crop cutting
-
ఒక్కటై సాగారు..
సీఎం దత్తత గ్రామాల్లో సామూహిక సోయాబీన్ కోత పనులు ప్రారంభం సమష్టిగా వెళ్దాం.. చైతన్యాన్ని చాటుదాం: కలెక్టర్ పిలుపు రైతులతో కలిసి పంట కోసిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి జగదేవ్‌పూర్ (మర్కూక్): సమష్టి చైతన్యంతో ముందుకు వెళ్తూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో సోయాబీన్ పంట కోత పనులను శుక్రవారం సామూహికంగా ప్రారంభించారు. సీఎం దత్తత గ్రామాలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు. సామూహికంగా సాగు చేసిన సోయాబీన్, మొక్కజొన్న పంటల కోత పనుల్లో అందరూ పాల్గొనాలన్నారు. సమష్టి చైతన్య చాటాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు గ్రామాల్లో పంట కోత పనులు చేపడుతున్నామన్నారు. రైతులు సైతం ముందుకురావడం అభినందనీయమన్నారు. అందరికీ ఒకే రకమైన విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా సహాయాన్ని అందించినట్టు తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే పంట సోయాబీన్ అని పేర్కొన్నారు. పంట వేసిన మూడు, నాలుగు నెలలో చేతికందుతుందన్నారు. జూన్ చివరి వారంలో సాగు చేసిన సోయా పంట ప్రస్తుతం చేతికందిందన్నారు. రెండు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానాన్ని రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలకు విస్తరిస్తామని చెప్పారు. సీడ్‌బౌల్ తెలంగాణలో రైతులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను అవలంబిస్తే మంచి పంటలను సాగు చేయవచ్చని సూచించారు. సోయాబీన్ పంటకోతలో సామూహికంగా కదిలినట్టుగానే మొక్కజొన్న కోతలోనూ ముందుకు సాగాలని సూచిం చారు. రెండు గ్రామాల్లో 800 ఎకరాల్లో సోయాబీన్ పంట సాగు చేయగా అధిక వర్షాల వల్ల 180 ఎకరాల పంటకు నష్టం వాటిల్లిందన్నారు. కొడవలి పట్టిన కలెక్టర్... కలెక్టర్ కొద్దిసేపు రైతుగా మారారు. సీఎం దత్తత గ్రామాల్లో శుక్రవారం సోయాబీన్ పంట కోతల్లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. రైతులు, కూలీలతో కలిసి పంట కోత పనులు చేపట్టారు. చేత కోడవలి పట్టి.. సగం మునుము వరకు కోత కోశారు. కలెక్టరే చురుగ్గా పనులు చేయడంతో రైతులు, కూలీలు మరింత ఉత్సాహంగా కదిలారు. ‘అమ్మా.. బాగున్నావా..?, పంట ఎట్ల ఉంది..? బాగానే ఉందా..?’ అంటూ కలెక్టర్ రైతులను పలుకరించారు. ఎకరానికి ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, క్వింటాల్ ధర రూ.5 వేలు ఉందని రైతులకు వివరించారు. పెట్టుబడి పోను ఎకరానికి రూ.15 నుంచి రూ.20 వేల వరకు లాభం వస్తుందని కలెక్టర్ లెక్కలు వేసి చెప్పారు. కార్యక్రమంలో జేసీ హన్మంతరావు, తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జీఎం హెచ్‌కే సింగ్, జేడీఏ గోవింద్, ఏడీఏ అశోక్ కుమార్, ఏఓ నాగరాజు, జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రం, సర్పంచ్‌లు భాగ్య, బాల్‌రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు కిష్టారెడ్డి, ఎంపీడీఓ పట్టాభిరామారావు, వీడీసీ సభ్యులు బాలరాజు, ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సత్తయ్య, కృష్ణ పాల్గొన్నారు. -
అక్టోబర్ నుంచి ప్రయోగాలు
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్‌లో సాగైన పంటలకు సంబంధించి దిగుబడులు లెక్కించడానికి ప్రణాళిక, వ్యవసాయశాఖ అధికారులు పంట కోత ప్రయోగాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ మొదటి వారం నుంచి ఎంపిక చేసిన గ్రామాలు, పొలాల్లో దిగుబడులు అంచనా వేయనున్నారు. వేరుశనగలో 756, కందిలో అత్యధికంగా 1,514 పంట కోత ప్రయోగాలు నిర్వహించనున్నారు. అయితే వేరుశనగ పంటకు ఈ సారి కూడా వాతావరణ బీమా పథకం అమలు చేస్తుండటంతో దిగుబడులు దారుణంగా వచ్చినా పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదు. జిల్లా వ్యాప్తంగా 5.50 లక్షల మంది రైతులు వేరుశనగ పంటపై రూ.75 కోట్ల వరకు ప్రీమియం చెల్లించారు. పంట కోత దిగుబడుల లెక్కలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఈ ఏడాది వేరుశనగ రైతులకు భారీగా నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆగస్టు పూర్తిగానూ, ప్రస్తుత సెప్టెంబర్‌లో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 6.09 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగైన వేరుశనగ పంటకు 80 నుంచి 90 శాతం మేర నష్టం జరిగినట్లేనని చెబుతున్నారు. పంట దెబ్బతిన్నా సాధారణం కన్నా జూన్‌లో 47 శాతం, జూలైలో 52 శాతం అధికంగా వర్షాలు పడటంతో వర్షపాత లోటు పెద్దగా కనిపించడం లేదు. ఈ లెక్కలు వాతావరణ బీమా పథకం నిబంధనలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది. దీంతో వాతావరణ బీమా పథకం వల్ల మరోసారి అన్యాయం జరగవచ్చని అంచనా వేస్తున్నారు. అదే పంట కోత ప్రయోగాల ద్వారా వచ్చిన దిగుబడుల లెక్కల ఆధారంగా బీమా పథకం అమలు చేస్తే ఈ ఏడాది భారీ ఎత్తున పరిహారం వచ్చే అవకాశం ఉంది. ఇక గ్రామం యూనిట్‌గా ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనా అమలు చేస్తున్న కంది పంటలో 1,514 పంట కోత ప్రయోగాలు నిర్వహించడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. కంది, ఇతర పంటలకు సంబంధించి 600 నుంచి 700 మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లించినట్లు లీడ్‌బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు వరిలో 51, పొద్దుతిరుగుడులో 36, జొన్న పంటలో 36 ప్రయోగాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా జిల్లాలో 8 పంటలకు అమలు చేస్తున్నా 10 శాతం కన్నా తక్కువ మంది రైతులకు కూడా ప్రయోజనం లేని పరిస్థితి నెలకొంది. -
పకడ్బందీగా పంటకోత ప్రయోగాలు
–సీపీఓ ఆనంద్‌నాయక్ కర్నూలు(అగ్రికల్చర్): పంటకోత ప్రయోగాలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఆనంద్‌నాయక్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని సనయన ఆడిటోరియంలో వ్యవసాయశాఖ ఏడీలు, అసిస్టెంటు స్టాటిస్టికల్ ఆఫీసర్లు తదితరులకు పంటకోత ప్రయోగాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఓ మాట్లాడుతూ...పంటకోత ప్రయోగాలను వ్యవసాయశాఖ, జిల్లా ప్రణాళిక విభాగం చెరి సగం చేపడుతాయని వివరించారు. జిల్లాలో గ్రామం యూనిట్‌గా వరికి బీమా అమలు చేస్తున్నామని, ప్రతి 100 హెక్టార్లను ఒక యూనిట్‌గా తీసుకొని పంట కోత ప్రయోగాలు నిర్వహించాలన్నారు. వరిలో 5‘5 మీటర్లు, కందిలో 10‘10 మీటర్ల ప్లాట్‌లో పంటకోత ప్రయోగం నిర్వహించాలని వివరించారు. జేడీఏ ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ..ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ప్రీమియంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యెజనను అమలు చేస్తోందన్నారు. నష్టపోయిన రైతులకు ఈ పథకం కింద పరిహారం రావాలంటే పంటకోత ప్రయోగాలు అత్యంతకీలకమన్నారు. సమావేశంలో ఎల్‌డీసీఎం నరసింహారావు, ఉద్యానశాఖ సహాయ సంచాలకులు రఘునాథరెడ్డి, జిల్లా ప్రణాళిక విభాగం డీడీ కష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.