సాక్షి, కేశంపేట: తహసీల్దార్ కార్యాలయంలో ఎంతో భద్రంగా ఉండాల్సిన రెవెన్యూ రికార్డులు మాయమయ్యాయి. భూములకు సంబంధించిన ఫైళ్లు కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల అవినీతి కార్యకలాపాలతో వార్తల్లోకెక్కిన కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రస్తుతం కీలకమైన రికార్డులకు రెక్కలు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉద్దేశపూర్వకంగా ఫైళ్లను ఎక్కడికైనా తరలించారా? లేక నామరూపాలు లేకుండా చేశారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే జరిగితే దీని వెనుక ఉన్నదెవరు.. నడిపిస్తున్నవారెవరు? పైగా రికార్డులను మాయం చేయాల్సిన అవసరం ఏముంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికితోడు అధికారులు సైతం నోరు మెదపకపోవడం మరిన్ని సందేహాలను రేకెత్తిస్తోంది. మా రికార్డులు ఇవ్వండి మహాప్రభో అంటూ కార్యాలయం చుట్టూ అన్నదాతలు నిత్యం తిరుగుతున్నా అధికారుల్లో స్పందన లేదు.
మూడేళ్ల రికార్డులు ఎక్కడ..
భూమి కొనుగోలు చేస్తే ఆ భూమికి సంబంధించి పట్టా మార్పిడి చేయాల్సి ఉంటుంది. సదరు భూమి రైతుకు ఎలా దక్కిందో తెలిపే పహాణీలు అవసరం. అదేవిధంగా వారసత్వంగా వచ్చిన భూమిని విరాసత్ చేసుకున్న వాటికి సంబంధించిన ఫైళ్లు రెవెన్యూ కార్యాలయాల్లో ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములను మ్యూటేషన్ చేసుకోవాలంటే ఆ భూమికి చెందిన పత్రాలు రెవెన్యూ కార్యాలయంలో లభ్యమవుతాయి. ఈ కీలకమైన రికార్డులను తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు భద్రపరుస్తారు. అయితే అవి కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో కనిపించడం లేదు. 2016 తర్వాత జరిగిన భూ లావాదేవీలకు సంబంధించి విరాసత్, భూ పట్టా మార్పిడి మ్యూటేషన్ తదితర రికార్డుల జాడ తెలియడం లేదు. భూ పత్రాల నకళ్ల కోసం రైతులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
మీరే వెతుక్కోండి..
కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన ఓ రైతు తనకు 2016లో ఇచ్చిన ప్రొసీడింగ్ జిరాక్స్ కావాలని అధికారులకు రెండు నెలల క్రితం వినతిపత్రం అందజేశాడు. ఇంతవరకు అధికారుల నుంచి జిరాక్స్ కాపీ అందకపోవడంతో వారిని నిలదీశాడు. మూడేళ్ల కాలానికి సంబంధించి రికార్డులు ఈ కార్యాలయంలో అందుబాటులో లేవని అధికారులు సమాధానమిచ్చారు. ‘నీకు ఓపిక ఉంటే.. ఆఫీస్‌లో నువ్వే వెతుక్కో’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. కాగా, ఈ విషయమై ఇన్‌చార్జి తహసీల్దార్ ఆంజనేయులు మాట్లాడుతూ.. 2016 సంవత్సరం నుంచి ఫైళ్లు కార్యాలయంలోనే ఉన్నాయి. ఎవరికైనా భూ రికార్డుల నకలు కావాలంటే వారికి అందిస్తాం’ అని చెప్పారు. విసుగు చెందిన రైతులు.. నిలదీస్తే ఫైళ్లు లేవని బాధ్యతారహితంగా అధికారులు పేర్కొంటుండటం గమనార్హం.
ఇంటి దొంగలపై అనుమానాలు..
తమ తప్పులు ఎక్కడ వెలుగులోకి వస్తాయోనన్న భయంతో రెవెన్యూ అధికారులే రికార్డులు దాచిపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అవినీతి సొమ్ముతో ఏసీబీకి తహసీల్దార్ లావణ్య పట్టుబడిన తర్వాతే రికార్డులు మాయమవటం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఆమెకు సహకరించిన ఉద్యోగులే ఈ పని చేసి ఉంటారా అనే చర్చజరుగుతోంది. పైగా 2016లో లావణ్య ఇక్కడ పోస్టింగ్ పొందారు. అంటే తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్నాక జరిగిన లావాదేవీలకు సంబంధించిన రికార్డులు మాత్రమే కార్యాలయంలో లేకపోవడంతో ఇంటి దొంగలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. రైతుల నుంచి డబ్బులు దండుకుని నిబంధనలకు విరుద్ధంగా ఫైళ్లు కదిలించారన్న ఆరోపణలు ఆమెపై పెద్దఎత్తున వచ్చాయి. ఈ క్రమంలోనే తహసీల్దార్ కార్యాలయంలోని కొన్ని కీలక ఫైళ్లను ఏసీబీ అధికారులు విస్తృతంగా పరిశీలించారు. మళ్లీ ఏసీబీ నుంచి ఎటువంటి ముప్పయినా రావొచ్చన్న భయంతో రెవెన్యూ సిబ్బందే రికార్డులను తరలించి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment