మూడేళ్ల క్రితం తాము పిండంలో మార్పులు చేశామని చైనా ప్రకటించడం ఎంత సంచలనం సృష్టించిందో... తాజాగా డిజైనర్ బేబీల ప్రకటన కూడా అంతే స్థాయిలో వివాదం సృష్టిస్తోంది. జన్యుమార్పులను కచ్చితంగా చేయగల క్రిస్పర్ టెక్నాలజీని ఇలా డిజైనర్ బేబీల సృష్టికి అస్సలు వాడకూడదని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ తాజాగా చైనా శాస్త్రవేత్త హే జియాంకుయ్ పట్టించుకోకుండా ఇద్దరు చిన్నారులను పిండందశలో జీన్ ఎడిటింగ్ చేపట్టడం కలకలం రేపుతోంది. తల్లిదండ్రుల నుంచి హెచ్‌ఐవీ/ఎయిడ్స్ సోకకుండా పిండంలోని డీఎన్‌ఏలో సీసీఆర్5 ప్రొటీన్‌ను తొలగించామని ప్రకటించి హే ఇప్పటికే కలకలం రేపారు. దీనిపై శాస్త్రవేత్తల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇలాంటి ప్రయోగాల కారణంగా మరో శక్తిమంతమైన జాతి ఉద్భవించి మానవజాతికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని మెజారిటీ శాస్త్రవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిగా నయంకాని వైరల్ వ్యాధులతో పాటు వారసత్వంగా సంక్రమించే రోగాల నుంచి భవిష్యత్ తరాలను కాపాడుకునే కోణంలో ఈ ప్రయోగాన్ని మరికొందరు సమర్థిస్తున్నారు. తాజాగా ఇలాంటి ప్రయోగాలను గతంలోనే నిషేధించామని చైనా శాస్త్ర,సాంకేతిక శాఖ సహాయమంత్రి జు నాన్‌పింగ్ తెలిపారు.
వెయ్యి నైపుణ్యాల ప్రణాళిక...
పదేళ్ల క్రితం చైనా ‘1000 టాలెంట్స్ ప్లాన్’ పేరుతో ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విదేశాల్లో స్థిరపడి వేర్వేరు రంగాల్లో రాణిస్తున్న చైనీస్ సంతతి ప్రజలను ఆకర్షించి స్వదేశానికి రప్పించేలా ప్రణాళిక రచించింది. తద్వారా చైనాను అన్ని రంగాల్లో పరుగులు పెట్టించాలని కమ్యూనిస్ట్ అధినాయకత్వం భావించింది. ఇందులో భాగంగానే అమెరికాలో పనిచేస్తున్న డా.హే జియాంకుయ్ చైనాకు చేరుకుని బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు చేపట్టారు. అయితే క్రిస్పర్ సాంకేతికతతో హే చేసిన ప్రయోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయమై కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్త డేవిడ్ బాల్టీమోర్ మాట్లాడుతూ..‘పిండం స్థాయిలో మార్పులు జరుగుతాయి కాబట్టి అవి భవిష్యత్తు తరాలకూ అందుతాయి. దీనివల్ల కొంతకాలం తరువాత ఇప్పటివరకూ ఉన్న జన్యు సమతౌల్యత పూర్తిగా దెబ్బతింటుంది. ఈ టెక్నాలజీతో ప్రమాదాలూ లేకపోలేదు. జన్యుక్రమంలో చేసే మార్పులు ఎలాంటి విపరిణామాలకు దారితీస్తాయో ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియదు. జన్యు మార్పిడి లేదా జీన్ ఎడిటింగ్ సాయంతో కొన్ని రకాల వ్యాధులను నిరోధించగలిగినా.. అనూహ్యంగా ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. హే చేసిన ప్రయోగం ఫలితంగా పుట్టిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరి శరీరంలో మానవుల కంటే భిన్నమైన కణాలు ఉన్నట్లుగా వెల్లడైంది. పిండం స్థాయిలో మార్పులు చేయడం ఖరీదైన వ్యవహారం కాబట్టి హెచ్‌ఐవీ వంటి వ్యాధులు ఎక్కువగా ఉండే పేద దేశాల్లో ఈ సాంకేతికతను వాడలేరు. అంతేకాదు. కొన్నితరాలపాటు ప్రభావం చూపగల ఇలాంటి చర్యలకు మనిషి గతంలో ఎన్నడూ పాల్పడలేదు’ అని తెలిపారు. అయితే ఈ భయాలను హే జియాంకుయ్ కొట్టిపారేస్తున్నారు. పారిశ్రామిక విప్లవం కారణంగా మానవజీవితంలో పెనుమార్పులు వచ్చాయనీ, అందుకు అనుగుణంగానే వ్యాధులు కూడా పెరిగాయని గుర్తుచేస్తున్నారు. వ్యాధికారక జన్యువులను సరిచేయడం ద్వారా పర్యావరణ కాలుష్యం ద్వారా వచ్చే సమస్యలను అధిగమించి మెరుగైన జీవితం జీవించడం సాధ్యమవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రయోగానికి అనుమతి లేదు
డా. హే జియాంకుయ్ చేపట్టిన జన్యువుల మార్పిడి ప్రయోగానికి తాము ఆమోదం తెలపలేదని చైనాలోని షెంజెన్ హార్మనీకేర్ విమెన్, చిల్డ్రన్ హాస్పిటల్ తెలిపింది. ఈ ప్రయోగ అనుమతి పత్రాలు ఫోర్జరీవి కావచ్చంది. మనిషి నైతికతను ఉల్లంఘించే ప్రయోగాలకు తాము వ్యతిరేకమని తెలిపింది. డా.హే చేపట్టిన ప్రయోగాన్ని ఖండిస్తూ చైనాకు చెందిన 100 మంది శాస్త్రవేత్తలు బహిరంగ లేఖను విడుదల చేశారు.అంతర్జాతీయంగా చైనా బయోమెడికల్ రంగానికి తలవంపు తెచ్చేలా డా.హే వ్యవహరిం చారన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి వినాశకర ప్రయోగాలు జరగకుండా కఠిన చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారంపై చైనా శాస్త్ర,సాంకేతిక శాఖ సహాయమంత్రి జు నాన్‌పింగ్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రయోగాలను చైనాలో నిషేధించామని స్పష్టం చేశారు. 14 రోజుల వయస్సున్న పిండంలోని మూలకణాలపై పరిశోధనలు నిర్వహించేందుకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment