
సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్. చిత్రంలో కేటీఆర్, సబిత, మాగంటి గోపీనాథ్
మోదీ సర్కారు ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందో తెలుసు
బీజేపీ అసలు స్వరూపాన్ని జనం అర్థం చేసుకుంటున్నారు
ఎర్రవల్లిలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజలు మెచ్చి అధికారం ఇవ్వాల్సిందే తప్ప..దాని కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం తమకు లేదని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాజకీయంగా నైతిక విలువలు పాటిస్తూ ప్రజలతో మమేకమైతే మరో మూడేళ్లలో అధికారం మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ మహాసభ ఏర్పాట్లకు సంబంధించి శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ‘బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతోపాటు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ను సంప్రదిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్డదారిలో ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి వచ్చారో చాట్ జీపీటీ, గూగుల్‌లో వెతికినా తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైంది. కొందరు అవగాహన రాహిత్యంతో బీజేపీ మెరుగవుతుందని అనుకుంటున్నారు. కానీ ఆ పార్టీ క్రమంగా బలహీనమవుతోంది. అబద్ధాలను ప్రచారం చేసి ఎక్కువ కాలం అధికారంలో కొనసాగుతానని బీజేపీ భ్రమపడింది. వాపును చూసి బలుపు అనుకున్న బీజేపీ అసలు స్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ప్రతిష్టాత్మకంగా జన సమీకరణ
ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు దూరాభారాన్ని దృష్టిలో పెట్టుకుంటూ జన సమీకరణపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలను కేసీఆర్ ఆదేశించారు. సమావేశంలో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ లు శంభీపూర్ రాజు, నవీన్‌రావు, వాణిదేవి, దా సోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్‌లతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పార్టీ నేత కల్వకుంట్ల వంశీధర్‌రావు ఎర్రవల్లిలో జరుగుతున్న సమావేశాలను సమన్వయం చేస్తున్నారు.