ఒక్కటై సాగారు..
Published Sat, Oct 15 2016 4:37 PM | Last Updated on Thu, Jul 11 2019 7:45 PM
సీఎం దత్తత గ్రామాల్లో సామూహిక సోయాబీన్ కోత పనులు ప్రారంభం
సమష్టిగా వెళ్దాం.. చైతన్యాన్ని చాటుదాం: కలెక్టర్ పిలుపు
రైతులతో కలిసి పంట కోసిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి
జగదేవ్‌పూర్ (మర్కూక్): సమష్టి చైతన్యంతో ముందుకు వెళ్తూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో సోయాబీన్ పంట కోత పనులను శుక్రవారం సామూహికంగా ప్రారంభించారు. సీఎం దత్తత గ్రామాలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు. సామూహికంగా సాగు చేసిన సోయాబీన్, మొక్కజొన్న పంటల కోత పనుల్లో అందరూ పాల్గొనాలన్నారు. సమష్టి చైతన్య చాటాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు గ్రామాల్లో పంట కోత పనులు చేపడుతున్నామన్నారు. రైతులు సైతం ముందుకురావడం అభినందనీయమన్నారు. అందరికీ ఒకే రకమైన విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా సహాయాన్ని అందించినట్టు తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే పంట సోయాబీన్ అని పేర్కొన్నారు. పంట వేసిన మూడు, నాలుగు నెలలో చేతికందుతుందన్నారు. జూన్ చివరి వారంలో సాగు చేసిన సోయా పంట ప్రస్తుతం చేతికందిందన్నారు. రెండు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానాన్ని రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలకు విస్తరిస్తామని చెప్పారు. సీడ్‌బౌల్ తెలంగాణలో రైతులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను అవలంబిస్తే మంచి పంటలను సాగు చేయవచ్చని సూచించారు. సోయాబీన్ పంటకోతలో సామూహికంగా కదిలినట్టుగానే మొక్కజొన్న కోతలోనూ ముందుకు సాగాలని సూచిం చారు. రెండు గ్రామాల్లో 800 ఎకరాల్లో సోయాబీన్ పంట సాగు చేయగా అధిక వర్షాల వల్ల 180 ఎకరాల పంటకు నష్టం వాటిల్లిందన్నారు.
కొడవలి పట్టిన కలెక్టర్...
కలెక్టర్ కొద్దిసేపు రైతుగా మారారు. సీఎం దత్తత గ్రామాల్లో శుక్రవారం సోయాబీన్ పంట కోతల్లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. రైతులు, కూలీలతో కలిసి పంట కోత పనులు చేపట్టారు. చేత కోడవలి పట్టి.. సగం మునుము వరకు కోత కోశారు. కలెక్టరే చురుగ్గా పనులు చేయడంతో రైతులు, కూలీలు మరింత ఉత్సాహంగా కదిలారు. ‘అమ్మా.. బాగున్నావా..?, పంట ఎట్ల ఉంది..? బాగానే ఉందా..?’ అంటూ కలెక్టర్ రైతులను పలుకరించారు. ఎకరానికి ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, క్వింటాల్ ధర రూ.5 వేలు ఉందని రైతులకు వివరించారు. పెట్టుబడి పోను ఎకరానికి రూ.15 నుంచి రూ.20 వేల వరకు లాభం వస్తుందని కలెక్టర్ లెక్కలు వేసి చెప్పారు. కార్యక్రమంలో జేసీ హన్మంతరావు, తెలంగాణ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జీఎం హెచ్‌కే సింగ్, జేడీఏ గోవింద్, ఏడీఏ అశోక్ కుమార్, ఏఓ నాగరాజు, జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రం, సర్పంచ్‌లు భాగ్య, బాల్‌రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు కిష్టారెడ్డి, ఎంపీడీఓ పట్టాభిరామారావు, వీడీసీ సభ్యులు బాలరాజు, ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సత్తయ్య, కృష్ణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement