ఖరీఫ్‌లో సాగైన పంటలకు సంబంధించి దిగుబడులు లెక్కించడానికి ప్రణాళిక, వ్యవసాయశాఖ అధికారులు పంట కోత ప్రయోగాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్‌లో సాగైన పంటలకు సంబంధించి దిగుబడులు లెక్కించడానికి ప్రణాళిక, వ్యవసాయశాఖ అధికారులు పంట కోత ప్రయోగాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ మొదటి వారం నుంచి ఎంపిక చేసిన గ్రామాలు, పొలాల్లో దిగుబడులు అంచనా వేయనున్నారు. వేరుశనగలో 756, కందిలో అత్యధికంగా 1,514 పంట కోత ప్రయోగాలు నిర్వహించనున్నారు. అయితే వేరుశనగ పంటకు ఈ సారి కూడా వాతావరణ బీమా పథకం అమలు చేస్తుండటంతో దిగుబడులు దారుణంగా వచ్చినా పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదు. జిల్లా వ్యాప్తంగా 5.50 లక్షల మంది రైతులు వేరుశనగ పంటపై రూ.75 కోట్ల వరకు ప్రీమియం చెల్లించారు.
పంట కోత దిగుబడుల లెక్కలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఈ ఏడాది వేరుశనగ రైతులకు భారీగా నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆగస్టు పూర్తిగానూ, ప్రస్తుత సెప్టెంబర్‌లో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 6.09 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగైన వేరుశనగ పంటకు 80 నుంచి 90 శాతం మేర నష్టం జరిగినట్లేనని చెబుతున్నారు. పంట దెబ్బతిన్నా సాధారణం కన్నా జూన్‌లో 47 శాతం, జూలైలో 52 శాతం అధికంగా వర్షాలు పడటంతో వర్షపాత లోటు పెద్దగా కనిపించడం లేదు. ఈ లెక్కలు వాతావరణ బీమా పథకం నిబంధనలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది. దీంతో వాతావరణ బీమా పథకం వల్ల మరోసారి అన్యాయం జరగవచ్చని అంచనా వేస్తున్నారు. అదే పంట కోత ప్రయోగాల ద్వారా వచ్చిన దిగుబడుల లెక్కల ఆధారంగా బీమా పథకం అమలు చేస్తే ఈ ఏడాది భారీ ఎత్తున పరిహారం వచ్చే అవకాశం ఉంది.
ఇక గ్రామం యూనిట్‌గా ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనా అమలు చేస్తున్న కంది పంటలో 1,514 పంట కోత ప్రయోగాలు నిర్వహించడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. కంది, ఇతర పంటలకు సంబంధించి 600 నుంచి 700 మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లించినట్లు లీడ్‌బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు వరిలో 51, పొద్దుతిరుగుడులో 36, జొన్న పంటలో 36 ప్రయోగాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా జిల్లాలో 8 పంటలకు అమలు చేస్తున్నా 10 శాతం కన్నా తక్కువ మంది రైతులకు కూడా ప్రయోజనం లేని పరిస్థితి నెలకొంది.