erravelli
-
బీఆర్ఎస్ నేతలతో భేటీ.. కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. పలు అంశాలపై ఆయన చర్చించారు. ఎమ్మెల్సీగా ఎవర్ని నిలపాలన్న విషయంపై అభిప్రాయాలను కేసీఆర్ తీసుకున్నారు. యాసంగి పంటకు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి నిర్ణయించారు. హామీల అమలుకై పోరాటాలకు కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్ సూచించారు.బహిరంగ సభపై పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్.. ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలని బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై రేవంత్ సర్కార్‌ను నిలదీయాలని కేసీఆర్ సూచించారు. -
కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్.. ఎర్రవెల్లి చేరుకున్న గులాబీ నేతలు
సాక్షి, సిద్దిపేట: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ఎర్రవల్లికి చేరుకుంటున్నారు.కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు ఎర్రవల్లికి వస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు వెంకట్రామి రెడ్డి, నవీన్ కుమార్ కుమార్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు ఎర్రవల్లి చేరుకున్నారు. -
ఎర్రవల్లి ఫాంహౌస్‌కు మంత్రి పొన్నం.. కేసీఆర్ ఏమన్నారంటే?
సాక్షి, సిద్ధిపేట: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. సిద్ధిపేట ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లిన పొన్నం.. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. గంటా 15 నిమిషాల పాటు ఇరువురి సమావేశం సాగింది. కేసీఆర్‌ని కలిసిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రభుత్వం తరుఫున కేసీఆర్‌ని కలిసి ఆహ్వానించామని తెలిపారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. భోజన సమయంలో వచ్చారు లంచ్ చేయమంటూ కేసీఆర్ కోరారు. దీంతో ఆయనతో కలిసి భోజనం చేసాము.. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు అన్ని పార్టీల వారీగా ఆహ్వానిస్తున్నాము. అందులో భాగంగా కేసీఆర్‌ని కూడా ఆహ్వానించాము.తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలా వద్దా అనేది ఆయన.. పార్టీ శ్రేణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ తల్లి ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారని కోరుకుంటున్నా. తెలంగాణలో పార్టీల మధ్య రాజకీయాలు వుండొన్చు.. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలు సహకరించాలి’’ అని పొన్నం విజ్ఞప్తి చేశారు. -
కేసీఆర్ ను కలిసిన కవిత.. కాళ్లకు నమస్కరించి భావోద్వేగం
-
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణ చేపడతాం: మధుయాష్కీ
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. త్వరలోనే కేసీఆర్ ఫామ్ హౌస్‌పై విచారణ చేసి అవినీతిని వెలికితీస్తామని హెచ్చరిక చేశారు. దీంతో, తెలంగాణలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. కాగా, మధు యాష్కీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్ నేతలు గుంట నక్కలా వేచి చూస్తున్నారు. కానీ, మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. అనేక మంది విపక్ష ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పార్టీ గెలుపు కోసం పనిచేస్తాను. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష పదవి ప్రస్తుతం ఖాళీగా లేదు. అధిష్టానం బాధ్యతలు ఇస్తే నిర్వహిస్తాను’ అని స్పష్టం చేశారు. -
కేసీఆర్ కోసం చింతమడక ప్రజల పడిగాపులు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ తాజా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలవడానికి వెళ్లిన చింతమడక వాసులు వేచిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. దీంతో చాలా సేపు బయటే ఎదురు చూడాల్సి వచ్చింది చింతమడక వాసులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు ఆయన స్వగ్రామం చింతమడక నుంచి 500 మంది.. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వచ్చారు. అయితే ఫామ్ హౌజ్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వాళ్లను అడ్డుకున్నారు. అనుమతి లేనిదే లోపలికి పంపమని చెప్పారు. దీంతో లోపలి నుంచి అనుమతి వచ్చేంత వరకు వాళ్లు అక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు మూడు గంటల పాటు వాళ్లు ఫామ్‌హౌజ్ చెక్‌పోస్ట్ వద్ద ఆగిపోవడంతో.. ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత లోపలి నుంచి అనుమతి రావడంతో వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినా.. బీఆర్ఎస్ అధ్యక్ష హోదాతో పాటు తాజా మాజీ సీఎం కావడంతో ఇంకా సెక్యూరిటీ కొనసాగుతోంది. -
ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి ఇలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు. సోమవారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో గెలిచిన ఎమ్మెల్యేతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు. వచ్చే నెల 16వ తేదీ దాకా మన ప్రభుత్వం కొనసాగేందుకు అవకాశం ఉంది(తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి గడువు జనవరి 16వ తేదీ దాకా ఉంది). కానీ, ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నాం. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరగుతుందో చూద్దాం’’ అని అన్నట్లు తెలుస్తోంది. అలాగే.. త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ మీటింగ్ జరుపుదాం. ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేద్దాం. అదే మీటింగ్‌లో బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతను ఎన్నుకుందాం అని ఆయన ఎమ్మెల్యేలతో అన్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన వాళ్లలో నెగ్గిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్లు ఉన్నారు. -
కేసీఆర్ కోసం ఫామ్‌హౌజ్‌కు ఎమ్మెల్యేలు
సాక్షి, మెదక్: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిసేందుకు సిద్ధమయ్యారు. సోమవారం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయిన అనంతరం.. అటు నుంచే అటే ఎర్రవెల్లికి బయల్దేరారు. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో ఉన్న కేసీఆర్‌ను కలిసి ఎన్నికల ఫలితాలపై వాళ్లు చర్చించనున్నారు. అలాగే.. పార్టీ కార్యాచరణ గురించి వాళ్లు చర్చించనున్నట్లు సమాచారం. గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్లు కూడా వాళ్ల వెంట ఫామ్‌హౌజ్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. -
ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ ఆకస్మిక సమావేశం
సాక్షి, సిద్ధిపేట(మెదక్): ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో సీఎం కేసీఆర్ శనివారం అకస్మిక భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎస్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సబితా ఇద్రారెడ్డి, హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కవిత హాజరైనట్లు తెలుస్తోంది. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఫామ్‌హౌజ్‌కు చేరుకున్నారు. ఈ భేటీలో పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయ చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్ల విడుదల, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు, వైఖరిపై సమీక్షించనున్నట్లు సమాచారం. చదవండి: బీజేపీ ‘ముందస్తు’ వ్యూహం! -
ఆస్తుల వివరాలను నమోదు చేసుకున్న కేసీఆర్
సాక్షి, సిద్దిపేట : తెలంగాణ వ్యాప్తంగా ఆస్తుల ఆన్లైన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పలు కీలక సంస్కరణల్లో భాగంగా గ్రామ స్థాయి నుంచి నివాస వివరాలను గ్రామ అధికారులు నమోదు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తులను నమోదు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన నివాసంలో ఆస్తుల వివరాలను శనివారం సీఎం స్వయంగా వెల్లడించారు. గృహ వివరాలతో పాటు వ్యవసాయేతర వివరాలను ఎర్రవల్లి గ్రామ కార్యదర్శి సిద్దేశ్వర్‌కు తెలియజేశారు. తనకున్న ఆస్తి వివరాల పత్రాలను చూపెట్టి ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు. సాధారణ పౌరుడిగానే అంగు ఆర్భాటాలు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తులను వివరించారు. ఈనెల 15లోపు ప్రతిఒక్కరు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సీఎం సూచించారు. (వెంటాడుతున్న గతం.. ఓటమి తప్పదా?) ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ, పుర ప్రజలు తమ స్థిరాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రత కల్పించేందుకే ఈ కార్యక్రమం. ఆస్తుల నమోదు అనేది దేశంలోనే మొట్టమొదటి, అతి పెద్ద ప్రయత్నం. సాగుభూముల తరహాలోనే వ్యవసాయేతర భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తాం’’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రత కల్పించేందుకు వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబం స్థిరాస్తుల వివరాలను విధిగా నమోదు చేసుకోవాలన్నారు. ఆస్తుల నమోదు అనేది దేశంలోనే మొట్టమొదటి అతి పెద్ద ప్రయత్నమని చెప్పారు. సాగు భూముల తరహాలోనే వ్యవసాయేతర భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. మరోవైపు దసరా నాటికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పునఃప్రారంభించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం కార్డ్ విధానంలో అమలవుతున్న రిజిస్ట్రేషన్ల విధానాన్ని ధరణి పోర్టల్‌లోకి మార్చే ప్రక్రియలో సబ్ రిజిస్ట్రార్లు బిజీగా ఉన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. సర్వే నంబర్, ఇంటి నంబర్లవారీగా భూములు, ఆస్తుల విలువలను వాటి ఎదుటి కాలమ్‌లో నమోదు చేస్తున్నారు. రెండు వారాల క్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ మంగళవారం నాటికి పూర్తి కానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్థానిక సంస్థలు కూడా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల నమోదు ప్రక్రియను ‘ధరణి’లోకి అప్లోడ్ చేసే ప్రక్రియను సమాంతరంగా చేపడుతున్నాయి. -
ఆలుగడ్డ సాగు ఎలా ఉంది?
జహీరాబాద్: ‘ఆలుగడ్డ విత్తనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు.. పంట దిగుబడులు ఎలా ఉన్నాయి. గిట్టుబాటు అవుతుందా?’అని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. ఆలుగడ్డ, అల్లం పంటల సాగు విధానం, రైతులు సాధిస్తున్న దిగుబడులు, మార్కెటింగ్ విధానం గురించి ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కొందరు రైతులు కేసీఆర్‌ను కలిశారు. దాదాపు నాలుగు గంటల పాటు వారు సీఎంతో గడిపారు. జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన రైతులు వెంకట్రాంరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, బద్ది రామ్‌రెడ్డి, బద్రేశ్, కోహీర్ మండలం పైడిగుమ్మల్ గ్రామానికి చెందిన రైతు వై.జయసింహారెడ్డి సీఎంను కలసిన వారిలో ఉన్నారు. అయితే.. ముఖ్యమంత్రే స్వయంగా వారిని పిలిపించుకున్నట్లు తెలిసింది. రైతులతో పాటు సంగారెడ్డి జిల్లా ఉద్యానవన అధికారి సునీత, జహీరాబాద్ అధికారి అనూషలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ప్రాం తంలో సాగవుతున్న పంటల గురించి ముఖ్యమంత్రి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆలుగడ్డ సాగుపై ఆరా తీసిన కేసీఆర్.. ఈ పంట మరింత విస్తరించాల్సిన ఆవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలిసింది. గత సంవత్సరం తగినంత మేర వర్షాలు లేక ఆలుగడ్డ పంట సాగు భారీగా పడిపోయిందని రైతులు సీఎంకు వివరించారు. కాగా, ఆలుగడ్డ, అల్లం పంటలను మార్కెట్‌కు తరలిస్తే కమీషన్ ఏజెంట్లు 10 శాతం మేర కమీషన్ వసూలు చేస్తున్నారని రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన స్పందిస్తూ.. రైతుల ఇబ్బందులను దూరం చేసేందుకే క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, దీంతో రైతులకు రానున్న రోజుల్లో తగిన మేలు కలుగుతుందని చెప్పినట్లు తెలిసింది. రెండేళ్లలో రైతుల కష్టాలకు చెక్ రైతులను దళారీ వ్యవస్థ నుంచి బయట పడేసేందుకు వీలుగా క్లస్టర్ వ్యవస్థ పని చేస్తుందని, రానున్న రెండేళ్లలో రైతుల కష్టాలు తీరుతాయని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. రైతులు పండించిన పంటను నేరుగా రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్లే పరిస్థితి రానున్న రోజుల్లో వస్తుందని చెప్పినట్లు తెలిసింది. కొన్ని సందర్భాల్లో ఆలుగడ్డ పంట చేతికి అందివచ్చినప్పుడు ధరలు ఉండడం లేదని, తమ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తే పంటను నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీల సౌకర్యం కల్పించాల్సి ఉందని, ఈ దిశలో తమ ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని సీఎం పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో నీటి వసతులు లేవని, దీంతో తగిన మేర పంటలను సాగుచేయలేకపోతున్నట్లు రైతులు వివరించారు. ఇందుకు సీఎం స్పందిస్తూ.. సింగూరు నుంచి జహీరాబాద్‌తో పాటు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు సాగునీటిని అందించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడంతోపాటు సాగునీటి వసతులను కల్పించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం రైతులతో చెప్పారు. చెరకు పంట సాగుపై ఆరా కాగా, చెరకు పంట సాగు ఏ మేరకు ఉంది.., ఎంత వరకు దిగుబడులు వస్తున్నాయని కేసీఆర్ రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు సుమారుగా 40 నుంచి 50 టన్నుల మేర పంట దిగుబడి వస్తున్నట్లు వారు వివరించారు. జిల్లాలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నా యనే విషయమై సీఎం ఉద్యానవన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అరటి, బొప్పాయి, కూరగాయల సాగుపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా తాము పండించిన అల్లం, పసుపు పంటను రైతులు సీఎం కేసీఆర్‌కు అందజేశారు. రైతులు పండించిన అల్లం పంట నాణ్యత బాగా ఉందని సీఎం మెచ్చుకున్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్‌ను కలసిన జహీరాబాద్ ప్రాంత రైతులు -
అవయవదానంలోనూ ‘ఎర్రవల్లి’ స్ఫూర్తి
జగదేవ్‌పూర్ (గజ్వేల్): ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో 35 మంది అవయవదానానికి ముందుకొచ్చారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ భాగ్యభిక్షపతి ఆధ్వర్యంలో మొత్తం 35 మంది యువకులు, మహిళలు కలిసి అవయవదానాలు చేస్తామని గాంధీ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ ఎర్రవల్లిని బంగారువల్లిగా మార్చారని, అందుకు కృతజ్ఞతగా తాము అవయవదానం చేసేందుకు ముందుకొచ్చామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాగ్య, వీడీసీ సభ్యులు బాల్‌రాజు, కరుణాకర్‌రెడ్డి, నవీన్, శ్రీశైలం, దాసు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు స్వచ్ఛత శక్తి పురస్కారం
జగదేవ్‌పూర్ (గజ్వేల్): దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు స్వచ్ఛతా శక్తి అవార్డులకు ఎంపికయ్యాయి. ప్రథమ బహుమతిని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి అందుకున్నారు. ద్వితీయ బహుమతి తమిళనాడు రాష్ట్రం దక్కించుకుంది. ‘స్వచ్ఛ సుందర్ శౌచాలయ్’లో భాగంగా ఇటీవల కేంద్ర బృందం ఎర్రవల్లి గ్రామాన్ని సందర్శించి డాక్యుమెంటరీ తీసింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. హరియాణా రాష్ట్రంలోని కురుక్షేత్రం గ్రామంలో మంగళవారం జరిగిన స్వచ్ఛ శక్తి పురస్కారం అందజేత కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛత శక్తి అవార్డును సర్పంచ్ భాగ్యలక్ష్మికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 128 మంది మహిళా సర్పంచ్‌లతోపాటు జిల్లా నుంచి స్వచ్ఛభారత్ మిషన్ కో ఆర్డినేటర్ చెన్నారెడ్డి, కొండపాక సర్పంచ్ మాధురి, మిట్టపల్లి సర్పంచ్ వరలక్ష్మి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ చండీయాగం
-
నాలుగో రోజు చండీయాగం
-
నాలుగో రోజు శాస్త్రోక్తంగా చండీయాగం
సాక్షి, మెదక్: లోక కళ్యాణార్ధం ముఖ్యమంత్రి కేసీఆర్ చేయిస్తున్న సహస్ర చండీయాగం నాలుగోరోజూ శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. ఉదయం పూజానంతరం 300 చండీ పారాయణాలు పూర్తి చేశారు. హోమంలో భాగంగా అరుణ పారాయణ మహాసారం, పంచ కాఠకముల పారాయణాలు, నవగ్రహ జపానుష్టానాలు, మహా మృత్యుంజయ జపం నిర్వహిస్తున్నారు. రేపు (శుక్రవారం) పూర్ణాహుతితో చండీయాగం పూర్తవుతుంది. -
మూడో రోజు కొనసాగుతున్న సహస్ర చండీయాగం
సాక్షి, మెదక్: సర్వజనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ చేయిస్తున్న చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం మూడో రోజుకు చేరుకుంది. వేదపారాయణాలు, వేదమంత్రాలతో ఎర్రవల్లి వ్యవసాయం క్షేత్రం ప్రతిధ్వనిస్తోంది. ఇప్పటివరకూ 200 చండీ పారాయణాలు పూర్తి అయ్యాయి. వేదఘోషతో ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రం, చండీయాగ వేదిక మారుమోగుతోంది. తెలంగాణ ప్రజల సుఖసంతోషాలతో జీవించాలంటూ సీఎం కేసీఆర్ సంకల్పించిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం పంచాహ్నిక దీక్ష మూడవరోజుకు చేరుకుంది. మంగళవారం వరకూ వందమంది రుత్విక్కులు 200 చండీ పారాయణాలు పూర్తిచేశారు. రెండోరోజు ఉదయం తొమ్మిది గంటలకు శాంతిపాఠముతో మహారుద్రయాగం ప్రారంభమైంది. 44 మంది రుత్విక్కులు ఏకకాలంలో ఏకాదశ రుద్రాభిషేకాలను నిర్వహించారు. ఆ తర్వాత క్రమార్చన హారతి, మంత్రపుష్ప సమర్పణ నిర్వహించారు. తొలిరోజులాగే రెండోరోజు కూడా రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. అనుష్ఠానం అనంతరం రాజశ్యామల మహావిద్య పారాయణం జరిగింది. ఆ తర్వాత హోమం పూర్తిచేసి.. అమ్మవారికి సహస్ర నామార్చన చేశారు. తీర్థప్రసాద వితరణతో రెండోరోజు రుద్రయాగం పూర్తయింది. చండీయాగ వేదిక ప్రాంగణంలో ప్రతిరోజు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద పారాయణాలు జరుగుతున్నాయి. మహేతిహాసాలైన రామాయణ భారతాల్లోని సుందరకాండ, విరాట పర్వం పారాయణాలు కూడా సమాంతరంగా నిర్వహిస్తున్నారు. శృంగేరీ శారదాపీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామివారి ఆశీస్సులతో, శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మార్గదర్శనంలో యాగ, పారాయణాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. -
ఎర్రవల్లిలో రెండోరోజూ సహస్ర చండీయాగం
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తలపెట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం మంగళవారం రెండోరోజుకు చేరుకుంది. మొత్తం 300 మంది రుత్వికులతో ఐదు రోజులపాటు చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం కొనసాగనుంది. విశాఖపట్నానికి చెందిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యాగం కొనసాగుతోంది. చండీయాగంలో భాగంగా ఈ నెల 25న పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వేదోక్తంగా ప్రారంభమైన చండీయాగం మహారుద్రసహిత సహస్ర చండీయాగం సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి దంపతులు యజ్ఞవాటికలో వేదోక్తంగా ఈ క్రతువును ప్రారంభించారు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో ప్రారంభమైన యాగానికి... కర్ణాటకలోని శృంగేరి పీఠానికి చెందిన తంగిరాళ సీతారామ శాస్త్రులు, మాడుగుల మాణిక్య సోమయాజులు, ఋగ్వేద పండితులు నరేంద్ర కాప్రే తదితర ప్రముఖులు వైదిక సారథ్యం వహించారు. స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి యాగశాల ప్రవేశం చేసి పూజా కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సుమారు 300 మంది ఋత్విజులు దుర్గా సప్తశతి పారాయణ క్రతువును ప్రారంభించడానికి ముందు యాగం నిర్విఘ్నంగా కొనసాగాలనే తలంపుతో 1,000 మోదకాలతో ప్రత్యేక హవనాన్ని నిర్వహించారు. ఋత్విజులు వేదమంత్రాలు పఠిస్తుండగా ముఖ్యమంత్రి దంపతులు ముందుగా యజ్ఞవాటిక చుట్టూ ప్రదక్షిణలు చేసి చండీ యజ్ఞవాటికలో పుణ్యాహవచణం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా గోపూజ, గురుపూజ జరిగింది. అరణి నుంచి అగ్నిని మథించడం ద్వారా రగిలిన నిప్పుతో నాలుగు యజ్ఞాలు ప్రారంభమయ్యాయి. సుమారు మూడు గంటలపాటు ముఖ్యమంత్రి దంపతులు యాగవాటికలోనే ప్రత్యేక పూజలు జరిపారు. ఇందులో భాగంగా వైవాహిక స్వర్ణోత్సవాలు జరిగిన వయో వృద్ధ దంపతులకు దంపతీ పూజలు, కన్యాకుమారి పూజలను సీఎం కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఏకోత్తర వృద్ధి సంప్రదాయంలో జరిగే సహస్ర చండీయాగంలో తొలి రోజు వంద సప్తశతి చండీ పారాయణాలు చేశారు. రుత్విజుల పారాయణాలతో ఎర్రవల్లి యాగవల్లిగా మారింది. సాయంత్రం జపాలు, అభిషేకాలు, ఇతర పూజా కార్యక్రమాలను చేపట్టారు. యాగంలో కపిలాశ్రమ స్వామి కూడా హాజరై ప్రముఖులకు ఆశీర్వచనం అందజేశారు. నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన హస్తినకు వెళ్లబోతున్నారు. -
ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ మహారుద సహస్ర చండీయాగం
-
వచ్చే నెలలో చండీ, రాజశ్యామల యాగాలు
సాక్షి, సిద్ధిపేట: యాగాలు, యజ్ఞాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై అపార నమ్మకం ఉన్న సీఎం కేసీఆర్ మరోసారి యాగాలకు సిద్ధమవుతున్నారు. కొంతకాలం కిందట అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఆయన.. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సూచన మేరకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో రెండు రోజులపాటు రాజ శ్యామల యాగాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యాగం నిర్వహించారు. అనంతరం ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించడం, రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కుటుంబసభ్యులతో కలసి విశాఖపట్నం వెళ్లి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందారు. ఈ నేపథ్యంలో స్వామి సూచన మేరకు సీఎం కేసీఆర్.. జనవరి 21 నుంచి 25 వరకు రెండు యాగాల నిర్వహణకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఈ మేరకు ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మొదటగా సహస్ర చండీ యాగం, ఆపై రాజ శ్యామల యాగం నిర్వహించనున్నట్లు సమాచారం. మొదటి రోజు సహస్ర చండీ యాగాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి, రుత్వికులు కలసి పూర్ణకుంభంతో ప్రారంభిస్తారు. ప్రారంభ, ముగింపు రోజుల్లో స్వామి హాజరు కానున్నట్లు తెలిసింది. మిగతా రోజుల్లో రుత్వికులు యాగాన్ని నిర్వహించనున్నారు. ఆ దిశగా వ్యవసాయక్షేత్రంలో ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు సమాచారం. -
ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో సీఎం కేసీఆర్ రాజశ్యామల హోమం
-
విస్తృత కార్యకర్తల సమావేశంలో ఆపద్ధర్మ సీఎం
-
మళ్లీ ఒకరోజు ఎర్రవల్లికి వస్తాను..
-
ఎక్కింది ఒక్క మెట్టు మాత్రమే: కేసీఆర్
ఎర్రవల్లి: తెలంగాణ సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామమైన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఇప్పటివరకూ మనం ఎక్కింది ఒక్క మెట్టు మాత్రమేనని, ఇదే స్ఫూర్తితో ఇళ్ల నిర్మాణంలో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. అనంతరం అక్కడ కమ్యూనిటీ హాల్‌ను కేసీఆర్ ప్రారంభించిన వెంటనే కళ్యాణ మండపంలో పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ నంబర్ వన్ కావాలన్నారు. సరిగ్గా ఏడాది కింద ఇదే రోజున ఘనంగా అయుత చండీయాగాన్ని ప్రారంభించిన కేసీఆర్.. నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి స్వీకారం చుట్టారు. పైలాన్ ఆవిష్కరించి సామూహిక గృహప్రవేశాలను ఆయన ప్రారంభించారు. తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్తులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను నగదు రహిత గ్రామాలుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యంగా ఈ రెండు గ్రామాల ప్రజలు ఎవరిపైనా ఆధారపడకుండా స్వయం పాలితగా ఉండి, స్వయం సమృద్ధి సాధించి, నగదు రహిత గ్రామాలుగా మారి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. మళ్లీ ఒకరోజు ఎర్రవల్లికి వస్తాను.. గ్రామంలో సామూహిక భోజనాలు ఏర్పాటు చేసి మరిన్ని అభివృద్ధి విషయాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవానికి ఎర్రవల్లికి 395, నర్సన్నపేటకు 200 ఇళ్లు చొప్పున మొత్తం 595 ఇళ్లు మంజూరుకాగా, నిర్మాణం పూర్తయిన ఇళ్ల పంపిణీ జరిగింది. ఎర్రవల్లిలో 344 ఇళ్లు, నర్సన్నపేటలో 186 ఇళ్లు మొత్తం 530 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో గృహ ప్రవేశాలు జరిగాయి. -
ఒక్కటై సాగారు..
సీఎం దత్తత గ్రామాల్లో సామూహిక సోయాబీన్ కోత పనులు ప్రారంభం సమష్టిగా వెళ్దాం.. చైతన్యాన్ని చాటుదాం: కలెక్టర్ పిలుపు రైతులతో కలిసి పంట కోసిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి జగదేవ్‌పూర్ (మర్కూక్): సమష్టి చైతన్యంతో ముందుకు వెళ్తూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో సోయాబీన్ పంట కోత పనులను శుక్రవారం సామూహికంగా ప్రారంభించారు. సీఎం దత్తత గ్రామాలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు. సామూహికంగా సాగు చేసిన సోయాబీన్, మొక్కజొన్న పంటల కోత పనుల్లో అందరూ పాల్గొనాలన్నారు. సమష్టి చైతన్య చాటాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు గ్రామాల్లో పంట కోత పనులు చేపడుతున్నామన్నారు. రైతులు సైతం ముందుకురావడం అభినందనీయమన్నారు. అందరికీ ఒకే రకమైన విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా సహాయాన్ని అందించినట్టు తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే పంట సోయాబీన్ అని పేర్కొన్నారు. పంట వేసిన మూడు, నాలుగు నెలలో చేతికందుతుందన్నారు. జూన్ చివరి వారంలో సాగు చేసిన సోయా పంట ప్రస్తుతం చేతికందిందన్నారు. రెండు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానాన్ని రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలకు విస్తరిస్తామని చెప్పారు. సీడ్‌బౌల్ తెలంగాణలో రైతులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను అవలంబిస్తే మంచి పంటలను సాగు చేయవచ్చని సూచించారు. సోయాబీన్ పంటకోతలో సామూహికంగా కదిలినట్టుగానే మొక్కజొన్న కోతలోనూ ముందుకు సాగాలని సూచిం చారు. రెండు గ్రామాల్లో 800 ఎకరాల్లో సోయాబీన్ పంట సాగు చేయగా అధిక వర్షాల వల్ల 180 ఎకరాల పంటకు నష్టం వాటిల్లిందన్నారు. కొడవలి పట్టిన కలెక్టర్... కలెక్టర్ కొద్దిసేపు రైతుగా మారారు. సీఎం దత్తత గ్రామాల్లో శుక్రవారం సోయాబీన్ పంట కోతల్లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. రైతులు, కూలీలతో కలిసి పంట కోత పనులు చేపట్టారు. చేత కోడవలి పట్టి.. సగం మునుము వరకు కోత కోశారు. కలెక్టరే చురుగ్గా పనులు చేయడంతో రైతులు, కూలీలు మరింత ఉత్సాహంగా కదిలారు. ‘అమ్మా.. బాగున్నావా..?, పంట ఎట్ల ఉంది..? బాగానే ఉందా..?’ అంటూ కలెక్టర్ రైతులను పలుకరించారు. ఎకరానికి ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, క్వింటాల్ ధర రూ.5 వేలు ఉందని రైతులకు వివరించారు. పెట్టుబడి పోను ఎకరానికి రూ.15 నుంచి రూ.20 వేల వరకు లాభం వస్తుందని కలెక్టర్ లెక్కలు వేసి చెప్పారు. కార్యక్రమంలో జేసీ హన్మంతరావు, తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జీఎం హెచ్‌కే సింగ్, జేడీఏ గోవింద్, ఏడీఏ అశోక్ కుమార్, ఏఓ నాగరాజు, జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రం, సర్పంచ్‌లు భాగ్య, బాల్‌రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు కిష్టారెడ్డి, ఎంపీడీఓ పట్టాభిరామారావు, వీడీసీ సభ్యులు బాలరాజు, ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సత్తయ్య, కృష్ణ పాల్గొన్నారు. -
దత్తత గ్రామం ఎర్రవల్లిలో కేసీఆర్ పర్యటన
-
దత్తత గ్రామం ఎర్రవల్లిలో కేసీఆర్ పర్యటన
మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం దత్తత గ్రామం ఎర్రవల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక వనరులను ఉపయోగించుకుని వ్యవసాయం చేయాలన్నారు. వర్షాలతో చెరువులు, డ్యామ్‌లు కళకళలాడుతున్నాయన్నారు. భవిష్యత్‌లో ఇక నీటి సమస్య ఉండదని కేసీఆర్ అన్నారు. గోదావరి జలాలు రెండేళ్లలో లక్ష ఎకరాలకు నీరందిస్తాయని, మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఆదర్శ గ్రామాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాల్లో త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహప్రవేశం చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లోను పశుగ్రాసం విత్తనాలు వేయాలని, రెండోపంటకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. గ్రామాల్లో బోర్ వేసేటప్పుడు జియాలజిస్ట్ల సలహా తీసుకొని వేయాలని ఆయన సూచించారు. -
తీవ్రంగా కొట్టి.. గొంతులో సూది గుచ్చారు
ఎర్రవల్లి: మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి లో గురువారం దారుణం చోటు చేసుకుంది. పొలానికి వెళ్లి వస్తున్న ఓ వ్యక్తిపై దుండగులు కర్రలతో దాడి చేశారు. అనంతరం తీవ్రంగా హింసించి గొంతులో సూది గుచ్చారు. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతంలో ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచిన భూమిని ఇతరుల పేరుతో దొంగ రిజిస్ట్రేషన్ చేశారని గత కొన్ని రోజులుగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పోరాడుతున్నాడు. సదరు వ్యక్తి ఈ రోజు వ్యవసాయ బావి వద్ద నుంచి వస్తుండగా గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. అనంతరం గొంతులో సూదిని గుచ్చారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దత్తత ఎర్రవల్లికి ఏడాది
-ఆదర్శ(అదృష్ట) గ్రామం -సుమారు రూ.150 కోట్ల అభివృద్ధి -హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు జగదేవ్‌పూర్:మారుమూల పల్లెకు అదృష్టం పట్టుకుంది..ఒకేసారి చరిత్రకు ఎక్కింది. ఏ గ్రామమని ఆలోచిస్తున్నారా..అదేనండి మన సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లి. దత్తత తీసుకుని ఏడాది అవుతున్న సందర్భంగా గ్రామాభివృద్ధిపై ప్రత్యేక కథనం... జగదేవ్‌పూర్ మండలంలో 23 గ్రామ పంచాయతీలు. 9 మదిర గ్రామాలున్నాయి. ఎర్రవల్లిలో ఎక్కువ శాతం వ్యవసాయమే జీవనధారం. మొత్తం జానాభా 1,445, ఓటర్లు 1,175, భూమి విస్తీర్ణం 22 వందల ఎకరాలు. సాగులో ఉంది 15 వందల ఎకరాలు. ప్రధాన పంటలు పత్తి, మొక్కజొన్న, పంటలను సాగు చేస్తారు. మండల కేంద్రానికి 8 కిలో మీటర్ల దూరంలో ఉన్నా అభివృద్ధి అంతంత మాత్రమే. ఇప్పుడు ఒకేసారి రూపురేఖలు మారిపోయాయి. సీఎం అడుగుపెట్టింది మొదలు అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. నిధుల వర్షం. అభివృద్ధి పనులు జోరు. రాష్ట్రంలోనే నంబర్‌వన్ గ్రామంగా రూపుదిద్దుకుంటోంది. సుమారు రూ 150 కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. ఇలా కలిసొచ్చింది... సీఎం కేసీఆర్ ఎర్రవల్లి గ్రామ సమీపంలో వ్యవసాయక్షేత్రాన్ని నిర్మించకున్నారు. ఫాంహౌస్‌కు ఎర్రవల్లి దారి నుంచే రాకపోకలు సాగించారు. సీఎం ఫాంహౌస్‌కు వస్తూ.. పోతుంటే ఎర్రవల్లి గ్రామ సర్పంచ్, ప్రజలు నమస్కారాలు పెట్టేవారు. ఇదే క్రమంలో గ్రామజ్యోతి కార్యక్రమం ప్రవేశపెట్టారు. గత ఏడాది ఆగస్టు19న సీఎం కేసీఆర్ ఎర్రవల్లి మీదుగా ఫాంహౌస్‌కు వెళుతున్నారు. ఆ సమయంలో గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, ప్రజలు రోడ్డు పక్కన నిలబడ్డారు. సీఎం రాగానే కాన్వాయ్ ఆపి వారితో గ్రామజ్యోతి కార్యక్రమంపై ఆరా తీశారు. వెంటనే నేనే వస్తా..శ్రమదానం చేస్తా అని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తుల ఆనందం ఆకాశనంటింది. 20న గ్రామంలో సీఎం కేసీఆర్ పాదయాత్ర చేస్తూ శ్రమదానం చేశారు. అలాగే సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం జరిగిన గ్రామజ్యోతి గ్రామసభలో ఎర్రవల్లిని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు. ఇక్క అక్కడి నుంచి ఎర్రవల్లికి తరుచూ సీఎం వస్తున్నారు. వచ్చినప్పుడల్లా వరలా జల్లులు కురిపిస్తూనే ఉన్నారు. ఊరంతా డబల్బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటన చేశారు. గ్రామస్తులతో కలిసి సంహపక్తి భోజనం చేశారు. విత్తనోత్పత్తిపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎర్రవల్లిని విత్తనోత్పత్తి భండాగరంగా ప్రకటించారు. గ్రామంలో 12 వందల మందికి సరిపడే కమ్యూనీటి భవనం, గ్రంథాలయం, బ్యాంకు, బస్‌స్టేషన్, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, విత్తనోత్పత్తి గ్రామంగా ఎర్రవల్లిని తీర్చిదిద్దుతున్నారు. ఎర్రవల్లి మదిరిగా నర్సన్నపేటను కూడా దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎర్రవల్లి, నర్సన్నపేటను రాష్ట్రంలో బంగారు తునకాలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నర్సన్నపేటకు 200 డబల్బెడ్రూం ఇళ్లను మంజూరు చేశారు. అలాగే ఊరంతా డ్రిప్పు ఇరిగేషన్, గోదావరి నీళ్లు అందిస్తామని, కూడవెల్లి వాగుకు పూర్వవైభవనం తీసుకొస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రూ. 6.36 కోట్ల నిధులతో మంజూరు అయిన 45 ట్రాక్టర్లను లబ్ధిదారులకు అందించారు. శ్రావణమాసంలో గృహప్రవేశాలు చేయాలని చేయనున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి పనుల వేగవంతం... సుమారు రూ. 150 కోట్ల నిధులతో రెండు గ్రామాల్లో డబల్బెడ్రూం, కుంటల అభివృద్ధి, కూడవెల్లి ఆధునీకరణ, పాండురంగరిజర్వాయర్, డ్రిప్పు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 31 న సామూహిక గృహప్రవేశాలు చేయాలని సంకల్పంతో అధికారులు ఇండ్లను పనుల్లో వేగవంతం చేస్తున్నారు.మొత్తం మీద ఏడాదిలో రెండు గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చాయి. రానున్న రోజుల్లో ఆదర్శ గ్రామాలు మారనున్నాయి. -
మా ఊరికి రావొద్దు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/కొండపాక: ‘కాంగ్రెస్.. కమ్యూనిస్టు.. తెలుగుదేశం పార్టోళ్లూ మీ సాయం ఇగచాలు. ఊళ్లేకొచ్చి లేని గొళ్లెం పెట్టకుండ్రి.. మా ఊరికి రావొద్దు.. ఆగం జేయొద్దు. రాజకీయాలుంటే ఊరి బయటే చేసుకోండ్రి’ అని మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామమైన ఎర్రవల్లివాసులు ప్రతిపక్ష పార్టీలకు నిర్మోహమాటంగా చెబుతున్నారు. వారిని గ్రామంలోకి రానివ్వొద్దని తీర్మానించారు. ఈ మేరకు ‘గ్రామంలోకి ప్రతిపక్షాలు రావద్దు’ అని పలకలపై రాసి మంగళవారం ఊరు చుట్టూ బోర్డులు పెట్టారు. ‘2013వ సట్టం ఒప్పుకొమ్మని ఆగమాగం జేస్తిరి. మీ మాటలు ఇని ఆగమైనం. ఇంక మా ఊరికొస్తే మంచిగుండదు. తపాస్‌పల్లి పోయొచ్చినం.. మీ సక్కదనం జూసొచ్చినం’ అని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ముంపుతో ఇప్పటికే ఆగమైన తమను కాంగ్రెస్, కమ్యూనిస్టు, టీడీపీలు రెచ్చగొడుతున్నాయని వాపోయారు. 123 జీఓ తమకు నచ్చిందని, మంత్రి హరీశ్ మాటలపై నమ్మకం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతిపక్షాల రాజకీయాల వల్లే కలసి మెలసి ఉంటున్న ఎర్రవల్లిలో గొడవలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లాఠీచార్జిలో గాయపడిన వేములఘాట్ ముంపు గ్రామస్తులను పరామర్శించడానికి సోమవారం కాంగ్రెస్ నాయకులు వెళ్లబోతే తమ ఊరిగుండా వెళ్లొద్దంటూ ఎర్రవల్లి ప్రజలు పొలిమేరలో కంప అడ్డం వేశారు. ప్రతిపక్షాలకు పరాభవం తప్పదు ఎర్రవల్లి ప్రజలకు కృతజ్ఞతలు. మిగతా గ్రామాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలకు పరాభవం తప్పదు. సిద్దిపేట నియోజకవర్గం ఇమాంబాద్, అనంతగిరి ప్రాజెక్టుల కింద భూ సేకరణను సైతం కొన్ని దుష్టశక్తులు అడ్డుకోవాలని చూశారుు. ఇమాంబాద్ రిజర్వాయర్ విషయంలో 120 రోజులు టెంటు వేస్తే వీళ్లు వచ్చి ఒకటే రెచ్చగొట్టుడు. కానీ 120 రోజుల తరువాత ఏం జరిగింది? నేను పోయి అదే టెంటు కింద కూర్చున్న. ఉన్న విషయాలు చెప్పి ఒప్పిం చిన. నిజంగా చెప్పాలంటే రైతులపై ముఖ్యమంత్రికి ఉన్న ప్రేమ ఈ వచ్చిపో యే నాయకులకు ఉంటదా? ఒక్కరోజు బాగోతంగాళ్లు వాళ్లు. ఇయ్యాల ఒస్తరు రేపు పోతరు. నేను మళ్లీ చెప్తున్నా.. ముం పు గ్రామాల ప్రజలను కడుపుల పెట్టుకొని చూసుకుంటా. - మంత్రి హరీశ్‌రావు -
పచ్చని పంటలతో కళకళ
జగదేవ్‌పూర్:సీఎం కేసీఆర్ దత్తత గ్రామలైన ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో వివిధ పంటలు కళకళలాడుతున్నాయి. ప్రధానంగా మొక్కజొన్న, సోయాబీన్ పంటలు విస్తారంగా సాగవుతున్నాయి. రెండు గ్రామాల్లో సమష్టి వ్యవసాయంలో భాగంగా ఎర్రనేలల్లో మొక్కజొన్న, నల్ల భూముల్లో సోయాబీన్ పంటలను సాగు చేశారు. 2,800 ఎకరాలను 14 జోన్లుగా విభజించి ఒక్క జోన్ పరిధిలో 200 ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేస్తున్నారు. మొక్కజొన్న, సోయాబీన్ విత్తనాలను ట్రాక్టర్ల ద్వారా విత్తారు. ప్రస్తుతం మొలకలెత్తిన పంటలతో రెండు గ్రామాలు కళకళలాడుతున్నాయి. రైతులు తమ భూముల్లో దంతె, గొర్రు, గడ్డి తీసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎటు చూసినా పచ్చని పంటలు కనిపిస్తున్నాయి. -
ఎర్రవల్లిలో ఇళ్లను పరిశీలించిన ఇంద్రకరణ్ రెడ్డి
మెదక్ : మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డితోపాటు దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి ఏ. ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. అంతకుముందు ఇదే మండలంలోని వరదరాజ్‌పూర్ గ్రామంలో కొలువైన వరదరాజులస్వామివారిని ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. -
ఫాంహౌస్‌కు చేరుకున్న సీఎం
జగదేవ్‌పూర్ (మెదక్) : మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం చేరుకున్నారు. ఆయన రాక నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు చేపట్టారు. సీఎం సోమవారం వరకు అక్కడే గడపనున్నారని సమాచారం. -
ఎర్రవల్లిలో ఇంటింటా ఇంటర్నెట్
జగదేవ్‌పూర్(మెదక్): ముఖ్యమంత్రి కేసీఆర్ తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో శుక్రవారం డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను పరిశీంచారు. అనంతరం గ్రామచావిడి వద్ద గ్రామసభలో పాల్గొని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు మంజూరైన 42 ట్రాక్టర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజలు సంఘటిత శక్తి అని ఎర్రవల్లి, నర్సన్న పేట గ్రామస్తులు నిరూపించాలని తెలిపారు. బర్రెలు, ఆవులు, కోళ్లతో ప్రత్యామ్నయ వ్యవసాయ ఆదాయం పెంచుకోవాలన్నారు. ఎర్రవల్లిలో ఇంటింటా ఇంటర్ నెట్ సౌకర్యం అందిస్తామని కేసీఆర్ తెలిపారు. -
నేడు ఎర్రవల్లికి సీఎం
లబ్ధిదారులకు ట్రాక్టర్ల పంపిణీ జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గ్రామచావిడి వద్ద గ్రామసభలో పాల్గొని ఇటీవల రెండు గ్రామాలకు మంజూరైన 42 ట్రాక్టర్లు అందజేస్తారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు ట్రాక్టర్లు వచ్చిన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ ఫాంహౌస్ నుంచి ఎర్రవల్లికి చేరుకుని ముందుగా డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను పరిశీలిస్తారు. అనంతరం గ్రామసభలో లబ్ధిదారులకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తారు. సభ ముగించుకుని ఫాంహౌస్‌కు చేరుకుంటారు. గురువారం రాత్రి ఎర్రవల్లిలో జేసీ వెంకట్రాంరెడ్డి, గడా అధికారి హన్మంతరావు సభ ఏర్పాట్లు పనులను పరిశీలించారు. -
ఫాంహౌస్ నుంచి రాజధానికి..
జగదేవ్ పూర్ (మెదక్) : నాలుగు రోజులుగా మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లోనే గడిపిన సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు పయనమయ్యారు. శుక్రవారం రాత్రి అక్కడకు వెళ్లి నాలుగు రోజులుగా వ్యవసాయక్షేత్రంలో ఖరీఫ్ పనులను పరిశీలించారు. ఏ పంటలను సాగు చేయాలో ఫాంహౌస్ ఉద్యోగులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. మార్కుక్, పాములపర్తి, గౌరారం మీదుగా రోడ్డు మార్గాన కాన్వాయ్ ద్వారా హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ వారాంతంలో మళ్లీ ఆయన ఫాంహౌస్‌కు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. -
సీఎం సారూ... జరా కాపాడండి!
జగదేవ్‌పూర్: తమ గ్రామాన్ని కాపాడాలని మల్లన్న సాగర్ ముంపు బాధితులైన మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లి వాసులు సీఎం కేసీఆర్‌ను కోరారు. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో ఉన్న సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ముంపు వాసులు శనివారం సాయంత్రం ఇక్కడికి వచ్చారు. ఎర్రవల్లి వాటర్ ట్యాంకు వరకు రాగానే పోలీసులు వారిని అడ్డగించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీధర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డితో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. సీఎం కలిసే అవకాశం లేదని సముదాయించారు. సీఎంకు ఇవ్వాలనుకున్న వినతి పత్రాన్ని డీఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి సర్పంచ్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ... మల్లన్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని కొంత వరకు తగ్గించి తమ గ్రామం ముంపునకు గురికాకుండా చూడాలని కోరారు. భూమికి భూమి, ఇంటికి బదులు ఇల్లు, ఊరుకు బదులు ఊరిని నిర్మించి ఇవ్వాలన్నారు. -
ఫాంహౌస్‌లోనే సీఎం కేసీఆర్
జగదేవ్‌పూర్ (మెదక్) : ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి ఫాంహౌస్‌కు వెళ్లిన విషయం తెల్సిందే. శనివారం సాయంత్రం వ్యవసాయ క్షేత్రంలో పర్యటించిన ఆయన ఫాంహౌస్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌రావు ఫాంహౌస్‌లో సీఎంను కలిసినట్లు సమాచారం. దత్తత గ్రామాల్లో విత్తోనోత్పత్తిపై పూర్తి వివరాలను సీఎంకు వివరించినట్లు తెలిసింది. అలాగే వివిధ అభివృద్ధి పనుల తీరును కూడా అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. సోమవారం వరకు ముఖ్యమంత్రి ఫాంహౌస్‌లోనే ఉంటారని సమాచారం. -
ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్
జగదేవ్‌పూర్ (మెదక్) : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో బిజీబిజీగా ఉన్న కేసీఆర్ విశ్రాంతి కోసం ఫాంహౌస్‌కు వెళ్లినట్లు తెలిసింది. సీఎం వస్తారనే సమాచారంతో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫాంహౌస్, రోడ్డు మార్గాన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం వచ్చి రాగానే తన దత్తత గ్రామాల్లో జరుగుతున్న పనులపై ఆరా తీసినట్లు తెలిసింది. ఆదివారం వరకు ఇక్కడే ఉంటారని సమాచారం. -
వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న సీఎం
జగదేవ్‌పూర్ (మెదక్) : సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం 5.40 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఆయన ఆ వెంటనే ఫాంహౌస్‌కు వెళ్లారు. ఫాంహౌస్ పర్యవేక్షకుడు జహంగీర్‌తో కలిసి వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు. పాలీహౌస్ పనులను పరిశీలించి పలు సూచనలు చేసినట్టు తెలిసింది. తన దత్తత గ్రామాల్లో జరుగుతోన్న అభివృద్ధి పనులపై ఆరా తీసినట్టు సమాచారం. గజ్వేల్‌లో మిషన్ భగీరథ పనులు పూర్తి కావడంతో ఇంటింటికి నల్లా నీటిని అందించే కార్యక్రమాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. -
వ్యవసాయ క్షేత్రం నుంచి బయల్దేరిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుండి రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు బయలుదేరారు. శనివారం సాయంత్రం ఫాంహౌస్‌కు వచ్చిన విషయం తెల్సిందే. ఆదివారం ఉదయం ఫాంహౌస్‌లో జరుగుతున్న పాలిహౌస్ పనులను పరిశీలించినట్లు తెలిసింది. అలాగే ఖరీఫ్‌లో ఎలాంటి పంటలను సాగు చేయాల్లో ఫాంహౌస్ బాధ్యులకు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్‌కు వెళ్లారు. -
ఫాంహౌస్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి
మెదక్ : సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గాన మెదక్ జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ముందుగానే సమాచారం ఉండడంతో జిల్లా ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రం, రోడ్డు మార్గాన భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫాంహౌస్‌కు సీఎం రాగానే ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో పలు అభివృద్ధి పనులపై ఆరా తీసినట్లు సమాచారం. సోమవారం కూడా సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఉంటారని సమాచారం. ఆదివారం, సోమవారాల్లో కేసీఆర్ ఎర్రవల్లిలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రెండు రోజులు ఫాంహౌస్ లోనే సీఎం కేసీఆర్!
జగదేవ్‌పూర్: సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తన వ్యవసాయక్షేత్రానికి శనివారం రాత్రి చేరుకున్నారు. రాత్రి 7 గంటల తర్వాత ప్రాంతంలో గౌరారం, పాములపర్తి, మార్కుక్, శివారు వెంకటాపూర్ గ్రామాల మీదుగా ఆయన తన ఫాంహౌస్‌కు చేరుకున్నారు. సోమవారం వరకు ఇక్కడే ఉంటారని సమాచారం. తన బాల్యమిత్రుడు, ఫాంహౌస్ గార్డెనర్, ములుగు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జహంగీర్ శనివారం రాత్రి వంటిమామిడి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో సీఎం కేసీఆర్ వచ్చీ రాగానే ఫోన్లో ఆయనకు అభినందనలు తెలిపినట్లు తెలిసింది. -
ఫాంహౌస్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తమ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సీఎం రాకపై ముందస్తు సమాచారం ఉండడంతో జిల్లా ఎస్పీ సుమతి, సిద్ధిపేట డీఎస్పీ శ్రీధర్ అధ్వర్యంలో ఫాంహౌస్ వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సాయంత్రం అల్లం తీసే పనులను, పాలిహౌస్ ఏర్పాటు పనులను పరిశీలించినట్లు తెలిసింది. రాత్రి ఇక్కడే బస చేసి శుక్రవారం ఖమ్మం జిల్లా భద్రాచలం వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
‘డబుల్’ అద్భుతం: ట్రెయినీ ఐఏఎస్‌లు
జగదేవ్‌పూర్ (మెదక్) : ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిని తెలంగాణ జిల్లాలకు చెందిన ట్రెయినీ ఐఏఎస్‌లు గురువారం సందర్శించారు. ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ నమూనా ఇళ్లను పరిశీలించారు. ట్రెయినీ ఐఏఎస్‌లు సిక్తాపట్నాయక్ (నల్లగొండ), సందీప్కుమార్జా (వరంగల్), గౌతమ్ (కరీంనగర్), ముసరఫ్అలీ ఫారూక్ (ఖమ్మం), కృష్ణ ఆదిత్య (మెదక్)లు ఎర్రవల్లిలో నమూనా కోసం నిర్మించిన రెండు ఇళ్లలో కలియదిరిగారు. నిర్మించిన తీరు, కల్పించిన వసతులను తెలుసుకున్నారు. అదే గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులనూ పరిశీలించారు. అభివృద్ధి పనులపై స్థానికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అత్యద్భుతమని కొనియాడారు. ఈ పథకం దేశంలో నంబర్‌వన్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ వైపు అడుగులు వేసే దిశగా ఈ ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. రోజూ రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు కూడా అద్భుతమని కొనియాడారు. -
ఎర్రవల్లిలో స్విస్ ఇంజనీర్ పర్యటన
జగదేవ్‌పూర్ : సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని మంగళవారం స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్ఓ) ఇంజినీర్ అండ్రెక్స్ పరిశీలించారు. ఉదయం సీడ్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ మురళితో కలిసి ఎర్రవల్లికి చేరుకున్న ఆండ్రెక్స్... నర్సన్నపేట, చేబర్తి గ్రామాల్లో గత ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను కూడా పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లు, రెండు పడక గదుల ఇళ్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఉన్నతాధికారి మురళిని అడిగి అండ్రెక్స్ తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పనుల్లో మేస్త్రీల పనితీరును కూడా ఆయన పరిశీలించారు. నమూనా ఇళ్లతోపాటు స్లాబ్ వేస్తున్న తీరును గమనించారు. అధ్యయనం ద్వారా తెలుసుకున్న వివరాల ఆధారంగా ఈనెల 13న రాజేంద్రనగర్‌లో ఎన్ఐఆర్డీ కేంద్రంలో మేస్త్రీలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆండ్రెక్స్ తెలిపారు. అందువల్లే ఎర్రవల్లిలో పనులను పరిశీలించినట్టు చెప్పారు. ఆయన వెంట హౌసింగ్ డీఈ భాఖీ, సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, వీడీసీ సభ్యులు సత్తయ్య, మల్లేశం, భిక్షపతి, నవీన్, మీనాక్షి గ్రూపు ప్రతినిధులు ఉన్నారు. -
గురువారం వరకు సీఎం ఫాంహౌస్‌లోనే
జగదేవ్‌పూర్ (మెదక్) : సీఎం కేసీఆర్ రోజంతా ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో గడిపారు. సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఎర్రవల్లిలోని తమ వ్యవసాయక్షేత్రానికి వెళ్లిన విషయం తెల్సిందే. మంగళవారం ఉదయం సీఎం కేసీఆర్ అల్లం పంట తీసే పనులను దగ్గరుండి పరిశీలించారు. ఫాంహౌస్‌లోనే నిల్వ చేస్తున్న అల్లంను పరిశీలించి పలు సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. ఫాంహౌస్ చుట్టూ గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం వరకు అక్కడే ఉంటారని సమాచారం. -
ఎర్రవల్లే.. తొవ్వ చూపాలె!
* ఎర్రవల్లి, నర్సన్నపేటలు దేశానికే ఆదర్శం కావాలి: సీఎం కే సీఆర్ * రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా తయారుచేసేందుకే నా తండ్లాట * త్వరలోనే డబుల్ బెడ్రూం ఇళ్లల్లోకి పోదాం * ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్ల పనుల పరిశీలించిన సీఎం * గ్రామసభలో కేసీఆర్ ప్రసంగం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘మనం గొప్ప విజయం సాధించబోతున్నం. గోదావరి నీళ్లొచ్చి ఒక్క పంట పండితే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతది. మీరు ఎట్ల జేసిండ్రో జర మాకు కూడా తొవ్వ జూపించి పొమ్మని ఎర్రవెల్లి గ్రామస్తులను వేరే గ్రామాలోళ్లు వచ్చి అడిగే రోజు వస్తది. మిమ్ముల్ని చూసి తెలంగాణ నేర్చుకోవాలె. యావత్తు దేశం నే ర్చుకోవాలే. ఆ ఉద్దేశంతో ఇక్కడ పనిచేస్తున్నాం. ఈ ప్రయోగం ఎర్రవల్లి కోసం కాదు. దీన్ని చూసుకుంటూ యావత్తు రాష్ర్టం బ్రహ్మాండంగా తయారు కావాలె. అందుకోసమే నా తండ్లాట’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మెదక్ జిల్లాలోని తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను, ఊరు చుట్టూ ఉన్న చెరువులను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామ సభలో మాట్లాడారు. ‘‘కొద్దిగ తొవ్వ దొరికినట్టు అనిపిస్తంది. డబుల్ ఇళ్లు అయిపోయినయి. ఇప్పుడే ఓ ఇల్లు ఎక్కి చూసిన. ఇంటి మీద నీళ్ల ట్యాంకు కడుతుండ్రు. గోదావరి నుంచి వచ్చే నీళ్లు మీ ఊరి పెద్ద ట్యాంకులకు.. అక్కడ్నుంచి ఇంటి మీదున్న ట్యాంకులకు వస్తయి. 24 గంటలు నల్లా నీళ్లు వస్తయి. నల్లా నీళ్లతో సహా ఇండ్లళ్లకు వెళ్తాం. గ్రామమంతా సీసీ రోడ్లు వేస్తరు. మే 15 నాటికి ఇండ్ల నిర్మాణం పూర్తయిపోతది. అయ్యగారిని అడుగుతా... మే 15 నుంచి 30 మధ్యన ఎన్నడు మంచిరోజు ఉంటే ఆనాడు పండుగ జేసుకొని అందరం కలసి ఇండ్లళ్లకు పోవాలె. చినుకుబడే సమయానికి మొక్కలు తీసుకొచ్చి నాటాలి. 6-7 ఫీట్ల ఎత్తు మొక్కలు తెచ్చి పెడితే ఎర్రవల్లి పచ్చగా కనిపిస్తుంది’’ అని అన్నారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే.. పొత్తుల ఎవుసం చేద్దాం మన ఊరి (ఎర్రవల్లి) పక్కన మాచిరెడ్డి కుంట, నల్లకుంట, లింగరాజుకుంటలు ఉన్నాయి. పాండురంగ దేవుని పేరు మీద ఇంకో పెద్దకుంట కట్టుకుందాం. కూడవెళ్లి వాగుమీద రెండు చెక్‌డ్యాంలు కట్టుకుంటున్నం. అన్ని చెరువుల్ల కలసి 200 ఎంసీఎఫ్‌టీల నీళ్లు నిల్వ ఉంటయి. ఈ నీళ్లు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు ఒక్కసారికి సరిపోతయి. మరోసారి నింపుకుంటే ఇంకో ఏడాది వస్తయి. రైతులు ఏడాదికి మూడు పంటలు పండించాలె. రెండు పెద్ద పంటలతోపాటు వేసవి సమయం కూడా వృథా కాకుండా తక్కువకాలంలో దిగుబడి వచ్చే పంటలు పెట్టాలె. అప్పుడే మనం గొప్పోళ్లం అవుతం. 2,800 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతి బిట్టుకు 200 ఎకరాల చొప్పున 14 బిట్లు చేస్తారు. దీనికి డ్రిప్ ఇరిగేషన్ కల్పిస్తరు. కట్క ఒత్తితే 2,800 ఎకరాలకు నీళ్లు పారుతయి. ఊళ్లలో భూమి లేని కుటుంబాల నుంచి యువకులను ఎంపిక చేసి ప్రతి బిట్టుకు ఒక ఆపరేటర్‌ను పెడతం. ఆయనకు ఎకరానికి ఇంత అని ఇద్దాం. ఈ ఆపరేటర్లే వాళ్లకు కేటాయించిన బిట్టులోని 200 ఎకరాలకు రోజు నీళ్లు పారిస్తరు. పొద్దున 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు నీటి పారకం పూర్తవుతుంది. రైతులుగా మనం పొలం పారిందా? లేదా చూసుకోవాలి. కలుపు, గడ్డిమొక్కలు ఉంటే వాటిని పీకేసి పొలాన్ని శుభ్రంగా పెట్టుకోవాలె. పురుగు లేకుండా పోవాలె.. పంట పొలానికి కావాల్సిన ఎరువులు, పురుగు మందులు ఒక్కొక్కరం కొట్టుకోం. ఊరు ఊరంతా కలసి పురుగు మందులు కొడతాం. 14 బిట్లకు ఒక్కొక్కటి చొప్పున పురుగు మందులు కొట్టే యంత్రాలు ఉంటయి. ఇప్పుడు నా పొలం కాడ ఉంది. మందులు కూడా ఎవరికి వాళ్లు కొనాల్సిన పని లేదు. దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుందాం. ఆ కమిటే మందులు కొనుగోలు చేస్తది. ఒకరి పొలంలో ముందు కొడితే పురుగు ఇంకొకరి పొలానికి పోతంది. అట్లా లేకుండా ఊరు ఊరంతా కలిపి కొడితే పురుగు లేకుండా పోతది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ కాడ చేసేది ఇదే పని. అక్కడ మార్కెట్ కమిటీ ఉంటది. కానీ మనకు ఆ బాధ లేదు. ఎందుకంటే విత్తన కంపెనీ ముందుగా రేటు నిర్ణయించి మనకు రేటు కట్టిస్తది. ఎవరి పొలంలో ఎంత దిగుబడి వస్తే వాళ్లకు అంత లాభం వస్తది. మూడో పంట మాత్రం మన ఇష్టం. పుచ్చకాయ, దోసకాయ, మెంతికూర, ఏది వీలైతే అది పండిద్దాం. దీన్ని కూడా హైదరాబాద్ నుంచి వ్యాపారులు వచ్చి కొనుక్కపోయేటట్టు ఆలోచన చేద్దాం. ఇదీ ఎర్రవల్లిలో మనం వ్యవసాయం చేసే పద్ధతి. పొత్తుల ఎవుసం ఉంటది కానీ ఎవరి భూమి వాళ్లకే ఉంటది. ఎవరి భూమిలో ఎంత పంట పండితే అంత డబ్బులు వాళ్లకు వస్తది. ఆడవాళ్ల పెత్తనం ఉన్నచోట లక్ష్మి గోదావరి ప్రాజెక్టులపై మనకు, మహారాష్ట్రకు మధ్య ఒప్పందం కుదిరింది. త్వరలో నేనే స్వయంగా వెళ్లి మాట్లాడి వస్తా. పాములపర్తి, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల పనులను 15, 20 రోజుల్లోనే ప్రారంభిస్తం. రెండు, రెండున్నరేళ్లలోనే పాములపర్తిలో నీళ్లు ఉంటయి. ఒక్కసారి గోదావరి నీళ్లు వచ్చినయంటే 365 రోజులు నీళ్లు ఉంటయి. ఈ 2 గ్రామాలు దేశానికే ఆదర్శంగా ఉండాలని నేను తండ్లాడుతున్న. తెలంగాణ రాష్ట్రానికి, యావత్తు దేశానికి కొత్త పాఠం చెప్పబోతున్నం. ఇప్పటి దాకా మీరే ఓ జిల్లాకు వెళ్లి చూసొచ్చిన్రు. ఇప్పుడు ఇంకో జిల్లా కలెక్టర్లే మీ దగ్గరకొచ్చి చూసి పోతుండ్రు. ఇదం తా మీ ఐకమత్యంతోనే అయింది. కొంత ప్రభుత్వ సాయం ఉంది. మీ వెంట నేను కార్యకర్తగా ఉన్నా. అందుకే అనుకున్నవన్నీ సాధించ కలుగుతున్నం. ఈ ఐక్యత ను కొనసాగించాలి. మా అక్కాచె ల్లెళ్లు పట్టు మీదుండాలె. అంకాపూర్ అభివృద్ధికి కారణం మహిళలే. ఆడవాళ్ల పెత్తనం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మి అమ్మవారు ఉంటది. ఎర్రవల్లి పచ్చగా కళకళలాడాలే. నాలుగైదు గ్రామాలను ఇలా చేసి చూపెట్టి ఇగో ఈ పద్ధతిలోనే మీరు కూడా చేసుకొమ్మని చెప్తే ఇంకొకళ్లకు తొవ్వ దొరుకుతది. మీరు అదృష్టవంతులు. నేను ఇక్కడ ఉండటం వల్ల మీ ఊరును తీసుకున్న. ఇదే విధానాన్ని యావత్తు రాష్ట్రం విస్తరిస్తాం. -
ఆ జిల్లా అధికారులు అంత యాక్టివ్ కాదు: కేసీఆర్
సంగారెడ్డి: మెదక్ జిల్లా లోని ఎర్రవెల్లి తరహాలోనే కరీంనగర్ లోనూ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం త్వరగా చేసి గృహప్రవేశాలు నిర్వహించాలని భావించాం, అయితే ఆ జిల్లా అధికారులు యాక్టివ్ గా లేరంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో మే30వ తేదీ లోపు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం గృహప్రవేశాలు జరుగుతాయని వెల్లడించారు. అదేవిధంగా ఎర్రవెల్లికి గోదావరి జలాలు తెప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 7న గోదావరి జలాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. ఎర్రవెల్లి లాగే కరీంనగర్ లో డుబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనుకున్నానని, కానీ కరీంనగర్ జిల్లా అధికారులు యాక్టివ్ గా లేరని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అనంతరం ఎర్రవెల్లి నుంచి సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు బయలుదేరారు. -
అల్లం పంటపై కేసీఆర్ ఆవేదన!!
► ఆర్నెల్ల కింద కిలో రూ.150... ఇప్పుడు రూ. 35 ►అల్లాన్ని తవ్వకుండా నిలిపివేయించిన ముఖ్యమంత్రి ►ఎక్కువ ధరకు విక్రయించేందుకు ఉద్యానశాఖ హైరానా! సాక్షి, హైదరాబాద్ : ఆయన స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి.. మరోవైపు అనేక పంటలు సాగుచేస్తూ లాభసాటి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు. కానీ ఆయనకూ ఒక సాధారణ రైతుకు వచ్చిన కష్టమే వచ్చింది. వ్యాపారుల దగా ఆయన పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకుండా చేసింది. ఆయన సీఎం కేసీఆర్.. ఆయన వేసినది అల్లం పంట. ఆ పంటకు గిట్టుబాటు ధర రాక, ఏం చేయాలో అర్థం కాక అల్లం తవ్వకుండా అలాగే ఉంచేశారు. మరి సీఎం పరిస్థితే ఇలా ఉంటే సాధారణ రైతు మాటేమిటనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. 50 ఎకరాల్లో సాగు.. సీఎం కేసీఆర్ తన ఎర్రవ ల్లి వ్యవసాయ క్షేత్రంలో గత జూన్ నెలలో తొలిసారిగా అల్లం సాగు ప్రారంభించారు. అప్పట్లో అల్లం ధర మార్కెట్లో కిలోకు రూ.150 నుంచి రూ. 200 వరకు పలికింది. దీంతో మంచి ధర ఉందన్న కారణంతో ఏకంగా 50 ఎకరాల్లో అల్లం సాగు చేపట్టారు. ఎకరానికి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టారని అంచనా. సాధారణంగా ఎకరానికి 10 టన్నుల దిగుబడి వస్తుంది. కేసీఆర్ అత్యాధునిక పద్ధతిలో సాగు చేసినందున 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి రావచ్చని భావిస్తున్నారు. కానీ పంటకాలం పూర్తయినా... దాన్ని తవ్వి తీసి విక్రయించాలంటే మార్కెట్లో పరిస్థితి ఘోరంగా ఉంది. వ్యాపారులు అల్లాన్ని కిలో రూ.35కు మించి కొనడం లేదు. అదే మార్కెట్లో వినియోగదారులకైతే కిలో రూ.120 వరకు అమ్ముతుండడం గమనార్హం. అయితే మార్కెట్లో మంచి ధర ఎక్కడైనా దొరుకుతుందా అని సీఎం ఆరా తీస్తున్నారు. ఈ అల్లం పంటను అమ్మిపెట్టే ప్రయత్నంలో ఉద్యానశాఖ ఉన్నట్లు తెలిసింది. వ్యాపారులను ఒప్పించి కనీసం కిలో రూ.100కు విక్రయించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే 50 ఎకరాల్లోని పంటను ఒకేసారి కొనడానికి ఏ వ్యాపారీ ముందుకు రావడం లేదని తెలిసింది. విడతల వారీగా కొనుగోలు చేస్తామని ఒక ప్రముఖ వ్యాపారి చెప్పినట్లు సమాచారం. తగ్గుతున్న అల్లం సాగు.. రాష్ట్రంలో అల్లం సాగు ఏడాదికేడాదికి తగ్గుతోంది. ప్రస్తుతం 5 వేల ఎకరాల్లోనే అల్లం సాగు చేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసే అల్లానికి వ్యాపారులు తక్కువ ధరకు దొరికే ఆలుగడ్డను గుజ్జు చేసి కలిపి అల్లం పేస్టు తయారు చేసి అమ్ముకుంటున్నారు. అలాగే అల్లాన్ని విడిగా కిలో రూ.120 దాకా విక్రయిస్తున్నారు. -
ఫాంహౌస్ నుంచే ఆరా తీస్తున్న కేసీఆర్
జగదేవ్‌పూర్ (మెదక్): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ సరళిపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచే ఆరా తీసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం కూడా వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యులుగా ఉన్న మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేసి.. పోలింగ్ గురించి పూర్తి వివరాలు అడిగితెలుసుకున్నట్లు సమాచారం. అలాగే ఉదయం సతీమణి శోభరాణితో కలిసి పంటలను పరిశీలించినట్లు తెలిసింది. బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఫాంహౌస్ వద్ద పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. శనివారం ఫామ్‌హస్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ అప్పటినుంచి ఇక్కడే ఉంటూ పంటలను పరిశీలిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పరిణామాలను ఆయన ఇక్కడి నుంచి తెలుసుకుంటున్నారు. -
రేపు సాయంత్రం వరకూ ఫామ్‌హౌస్‌లోనే కేసీఆర్!
జగదేవ్‌పూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మూడో రోజు సోమవారం కూడా మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గడిపారు. శనివారం రాత్రి ఆయన ఇక్కడకు వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఆయన ఫాంహౌస్‌లో తిరుగుతూ పంటలను పరిశీలించారు. అల్లం పంటకు సంబంధించి ఫాంహౌస్ బాధ్యులకు కేసీఆర్ సూచనలిచ్చినట్లు తెలిసింది. అలాగే సాయంత్రం కూడా తన సతీమణి శోభతో కలిసి పంటలను పరిశీలించారు. సీఎం మంగళవారం సాయంత్రం హైదరాబాద్ తిరిగి వెళ్తారని తెలిసింది. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్
జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాత్రి 10 గంటల సమయంలో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన అక్కడి నుంచి ఫాంహౌస్‌కు వచ్చారు. సోమవారం వరకు ఫాంహౌస్‌లోనే ఉంటారని సమాచారం. కాగా, సీఎం వస్తున్నారనే సమాచారంతో జిల్లా ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో సాయంత్రం నుంచే రోడ్డు మార్గాన బందోబస్తు ఏర్పాటు చేశారు. గౌరారం, పాములపర్తి, శివారు వెంకటాపూర్ మీదుగా సీఎం కేసీఆర్ కాన్వాయ్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంది. -
ఎర్రవల్లి టూ మిషన్ భగీరథ పైప్‌లైన్
మెదక్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి మిషన్ భగీరథకు పైపులైన్ ఏర్పాటు చేశారు. రైట్ ఆఫ్ వే చట్టం కింద ఫాంహౌస్ నుంచి పైపులైన్ వేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. పైపులైన్ కోసం ఫాంహౌస్‌లో కొంతమేర అల్లం పంటను తొలగించినట్లు తెలిపారు. మిషన్ భగీరథకు అందరూ సహకరించాలని సీఎం కేసీఆర్ కోరారు. -
చదువుకున్న బడికి శంకుస్థాపన చేసిన కేసీఆర్
-
చదువుకున్న బడికి శంకుస్థాపన చేసిన కేసీఆర్
మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయప పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఎర్రవెల్లిలో దాదాపు 29 కోట్లతో కూడవెల్లి వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఎర్రవల్లిలో దాదాపు 42.5 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్‌కు శంకుస్థాపన చేశారు. కాగా మెదక్ జిల్లా దుబ్బాక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం అరుదైన ఘట్టం ఆవిష్కృతం అయింది. అరకొర వసతుల మధ్య విద్యనభ్యసించిన నాటి విద్యార్థి కేసీఆర్.. నేడు ముఖ్యమంత్రి హోదాలో పాఠశాల నూతన భవన శంకుస్థాపన చేశారు. తాను అష్టకష్టాలు పడి విద్యను పూర్తిచేశానని, తనకొచ్చిన బాధలు ఇప్పుడు చదువుకునే విద్యార్థులకు రావొద్దన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి పాఠశాల నూతన భవన నిర్మాణానికి రూ.4.67 కోట్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనంతరం దుబ్బాక నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులతో బాలాజీ ఫంక్షన్ హాలులో సీఎం సమీక్ష నిర్వహించారు. కాగా మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో వెంకటేశ్వర ఆలయంలో తన బాల్యమిత్రులతో సీఎం గడపనున్నారు. -
యాగం పరిపూర్ణం
అయుత చండీయాగం చివరిరోజు అగ్ని ప్రతిష్ట * 70 లక్షల ఆహుతులు, 10 లక్షల నవార్ణ మంత్రాలతో ఆజ్యహోమం * అమ్మవారికి 12 టన్నుల పరమాన్న ద్రవ్య తర్పణం * యాగం ముగింపు సమయంలో అపశ్రుతి.. యాగశాలకు ఆగ్నేయ దిశలో చెలరేగిన మంటలు * 45 నిమిషాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది * అంతకుముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి కేసీఆర్ మహారుద్రయాగం * అగ్ని ప్రమాదంతో యాగస్థలికి రాకుండానే వెనుదిరిగిన రాష్ట్రపతి * యాగస్థలిని శుద్ధి చేసి మహాపూర్ణాహుతి నిర్వహించడంతో ముగిసిన క్రతువు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి సకల జనహితం, సస్య సమృద్ధిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ చేపట్టిన అయుత చండీ మహాయాగం ఆదివారంతో పరిపూర్ణమైంది. పసుపువర్ణ వస్త్రాల్లో వచ్చిన 1,100 మంది రుత్విక్కులు నవార్ణ మంత్ర జపాలు చేస్తుండగా చండీమాతకు సీఎం 70 లక్షల ఆహుతులు, 10 లక్షల నవార్ణ మంత్రాలతో 12 టన్నుల పరమాన్న ద్రవ్యాన్ని ఆజ్యహోమ తర్పణం చేశారు. రెండు టన్నుల గంధపు చెక్కలతో హోమ గుండాలను వెలిగించారు. 4 రోజులపాటు ప్రశాంతంగా సాగిన యాగంలో చివరిరోజు అపశ్రుతి దొర్లింది. రాష్ట్రపతి ప్రణబ్ చండీ మాతకు మహా పూర్ణాహుతి ఇచ్చి యాగం పరిసమాప్తి చేసే క్రతువు మాత్రమే మిగిలి ఉందనగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 10 నిమిషాల్లో రాష్ట్రపతి మంటపం వద్దకు చేరుకుంటారనగా యాగశాలకు మంటలు అంటుకోవడం తో రుత్విక్కులు అగ్నిహోమం చేసే యాగశాల ప్రధాన మంటపం చాలావరకు అగ్నికి ఆహుతైంది. దీంతో రాష్ట్రపతి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ప్రమాదానికి కొద్ది గంటల ముందే ఏపీ సీఎం చంద్రబాబు యాగానికి వచ్చి వెళ్లారు. ప్రమాదం తర్వాత కేసీఆర్, గవర్నర్ నరసింహన్ దంపతులతో కలసి మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నవార్ణ జపాలకు తొలిసారి విఘ్నం శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి పంపిన ప్రత్యేక పట్టు వస్త్రాలు ధరించిన సీఎం కేసీఆర్ దంపతులు ఉదయం 8.30కి యాగశాల ప్రవేశం చేశారు. మహా సరస్వతి, మహాకాళి, వరలక్ష్మి విగ్రహాల వద్ద గురు ప్రార్థన చేశారు. గోపూజ, గణపతి హోమం తదితర పూజలు చేశారు. మహా పూర్ణాహుతికి ఆరంభంగా ఉదయం 9.40 గంటలకు రాజశ్యామల మంటపంలోని ప్రధాన హోమ గుండంలో అగ్నిప్రతిష్ట చేశారు. ఈ హోమ గుండంలోని అగ్నితోనే మిగతా 100 హోమగుండాలను వెలిగించారు. ఒక్కో హోమ గుండం వద్ద 11 మంది రుత్విక్కులు హోమం మొదలు పెట్టారు. పరమాన్నం, పూలు, పండ్లు, తమలపాకులతో ఆజ్యహోమం చేశారు. 10.20 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యాగశాలకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు మంత్రి హరీశ్‌రావు స్వాగతం పలకగా.. యాగశాల ప్రధాన ద్వారం వద్ద రుత్విజులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. చంద్రబాబు, ఆయన వెంట వచ్చిన కేంద్రమంత్రి సుజనా చౌదరి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఉన్నారు. వీరు మొదటి యాగశాలలో ప్రదక్షిణ చేశారు. అనంతరం కేసీఆర్ వారిని శివపార్వతుల విగ్రహం వద్దకు తీసుకెళ్లారు. రాజశ్యామల మంటపంలో కేసీఆర్, చంద్రబాబు మహారుద్ర యాగంలో పాల్గొన్నారు. తన వెంట తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు, పండ్లు, పూలను చంద్రబాబు.. మహారుద్రయాగం హోమగుండానికి సమర్పించారు. బాబు వచ్చిన సమయంలోనే యాగశాలలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో రుత్వికులు నవార్ణ మంత్ర జపాలను ఆపేసి కాసేపు బయటికి వెళ్లిపోయారు. ఇప్పటివరకు నిర్విఘ్నంగా కొనసాగిన నవార్ణ మంత్ర జపాలకు తొలిసారి బ్రేక్ పడినట్లు అయింది. యాగనిర్వాహకులు ఒక దిశలో మాత్రమే ఫ్యాన్లు నడిపి పొగను బయటికి పంపడంతో 30 నిమిషాల అనంతరం రుత్వికులు హోమగుండాల వద్దకు వచ్చి కూర్చున్నారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత కేసీఆర్ మళ్లీ మహారుద్రయాగం ప్రారంభించారు. కాళీ మాతకు పట్టు వస్త్రాలు, అరటి, కమలాలు, దానిమ్మ, ఆపిల్, జామ, మామిడి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం తదితర ఫలాలతో పాటు, పసుపు, కుంకుమతో పూర్ణాహుతి సమర్పించారు. ఆహుతైన ప్రధాన యాగ మంటపం మధ్యాహ్నం 12.30కి రుత్వికులు నవార్ణ మంత్ర జపాలు పూర్తి చేశారు. చండీమాతకు అంతిమ పూర్ణాహుతి ఇవ్వడం ద్వారా యాగం పరిసమాప్తం చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రపతి రాక కోసం ఈ కార్యక్రమాన్ని కొద్దిసేపు ఆపివేశారు. ఈ లోగా కొద్దిసేపు విరామం ఇవ్వడంతో 80 శాతం మంది రుత్వికులు యాగశాల వదిలి బయటికి వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో అంటే మధ్యాహ్నం 1.05 గంటలకు ఒక హోమగుండం వద్ద మిగిలిపోయిన ఆవు నెయ్యిని గుండంలోకి గుప్పించారు. దీంతో ఒక్కసారిగా యాగశాల ఆగ్నేయ దిశలో అగ్ని కీలలు పైకి లేచి యాగశాల పై కప్పును తాకాయి. అప్పటికే పొగతో వేడిగా మారిన పైకప్పు గడ్డి ఒక్కసారిగా అంటుకుంది. దీంతో రుత్విక్కులు యాగం చేసే ప్రధాన యాగ మంటపం 80 శాతం అగ్నికి ఆహుతైంది. అయిదు నిమిషాల్లోనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కాలుతున్న యాగశాలపైకి ఎక్కి యంత్రాల సాయంతో నీళ్లు చల్లడంతో మంటలు కొంత తగ్గుముఖం పట్టాయి. 20 నిమిషాల పాటు హెలికాప్టర్లోనే ప్రణబ్ మధ్యాహ్నం 1.28 గంటలకు రాష్ట్రపతి హెలికాప్టర్లు వచ్చాయి. ఒక హెలికాప్టర్ యాగశాల చుట్టూ చక్కర్లు కొట్టింది. రాష్ర్టపతి హెలికాప్టర్తోపాటుగా మరో పైలట్ హెలికాప్టర్ యాగశాలకు కిలోమీటర్ దూరంలో శివారు వెంకటాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగాయి. మంటలు అదుపులోకి వస్తే మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి సిద్ధమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు రాష్ట్రపతి హెలికాప్టర్లోనే వేచి ఉన్నారు. అయితే రాష్ట్రపతి చీఫ్ సెక్యూరిటీ అధికారి నుంచి అనుమతి రాకపోవడంతో ప్రణబ్ ముఖర్జీ తిరిగి వెళ్లిపోయారు. యాగస్థలిని సంప్రోక్షణ చేసిన పండితులు అగ్నిమాపక సిబ్బంది దాదాపు 45 నిమిషాల పాటు శ్రమించి మధ్యాహ్నం 2 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది కేసీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను యాగశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విశ్వామిత్ర అతిథి గృహంలోనికి తరలించారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత శృంగేరీ పీఠం శిష్యులు పురాణం మహేశ్వరశర్మ, ఫణిశశాంకశర్మ, గోపికృష్ణశర్మ వేదమంత్రాలతో యాగస్థలిని సంప్రోక్షణ చేశారు. అనంతరం సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్‌ను పూర్ణకుంభంతో ఆహ్వానించి హోమం నిర్వహించారు. చండీమాతకు అంతిమంగా మహాపూర్ణాహుతి సమర్పించి యాగాన్ని పరిపూర్ణం చేశారు. ఇందులో పరమాన్నంతోపాటు అయిదు టన్నుల బెల్లం, నాలుగు టన్నుల నెయ్యి వినియోగించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో స్పీకర్ మధుసూధనాచారి, ఎంపీ వి.హనుమంత రావు, రిటైర్డ్ జడ్జి ఎల్.నరసింహరెడ్డి, సినీ ప్రముఖులు జమున, తనికెళ్ల భరణి, డి.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా, చండీయాగం నిర్వహణ కోసం వార్త పత్రిక సీఎండీ గిరీష్ సంఘీ, జేఎంజే గ్రూపు చెర్మైన్ జేఎం జోషితో కలిసి రూ.25లక్షల విరాళం అందజేశారు. -
మహాపూర్ణాహుతి ప్రారంభం
-
మహాపూర్ణాహుతి ప్రారంభం
ఎర్రవల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన అయుత చండీయాగం చివరి దిశకు చేరుకుంది. ఆదివారం మధ్యాహ్నం యాగంలో ముగింపు కార్యక్రమమైన మహాపూర్ణాహుతి 2 వేల మంది రుత్వికులతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. గత నాలుగు రోజులుగా ఎర్రవల్లిలో భక్తిశ్రద్దలతో చండీయాగం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొద్ది సేపటి క్రితం అగ్ని ప్రమాదం జరిగింది. దురదృష్టవశాత్తు యాగశాల వద్ద అగ్నిప్రమాదం జరిగిందని ..ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. మరికాసేపట్లో శాస్త్రోక్తంగా యాగం ముగుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. యాగం చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. -
చండీయాగంలో అపశ్రుతి, అగ్నిప్రమాదం
ఎర్రవల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయుత మహాచండీయాగంలో చివరిరోజు అపశృతి చోటుచేసుకుంది. యాగం నిర్వహిస్తున్న యాగశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. హోమంలో మంటలు చెలరేగి యాగశాల మంటపం పైభాగానికి వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో అక్కడున్నవారంతా భయాందోళనతో చెల్లాచెదురయ్యారు. తొక్కిసలాట జరగకుండా పోలీసులు బారికేడ్లు తొలగించారు. యాగశాలలో ఉన్న ప్రముఖులు, ప్రజలను బయటకు పంపించారు. మూడు అగ్నిమాపక శకటాల సాయంతో అగ్నిప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఒకేసారి పెద్ద మొత్తంలో హోమగుండంలో ఆవు నెయ్యి వేయండంతో మంటలు చెలరేగాయి. యాగ విరామ సమయంలో మంటలు అంటుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిమిషాల వ్యవధిలోనే మంటలను అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, యాగం యధావిధిగా కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటించారు. వెనుదిరిగిన రాష్ట్రపతి ఈ మధ్యాహ్నం ఎర్రవల్లి చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చండీయాగంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. చండీయాగంలో మంటలు వ్యాపించడంతో యాగప్రాంగణంలో కలకలం రేగింది. సరిగ్గా అదే సమయానికి హెలికాప్టర్ లో రాష్ట్రపతి అక్కడకు చేరుకున్నారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో రాష్ట్రపతి కిందకు దిగకుండానే వెనుదిరిగారు. -
చండీయాగంలో చంద్రబాబు
-
చండీయాగంలో చంద్రబాబు
మెదక్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం ఎర్రవల్లికి చేరుకున్నారు.మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం చివరి రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. ఎర్రవల్లికి చేరుకున్న చంద్రబాబుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబుతో పాటు మంత్రులు సుజనాచౌదరి, కేఈ కృష్ణ మూర్తి, గంటా శ్రీనివాస్‌లు ఎర్రవల్లికి చేరుకున్నారు. బెజవాడ దుర్గమ్మ చీర, కుంకుమ, ప్రసాదాలను చంద్రబాబు తన వెంట తీసుకొచ్చారు. చంద్రబాబును ఆయుత చండీయాగంలో పాల్గొనాలని కోరుతూ కేసీఆర్ విజయవాడకు వెళ్లి ఆహ్వానించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆదివారం చివరిరోజు ఆయుత చండీయాగం కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబు ఎర్రవల్లి చేరుకున్నారు. -
ఎర్రవల్లిలో నాలుగోరోజు యాగం ప్రారంభం
-
ఎర్రవల్లిలో నాలుగోరోజు యాగం ప్రారంభం
మెదక్ : లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత మహాచండీయాగం నాలుగో రోజు శనివారం అత్యంత వైభవంగా ఆరంభమైంది. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో ఉదయం ఎనిమిది గంటలకు ఈ యాగం ప్రారంభమైంది. యాగంలో భాగంగా ఈ రోజు మృత్యుంజయ హోమం, కుమారి సూహాసిని పూజ, కోటి సహస్రనామాలను రుత్వికులు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ దంపతులు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి యాగశాలకు చేరుకున్నారు. ఈ రోజు యాగానికి తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య హాజరయ్యారు. అలాగే ఎన్సీపీ నేత శరద్ పవర్‌తో పాటు సుప్రీంకోర్టు నాయమూర్తి ఎన్వీ రమణ కూడా ఈ యాగ స్థలికి విచ్చేశారు. అయితే ఉదయం నుంచే ఎర్రవల్లికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీ పెరగడంతో యాగశాల వద్ద మరో రెండు అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ యాగం ఆదివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చివరి రెండు రోజులు అంటే ఇవాళ, రేపు భక్తులు భారీ సంఖ్యలో ఎర్రవల్లికి తరలి వచ్చే అవకాశం ఉంది. -
ఎర్రవల్లిలో మరింత రద్దీ
జగ్దేవ్పూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలో చేపట్టిన అయుత మహాచండీయాగం శనివారం నాలుగోరోజుకు చేరుకుంది. అయుత చండీయాగం చూసేందుకు వచ్చే భక్తుల సంఖ్య శనివారం ఉదయం మరింత పెరిగింది. చివరి రెండు రోజులు కావటంతో శనివారం ఉదయానికే సుమారు 80 వేల మంది యాగశాలకు చేరుకున్నారు. యాగశాల వైపునకు వచ్చే బైక్‌లు సహా వాహనాలను నర్సన్నపేట్, ప్రజ్ఙాపూర్, గౌరారం, తుర్కపల్లి వద్దనే పోలీసులు నిలిపివేస్తున్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మధ్యాహ్నానికి రద్దీ తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు యాగానికి లక్ష వరకు భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా నేడు కుంకుమార్చన రద్దు చేస్తున్నట్లు నిర్వహాకులు తెలిపారు. -
నేడు నాలుగో రోజు అయుత చండీయాగం
మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలో చేపట్టిన అయుత మహాచండీయాగం శనివారం నాలుగోరోజుకు చేరుకుంది. నేడు మృత్యుంజయ హోమం, కుమారి సూహాసిని పూజ, కోటి సహస్రనామాలు పూజలు జరగనున్నాయి. మధ్యాహ్నం ఈ యాగానికి తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య హాజరుకానున్నారు. ఈ యాగానికి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు యాగానికి లక్ష వరకు భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా నేడు కుంకుమార్చన రద్దు చేస్తున్నట్లు యాగం నిర్వహాకులు తెలిపారు. అయితే ఈ చండీయాగం ఆదివారంతో ముగియనుంది. చివరి రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ యాగానికి విచ్చేయనున్నారు. -
చండీయాగానికి తరలివచ్చిన ప్రముఖులు
హైదరాబాద్: అయుత మహా చండీయాగం మూడోరోజు కార్యక్రమం శుక్రవారం ఉదయం గురుపార్థనలతో ప్రారంభమైంది. ఉ8.20 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు యాగశీల ప్రవేశం చేశారు. గురుప్రార్ధనలో భాగంగా శృంగేరిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతితిర్థి స్వామివారికి వందేగురు పరంపర అంటూ రుత్విజులు పఠనం చేస్తుండగా సీఎం గురువుకు సాష్టాంగ ప్రణామం చేశారు. సప్తశాధీ పారయాగం ప్రారంభించే ముందు పూర్వాంగం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అఃతర మాతృకశ్యాసాలు, బహిర్ మాతృకన్యాసాలు, చండీ కవచం, అర్గళ, కీలక పఠనం, ఏకదశిశ్యానాలు నిర్వహించారు. శరీరంలో అమ్మవారిని ఆవాహన చేసుకునేందుకు రుత్విజులు పాటించే సంప్రదాయ కార్యకామమిది. యాగశాల పొంగగాన్ని చాయంతి, బంతి పూలతో ప్రత్యేకంగా అలంకరించి ఆకర్షణీయంగా మార్చారు. గురుప్రార్థనతో కలియతిరిగి రుజ్విజులకు అభివాదం చేశారు. శుక్రవారంనాటి కార్యకామానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి, శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణనందస్వామిలకు సీఎం స్వాగతం పలికి, పాదాభివందనం చేశారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ చక్రపాణి , ఆంధ్రప్రదేశ్అసెంబ్లీ స్వీకర్ కోడెల శివప్రసాదరావు , తెలంగాణమంత్రులు టీ హరీష్‌రావు, కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివవాస్ రెడ్డి, చందూలాల్, టూరిజం కార్పోరేషన్ చైర్మన్ పేర్వారం రాములు, మీడియా సంస్థల అధిపతులు గిరీష్ సంఘి, గౌతమ్, వీ రాధాకృష్ణ, శైలజాకిరణ్, పలువులు అధికార, అనధికార ప్రముఖులు హాజరయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ దంపతులు ఉదయం పూజల్లో పాల్లొని, అన్నప్రసాదాలు స్వీకరించారు. యాగశాలకు వచ్చిన అతిథులకు ప్రధానం ద్వారం వద్ద మంత్రి హరీష్‌రావు ఆహ్వానించగా , యాగశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో ప్రదక్షిణం చేయించారు. ఈ సందర్భంగా శృంగేరి పీఠం నుంచి వచ్చిన ప్రధాన రుత్వికుల్లో ఒకరైన ఫశిశశాంక శర్మ అయుత చండీయాగం నేపధ్యాన్ని వివరించారు. -
మూడోరోజుకు చేరిన అయుత చండీయాగం
-
ఎర్రవల్లిలో బారులు తీరిన భక్తులు
ఎర్రవల్లి: మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. శుక్రవారం నుంచి వరుస సెలవులు కావడంతో ఉదయం 5 గంటల నుంచే భక్తుల రద్దీ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల కల్లా దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు ఎర్రవల్లి వచ్చారు. ఎర్రవల్లికి వెళ్లే మార్గంలో 5 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, తూప్రాన్, కొండపాక, జగదేవ్‌పూర్, గజ్వేల్ మండలాలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల నుంచి ప్రజలు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారితో పాటు జగదేవ్‌పూర్-నల్లగొండ ప్రధాన మార్గం సైతం రద్దీగా మారింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. -
మూడోరోజుకు చేరిన అయుత చండీయాగం
ఎర్రవల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అయుత చండీయాగం మూడోరోజు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం గురుప్రార్ధనతో మూడోరోజు అయుత చండీ యాగం ప్రారంభమైంది. వేద మంత్రాల మధ్య పూజలు ప్రారంభమయ్యాయి. శ్వేత వర్ణ దుస్తుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాగస్థలికి చేరుకున్నారు. గురు ప్రార్థనతో ప్రారంభమైన చండీయాగం, గోపూజ, త్రిసహస్ర చండీ పారాయణములు, నవార్ణ పూజ, నవగ్రహ హోమం, తదితరాలతో పాటు మహా మంగళహారతి నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ యాగాన్ని తిలకించేందుకు వచ్చారు. ఆయనకు కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారు. మరోవైపు ఈ చండీయాగానికి వీఐపీల నుంచి సామాన్య ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇవాళ రాత్రి 10 గంటల వరకూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. భక్తులు ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకూ యాగశాలను సందర్శించే అవకాశం ఉంది. నేటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అన్నమయ్య భావనా వాహిణి వ్యవస్థాపకురాలు శోభారాజ్ అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి తదితర ప్రముఖలు ఈ చండీయాగంలో పాల్గొంటారు. ఇక గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, తూప్రాన్, కొండపాక, జగదేవ్‌పూర్, గజ్వేల్ మండలాలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల నుంచి ప్రజలు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారితో పాటు జగదేవ్‌పూర్-నల్లగొండ ప్రధాన మార్గం సైతం రద్దీగా మారింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. -
ఇంత జనం వస్తే ఎలా?
భక్తుల తాకిడిపై పోలీసుల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: ఎర్రవల్లి.. ఇప్పుడో పుణ్యక్షేత్రం. పర్యాటక ప్రాంతం. అన్ని దారులే అటే. గతంలో కనీసం పేరు కూడా వినిఉండని ధార్మిక వేడుక కావటం, 1,500 మంది రుత్విజులు ఏకధాటిగా చండీ సప్తశతి పారాయణంతో నిర్వహించే మహా యాగం కావడం, స్వయంగా సీఎం నిర్వహిస్తుండటంతో భక్తుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. దీంతో తొలిరోజే భక్తులు పోటెత్తారు. రెండోరోజు వారి సంఖ్య రెట్టింపైంది. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవు కావటంతో వారి సంఖ్య మరింత పెరగనుంది. ఇప్పుడిదే అధికారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తితే నియంత్రించటం కష్టమవుతుందని పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే రోజుల్లో అయుత చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు రానుండటంతో భక్తుల నియంత్రణ సవాల్‌గా మారుతుందని భావిస్తున్నారు. దీంతో భక్తుల రద్దీని నియంత్రించక తప్పదని ఇతర విభాగాల అధికారులతో పోలీసులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీకి ప్రత్యేకంగా విన్నవించారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వరుసగా సెలవులు ఉండటంతో బస్సులు పెంచాలని ఆర్టీసీ తొలుత నిర్ణయించింది. కానీ పెంచి తే ఎర్రవల్లికి తాకిడి భారీగా ఉంటుందని, బస్సులు తగ్గించాలని పోలీసులు ఆర్టీసీని కోరారు. ఉదయం భారీగా తగ్గించి.. కొన్నిం టిని మాత్రమే మధ్యాహ్నం, సాయంత్రం నడపాలని సూచించా రు. ఒకే సమయంలో ఎక్కువమంది రాకుండా.. సాయంత్రానికి మళ్లించాలనేది వారి ఆలోచన. దీంతో బస్సుల సంఖ్యను తగ్గించి పరిమితంగానే నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. -
మహాయాగం.. శుభారంభం
-
మహాయాగం.. శుభారంభం
ఎర్రవల్లిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ మొదలైన అయుత చండీ మహాయాగం అయుత చండీ యాగశాల నుంచి ప్రత్యేక ప్రతినిధి/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత చండీ మహాయాగం అత్యంత వైభవంగా ఆరంభమైంది. వేద పండితులు, రుత్విజులు, భక్తజన సందోహంతో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అయుత చండీ మహాయాగం నిర్ణయించిన ముహూర్తం మేరకు బుధవారం ఉదయం ప్రారంభమైంది. 8.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు యాగశాల ఆవరణ ప్రవేశం చేశారు. మంత్రులు హరీశ్‌రావు, కె.తారకరామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సీఎం వెంట వచ్చారు. రుత్విక్కులు, బ్రాహ్మణులు వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంభంతో సీఎం దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రుత్విక్కులతో కలసి సీఎం యాగశాల ప్రదక్షిణ చేశారు. సీఎంతోపాటు అందరూ మొదటి రోజున నిర్దేశించిన పసుపు రంగు దీక్షా వస్త్రాలు ధరించారు. శృంగేరి శారదా పీఠాధిపతి శిష్యులు పురాణం మహేశ్వర శర్మ, ఫణి శశాంక శర్మ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ యాగంలో రుత్విక్కులు తొలి రోజు ఒక పారాయణం, 4 వేల జపాలు చేశారు. త్రైలోక్యగౌరీ వ్రతంలో అంకురార్పణ గవర్నర్ నరసింహన్ దంపతులు 8.45 గంటలకు యాగశాలకు రాగా.. వారికి ముఖ్యమంత్రి దంపతులు, రుత్విజులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. చండీమాత విగ్రహం ముందు గురుప్రార్థనతో మొదటి రోజు కార్యక్రమం మొదలైంది. సీఎం దంపతులు, గవర్నర్ దంపతులు పూజలో పాల్గొన్నారు. మొదట విఘ్నేశ్వరుడికి పూజ చేసి నిర్విఘ్న సమాప్తికై గణపతిమోదక హవనం చేశారు. త్రైలోక్యగౌరీ వ్రతంతో చండీయాగానికి అంకుర్పారణ జరిగింది. యాగం జరుగుతున్నంత సేపు కేసీఆర్‌కు చదువు చెప్పిన గురువు మృత్యుంజయశర్మ దంపతులు ఆయన వెంటే ఉన్నారు. అంతకుముందు వేద పండితులు పురాణం మహేశ్వరశర్మ, ఫణి శశాంకశర్మ, గోపీకృష్ణశర్మ తదితరులు పంచగవ్యప్రాశన, గోమూత్ర, గోమయ, గోఘృత, గోదధి, గోక్షీరం కలిపి మంత్రయుక్తంగా యాగశాల మంటపాన్ని శుద్ధి చేశారు. పూజా కార్యక్రమాలివీ.. ముఖ్యమంత్రి, గవర్నర్ దంపతులు కలిసి గోపూజ, మహామంటప స్థాపన, చండీయంత్ర లేఖనం, యంత్ర ప్రతిష్ట, దేవతాహ్వానం, ప్రాణప్రతిష్ట, నవా వరుణార్చన, మహారుద్రయాగ సంకల్పం, రాజ శ్యామల పునఃశ్ఛరణ, చతుర్వేద యాగ ప్రారంభం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 10:30 గంటలకు మహా మంగళహారతి పూర్తి చేసి యాగశాలను రుత్వికులకు అప్పగించారు. రాజ శ్యామల యాగం పూర్ణాహూతిలో ఆచార్య రవిశంకర్, వేద పండితులు కుప్పా రామజోగి సోమయాజులు పాల్గొని సీఎం దంపతులను ఆశీర్వదించారు. శృంగేరీ పీఠం పండితులు నరహరి సుబ్రహ్మణ్య భట్టు, తంగిరాల శివకుమార శర్మ పవిత్ర శ్రీచక్రానికి నవార్ల పూజాకల్పోక్తంగా ప్రత్యేక అర్చనలు జరిపారు. హంపీ విరూపాక్ష పీఠం అధిపతి విద్యారణ్య విరూపాక్ష స్వామి, శ్రీశైలం జగద్గురు పీఠం అధిపతులు శ్రీవీరశైవ మహాస్వామి పాల్గొని కేసీఆర్ దంపతులను ఆశీర్వదించారు. 3 క్వింటాళ్ల కుంకుమ.. 5 వేల మంది మహిళలు 100 హోమగుండాలు.. ప్రతి హోమగుండం చుట్టూ 11 మంది రుత్విక్కులు కూర్చొని ఏకోత్తర వృద్ధి (1,100 మంది రుత్విక్కులు ఏకకంఠంతో) సంప్రదాయంతో సప్తశతి పారాయణం, 4 వేల చండీ నవాక్షరీ జపం చేశారు. 11:25 గంటలకు ఏకకంఠంతో చండీయాగ పారాయణం ప్రారంభించి.. నిర్విఘ్నంగా మధ్యాహ్నం 1:40 వరకు కొనసాగించి 4 వేల చండీ నవాక్షరీ జపాలను పూర్తి చేయడంతో తొలిరోజు క్రతువు ముగిసింది. ఇదే సమయంలో మరో 400 మంది రుత్విక్కులు మహారుద్రయాగం, కుమారస్వామి, ముత్తయిదువులతో కుంకుమార్చన నిర్వహించారు. 3 క్వింటాళ్ల కుంకుమతో 5 వేల మంది మహిళలతో లలితా సహస్ర నామాలతో గౌరీదేవికి కుంకుమార్చన చేశారు. యాగం జరుగుతున్నంతసేపు సీఎం దంపతులు మంచినీళ్లు కూడా ముట్టలేదు. యాగం జరుగుతున్నంతసేపు సైనిక హెలికాప్టర్ ఆకాశంలో చక్కర్లు కొడుతూ గస్తీ నిర్వహించింది. ప్రముఖుల రాక.. తొలి రోజున ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. మొదటి రోజున గవర్నర్ దంపతులతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి బొసాలే, న్యాయమూర్తులు చంద్రయ్య, దుర్గాప్రసాద్, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు, మై హోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, హన్మంత్ షిండే, బాబూమోహన్, ప్రశాంత్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, మాదవరం కృష్ణారావు, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్, కేశవరావు, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీష్, రాములు నాయక్, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు యాగాన్ని వీక్షించారు. అద్భుతంగా యాగశాల రెల్లు గడ్డితో అత్యద్భుతంగా నిర్మించిన చండీ మహాయాగ శాల భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ప్రాంగణమంతా భక్తి భావం ఉప్పొంగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సీఎం స్వీయ పర్యవేక్షణలో జరిగిన ఏర్పాట్లు అందరినీ అబ్బురపరిచాయి. తొలి రోజు ఎర్రవల్లికి వెళ్లే దారులన్నీ ప్రైవేటు వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయాయి. దాదాపు 25 వేల మంది భక్తులు యాగాన్ని తిలకించేందుకు వచ్చినట్లు అంచనా. -
యాగవల్లి
వేద మంత్రాలతో ఘోషించిన ఎర్రవల్లి వైభవంగా ప్రారంభమైన అయుత చండీ యాగం అమ్మవారి సేవలో తరించిన భక్తజనం అయుత చండీ మహాయాగం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బుధవారం ఉదయం ఈ మహా క్రతువు మొదలైంది. సకల వసతులతో కూడిన ఏర్పాట్లు అందరిని కట్టిపడేశాయి. లోక కల్యాణం కోసం సీఎం కేసీఆర్ దంపతులు చేపట్టిన ఈ యాగంలో వందలాదిమంది వేద పండితులు ఒక్కచోట చేరి వేదాలు ఘోషించారు. గవర్నర్ నరసింహన్ దంపతులతోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం పెద్ద సంఖ్యలో అమ్మవారి పూజలో పాల్గొన్నారు. మహిళలు భారీ ఎత్తున కుంకుమార్చన నిర్వహించారు. చండీ మాత పూజతోపాటు యాగ నిర్వహణను అతిథులు, భక్తులు చూసి తరించారు. దాదాపు 50 వేల మందికి రుచికరమైన భోజనాలను వడ్డించారు. ఐదురోజుల మహోత్సవంలో మొదటిరోజు కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. - జగదేవ్‌పూర్ ఐదువేల మందితో కుంకుమార్చన.. గజ్వేల్: చండీయాగం విజయవంతం చేసేందుకు యాగ శాల ప్రధాన ద్వారం సమీపంలో పెద్ద ఎత్తున కుంకుమార్చన నిర్వహించారు. ఐదు విడతలుగా సాగిన ఈ కార్యక్రమంలో ఒక్కోవిడతలో వెయ్యిమంది చొప్పున మహిళలు పాల్గొన్నారు. ఒక్కో విడత 45నిమిషాలపాటు సాగింది. 40 మంది వేద పండితులు ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. అమ్మవారికి వెయ్యి సహస్రనామాలతో కుంకుమార్చన చేశారు. అయుత సంకల్పానికి దగ్గరి మార్గం.. సంగారెడ్డిలోని దుర్గాభవానీ క్షేత్రం నిర్వాహకులు కాసుల నర్సింహశర్మ, పవనశర్మ కార్యక్రమ ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. అయుత సంకల్పానికి ఇది చాలా దగ్గరి మార్గంగా అభివర్ణించారు. వెయ్యి సహస్ర నామాలుగా సాగే ఈ కార్యక్రమంలో ఒక్కో నామానికి ఒక్కో విశేషం ఉంటుందని చెప్పారు. కుంకుమార్చనలో నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొని మహిళలతో కాసేపు ముచ్చటించారు. ఏర్పాట్లను అదనపు జేసీ వెంకట్వేర్లు, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు పర్యవేక్షించారు. 50వేల మందికి భోజనాలు జగదేవ్‌పూర్: అయుత చండీయాగానికి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణతోపాటు భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజన కార్యక్రమాలు కొనసాగాయి. ఉదయం భక్తులకు ఉప్మా, చెట్నీతో అల్పాహారమందించారు. మధ్యాహ్న భోజనంలో కందిపప్పు, ఆలుగడ్డ, కాలీఫ్లవర్‌తో కలిపి కూరలు చేశారు. బెండకాయతో పిండిచారు, పెరుగు, దొండకాయ పచ్చడితో భోజనం పెట్టారు. మధ్యాహ్నం 1:40 నుంచి భోజనాలు మొదలు పెట్టగా సాయంత్రం వరకు కొనసాగింది. 50 వేల మంది భోజనాలు చేసినట్టు అంచనా. లోక కల్యాణం కోసమే... శాంతి కోసం, లోక కల్యాణం కోసం చేస్తున్న యాగమిది. ప్రజలకు ఆయురారోగ్యాలను ప్రసాదించడం. కరువు కాటకాలను తరిమికొట్టడం, పశుపక్షాదుల సంరక్షణ తదితర లక్ష్యాలు సైతం ఇందులో ఇమిడి ఉన్నాయి. నేను శృంగేరిలో, ప్రస్తుతం ఇక్కడ రెండసార్లు అయుత చండీయాగంలో పాల్గొన్నా. ఎంతో ఆనందంగా ఉంది. - ఆదిత్య శర్మ (వేద పండితులు, శివమొగ్గ, కర్ణాటక) యాగంతో మంచి ఫలితాలు నియమ నిష్టలతో చేృస్తున్న ఈ యాగంతో మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కళ్లల్లో ఆనందం చూసేలా.. కరువును తరిమికొట్టాలని దేవతలను వేడుకునే క్రమంలో యాగం జరపడం సంతోషకరం. గతంలో శృంగేరి పీఠంలో... ప్రస్తుతం అయుత చండీ యాగాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. - శ్రీపాద శర్మ(హోస్పేట్, కర్ణాటక) ఏర్పాట్లు ఘనం... గతంలో మా క్షేత్రంలోనూ ఈ యాగం జరిగింది. వైదిక నిర్వహణలో మార్పుల్లేవు. కానీ ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయి. యాగశాలలు, వసతుల ఏర్పాట్లు పూర్తిగా ఆధ్మాత్మిక వాతావరణంలో సాగాయి. ఇంత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడం మరెవరికీ సాధ్యం కాదు. - కాసుల నర్సింహ్మశర్మ (సంగారెడ్డిలోని దుర్గాభవానీ క్షేత్రం నిర్వాహకుల్లో ఒకరు) అంతా ఆధ్యాత్మికత... యాగశాల ప్రాంగణంలో అణువణువునా.... ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. దృఢ సంకల్పంతో సీఎం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు యాగశాలను సందర్శించి చండీమాత అనుగ్రహానికి పాత్రులు కావాలి. నిజంగా ఇది మంచి అవకాశం. - పవన కుమార శర్మ (సంగారెడ్డి భవానీ క్షేత్రం నిర్వాహకుల్లో ఒకరు) -
ఎర్రవల్లి పిలుస్తోంది!
దేశం దృష్టిని ఆకర్షిస్తున్న కుగ్రామం * అయుత చండీయాగంతో చుట్టుపక్కల ఊళ్లకూ కొత్త వెలుగులు * మెరిసిపోతున్న రహదారులు.. మురిసిపోతున్న పల్లె ప్రజలు * అంగరంగ వైభవంగా ఏర్పాట్లు.. విద్యుత్ వెలుగుల్లో కాంతులీనుతున్న యాగక్షేత్రం అయుత చండీయాగశాల నుంచి సాక్షి ప్రతినిధి: కంకర తేలిన రోడ్లు.. తాగునీళ్లకు తండ్లాట.. గుడిసెల్లో బతుకులు.. పొద్దుగూకితే ఇళ్లల్లో అలుముకునే చీకట్లు.. ఊళ్లో ఏమైనా అయితే పక్కపల్లెకు తెలియనంత కుగ్రామం అది! మెదక్, నల్లగొండ జిల్లా సరిహద్దుల్లో విసిరేసినట్టున్న ఆ గ్రామం ఇప్పుడు రాష్ట్రానికే కాదు.. దేశంలోని పల్లెలకే ఆదర్శం. అదే జగదేవ్‌పూర్ మండలంలోని ఎర్రవల్లి! సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌తో వార్తల్లోకి ఎక్కిన ఈ గ్రామం ఇప్పుడు అయుత చండీయాగంతో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. యాగశాల దారిలో..: హైదరాబాద్ నుంచి శామీర్‌పేట మీదుగా రాజీవ్ రహదారిపై కరీంనగర్ వైపు 56 కిలోమీటర్లు ప్రయాణిస్తే గౌరారం గ్రామం వస్తుంది. అక్కడ ఆగి కుడి వైపునకు చూస్తే ‘చతుర్వేద స్వాహాకార పురస్సర మహారుద్ర పురశ్చరణ సహిత అయుత చండీ మహాయాగం’ అని రాసిన నిలువెత్తు స్వాగత ద్వారాలు యాగశాలకు దారి చూపిస్తున్నాయి. 33 అడుగుల డ బుల్ లైన్ రోడ్డు నల్లగా మెరుస్తోంది. ఇంతకుముందు ఇక్కడ ప్యాచ్‌లు వేసిన 10 అడుగుల సింగిల్ రోడ్డు ఉండేది. యాగం కోసం వారం కిందటే డబుల్ లైన్ రోడ్డు వేశారు. గౌరారం నుంచి వర్థరాజ్పూర్ వరకు రూ.17 కోట్లు ఖర్చు చేసి 12.5 కిలోమీటర్ల మేర ఈ దారి వేశారు. రోడ్లు, భవనాల శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 45 రోజుల్లోనే ఈ రోడ్డు పూర్తి చేశారని చెబుతున్నారు. గౌరారం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపుల ఉన్న దాబాలు కూడా ముస్తాబయ్యాయి. కొత్త ఫర్నిచర్, కొత్త ధరల పట్టికతో సిద్ధమయ్యాయి. తినటం మానేస్తామా సార్.. గౌరారం మీదుగా 3 కిలోమీటర్లు ముందుకు వెళ్తే పాములపర్తి ఊరు. ఈ ఊరిపై యాగం ప్రభావం పెద్దగా కనిపించ లేదు. చేనులో పత్తి ఏరుకునే కొందరు కూలీలను పలకరించగా.. ‘‘యాగం ఉందని తినటం మానేస్తమా సారూ.. యాగానికి పోతే ఇళ్లెట్ల గడవాలే’’ అని వారన్నారు. యాగశాల వైపు బయల్దేరితే మార్కుక్ గ్రామం వచ్చింది. సీఎం ఫాంహౌస్‌కు వెళ్లే సమయంలో ఇక్కడ ఆగి మాట్లాడుతూ... ‘‘వెయ్యి ఎకరాల సాగు ఉన్న గ్రామమట. సారవంతమైన భూముల్లో కూరగాయలు పండుతాయట. చిన్న సన్నకారు రైతులు బోర్లు వేసుకున్నారు. రైతుల ఆర్థిక పరిస్థితి ఫర్వాలేదు’’ అని మార్కుక్ను ఉద్దేశించి ఒకట్రెండు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇక అక్కడ్నుంచి కిలోమీటర్ దూరం నడిస్తే.. గంగాపూర్ చౌరస్తా. ఇక్కడ కుడి, ఎడమలుగా రెండు దార్లు వెళ్తాయి. కుడివైపు దారిని వీవీఐపీలు, వీఐపీలకు కేటాయించారు. సామాన్యులకు ఈ దారిగుండా అనుమతి లేదు. గంగాపూర్ చౌరస్తా నుంచి యాగస్థలం వరకు ప్రతి స్తంబానికి హైమాస్టు లైట్లు పెట్టారు. ఎడమ వైపు దారిలో సామాన్య భక్తులకు, వివిధ గ్రామాల నుండి వచ్చే నాయకులకు, సర్పంచ్‌లు, ఎంసీటీసీలకు కేటాయించారు. దేదీప్యమానంగా యాగస్థలి గంగాపూర్ శివారులో మేకలు చూసుకుంటున్న అబ్బసాని మల్లయ్య యాదవ్‌ను ‘తాత యాగం ఎట్టున్నదే..’ అని పలకరించగా.. ‘కాలం బోయింది బిడ్డా... నా సిన్నప్పుడు ఇంత సౌలతి ఎక్కడిది. రోడ్డు జూస్తివా... ఎట్టేసిండ్రో... పోచమ్మ తల్లికి ఏటపోతును కోస్తేనే పెద్ద పండుగ అనుకునేటోళ్లం. ఇంత పెద్ద యాగం ఉంటదని నాకు తెల్వను కూడా తెల్వదు. కేసీఆర్ పెద్దోడు కాబట్టి జోరుగ జేస్తండు. ఎట్టాజేసినా గ దే పుణ్టెం (పుణ్యం) కద బిడ్డా...’ అంటూ వేదాంతం చెప్పాడు. ఈ చౌరస్తా నుంచి శివారు వెంకటాపూర్ వరకు ప్రతి స్తంబానికి హైమాస్టు లైట్లు బిగించారు. శివారు వెంకటాపూర్ నుంచి యాగస్థలం ఒక కిలోమీటర్ లోపే. విద్యుత్ దీపాల వెలుగుల్లో యాగస్థలం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అంత వెలుగును చూడటం చుట్టు పక్కల పల్లె ప్రజలకు అదే మొదటిసారి అట. ‘ఆ లైట్లను జూత్తంటే పట్నంల ఉన్నట్టే ఉంది సారూ..’ అంటూ యాదమ్మ అనే మహిళ సంబరపడిపోయింది. పొలం పనులు చేసుకొని ఇళ్లకు వెళ్తున్న శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన మూనగారి లక్ష్మి, గాలవ్వలను పలకరించగా.. ‘సీఎం సారు.. మా ఊరు నుంచే వత్తాపోతా ఉంటడు గానీ ఊళ్లె దిగకపాయే. యాగం పెడితే మంచిదేగా సారూ..’ అని అన్నారు. యాగానికి మీరు వస్తారా? అని అడగ్గా.. ‘తీరుబాటు ఉంటే అత్తాం.. లేకుంటే లేదు..’ అని సమాధానమిచ్చారు. శివారు వెంకటాపూర్ చౌరస్తా వద్ద 5 హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డు ఎడమ వైపు ఒకదాని తర్వాత ఒకటిగా నాలుగు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి గవర్నర్‌కు, మరొకటి ఏపీ సీఎం చంధ్రబాబునాయుడుకు కేటాయించారు. కుడివైపున రాష్ట్రపతి కోసం మరో హెలిప్యాడ్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు. కరీంనగర్ నుంచి ఇలా రావాలి.. కరీంనగర్ నుంచి వచ్చేవారి కోసం ప్రజ్ఞాపూర్ వద్ద యాగం స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రజ్ఞాపూర్ నుంచి ఎర్రవల్లి యాగశాల 12 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ్నుంచి 7 కిలో మీటర్లు ప్రయాణిస్తే గణేష్‌పల్లి చౌరస్తా. అక్కడ చరణ్ అనే యువకుడిని పలకరించగా.. ‘‘కేసీఆర్ గొప్పోడు సార్.. ఇంత పెద్దయాగం చేస్తుండు. ఎర్రవల్లికే కాదు సార్.. చుట్టుపక్కల మా ఊళ్లకు కూడా పేరొచ్చింది.. యాగం కోసం నెల నుంచి రోడ్డు వేస్తున్నరు కదా. భోజనాలు, టిఫిన్లు, ఛాయ్ బాగా పోతున్నాయి సార్..’’ అంటూ మురిసిపోయాడు. ఖమ్మం, నల్లగొండ నుంచి వచ్చే భక్తులు గ ణేష్పల్లి చౌరస్తాకు చేరుకున్న తర్వాత కుడివైపు మళ్లితే నర్సన్నపేట క్రాస్ వస్తుంది. కరీంనగర్, వరంగల్ భక్తులు కూడా ఇదే దారిన రావాలి. హైదరాబాద్ కుషాయిగూడ నుంచి వచ్చే వారికి కూడా ఒక దారి ఉంది. వాళ్లు లక్ష్మాపూర్, కర్కపట్ల, దామరకుంట, వర్ధరాజ్‌పూర్ మీదుగా 30 కిలోమీటర్లు ప్రయాణించి ఎర్రవల్లి యాగ స్థలానికి చేరుకోచ్చు. యాగానికి 20 కిలోమీటర్ల దూరం నుంచే ప్రతి గ్రామ శివారులో ఒక చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ప్రతి చెక్ పోస్టు వద్ద 6 మంది పోలీసులను కాపలా పెట్టారు. ఎర్రవల్లి దశ తిరిగింది.. ఎర్రవల్లి 420 కుటుంబాలున్న చిన్న పల్లె. 2,200 ఎకరాల సాగు భూమి ఉంది. పత్తి, మొక్కజొన్న ప్రధాన పంటలు. కేసీఆర్ రాకముందు ఈ పల్లెను పట్టించుకున్నవారు లేరు. కేసీఆర్ క్లాస్మేట్ జహంగీర్ పట్టుబట్టి ఎర్రవల్లిలో కేసీఆర్‌తో భూమి కొనుగోలు చేయించారట. అప్పట్నుంచే ఊరు దశ తిరిగింది. తెలంగాణ రావడం.. కేసీఆర్ సీఎం కావడం గ్రామాభివృద్ధికి మరింత బలం చేకూరింది. సీఎం కేసీఆర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 285 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేశారు. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ప్రతి రైతుకు డ్రిప్పులు అందిస్తున్నారు. గ్రామస్తులను పలకరిస్తే.. ‘మా బతుకులకు ఢోకా లేదండీ.. కేసీఆర్ అన్నీ ఇస్తున్నారు. ఈ యాగంతో మా యోగం మారిపోద్ది..’ అని మురిసిపోయారు. భారీ పోలీస్ బందోబస్తు ఐదు రోజలు జరిగే ఈ అయుత చండీయాగానికి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సుమతి, ఆరుగురు ఏఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 60 మంది సీఐలు, 185 మంది ఎస్సైలు, 40 మంది మహిళ ఎస్సైలు, 300 మంది ఏఎస్సైలు, 200 మంది హోంగార్డులు, 400 మంది కేంద్ర భద్రత బలగాలలతో పాటు ఆదనంగా 400 మందిని కానిస్టేబుళ్లలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. -
చండీయాగానికి వై-ఫై సేవలు
- ప్రైవేటు టెలికం సంస్థల కసరత్తు - మొబైల్ టవర్ ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ - సిద్ధమవుతున్న సంచార మరుగుదొడ్లు - మూడో రోజు పనులను పరిశీలించిన సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్న అయుత చండీయాగానికి వై-పై సేవలు అందించడానికి టెలికాం సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రిలయన్స్ ఆధ్వర్యంలో 4జీ సేవలు అందించడానికి కసరత్తు జరుగుతోంది. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే యాగశాల వద్ద మొబైల్ టవర్‌ను ఏర్పాటుచేసి వై-పై సేవలు అందిస్తుండగా.. మిగిలిన ప్రైవేట్ సంస్థలన్నీ 3జీ సేవలు అందించడానికి పనులు చేపట్టాయి. ఇక, యాగానికి వచ్చే వారి కోసం సంచార మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు. రెండు రోజులుగా ఫాంహౌ్‌సలోనే ఉండి పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. శనివారం కూడా యాగశాలకు వచ్చి పనులను చూశారు. పనులను మరింత వేగంగా చేయాలని సూచించారు. 21 నుంచి ఎర్రవల్లిలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం (ఈ నెల 21) నుంచి మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌ్‌సలోనే ఉండనున్నారు. వ్యక్తిగత హోదాలో 23 నుంచి 27 వరకు ఆయన అక్కడ అయుత చండీయాగాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఎర్రవల్లికి వెళ్లిన కేసీఆర్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం నిజాం కళాశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటుచేసిన క్రిస్మస్ విందులో పాల్గొంటారు. సోమవారం మధ్యాహ్నం మళ్లీ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌ్‌సకు వెళ్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదే రోజు ఆయన అక్కడ అయుత చండీయాగం ప్రారంభానికి ముందు నిర్వహించే కొన్ని పూజాదికాల్లో పాల్గొంటారని సమాచారం. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈనెల 27న అయుత చండీయాగం ముగియనుండగా, ఆ తర్వాతనే సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్‌కు వస్తారని తెలిసింది. -
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో రేపు కేసీఆర్ ప్రెస్ మీట్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం మధ్యాహ్నం ఎర్రవల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఆయన అయుత చండీయాగం వివరాలను మీడియాకు వివరించనున్నారు. మెదక్ జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ ఈ నెల 23 నుంచి 27 వరకు ఈ యాగాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాగాన్ని 1500 మంది రుత్వికుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. శృంగేరీ పీఠం వేద పండితుల పర్యవేక్షణలో యాగం జరగనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేసీఆర్ స్వయంగా ఆహ్వానించారు. అలాగే పలువురు ప్రముఖులతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఈ యాగానికి హాజరు అవుతారు. -
కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద భారీ ఏర్పాట్లు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జరగనున్న ఆయుత చండీయాగానికి సంబంధించిన పనులు చకచక సాగుతున్నాయి. కేసీఆర్‌ను గురువారం శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆశీర్వదించారు. మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఆయుత చండీయాగం డిసెంబర్ 23వ తేదీన ప్రారంభం కానుంది. 27వ తేదీన ఈ యాగం ముగియనుంది. చివరి రోజు యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. ఈ యాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కేసీఆర్ స్వయంగా ఆహ్వానించనున్నారు. ఈ యాగానికి దేశంలోని ప్రముఖలను కూడా ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్‌హౌస్ వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మెదక్ జిల్లా ఎస్పీ సుమతి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
ఆరు నెలల్లో మళ్లీ దసరా...
ఇళ్లు కట్టి..పండగ చేసుకొందాం - 6 నెలల్లోపే నిర్మాణం పూర్తి: సీఎం - ఎర్రవల్లి, నర్సన్నపేటలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన - ఒకేసారి గృహప్రవేశం చేద్దాం.. - అంకాపూర్‌ను మించేలా అభివృద్ధి - డ్రిప్పు ద్వారానే సాగు చేయాలని రైతులకు సూచన జగదేవ్‌పూర్: ఎర్రవల్లి, నర్సన్నపేటలను అద్భుత గ్రామాలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఇటు గ్రామాభివృద్ధితో పాటు అటు వ్యవసాయాభివృద్ధి ఒకేసారి జరగాలని ఆకాంక్షించారు. ఐదున్నర నెలల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, అందరం ఒకేసారి గృహప్రవేశం చేద్దామన్నారు. గురువారం దసరా పర్వదిన వేళ తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజలు అదృష్టవంతులన్నారు. రెండు గ్రామాల ప్రజల చైతన్యం ఎంతో గొప్పదన్నారు. ఐక్యమత్యంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. వ్యవసాయాభివృద్ధి ఎంతో ముఖ్యం గ్రామాల అభివృద్ధి ఎంత ముఖ్యమో వ్యవసాయాభివృద్ధి అంతకంటే ముఖ్యమని సీ ఎం కేసీఆర్ అన్నారు. ప్రతి రైతుకు డ్రిప్పు సౌకర్యం కల్పిస్తామని, బోర్లు వేయిస్తామని చె ప్పారు. అంకాపూర్‌ను మరిపించేలా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను తీర్చిదిద్దుతామన్నా రు. జిల్లాలోని పాములపర్తి రిజర్వాయర్‌కు కొండపోచమ్మసాగర్ అనీ, సిద్ధిపేట ప్రాంతం లో నిర్మించే రిజర్వాయర్‌కు కొమురెళ్లి మల్లన్నసాగర్ అనీ పేర్లు పెట్టామన్నారు. రెండు రిజ ర్వాయర్లను త్వరగా పూర్తి చేసి మెదక్, నల్లగొం డ, రంగారెడ్డి జిల్లాలకు తాగు, సాగునీరందిస్తామన్నారు. ఆరు నెలల్లో ఇంటింటికీ నల్లా కలెక్ష న్ ద్వారా తాగునీరందిస్తామన్నారు. నీటి నిల్వ కోసం కూడవెళ్లి వాగును అభివృద్ధి చేసి అక్కడక్కడా చెక్‌డ్యాంలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రైతులు పొలాల వద్ద భారీ కుం డీలు ఏర్పాటు చేసుకుని నీరు నిల్వ చేసుకోవాలని సూచించారు. చేబర్తి నుంచి ఇటిక్యాల వర కు వాగును నీటి నిల్వకు అనువుగా పటిష్టం చే స్తామన్నారు. ఈ పనులు వారంలోపు మొదలు పెట్టాలని కలెక్టర్, జేసీలను ఆదేశించారు. వందశాతం డ్రిప్పుతోనే సాగు రెండు గ్రామాల్లో రైతులు వందశాతం డ్రిప్పు సౌకర్యం ద్వారానే పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. బోర్లు లేని ప్రతి రైతుకు బో ర్లు వేయించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. డ్రిప్పును ప్రభుత్వమే అందిస్తుందన్నారు. రెం డు గ్రామాల్లో ఎంత డ్రిప్పు అవసరమో సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌లోపు సర్వేలు పూర్తి కావాలని, ప్రతి రైతు పొలం వద్ద కుండీలు పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 485 ఇళ్లకు శంకుస్థాపన ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో సీఎం కేసీఆర్ 485 ఇ ళ్ల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన శిలాఫ లకాన్ని ఆవిష్కరించారు. ఎర్రవల్లిలో 285, న ర్సన్నపేటలో 200 డబుల్ బెడ్రూం ఇళ్లను ని ర్మించనున్నారు. ఆరు నెలల్లోపు ప్రాజెక్టును పూ ర్తి చేసి విజయం సాధించాలని, అప్పుడు మళ్లీ దసరా పండుగ చేసుకుందామన్నారు. నిర్మాణ బాధ్యతలు చేపట్టిన మీనాక్షి కంపెనీ ప్రతినిధులను సీఎం ఆదేశించారు. గడువులోగా పూర్తి చేస్తే ఇక్కడే మిమ్మల్ని సన్మానిస్తామన్నారు. దసరా సంబరాల్లో సీఎం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం జమ్మి చెట్టు వద్ద పూజలు చేశారు. అనంతరం దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎం జమ్మి ఆకులు ఇస్తూ శుభాకాంక్షలు తెలిపారు. -
దసరా సంబురాల్లో కేసీఆర్
మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్‌కు చేరుకున్నారు. గురువారం అంతా తీరిక లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన రాత్రి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు చేరుకున్నారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులతో కలిసి దసరా సంబురాల్లో పాల్గొన్నారు. ముందు ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. అనంతరం ఉన్నపలంగా తిరిగి నల్లగొండ జిల్లా సూర్యాపేటకు హెలికాప్టర్ ద్వారా చేరుకొని అక్కడ తెలంగాణలోని పేదలకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక పథకం పేదలకు డబుల్ బెడ్రూం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లి ఫాం హౌజ్ కు చేరుకున్నారు. అంతకు ముందు ఎర్రవెల్లిలో కూడా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దసరా సంబురాల్లో మునిగిపోయారు. -
గృహవల్లి
- ఎర్రవల్లికి 285 డబుల్ బెడ్రూంలు మంజూరు - గ్రామస్తుల హర్షాతిరేకాలు - త్వరలోనే సీఎం భూమిపూజ జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవల్లిలో సోమవారం సంబురాలు మిన్నంటాయి. ఈ గ్రామానికి 285 డబుల్ బెడ్రూములు మంజూరు చేయడంతో గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఊరంతా స్వీట్లు పంచుకున్నారు. సంబురాలు చేసుకున్నారు. గ్రామంలో డబుల్ బెడ్ రూముల ఇళ్లను మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణాల కోసం రూ.14.36 కోట్లను సైతం మంజూరు చేశారు. కలెక్టర్ రోనాల్డ్‌రాస్, గడా అధికారి హన్మంతరావు, మండల తహశీల్దార్‌కు, హౌసింగ్ అధికారులకు ఉత్తర్వులను పంపించారు. ఒక్క డబుల్ బెడ్రూం నిర్మాణానికి రూ.5.4 లక్షల చొప్పున విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఎర్రవల్లిలో సీఎం పర్యటించినప్పుడు.. ఒక్క పెంకుటిల్లు లేకుండా కూల్చివేయాలని సీఎం అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. అలాగే ఇళ్లు లేనివారు కోసం అధికారులు సర్వే చేసి 285 మంది అర్హులను గుర్తించారు. గృహనిర్మాణ సంస్థ అధికారులు కూడా ఇటీవల సర్వే నిర్వహించారు. గ్రామంలో గుర్తించిన అర్హుల నివేదికను ఇటివల సీఎం కేసీఆర్ దృష్టికి జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, గడా అధికారి హన్మంతరావు తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వానికి పంపించారు. ఈ క్రమంలో సోమవారం ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూంల నిర్మాణం కోసం గృహ నిర్మాణ సంస్థ నుంచి జీఓ విడుదలైంది. చైనా పర్యటన అనంతరం సీఎం కేసీఆర్.. ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసే అవకాశం ఉంది. కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం... గ్రామానికి డబుల్ బెడ్రూంలు మంజూరు కావడంతో సోమవారం ఎర్రవల్లి గ్రామ సర్వ వర్గ సమితి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. ఊరంతా స్వీట్లు పంచుకున్నారు. గ్రామ సర్పంచ్ భాగ్య, గ్రామ సర్వ వర్గ సమితి అధ్యక్షుడు కిష్టారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు ఎర్రవల్లి గ్రామస్తులందరం జన్మజన్మలా రుణపడి ఉంటామన్నారు. ఊరంతా పెంకుటిళ్లు లేకుండా డబుల్ బెడ్ రూంలు కట్టించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు కృష్ణ, ఆంజనేయులు, సలహాదారులు భిక్షపతి, బాల్‌రాజు, సభ్యులు సత్తయ్య, నవీన్, మహిళ సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
బాల్‌రాజ్.. అంతా బాగుందా..
ఎర్రవల్లి ఆభివృద్ధి పనులపై సీఎం ఆరా జగదేవ్‌పూర్: ‘ఏమి బాల్‌రాజు.. అంతా సెట్‌రైట్ అయిందా.. పనులెట్లా సాగుతున్నాయ్..’ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు శుక్రవారంరాత్రి ఫాంహౌస్‌కు వెళుతూ మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో సర్పంచ్ భర్త టీఆర్ఎస్ నేత బాల్రాజును పలకరించారు. కేసీఆర్ ఫాంహౌస్ వస్తున్నారని సమాచారం ఉండడంతో బాల్రాజుతోపాటు మరో ఐదుగురు నాయకులు రోడ్డు పక్కన పాఠశాల దగ్గర వేచి ఉన్నారు. ఎర్రవల్లికి చేరుకుగానే వారిని చూసి సీఎం కాన్వాయ్ ఆపి ఇలా పలకరించారు. ఈ నెల 8న చైనా పర్యటనకు వెళ్లుతున్న క్రమంలో ఓ సారి వ్యవసాయక్షేత్రంలో వ్యవసాయ పనులను పరిశీలించేందుకు సీఎం వచ్చినట్లు తెలుస్తోంది. శనివారం ఫాంహౌస్‌లోనే ఉండి, ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. -
ఎర్రవల్లి ఇక 'ఆదర్శ గ్రామం'
-
ఎర్రవల్లి ఇక 'ఆదర్శ గ్రామం'
ప్రభుత్వపరంగా డిక్లేర్ చేయిస్త గ్రామానికి సంబంధించిన అన్ని పనులకు సర్కార్‌దే బాధ్యత వ్యవసాయ అభివృద్ధికి 100 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధమే ఎర్రవల్లి విత్తనోత్పత్తి గ్రామంగా ఆవిర్భవించాలి 'స్వయంపాలిత-సమృద్ధి గ్రామం'గా మారాలె ఐకమత్యంతోనే అన్నీ సాధ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు గజ్వేల్: 'ఎర్రవల్లిని ప్రభుత్వపరంగా ఆదర్శ గ్రామంగా డిక్లేర్ చేయిస్తా. గ్రామానికి సంబంధించిన అన్ని పనులను ఇక సర్కార్ చూసుకుంటది. వ్యవసాయ రంగం అభివృద్ధికి అవసరమైతే రూ. 100 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధమే. మన ఊరిని విత్తనోత్పత్తి గ్రామంగా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుందాం. మీకో బ్యాంకును పెట్టిస్తా. మొత్తమ్మీద ఊరిని స్వయంపాలిత-సమృద్ధి గ్రామంగా మార్చుకుందాం'అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లి గ్రామంపై వరాల జల్లు కురిపించారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా 10 రోజుల కిందట మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలో పర్యటించిన కేసీఆర్...శనివారం సాయంత్రం మరోమారు ఎర్రవల్లిని సందర్శించారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించనున్న స్థలాన్ని, శిథిలమైన ఇళ్ల కూల్చివేత పనులను ఆయన పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, 'గడా' ఓఎస్డీ హన్మంతరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే... నిన్న మీరంతా నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు పోయి వచ్చారు కదా. ఆ ఊరు ఎట్లుంది. మనం ఎందుకు అట్ల కావొద్దు. ముందుగాల ఇళ్ల నిర్మాణ పనులు, ఊరిని శుభ్రం చేసుకునే పనులు చేసుకుందాం. ఆ తర్వాత వ్యవసాయరంగ అభివృద్ధి పనులు మొదలు పెడదాం. వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామంలోని భూములన్నింటికీ భూసార పరీక్షలు చేస్తరు. దానిని బట్టి పంటలు వేసుకుందాం. వరి పంట బంద్జేద్దాం. ఇంకా విత్తనోత్పత్తి పంటలే వేసుకుందాం. నేను సీడు కంపెనీలతో మాట్లాడుతా. మీరు ఉత్పత్తి చేసిన విత్తనాలు వారు తీసుకుపోతరు. మంచి లాభం ఉంటది. ఊల్లె ఒక్క గుంట జాగ కూడా వేస్ట్ కావొద్దు. మంచి భూములు మనయ్. తెలంగాణలో ఏ గ్రామానికీ లేని సౌకర్యం మీకుంది. ముఖ్యమంత్రి అయిన నేను మీ ఊరు వ్యక్తిని. నేనే కాదు ప్రభుత్వ యంత్రాంగమంతా మీ వెంట ఉంటది. పనులెందుకు కావ్? అందరికీ బోర్లు వేయిస్త. డ్రిప్ సిస్టమ్ పెట్టుకుందాం. నీళ్ల నిల్వకు కుండీలు కట్టుకుందాం. ఇంటింటికీ బర్రెలు ఇప్పిస్త. పాడిరంగాన్ని అభివృద్ధి చేసుకుందాం. జరంత భూమి ఉన్నోళ్లకు కూరగాయల పంటలు పండించేలా చేద్దాం. దళితుల భూములను బాగజేపిస్త. వారికి గతంలో పంపిణీ చేసిన భూముల్లో కొంత బాగలేదు. అంత సాఫ్ జేపిస్త. అక్కడ కూడా బంగారు పంటలు పండేట్లు చేసుకుందాం. గ్రామంలో జాగలన్నీ సక్కగ లేవు. ఒక్కో రైతుకు ఆడింత, ఈడింత జాగుంది. రైతుల మధ్య అవగాహనతో హద్దు బదులు చేసుకుందాం. దీని ద్వారా ఒక్క దగ్గరనే ఎక్కువ భూమి అయితది. పూర్తిగా భూమి లేనోళ్లకు ఫౌల్ట్రీ ఫారాలు పెట్టిద్దాం. ఎస్సీ, బీసీ పిల్లలకు సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇస్త. వచ్చే వానాకాలం వరకు లోకమంతా వచ్చి ఈ ఊరినే చూసెటట్టు కావాలె. ఇవ్వన్నీ జరగాలంటే ఐకమత్యం చాలా అవసరం. ఎవరింట్లయినా పెండ్లయితే ఇంటికో రూ. 50 చొప్పున సాయం జేయండి. ఆ కుటుంబం అప్పులపాలు కాకుండా ఉంటది. ఊర్ల ఉండెటోళ్లకే ఇండ్లు... 'ఊర్ల నివాసం ఉండెటోళ్లకే ఇండ్లు ఇస్తం. 30, 40 ఏళ్ల కిందట ఇతర ప్రాంతాలకు వలస పోయి అక్కడ ఇండ్లు కట్టుకున్నోళ్లకు ఎట్ల ఇస్తం' అంటూ సీఎం స్పష్టం చేశారు. గ్రామానికి చెందిన పలువురు ఇండ్ల జాబితాలో తమను చేర్చుకోవడం లేదని సీఎం దృష్టికి తీసుకురాగా పైవిధంగా స్పందించారు. గ్రామానికి చెందిన అన్ని కులాలతో కూడిన కమిటీ ఇళ్ల జాబితాను సిద్ధం చేసి గ్రామసభలో చదవాలని, ఎవరివైనా పేర్లు రాకపోతే మరో అవకాశం కల్పించాలని ఆదేశించారు. రాఖీ కట్టిన సర్పంచ్... ఎర్రవల్లి గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్‌కు గ్రామ సర్పంచ్ భాగ్య రాఖీ కట్టారు. అనంతరం పాదాభివందనం చేసి సీఎంతోపాటు సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘ఎర్రవల్లి’పై సీఎం ఆరా
జగదేవ్‌పూర్: సీఎం కేసీఆర్ గురువారం రాత్రి తన ఫాంహౌస్‌కు వస్తూనే ఎర్రవల్లి పనులపై ఆరా తీసినట్టు తెలిసింది. గ్రామజ్యోతిలో భాగంగా ఆయన తన గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామంలో రెండ్రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న పనులపై ఆయన ఆరా తీశారని సమాచారం. కాగా, గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో సీఎం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఆదివారం వరకు ఇక్కడే ఉంటారని తెలిసింది. -
ఎర్రవల్లి పనులపై సీఎం కేసీఆర్ ఆరా..
శనివారం సాయంత్రమే హైదరాబాద్‌కు పయనం జగదేవ్‌పూర్: గత రెండు రోజులుగా ఎర్రవల్లిలో పర్యటించిన సీఎం కేసీఆర్ మూడోరోజైన శనివారం మాత్రం ఫాంహౌస్‌లోనే ఉన్నారు. ఉదయం వ్యవసాయక్షేత్రంలో తిరిగి పంటలను పరిశీలించిన ఆయన.. అక్కడి నుంచే ఎర్రవల్లిలో జరుగుతున్న పనులపై ఆరా తీసినట్లు తెలిసింది. ఆ పనులను తొందరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం. కాగా, సీఎం కేసీఆర్ తిరిగి శనివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు వెళ్లారు. సీఎం గ్రామం మీదుగా వెళ్తారనే సమాచారంతో నర్సన్నపేట గ్రామస్తులు కొందరు రోడ్డుపై నిలబడ్డారు. సీఎం.. వారి వద్ద తన కాన్వాయ్ ఆపించి, వారితో మాట్లాడారు. గజ్వేల్ పట్టణానికి చెందిన వ్యాపారి దత్తాద్రి.. కేసీఆర్‌కు వినతి పత్రం అందించారు. గజ్వేల్ పట్టణంలో జూనియర్ కళాశాల ముందు భాగంలో డబ్బాలను పెట్టుకొని 35 ఏళ్లుగా జీవిస్తున్నామని, వాటిని తొలగిస్తే ఉపాధి కోల్పోతామని విన్నవించారు. అలాగే వరంగల్‌కు చెందిన మరో వ్యక్తి వినతిపత్రం ఇవ్వగానే, అతనిని తన కాన్వాయ్‌లో ఎక్కించుకొని వెళ్లారు. కాగా సీఎంను కలవడానికి కొందరు బీడీ కార్మికులు రాగా, వారిని పోలీసులు ఆపడంతో కలుసుకోలేకపోయారు. -
రండి.. దరిద్రంపై యుద్ధం చేద్దాం!
ఎర్రవల్లి గ్రామసభలో సీఎం కేసీఆర్ గజ్వేల్: ‘‘నిన్న ఒక ఆలోచన వచ్చింది. ఒక దారిలో వెళ్దామనుకున్నాం. గ్రామాన్ని మొత్తం పరిశుభ్రం చేసే పని మొదలుపెట్టాం. మంచి పనికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. ఇది ఇంతటితో ఆగిపోదు. ఇంకా ముందుకెళ్దాం. నా వెంట రండి. ఇక దరిద్రం మీద యుద్ధం చేద్దాం. మీ వెంట నేనుంటా. ఎందుకు పైకిరారో చూస్తా..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో రెండోరోజు నిర్వహించిన ‘గ్రామజ్యోతి’ సభలో ఆయన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం పిలుపునందుకొన్న గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి తట్టా, పార చేతపట్టుకొని ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామాన్ని నాలుగు భాగాలుగా విభజించుకొని శ్రమదానం పనుల్లో నిమగ్నమయ్యారు. అధికారులు సైతం ఈ పనుల్లో భాగస్వాములయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం స్వయంగా పనులను పర్యవేక్షించారు. అనంతరం గ్రామసభలో మాట్లాడుతూ... ‘‘నిన్న ఇక్కడ జరిగిన సభ, నా మాటలు టీవీలు, పత్రికల ద్వారా తెలుసుకున్న ఈ ఊరికి చెందిన దాతలు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అంగీకరించారు. ఎర్రవల్లిలో ఇల్లు లేని కుటుంబం ఉండొద్దు. ఇప్పటి దాకా ముక్కిపోయి, మురిగిపోయిన ఇళ్లలో కాలం గడిపాం. ఇకపై అలా ఉండొద్దు.. అయిదారు నెలల్లో అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తా’’ అని సీఎం హామీ ఇచ్చారు. చౌరస్తాలను సిటీలో మాదిరి అందంగా తీర్చిదిద్దుకుందామని పేర్కొన్నారు. ‘ఒక్క దెబ్బకు ఊరంతా సైరకు రావాలె... దయ్యం వదలాలె’ అంటూ గ్రామస్తులను ఉత్సాహపరిచారు. ఇక్కడితో మన ప్రయత్నాలు, పనులు ఆగిపోవన్నారు. ఒకరోజు కంటివైద్య శిబిరం నిర్వహించి అందరికీ పరీక్షలు చేయిద్దామని, మరో రోజు సాధారణ వైద్య శిబిరాన్ని నిర్వహించి వైద్య పరీక్షలు చేయిద్దామని చెప్పారు. ఎర్రవల్లిని చూసి అంతా ఆశ్చర్యపోవాలి ‘‘ఇప్పుడు మనం పని మొదలుపెట్టాం. ఎర్రవల్లి ఎంత అందంగా మారిపోయిందని అంద రూ ఆశ్చర్యపోవాలి. అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. జిల్లాకో ఊరును ఇలా తయారు చేస్తే వెలుగొస్తుంది. ఊరిలో ఇవ్వాల్టి నుంచి మోటు మాటలు బంద్ చేయండి. మాట్లాడితే రూ.50 జరిమానా ప్రకటించండి. అప్పుడు అందరూ సక్కగ మాట్లాడుతరు. గ్రామ కమిటీలో ఈ నిర్ణయం తీసుకోండి’’ అని సీఎం సూచించా రు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని ఉద్దేశించి ‘‘ఏమయ్యా.. ఎంపీ గారు మా ఊరికి ఎన్ని డబ్బులిస్తరు?’’ అని ప్రశ్నించారు. ఎంపీ లేచి ‘రూ. 50 లక్షలు ఇస్తాను సార్’ అని ప్రకటించారు. ఆపై కలెక్టర్ రోనాల్డ్ రాస్‌ను ఉద్దేశించి ‘కలెక్టర్ గారూ.. మీరెంత ఇస్తరు?’ అని సీఎం అడిగారు. ఆయన రూ.25 లక్షలు కేటాయిస్తాం సార్ అని బదులిచ్చారు. దీంతో సీఎం గ్రామస్తుల వైపు చూస్తూ.. ‘‘ఇగ జూసిన్రా.. మీరు నా ఎంబడి ఉంటే ఇంకా షాన డబ్బులు తెస్త..’ అని వ్యాఖ్యానించారు. ఆదర్శ గ్రామాల్లో ఒక్కో దగ్గర ఒక్కో నియమం ఉంటుందని, కొన్ని గ్రామాల్లో మందు తాగుడు బంద్ చేశారని, ఇంకొన్ని గ్రామాల్లో మందు తాగితే జరిమానా విధిస్తున్నారని, అలాగే మీరు కూడా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలని గ్రామస్థులకు సూచించారు. తాను మళ్లీ వస్తానని, అప్పుడు గ్రామ ఎజెండా తయారు చేద్దామంటూ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం గ్రామస్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, ఎంపీటీసీ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రవెల్లి గ్రామజ్యోతిలో కేసీఆర్ ప్రసంగం!
-
ఎర్రవెల్లిలో కేసీఆర్ సహఫంక్తి భోజనం
మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎర్రవల్లికి 200 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం కేసీఆర్ ఎర్రవల్లి గ్రామస్తులతో కలసి సహఫంక్తి భోజనం చేశారు. గురువారం కూడా కేసీఆర్ ఎర్రవెల్లి గ్రామాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఈ గ్రామంలోనే ఉంది. -
బంగారువల్లి కావాలె
గజ్వేల్: ‘‘గ్రామజ్యోతి అంటూ సీఎం ఉరుకులాడుతుండు.. ఆయన ఉండే ఎర్రవల్లి సంగతేంది? అని అందరూ అనుకునే పరిస్థితి రావొద్దు. నా ఊరు చిన్నతనం కావొద్దు. ఈ ఎర్రవల్లి బంగారువల్లిగా మారాలె. రాష్ట్రంలోనే నంబర్ వన్ గ్రామంగా అవతరించాలె..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో ‘గ్రామజ్యోతి’ గ్రామసభలో సీఎం పాల్గొన్నారు. అంతకుముందు గ్రామంలోని వీధులన్నీ కలియతిరిగారు. ఈ సందర్భంగా పారిశుధ్యం, ఇతర సమస్యలపై ఆరా తీశారు. అనంతరం గ్రామసభలో మాట్లాడుతూ.. ‘‘ఏడ్వదలుచుకుంటే గంటసేపు ఏడ్చే బాధ ఉంది. ఇబ్బంది ఉంది. కానీ ఏడిస్తే పని కాదు కదా! నేను ఎర్రవల్లిలో ఉండే తెలంగాణ తెచ్చిన. ఎన్నో విజయాలను అందుకున్న. ఇప్పుడు ఈ ఊరిని మార్వలేనా? మీరంతా నాకు సహకరించండి. ఈ గ్రామం రూపురేఖలు మారుస్తా’’ అని పేర్కొన్నారు. ‘‘నేను తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఈ బక్కోనితోని ఏమైతది. బొండిగె పిసికితే పోతడు అని అవమానపరిచారు. అయినా బాధ పడలే. లక్ష్యం కోసం పనిజేసిన. అనుకున్నది సాధించిన. మీరు కూడా మన ఊరి బాగుకు కదలాలే.. గ్రామాలకు ఎన్నో నిధులు వస్తున్నయ్ అయినా మారుతలేవ్. మారాలంటే ఒక్కటే మార్గం. మనం మేల్కోనాలె’’ అని వ్యాఖ్యానించారు. గ్రామానికి జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిని ఇన్చార్జిగా నియమిస్తున్నానని, ఆయన గ్రామం రూపురేఖలు మార్చటానికి సహకరిస్తారని చెప్పారు. ‘‘గ్రామంలో 231 పెంకుటిండ్లు, 107 ఆర్సీసీ బిల్డింగ్లు, 40 కూలిపోయేదశలో ఉన్న ఇండ్లు, మరో 10 గుడిసెలు, వలస వెళ్లటం వల్ల మరో 30-40 వృథాగా ఉన్న ఇండ్లు ఉన్నాయ్.. మీరు చేయాల్సిందల్లా ఒకటే! కరాబైన ఇండ్లను కూల్చేసుకొని కొత్త ఇండ్లు కట్టుకోవాలి. గ్రామానికి 200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తున్నా’’ అని ప్రకటించారు. దీంతో గ్రామస్తులంతా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేయగా.. ‘‘చప్పట్లు కొట్టినట్లు కాదు. ఊరి కోసం కష్టపడాలి’’ అని సీఎం పేర్కొన్నారు. గ్రామం రూపురేఖలు మార్చుకొని రోడ్లు పెద్దగా చేసుకుందామని, ఇందుకు అధికారులు ప్లాన్ ఇస్తారని వివరించారు. ‘‘నేను రాత్రికి ఇక్కడ్నే ఉంటా. శుక్రవారం వస్తా. అందరం కలిసి శ్రమదానం చేద్దాం. నేను మీతో కలిసి శ్రమదానం చేస్తా. మీరు ఎన్ని తట్టల మట్టి మొయ్యిమంటే అన్ని మోస్తా. మోరీలు సాప్ చేయమంటే చేస్తా. రేపు మాత్రం అందరూ ఇందులో పాల్గొనాలి. గ్రామంలో చెత్త లేకుండా చేయడానికి అంతా కలిసి రోజంతా శ్రమదానం చేద్దాం. అందరూ గడ్డపార, తట్ట పట్టుకొని రావాలి. భోజనం నేనే పెట్టిస్త’’ గ్రామస్తులతో అన్నారు. నాలుగు ముక్కలుగా పనిని విభజించుకుందామని, జిల్లేడు, సర్కార్ తుమ్మచెట్లు పూర్తిగా తొలగిద్దామని, ఆ చెట్లు దారిద్య్రానికి హేతువులని అన్నారు. మున్ముందు 24 గంటల కరెంట్... ‘‘మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో కష్టాలుండె. ఇప్పుడా బాధ లేదు. కరెంట్ కోతలను నివారించాం. మున్ముందు 24 గంటల త్రీఫేజ్ కరెంట్ తెస్త. నేను ఇంతకుముందే అసెంబ్లీలో చెప్పిన. ప్రతి ఇంటికి నల్లా నీరు ఇవ్వకుంటే వచ్చే ఎలక్షన్ల ఓట్లు అడగనని. అదే మాట మీద ఉంట. గోదావరి జలాలు తెస్త. నియోజకవర్గంలోని పాములపర్తిలో 20 టీఎంసీల పెద్ద రిజర్వాయర్ కడుతున్నం. అది పూర్తయితే మనకు సాగునీటి బాధలు ఉండవు’’ అని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకట్రామ్రెడ్డి, గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(గడా) ఓఎస్డీ హన్మంతరావు, గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. మీ బతుకులు మారుస్తా.. చెత్తపై యుద్ధం ప్రకటించి గ్రామం రూపురేఖలు మార్చడమే కాదు.. మీ బతుకులూ మారుస్తానని సీఎం గ్రామస్థులకు భరోసా ఇచ్చారు. ‘‘మీరు ముందుగాల నిజామాబాద్ జిల్లా అంకాపూర్ వెళ్లండి. నేను 1986లో సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచాక వెళ్లి ఆ గ్రామంపై అధ్యయనం జరిపితే ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వారి వ్యవసాయం కొత్తగా ఉంది. సంఘటితంగా ఉండటం వల్ల ఎన్నో విజయాలు సాధించారు. గ్రామంలో ఇప్పటివరకు పోలీస్ కేసు నమోదు కాలేదు. బ్యాంకుల్లో వారి డిపాజిట్లు అప్పట్లోనే రూ.22 కోట్లు ఉన్నయ్. ఎర్రవల్లి కూడా మరో అంకాపూర్ కావాలి. గ్రామంలో ఎవరిని ఎలా ఆదుకోవాలి. విద్యార్హతలను బట్టి ఎలా ఉపాధి కల్పించాలి అనేది అధికారులు ప్రతి కుటుంబం నుంచి ఫార్మాట్ తీసుకుంటరు. విద్యార్హతలు లేనివారినీ ఆదుకుంటాం. బర్లు, గొర్లు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్న. అంతేకాదు గ్రామంలోని రైతులందరికీ డ్రిప్ పథకం వర్తింపజేస్తా’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. -
గిదేం ఊరు.. గిట్లయితే బాగలేదు..!
- ఇండ్ల మధ్యనే జిల్లేడు చెట్లు.. - పొదలు, చెత్తా చెదారం.. - ఇదేం బాగలేదు.. - వెంటనే మార్చేద్దాం - అంతా కలిసి నడుద్దాం - వీధులన్నీ చుట్టి..గ్రామస్తులతో ముచ్చటించిన సీఎం - ఎర్రవల్లిలో సీఎం పాదయాత్ర - రూపు రేఖలు మారుస్తానంటూ హామీ - గ్రామస్తుల హామీ తీసుకున్న ముఖ్యమంత్రి గజ్వేల్/జగదేవ్‌పూర్: ఏమ్మా మరుగుదొడ్డి కట్టుకున్నారా... ఈ మురుగంతా ఏందీ..ఈ చెత్త గిట్లనే ఉంటదా..రోడ్డు పక్కన పాతబావి ఏందీ..ఇండ్ల మధ్య జిల్లేడు చెట్లు మంచిది కాదు..చాలా పాత ఇళ్లు.. పెంకుటిళ్లు ఉన్నట్టు ఉన్నయ్.. గీ ఇండ్లల్ల ఎవరూ ఉండరా.. ఇండ్ల మధ్య పెంటకుప్పులేందీ.. ఈ చెత్తా చెదారమేందీ...ఏమయ్యా గీ ఇల్లు నీదేనా.. ఈ గుడిసే మీదేనా..అందరికి ఇండ్లు కట్టిస్తాం..ఊర్లో ఎటు చూసినా.. ఏమూలన చూసినా పాత, కూలిపోయిన ఇండ్లే కనిపిస్తున్నాయ్.. గిదేం ఊరు.. గిట్లయితే బాగుండదు.. అంతా మార్చేద్దాం..అనే సంభాషణల మధ్య సీఎం కేసీఆర్ ఎర్రవల్లి గ్రామ పర్యటన కొనసాగింది. బుధవారం సాయంత్రం ఎర్రవల్లి గ్రామ సమీపంలోని తన వ్యవసాయక్షేత్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్ గురువారం ఉదయం గ్రామజ్యోతిలో భాగంగా పక్కనే ఉన్న ఎర్రవల్లి గ్రామంలో పాదయాత్ర చేపట్టారు. ఉదయం 10.50 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర 2.30 గంటలకు ముగిసింది. స్థానిక వాటర్ ట్యాంకు వద్దకు సీఎం కేసీఆర్ 10.50 నిమిషాలకు చేరుకున్నారు. గ్రామానికి చెందిన మహిళలు సీఎం కేసీఆర్‌కు మంగళహారతులతో స్వాగతం పలికి, తిలకం దిద్దారు. అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించి వీధుల గుండా నడుచుకుంటూ వెళ్లారు. రోడ్డు పక్కనే ఉన్న నారిని లక్ష్మీనర్సు ఇంట్లోకి వెళ్లి మరుగుదొడ్డిని పరిశీలించారు. అలాగే చింతకాయల రాజవ్వ ఇంటికెళ్లి రాజ వ్వతో మాట్లాడారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్నా మురుగు గుంతల ను పరిశీలించారు. పక్కనే ఉన్న సర్పంచ్ భాగ్య, మాజీ సర్పంచ్ కిష్టారెడ్డితో ఇండ్ల మధ్య ఈ మురుగేంది అని ప్రశ్నించారు. వెంటనే మురుగును తొలగించాలని ఆదేశించారు. అలానే ముందుకెళ్లి నూతనంగా నిర్మిస్తున్న స్త్రీ శక్తి భవనాన్ని పరిశీలించి, తొందరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి అవుసుల నర్సింహా చారి, యాదగిరి ఇంటి వెనుకకు వెళ్లి అక్కడే ఉన్న మరుగుదొడ్డిని పరిశీలించారు. అదే రోడ్డున అంబేద్కర్ చౌరస్తా వెళ్లే దారి వద్దకు వచ్చారు. కొంత ముందుకు వచ్చి ఓ పాత ఇల్లు ఉన్న గల్లీలోకి వెళ్లారు. అక్కడ కూలిన ఇల్లును చూసి ఇండ్ల మధ్య ఇలాంటి కూలిన ఇండ్లు ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు. గ్రామానికి చెందిన తుమ్మ కృష్ణ ఈ స్థలం యూత్ భవనం కోసం ఇస్తున్నాం సారూ.. అంటూ వివరాలు సీఎంకు చెప్పారు. అలాగే రోడ్డు పక్కన్నే ఉన్న పాడుబడ్డ చేదబావి దగ్గరకు వెళ్లి తొంగి చూశారు. అటు నుంచి అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చి సర్పంచ్ భర్త బాల్‌రాజుతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయించారు. అనంతరం గ్రామజ్యోతి సభ కార్యక్రమానికి వెళుతూ దళిత కాలనీ ఎక్కడా అంటూ పక్కనే ఉన్నా ‘గడా’ ఓఎస్ డీ హన్మంతరావును ఆడిగారు. దళిత కాలనీని కూడా చూద్దామంటూ కాలనీలోకి ఆడుగుపెట్టారు. మొండి భిక్షపతి ఇంటి వెనుక నుంచి పెంకుటిళ్లను చూస్తు ముందుకు వెళ్లారు. మరుగుదొడ్డిని పరిశీలించారు. సైద నర్సయ్య ఇంటి దగ్గరకు రాగానే కూలిపోయిన ఇల్లు కనిపిం చింది. వెంటనే సీఎం కేసీఆర్ ఈ ఇల్లు ఎవరిదీ.. అం టూ ఆరా తీశారు. సైద నర్సయ్యను పిలిచి ఇల్లు ఉందా అని ఆడిగారు. యాదయ్య లేదనగానే.. ఎక్కడుంటున్నవ్ అని ఆడగడంతో రేకు ల ఇంట్లో ఉంటున్నా అంటూ చెప్పారు. దళిత కాలనీ అంతా కలియతిరుగుతూ కనిపించిన వారినల్లా పలకరించారు. మల్లని యాదయ్య, నాగమణి దంపతులు ఉంటున్న గుడిసెను చూసి మీదేనా గుడిసె.. మీకు ఇల్లు కట్టిస్తా అంటూ హామీ ఇచ్చారు. రోడ్డు పక్కనే ఉన్న పూరి గుడిసెను ప్రత్యేకంగా పరిశీలించారు. ఇండ్ల బయటకు వెళ్లి సరిహద్దు ప్రాంతాలను పరిశీలించారు. ఇండ్ల మధ్య గీ చెత్తాచెదారం ఎందీ.. అంటూ పక్కనే ఉన్న గడా అధికారి హన్మంతరావును, బాల్‌రాజు, కిష్టారెడ్డిని ప్రశ్నించారు. ఇదంతా తీసేయాలి.. నిన్నమొన్న గ్రామజ్యోతి కార్యక్రమంలో ఏంచేశారు. అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుంచి మళ్లీ బీటీ రెడ్డెక్కి బీసీ కాలనీలోకి ప్రవేశించారు. రోడ్డుపై నిలబడి కాలనీల సంగతులు తెలుసుకున్నారు. వాటర్‌ట్యాంకు దగ్గరకొచ్చి నిన్నమొన్న వేశారా అంటూ సీసీ రోడ్ల గురించి గడా ఓఎస్డీని ఆడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి పాఠశాల నూతన భవనాల పనుల వివరాలను ఆడిగి తెలుసుకున్నారు. సీఎం నాటేందుకు ఏర్పాటు చేసిన మొక్కలను చూసి నాటకుండానే ముందుకుసాగారు. హనుమాన్ గుడి దగ్గర పాడుబడ్డ ఇండ్లను చూసి ఇండ్లల్లో ఎవరూ ఉంటలేరా అయితే గ్రామానికి ఏదైనా అవసరం ఉంటది జాగా అడగండి అంటూ సర్పంచ్ భర్త బాల్రాజును అదేశించారు. అక్కడి నుంచి 12.30 గంటలకు గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. జేసీ వెంకట్రామిరెడ్డి, స్థానిక సర్పంచ్ భాగ్య, ఎంపీటీసీ భాగ్యమ్మ, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీపీ రేణుక, గడా అధికారి హన్మంతరావు, జహంగీర్, రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి సీఎంతో కలిసి లోపలకు వెళ్లారు. సీఎం అక్కడ నిమ్మరసం తగారు. అనంతరం గంటకు పైగా గ్రామాభివృద్ధిపై చర్చించారు. గ్రామంలో ఎంత మందికి ఇండ్లు లేవు, కూలిపొయిన ఇండ్లు ఎన్ని ఉన్నాయి..ఊరి బయట ఎంత మంది ఉంటున్నారు అనే విషయాలను ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్ సమస్యలపై చర్చించేందుకు అధికారులను పిలవగా ఎవరూ లేరు. దీంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 1.45 గంటలకు గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొని 43 నిమిషాలు మాట్లాడారు. మళ్లీ రేపు వచ్చి శ్రమదానం చేస్తా..అందరం కలిసి భోజనం చేద్దామంటూ వ్యవసాయక్షేత్రానికి వెళ్లారు. -
దండులా కదలాలె
సంఘటితమై ‘పవర్’ చాటాలె.. - గ్రామాల ప్రగతికి బాటలు వేయాలె - ఎర్రవల్లి ‘గ్రామజ్యోతి’లో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు - గ్రామంలో వీధులన్నీ కలియతిరిగిన సీఎం - పారిశుద్ధ్యం, ప్రజాసమస్యలపై ఆరా - నేడు ‘చెత్తపై యుద్ధా’నికి సీఎం నిర్ణయం గజ్వేల్/జగదేవ్‌పూర్: ‘ఊరు బాగుకు కదలాలె.. సంఘటితమై ‘పవర్’ ఏమిటో చాటాలె.. గ్రామాలకు ఎన్నో నిధులు వస్తున్నయ్.. అయినా మారుతలేవ్. మారాలంటే ఒక్కటే మార్గం.. మనం మేల్కొనాలె’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. గురువారం జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో నిర్వహించిన గ్రామజ్యోతి సభలో కేసీఆర్ ప్రసంగించారు. అంతకుముందు గ్రామంలో వీధులన్నీ కలియతిరిగి పారిశుద్ధ్యం తీరును పరిశీలించడమే కాకుండా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, ఎంపీటీసీ భాగ్యమ్మ, ఎంపీపీ రేణుక, జడ్పీటీసీ రాంచంద్రంలతోపాటు వివిధ శాఖల అధికారులతో గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో సమీక్ష జరిపారు. అనంతరం సభలో గ్రామస్తులనుద్దేశించి ప్రసంగించారు. ‘గ్రామాలకు ఎన్నో నిధులు వస్తున్నయ్. కానీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ప్రజా చైతన్యంతోనే ప్రగతికి బాటలు పడతాయి..’ అంటూ పేర్కొన్నారు. ‘గ్రామం లో 1500 మంది పైచిలుకు జనాభా ఉంది. చి న్న పిల్లలు, వృద్ధులు సుమారు 500 మందిని మినహాయిద్దాం. మిగిలిన 1000 మంది ఒక్కటై సంఘటిత శక్తిని చాటుదాం. ఏళ్ల తరబడి పాములు, తేళ్లు పారే ఇండ్లల్లో బతికినం. ఇప్పటికైనా ఈ దుస్థితి మారాలె’ అంటూ చైతన్యపరిచారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అందరూ కలిసి రావాలని కోరారు. ముందుగా సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని సాధించి ఆ తర్వాత శిథిలమైన ఇళ్లను తొలగించి వాటి స్థానంలో కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా విశాలమైన రోడ్ల నిర్మాణానికి బాటలు వేసుకోవాల్సిన అవసరముందన్నారు. పారిశుద్ధ్యంలో వరంగల్ జిల్లా గంగదేవునిపల్లి మనకు ఆదర్శం కావాలన్నారు. అందరూ పట్టించుకుంటే చిటికె లో సమస్యలు పరిష్కారమవుతాయని వివరిం చారు. 6, 7 నెలల్లో గ్రామాన్ని పూర్తిగా మార్చేద్దామని చెప్పారు. గ్రామాన్ని బాగుచేసుకోవడమే కాకుండా ప్రతి వ్యక్తి కడుపునిండా తిని కంటినిండా నిద్రపోయే రోజు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ‘నా ఫామ్‌హౌస్ ఇక్కడనే ఉం ది. ఇది నా ఊరు. అటుపోయినపుడు, ఇటుపోయినపుడు వస్త. మీ వెంట ఉండి సమస్యలు పరిష్కరిస్తా’నని భరోసా ఇచ్చారు. ‘గ్రామంలో బస్తీలన్నీ అద్దంలా మారాలె. ఆరేడు నెలల్లో మంచినీటి కోసం ఏ ఆడపడుచు రోడ్డుమీదికి రావొద్దు. అలా వచ్చిందంటే ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీలు రాజీనామా చేయా లె అన్నారు. ‘మరో నాలుగేళ్లల్లో ఈ గ్రామానికి రూ. 74లక్షలు వస్తాయి. వీటితోపాటు మరిన్ని నిధులు మీకు ఇస్త. సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా చూస్తా’ అంటూ పునరుద్ఘటించారు. రాజకీయాలు గిప్పుడెందుకు? గ్రామంలో అంతా కలిసికట్టుగా ముందు కు సాగాల్సిన అవసరముందని సీఎం హితవు పలికారు. ‘ఎలక్షన్లు వచ్చినపుడు రాజకీయాల సంగతి చూద్దాం. ఇప్పుడొద్దు’ అంటూ సూచిం చారు. గ్రామంలో ‘సర్వవర్గ సమితి’ పేరిట కమిటీని ఏర్పాటుచేసుకోవాలని, ఇందులో అన్ని కులాలకు ప్రాతినిథ్యం దక్కేలా చూడాల న్నారు. ఈ కమిటీ నిర్ణయాల మేరకు ముందు కు సాగాలన్నారు. బ్రెజిల్ దేశంలోని లియోడిజనిరో పట్టణం కాలుష్యం లేని ప్రాంతంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణలోని ప్రతి గ్రామం, పట్టణం ఈ అంశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గ్రామస్తులు ఎప్పుడూ తమగురించే ఆలోచించకుండా సమాజం గురించి కూడా ఆలోచించాలని కోరారు. గాంధీజీ, అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాల సాధనకు తమవంతు ప్రయత్నం చేయాలని సూచించారు. గ్రామంలో శుక్రవారం ‘చెత్తపై యుద్ధం’ కార్యక్రమం చేపడదామని సీఎం పిలుపునివ్వగా గ్రామస్తులు చప్పట్లతో హర్షామోదం పలికారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. ‘చప్పట్లు కొట్టినట్లు గాదు... నాతో పంచాయతీ గొట్టు ఉంటది. పని అయిపోయేదాక వెంటపడత. అందరూ సహకరించాలె’ అంటూ పేర్కొనగా గ్రామస్తులు ముఖ్యమంత్రికి తాము ఎల్లపుడూ సహకారమందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్ నగరపంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్ఎస్ నేతలు జహంగీర్ తదితరలు పాల్గొన్నారు. -
మెదక్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
-
'మీ గ్రామస్తుడినే కాబట్టి నిధులకు కొరత ఉండదు'
మెదక్: వచ్చే ఆరునెలల్లో ఎర్రవల్లి గ్రామస్వరూపాన్ని సమూలంగా మార్చివేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. జిల్లాలోని ఎర్రవల్లిలో గురువారం గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టిన సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. ఆ గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చుదిద్దుతానని తెలిపారు. 'నేను మీ గ్రామస్తుడినే. అందుచేత నిధులకు కొరత ఉండదు. వచ్చే ఆరునెలల్లో ఎర్రవల్లిని బంగారు వల్లిగా తీర్చిదిద్దుతాం' అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎర్రవల్లి గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా మెదక్ జాయింట్ కలెక్టర్ నియమిస్తున్నట్లు తెలిపారు. రేపు ఎర్రవల్లిలో గ్రామ ప్రజలతో కలిసి కేసీఆర్ శ్రమదానం కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రజలతో సహపంక్తి భోజనం, ఎల్లుండి మొక్కలు నాటే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. -
ఎర్రవెల్లిలో గ్రామజ్యోతి ప్రారంభించిన కేసీఆర్
మెదక్ : మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే తిగుల్, మునిగడప గ్రామాల్లో ఆయన పర్యటించనున్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట మధ్యలో సీఎం ఎప్పుడైనా ఈ రెండు గ్రామాలకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఆదివారం వరకూ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉంటారని సమాచారం. -
గ్రామజ్యోతి ఎలా నడుస్తోంది?
ఎర్రవల్లి గ్రామస్తులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా * బాగా చేయండి.. నేనే వస్తా.. శ్రమదానం చేస్తా జగదేవ్‌పూర్: గ్రామజ్యోతి కార్యక్రమం ఎలా నడుస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరా తీశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆయన తన కాన్వాయ్ ద్వారా గణేశ్‌పల్లి, నర్సన్నపేట, ఎర్రవల్లి గ్రామాల మీదుగా ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఎర్రవల్లి మీదుగా వెళ్తున్న క్రమంలో స్థానిక వాటర్‌ట్యాంకు దగ్గర గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, గ్రామ ప్రజలు గుమికూడటంతో అక్కడ ముఖ్యమంత్రి ఐదు నిమిషాల పాటు ఆగారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ‘మీ ఊర్లో గ్రామ జ్యోతి ఎలా నడుస్తోంది... బాగా చేయండి.. నేనూ పాల్గొని శ్రమదానం చేస్తా.. గ్రామజ్యోతిని బ్రహ్మాండంగా నిర్వహిద్దాం.. గురువారం లేదా ఆదివారం ప్రతి వాడలో పర్యటిస్తా’ అని కేసీఆర్ ఉత్సాహపరిచారు. అనంతరం ముఖ్యమంత్రి తన కాన్వాయ్ ద్వారా గ్రామ సమీపంలోని ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ రోనాల్డ్‌రాస్, గడా అధికారి హన్మంతరావు స్వాగతం పలికారు. ఫాంహౌస్‌కు చేరుకోగానే జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. తన క్షేత్రంలో జరుగుతున్న వ్యవసాయ పనుల గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. నేడు మూడు గ్రామాల్లో పర్యటన! ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మండలంలోని ఎర్రవల్లి, తిగుల్, మునిగడప గ్రామాల్లో పర్యటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఎర్రవల్లిలో గడా అధికారి హన్మంతరావు బుధవారం వివిధ పనులను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. తిగుల్ గ్రామంలో కూడా పర్యటించనున్నారని తెలిసింది. దీంతో గ్రామ సర్పంచ్ సుధాకర్‌రెడ్డి.. తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో సీఎం ఎప్పుడైనా గ్రామానికి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. మునిగడపలో సైతం పర్యటిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తానికి ఆదివారం వరకు సీఎం ఫాంహౌస్‌లో ఉంటారని సమాచారం. -
వ్యవసాయ క్షేత్రంలోనే సీఎం
జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం కూడా వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తన ఫాంహౌస్‌కు వచ్చిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతూ అల్లం విత్తే పనులను, పంటలను పరిశీలించారు. అయితే వివిధ పత్రికల్లో సీఎంతో కలసిన స్టీఫెన్సన్ ఫొటోలు రావడంతో ఫాంహౌస్ వద్ద మరింత భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అటు వైపు వెళ్లేవారి పూర్తి వివరాలతో పాటు ఫోన్ నంబర్లను సేకరిస్తూ పంపిస్తున్నారు. శివారు వెంకటాపూర్, వర్ధరాజ్‌పూర్ వెళ్లేవారిని గంగాపూర్, యూసుఫ్‌ఖాన్‌పల్లి, ఎర్రవల్లి మీదుగా దారి మళ్లించారు. ఫాంహౌస్ పక్క నుంచి ఎవరినీ పంపించడం లేదు. అలాగే ప్రైవేట్ మినీ బస్సుల అసోసియేషన్ రాష్ట్ర నేతలు సీఎంను కలవడానికి ఫాంహౌస్‌కు వస్తుండగా వెంకటాపూర్ శివారులోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు వెనుదిరిగారు. కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.