
జన్యు సవరణ (జీనోమ్ – ఎడిటింగ్) సాంకేతికతతో తొలి రెండు వరి వంగడాలను ఆవిష్కరించిన ఐసిఎఆర్
30% అధికంగా ధాన్యం దిగుబడినిచ్చే సత్తా.. కరువు, చౌడులను తట్టుకునే శక్తి ఈ రకాలకు ఉంది
వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న భూతాపాన్ని తట్టుకుంటూ 30% అధిక దిగుబడిని ఇవ్వగలిగిన రెండు సరికొత్త జన్యుసవరణ వరి రకాలను ప్రపంచంలోనే తొట్టతొలిగా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) శాస్త్రవేత్తలు రూపొందించారు. క్రిస్పర్– కాస్9 అనే సరికొత్త జీనోమ్–ఎడిటింగ్(జిఇ) టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేసిన రెండు వరి వంగడాలను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఆవిష్కరించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్)కి చెందిన పూసాలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్‌ఐ) పూసా రైస్ డిఎస్‌టి1 అనే రకం కరువును, చౌడును తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్‌ఆర్) పరిశోధకులు అభివృద్ధి చేసిన డిఆర్‌ఆర్ ధన్ 100 (కమల) అనే వరి అధిక దిగుబడినిస్తుంది.
మన దేశంలో ఇప్పటి వరకు అధికారికంగా సాగులో ఉన్న జన్యుమార్పిడి పంట పత్తి ఒక్కటి మాత్రమే. జన్యుసవరణకు ఇదే ్ప్రారంభం. గతంలో సంక్లిష్టమైన ‘జన్యుమార్పిడి’లో భాగంగానే ‘జన్యుసవరణ’ను కూడా చూసేవారు. అయితే, 2022లో జన్యుసవరణను కఠినమైన నియంత్రణ ప్రక్రియ నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ తర్వాత జన్యు సవరణ పరిశోధనలకు రూ. 500 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే జన్యుసవరణ తొలి వరి రకాలను ఇప్పుడు ఆవిష్కరించారు.
ఈ రెండు వంగడాల పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ఈ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సత్కరించారు. పూసా డిఎస్‌టి రైస్ 1 పై కృషి చేసిన డాక్టర్ విశ్వనాథన్ సి, డాక్టర్ గోపాల్ కృష్ణన్ ఎస్, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ శివానీ నగర్, డాక్టర్ అర్చన వాట్స్, డాక్టర్ సోహం రే, డాక్టర్ అశోక్ కుమార్ సింగ్, డాక్టర్ ్ప్రాంజల్ యాదవ్‌లను సత్కరించారు. డిఆర్‌ఆర్ రైస్ 100 (కమల) అభివృద్ధికి కృషి చేసిన ఐఐఆర్‌ఆర్ శాస్త్రవేత్తలు డాక్టర్ సత్యేంద్ర కుమార్ మంగథియా, డాక్టర్ ఆర్.ఎం. సుందరం, డా. అబ్దుల్ ఫియాజ్, డా. సి.ఎన్. నీరజ, డా. ఎస్వీ సాయి ప్రసాద్‌లను సత్కరించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది మాట్లాడుతూ, ఈ సాంకేతికత దేశీయంగా అభివృద్ధి చేసినది కావటం వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ప్రయత్నాల ద్వారా రైతులకు త్వరగా అందించవచ్చని అన్నారు.
10కి పైగా పంటలకు జన్యు సవరణ
ఐసిఎఆర్ డైరెక్టర్ డాక్టర్ జనరల్ మంగి లాల్ జాట్ ప్రసంగిస్తూ ఈ రెండు వంగడాల ఆవిష్కరణ భారత వ్యవసాయంలో ఒక చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు. రాబోయే సంవత్సరాల్లో అనేక ఇతర పంటలకు సంబంధించి జన్యు సవరణ పంట రకాలను విడుదల చేస్తామని అన్నారు. ‘కొత్త వ్యవసాయ విధానాలు కొత్త పద్ధతులకు అనుగుణంగా ఉండాలి. మారిన వాతావరణ పరిస్థితుల్లో పాత పద్ధతులు పనిచేయవు’ అని ఆయన అన్నారు. దేశంలోని బహుళ జాతి సంస్థలు, విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం పప్పుధాన్యాలు, ఆవాలు, గోధుమ, ΄÷గాకు, పత్తి, అరటి, టమోటా, నూనెగింజలు వంటి 10కి పైగా పంటలకు సంబంధించి జన్యు–సవరణపై పరిశోధనలు చేస్తున్నాయని ఆయన వెల్లడించారు.
ఆస్ట్రేలియాలోని ముర్డోక్ విశ్వవిద్యాలయంలోని ఇంటర్నేషనల్ చైర్ ఆఫ్ అగ్రికల్చర్ – ఫుడ్ సెక్యూరిటీ, సెంటర్ ఫర్ క్రాప్ అండ్ ఫుడ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ రాజీవ్ వర్షిణి మాట్లాడుతూ, ఈ ఆవిష్కరణలు వ్యవసాయ జీవసాంకేతికతలో ఒక మైలురాయన్నారు. ప్రత్యేకంగా చిన్న–సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని, ప్రపంచ పురోగతికి ప్రేరణనిస్తాయని అన్నారు. ఈ రెండు జన్యు సవరణ వంగడాలను వాణిజ్య స్థాయిలో విత్తనోత్పత్తి చేసి రైతులకు అందించడానికి మరో నాలుగైదు సంవత్సరాలు పట్టొచ్చు.
కరువు, చౌడును అధిగమించి..
ఎంటియు1010 వరి వంగడానికి జన్యు సవరణ చేసి ‘పూసా రైస్ డిఎస్‌టి 1’ వంగడాన్ని పూసాలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్‌ఐ) అభివృద్ధి చేసింది. ఒత్తిడి నిరోధకతను అణిచివేసే జన్యువును తొలగించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ వంగడాన్ని రూపొందించారు. పత్ర రంధ్రాల సాంద్రతను తగ్గించటం ద్వారా తక్కువ నీటితో పంట పండేలా మార్పు చేశారు. చౌడును తట్టుకొని ఎక్కువ పిలకలు వచ్చేలా చేయటం ద్వారా అధికంగా ధాన్యం దిగుబడి వచ్చేలా చేశారు. క్షేత్రస్థాయి పరీక్షల్లో ఎంటియు 1010 రకంతో ΄ోలిస్తే కరువు, చౌడు వత్తిళ్లను తట్టుకొని గణనీయంగా అధిక దిగుబడిని చూపించాయని ఐఎఆర్‌ఐ తెలిపింది.
సాంబ మసూరికి కొత్త రూపు
దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొంది, విస్తారంగా సాగవుతున్న సాంబ మసూరి (బిపిటి–5204) వంగడానికి జన్యుసవరణ చేసి ‘డిఆర్‌ఆర్ ధన్ 100 (కమల)’ రకాన్ని అభివృద్ధి చేశారు. రాజేంద్రనగర్‌లోని 30% అధిక దిగుబడిని ఇస్తుంది. 20 రోజులు ముందే కోతకు వస్తుంది. ‘క్రిస్పర్’ను ఉపయోగించి సాంబ మసూరిలోని సైటోకినిన్ ఆక్సిడేస్ జన్యువుకు తగిన విధంగా సవరణ చేశారు. ఫలితంగా ధాన్యం దిగుబడిలో 19% పెరుగుదల, 20 రోజుల వరకు ముందస్తు పరిపక్వతతో పాటు తక్కువ ఎరువుల వినియోగం, కరువు పరిస్థితులలో మెరుగైన పనితీరు వంటి గుణాలతో ‘డిఆర్‌ఆర్ ధన్ 100 (కమల)’ రకం రూపుదాల్చింది.
ఐసిఎఆర్ శాస్త్రవేత్తల అసాధారణ విజయాలు
వ్యవసాయ సవాళ్లను అధిగమించడానికి ఆధునిక పద్ధతులను అవలంభించాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. ఆయన మాటల నుంచి ప్రేరణ పొందిన ఐసిఎఆర్ శాస్త్రవేత్తలు ఈ కొత్త రకాలను సృష్టించడం ద్వారా వ్యవసాయ రంగంలో అసాధారణ విజయాలు సాధించారు. వరిలో ఈ కొత్త పంటలు ధాన్యం ఉత్పత్తిని పెంచడమే కాకుండా పర్యావరణ పరంగా సానుకూల ఫలితాలను ఇస్తాయి. సాగు నీరు ఆదా అవుతుంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. తద్వారా పర్యావరణంపై ఒత్తిడి తగ్గుతుంది. మొత్తంగా వరి సాగు విస్తీర్ణాన్ని 50 లక్షల హెక్టార్లు తగ్గించాలి. ధాన్యం ఉత్పత్తిని కోటి టన్నులు పెంచాలి. ఈ 50 లక్షల హెక్టార్ల భూముల్లో అదనంగా పప్పుధాన్యాలు, నూనెగింజలను సాగు చెయ్యాలి.
– శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
జన్యుభద్రతా పరీక్షల గణాంకాలను కూడా ప్రకటించాలి
ఐసిఎఆర్ మొట్టమొదటి జన్యు సవరణ వరి రకాలను విడుదల చేసింది. అధిక దిగుబడినిస్తూ, కరువును తట్టుకోవటం కోసం సరికొత్త క్రిస్పర్–కాస్9 టెక్నాలజీని వినియోగించి ఈ రకాలను అభివృద్ధి చేశారు. వీటికి సంబంధించిన జన్యుభద్రతా పరీక్షల గణాంకాలను సైతం బహిరంగంగా ప్రకటిస్తే ఈ సరికొత్త వరి బియ్యం తినటంలో భద్రత గురించి కూడా ప్రజలు తెలుసుకుంటారు.
– డాక్టర్ సుమన్ సహాయ్, స్వతంత్ర శాస్త్రవేత్త, జీన్‌క్యాంపెయిన్ వ్యవస్థాపకులు