Many Nutritional Values Of Seaweed Plant, Scientists Says - Sakshi
Sakshi News home page

Seaweed Plant: పోషకాలు, ఔషధ గుణాల సమ్మిళితం.. 'సీ వీడ్‌' 

Published Fri, Jul 22 2022 4:29 AM | Last Updated on Fri, Jul 22 2022 10:08 AM

Many nutritional values of seaweed plant says Scientists - Sakshi

గ్రీన్‌ సీవీడ్‌

సాక్షి, విశాఖపట్నం: ఎన్నో పోషక విలువలు.. మరెన్నో ఔషధ గుణాల మేలు కలయిక.. సీవీడ్‌ (సముద్రంలో పెరిగే నాచులాంటి మొక్క). జపాన్, చైనా, కొరియా తదితర దేశాల్లో ప్రాచీన కాలం నుంచి ఇది అందుబాటులో ఉంది. నేరుగానూ, ఆహార పదార్థాల రూపంలోనూ దీన్ని తింటున్నారు. సీవీడ్‌పై ఇప్పుడు మనదేశంలోనూ ఆసక్తి పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఆరోగ్యంపై శ్రద్ధ అధికమవుతున్న నేపథ్యంలో సీవీడ్‌ ఆధారిత ఆహార ఉత్పత్తులపై ప్రజలు మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ), సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ (సీఐఎఫ్‌టీ).. సీవీడ్స్‌తో వైవిధ్య ఆహార ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం, వినియోగం పెంచడంపై దృష్టి సారిస్తున్నాయి.

మ్యాక్రో ఆల్గేగా పిలిచే ఈ సీవీడ్‌ మన దేశ తూర్పు, పశ్చిమ తీరాల్లో విరివిగా లభిస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సీవీడ్‌తో సూప్‌లు, నూడుల్స్, పాస్తాల్లో పొడి, రోల్‌ రూపంలో తినడానికి వీలుగా తయారుచేస్తున్నారు. అలాగే బిస్కెట్లు/కుకీస్, డ్రింకులు, నూట్రియెంట్‌ బార్స్, బ్రెడ్లు, సాచెట్లు వంటి వాటి తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు సీవీడ్‌తో తినే పదార్థాలు, సూప్, సాచెట్లు వంటివి తయారు చేయడానికి అవసరమైన టెక్నాలజీని విశాఖ ఐకార్‌–సీఐఎఫ్‌టీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.  

తినడానికి వీలుగా 221 రకాల జాతులు.. 
సీవీడ్‌లో ఎరుపు, గోదుమ, ఆకుపచ్చ రంగుల్లో తినడానికి వీలుగా 221 రకాల జాతులున్నాయి. వీటిలో సోడియం, కాల్షియం, క్లోరిన్, మెగ్నీషియంతోపాటు ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఫోలిక్‌ యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి. తక్కువ కొవ్వు, కేలరీలుంటాయి. సీవీడ్‌లో పలు ఔషధ గుణాలు ఉండడంతో వాటితో తయారైన ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, హెచ్‌ఐవీ, కోవిడ్‌ వంటివి నియంత్రణలోకి వస్తాయని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ (సీఐఎఫ్‌టీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం ఐకార్‌–సీఐఎఫ్‌టీ శాస్త్రవేత్తలు డైటరీ ఫైబర్‌ ఫోర్టిఫైడ్‌ ఫిష్‌ సాసేజ్‌ను అభివృద్ధి చేశారు. వీటిని ఆహార, చేపల శుద్ధి చేసే రిటైల్‌ మార్కెట్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ కియోస్కుల్లో అందుబాటులో ఉంచే వీలుంది.  

కృత్రిమంగానూ పెంచే వీలు.. 
సీవీడ్‌ సముద్రంలో సహజసిద్ధంగానే పెరుగుతుంది. దీనిని కృత్రిమంగానూ పెంచవచ్చు. ఇలా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో వీటి పెంపకాన్ని చేపట్టారు. తీరం నుంచి అర కిలోమీటరు దూరం వరకు.. అలల తీవ్రత అంతగా లేని, లోతు తక్కువగా ఉండే సముద్ర ప్రాంతం సీవీడ్‌ పెంపకానికి అనుకూలం.  

సీవీడ్‌తో శానిటైజర్ల తయారీ.. 
ఐకార్‌– సీఐఎఫ్‌టీ కొచ్చి శాస్త్రవేత్తలు సీవీడ్‌తో హ్యాండ్‌ శానిటైజర్ల తయారీ సాంకేతికతను కూడా అభివృద్ధి చేశారు. ఇది కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ నియంత్రణలో చురుగ్గా పనిచేస్తున్నట్టు నిర్ధారించారు. రెడ్‌ సీవీడ్‌.. ఫుడ్, కాస్మొటిక్స్, ఫార్మా, బయోమెడికల్‌ పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగపడుతోంది. ఇది హెర్పిస్, ఇన్‌ఫ్లుయెంజా, హెచ్‌ఐవీ వైరస్‌లపై ప్రభావం చూపుతోందని గుర్తించారు. మరోవైపు విశాఖలో లభించిన గ్రీన్‌ సీవీడ్‌తో సూప్‌ను కూడా తయారు చేసినట్టు విశాఖ ఐకార్‌–సీఐఎఫ్‌టీ సీనియర్‌ శాస్త్రవేత్త జెస్మీ దేబర్మ ‘సాక్షి’కి తెలిపారు.   

ఏపీ తీరంలో 1,215 హెక్టార్లు  
దేశంలో సముద్ర తీరంలో సీవీడ్‌ పెంపకానికి అనువైన ప్రాంతాలను గుర్తించడానికి సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 49 ప్రాంతాల్లో తీరానికి ఆనుకుని సముద్రంలో 1,215 హెక్టార్లు సీవీడ్‌ పెంపకానికి అనువుగా ఉందని గుర్తించారు. విశాఖ తీర ప్రాంత పరిసరాల్లో రెడ్, బ్రౌన్‌లకంటే గ్రీన్‌ సీవీడ్‌ (ఉల్వా రకం) ఎక్కువగా లభిస్తోంది.

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆర్కే బీచ్‌ వద్ద 40, ఉడా పార్క్‌ 10, తెన్నేటి పార్క్‌ 50, తొట్లకొండ 25, భీమిలి 25, తిమ్మాపురం 50, మంగమారిపేట 50, ఎండాడ 25, ముత్యాలమ్మపాలెం 25, పూడిమడక 50, బంగారమ్మపాలెం 25, రాంబిల్లి వద్ద 25 వెరసి 400 హెక్టార్లు అనుకూలంగా ఉన్నట్టు తేల్చారు. ఇంకా విజయనగరం జిల్లాలో 165, శ్రీకాకుళంలో 75, తూర్పు గోదావరిలో 250, పశ్చిమ గోదావరిలో 100, కృష్ణాలో 105, ప్రకాశంలో 75, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 45 హెక్టార్లను గుర్తించారు.

ఇప్పటికే ఈ ప్రాంతాల్లో సహజసిద్ధంగా సీవీడ్‌ పెరుగుతోంది. ఔత్సాహికులు ముందుకొస్తే పెంచేందుకు ఈ ప్రాంతాలు అనుకూలమని నిర్ధారించారు. సముద్రంలో కేజ్‌ కల్చర్‌తోపాటు మల్టీ ట్రాఫిక్‌ ఆక్వాకల్చర్‌ పేరిట సీవీడ్‌ను పెంచేలా ఆలోచన చేస్తున్నారు. 

సీవీడ్‌పై అవగాహన కల్పిస్తున్నాం.. 
పలు ఔషధ గుణాలు, పోషకాలు ఉన్న సీవీడ్‌ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. సీవీడ్‌లో బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌లను చంపే గుణాలున్నాయి. సీవీడ్‌తో పశుగ్రాసం, ఎరువులను తయారు చేసే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. సీవీడ్‌ వినియోగం పెరగాలంటే వీటి ఉత్పత్తులు తయారు చేసే అనుబంధ పరిశ్రమలు రావాలి.  
– బి.మధుసూదనరావు, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్, ఐకార్‌–సీఐఎఫ్‌టీ, విశాఖపట్నం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement