Crispr Cas9
-
హెచ్ఐవీకి మందు దొరికింది!
అవసరాలకు తగ్గట్టుగా జన్యువుల్లో మార్పులు చేర్పులు చేసేందుకు వీలు కల్పించే క్రిస్పర్ క్యాస్ –9 టెక్నాలజీతో శాస్త్రవేత్తలు జంతువుల్లో హెచ్ఐవీని లేకుండా చేయగలిగారు. బతికున్న జంతువుల జన్యువుల్లోంచి హెచ్ఐవీ కారక వైరస్‌ను తొలగించగలగడం ఇదే తొలిసారి. వైద్యశాస్త్రం చాలా అభివృద్ధి చెందినప్పటికీ హెచ్ఐవీకి ఇప్పటివరకూ పూర్తిస్థాయి చికిత్స అన్నది లేదన్నది తెలిసిందే. యాంటీ రెట్రో వైరల్ మందులను వాడుతూ జీవితకాలాన్ని పెంచుకునేందుకు మాత్రమే అవకాశముంది. ఈ నేపథ్యంలో టెంపుల్ యూనివర్శిటీ, నెబ్రాస్కా యూనివర్శిటీ మెడికల్ సెంటర్ల శాస్త్రవేత్తలు క్రిస్పర్ సాయంతో హెచ్ఐవీ వైరస్‌లను తొలగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2014లో టెంపుల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన శాలలో మానవ కణాల జన్యువుల్లోంచి వైరస్‌ను తొలగించడంలో విజయం సాధించగా.. తరువాతి కాలంలో నెబ్రాస్కా యూనివర్శిటీ శాస్త్రవేత్తలతో కలిసి బతికున్న జంతువులపై ప్రయోగాలు చేసి విజయం సాధించారు. హెచ్ఐవీ వైరస్ తనదైన డీఎన్ఏ సాయంతో కణాల్లోకి చొరబడి విభజితమవుతుందన్నది తెలిసిందే. వ్యాధితో కూడిన ఎలుకలకు యాంటీ రెట్రో వైరల్ మందులను చాలా నెమ్మదిగా వారాలపాటు విడుదల చేస్తూ వైరస్ మోతాదు అతి తక్కువ స్థాయిలో ఉండేలా చేసిన తరువాత శాస్త్రవేత్తలు.. ఆ తరువాత కణాల లోపల ఉండే వైరస్ డీఎన్ఏ పోగును కత్తిరించారు. ఆ తరువాత జరిపిన పరిశీలనల్లో మూడు వంతుల ఎలుకల్లో వైరస్ లేకుండా పోయినట్లు స్పష్టమైంది. -
క్రిస్పర్‌తో అందరికీ సరిపోయే మూలకణం!
శరీరంలోని ఏ కణంగానైనా, అవయవంగానైనా మారిపోగల సామర్థ్యం మూలకణాల సొంతం. అయితే ఒకరి మూలకణాలు ఇంకొకరికి సరిపోవు. అందరికీ సరిపోయేలా మూలకణాలను తీర్చిదిద్దగలిగితే.. ఎన్నో వ్యాధులకు సమర్థమైన చికిత్స అందించడం వీలవుతుంది. ఈ అద్భుతాన్ని సాధించారు కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఈ సార్వత్రిక మూలకణాలు రోగ నిరోధక వ్యవస్థ కళ్లుగప్పి పనిచేయడం ఇంకో విశేషం. పెద్దల్లోని మూలకణాలను పిండ మూల కణాల లక్షణాలు కనపరిచేలా చేయగలరని దశాబ్దం క్రితం ప్రపంచానికి తెలిసినప్పటి నుంచి వాటిని సమర్థంగా వాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే నాణ్యత.. పునరుత్పత్తి విషయంలో కొన్ని సమస్యలు రావడంతో విస్తృత వినియోగంలోకి రాలేకపోయాయి. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా వర్శిటీ శాస్త్రవేత్తలు జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ క్రిస్పర్ను ఉపయోగించి ఏ మూలకణాన్నైనా పిండ మూల కణాల లక్షణాలు కనిపించేలా మార్చగలిగారు. ఇందుకోసం రెండు జన్యువులను పనిచేయకుండా చేశామని, సీడీ47 అనే జన్యువు ద్వారా ఎక్కువ మోతాదులో ప్రొటీన్లను ఉత్పత్తి చేయించడం ద్వారా లక్ష్యాన్ని చేరుకున్నామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డ్యూస్ తెలిపారు. జంతువులపై జరిగిన పరిశోధనలు సంతప్తికరంగా ఉన్నాయని వివరించారు. అంతేకాకుండా.. ఈ కొత్త సార్వత్రిక మూలకణాలతో తాము గుండె కండర కణాలను తయారు చేశామని.. ఎలుకల్లోకి వీటిని జొప్పించి పరిశీలించామని వివరించారు. -
డిజైనర్ బేబీ దుమారం!
మూడేళ్ల క్రితం తాము పిండంలో మార్పులు చేశామని చైనా ప్రకటించడం ఎంత సంచలనం సృష్టించిందో... తాజాగా డిజైనర్ బేబీల ప్రకటన కూడా అంతే స్థాయిలో వివాదం సృష్టిస్తోంది. జన్యుమార్పులను కచ్చితంగా చేయగల క్రిస్పర్ టెక్నాలజీని ఇలా డిజైనర్ బేబీల సృష్టికి అస్సలు వాడకూడదని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ తాజాగా చైనా శాస్త్రవేత్త హే జియాంకుయ్ పట్టించుకోకుండా ఇద్దరు చిన్నారులను పిండందశలో జీన్ ఎడిటింగ్ చేపట్టడం కలకలం రేపుతోంది. తల్లిదండ్రుల నుంచి హెచ్ఐవీ/ఎయిడ్స్ సోకకుండా పిండంలోని డీఎన్ఏలో సీసీఆర్5 ప్రొటీన్‌ను తొలగించామని ప్రకటించి హే ఇప్పటికే కలకలం రేపారు. దీనిపై శాస్త్రవేత్తల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇలాంటి ప్రయోగాల కారణంగా మరో శక్తిమంతమైన జాతి ఉద్భవించి మానవజాతికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని మెజారిటీ శాస్త్రవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిగా నయంకాని వైరల్ వ్యాధులతో పాటు వారసత్వంగా సంక్రమించే రోగాల నుంచి భవిష్యత్ తరాలను కాపాడుకునే కోణంలో ఈ ప్రయోగాన్ని మరికొందరు సమర్థిస్తున్నారు. తాజాగా ఇలాంటి ప్రయోగాలను గతంలోనే నిషేధించామని చైనా శాస్త్ర,సాంకేతిక శాఖ సహాయమంత్రి జు నాన్పింగ్ తెలిపారు. వెయ్యి నైపుణ్యాల ప్రణాళిక... పదేళ్ల క్రితం చైనా ‘1000 టాలెంట్స్ ప్లాన్’ పేరుతో ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విదేశాల్లో స్థిరపడి వేర్వేరు రంగాల్లో రాణిస్తున్న చైనీస్ సంతతి ప్రజలను ఆకర్షించి స్వదేశానికి రప్పించేలా ప్రణాళిక రచించింది. తద్వారా చైనాను అన్ని రంగాల్లో పరుగులు పెట్టించాలని కమ్యూనిస్ట్ అధినాయకత్వం భావించింది. ఇందులో భాగంగానే అమెరికాలో పనిచేస్తున్న డా.హే జియాంకుయ్ చైనాకు చేరుకుని బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు చేపట్టారు. అయితే క్రిస్పర్ సాంకేతికతతో హే చేసిన ప్రయోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయమై కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్త డేవిడ్ బాల్టీమోర్ మాట్లాడుతూ..‘పిండం స్థాయిలో మార్పులు జరుగుతాయి కాబట్టి అవి భవిష్యత్తు తరాలకూ అందుతాయి. దీనివల్ల కొంతకాలం తరువాత ఇప్పటివరకూ ఉన్న జన్యు సమతౌల్యత పూర్తిగా దెబ్బతింటుంది. ఈ టెక్నాలజీతో ప్రమాదాలూ లేకపోలేదు. జన్యుక్రమంలో చేసే మార్పులు ఎలాంటి విపరిణామాలకు దారితీస్తాయో ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియదు. జన్యు మార్పిడి లేదా జీన్ ఎడిటింగ్ సాయంతో కొన్ని రకాల వ్యాధులను నిరోధించగలిగినా.. అనూహ్యంగా ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. హే చేసిన ప్రయోగం ఫలితంగా పుట్టిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరి శరీరంలో మానవుల కంటే భిన్నమైన కణాలు ఉన్నట్లుగా వెల్లడైంది. పిండం స్థాయిలో మార్పులు చేయడం ఖరీదైన వ్యవహారం కాబట్టి హెచ్ఐవీ వంటి వ్యాధులు ఎక్కువగా ఉండే పేద దేశాల్లో ఈ సాంకేతికతను వాడలేరు. అంతేకాదు. కొన్నితరాలపాటు ప్రభావం చూపగల ఇలాంటి చర్యలకు మనిషి గతంలో ఎన్నడూ పాల్పడలేదు’ అని తెలిపారు. అయితే ఈ భయాలను హే జియాంకుయ్ కొట్టిపారేస్తున్నారు. పారిశ్రామిక విప్లవం కారణంగా మానవజీవితంలో పెనుమార్పులు వచ్చాయనీ, అందుకు అనుగుణంగానే వ్యాధులు కూడా పెరిగాయని గుర్తుచేస్తున్నారు. వ్యాధికారక జన్యువులను సరిచేయడం ద్వారా పర్యావరణ కాలుష్యం ద్వారా వచ్చే సమస్యలను అధిగమించి మెరుగైన జీవితం జీవించడం సాధ్యమవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రయోగానికి అనుమతి లేదు డా. హే జియాంకుయ్ చేపట్టిన జన్యువుల మార్పిడి ప్రయోగానికి తాము ఆమోదం తెలపలేదని చైనాలోని షెంజెన్ హార్మనీకేర్ విమెన్, చిల్డ్రన్ హాస్పిటల్ తెలిపింది. ఈ ప్రయోగ అనుమతి పత్రాలు ఫోర్జరీవి కావచ్చంది. మనిషి నైతికతను ఉల్లంఘించే ప్రయోగాలకు తాము వ్యతిరేకమని తెలిపింది. డా.హే చేపట్టిన ప్రయోగాన్ని ఖండిస్తూ చైనాకు చెందిన 100 మంది శాస్త్రవేత్తలు బహిరంగ లేఖను విడుదల చేశారు.అంతర్జాతీయంగా చైనా బయోమెడికల్ రంగానికి తలవంపు తెచ్చేలా డా.హే వ్యవహరిం చారన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి వినాశకర ప్రయోగాలు జరగకుండా కఠిన చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారంపై చైనా శాస్త్ర,సాంకేతిక శాఖ సహాయమంత్రి జు నాన్పింగ్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రయోగాలను చైనాలో నిషేధించామని స్పష్టం చేశారు. 14 రోజుల వయస్సున్న పిండంలోని మూలకణాలపై పరిశోధనలు నిర్వహించేందుకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉందన్నారు. -
నచ్చేలా.. మెచ్చేలా..డిజైనర్ బేబీలు!
జన్యు క్రమంలో మార్పులతో కావాల్సిన ఫలితాలు ఎకరా భూమిలో ఐదు టన్నుల బియ్యం పండితే.. రోగమన్నది లేని కాలం వస్తే.. పుట్టబోయే బిడ్డకు మనం కోరుకున్న లక్షణాలన్నీ వచ్చేలా చేసుకుంటే.. అవసరానికి కావాల్సినంత పెట్రోలు, డీజిల్ ఇంట్లోనే ఉత్పత్తి తయారైపోతోంటే.. భలే బాగుంటుంది కదా! త్వరలోనే ఇలాంటి అద్భుతాలన్నీ వాస్తవంగానే సాకారమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రిస్పర్ క్యాస్–9 టెక్నాలజీతో ఇదంతా సాధ్యమేనని అంటున్నారు. ఏమిటీ టెక్నాలజీ? మానవులే కాదు జంతువులు, చెట్లు, సూక్ష్మజీవులు సహా ప్రతి జీవ కణంలోనూ డీఎన్ఏ ఉంటుందని మనకు తెలిసిన విషయమే. కణాల్లో ఉండే ఒక్కో క్రోమోజోమ్‌లో ఆరు అడుగుల పొడవైన డీఎన్ఏ పోగు ఉంటుం ది. ఈ డీఎన్ఏ పోగులోని భాగాలనే మనం జన్యువులుగా కూడా చెబుతుంటాం. ఈ జన్యు క్రమమే మొత్తంగా ఆ జీవికి సంబంధించిన అన్ని లక్షణాలను నిర్దేశిస్తుంటుంది. ఈ జన్యు క్రమంలో వచ్చే స్వల్ప మార్పులే ఆ జీవకణం లక్షణాలు మారిపోవడానికి, వ్యాధులు రావడానికి కారణమవుతుంటాయి. ఈ మార్పులను సరిచేస్తే ఆ లక్షణాల ను సరిదిద్దడానికి, వ్యాధులను దూరం చేయడానికి వీలవుతుంది. అలా నేరుగా జన్యు క్రమంలో మార్పులు చేయడానికి తోడ్పడే టెక్నాలజీయే ‘క్రిస్పర్ క్యాస్–9’గా పిలుస్తుంటాం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో కత్తెర లాంటి వ్యవస్థ. డీఎన్ఏ పోగులో ఉండే క్రిస్పర్ అనే భాగాలు, క్యాస్–9 అనే ఎంజైమ్‌ల సహాయంతో కణాల్లోని క్రోమోజోమ్‌లలో ఉన్న జన్యు క్రమాన్ని కత్తిరించి, అవసరమైన జన్యు క్రమాన్ని చేర్చడానికి వీలవుతుంది. బ్యాక్టీరియాల్లో ఎప్పటినుంచో.. బ్యాక్టీరియాల వంటి కేంద్రకం లేని ఏక కణ జీవులన్నింటిలోనూ ఇప్పటికే క్రిస్పర్ క్యాస్–9 వ్యవస్థ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా బ్యాక్టీరియాలపైనా వైరస్ దాడి చేస్తుంది. అలాంటి సమయంలో ఆ బ్యాక్టీరియా తన డీఎన్ఏ పోగులో ఉండే క్రిస్పర్ భాగాలు, క్యాస్–9 అనే ఎంజైమ్ సాయంతో ఆ వైరస్ తాలూకు డీఎన్ఏను తొలగిస్తుంది. భవిష్యత్తులో అలాంటి వైరస్ దాడి చేసినప్పుడు గుర్తించేందుకు, ఎదుర్కొనేందుకు కూడా ఈ వ్యవస్థను సంసిద్ధం చేస్తుంది. ఈ ‘క్రిస్పర్ క్యాస్–9’పద్ధతిని ఏక కణ జీవుల్లోనే కాకుండా... మనుషులు సహా అన్ని జీవజాతుల్లోనూ ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో జన్యు ఎడిటింగ్‌లో కొత్త అధ్యాయం మొదలైంది. ఏమేం చేయవచ్చు? జన్యువును తొలగించడం..: ఏవైనా లక్షణాలు వద్దనుకుంటే.. జన్యు క్రమంలోని సదరు లక్షణాలకు సంబంధించిన జన్యువులను ఈ టెక్నాలజీ ద్వారా తొలగించవచ్చు. అంతేకాదు జన్యువులను తొలగించి పరిశీలించడం ద్వారా.. ఏయే జన్యువులు ఏయే పని చేస్తున్నాయి, ఏయే లక్షణాలు కలిగిస్తున్నాయి, ఎలాంటి మార్పులు వస్తాయనేది గుర్తించవచ్చు. కొత్త జన్యువులు చేర్చడం: మనం కోరుకున్న లక్షణాలున్న జన్యువులను జన్యుక్రమంలోకి జొప్పించవచ్చు. ఉదాహరణకు మేథస్సుకు ఓ జన్యు వు కారణమనుకుంటే.. మంచి తెలివితేటలు గల బిడ్డలు పుట్టేలా ఈ టెక్నాలజీ ద్వారా ఆ జన్యువును పిండం జన్యుక్రమంలోకి చేర్చవచ్చు. జన్యువులను చైతన్యవంతం చేయడం: సాధారణంగా జీవుల్లో తరాలు మారే కొద్దీ కొన్ని రకాల జన్యువులు నిద్రాణ స్థితిలోకి వెళ్లడం, చైతన్యవంతంగా మారడం జరుగుతుంటుంది. అలాంటి జన్యువులను ఈ పద్ధతి ద్వారా చైతన్యవంతం చేయవచ్చు. జన్యువుల నియంత్రణ: ఈ పద్ధతిద్వారా జన్యువుల పనితీరును పూర్తిగా నియంత్రించే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని జన్యువులు అధిక ప్రొటీన్ ఉత్పత్తి చేసేలా చేయడంతోపాటు మరికొన్నింటిని తక్కువగా పనిచేసేలా కూడా మార్పులు చేసుకోవచ్చు. మానవ ఆరోగ్యం..: కేన్సర్ మొదలుకుని ఎన్నో రకాల వ్యాధులకు ‘క్రిస్పర్ క్యాస్–9’ద్వారా మెరుగైన చికిత్స లభిస్తుంది. మధుమేహం, సిస్టిస్ ఫైబ్రోసిస్, సికిల్‌సెల్ ఎనీమియా వంటి మొండి వ్యాధులకూ చికిత్స అందుబాటులోకి వస్తుంది. అసలు కొన్ని రకాల వ్యాధులు రాకుండానే ఉండేలా కూడా చేయవచ్చు. కావాల్సినట్లుగా పిల్లలు!: మనం కోరుకున్నట్లుగా పిల్లలను కనేందుకు ‘క్రిస్పర్ క్యాస్–9’విధానం తోడ్పడుతుంది. కోరుకున్నట్లుగా చర్మం, జుత్తు, కళ్ల రంగు, ఎత్తు, తెలివితేటలు ఉండేలా జన్యుక్రమంలో మార్పులు చేయవచ్చు. ఎన్నో లాభాలున్నాయ్.. కొత్త, వినూత్న లక్షణాల పదార్థాలు..: సూక్ష్మజీవుల్లోని జన్యువుల్లో మార్పులు, చేర్పులు చేయడం ద్వారా అవి వినూత్న లక్షణాలున్న పదార్థాలను తయారు చేసేలా మార్చవచ్చు. ఉదాహరణకు గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని చమురులాంటి ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలిగేవి.. ఉక్కుకంటే దృఢమైన పోగులను తయారు చేయగల సాలీళ్లు వంటివాటిని అభివృద్ధి చేయొచ్చు. మందుల తయారీ: వివిధ రకాల బ్యాక్టీరియాల జన్యు క్రమంలో మార్పులు చేసి.. అవి మనకు అవసరమైన రసాయనాలు, ఔషధాలు ఉత్పత్తి చేసేలా మార్చవచ్చు. తద్వారా అతి చౌకగా అద్భుతమైన ఔషధాలు ఉత్పత్తి చేయవచ్చు. వ్యవసాయం: పంటల దిగుబడులను భారీగా పెంచేందుకు, చీడపీడలను సమర్థంగా తట్టుకునేందుకు వీలయ్యేలా మార్పులు చేయవచ్చు. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావం, వరదల వంటి అన్ని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని అధిక దిగుబడులు ఇవ్వగల వంగడాలను అభివృద్ధి చేసేందుకూ ఈ పద్ధతి తోడ్పడుతుంది. ఇప్పటికే సక్సెస్ అమెరికాలోని ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీకి చెందిన షౌఖారత్ మిటాలిపోవ్ అనే శాస్త్రవేత్త క్రిస్పర్ క్యాస్–9 పద్ధతి ద్వారా తొలిసారి మానవ పిండంలోని డీఎన్ఏలో మార్పులు చేశారు. బిడ్డగా మారగల అవకాశమున్న పిండాల్లోని వ్యాధికారక జన్యువులను సరిచేయడంలో ఆయన విజయం సాధించారని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ‘టెక్నాలజీ రివ్యూ’వెబ్సైట్ వెల్లడించింది. అయితే ఎన్ని పిండాల్లో మార్పులు చేశారు, ఏయే జన్యువుల్లో మార్పులు/చేర్పులు చేశారన్న వివరాలు బయటపెట్టలేదు. కానీ విజయవంతంగా జన్యుపరమైన మార్పులు చేసిన ఒకట్రెండు రోజులకే ఆ పిండాలను నాశనం చేసేసినట్లు సమాచారం. ఈ ప్రయోగం నేపథ్యంలో... చికిత్సలేని వ్యాధులను, వైకల్యాలను క్రిస్పర్ క్యాస్–9తో సరిచేయవచ్చన్న అంచనాలు మరింత బలపడ్డాయి. నైతికతకు సవాలు! క్రిస్పర్ క్యాస్–9 పరిశోధనలకు మానవ పిండాలను ఉపయోగించడంపై ఇప్పటికే పలు నైతికపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేగాకుండా ఈ పద్ధతివల్ల ఊహించని దుష్పరిణామాలు కూడా ఉంటాయని.. మానవాళికి కీడు కలిగించే పరిస్థితులు తలెత్తుతాయనే ఆందోళనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. క్రిస్పర్ క్యాస్–9 తెరపైకి వచ్చిందిలా.. 1987 క్రిస్పర్పై తొలి పరిశోధనా వ్యాసం ప్రచురితమైంది. 2000 కేంద్రకాలు లేని ఏకకణ జీవులన్నింటిలోనూ క్రిస్పర్ వ్యవస్థ ఉన్నట్లు గుర్తించారు. 2002 దీనికి ‘క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్డ్ పాలిన్డ్రోమ్ రిపీట్స్’లేదా క్రిస్పర్గా పేరు పెట్టారు. (డీఎన్ఏలోని కొన్ని భాగాలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూ ఉంటాయి. జన్యుక్రమాన్ని ఎటు నుంచి చదివినా ఒకేలా ఉండే ఈ భాగాలనే క్రిస్పర్ అంటారు) 2008 క్రిస్పర్ డీఎన్ఏలోని కొన్ని భాగాలపై పనిచేయగలదని తెలిసింది. 2013 క్రిస్పర్, క్యాస్–9 ఎంజైమ్లతో జన్యువుల్లో మార్పులు చేయవచ్చని నిరూపితమైంది. 2014 క్యాస్–9తో జన్యుక్రమం మొత్తాన్ని స్క్రీన్ చేయగలిగారు. 2015 క్రిస్పర్ క్యాస్–9 ద్వారా కేన్సర్ కణాలను సాధారణ కణాలుగా మార్చగలిగారు.