల కల్పనే ఇలాంటి సమస్యలకు ఏకైక పరిష్కార మార్గమని నిపుణులు చెప్పడంతో జగన్ సర్కారు ఈ చర్యలకు సాహసోపోత నిర్ణయాలు తీసుకుంది. జగ్గయ్యపేటలో బేస్ స్టేషన్, రీసర్వే 18న ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా భూములను సమగ్ర రీసర్వే చేయాలని నిర్ణయించిన జగన్ సర్కారు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో పైలట్ ప్రాజెక్టుకు ఈనెల 18న (మంగళవారం) శ్రీకారం చుట్టనుంది. ఆరోజు ఉదయం 11 గంటలకు జగ్గయ్యపేటలో బేస్ స్టేషన్‌ను ప్రారంభించి తక్కెళ్లపాడులో రీసర్వే పైలట్ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభిస్తారు. తదుపరి మండలంలోని 25 గ్రామాల్లోగల 66,761 ఎకరాల భూముల్లో రీసర్వే పూర్తి చేస్తారు. ఇక్కడ వచ్చే అనుభవాలతో అవసరమైన మార్పులతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం త్వరితగతిన ప్రక్రియను చేపట్టనుంది. రైతులపై నయాపైసా భారం లేదు: ఉప ముఖ్యమంత్రి బోస్ ప్రస్తుతం ఎవరైనా రైతు తన భూమిని సర్వే చేయించుకోవాలంటే మీసేవలో రుసుం చెల్లించాలి. అయితే భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టుకు రూ.2000 కోట్ల వ్యయం అవుతున్నా రైతులపై నయాపైసా కూడా భారం మోపకుండా మొత్తం ప్రభుత్వమే భరించాలని సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా దేశాల్లో వినియోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సమగ్ర రీ సర్వేకు వినియోగిస్తున్నట్టు బోస్ ‘సాక్షి’కి తెలిపారు. 2022 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి చేసి పటిష్టమైన నూతన రెవెన్యూ రికార్డులు రూపొందిస్తామన్నారు. -
ఇక ఆటోమ్యుటేషన్
సాక్షి, అమరావతి: భూయాజమాన్య హక్కుల మార్పిడి (మ్యుటేషన్) విషయంలో అవినీతిరహిత, పారదర్శక, సులభతర, సత్వర సేవల దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రిజిస్ట్రేషన్ దస్తావేజుల తయారీలో అవినీతి, దళారుల ప్రమేయం లేకుండా ఎవరి దస్తావేజులు వారే రాసుకునే పబ్లిక్ డేటా ఎంట్రీ (పీడీఈ) విధానాన్ని ఇటీవల అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం తాజాగా ఆటోమ్యుటేషన్ ప్రక్రియకు మంగళవారం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆటోమ్యుటేషన్ సేవల పోస్టర్‌ను మంగళవారం సచివాలయంలో విడుదల చేశారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్ల నమోదు (మ్యుటేషన్) కోసం మీసేవ కేంద్రాలకు వెళ్లి.. నిర్ధిష్ట రుసుం చెల్లించి.. పత్రాలన్నీ స్కాన్ చేసి సమర్పించాల్సి వస్తోంది. తర్వాత మళ్లీ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగడమే కాకుండా.. అక్కడి సిబ్బందికి ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వస్తోంది. ఎటువంటి ఫీజు చెల్లించకుండానే.. ఇకపై రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆ భూములను కొనుగోలుదారుల పేరుతో తాత్కాలికంగా నమోదు చేసేలా రిజిస్ట్రేషన్ అధికారులకు వీలు కల్పిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పట్టాదార్ పాస్‌బుక్ చట్టం – 1971’ను ప్రభుత్వం సవరించింది. ఇక నుంచి భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఆన్‌లైన్‌లోనూ, రెవెన్యూ రికార్డుల్లోనూ వారి పేర్ల నమోదు (మ్యుటేషన్) కోసం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. దరఖాస్తు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. అధికారులే రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మీభూమి పోర్టల్ (ఆర్ఓఆర్, 1బి, అడంగల్)లో తాత్కాలిక ప్రాతిపదికన నమోదు చేస్తారు. తదుపరి ఆ లావాదేవీపై అభ్యంతరాల స్వీకరణకు రెవెన్యూ అధికారులు 15 రోజులు గడువు ఇస్తారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయ అధికారులు చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేసి నెల రోజుల్లో శాశ్వత మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ భూమార్పిడి వివరాలను meebhoomi. ap. gov. in లో చూసుకునే సదుపాయాన్ని కల్పించారు. ప్రయోగాత్మకంగా మొదట కృష్ణా జిల్లా కంకిపాడులో.. ఆటోమ్యుటేషన్‌ను మొదట కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఇప్పుడు దీన్ని రాష్ట్రమంతా అమల్లోకి తెచ్చింది. నూతన విధానం ప్రకారం.. భూబదలాయింపు ప్రక్రియ ప్రతి దశలో పట్టాదారు మొబైల్‌కు సంక్షిప్త సమాచారం వస్తుంది. రిజిస్ట్రేషన్ జరిగిన 30 రోజుల్లో తహసీల్దార్ ధ్రువీకరించి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తారు. తర్వాత ఎలక్ట్రానిక్ పట్టాదారు పాస్ పుస్తకాన్ని మీభూమి వెబ్సైట్ నుంచి ప్రజలు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. – శ్రీధర్, రాష్ట్ర భూపరిపాలన సంయుక్త కమిషనర్ -
అక్కడ కుక్కలు, గుర్రాల పేరుతో భూములు!
పణజి: బిహార్‌లో రెవెన్యూ రికార్డులు సరిగా లేదని గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ వాఖ్యానించారు. మంగళవారం 70వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గోవా విశ్వవిద్యాలయం మైదాన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జమీందారీ నిర్మూలన చట్టం అమలు బిహార్‌లో సమర్థవంతంగా జరగలేదని పేర్కొన్నారు. మాలిక్ 2017-18 మధ్య కాలంలో బిహార్ గవర్నర్‌గా సేవలందించారు. బిహార్‌లో కుక్కలు, గుర్రాలు, కర్రల పేరుతో కూడా సొంత భూములు ఉన్నాయని తెలిపారు. జమీందారీ నిర్మూలన చట్టం ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే సమర్థవంతంగా అమలులో ఉందని పేర్కొన్నారు. తాను బిహార్ గవర్నర్‌గా పనిచేసిన కాలంలో.. రెవెన్యూ రికార్డులు సరిగా లేవని, అక్కడ కుక్కలు, గుర్రాలు, కర్రల పేరిట భూమి నమోదు చేయడాన్ని చూసి షాక్‌కు లోనయ్యానని చెప్పారు. జమీందారీ చట్టంలోని లోపాల వల్లే.. ఇప్పుడు అక్కడ కొంతమంది భూస్వాముల పేరిట 4,000-5,000 వరకు భిగా భూములు ఉన్నాయని వెల్లడించారు. జమీందారీ నిర్మూలన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసిన యూపీ మాజీ ముఖ్యమంత్రి చౌదరి చరణ్ సింగ్‌ను ఈ సందర్భంగా మాలిక్ కొనియాడారు. బిహార్ నుంచి జమ్మూకశ్మీర్‌కు గవర్నర్‌గా వెళ్లిన సత్యపాల్ మాలిక్.. ఇటీవల ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ నెలలో (నవంబర్) గోవాకు బదిలీ అయ్యారు. -
నువ్వెప్పుడో చచ్చావ్..పో..పో!
ఆమెను బతికుండగానే చంపేశారు. రెవెన్యూ రికార్డుల్లోనూ ఆమె ఇప్పటికే మృతి చెందినట్లు చూపిస్తున్నారు. చనిపోయావనే సాకుతో రెండేళ్లుగా ఆమెకు రేషన్ కూడా ఇవ్వడం లేదు. తాను బతికే ఉన్నానని, న్యాయం చేయాలని కాళ్లరిగేలా అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. సాక్షి, చిత్తూరు (గుర్రంకొండ): స్థానిక ఇందిరమ్మ కాలనీలో కె. పురుషోత్తం(33), కె. లక్ష్మీదేవి(23) దంపతులు నివాసముంటున్నారు. వీరికి కుమారుడు ఉన్నాడు. పశుపోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం గ్రామంలో నిర్వహించిన పల్స్‌సర్వేలో లక్ష్మీదేవి పేరు తొలగించారు. దీంతో రేషన్ దుకాణంలో ఆమెకు రేషన్‌ను నిలిపివేశారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ తహసీల్దార్ కార్యాలయానికి పరుగులు తీసింది. తమ రికార్డుల్లో మృతి చెందినట్లు నమోదై ఉందని రెవెన్యూ అధికారులు చెప్పడంతో హతాశురాలైంది. తాను బతికే ఉన్నానని, తమ కుటుంబానికి రేషన్ ఇచ్చి ఆదుకోవాలంటూ బాధితురాలు రెండేళ్ల క్రితం అర్జీ ఇచ్చింది. నాటి నుంచి ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా ఆమె గోడు అరణ్యరోదనే అయ్యింది. రికార్డుల్లో తప్పిదాన్ని సరిచేయకపోవడంతో రేషన్ అందక ఆమెకు జీవనానికి శాపమైంది. అంతేకాదు; ప్రభుత్వ పథకాల లబ్ధి కూడా ఆమెకు అందని పరిస్థితి. ఉన్నతాధికారులైనా స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది. -
మాట వినకపోతే.. శాల్తీ గల్లంతే..!
సాక్షి, ఒంగోలు : మేం చెప్పినట్లు చేయాల్సిందే.. మాట వినకపోతే శాల్తీ గల్లంతే.. రెవెన్యూ రికార్డులు మా పేర్ల మీద మార్చండి.. లేదంటే మీ అంతు చూస్తాం.. అంటూ మండల మెజిస్ట్రేట్‌పై కబ్జాదారులు బెదిరింపులకు దిగారు.. ఈ విధంగా బెదిరింపులకు పాల్పడింది అధికార పార్టీ నేతలో, వారి అనుయాయులో కాదు.. గత ఐదేళ్లలో ప్రభుత్వ భూములను ఆక్రమించి బ్యాంకుల్లో కోట్ల రూపాయల లోన్లు తీసుకుని అధికారిక దందా నడిపిన టీడీపీ నేతలు. అధికారం కోల్పోయినా వీరి తీరు మాత్రం మారలేదనడానికి లింగసముద్రం మండలంలో జరిగిన సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణలో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ భూ వివాదాలు అధికంగా ఉన్న లింగసముద్రం మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని 40 రెవెన్యూ బృందాలతో సర్వే మొదలు పెట్టారు. సర్వేలో టీడీపీ నేతల కబ్జా పర్వం బయటపడుతుండటంతో రికార్డులు మార్చాలంటూ తహసీల్దార్‌పై బెదిరింపులకు దిగారు. వారి హెచ్చరికలతో భయాందోళనకు గురైన తహసీల్దార్ తనను బదిలీ చేయాలంటూ ఆర్డీఓ, కలెక్టర్‌కు విన్నవించారు. కబ్జాదారులు తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారంటూ బహిరంగ సమావేశంలోనే తహసీల్దార్ వాపోయారంటే టీడీపీ నేతలు ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీడీపీ నేతలు ప్రకాశం జిల్లా, లింగసముద్రం మండలంలో పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి అప్పట్లో ఉన్న రెవెన్యూ అధికారుల ద్వారా ఆన్లైన్ చేయించేశారు. అంతటితో ఆగకుండా ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి కోట్ల రూపాయలు లోన్లు పొందారు. పెదపవని గ్రామంలో టీడీపీ నేతగా వ్యవహరిస్తున్న ఓ మాజీ వీఆర్ఓ ఒక్కడే 17 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారనేది బహిరంగ రహస్యమే. ఐదేళ్లలో సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టారంటే టీడీపీ నేతలు ఏస్థాయి దందాకు పాల్పడ్డారో అర్థమౌతుంది. ముఖ్యంగా మండలంలోని పెదపవని, తిమ్మారెడ్డిపాలెం, మొగిలిచర్ల, లింగసముద్రం, మాలకొండరాయునిపాలెం గ్రామాల్లో వాగు, కుంట, కాలువ, గయాలు, ఏడబ్ల్యూ, పశువుల మేత పోరంబోకులు, శ్మశానాలను సైతం వదలకుండా కబ్జా చేసేశారు. అప్పట్లో ఈ వ్యవహారం బయటపడినప్పటికీ కొందరిపై మాత్రమే చర్యలు తీసుకుని వదిలేశారు. ప్రభుత్వ భూములను భారీగా ఆక్రమించిన టీడీపీ నేతల జోలికి మాత్రం వెళ్లని పరిస్థితి. దీంతో ఇప్పటికీ ప్రభుత్వ భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోనే ఉండిపోయాయి. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ సర్వేలో భాగంగా కలెక్టర్ పోల భాస్కర్ భూ వివాదాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఎక్కువగా ఉన్న లింగసముద్రం మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని సర్వే మొదలు పెట్టారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి 40 రెవెన్యూ బృందాలను మండలంలో మోహరింపజేయడంతోపాటు కలెక్టర్ స్వయంగా అక్కడకు వెళ్లి సర్వేను పర్యవేక్షిస్తున్నారు. కబ్జా భాగోతాలు బయటకు రావడంతో తహసీల్దార్‌పై బెదిరింపుల పర్వం: రెవెన్యూ బృందాల పరిశీలనలో గత ఐదేళ్లలో టీడీపీ నేతలు చేసిన భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది. జిల్లా కలెక్టర పర్యవేక్షణలో సర్వే జరుగుతుండటంతో ఇక తమను కాపాడేవారు లేరని భావించిన టీడీపీ నేతలు కొందరు రెవెన్యూ రికార్డులు మార్చి తమ పేర్లు చేర్చాలంటూ తహసీల్దార్ రాఘవస్వామిపై బెదిరింపులకు దిగారు. చెప్పినట్లు వినకపోతే శాల్తీ గల్లంతేనంటూ హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన తహసీల్దార్ తనకు కబ్జా దారుల నుంచి ప్రాణహాని ఉందని, తనను బదిలీ చేయాలంటూ కందుకూరు ఆర్డీవో ఓబులేసు, కలెక్టర్ పోల భాస్కర్ల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనను బెదిరించిన వారి పేర్లు చెప్పేందుకు కూడా ఆయన బయపడుతున్న పరిస్థితి. కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదంటే టీడీపీ నేతలు తహసీల్దార్‌ను ఏస్థాయిలో బెదిరించారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని జిల్లాలో మరో ఘటన జరగకుండా అక్రమార్కులకు హెచ్చరిక పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
రెవెన్యూ రికార్డులు మాయం!
సాక్షి, కేశంపేట: తహసీల్దార్ కార్యాలయంలో ఎంతో భద్రంగా ఉండాల్సిన రెవెన్యూ రికార్డులు మాయమయ్యాయి. భూములకు సంబంధించిన ఫైళ్లు కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల అవినీతి కార్యకలాపాలతో వార్తల్లోకెక్కిన కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రస్తుతం కీలకమైన రికార్డులకు రెక్కలు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉద్దేశపూర్వకంగా ఫైళ్లను ఎక్కడికైనా తరలించారా? లేక నామరూపాలు లేకుండా చేశారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే జరిగితే దీని వెనుక ఉన్నదెవరు.. నడిపిస్తున్నవారెవరు? పైగా రికార్డులను మాయం చేయాల్సిన అవసరం ఏముంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికితోడు అధికారులు సైతం నోరు మెదపకపోవడం మరిన్ని సందేహాలను రేకెత్తిస్తోంది. మా రికార్డులు ఇవ్వండి మహాప్రభో అంటూ కార్యాలయం చుట్టూ అన్నదాతలు నిత్యం తిరుగుతున్నా అధికారుల్లో స్పందన లేదు. మూడేళ్ల రికార్డులు ఎక్కడ.. భూమి కొనుగోలు చేస్తే ఆ భూమికి సంబంధించి పట్టా మార్పిడి చేయాల్సి ఉంటుంది. సదరు భూమి రైతుకు ఎలా దక్కిందో తెలిపే పహాణీలు అవసరం. అదేవిధంగా వారసత్వంగా వచ్చిన భూమిని విరాసత్ చేసుకున్న వాటికి సంబంధించిన ఫైళ్లు రెవెన్యూ కార్యాలయాల్లో ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములను మ్యూటేషన్ చేసుకోవాలంటే ఆ భూమికి చెందిన పత్రాలు రెవెన్యూ కార్యాలయంలో లభ్యమవుతాయి. ఈ కీలకమైన రికార్డులను తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు భద్రపరుస్తారు. అయితే అవి కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో కనిపించడం లేదు. 2016 తర్వాత జరిగిన భూ లావాదేవీలకు సంబంధించి విరాసత్, భూ పట్టా మార్పిడి మ్యూటేషన్ తదితర రికార్డుల జాడ తెలియడం లేదు. భూ పత్రాల నకళ్ల కోసం రైతులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. మీరే వెతుక్కోండి.. కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన ఓ రైతు తనకు 2016లో ఇచ్చిన ప్రొసీడింగ్ జిరాక్స్ కావాలని అధికారులకు రెండు నెలల క్రితం వినతిపత్రం అందజేశాడు. ఇంతవరకు అధికారుల నుంచి జిరాక్స్ కాపీ అందకపోవడంతో వారిని నిలదీశాడు. మూడేళ్ల కాలానికి సంబంధించి రికార్డులు ఈ కార్యాలయంలో అందుబాటులో లేవని అధికారులు సమాధానమిచ్చారు. ‘నీకు ఓపిక ఉంటే.. ఆఫీస్‌లో నువ్వే వెతుక్కో’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. కాగా, ఈ విషయమై ఇన్చార్జి తహసీల్దార్ ఆంజనేయులు మాట్లాడుతూ.. 2016 సంవత్సరం నుంచి ఫైళ్లు కార్యాలయంలోనే ఉన్నాయి. ఎవరికైనా భూ రికార్డుల నకలు కావాలంటే వారికి అందిస్తాం’ అని చెప్పారు. విసుగు చెందిన రైతులు.. నిలదీస్తే ఫైళ్లు లేవని బాధ్యతారహితంగా అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. ఇంటి దొంగలపై అనుమానాలు.. తమ తప్పులు ఎక్కడ వెలుగులోకి వస్తాయోనన్న భయంతో రెవెన్యూ అధికారులే రికార్డులు దాచిపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అవినీతి సొమ్ముతో ఏసీబీకి తహసీల్దార్ లావణ్య పట్టుబడిన తర్వాతే రికార్డులు మాయమవటం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఆమెకు సహకరించిన ఉద్యోగులే ఈ పని చేసి ఉంటారా అనే చర్చజరుగుతోంది. పైగా 2016లో లావణ్య ఇక్కడ పోస్టింగ్ పొందారు. అంటే తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్నాక జరిగిన లావాదేవీలకు సంబంధించిన రికార్డులు మాత్రమే కార్యాలయంలో లేకపోవడంతో ఇంటి దొంగలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. రైతుల నుంచి డబ్బులు దండుకుని నిబంధనలకు విరుద్ధంగా ఫైళ్లు కదిలించారన్న ఆరోపణలు ఆమెపై పెద్దఎత్తున వచ్చాయి. ఈ క్రమంలోనే తహసీల్దార్ కార్యాలయంలోని కొన్ని కీలక ఫైళ్లను ఏసీబీ అధికారులు విస్తృతంగా పరిశీలించారు. మళ్లీ ఏసీబీ నుంచి ఎటువంటి ముప్పయినా రావొచ్చన్న భయంతో రెవెన్యూ సిబ్బందే రికార్డులను తరలించి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఊళ్లకు ఊళ్లు మాయం !
సాక్షి, హైదరాబాద్ : మనుషులు అదృశ్యం కావడం.. వస్తువులు కనిపించకుండా పోవడం గురించి విన్నాం. అయితే ఇక్కడ ఏకంగా ఊళ్లకు ఊళ్లే మాయమయ్యాయి. అదెలా అని ఆశ్చర్య పోతున్నారా?.. మన రెవెన్యూ అధికారుల నిర్వాకంతో ఇది సాధ్యమైంది. జనాభా లెక్కల సేకరణతో అసలు విషయం వెలుగుచూసింది. 2021 జనగణనకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో 2011 సెన్సెస్‌ను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఆ జాబితా ఆధారంగా గ్రామాల వారీగా జనాభా వివరాల సేకరణకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో కొన్ని గ్రామాలు కనిపించకుండా పోవడంతో కేంద్ర జనగణన శాఖ అవాక్కయ్యింది. ఏకంగా ఊళ్లు మాయం కావడాన్ని సీరియస్‌గా పరిగణించింది. 2011 జనాభా లెక్కల అనంతరం ఏర్పడిన 23 జిల్లాలు కలుపుకొని.. మొత్తం 14 జిల్లాల పరిధిలో 460 గ్రామాలు, 2 మున్సిపాలిటీల పేర్లు గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర జనగణనశాఖ జాయింట్ డైరెక్టర్ హెలెన్ ప్రేమకుమారి.. సదరు గ్రామాలను డీనోటిఫై చేశారా?.. అలాగే కొత్తగా జాబితాలో 38 పంచాయతీలు చేర్చిన వైనాన్ని ప్రశ్నిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖాస్త్రం సంధించడం గమనార్హం. ఒకవేళ కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో చేరిస్తే.. ఆ వివరాలు పంపాలని కోరారు. రెవెన్యూ లెక్క తప్పింది ! జిల్లాల పునర్విభజన అంశంతో కొన్ని పల్లెల వివరాలు రెవెన్యూ రికార్డుల నుంచి మాయమయ్యాయి. భౌతికంగా ఆ పల్లెలు యథాస్థానంలో ఉన్నా రికార్డుల నుంచి కనిపించకుండాపోవడం కలకలం సృష్టించడమే కాదు, అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. 2016లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేస్తూ జీఓ 221 నుంచి 250లను జారీ చేసింది. జీఓల్లో గ్రామాలకు గ్రామాలే గల్లంతయ్యాయి. జిల్లా కేంద్రాలుగా ఏర్పడ్డ 2 మున్సిపాలిటీల పేర్లు కూడా కనిపించకుండా పోయా యి. పోనీ, ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారా! అంటే అదీ లేదు. 2021 జనాభా లెక్కల సేకరణకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయా జిల్లాల్లోని గ్రామాల జాబితాను పరిశీలిస్తున్న క్రమంలో 58 మండలాల పరిధిలోని 460 గ్రామాలతోపాటు వనపర్తి, గద్వాల మున్సిపాలిటీల సమాచారం కూడా గల్లంతుకావడంతో జనగణన అధికారులు నివ్వెరపోయారు. ఈ విషయాన్ని గత మార్చిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేసింది. ఈ గ్రామాలున్నాయా? రద్దు చేశా రా? కొత్తగా 38 గ్రామాలను ఏర్పాటు చేశా రు కదా.. వాటికి సంబంధించి ఉత్తర్వు కాపీలను పంపమని సూచించింది. భారత్–2021 జనాభా లెక్కలకు సంబంధించి ఈ ఏడాది చివరి నాటికి గ్రామాల హద్దులను ప్రకటించాల్సి ఉన్నందున తక్షణమే వివరాలను నివేదించాలని కోరింది. కేంద్రం లేఖతో తేరుకున్న రెవెన్యూ శాఖ.. గ్రామాల గల్లంతుపై దృష్టి సారించింది. గత జూన్‌లో సీఎస్ జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా ఈ అంశంపై చర్చించారు. కేంద్రం పంపిన జాబితాలో గల్లంతైనట్లు గుర్తించిన గ్రామాలపై మండలాలవారీగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 589 తహసీల్దార్లలో కేవలం 167 మంది, 142 మున్సిపాలిటీల్లో 30 మంది మాత్రమే స్పందించారు.