సాక్షి, హైదరాబాద్ : మనుషులు అదృశ్యం కావడం.. వస్తువులు కనిపించకుండా పోవడం గురించి విన్నాం. అయితే ఇక్కడ ఏకంగా ఊళ్లకు ఊళ్లే మాయమయ్యాయి. అదెలా అని ఆశ్చర్య పోతున్నారా?.. మన రెవెన్యూ అధికారుల నిర్వాకంతో ఇది సాధ్యమైంది. జనాభా లెక్కల సేకరణతో అసలు విషయం వెలుగుచూసింది. 2021 జనగణనకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో 2011 సెన్సెస్‌ను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఆ జాబితా ఆధారంగా గ్రామాల వారీగా జనాభా వివరాల సేకరణకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో కొన్ని గ్రామాలు కనిపించకుండా పోవడంతో కేంద్ర జనగణన శాఖ అవాక్కయ్యింది. ఏకంగా ఊళ్లు మాయం కావడాన్ని సీరియస్‌గా పరిగణించింది.
2011 జనాభా లెక్కల అనంతరం ఏర్పడిన 23 జిల్లాలు కలుపుకొని.. మొత్తం 14 జిల్లాల పరిధిలో 460 గ్రామాలు, 2 మున్సిపాలిటీల పేర్లు గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర జనగణనశాఖ జాయింట్ డైరెక్టర్ హెలెన్ ప్రేమకుమారి.. సదరు గ్రామాలను డీనోటిఫై చేశారా?.. అలాగే కొత్తగా జాబితాలో 38 పంచాయతీలు చేర్చిన వైనాన్ని ప్రశ్నిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖాస్త్రం సంధించడం గమనార్హం. ఒకవేళ కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో చేరిస్తే.. ఆ వివరాలు పంపాలని కోరారు.
రెవెన్యూ లెక్క తప్పింది !
జిల్లాల పునర్విభజన అంశంతో కొన్ని పల్లెల వివరాలు రెవెన్యూ రికార్డుల నుంచి మాయమయ్యాయి. భౌతికంగా ఆ పల్లెలు యథాస్థానంలో ఉన్నా రికార్డుల నుంచి కనిపించకుండాపోవడం కలకలం సృష్టించడమే కాదు, అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. 2016లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేస్తూ జీఓ 221 నుంచి 250లను జారీ చేసింది. జీఓల్లో గ్రామాలకు గ్రామాలే గల్లంతయ్యాయి. జిల్లా కేంద్రాలుగా ఏర్పడ్డ 2 మున్సిపాలిటీల పేర్లు కూడా కనిపించకుండా పోయా యి. పోనీ, ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారా! అంటే అదీ లేదు. 2021 జనాభా లెక్కల సేకరణకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆయా జిల్లాల్లోని గ్రామాల జాబితాను పరిశీలిస్తున్న క్రమంలో 58 మండలాల పరిధిలోని 460 గ్రామాలతోపాటు వనపర్తి, గద్వాల మున్సిపాలిటీల సమాచారం కూడా గల్లంతుకావడంతో జనగణన అధికారులు నివ్వెరపోయారు. ఈ విషయాన్ని గత మార్చిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేసింది. ఈ గ్రామాలున్నాయా? రద్దు చేశా రా? కొత్తగా 38 గ్రామాలను ఏర్పాటు చేశా రు కదా.. వాటికి సంబంధించి ఉత్తర్వు కాపీలను పంపమని సూచించింది. భారత్–2021 జనాభా లెక్కలకు సంబంధించి ఈ ఏడాది చివరి నాటికి గ్రామాల హద్దులను ప్రకటించాల్సి ఉన్నందున తక్షణమే వివరాలను నివేదించాలని కోరింది. కేంద్రం లేఖతో తేరుకున్న రెవెన్యూ శాఖ.. గ్రామాల గల్లంతుపై దృష్టి సారించింది. గత జూన్‌లో సీఎస్ జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా ఈ అంశంపై చర్చించారు. కేంద్రం పంపిన జాబితాలో గల్లంతైనట్లు గుర్తించిన గ్రామాలపై మండలాలవారీగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 589 తహసీల్దార్లలో కేవలం 167 మంది, 142 మున్సిపాలిటీల్లో 30 మంది మాత్రమే స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment